(నలుగురూ కూర్చుని సుబ్రమణ్యం కోసం చూస్తుంటారు. బయట ఉండుండి పెద్దగా
కేకలు వినిపిస్తుంటాయి. కర్టెన్ వెనకనుండి ఒక మూడేళ్ళ బాబు తొంగి తొంగి
చూస్తుంటాడు.)
రాఘ ఏయ్ బాబూ దా! నీ పేరేంటమ్మా?
బాబు అబిషేక్ బలద్వాజ్ ….
రాఘ మీ అక్క పేరో?
అభి సాయితీ జోస్నా.
( బయట మగ గొంతుక ఎవడ్రా నువ్వు? ఎవడివి రా? ఎవడ్రా ఇక్కడ పెద్ద మనిషి?
అమెరికా నుండొస్తే నాకేటి….?! అమిరికానుండొస్తె కారడ్డం పెట్టెస్తావా…?
ఇవతలోడికో రూలు నీకో రూలా? రా రా! రా!!)
సుబ్ర (చిన్నగా) ఎక్కువ తక్కువ మాటాడకుండా తిన్నగ లోపలకెళ్ళు!
మగ (తీవ్రంగా) పెద్ద పైల్మేన్ లాగ నువ్వు చెప్పెస్తె మేం లోపటి కెళిపోవాలా? అంత పట్టున్నోడివైతే కారు తీయించి అప్పుడు మాటాడు…..
ఆడ (బతిమాలుతున్నట్టు) రండి మీర్లోపటికి రండి ముందు…
మగ చెయ్యొదులే చెప్తాను…..ఆడు వరష్ట పోజిబుల్ ఫెలో అయ్యుండీ గూడా నన్ను వరష్ట పోజిబుల్ ఫెలో అన్నాడు కదా అవేళ బుచ్చి పెళ్ళిలోన? మరిప్పుడేఁవీ…? నోరు పెగల్దేఁవీ?
సుబ్ర (పళ్ళు కొరుకుతూ, నెమ్మదిగా) నాకు ఫ్రెండ్సున్నారు! ఇప్పుడు పెంట పెట్టక!
మగ నువ్వు పెట్టేవా పెంట నేను పెట్టేన్రా? ఎవళ్రా అన్న దమ్ముడి మీద దావా తెచ్చిన దగుల్బాజీ? రమ్మన్రా ఆ కారు పెట్టినోడికి……
ఆడ రండి వాళ్ళ పాపాన వాళ్ళే పోతార్రండి! లోపటికి రండి!
(పక్క వాటా తలుపులు పెద్దగా వేస్తున్న చప్పుడు.)
కోటి (గోపాల్ తో గుస గుసగా) మందడి గోడ విషయంలో బ్రదర్సిద్దరికీ ఏవో గొడవలున్నాయండి! ఇతను దావా కూడా వేసేడంటారు…..
(సుబ్రమణ్యం విసురుగా లోపలికొచ్చి)
సుబ్ర ఒరే అభీ నువ్వు లోపలకెళ్రా! (కోటేశ్వర్రావుతో, అనుమానంగా) దావా? ఏంటి దావా??
కోటి అహఁహా వారు మీ అన్నయ్యగారు కదండి? మీ కేసు మా ఫ్రెండే టేకప్ చేసేడు కదా?!
సుబ్ర ఆంజనేయులు మీ ఫ్రెండా?
కోటి ఆఁయండి! వారు టేకప్ చేస్తే మనకి పూచీ పేచీ లేదు లెండి!
సుబ్ర అదిప్పుడెందుకు! (సిగరెట్ వెలిగించుకుని) ఇంకేంటి చెప్పండి? (రాఘవని, గోపాల్ని చూసి) కధ ఫ్యూచర్ గురించి పరవాలేదు…..మంచి కధలొస్తునాయి! పొయెట్రీ భవిష్యత్తు గురించే వర్రీ! మంచి కధకి మంచి రోజులొచ్చేయి కానీ ఇవాళ మంచి కవిత భవిష్యత్తు ప్రశ్నార్ధకంగానే ఉంది……
క్రిష్ణ తెలుగు కధ భవిష్యత్తు గురించి పరవాలేదు సార్ ! మంచి కధలొస్తున్న మాట నిజమే! కానీ……. గొప్ప కధలు ఇంకా రావల్సే ఉంది…..పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన తరవాత మళ్ళీ అటువంటి అంతర్జాతీయ స్థాయి కధలు ఎన్నొచ్చేయంటారు? ఎక్కడో విఫలమవుతున్నామ్ !
