హిత సూచని: ప్రవేశిక

[సామినేని ముద్దునరసింహం నాయుడు 1855లో రాసి, 1862లో అచ్చయిన పుస్తకం హిత సూచని. ఏరకంగా చూసినా ఇది ఒక గొప్ప పుస్తకం. తెలుగులో శాస్త్రసంబంధమైన పుస్తకాలు లేవని గుర్తించడం, తెలుగులో భాషాశైలి గురించి అద్భుతమైన సూచనలు చేయడం, భాష సులభంగా ఉండాలని నిర్దేశించడం వంటివే కాక, సంఘ సంస్కారం విషయంలో ఆరోగ్యకరమైన జీవితానికి కావలసిన వైజ్ఞానిక విషయాలు తెలుగులో కావాలని చెప్తూ స్త్రీలకు విద్య కావాలని, వాళ్ళకి వ్యక్తి స్వాతంత్ర్యం కావాలని, రజస్వలానంతరమే వాళ్ళ ఇష్టాన్ని అనుసరించి వివాహం చెయ్యాలని ఎంతో ముందు చూపుతో రాసినవారు ముద్దునరసింహం నాయుడు. ఈ అరుదైన, అద్భుతమైన పుస్తకాన్ని ఎంతో శ్రమతో టైపు చేసి, ఈమాట గ్రంథాలయంలో ఉంచడానికి అనుమతి ఇచ్చిన వి. ఎస్. టి. శాయిగారికి బహుధా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ముద్దునరసింహం మనుమడైన ముద్దుకృష్ణ ఆ పుస్తకాన్ని పునఃప్రచురించినప్పుడు ఆరుద్ర రాసిన ముందుమాట సంక్షిప్తంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం. పూర్తి పుస్తకం ఈమాట గ్రంథాలయంలో చదవగలరు. – సం.]


ప్రవేశిక

వాళ్ళ ముత్తాతగారు చేసిన గ్రంథాన్ని మళ్ళీ ముద్రించాలనే ఉద్దేశం ముద్దుకృష్ణకు చాలా కాలంగా ఉండేది. ముద్దుకృష్ణ అంటే మరెవరోకాదు; నవ్యసాహిత్య పరిషత్తు కొత్తరోజుల్లో ఆధునిక కవుల ఖండకావ్యాలను సంకలనంచేసి, 1935లో, ‘వైతాళికులు’ అనే సంపుటిని ప్రచురించిన ప్రజ్ఞావంతుడు. సామ్యవాద భావాలతో ‘జ్వాల’ అనే సాహిత్య పత్రికను నడిపిన దక్షుడు. “చీకటిలోనికి దీపికను తీసికొని పోగలరుకాని, ఎవరూ చీకటినే వెలుతురుగా మార్చలేరు” అని అజ్ఞానం తెల్లారని కాలంలో ఈ శతాబ్దంలో నమ్మినవాడు; కిందటి శతాబ్దంలోనే వాళ్ళ ముత్తాతగారు చిమ్మచీకటిలోనికి ఒక చిరుదీపికను తీసికొని రావడానికి ఒక గ్రంథం చేశారని తెలిసినవాడు. (కిందటి శతాబ్దం మొదటి సగభాగంలో గ్రంథకర్తలు గ్రంథాలను చేసేవారు. లేఖకులు రాసేవారు.)

ముద్దుకృష్ణ ముత్తాతగారి పేరు: స్వామినీన ముద్దు నరసింహనాయనివారు. ఆయన చేసిన గ్రంథం పేరు: హితసూచని. ఇది 1862లో తొలిసారి అచ్చుపడింది. దీని ప్రతులు రమారమీ అలభ్యం. ఒకటి రాజమంద్రి గౌతమీ గ్రంథాలయంలో ఉందని ముద్దుకృష్ణకు బాగా తెలుసు. దానిలో కొన్ని పుటలు లేవన్న సంగతి కూడా తెలుసు. వేరే ప్రతులు ఎక్కడ దొరుకుతాయో పరిశోధించమని నన్ను అడుగుతూ వుండేవాడు. హితసూచనిని మళ్ళీ అచ్చువేయాలన్న సంకల్పం ముద్దుకృష్ణతోబాటు నాకూ లేకపోలేదు. ముద్దుకృష్ణకు ఈ కోరిక నేను పుట్టకముందే ఉండేది.

