అడుగడుగూ తిరుగుబాటైన గీత

తర్కం ఆమె బలం. ధిక్కారం ఆమె స్వరం. బాధితుల పట్ల ప్రేమ ఆమె ఆభరణం. నిజాయితీ, నిబద్ధత, పట్టుదల ఆమె ఆయుధాలు. హెచ్‌బిటి (HBT – Hyderabad Book Trust) గీతా రామస్వామిగా తెలుగు సాహిత్య లోకానికి పరిచితురాలే అయినా, ఆమె జీవితంలో నుండి అనేక ఆసక్తికరమైన పార్శ్వాలను పోరాటాలను విపులంగా చర్చిస్తూ, ఆమెను సరికొత్త కోణంలో చూసేందుకు గుర్తించేందుకు అవకాశమిస్తూ Land Guns Caste Woman – The Memoir of a Lapsed Revolutionary పేరుతో గీత మొదట ఇంగ్లీషులో రాసిన తన ఆత్మకథని అడుగడుగున తిరుగుబాటు పేరిట ప్రభాకర్ మందార తెలుగులోకి అనువదించారు.

తమిళ మూలాలు ఉన్న కేరళ బ్రాహ్మణ కుటుంబం గీతది. తండ్రి బదిలీలతో బెంగళూరు, ముంబై, చెన్నై, షోలాపూర్… ఇలా అనేక నగరాలలో నివసించిందామె. తనకు తప్పు అనిపించిన విషయాలను ధైర్యంగా ఎదిరించే గుణం ఆమెకు చిన్ననాటినుంచే ఉంది. చెన్నైలో హైస్కూల్‌లో చదువుతున్నపుడు, అంటే తన పదమూడో ఏట నుండే ఇంట్లో బలంగా కనపడుతోన్న పితృసామ్య భావజాలాన్ని, హైందవ ఛాందసాన్ని ఎదిరించి గెలిచింది. పీరియడ్స్ గురించి శాస్త్రీయంగా వాదించింది. బ్రాలు వాడవద్దని ఇంట్లోవారు శాసిస్తే, ట్యూషన్లు చెప్పి డబ్బులు సంపాదించి మరీ తనకుతాను కొనుక్కుంది. ఇలా రోజువారీ విషయాల్లో, ఇంట్లో మొదలైన ఈ తిరుగుబాటు ధోరణినే తన జీవితమంతా అనేక రూపాల్లో గీత ప్రదర్శించింది. అన్యాయాన్ని, అసమానతను సహించలేక సమసమాజ నిర్మాణంపై కలలతో నక్సలైట్‌గా మారింది. అక్కడా నిజమైన పరిష్కారం దొరకదని త్వరలోనే గ్రహించి బయటకు వచ్చింది. పీడితులకు మేలు చేయాలనే నిరంతర తపన, అన్వేషణలతో ఘజియాబాద్ మురికివాడల్లో చైతన్యం తేవడంలో తనవంతు పాత్రను పోషించింది. ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీ సంఘం స్థాపించి అక్కడి అతిపేద దళితుల జీవితాలను బాగుపరచడంలో అనితరసాధ్యమైన కృషి చేసింది. గీత తనను తాను ఒక విఫల ఆదర్శవాదిగా చెప్పుకుంటుంది, కానీ తన జీవితమే గొప్ప ఆదర్శం. కులవివక్ష నిర్మూలన కోసం, పేదప్రజల బాగు కోసం తన అలుపెరగని పోరాటాలు, సాధించిన విజయాలూ స్పూర్తిగాథల్లాంటివి.

