తమాషా దేఖో 8

(కింద వంటిల్లు.  అమోఘరత్నం గేస్‌ సిలిండర్‌ వంచి చూస్తుంటుంది.  జానీ, క్రిష్ణ, వెనగ్గా కోటేశ్వర్రావు ప్రవేశం.  రామజోగి, భాను, నైసు, బూర, వల్లి ఆసక్తిగా చూస్తుంటారు.  )

జానీ (చేతిలో ఫొటో ఇస్తూ) చూడండి క్రిమో గాడికి బిల్డప్‌ ! You should be proud!

అమో (జానీతో) ఏదీ ఇలా తే! (ఆశ్చర్యంగా) ఇదేఁవిట్రా ఫొటో ఇలా తీసేవు?  మొహం అలా చెండుకున్నట్టు పెట్టుకున్నాడేఁవీ వీడు?  (అందరూ చుట్టూ చేరుతారు.)

రామ సగం మొహం చీకటీ సగం మొహం వెలుతురూనా?  ఓ కన్నూ, సగం ముక్కూ…అవును సుమీ….(క్రిష్ణతో) మొహం అలాగ చించుకున్నావేఁవీ?

జానీ అది హాల్ఫ్‌ టోన్‌ సిల్హౌట్‌ అంకుల్‌ !  మొహం చెండుకోడం కాదండి….. ఇంటలెక్చువల్‌ లుక్కు రావాలంటే కవర్‌ పేజి మీదా గట్టా వేసినప్పుడు మొహం అలాగే పెట్టుకోవాలి…. పొయెటిగ్గా!  గ్రేట్‌ ఇంటలెక్చువల్స్‌ కి లుక్కుంటాది ఒక లుక్కు!   మనోడికొచ్చిందా లేదా……లుక్కు లుక్కు?!

రామ   ఏదీ ఏఁవిటో రాసేరు చదవనీ…..ఒకానొక అక్షర…?  (అమోఘరత్నం చేతికిచ్చి)  నువ్వు చదవ్వే!

అమో   ఏ జన్మానేనా ఓ ఆంధ్ర ప్రభేనా చదివిన పాపాన పోతే కదా….(గర్వంగా చదువుతుంది)
క్రిమో!

ఒకానొక అక్షర జలపాత ధార లోంచి చటుక్కున విస్ఫోటనం చెంది
‘ఏమిటి? ఎందుకిట్లా?!’ అంటూ ఊగిపోతున్న అగ్ని నక్షత్రపు సంతకమా?
కధా లిపికి కొత్త అక్షరమా?
ఏమో!!

రామ   జలపాతాల మీంచి గెంతేడూ?

అమో (నిష్టూరంగా) జలపాతాల మీంచి గెంతడం ఏఁవిటండీ?

కోటి నిజంగా జలపాతాలు కాదు మాఁయ్‌ గారూ! అక్షర జలపాతాలు…

రామ వీడికి ఇరవయ్యో ఏట జలగండం ఉన్నాదయ్యా!

భాను   మానవ సమంధాల పుస్తకం కోసం కావోలు నాన్నా!  ఉట్టినే … పుస్తకంలో వెయ్యడం కోసం అలా అంటారు…..

అమో   (నుదుటి మీద కొట్టుకుని) అమ్మా మీ నాన్నగారు ఏ జన్మానా ఓ కధన్నా చదివిన పాపాన పోలేదు.  మానవ సమంధాలూ అవీ ఆయనకేఁవిటి తెలుస్తాయే?
(రామజోగితో) నిజంగా జల పాతాలూ నక్షత్ర మంటలూ అని వెర్రెత్తిపోకండి!  ఇది సాహిత్యం!!

రామ   అది కాదే! ఆ రాసిన ముక్కలకి అర్ధఁవేవిటో చెప్పకుండా పళ్ళు కొరుక్కుంటావేఁవీ?   జానీ పోనీ నువ్వు చెప్పురా?!  జలపాతాల కింద నుండీ నక్షత్రాల కింద నుండీ అనున్నాదా లేదా?  అదే చదివింది కదా నన్నంటుందేఁవీ?