1924లో ముద్దుకృష్ణ మద్రాసులో చదువుకొంటున్న రోజుల్లో గిడుగు రామ్మూర్తి గారిని కలుసుకొన్నాడు. ఆయన హితసూచని పుస్తకాన్ని ముద్దుకృష్ణకు చూపించి ఈ పుస్తకానికి చరిత్రాత్మకమైన విలువ వున్నదని చెప్పారు. “వ్యావహారికభాష ప్రయోజనాన్ని గుర్తించి ఆ వాదాన్ని ప్రారంభించినవాడు ఈ ముద్దు నరసింహం. అంతేకాదు సంఘ సంస్కారము, వితంతు వివాహము, బ్రహ్మసమాజముద్వారా బంగాళాదేశంనుంచి ఆంధ్రదేశంలోకి దిగుమతి కావడం కాదు. అంతకు పూర్వమే మన తెలుగువాడొకడు ఈ ఉద్యమాన్ని తలపెట్టి ప్రచారం చేసినవాడున్నాడు. అని రుజువు చేయడానికి ఈ హితసూచని ఆధారం. అందుచేతను ఈ గ్రంథాన్ని తిరిగి అచ్చు వేయాలి. ఆ ప్రయత్నం జరిగేలోపున ముందు నీ తండ్రిగారిని అడిగి వారి తాతగారి జీవితవిశేషాలు కనుక్కొని ఉపోద్ఘాతం రాసి పంపండి” అని గిడుగువారు ముద్దుకృష్ణకు హితబోధచేశారు.

“నేను మా నాయనగారిని అడిగి ఆయన తాతగారి జీవితం గురించి చెప్పిన సంగతులన్నీ రాసి ఉంచాను. కాని, రామమూర్తిగారి హితసూచని ప్రచురణ ప్రయత్నం కొనసాగలేదు.” అని ముద్దుకృష్ణ చాలా బాధపడ్డాడు. ముద్దునరసింహంగారిమీద ఒక చిన్నవ్యాసం రాసి రాజమంద్రి సరస్వతీ పవర్‌ ప్రెస్‌వారి పక్షపత్రిక ‘సంస్కృతి’ 1-5-1959వ సంచికలో ప్రచురించాడు. (ఈ వ్యాసంలోనే గిడుగువారి ప్రయత్నం గురించి చివర రాశాడు.) వాళ్ళ ముత్తాతగారి కాలాన్ని నిర్ణయించడానికి ముద్దుకృష్ణ ఈ వ్యాసంలో ప్రయత్నించాడు.

“ముద్దునరసింహంగారి కాలం ఉజ్జాయింపుగా నిర్ణయించడానికి కొన్ని ఆధారాలు వున్నవి. ముద్దునరసింహంగారి కుమారుడు రంగప్రసాదరావు. ఆయన పెద్ద కుమారుడు తాతగారి పేరుగల ముద్దునరసింహం. ఈ మనవడు జనవరి 1861 ప్రాంతంలో. ఈయనకు పదకొండు సంవత్సరాల వయసులో తండ్రి రంగప్రసాదరావు చనిపోయాడు. అంటే రంగప్రసాదరావు మరణం 1872 ప్రాంతంలో. రంగప్రసాదరావు 1862లో హితసూచని గ్రంథాన్ని ప్రచురించాడు. అప్పటికి ఆయన రాజమహేంద్రవరంలో జిల్లా ఏక్టింగు గవర్నమెంటు వకీలు. రంగప్రసాదరావు 1832 ప్రాంతంలో జన్మించివుండాలి. దానినిబట్టి ముద్దునరసింహం మరణం 1856 ప్రాంతంలో అని నిర్ణయించవొచ్చును. అందుచేతను హితసూచని రచన 1856 పూర్వం జరిగివుండాలి.” పైన కోట్‌ చేసిన కాలనిర్ణయం ముద్దుకృష్ణ కేవలం తన ఊహాబలంతోనే తప్ప ప్రబల సాక్ష్యాధారాలతో చేయలేదు. ముద్దుకృష్ణలాగే టేకుమళ్ళ కామేశ్వరరావుగారు కూడా “మొత్తంమీద 1856కే హితసూచని గ్రంథం పూర్తయిందన్నమాట.” అని, 1937లోనే ‘ప్రతిభ’ అనే నవ్యసాహిత్య పరిషత్తు పత్రికలో ఊహించారు. ఈ ఇద్దరి ఊహలూ కరక్టే. ఇలాగ ధృవీకరించడానికి నా దగ్గిర సమకాలిక సాక్ష్యాలు ఉన్నాయి. 1856లో ముద్దునరసింహంగారు మరణించారు.

పందొమ్మిదో శతాబ్దం ఆదినుండీ చాలా సంవత్సరాలు చెన్నపట్నంలోని అశైలం ప్రెస్‌ అనే సంస్థ ‘మద్రాస్‌ ఆల్‌మొనాక్‌’ అనే వార్షిక సంపుటాలను ప్రచురించేది. 1840 నుండి ఆ సంచికలలో వివిధ జిల్లాల న్యాయశాఖలలో ఉద్యోగం చేస్తున్న నేటీవుల పేర్లూ వాళ్ళ హోదాలు ప్రకటించేది. ముద్దునరసింహంగారి పేరు 1848లో తొలిసారిగా కనబడుతుంది. 1856లో ఆఖరిసారిగా నమోదు అయింది. 1857 నుండి ఆయన పేరులేదు. అంటే 1856లోనే ఆయన మరణించారన్నమాట. రెండేళ్ళ తర్వాత తండ్రి చేస్తున్న ఉద్యోగంలో కొడుకును నియమించారు. అందుకే 1859 నుంచీ సామినేని రంగయ్య పేరు న్యాయశాఖలో ఉద్యోగిగా కనబడుతుంది.