బాగా చదవడం, ఆలోచించడం, అలా అందిపుచ్చుకున్న తార్కికతను నిజజీవితంలో ఉపయోగించుకోవడం ఆమెలో ఉన్న ప్రత్యేకత. ఆమె జీవితానికి బలమైన పునాది ఇదే. తండ్రి బదిలీతో హైదరాబాదు వచ్చి, అక్కడ కేంద్రీయ విద్యాలయంలో చేరాక, ఆమెలోని విజ్ఞానదాహం కొంతమేరకు శాంతించింది. అక్కడ జరిగే పోటీల్లో గెలుస్తూ, నిర్వహిస్తూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని మొట్టమొదటి హెడ్‌గర్ల్‌గా ఎన్నిక అయింది. ఐఐటిలో సీట్ వచ్చినా ఆర్థిక కారణాల వల్ల కోఠీ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీలో చేరాల్సి వచ్చింది. చదువుకు సంబంధించి తనకు కావలిసిన సదుపాయాలు అక్కడ దొరకలేదు, తపన తీరలేదు. అందుకే ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండలేకపోయింది. డిగ్రీ రెండో సంవత్సరం చదవడానికి ఉస్మానియా క్యాంపస్‌కి వెళ్ళింది. దానికి కొన్ని రోజుల ముందే జార్జిరెడ్డి హత్య జరిగింది. అక్కడ అతని భావజాలానికి ఆకర్షితురాలు అయి, అతనికి సంబంధించిన వారితో స్నేహం చేసింది. వారిలో అతని తమ్ముడు సిరిల్ ఒకడు. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఆమె జిజ్ఞాసకు అక్కడి పరిచయాలు ఎంతో తోడ్పడ్డాయి. చదివిన పుస్తకాల వల్ల ప్రపంచాన్ని మార్చటం సాధ్యమే అనే అభిప్రాయం ఏర్పడింది. వామపక్ష రాజకీయాలు అర్థవంతమైనవి అనిపించాయి. ప్రపంచమంతా విప్లవ వాతావరణం నిండివున్న సమయం అది. ఆ ప్రభావం క్యాంపస్‌లో కూడా చాలా ఉంది. క్యాంపస్ జీవితం గీతను ఎంతలా ప్రభావితం చేసిందంటే, హైదరాబాద్‌తో, రాజకీయాలతో అప్పుడు ఏర్పడిన అనుబంధం ఆమె జీవనపర్యంతం అంటిపెట్టుకునే ఉంది.

తన అక్కను బావ రక్తం వచ్చేలా కొట్టడం; తన తండ్రికి ట్రాన్స్‌ఫర్ అయితే బలవంతంగా గీతను హైదరాబాద్ వదిలి రమ్మనడం అనే రెండు సంఘటనల వల్ల, ఒక వ్యక్తిగా శక్తిని కూడగట్టుకునేందుకు ఎవరి మీదా ఆధారపడకూడదని, పెళ్ళి చేసుకోకూడదనీ నిర్ణయం తీసుకున్నానంటుంది.

1973లో సిపిఐ ఎమ్ఎల్ – చండ్ర పుల్లారెడ్డి గ్రూప్‌లో చేరింది. పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, రిక్రూట్‌మెంట్‌లో, సాంస్కృతిక విభాగంలో పనిచేసింది. పార్టీలో ఉన్న సమయంలో తల్లిదండ్రులు అబద్ధం చెప్పి చెన్నైకి పిలిపించి, గతాన్ని మర్చిపోయేలా ఆమెకు షాక్ ట్రీట్‌మెంట్ ఇప్పించారు. పార్టీ స్నేహితుల సాయంతో అక్కడి నుండి తప్పించుకొని హైదరాబాద్ వచ్చింది. ఆమె వ్యక్తిగత జీవితంలో అదొక పెద్ద కుదుపు. బయట ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న ఈ ధీర తల్లిదండ్రుల, అక్కల నుండి వచ్చిన విపత్తును ఎదుర్కోలేక కుంగిపోయింది. పుట్టింటికి సన్నిహితంగా ఉన్న మిత్రులను చూసినపుడు, ‘ఏదో కోల్పోయినట్టుగా ఉంది, నాలోని శూన్యం ఎప్పటికీ పోదు’ అని అందుకే రాసుకుంది. ఈ ఆత్మకథ చదువుతున్నప్పుడు తన పోరాటం మనల్ను ఎంత ఆకట్టుకుంటుందో పిల్లల పెంపకం, కుటుంబ సంబంధాల గురించి అంతగానూ ఆలోచింపచేస్తుంది. పిల్లలు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు కుటుంబం నుండి ఆసరా చాలా ముఖ్యమని, ఆ నిర్ణయాలు వాళ్ళెలాగూ మార్చుకోలేరు కనుక, ఆ సంధి సమయాల్లో కుటుంబం పిల్లలను వెనక్కి లాగే పనులు చేయడంలో అర్థం లేదని, వాళ్ళ నిర్ణయాలను ఆమోదించలేకపోయినా, వెనక్కు లాగి మరింత హింసించే హక్కు కుటుంబాలకు లేదని, అట్లాంటి ప్రయత్నాలు గాయాలు చెయ్యడమే తప్ప పిల్లల మనసులు మార్చలేవనీ గీత కథ చెప్తుంది.