జానీ   అంటే అది జష్ట్‌ కవిత లాగ అంకుల్‌….లిటరల్‌ గా తీసుకోకూడదు!

రామ కళా కళ్ళు…గంగ వెర్రులూ…

అమో వెర్రని కాదు.  (మురిపెంగా) అర్ధం చేసుకుంటే అందులో ఎంతేనా ఉన్నాది!  మీకు బుర్రకెక్కప్పోతే వాళ్ళదా తప్పు!

రామ నీకు అర్ధఁవయింది కావోలు నువ్వు చెప్పు.

అమో అంటే…’ఫలానా క్రిష్ణ మోహను కధలూ అవీ మా బాగా రాస్తునాడూ జన ముద్దయిన పిల్లడూ’ అనీసి దానర్ధం.  ఏఁవిరా క్రిష్ణా అంతేనా?

క్రిష్ణ (కీచు గొంతుతో) నాకేఁవే అమ్మా నేను జన ముద్దయిన పిల్లణ్ణి!

అమో అంట్ల చిప్ప వెధవా!  నా కిరసనాయిలు తెచ్చి పడెస్తే తప్పకుండా అంత వాడివీ….

క్రిష్ణ (కీచు గొంతుతో మళ్ళీ) నాకేఁవే అమ్మా నేను లోక ముద్దయిన పిల్లణ్ణి!

కోటి (ఫోటో కేసే చూస్తూ)  మీ నాన్నకే కాదువై నాకూ బోధ పళ్ళేదు!  “ఏదో ఒక గొప్ప వ్యక్తి” అని వేసేరు!  ఏంవై అంతేనా?

క్రిష్ణ మీకు అంతే తట్టింది.
” అక్షర రుధిరోద్గారికి లక్షణాలు లిఖిస్తాను ” …..
ఇలాటివి విన్నారా ఎప్పుడేనా?

అమో తిక్క వెధవన్నా! గొప్ప వాడివీ తిప్ప వాడివీ అవక్ఖల్లేదు నాయినా దీనమ్మ కడా వెలిసి పోయిన గొప్పవాళ్ళు….(కళ్ళంట నీళ్ళు పెట్టుకుని, వెంకటేశ్వర స్వామి ఫొటో ఎదురుగా నిలబడి) వెంకన్న బాబూ!  నా పిల్లలు ‘గోచీ గోచీ ఎక్కడున్నావంటే రెండు పిర్రల సందునా ఉన్నా’ నని ఎవళ్ళ కంటా పడకుండా ఇంతన్నం తిని ఓ చోట బతికితే….(ఇంకా ఏడుస్తూ) ఏ తల్లి కొడుకో…… ఫలానా జనమంచి వాళ్ళ పిల్లడు…..(దుఖంతో) ఊఁ…..

భాను   నువ్వూరుకోవే అమ్మా…ఇందులో ఏడవటానికేఁవిటున్నాది……

నైసు డాడీ…అమ్మమ్మ ఎందుకేడుస్తోందీ? గొప్ప వ్యక్తి అంటే ఏంటి?

క్రిష్ణ (మీసం దువ్వుతూ) అంఠే….ఘోఛీ లాఘా ఖాకుంఢా దర్ఝాగా థల పాఘా లాగ బతికే వాడు….

భాను నువ్వూరుకోరా తమ్మూ!  అమ్మ ఏడుస్తూ వుంటే…!

క్రిష్ణ అమ్మ సంగతి ఎవడికి తెలీదే అక్కా!  దానికి సంతోషఁవొస్తే ఏడుస్తుంది దుఖఁవొస్తే నవ్వుతుంది……అంతా చైతన్య స్రవంతి టైపు!

భాను పోన్లే నువ్వేనా ఊరుకో!  మీ ఫ్రెండ్సెవరూ లేరు జానీవే కదా ఉన్నాడు.  నువ్వింకా అలా సాహిత్యం సాహిత్యంగా మాటాడతావేఁవీ?  మామూలుగా మనం మాటాడుకునీటట్టు మాటాడూ?!

(బూర, వల్లి వీధిగదిలోంచి పరిగెడుతూ వచ్చి)

బూర   మాఁయ్యా! మాఁయ్యా!!

క్రిష్ణ   ఊఁ?