ముద్దు నరసింహంగారు 1856లో మరణించారని తేలింది గానీ, ఆయన జన్మ సంవత్సరం తేల్చడం కష్టం. స్వామినీన వంశీయులు తరతరాలుగా రాజమంద్రి వాస్తవ్యులని ఈస్టిండియా కుంఫిణీవారి దుబాషులనీ ముద్దుకృష్ణ రాశాడు. 1769లో ఫ్రెంచివారిని వెళ్ళగొట్టాకగానీ ఇంగ్లీషువారికి ఉత్తర సర్కారులు దఖలు పడలేదు. ఈ రాజ్యాలను కంపెనీవారు మూడు కేంద్రాలలో ఉన్న ప్రొవిన్షియల్‌ కవున్సిళ్ళ ద్వారా పాలిస్తున్నామన్న నెపాన పన్నులు వసూలుచేస్తూ కొల్లగొట్టేవారు. ఆ మూడు కేంద్రాలూ గంజాము, విశాఖపట్నం, మచిలీపట్నాలు మాత్రమే. రాజమంద్రికి అప్పుడు ప్రాముఖ్యం లేదు. స్వామినీనవారు ప్రొవిన్షియల్‌ కవున్సిళ్ళలోని తెల్లదొరల దగ్గర దుబాషీలని ధృవపర్చడానికి ప్రస్తుతానికి సాక్ష్యాలు లేవు.

1794లో కొత్త పరిపాలనా విధానాన్ని కుంఫిణీ అమలు పరిచింది. సర్క్యూట్‌ మీద వివిధ ప్రాంతాలకు వెళ్ళి న్యాయవిచారణ చేసే ప్రొవిన్షియల్‌ కవున్సిళ్ళను రద్దుచేసి, వాటిస్థానే కలక్టరేటులను స్థాపించారు. గోదావరిజిల్లా ఏర్పడింది. దానిని మూడు డివిజన్లుగా విభజించారు.

అవి: ఫస్టు డివిజన్‌: పిఠాపురం, పెద్దాపురం సంస్థానాలు ఇందులో ఉండేవి. కాకినాడ కేంద్రం.
సెకండు డివిజన్‌: ఉండి, తణుకు, నరసాపురం, మొగలితుర్రు జమీందారీలు ఈ విభాగంలో ఉండేవి. మొగలితుర్రు కేంద్రస్థానం.
థర్డు డివిజన్‌: నడిమిలంకలు, రాజమంద్రి హవేలీ భూములు, రామచంద్రపురం, కోరుకొండ, కొత్తపల్లి, పోలవరం, గూటాల వగైరా ప్రాంతాలు దీనిలో ఉండేవి, రాజమంద్రి కేంద్రస్థానంగా నిర్ణయించారు.

ఇవి రెవిన్యూ డివిజన్లు. న్యాయపరిపాలన పాత ప్రొవిన్షియల్‌ కవున్సిళ్ళ సర్క్యూట్‌ కోర్టులద్వారా జరుగుతూ వుండేది. అయితే 1793లో రాజమంద్రిలో ఒక అదాలత్‌ స్థాపించారు. అప్పటినుంచీ ఆ కచేరీలో నేటివులు జమీన్‌దారులుగా, రైటర్లుగా, హెడ్‌రైటర్లుగా పనిచేసేవారేమో. ఆదినుంచీ స్వామినేనివారు రాజమంద్రి వాస్తవ్యులయితే వారి దుబాషీతనం 1792నుంచీ మొదలయి వుంటుంది. ముద్దునరసింహంగారు అరవైనాలుగు సంవత్సరాలు జీవించారనుకొంటే, ఆయన 1792లో జన్మించి వుండవచ్చు. కానీ ఆయన అంతకాలం జీవించారనుకోడానికి ఆధారంలేదు. వారి తాతతండ్రులు దుబాషులైతే వాళ్ళదగ్గరే ఆయన చిన్నప్పుడు ఇంగ్లీషు కూడా నేర్చుకొని వుండవచ్చు. అయితే ముద్దుకృష్ణ కథనం వేరుగా ఉంది.

“ముద్దునరసింహానికి ఇంగ్లీషు చదువుమీద ఆకర్షణ కలిగింది. దక్షిణాదిని కుంభకోణంలో తప్ప మరెక్కడా ఇంగ్లీషుస్కూలు లేదు. అప్పటికింకా రైలుమార్గాలు ఏర్పాటుకాలేదు. అయినప్పటికీ, ముద్దునరసింహం రాజమహేంద్రవరంనుంచి నాటున ప్రయాణంచేసి బందరుకు చేరి అక్కడి ఓడ ఎక్కి మద్రాసు చేరి అక్కడి నుంచి నాటున కుంభకోణం చేరి ఇంగ్లీషు స్కూల్లో చేరాడు.”