షాక్ ట్రీట్‌మెంట్ వలన జ్ఞాపకశక్తి, ఆత్మ విశ్వాసం తగ్గిపోయి, పెళ్ళి చేసుకోవాలనుకున్న సిరిల్‌ను కూడా గుర్తుపట్టలేని స్థితిలో హైదరాబాద్ చేరుకుంది. క్రమంగా కోలుకొని ఉద్యమంలో సిరిల్‌తో కలిసి పనిచేసే సమయంలో, విప్లవ జీవితానికి వారి సాహచర్యం అనుకూలంగా ఉంటుందన్న నమ్మకంతో వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

1975లో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినపుడు పార్టీ గీతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోమని సూచించింది. ఆ సమయంలో అనేక ఎన్‌కౌంటర్లు, అరెస్టులు జరిగాయి. గీతా, సిరిల్ అనేక స్థావరాలు మారుతూ పార్టీ పనులు కొనసాగించారు. 1976 మధ్యలో పార్టీ విధానాలతో వీరికి అసంతృప్తి మొదలైంది: ‘ప్రజాసమస్యలపై ఉద్యమాలు నిర్మించాలనే ప్రయత్నంగాని, ఆలోచనగానీ ఎక్కడా కనపడలేదు. హింస పట్ల పార్టీ వైఖరిపై కూడా బేధాభిప్రాయం ఉంది. ప్రజా సమీకరణ మీద, ఇతర ఎమ్ఎల్ గ్రూపుల మీద ఆధిపత్యం మీదే పార్టీ దృష్టి ఉండేది. సెల్‌లో చర్చలు లేవనెత్తినా ఏం ఉపయోగం లేదు. ప్రజాస్వామిక కేంద్రీకరణ విధానంతో వామపక్షాలు అంతర్గతంగా పార్టీలో వాదనలు, చర్చలు లేకుండా భ్రష్టు పట్టించి, చివరికి తమను తాము ధ్వంసం చేసుకున్నాయి.’ చివరకు 1976లో వారిద్దరూ పార్టీ నుండి బయటకు వచ్చారు.

1977లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి, ప్రజలతో కలిసి పనిచేయాలనే ఆకాంక్షతో గీత, సిరిల్‌లు ఘజియాబాద్‌కు వెళ్ళారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులైన బాల్మీకి కులస్తులకు తన సాయం అవసరమని గుర్తించి, అక్కడి పిల్లలకు ఇంగ్లీషు నేర్పించటంతో పాటు సమాజం పట్ల అనేక విధాల అవగాహనలు కల్పించింది గీత.

1980లో సిరిల్ చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే, మాజీ సీపీఐ ఎమ్ఎల్ కార్యకర్త సి. కె. నారాయణ రెడ్డితో కలిసి గీత ‘హైదరాబాద్ బుక్ ట్రస్ట్’ అనే ప్రచురణ సంస్థను ప్రారంభించింది. దానినుండి ఎన్నో మంచి పుస్తకాలు ప్రచురించింది. ప్రపంచ సాహిత్యం నుండి కొన్ని గొప్ప పుస్తకాలను అనువదించి తెలుగువారికి పరిచయం చేసింది. ఆ క్రమంలో అనేకమంది రచయితలు, మేధావులు, అంబేద్కరిస్టులు, కార్యకర్తలను కలుసుకుంది. పుస్తకం మొదటి నుండి చివరి వరకూ తను కలుసుకున్న వ్యక్తులనేకమందిని ఎంతో ఇష్టంగా గీత పాఠకులకు పరిచయం చేస్తుంది. విభిన్నమైన ఆ వ్యక్తులను, వారితో వైవిధ్యమైన ఆమె స్నేహాన్ని, చర్చలను తెలుసుకోవటం చాలా అబ్బురంగా ఉంటుంది. ఒక చదువుకోని దళిత వృద్ధునితో జరిగిన చర్చలను గురించి చెప్పిన ధోరణిలోనే ఒక గవర్నర్‌తో చేసిన చర్చను కూడా చెప్పడం గీతకే సాధ్యం.