రాఘ నిజఁవే! మంచి కధల్ని ప్రోత్సహిస్తూ పోవటం మంచిదే కాని…. మంచి కధ గొప్ప కధగా మారటానికి అనువైన చారిత్రక సందర్భాలు ఎలా క్రియేట్ అవుతాయన్నది ఎవరూ ఆలోచిస్తున్నట్టు కనిపించదు. What does it take to transform a good story into a great story…?
సుబ్ర అందుకే కదా ఇప్పుడు…. దటీజ్ ద సావనీర్ థీమ్ ! మానవ సంబంధాలు అంతస్సూత్రంగా లేకపోవటమే మంచి కధా పరిణామ క్రమంలో విఫలతా మైలు రాయి, ఇది విమర్శకులు గ్రహించుకోలేక పోయిన సత్యం అని ఊకా మాషారు స్టేట్మెంటిచ్చేరు. దానిమీద లిటరరీ సర్కిల్స్ లో పెద్ద దుమారం లాగొచ్చీసింది!
కోటి (నమ్రతగా కలగచేసుకుని) చిన్న చిన్న విషయాలు కూడా మిస్సయిపోతూ ఉంటారు సార్ ! ఆళకి తెలీదు, మనం చెప్తే విన్రు! తెలుగు కధ భవిష్యత్తు ఏమైపోతుందో అని ఎప్పుడేనా ఒక్కణ్ణీ కూచున్నప్పుడు బెంగగా ఉంటాదండి. నెరూడా, డెరీడా వంటి పెద్దల అభిప్రాయాలూ మన అభిప్రాయాలూ ఎసన్సు అన్నీ నిగ్గు తీయించి, గొప్ప కధ రావలిసినటువంటి ఆ చరిత్ర పరిణామం ఏఁవిటి అన్నది ఎత్తి రాయిస్తే బావుంటుందండి.
గోపా (ఆశ్చర్యంగా) నెరూడా డెరీడా గురించీ తెల్సూ మీకు?
కోటి వాళ్ళు ఇంగ్లీషు కవిత్వంలో ఇప్పుడు లేటెష్టు పెద్ద వాళ్ళు కదండి? నాకూ పెద్దగా తెలీదనుకోండి …. మా క్రిష్ణా వాళ్ళూ మాటాడుకుంటూవుంటే విన్నముక్క! మీరు కధకి లక్ష రూపాయిలు గిఫ్టు కింద ఇస్తనార్ట కదా? ఆ ముక్క విన్న దగ్గిర్నుండీ చెప్పొద్దా నాకూ మేగ్జిమం ఇంట్రష్టుగానే ఉందండి! మీరు వినాలే గాని చెప్పడానికి నా దెగ్గిర చాలా కధలే వున్నాయి…..
రాఘ ఇవి మీ లాటి రిచ్ పీపుల్ కోసం కాదు కోటీ గారూ! జన జీవన చైతన్యం ప్రతిఫలించే కధల కోసం. పేదరికం గురించి ముందు తెలుసుకుని అప్పుడు..!
కోటి అయ్యో నాకు తెలీకేఁవండి. అలాగయితే మీరు చెప్పండి? మీరెప్పుడేనా కూలి పని చేసేరా? రాళ్ళు కొట్టేరా?
రాఘ లేదు! ఎందుకు?
కోటి (గర్వంగా) నేను రాళ్ళు కొట్టేనండి.
గోపా మీరా?