ఇది ముద్దుకృష్ణ వినికిడివల్ల రాసినది, ముద్దునరసింహానికి పద్నాలుగేళ్ళ వయస్సు వచ్చిననాటికి రాజమంద్రిలో ఇంగ్లీషు బళ్ళు లేకపోవచ్చుగానీ బందరులో మార్గన్‌ దొరగారి ఇస్కూలు ఉండేది. 1776లో జన్మించిన కావలి బొర్రయ్యగారు తన పద్నాలుగో ఏట 1790లోనే అక్కడ ఇంగ్లీషు నేర్చుకొన్నారు. ఇంగ్లీషు చదువుకోసం కాకపోయినా ముద్దునరసింహంగారు కోయంబత్తూరుకు మాత్రం వెళ్ళడం నిజం. దానికి ఒక కారణంకూడా వుంది. అదేమిటో తెలుసుకొనడానికి ముందు ఆనాటి విద్యావిధానం ఏమిటో నౌఖరి పద్ధతులేమిటో తెలుసుకోవాలి.

కుర్రవాళ్ళను అయిదో యేట వీధిబడిలో వేస్తారు. గుంట ఓనమాలు దిద్దాక, కజితంమీద అక్షరాలు రాయిస్తారు. (కజితం అంటే పలక లాంటిది) అక్షరాల తర్వాత గుణింతాలు, తర్వాత మాటలు రాయడం నేర్పుతారు. చెప్పిన పేరు రాయడం వచ్చాక తాటాకుమీద గంటంతో లిఖించడం నేర్పుతారు. మొదట గుండ్రటి సున్నాలు చుట్టడంతో ఈవ్రాత బాగా పట్టుబడుతుంది. బాల రామాయణం, అమరకోశంలోని కొన్ని వర్గులూ, పద్యాలూ, శ్లోకాలూ అర్థం చెప్పకుండా భట్టీ పట్టిస్తారు. సంవత్సరాల పేర్లు, మాసాలూ, వారాలూ, తిథులూ, గ్రహాలూ, నక్షత్రాలూ, పండుగలూ, పబ్బాలూ, మొదలైనవి కంఠతా పెట్టిస్తారు.

కుర్రవాడు తన పదోయేటో పదకొండో యేటో బడి విడిచిపెట్టేస్తాడు. చదువు పూర్తయిందా లేదా అని ఏమాత్రం పట్టించుకోరు. కులవృత్తిలో ప్రవేశిస్తాడు. వాళ్ళ తండ్రి కచేరీలో నౌఖరీ చేస్తుంటే కుర్రవాడుకూడా అందులో చేరుతాడు. లెక్కలు, పద్దులు రాయడం నేర్చుకొంటాడు. కొంచం చెయ్యితిరిగాక ఆ పిల్లవాడి బంధువులు ఎంతో తాపత్రయపడి ఏదో ఉద్యోగంలో అబ్బాయిని వేయిస్తారు. స్వయంకృషిమీదే కుర్రాడు ఇంగ్లీషు కూడా స్వయంగానో, ఉన్న బళ్ళల్లోనో నేర్చుకొంటాడు.

ముద్దునరసింహంగారుకూడా ఇలాగే బడిలో చదువుకొని కచేరీలో చేరి ఉంటారు. ఇంగ్లీషులో కుదురైన దస్తూరీ అలవడిన కుర్రవాళ్ళు ఆ రోజుల్లో ఏదో ఒక కచేరీలో ఉమేదువారీగా ఉంటే జీతంబత్తెంలేని వలంటిరు గుమస్తాగా చేరేవారు. చుట్టాల ప్రాపంకంవల్ల క్రమంగా ఏదోకొంచెం జీతంవచ్చే ఉద్యోగం వేయించుకొంటారు. తెల్లదొరల మెప్పుపొందితే రొట్టెవిరిగి నేతిలో పడ్డట్టే. అదొరకు ఏ వూరు బదిలీ అయితే ఆ వూరికి ఆ నేటివు గుమాస్తాకూడా వెళ్ళేవాడు. ముద్దునరసింహంగారు అలాగే ఎవరో దొర ఆశ్రయం దొరకడంవల్ల, ఆ దొరకు కోయంబత్తూరు బదిలీ అయితే అక్కడకు వెళ్ళివుంటాడు.

కుంఫిణీ నౌఖరీలో ఇది సర్వసామాన్యము. కర్నల్‌ కాలిన్‌మెకంజీని ఆశ్రయించుకొన్న కావలి సోదరులు, ఆ దొర తిరిగినన్ని ఊళ్ళూ తామూ తిరిగారు. చెన్నరాజధాని సుప్రీంకోర‌ట్‌లో ఇంటర్‌ప్రీటర్‌గా పనిచేసిన వెన్నెలకంటి సుబ్బారావు (1759-1839) ఆదిలో సేలం, చార్‌మహల్‌, దక్షిణ కనరాలలో తన పోషకుడైన దొరతో నివసించాడు. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకోవాలంటే కొన్ని డజన్లు ఉన్నాయి.