బూర పాప కర్మలు కొను!

క్రిష్ణ అన్నాల ముందు ఇప్పుడెందుకే పాప కర్మలూ….?

బూర   అబ్బా!  కొనూ..!

క్రిష్ణ సరే పదండి! ఊఁ……చెప్పండి మరి!

బూర   (చెయ్యెత్తి) కిట్ట మాఁయ్యకీ….

నైసు, వల్లి జై!

క్రిష్ణ గెట్టిగా!

పిల్లలు   కిట్ట మాఁయ్యకీ జై!

క్రిష్ణ   ఊఁ ఊఁ!  (వీధి గదిలోకెళ్ళి గట్టిగా)  పాప్‌ కార్న్‌ !  ఏయ్‌ పాప్‌ కార్న్‌ ?!  ఇలా రా!

పాప్‌ కార్న్‌ అబ్బాయి ఒచ్చేను బాబూ!
(తెర)

ఐదవ అంకం
ఒకటవ స్థలం

(చింతాడలో క్రిష్ణ సమాజం అధికార్ల సీతమ్మ గారి ధర్మం అని రాతి పలక మీద చెక్కి ఉంటుంది.  సాయంకాలం.  అరుగు మీద రాఘవ, గోపాల్‌ కూర్చుని ఉంటారు.  కొంచెం ఎడంగా గుమ్మం దగ్గర సమాజం చిట్టెమ్మ గారు, దేవుళ్ళమ్మ గారు, పెద్ద మామ్మ కూర్చుని ఉంటారు.    లోపల క్రిష్ణుడి విగ్రహం ముందు దీపం వెలుగుతూ ఉంటుంది.  చిట్టెమ్మ గారు విస్తరాకులు కుడుతూ ఉంటుంది.  దేవుళ్ళమ్మ గారు వత్తులు చేస్తూ పెద్ద గొంతుకతో తరంగాలు పాడుతూ ఉంటుంది.  పెద్ద మామ్మ ఆసక్తిగా కళ్ళు చిట్లించి వీధిలోకి చూస్తుంటుంది.)

దేవు (పాట)     కౌస్థుభ మణి హార
కనకాంబరా ధరా ధీర
కౌస్థుభ మణి హార

పెద్ద   దేవుళ్ళు పాటలన్నీ అయిపో వచ్చేయి.  వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు నాన్నా?

గోపా ఒస్తార్లెండి!  పాడండి……..హాయిగా!

దేవు   ఎన్ని పాడినా ఇంకా ఉన్నాయి.  మీరు వినాలే గానీ రాత్తిరి తెల్లవార్లూ పాడ మన్నా పాడతాను.

చిట్టె   ఎవరి కోసం బాబూ చూస్తునారు?  మీ స్నేహితులా?

పెద్ద   వాళ్ళ స్నేహితుడేనూ.  నిన్న శని వారం ఒస్తానన్న మనిషి ఇప్పటికింకా రాలేదు.  మా క్రిష్ణుడ్ని పంపించేం కనుక్కు రమ్మని…

దేవు దేవుడికి నగలు చేయిస్తునార్ట?

పెద్ద   దేవుడిక్కాదమ్మా మనుషులికేను!  కవులు, పండితులు, కళా కార్లు ఇలాటి వాళ్ళకి నగలు పెట్టి సత్కారం చేయిస్తునారు….

దేవు వీరభద్రుడి దెగ్గిర బెత్తాయించీసేరా?

పెద్ద లేదింకాను ఇదిగో వీళ్ళు డబ్బు పట్టుకు రావాలని నిన్నట్నించి చూస్తునారు పాపం…

చిట్టె ఒస్తారు రాకెక్కడికి పోతారు.

దేవు   (నవుతాలుగా) నేను ఫష్టు మార్కుగా పాడతా కానూ…. ఓ పిప్పో పిసరో నాకూ చేయిద్దూ సుబ్బప్పా!

పెద్ద   ముసిలి దొంగవెడి కూతురా ఇప్పుడు నీకూ నాకూ కిరీటాలు తక్కువొచ్చేయా?  పట్నాలంట పండితులుంటారు వాళ్ళ కోసం!