కోటి ఊఁ? టెంతు క్లాసు పేసైన వెంటనే మా మాఁవయ్య రైల్వేల్లో గేంగ్‌మేన్ కింద వేయించేడు. నేనూ మా ముప్పూడి వాడూ, కందీశ వాడూ రోజూ పొద్దుటే కేరేజి కట్టుకుని ట్రాలీ తోసుకుంటూ రైల్వే ట్రేక్ లేయింగ్ కెళ్ళే వాళ్ళఁవండి. ఓరోజు ట్రేకినస్పెక్ట్టరు సైకిల్లో గాలి తీస్సేఁవని డవుటొచ్చి
చెట్టుకి తాడేసి కట్టి చెండాలూడ గొట్టేడు. ఎండలో రాళ్ళు కొట్టడం అదొక అనుభవం లెండి. మీరూ గోపాలు గారూ లైక్ చేస్తారు….
రాఘ మంచి కధ రాయటానికి అనుభవం ఉన్నంత మాత్రాన చాలదు కోటీ గారూ! రాసే శక్తి కావాలి.
కోటి అదే లెండి! అందుకే నేను కధ చెప్తాను నువ్వు చిలవలూ పలవలూ పెట్టి రాయి, ఒచ్చిండబ్బు నాకు సెవెంటీ నీకు థర్టీ అని మా క్రిష్ణని బతిమాల్తునాను.
గోపా ఏం ఫిఫ్టీ ఫిఫ్టీ కాదూ?
కోటి కష్టవంతా కధల్లడం లోనే ఉన్నాది. రాయడానికేటున్నాదండి ఇతను మరీ మురిపించుకుంటే మా డాక్యుమెంట్ రైటర్ని పెట్టి రాయించెస్తాను. ఇతను ‘డబ్బెందుకు డబ్బెందుకు’ అని బీదరుపులు అరుస్తాడు కదా! అందుకే థర్టీ తోటి సరిపెట్టేను. అయినా….మేం రాసినప్పటి సంగతి, మీరు ఇచ్చినప్పటి సంగతి కదండి!
గోపా ఏం మీరు రాయకూడదా, మేం ఇవ్వకూడదా. మీలాటి వాళ్ళు రాస్తారనే కోటీ గారూ!
(సుబ్రమణ్యంతో) అవునూ….నేను ఒచ్చేముందు చెక్కులు పంపించేను ఏంటి జవాబు లేదు?
సుబ్ర ఒచ్చేయిలే! సమాచార శాఖ డీవో వెట్ పార్టీ ఇమ్మని ఎప్పణ్ణుంచో అడుగుతున్నాడు.
ఎడ్వటయిజ్ మెంట్స్ ఆపెస్తానని ఫోన్ చేసేడు….తెలుగు వెలుగుల తేట జిలుగులు అని ఫొటో గేలరీ ఒకటి బ్లాక్స్ సెట్ చేయిస్తునాను….అంత మందికీ రిప్రజెంటేషనుండాలి నీకు తెల్సు కదా! ఏ కేష్టోల్ని ఒదిలీసినా కోపాలొచ్చెస్తాయి…..ఎక్కడా ఊపిరి సలపనంత పని! క్రిమో? భాస్కర్రాజు ఫొటో ఎలాగేనా కావాలని జానీ గాడికి చెప్పు.
క్రిష్ణ అలాగేనండి!
గోపా సుబ్బా! ఆడిటర్ దగ్గర్నుండి ఎకౌంట్స్ స్టేట్ మెంట్ కాపీ తెచ్చిస్తానన్నావు? నాకూ రాఘవకీ కావాలి……
సుబ్ర (ముభావంగా) ఇస్తానిస్తాను…ఇదుగో తెప్పించాలి……
రాఘ మరి…..కిరీటాల సంగతి ఏం తేల్చేరు? చింతాడయితే బెష్ట్ అనిపిస్తుంది!
గోపా ఊఁ. Let us go to Chintada! ఏం క్రిమో?
క్రిష్ణ అలాగే మా అమ్మకి చెప్తాను! ఎప్పుడొస్తారండి?
కోటి ఎంత తొందరగా బెత్తాయిస్తే అంత మంచిదండి. బడ్జెట్ తరవాత గోల్డ్ రేటు బాగా పెరిగిపోతుందంటున్నారు!
రాఘ How about this week-end? ఈ శని వారం?