ముద్దునరసింహంగారు 1848లో రాజమంద్రి జిల్లాకోర్టులో సెకండుక్లాసు మునసబుగా పనిచేసిన దాఖలాలు దొరుకుతున్నాయి. 1848లోనే రాజమండ్రి జిల్లాజడ్జిగా థామస్‌ఆండ్రూ ఆన్‌స్త్రూతర్‌ నియమితుడయ్యాడు. ఈ దొర 1835లో, 37లో కోయంబత్తూరు సబ్‌కలక్టర్‌గా జాయింట్‌ మేజస్ట్రేట్‌గా పనిచేశాడు. ఇతనికి ముద్దునరసింహంగారికి పూర్వపరిచయం ఉందో లేదో భావి పరిశోధనలవల్ల గానీ తేల్చలేం. ఏమైనా ఆన్‌స్త్రూతర్‌, రాజమంద్రికి వచ్చిన సంవత్సరమే మొదటిసారిగ ముద్దునరసింహంగారి పేరు జూడిషియాల్‌ సిబ్బందిలో కనబడడం గమనార్హమైన విషయం. (రెండవ తరగతి జిల్లా మునసబుకు ఆ రోజుల్లో నూటపదిహేను రూపాయల జీతం, డెబ్బై రూపాయల భత్యం ముట్టేది – హోదా సంగతి వేరే చెప్పక్కర్లేదు.)

స్థానికంగా ఉండే తెల్లదొరలతో ముద్దునరసింహంగారు సాయిలా పాయిలాగా వుంటూ సంభాషిస్తూ విద్యాగోష్ఠులు జరిపేవాడని చెప్పవచ్చు. ముద్దుకృష్ణ కథనం ప్రకారం జిల్లా జడ్జితో ఆయన సాయంత్రాలు షికారు వెళ్ళేవారు.

“ఒకనాడు ఇద్దరూకలిసి, ఆర్యాపురం అవతలవున్న సీతమ్మచెరువు ప్రాంతాలకు వెళ్ళారు. ఆ కాలంలో ఆర్యాపురం ప్రాంతంకూడా అడివిగా వుండేది. తరుచు చిరతపులులు తిరుగుతూవుండేవి. సీతమ్మచెరువు ప్రాంతాలకు – నేటి పేపరుమిల్లు ప్రాంతం – వీరు చేరగానే పొదచాటునుంచి యెలుగుబంటి వచ్చి వీరిని యెదుర్కొన్నది. జిల్లాకలక్టరు పారిపోయాడు. ఆ ప్రాంతాలకు షికారుకెళ్ళేటప్పుడు ముద్దునరసింహం పక్కను ఖడ్గం వుండేది. కలక్టరువద్ద పిస్తోలు వుండేది. కానీ, హఠాత్తుగా యెలుగుబంటి యెదురుకాగానే కలక్టరు కంగారుపడి పారిపోయాడు. ముద్దునరసింహం కత్తిదూసి యెడమచేత్తో యెలుగు ముట్టెపట్టుకొని దానిని నరికివేసి కత్తినివున్న రక్తాన్ని ఆకులతో తుడుస్తూవుండగా వూరిలోని జనాన్ని పోగుచేసుకొని కలక్టరు అక్కడకు వచ్చారు.”

ముద్దుకృష్ణచేసిన పై కథనంవల్ల ముద్దునరసింహంగారు కత్తిసాములో ఆరితేరినవారని చెప్పవచ్చు. “శరీరారోగ్యమునకు జరూరైన సంగతులు బాగా తెలుసుకొనే వాడిక” వ్యాయామంవల్ల కూడా వారికి వుండేదనిభావిస్తే, తప్పులేదు. వెలమవారిలో కత్తిపట్టడం కొందరికి, కర్రపట్టడం కొందరికి కులవిద్య. ముద్దునరసింహంగారు ఆదివెలమలు. తెలుగు దేశంలోని వెలమదొరలలో రెండు రకాలవారున్నారు. పద్మవెలమలు లేక పెద్దవెలమలు లేక రాచవెలమలు అనే శాఖ వకటి, ఆదివెలమలు అనే శాఖ ఇంకొకటివున్నాయి. పద్మవెలమల స్త్రీలు ఘోషా పాటిస్తారు. ఆదివెలమలు పరదాను పాటించరు.

ముద్దునరసింహంగారు కత్తిపట్టి ధైర్యసాహసాలను ప్రదర్శించిన ఇంకో సందర్భాన్ని ముద్దుకృష్ణ రికార్డు చేశాడు.

“ఒంగోలు దగ్గిర కొత్తపట్నంలో వివాహానికి ఈయన (ముద్దునరసింహం) వెళ్ళాడు. రాత్రి పెళ్ళి జరుగుతూ వుండగా మరాఠీదండు దోచుకోడానికి వొస్తూవుందని వార్త వొచ్చింది. అప్పుడు ముద్దునరసింహం ఆడవాళ్ళని పిల్లల్ని అటుకుమీదకు ఎక్కించాడు; తలుపులన్నీ బార్లా తీయించివేసి గుమ్మంపక్కను ఒక తలుపు చాటున తనూ, మరొక తలుపు చాటున తన నౌఖరు నక్కి ఉన్నారు. ఒక్కొక్క దోపిడీవాడూ లోపల కాలుపెట్టగానే ముద్దునరసింహం వాడితల నరకడమూ, నౌఖరు ఆ తలనీ మొండాన్నీ పక్కకు లాగిపారేయడమూ పద్ధతిని ఏడుగురు దోపిడీదార్లను చంపి ఆ శవాలను వీధిలో పారేయించి, కత్తులు పట్టుకొని తనూ నౌఖరూ వీధిలోకి వచ్చేటప్పటికి ఇరుగు పొరుగువారు ధైర్యం తెచ్చుకొని కత్తులూ కర్రలూ పట్టుకొనివచ్చి మరాఠీదండును తరిమివేశారు.”