దేవు హాస్యాని కన్న ముక్కమ్మా!  (మందిరం లోకి చూపించి) మా కిష్టుడికి చేయించు నగ.

గోపా మీ పాట మా బావుందండి!

దేవు ఏదో మీ అభిమానం.  పొగలల్లా వంటా రాత్తిరల్లా పాటా ఇదే నా బతుకు.

రాఘ వంటలు వండుతారా?

పెద్ద దేవుళ్ళమ్మ పాటెంత తియ్యనో వంటంత కమ్మన!

చిట్టె దానికీ నాకూ జ్ఞానం తెలిసిందెగ్గిర్నుంచి ఇక్కడ సమాజంలోనే ఉంటునాం బాబూ.  దేవుళ్ళు వంటలకి వెళ్తుంది.  నేను సమాజం చూసుకుంటాను.

రాఘ   (చుట్టూ చూసి) ఈ చెట్లూ అవీ…ఇక్కడ బావుందండి.

దేవు   పొద్దు పోతునాది!  బాబూ….ఇక్కడ రాత్తిరయితే మీకు పొగలుట?

రాఘ   ఊఁ!

చిట్టె ఇందమ్మంటే అందమ్మ ఇంతిలీసి విడ్డూరాలూ కలవమ్మ!

దేవు అక్కడ వైకుంఠం లాగుంటుంది కాదూ?

గోపా   మీకెవరు చెప్పేరు?

దేవు   వీళ్ళ కిష్టుడు చెప్పేడు.  అమిరికా ఎలా వుంటుందిరా అంటే నీకు అర్ధఁవయ్యీటట్టు చెప్పాలంటే వైకుంఠం లాగుంటుందే అన్నాడు!

(మోటర్‌ సైకిల్‌ చప్పుడు)

రాఘ   అడుగో వొచ్చేడు!

(క్రిష్ణ, కోటేశ్వర్రావు ప్రవేశం.)

కోటి   (హెల్మెట్‌ అరుగుమీద పెట్టి కూర్చుని) ఊళ్ళో లేరండి!

క్రిష్ణ   ఇల్లు తాళం పెట్టుంది.  వాళ్ళ అన్నయ్య గార్నడిగితే ఏమో తెలీదన్నారు.

గోపా   మెసేజ్‌ ఏం ఇవ్వ లేదా?

కోటి   లేదుటండి.  ఆఫీసులో కనుక్కుందాఁవంటే ఆదివారం!

రాఘ   నేను అంత గట్టిగా ఆడక్కుండా ఉండాల్సింది!

గోపా లేదులే ఏదో అర్జెంట్‌ పనై ఉంటుంది.

పెద వీర భద్రుడి కొడుకు నాలుగు మాట్లొచ్చేడు.  వాళ్ళ నాన్నని రమ్మన్నారా అనీసి?

కోటి ఇంకిప్పుడెందుకూ వీరభద్రుడు?! (గోపాల్‌ ని పరీక్షగా చూసి)  మీరేటండి? షివర్‌ అవుతున్నారు?

గోపా   చిన్న ఫీవర్‌ లాగున్నాది.

(దేవుళ్ళమ్మ లేచి సమాజం లోపటికి వెళ్తుంది.)

కోటి   (క్రిష్ణతో) ఇంట్లోకెళ్ళి దుప్పటీ తీసుకురా!

(క్రిష్ణ సమాజం పెరట్లోంచి ఇంటి వైపు వెళ్తాడు).

కోటి   (గోపాల్తో, రాఘవతో)  ఎందుకండి కధలూ కవిత్వాలూ అని ఇంత లెక్ఖన శ్రమ పడతారు.  అసలు (ఆగిపోతాడు).

గోపా చెప్పండి?  ఆపీసేరేం?

కోటి ఒద్దులెండి! మీరు బాధ పడ్డఁవే మిగిలింది.

రాఘ చెప్పండి పర్లేదు?

కోటి   ప్రపంచంలో నీతికీ నియమానికీ మంచితనానికీ మానవత్వ విధానానికీ అన్నిటికీ తమదే పవరు పట్టా అన్నట్టు ఫీలైపోతారు కదండి కవులు?

గోపా   ఊఁ….. Conscience keepers of the society…….

