ఉదయాన్నే
నావైన అనుభవాలను
తాజాగా దండ గుచ్చుదామని పూనుకున్నాను
లోకానికి నా కథనో వ్యథనో
విన్నవిద్దామనే ఆశపడ్డాను
వింత కూతొకటి
నాదైన సమయాన్ని దోచేసింది
గాలిలో తేలి వచ్చి
చెవిలోకి జొరబడిన
మాటల మంత్రజాలం
కనికట్టు చేసి కట్టేసింది
వరదలో కొట్టుకుపోతూ అక్షరాలు
అవిశ్రాంతంగా రాలిపడుతూ పదాలు
చూపులకు అతుక్కుని
తెలియని మాయా ప్రపంచంలోకి
బలవంతంగా ఈడ్చుకుపోయాయి
కలం కాగితం
ఏనాడో మాయమయ్యాయి సరే
మునివేళ్ళపై వాక్యం సరిగ్గా నాట్యమాడుతున్నప్పుడే
మనసును అదృశ్యశక్తేదో బంధించి
ఖైదు చేసింది
ఇక తీరం అగుపించదు
అల్లంత దూరానో
అందనంత యోజనాల అవతలో
మనిషి రూపం
మసకమసకగా కనబడుతోంది
ఈ గాజుసముద్రం
నన్ను నా నుండి వేరు చేసింది
సమస్త భూమండలాన్ని
సుడిగుండమై
లోనికి లాగేసింది
జీవితం నుండి
మానవ స్పర్శను విడదీసి
ఎడారిగా మిగిల్చింది