ఇలాంటి ధైర్యసాహసాలతో తననూ తనవారినీ ‘బచావు చేసుకోవడం’ వల్ల ముద్దునరసింహంగారు ఆనాటి తెల్లవాళ్ళ ప్రశంసలకు ‘మిక్కిలి’ పాత్రులై వుంటారు. ఆ రోజుల్లో రాజమంద్రిలోని దొరలూ దొరసానులూ ఇంగ్లీషు మాట్లాడగల నేటీవులతో చర్చలు పెట్టుకొనడం గ్రంథాలకు ఎక్కింది. 1837లో రాజమంద్రి జిల్లాజడ్జి జేమ్సుథామస్‌ భార్య ఇంగ్లాండుకు రాసిన వుత్తరాలలో బాలికల విద్య గురించి పోస్టాఫీసు హెడ్‌రైటర్‌ శ్రీనివాసరావుతో చేసిన సంభాషణను పొందుపరిచింది. ఆడపిల్లల బడిపెడితే ఎవరైనా వస్తారా అని 1837 అక్టోబరు 31వ తేదీకి ముందు అడిగింది. “No what for girls learn?” అని శ్రీనివాసరావన్నాడట. ఆడపిల్లలు చదువుకొంటే ఆ కుటుంబానికి అరిష్టాలు వాటిల్లుతాయనికూడా చెప్పాడు. (లేఖ నెంబరు 13)

1848నుండి 1852దాకా అయిదేళ్ళు ముద్దునరసింహంగారు రాజమంద్రిలోనే సెకండుక్లాసు డిస్ట్రిక్టు మునసఫుగా పనిచేశారు. 1853లో ఆయనను ఫస్టుక్లాసు డిస్ట్రిక్టు మునసఫుగా ప్రమోటుచేసి సీతానగరంలో నియమించారు. అయితే ఏ కారణాలవల్లనో తెలియదుగానీ మరుచటి సంవత్సరం రాజమంద్రి జిల్లా కోరట్టులో ఆయనను థర్డుక్లాసు డిస్ట్రిక్టు మునసఫుగా నియమించారు. 1858దాకా ఆ మూడేళ్ళు ఆయన ఆ హోదాలోనే ఉండేవారు. 1857లో ఆయన పేరు అశైలమ్‌ ఆల్‌మనాక్‌లో కనబడదు.

హితసూచని ముఖపత్రంమీద ‘మహోపకారులగు రాజమహేంద్రవరపు జిల్లా ఫస్టుక్లాస్‌ డిస్ట్రిక్టు మునసఫుగా నుండిన స్వామినీవ ముద్దునరసింహనాయనివారు’ దానిని రచించినట్టు ప్రకటించడంవల్ల హితసూచని రచన ఆయన ఆ హోదాలో ఉన్న 1853 నాటికి అచ్చువేయించడానికి సిద్ధంచేసి వుంటారు.

ఆ రోజుల్లో రాజమంద్రిలో ప్రైవేటు ముద్రణ సౌకర్యాలు లేవు. చాఫాఖానాలు చెన్నపట్టణంలోనే విస్తారంగా వుండేవి. బందరులోనూ ముద్రణ సౌకర్యాలుండేవి. 1874లో వీరేశలింగంగారు వివేకవర్ధని మాసపత్రికను ‘ఆ కాలమునందు మా గోదావరి మండలములో దొరతనమువారివి తక్క వేఱు ముద్రాయంత్రము లేకపోవుటచేత’ చెన్నపట్టణంలోని కొక్కొండవారి ప్రెస్‌లో అచ్చువేయించేవారు. తర్వాత సొంత ప్రెస్సుకు ప్రయత్నించారు. 1876లోగాని వీరేశలింగంగారి ముద్రాయంత్రం రాజమంద్రికి రాలేదు. దీనికి పద్నాలుగేళ్ళపూర్వం 1862లో అచ్చుపడిన హితసూచనిని చెన్నపట్నంలోని ప్రెస్సులోనే ముద్రించవలసివచ్చింది.

ముద్దునరసింహంగారి జీవితకాలంలో హితసూచని అచ్చుపడలేదు. ఆయన అవసానకాలాన్ని ముద్దుకృష్ణ ఇలా కథనం చేశాడు.