సుబ్ర మీరు బయల్దేరెళ్ళండి. ఇవుగో…డిజైన్లు మీతోటే తీసుకుని. నేను కొంచెం పన్లవీ చూసుకుని వెనక మీదొస్తాను, సాటర్ డే ఆఫ్టర్ నూన్ కి!
క్రిష్ణ బష్టేండ్లో ఫలానా జనమంచి వాళ్ళ ఇల్లని అడిగితే చెప్పెస్తారు!
సుబ్ర (అగ్గిపుల్ల విరిచి పళ్ళు కుట్టుకుంటూ తలూపి) ఊఁ! వీరభద్రుడి దుకాణం నాకు తెల్సులే!
గోపా సరే మేం వెళ్తాం మరి!
సుబ్ర ఊఁ ఊఁ….!
రెండవ స్థలం
(పెళ్ళి పందిరి. శైలజ వెడ్స్ ఆది నారాయణ అనే బోర్డు సీరీస్ లైట్లతో కట్టి ఉంటుంది. మైకుల్లో పాటలు, భజంత్రీలు వినిపిస్తుంటాయి. పందిట్లో కర్ర కుర్చీల్లో రాఘవ, గోపాల్ , మేఘన, క్రిష్ణ మోహన్, జానీ, నక్కా అప్పల నారాయణ గారు కూర్చుని విసనకర్రలతో విసురుకుంటుంటారు.)
మేఘ Shhhh…..! Hot Daddy! Hot, Hot, Hot……
గోపా You are the one who signed up for it! Can’t complain now!
మేఘ Yeah! I know…..ooooooo……Ho……tt! I’m gonna die here….
గోపా (మొట్టికాయ వేసి) నోరు ముయ్యవే! పెళ్ళి పందిట్లో ఏంటా మాటలు?
మేఘ O..sorry Daddy!
అప్పల (మేఘనకి విసురుతూ) ఉక్కపోస్తందంటందా? అందుకే రాత్తిరి ముహూర్తం పెట్టించేఁవు
….పొగటి పూటయితే అసలిక్కడ నిలబళ్ళేదు మీ యమ్మాయి…..
మైకు కాలి గోల సంబరానికి మంగలాయను ఎక్కడున్నా వెంటనే రావాల. మ్తుౖతెదమ్మలు అయిరేను కుండల కాడికి వెంటనే రావాల……అచ్చింతా లడసీయర్రా!
అప్పల (గోపాల్తో) కాలి గోళ్ళ సంబరం అయిపోతంది. ఇంక లగ్గసర్లు బాబూ… రండి!
గోపా పదండి….
(అందరూ పందిరికి దగ్గరగా నడుస్తారు. భజంత్రీలు మోగుతుండగా అక్షింతలు చల్లుతారు. ఆది బాబు, శైలజ పసుపు బట్టల్లో కొంగులు ముడి వేసుకుని పందిట్లోకి వస్తారు. వాళ్ళ వెనకే ఆది బాబు మామ, బంధువులు వచ్చి గోపాల్ వాళ్ళకేసి కుతూహలంగా చూస్తుంటారు.)
జానీ ఆరంజోతి కనిపించిందా?
ఆది ఊఁ ఇంత పెద్ద బలుబులాగున్నాది…
జానీ అయితే నీకు మీ ఆవిడంటే ఇష్టం. ఏటి శైల్జా నీక్కనిపించిందా?
శైల (తల దించుకుని నవ్వుతూ ఏమీ మాట్లాడదు.)
జానీ కనిపించలేదంట బే! నీ మీద ఇష్కు లేదురా…!
మామ (కలగచేసుకుని) ఇందాక మీయమ్మ కనిపించిందా అంటే ఊఁ అన్నావు…ఆడి స్నేహితులడిగితే సిగ్గా? సెప్పు…..
శైల (నెమ్మదిగా) కనిపించింది….
మేఘ (curious) What does she say…?
గోపా She says she saw the star in the sky. When the priest shows them the star…..if they can see it that means they love each other….
మేఘ Just as simple as that….
గోపా Just as simple as that! He says he saw the star shining like a light bulb!
మేఘ Ooo..he must REALLY love’er! (పందిట్లోంచి పైకి చూసి) I don’t see any
star?!