ఆ సమయంలోనే దళిత మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకరైన న్యాయవాది, రచయిత బొజ్జా తారకంతో గీతా, సిరిల్‌ల స్నేహం బలపడింది. దళిత సంఘాలతో వారి సాన్నిహిత్యం పెరిగింది. సిరిల్ పేదల తరఫున న్యాయస్థానాల్లో వాదించటానికి బొజ్జా తారకంతో కలిసి ‘సలహా’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు.

మరోవైపు గీత స్త్రీవాద బృందంతో కలిసి పనిచేస్తూ, వివిధ పుస్తక రచనల్లో భాగస్వామి అయ్యింది. సవాలక్ష సందేహాలు అనే పుస్తకం కోసం పేదమహిళల ఆరోగ్య, ఇతర సమస్యలను పరిశోధించమని గీతకు అప్పగించారు. దానికోసం 1984లో ఇబ్రహీంపట్నం వెళ్ళింది. పార్టీలతో సంబంధం లేకుండా, హింసతో నిమిత్తం లేకుండా ఒక మిలిటెంట్ ఉద్యమాన్ని నిర్మించడం సాధ్యమేనా? ప్రజా ఉద్యమంలో మానవతను, ప్రజాస్వామిక ఆచరణనూ మిళితం చేయడానికి వీలవుతుందా? గ్రామీణ పేదలకోసం తనకు తానుగా నిలదొక్కుకోగలిగే ఒక బలమైన సంస్థను ఏర్పాటు చేయడం సాధ్యమేనా? గీత ప్రయత్నించాలనుకుంది. అక్కడికి వెళ్ళిన కొత్తలో జాగ్రత్తగా అన్నీ పరిశీలించి, కనిపించిన అందరితో మాట్లాడి, ప్రశ్నలు అడిగి అక్కడి ప్రజాజీవితాన్ని బాగా ఆకళింపు చేసుకుంది. దళితవాడ పక్కనే గది అద్దెకు తీసుకొని వారి అలవాట్లను నేర్చుకొని వారితో మమేకమైంది. అక్కడి సాధకబాధకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారి జీవితాలు బాగుపడేలా వారితో కలిసి సుమారు పది సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసింది.

ఈ పుస్తకంలో ఇబ్రహీంపట్నం పరిసరప్రాంతాల అప్పటి స్థితికి కారణమైన నిజాం పరిపాలన, రైతాంగ పోరాటం, భూస్వాముల ఆక్రమణల చరిత్ర అంతా వివరంగా రాయడంతో తెలంగాణ ఆత్మ పాఠకులకు మరింత అర్థం అవుతుంది.

ఏ విషయమైనా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళేందుకు చట్టబద్దమైన గుర్తింపు ఉండాలి అని 1985లో, ఇబ్రహీంపట్నం తాలూకా వ్యవసాయ కూలీల సంఘం (ఐటివిసిఎస్) అనే ట్రేడ్ యూనియన్‌ని రిజిస్టర్ చేసుకున్నారు. దానిని సంగం అనేవాళ్ళు. దానిలో కొందరు పూర్తిస్థాయిలో పని చేసేవారు. అనేకమంది సభ్యులు చేరారు. పరిస్థితుల వేగంగా మారాయి. వేతనాలు పెరిగాయి. సమావేశాల్లో పేదజనమంతా ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళు. చర్చలు చేసి చివరికి వారే ఏకాభిప్రాయానికి వచ్చేవారు. అనేక గ్రామాల్లో వెట్టికూలీల విముక్తి జరిగింది.

ఆ సమయంలో కారంచేడు దళితుల హత్యాకాండ జరిగింది. బొజ్జా తారకంతో కలిసి అక్కడికి వెళ్ళినపుడు కారంచేడు దళితోద్యమం ఆమెకు మరింత స్ఫూర్తిని, అవగాహనను ఇచ్చింది. ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల అంబేద్కర్ పుస్తకాలను పంపిణీ చేసింది. అనియత విద్యాకార్యక్రమాలను ప్రారంభించింది. సంగం శాశ్వత సభ్యులు దాని ద్వారా జీతాలు పొందేవారు.