“ఈయన ఆఖరిదశలో పెద్దాపురంలో మునసబుగా ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం కచ్చేరి హఠాత్తుగా ఆపుచేసి ఒంట్లో బాగులేదని, ఇంతతో కచ్చేరి ఆపు చేస్తున్నానని, మళ్ళీ కలుసుకోలేకపోతే ఇంతతో సెలవు అని ఇంటికి వెళ్ళిపోయాడు. కుటుంబం రాజమహేంద్రవరంలో ఉంది. ఆయన వొంటరిగా పెద్దాపురంలో వున్నాడు. ఇల్లు చేరగానే వంటవాడిని పిలిచి భోజనం చెయ్యను. గదిలో పడుకొంటాను. పొద్దున్నవరకూ నన్ను మాట్లాడించవద్దు. పొద్దున్నచూసి మరీ అబ్బాయికి రాజమహేంద్రవరం కబురుచేయించు అని చెప్పి పడుకొన్నాడు. ఆ రాత్రి యెప్పుడో ప్రాణంపోయింది. అప్పటికి ఆయన కుమారుడు రంగప్రసాదరావు చదువుకుంటున్నాడు.”

1855లో ముద్దునరసింహంగారు చనిపోయేటప్పుడు రంగప్రసాదరావు ఇంకా చదువుకొంటున్నాడంటే ఏ ఇరవై సంవత్సరాల వయస్సువాడో అయివుండాలి. అందువల్లన అతని జననం 1835 ప్రాంతాలు కావచ్చు. ముద్దునరసింహంగారి ఇరవయ్యో ఏట పెద్దకొడుకు రంగప్రసాదరావు పుట్టాడనుకుంటే ఆయన జననకాలం 1815 అని తేలుతుంది. ఏమైనా ముద్దునరసింహంగారి జననకాలం 1810 ముందుకు జరిపించలేం. కాబట్టి ఆయన జీవితకాలాన్ని 1810-1855 అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల జీవితకాలంలో ఆయన మనుగడ సార్థకమే అయిందని చెప్పాలి.

హితసూచని పీఠికలో “స్త్రీలకు విద్యలు సాధకములగుచున్నవి” అన్నది ప్రారంభ వాక్యం. ఇవి 1853లో అన్నమాటలు. 1837లో జిల్లా జడ్జి, అతని భార్య ఆడపిల్లలకు బడిపెడతామంటే హిందువులు ఆసక్తి చూపలేదు. అయినా పదహారేళ్ళలో కొంత ప్రభావితం అయ్యారని తెలుస్తూంది. స్త్రీ విద్య గురించి వాదోపవాదాలు చాలా జరిగేవి. ముద్దునరసింహంగారి పుస్తకం వెలువడిన రెండు దశాబ్దాలకు ధవళేశ్వరంలోని ప్రముఖులు చందాలు వేసుకొని 1874లో ఒక బాలికాపాఠశాలను స్థాపించుకొన్నారు. “పురుషులలో సైతము విద్య యత్యల్పముగా నుండిన యాకాలములో వొక చిన్నగ్రామములోనివారు చందాలు వేసికొని పాఠశాలను స్థాపించిరనుట వింతగానే తోచవచ్చును” అని వీరేశలింగంగారు తమ స్వీయచరిత్రలో రాశారు.

ఆడపిల్లలకోసం ఆ రోజుల్లో బళ్ళు రాజమంద్రిలో లేకపోలేదు. అయితే పరువున్నవాళ్ళ పిల్లలు వాటిలో చదువుకొనేవారుకాదు. ఆ కాలమునందు రాజమహేంద్రవరములో పాఠశాలయనగా వేశ్యల చదువుకూటమనియే యర్థము. వేశ్యల నృత్యగీతాదులకై పెట్టబడిన పాఠశాలలప్పుడా పురమునందెన్నియో యుండెను.” అని వీరేశలింగంగారే రాశారు. సంఘ సంస్కారోద్యమ ప్రభావంవల్ల ఇవి క్రమేణా మూతపడ్డాయి.

పురుషులకే విద్య సరిగ్గా బోధించడంలేదని ముద్దునరసింహంగారికి తెలుసు. ఏ క్రమంలో అధ్యయనం చేయించాలో ఆయన సూచించారు. “ఈ అనుక్రమముగ విద్య చెప్పించేయెడల స్త్రీ జాతికి యెవరెవరి మర్యాదకున్ను స్థితికిన్ని అనుకూలమని తోచినమట్టుకు విద్య చెప్పించవచ్చును. సాధ్యమైనంతమట్టుకు గ్రంథములు స్త్రీలున్ను చదవడమునకు లాయఖుగా నుండేలాగు రచించబడివలసినది” అని దూరదృష్టితో ఆయన చెప్పారు.