కోటి   మరి కవుల మంచితనానికి జవాబుదారీ ఎవరు?  అనకూడదు గాని….. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది….లోకం మీద అడ్డంగా నోరు పెట్టుకుని, కొట్టుకు తినీవోడిదే రాజ్యంలాగున్నాది.  కవులైనా అంతే, తక్కినోళ్ళం ఎల్లపోటు ప్రజలఁవూ అంతే!

పెద్ద బావుంది కవులు మాత్రం మనుషులు కారా!

కోటి ఎందుక్కారు….కవులూ మనుషులే!  మాటలు నేర్చిన మనుషులు.  అంతే!

రాఘ లోకం అలాగున్నాది కాబట్టే మేం ఇలాగున్నాం కోటీ గారూ.  ఏఁవీ అనకుండా, ఏదీ చూడకుండా ఏఁవీ చెయ్యకుండా కూర్చో లేకే!  (నిష్టూరంగా) మీరేం చేస్తున్నారు?  మీ కడుపులో చల్ల కదలకుండా మీ వ్యాపారాలు వ్యవహారాలు మీరు చూసుకుంటారు….

కోటి నన్ను నేను పైకి తెచ్చుకుంటే ఒకడు బావుపడ్డా బావుపడ్డట్టే కదండి….

గోపా అందరూ అలాగనుకో బట్టే ఊరూ దేశం రోజు రోజుకీ ఇలాగ దిగజారుతున్నాయి.  ఒకసారి రోడ్డు మీదికెళ్ళి చూడండి కోటీ గారు!

కోటి మీరు నాకు చెప్పాలేటండి.  ఇవాళే మా అక్క కొడుక్కి EAMCET  కట్టీసి ఇలాగొస్తున్నాను.
ఇంట్రమీట్‌ గుంటడి ఫీజు ఏడాదికి ముప్ఫయ్‌ వేలు.  ఏటి తిని బతకమన్నారు?

రాఘ అవునండి ఇదొకటి చూసేను.  ఎక్కడ చూసినా కాక్రోచెస్‌ లాగ ఎమ్సెట్‌ పిల్లలే కనిపిస్తున్నారు.  ఇక్కడ పిల్లలికి ఎమ్సెట్‌ తప్ప ఇంకో లోకం తెలీదు?

కోటి   అంటే….ఇక్కడ పరిస్థితులు ఏఁవంత బాగోలేవండి.   నీ సత్తు రూపాయికీ నా చింకి పంచెకీ చెల్లూ అన్నట్టుగున్నాయి వ్యవహారాలు.  అందుకే మాకందరికీ ఎంత వేగిరం ఎమ్సెట్‌ పేసయిపోయి ఇంజినీరింగూ జావా చదివీసి ఈ దరిద్ర దేశం వొదిలీసి మీ అమిరికాలో ఒచ్చి పడిపోవాలనే ఎంతసేపూ!  ఆశందరికీ ఉంటాది కదండి…..మీరేటో అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నట్టు ఉండకుండా ఇక్కడికొస్తాఁవంటారు….

గోపా ఇది మన దేశం!  వీళ్ళు మన మనుషులు! ఎమ్సెట్లూ అమెరికాలూ అన్నీ అనుభవించి అమిరికా జలుబు వొదిలిపోయి ఉన్నాం కాబట్టి మాకు ఈ సంగతి బోధ పడుతుంది.  ఇది మీకు అర్ధం కాదు.  దీన్ని దరిద్ర దేశం అన్నారు.  అక్కడ అమెరికాలో ఇంగ్లండ్లో తెలివైన వాళ్ళు మన దేశాన్ని a model for civilization అనీ, మనుషులు ఇలా బతకాలని తోవ చూపించిన సంస్కృతి అనీ పొగుడుతూ ఉంటారు.  మనుషులకి బోధ పడీటట్టు చెప్పటానికి ఒక్క కధలూ, కవులే తప్ప మరో గత్యంతరం లేదు కోటీ గారు.  అక్కడుండి మేం చెయ్యగలిగింది ఇలాటి పనులే……. ఈ దేశం ఇలా ఉంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేకే ఏవో పన్లు చెయ్యాలని తలపెడతాఁవు.  ఎక్కువగా ఎదురుదెబ్బలే తిన్నాను…కానీ….బంగారం షాపుల పక్కన కుళ్ళు కాలువల్ని రోజంతా ఓపిగ్గా జలించే వాళ్ళని చూసేరా?  కొంచెం బంగారం రజను దొరుకుతుందని ఆశగా ఫేమిలీ అందరూ కుళ్ళు కాలవ పక్కనే మకాం పెట్టి జల్లిస్తుంటారు. I have that spirit…  అందుకే …. I may feel a lot of things…but I don’t feel discouraged enough to give up…