గోపా You’ll see the star when YOU get married!
మేఘ (కళ్ళు పెద్దగా తిప్పి, గోపాల్ని విసనకర్రతో కొట్టి) Daddy?! Shutt…up!!
మామ (గోపాల్ , రాఘవతో) బాబూ! బోజనాలకి లేవాల!
రాఘ (కంగారుగా) భోజనాలా? అబ్బే…ఒద్దండీ….
మామ (చిన్నబుచ్చుకుని) స్పెషలగా వొండించేను బాబూ…తమరకా డవుటేం అక్కల్లేదు. పెల్లికొచ్చి తినకుంటా ఎల్తే సోబస్కరం కాదు బాబూ…
గోపా (లేచి) అయ్యో అదేం లేదండీ….పదండి! (రాఘవ చెయ్యి పట్టుకుని) Let’s eat a little bit?! చలో!
(భోజనాల లైను దగ్గిర రుద్రమూర్తిని చూసి)
గోపా హలో రుద్రమూర్తి గారు…?
రుద్ర Hello! ఒచ్చేరా రండ్రండి….You are our guests here!
గోపా అదేం అలాగన్నారు?
రుద్ర ఆది బాబు పెళ్ళి కదా! నేను సాయానికొచ్చేను.
(రాఘవ, క్రిష్ణ రుద్రమూర్తిని తప్పించుకుని ఒక పక్కగా వెళ్ళి వడ్డించుకుంటారు.)
రుద్ర (మేఘన, రాఘవ, క్రిష్ణ డిన్నర్ ఐటమ్స్ కేసి ఇబ్బందిగా చూస్తుండటం గమనించి,బూరె నోట్లో వేసుకుని నముల్తూ, రస్నా తాగుతూ గట్టిగా నవ్వుతూ) See! It won’t bite
you…
గోపా (పందిట్లోకీ, చుట్టూ కలయచూస్తూ, సందేహంగా రుద్రమూర్తితో) This place….looks like a slum! ఈ ఫూడ్….పరవాలేదా?
రుద్ర (గోపాల్తో) నిజఁవేనండి….You need to be careful. Especially…with the
water!
గోపా మీరు ఆ నీళ్ళే తాగుతునారు?
రుద్ర I am used to this. నేను బురద నీళ్ళేనా తాగుతాను. I have a very weak sense of taste……. మీకు బోటిల్స్ తెప్పించమంటారా? ఊఁ….?
గోపా That’d be nice! మా అమ్మాయికి……
రుద్ర Sure! Sure!! ఉండండి….(భుజం తట్టి, హడావిడిగా పందిట్లోకి వెళిపోతాడు.)
(గోపాల్, రాఘవ ఆశ్చర్యంగా అతను వెళ్ళినవైపు చూస్తారు. అందరూ ప్లేట్లలో డిన్నర్ పెట్టుకుని కుర్చీలకేసి నడుస్తారు. ఆది బాబు, శైలజ పసుపు బట్టల్లో వచ్చి వాళ్ళ దగ్గరగా కూర్చుంటారు.)
ఆది (రాఘవతో, గర్వంగా) ఆ శ్లోకం నేర్చీసేను సార్!
రాఘ ఏ శ్లోకం?
ఆది ఆవేల డంగలాలో చదవమన్నారు కదా?! (కార్డు చూసి చదువుతాడు)
జానక్యా: కమలామలాంజలి పుటే: యా పద్మ రాగాయితా:
న్యస్తా రాగవ
రాఘ (తింటూ) రాగవ కాదు! రాఘవ….నా పేరు! కరక్టుగా అను!
ఆది ఉండండి సదవనియ్యండి! మా పెల్లి పంతులుగారికి అడిగీసి నేర్చుకున్నాను…..
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితా:
స్రస్తా: శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయితా:
ముక్తాస్తా శ్శుబదా బవంతు బవతాం శ్రీరామ వైవాహికా:
దాని మీనింగూ తెల్సు! చెప్మన్నారా?
రాఘ (అన్నంకేసి పరీక్షగా చూస్తూ) ఏంటి?