1840నాటికే తెలుగులో గ్రంథప్రచురణ ఉత్సాహకరంగా కొనసాగుతోంది. 1839లో ‘వృత్తాంతిని’ అనే పత్రిక కొన్నాళ్ళు నడిచింది. 1840లో ‘వర్తమాన తరంగిణి’ అనే పత్రిక ప్రారంభమై ఒక దశాబ్దంపైగా కొనసాగింది. చాపాఖానాలు, అచ్చుకూటాలు, ప్రింటింగు ప్రెస్సులు చెన్నపట్నంలోనూ కొన్ని ఇతర నగరాలలోనూ వెలసాయి. పురాణంవారు, వావిళ్ళవారు, పూవ్వాడవారు మొదలైనవారు గ్రంథ ప్రచురణ విరివిగ చేశారు. సెంటు జార్జి కోటకు చెందిన కాలేజీలో కుంఫిణీ ఉద్యోగులుగా రైటరు రాంకులో నమోదు అయిన తెల్ల విద్యార్థులకు తెలుగు నేర్పడంకోసం వ్యాకరణాలు, నిఘంటువులు, రీడర్లు వగైరాలను సర్కారువారే అచ్చువేయసాగారు. స్కూలు బుక్‌ సొసైటీ పేరుతో మరొక అనుబంధసంస్థ నేటీవు విద్యార్థులకోసం పుస్తకప్రచురణ చేపట్టింది.

ఇలా వెలువడుతున్న గ్రంథాలను చూసి ఇవి “మిక్కిలీ సదుపాయముగా ఏర్పడియున్నట్టు కొందరెంచుకొంటున్నారు”గాని ముద్దునరసింహంగారు అలాగ భావించలేదు. “ఇదివరకు ఏర్పడియున్న గ్రంథములు ఏమి, వాటిని బాలురకు చెప్పించు పద్ధతులు ఏమి, యెవరెవరిచేత జరిగించబడుచున్న కృషికి తగిన ఫలములు ఇవ్వడము లేదని” ఆయన భావించారు. దానికి కారణం ఒకటే. ఆపుస్తకాలు గుమాస్తాలను తయారుచేసేవేగాని విజ్ఞానబోధకాలుకావు.

వర్తమాన కాలంలో విజ్ఞానదాయకమైన పుస్తకాలు ‘వాక్యగ్రంథాలు’గా వ్రాయాలని ప్రింటు వేయించాలని ఆయన చాటిచెప్పారు. పండిత పామర సాధారణంగా ఉండే వాక్యగ్రంథాలు లేకపోవడముచేత హిందూదేశములవారికి విద్యలు రావడం కఠినమై ఉందని గుర్తించారు. తెలుగులో శాస్త్రగ్రంథాలు ఏర్పాటు చేయాలంటే సంస్కృతం మొదలైన భాషలను ఆశ్రయించాలి. ఇద్దరు ముగ్గురు పండితులను కూర్చి వారికి కావలసిన గ్రంథాలను తెప్పించియిస్తే కావలసిన తెలుగు పుస్తకాలు త్వరగా ఏర్పాటు కావచ్చునని ఆనాడే చెప్పారు. “ఇంగిలీషు బాగా తెలిసిన, అసలు గ్రంథములయొక్క ముఖ్యాభిప్రాయములు సులభముగా బోధపడతగినట్టు దేశభాషకు సంగ్రహములు చెయ్యడమునకు లాయఖైనవారు పూనుకొన్న పక్షములో” తెలుగువాళ్ళు విజ్ఞానవంతులవుతారని ముద్దునరసింహంగారి నమ్మకం. ఆయన 1853లో సూచించిన పద్ధతిన తెలుగు అకాడమీ చేపట్టడానికి నూటఇరవై సంవత్సరాలు పట్టింది.

ముద్దునరసింహంగారు ఆరుణోదయం కాబోతోందని చాటే వెలుగుల చుక్క. ఇహలోక విరుద్ధులైన వాటిని తోసిపుచ్చిన హేతువాది. ఆడపిల్లలకు రజస్వలానంతరమేకాక పూర్ణవయస్సు వచ్చాక వాళ్ళ ఇష్టంతోనే పెళ్ళిచేయాలని సప్రమాణంగా వాదించిన దిట్ట. దెయ్యాలూ భూతాలూ దివ్యదృష్టి వగైరాలను తూర్పారబట్టిన గట్టివాడు. ఇతర లోహాలను బంగారం చేయడం అసంభవమని రుజువు చేసిన వేత్త. వాడుకభాషలో వాక్య గ్రంథాలకు బహుశా ఆద్యుడు.

“గ్రంథములు సత్త్వరజస్తమో గుణాత్మకములైయున్నవి” అని ఆదిలోనే చెప్పి ఈ గుణములలో సత్త్వగుణమే ముఖ్యముగా గ్రహించదగ్గదని నూటముప్పైరెండు సంవత్సరాల కిందట బోధించాడు. ఇవాళ తెలుగు సాహిత్యంలో రజస్తమోగుణాత్మకమైన రచనలే కొల్లలుగా వస్తున్నాయి. ఆనాడే చీల్చి చెండాడిన పిశాచాలను ఈనాడు క్షుద్ర సాహిత్యకారులు మళ్ళా రెక్కపట్టుకు తీసుకువస్తున్నారు. సత్త్వగుణ ప్రధానమైన హేదువాద రచనలు సృజనాత్మకరంగంలోకూడా ఇవాళ చాలా అవసరం.

ముద్దునరసింహంగారి మీదా వారి హితసూచనిమీదా సమర్థులెవరైనా పిహెచ్‌.డి. సిద్ధాంత గ్రంథం రాస్తే ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ మంచిపని ఎప్పుడు జరుగుతుందో మరి.

ఆరుద్ర.