కోటి   ఎంత జల్లించినా కుళ్ళేనండి.  అలాగ జనాల్లోకి రండి.  కవుల రాతల్లోనూ గవర్మెంటు రాతల్లోనే చూపిస్తారు మంచి…..(విరసంగా) సుజలాం! సుఫలాం!! పచ్చదనం! పరిశుభ్రం!! జై హింద్‌ !

గోపా It could be a lot worse..  హిస్టరీ చదువుకున్నారు కావోలు?!  మనిషిని మనిషి ఎన్ని రకాలుగా హింసించి, మోసగించి, దుఖ పెట్ట గలడో అన్ని రకాల దృష్టాంతాలూ, ఘోరాలూ,  యుద్ధాలూ, రోగాలూ, హత్యలూ, చావులూ, చిత్ర హింసలూ చరిత్ర నిండా ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి.  అది సాకు పెట్టుకుని…ఇలా ఉందని ఒదిలేస్తే ఇంకా చెడుతుంది.

చిట్టె (ఆసక్తిగా వింటూ, కోటేశ్వర్రావుతో) అలా వీధిలోకి వెళ్తే మంచి వాళ్ళు ఎందర్లేరు అల్లుడూ.  నువ్వు పేపర్లలో చదివిందే చెప్పేవు……

దేవు   (కాఫీ తెచ్చి) వొళ్ళు అబకాయించినట్టున్నాదన్నావు.  వేడి వేడిగా ఈ కాఫీ చుక్కలు తాగీ బాబూ!  దేవుడి దెగ్గిర నిమంత్రించి తెచ్చేను….తాగీ!

గోపా   (కాఫీ తీసుకుని, ఆరోపణగా)  మీరు పాట ఆపీసేరు!

దేవు   (సడన్‌ గా, పెద్ద గొంతుతో ఎత్తుకుని)
అంతరంగామందూ నపరాధాములూ చేసీ
మంచి వానీ వలెనూ మనుజూడున్నాడూ
ఇతరులెరుగాకున్నా ఈశ్వరూడెరుగాడా
కామ క్రోధా మోహ మద లోభ మచ్చరము
లారుగురు దొంగలూ పొంచి యున్నారూ….
ఇతరులెరుగాకున్నా ఈశ్వరూడెరుగాడా
గూడు చిన్నాబోయెరా
చిన్నన్న
గూడు చిన్నాబోయెరా………

(దుప్పటితో క్రిష్ణ ప్రవేశం.)

రాఘ (పాడుతున్నట్టు) కామ క్రోధా మోహ……కామ క్రోధా మోహ……

క్రిష్ణ   (ఎకసెక్కంగా) దేవుళ్ళు మామ్మా!  రాఘవ రావు గారికి పాటలు మప్పుతునావా?

దేవు (పాట ఆపి, నిష్టూరంగా) కధ రాసీరా వెధవన్నా!  కధ రాసీ!

చిట్టె   కట్టుకోలేనిదే కామం.  కధలు రాయిస్తే పోతుందా నాన్నా!

(కరంటు పోతుంది).

కోటి ఇదొకటి!  కరంటు పోయింది….

రాఘ గాలీ వానా వచ్చేలాగుంది.  నా బేగ్‌ లో టార్చ్‌ లైట్‌ ఉండాలే?  క్రిమో?  నా బేగులో టార్చ్‌ లైట్‌ ఉండాలి…..?

చిట్టె   కంగారు పడకండి నాన్నా కూర్చోండి.  లోపట దీపం వున్నాది!  లోపటున్నాది దీపం.

(అసంపూర్తి).