ఆది సీతా అమ్మవారు చేతులు ఎర్రగ కలవ పువ్వుల్నాగున్నాయి. అందల ముత్యాల
తలంబరాలేసుకుంటె పుష్యరాగాల్లాగున్నాయి……అవి రాముడి తల మీదెయ్యాలని ఇసిరితే మల్లి
పువ్వుల్నాగ అవుపించేయి. రాములోరొంటి మీద పడీ పడగానె ఇంద్ర నీలాల్లాగ నీలంగా మెరిసేయి. ఆ సీతా రాముల కల్యానం అందరికీ శుభాన్నిస్తుంది…..(క్రిష్ణతో) ఏటి కరక్టేనా?
క్రిష్ణ (తింటూ) ఏమోరా నాకేటి తెల్సు….!
(ఒకతను మినరల్ వాటర్ బాటిల్స్ ట్రేలో పెట్టుకుని గోపాల్ దగ్గరికొచ్చి)
గోపాల్ గారు మీరే కస్సార్ ?! (నీళ్ళిచ్చి వెళ్తాడు.)
గోపా Thank…you!
రాఘ ఈ బూర్లు…..కాక నూనె…(వికారంగా మొహం …..పెట్టి లేచి)….. అబ్బా….థు….(దూరంగా వెళ్ళి ఉమ్మేసి, గోపాల్ దగ్గర నీళ్ళు తీసుకుని ఆత్రంగా తాగుతాడు.) (గుసగుసగా) ఈ తిండి మనం తినలేం….
(ఆది బాబు ఇబ్బందిగా లేచి) ఏటి సార్ డిన్నర విగటుగా ఉన్నాదా?
గోపా (కంగారుగా) ఏయ్ ఏయ్ అదేం కాదు. నువ్వు కూర్చో!
రాఘ (నీళ్ళు తాగుతూ, సంజాయిషీగా) మాకు ఈ టైపు ఫూడ్ అలవాట్లేదు కదా …. అంతకంటే ఏం లేదు.
క్రిష్ణ (చేతిలో ప్లేటు పారేసి వచ్చి) నువ్వు అలాగేం అనుక్కోకురా!
ఆది (సిగ్గుగా) ఏటనుకోటానికేటున్నాది?! మీరొచ్చేరదే శాన….
గోపా (పెళ్ళికూతుర్ని చూసి) నీ పేరేంటమ్మా? శైలజా…?
శైలజ (తల దించుకుని నవ్వుతూ ఏం మాట్లాడదు)
గోపా (రాఘవతో) ఆ అమ్మాయి మొహం చూడు! ఎంత నిర్మలంగా ఉందో…..
రాఘ (చూసి, ఆలోచనగా) ఇంకా ఏం తెలీదేం…..?!
గోపా ఊఁ….ఏం తెలీదు!
మేఘ (కర్పూరం పుల్ల వాసన చూస్తూ) What తెలీదు? These sticks are really cool!
జానీ (హడావిడిగా వచ్చి) ఆదీ! కాళ్ళకి దండాలు పెట్టిస్తారంట! గురువు గారు మీ ఇద్దర్నీ రమ్మంట్నారు.
గోపా సరే ఇంక మేం వెళ్ళొస్తాం ఆది బాబూ!
(అందరూ లేచి వెళ్తారు.)
మూడవ స్థలం
(అమోఘరత్నం గారిల్లు. జానీ, క్రిష్ణ మోహన్ , కోటేశ్వర్రావు కిళ్ళీలు వేసుకుని, డాబా మీద పిట్టగోడని ఆనుకొని కూర్చుని ఉంటారు. జాలారి పేట మైకులో బైఠో భజన్ వినిపిస్తుంటుంది.)
క్రిష్ణ (ఆకాశంకేసి చూసి) అమావాస్య బాబూ!
కోటి ఊఁ…..నో మూను!
జానీ ఈ లైటింగ్ లో సిల్హౌట్స్ తీస్తే బ్రెమ్మానం గొస్తాయిరా…!
కోటి దెయ్యాలు దేవులాడీ వేళ ఇప్పుడు ఫొటోలేటమ్మా జానీ?! (క్రిష్ణతో) కధాలోచించేవా?