1973లో వచ్చిన తెలంగాణ భూపరిమితి చట్టం, 1950లో వచ్చిన రక్షిత కౌలుదార్ల చట్టం, 1952లో వచ్చిన భూదాన చట్టాల ప్రకారం పేదలకు రావాల్సిన భూములను భూస్వాములు బినామీ పేర్లతో గుప్పెట్లో పెట్టుకున్నారు. గీత తన అనితర సాధ్యమైన కృషితో ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల మండలాల్లో వెట్టి నిర్మూలనకు, ఆక్రమిత భూముల విముక్తికి కృషి చేశారు, పేదల జీవితాల్లో అనూహ్యమైన మార్పు తీసుకువచ్చారు. స్థానికులు ఆ ప్రాంతాన్ని గీతమ్మ రాకముందు, వచ్చిన తర్వాత అని స్పష్టమైన తేడా చూపిస్తారు.

‘అయ్యో గీత ఇలా ఎందుకు చేసింది?’ అనిపించే రెండు సంఘటనలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఒకటి, పీడితులకు నష్టం కలిగేలా ప్రవర్తించినవారికి మెడలో చెప్పులదండ వేయడం; రెండు, అప్పగించిన అతి ముఖ్యమైన పని చేయని ఒకతనిని పిలిపించి చేతులకు గాజులు వేయడం. ఒక ఫెమినిస్ట్ అయి దేనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో ఆ మూలాలే మర్చిపోయి, తిరిగి ఆ స్త్రీత్వ చర్యలే అవమానకరంగానూ, తక్కువగానూ చూపే పనులు చెయ్యడం – అదీ ఇట్లాంటి వ్యక్తి – ఒక పట్టాన కొరుకుడు పడదు. ఎన్నో కుటుంబాలతో ఏకమయి, మనిషిని మనిషిగా గుర్తించి సాయపడిన ఈ మనిషి, మళ్ళీ ఒక చెప్పులదండతో మరొకరిని అవమానించబూనడమూ అలాంటిదే. కానీ ఆ సమయాల్లో సాధించాల్సిన లక్ష్యం మీదే ఆమె గురి వుంది. రెండు సందర్భాలనూ ఈ పుస్తకంలో చేర్చడం ఆమె నిజాయితీకి గుర్తు. ఆమె వాటిని మర్చిపోలేదు, చెరిపేసుకోలేదు, దాచుకోలేదు. మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయిన క్షణాల్లో దొర్లిన పొరబాట్లను, నమోదు చేసుకునే ముందుకు నడిచింది.

ఒక్కో ఊరిలో కలిసిన వ్యక్తుల్లో ప్రత్యేకతలు గుర్తించి ఎంతో అభిమానంతో వాళ్ళ గురించి, వారితో తన అనుబంధాన్ని, వారు పడిన శ్రమ, వారి విజయాల గురించి గీత తన ఆత్మకథలో వివరించింది. కాని, కొన్ని ఘటనలు, సంఘటనలు మళ్ళీ మళ్ళీ చెప్పడంవల్ల కథనంలో బిగి తగ్గిపోయింది. ఒక మంచి ఎడిటర్ చేతిలో పడివుంటే ఈ పుస్తకం మరింత చిక్కటి పఠనానుభవాన్ని పాఠకులకు మిగిల్చగలిగేది.

అడుగడుగున తిరుగుబాటు పుస్తకం కేవలం పోరాటాన్నే కాదు ప్రేమను, స్నేహాన్ని, సౌభ్రాతృత్వాన్ని, కృషిని, త్యాగాన్ని, కుటుంబ బంధాలనీ సూక్ష్మంగా పరిచయం చేస్తుంది. మనిషి ఎన్నో వైపుల నుండి ఆలోచించవలసిన అవసరాన్ని, మనిషి మీద బాల్యం నుండి ప్రతి దశలోనూ పడే ప్రభావాలని, రిపిల్ ఎఫెక్ట్ లాగా అవి జీవితాలను దిద్దే తీరునీ, ఈ పుస్తకం చూపెడుతుంది. తెలుగునాట ఎంతోమందికి కేవలం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పరంగా మాత్రమే తెలిసిన గీత, ఈ పుస్తకం ద్వారా సరికొత్తగా పరిచయం అవుతుంది.


పుస్తకం: అడుగడుగున తిరుగుబాటు
రచన: గీతా రామస్వామి
అనువాదం: ప్రభాకర్ మందార
ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2023
వెల: ₹499 పే. 455
ప్రతులకు: లోగిలి, హెచ్‌బిటి, పుస్తకాల దుకాణాలలో.