జానీ మీరేటి ఈమధ్యన కధలు కధలని పట్టించేరు?
క్రిష్ణ ఆ లక్ష రూపాయలు ప్రైజు మాట విన్నప్పట్నించీ మా బావ గారికి నిద్దర పట్టటం లేదు.
కోటి (నిష్టూరంగా) మీరిద్దరూ గొప్ప జలంత్రీ గాళ్ళురా! ఎన్ని ట్రాన్సాక్షన్లు చేస్తే లక్ష రూపాయలు?! అలాగే చూస్తుండండి. రాస్తానో రాసి చూపిస్తానో….
క్రిష్ణ ఇదేం డాక్యుమెంట్ రైటింగనుకున్నారా? ఇండియన్ సొసైటీ మీద కల్చర్ మీద అవగాహన ఉండాలి.
(కిందనుండి అమోఘరత్నం కేక)
అమో క్రిష్ణా? ఒరే కిష్టప్ప! కాలు గలిగిన పిల్లడివి నాల్రోలాయి బతిమాల్తునాను నా కిరసనాయిలు నాకు తెచ్చి పడెస్తే నీ అంతటి వాడివి నువ్వు తండ్రి తండ్రీ?!
క్రిష్ణ (చికాగ్గా) అబ్బా ఉండవే!
కోటి నీకేటున్నాది అవగాహన? ఇండియా అంటే నాగా లేండ్ మేఘాలయా సిక్కిం భూటాన్ హిమాచల ప్రదేశ్ అరుణా చల ప్రదేశ్ , ఇప్పుడు కొత్తగా వింధ్యాంచల్ ,వనాంచల్ , ఉత్తరాంచల్ , చెత్తీస్ గడీ, టిట్లాఘర్ , దొంగలఘర్ , బైలడిల్లా, డురుబురూ, కిరండూల్ ఇన్ని కలిస్తే కదా ఇండియా?! ఎప్పుడూ ‘ఇండియా దిస్ ఇండియా దట్’ అంటావు గానీ నువ్వే జన్మానేనా రాయగెడా మజ్జి గైరమ్మ గుడి దాటి అవతలికెళ్ళిన పాపాన పోయేవా?
క్రిష్ణ మేం సివిల్ సర్విసెస్ కి ప్రిపేరవుతునాం. ఇండియన్ హిస్టరీ మెయిన్స్….
కోటి పుస్తకాల్లో చదివి కధా కార్యక్రమం నడిపించెస్తావా? (కిళ్ళీ ఉమ్మి వచ్చి) ఆ రాఘవరావు గారు మాటాడితే ఇండియన్ పోవర్టీ అంటాడు కదా! నేను రాళ్ళు కొట్టేను రైల్వే లైను మీద కూలి పని చేసేనంటే ‘ఆఁ..?’ అన్నాడు! అవునువై….ఆయన మాటాడితే మాటకి ముందు శాస్త్రీయ దృక్పధం అంటాడు. శాస్త్రీయ దృక్పధం అంటే ఏటమ్మా?
జానీ అంటే….సైంటిఫిక్ టెంపరు బావగారూ!
కోటి పిల్లిని మార్జాలం చేసేవు!
క్రిష్ణ అంటే….అన్ని విషయాలూ సైన్సు ప్రకారం ఆలోచించడం.
కోటి నేను సియ్యీసీ కదా! ఎంపీసీ బైపీసీ తియ్యనోడు శాస్త్ర ప్రకారం ఎలాగ ఆలోచించటం?
జానీ నేనూ సియ్యీసీ వే కదా! సైంటిఫిగ్గా అన్ని విషయాలూ అర్ధం చేసుకుంటే చాలు.
క్రిష్ణ మీరు తెల్లార్లెగిస్తే ముందు వార ఫలాలు చూస్తారు! శాస్త్రీయ దృక్పధం ఊసు మీకెందుకూ….
కోటి అలాక్కాదు. రాఘవ రావు గార్ని పక్కకి పిల్చి అడిగితే కధలోన శాస్త్రీయదృక్పధం ఉండాలి కోటీ గారూ లేకపోతే లాభం లేదన్నాడు. రాఘవ గారూ గోపాలు గారూ ఎంపీసీలో పీహెచ్ డీ చదువుకున్నారు కదూ…
క్రిష్ణ ఊఁ?
కోటి నువ్వు చెప్పు…..ఎమ్మెస్సీ చదువుకున్నావోడి శాస్త్రీయ దృక్పధం గొప్పదా పీహెచ్ డీ చదువుకున్నావోడి శాస్త్రీయ దృక్పధం గొప్పదా?
జానీ పీహెచ్ డీ చదువుకున్నా వోడిదే గొప్పది.
క్రిష్ణ అలాగ డిగ్రీలు బట్టి కాదు…..శాస్త్రీయ దృక్పధం అంటే ఉన్న విషయం ఉన్నట్టు చూడ గలగటం.
కోటి యద్దృశ్యమ్ తన్నశ్యమ్ అన్నాడు కదా!
జానీ అంటే?
క్రిష్ణ అంటే ఈ కంటికి కనిపించేదల్లా ముక్కు పొడుం తప్ప మరేం కాదూ అని! మా బావగారి కబుర్లకేటి….
కోటి బావుంది శ్లేష! మీ కవులందరూ కలిసి అమిరికావోడ్ని నిండా ముంచేటట్టున్నారు. మీ మానవ సంబంధ గురోజీ వాలకం చూస్తే నాకేదో డవుటుగా ఉందమ్మా! పాపం శాస్త్రీయ దృక్పధ బెదరు అమిరికా నుండి వెచ్చటి వెన్న జాగర్త చేసి తెచ్చి ఇక్కడ కవుల మీటింగులంట ఖర్చు పెట్టుకుంటున్నాడు….. శాస్త్ర ప్రకారం పోతే కుక్క పిల్లలు పుట్టేయిట!
క్రిష్ణ మీకు అన్నీ డవుటే! ఇండియన్ కల్చరల్ లేండ్ స్కేప్ లో ఇప్పుడు హ్యూమన్
(కింద నుండి కేక.)
అమో (కోపంగా) ఇటున్న పుల్ల తీసి అటు పెట్టవు కాన్నాయినా నువ్వు ఇండియానీ, ఇటలీనీ, ఇథియోపియానీ, ఈష్ట్రియానీ ఛప్పన్నారు దేశాల్నీ ఉద్ధరించిద్దుగాని రా!
క్రిష్ణ ఈష్ట్రియా అని దేశం ఏం లేదు. తెస్తానన్నాను కదా నువ్వుండవే!
అమో ఈష్ట్రియా కాకపోతే ఊష్ట్రియా! నీ కళ్ళెదురుకుండా అసిరమ్మంత మనిషిని నేనున్నాను కదూ పొద్దుట్నుంచి మీ గుడ్డలన్నీ ఉతికుతికి నడ్డి విరిగి చస్తునాను. ఇప్పుడింక వండాలి! నీకు చారు నీళ్ళు పెట్టడఁవేనా చేత కాదు. పొనీ ఇలాగొచ్చి నా కాళ్ళు పట్టు నీకు సప్త సోషల్ వర్కులు రాసినంత పుణ్యం!
జానీ (నవ్వుతూ కిందికి వంగి) క్రిమో నెందుకాంటీ తిడతారూ?
అమో నాయినా తోడు దొంగవి నువ్వూ ఉన్నా? క్రిమో కీటకఁవో నా కిరసనాయిలు తెచ్చి పడీమను! ఐసు కులుకో బాత్ కులుకో అని మీరు కూచుని గప్పాలు కొట్టుకుంటూ ఉంటే నాకు ఇంట్లో గేసూ లేక కిరసనాయిలూ లేక మీకు కాఫీలూ టిఫిన్లూ ఉపారాలూ నా కాళ్ళు పొయిలో పెట్టి వండమన్నావా…?
జానీ అబ్బా కిరసనాయిలు నీను తెస్తాను గాని మీకోటి చూపించాలి ఇలాగ రండి!
అమో నా కాళ్ళు లేవు అదేదో పట్టుకుని నువ్వే కిందకి రా!
(ఇంకా ఉంది).