తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుకోవలసి వచ్చినప్పుడల్లా ముఖ్యంగా ముందుకు వచ్చేవి అవే అంశాలు – సాహిత్య సభ్యత, సంస్కృతి, విమర్శ లేమి. అయితే, ఈమధ్యన తెలుగు సాహిత్యంలో విమర్శ అనే పదం వినిపిస్తుండడం ఒక పరిణామం. అది మంచికనుకునేలోపే కాకుండా పోవడమూ ఇంకో పరిణామం. కన్నుమూసి తెరిచేంతలో పుస్తకంపై విమర్శ కాస్తా, వ్యక్తిగత స్పందనలు, ప్రతిస్పందనలు, ఆపైన దూషణలుగా మారడం ఇప్పుడు కనిపిస్తున్న విమర్శాలోకపు వాతావరణం. విమర్శ అంటే మంచినైనా చెడునైనా, పొగడ్తనైనా తెగడ్తనైనా ఒక సభ్యమైన భాషతో ఇవ్వగలగాలి; ఒకవేళ విమర్శలో సభ్యత కొంత లోపించినా కవిరచయితలు ఒక మెట్టు పైనే ఉండి ఆ అభిప్రాయాలను స్థితప్రజ్ఞతతో తీసుకోగలగాలి. నిజానికి, పుస్తకం కాని ఒక రచన కాని ప్రచురించినాక, పాఠకుల లోకంలో రచయితలు ఎక్కడా ఉండకూడదు. దురదృష్టవశాత్తు మన తెలుగు కవిరచయితలు అక్కడే తచ్చట్లాడుతుంటారు అందరి ముఖాలూ ఆశగా చూస్తూ, ఎవరు ఏమన్నా వెంటనే దబాయిస్తూనో, కృతజ్ఞతలు కురిపిస్తూనో. రచయితల స్పందనలను పక్కన పెడితే, ఈ సదరు విమర్శకులకు కూడా వాక్యం మీద కొంత అవగాహన, పట్టు ఉండటం ఎంత అవసరమో ఎవరూ పట్టించుకుంటున్నట్లు లేరు. విమర్శ కూడా సాహిత్యంలో ఒక భాగం అని, మిగతా సాహిత్య ప్రక్రియల్లాగే విమర్శకి కూడా సాధన తప్పనిసరి అని చెప్పేవాళ్ళు కనపడటం లేదు. పాఠకులుగా అయినా సరే ఒకరు సాహిత్యాన్ని చదివినా, విశ్లేషించినా దాని గుణగణాలు ఎంచవలసింది తమ ఇష్టాయిష్టాల సరిహద్దులకు ఆవలగానే. ఒక రచన పాఠకులలో ఆహ్లాదం కలిగించినా, ఏహ్యత కలిగించినా సాహిత్య దృక్కోణంలో అవి ఒకే నాణ్యత, విలువ కలిగినవి. అనుభూతి లక్షణం కాదు, ఆ అనుభూతి స్థాయి లేదా తీవ్రత మాత్రమే ఆ నాణ్యతను నిర్ణయిస్తుంది. సాహిత్య సద్విమర్శ ఇది అర్థం చేసుకుంటే తప్ప సాధ్యం కాదు. కళను కళగానే సమీపించాలి. సాహిత్యాన్ని సాహిత్యపరిధిలోనే విమర్శించాలి. పికాసో, గొగాఁ, దలీ తదితరుల చిత్రాలను విశ్లేషిస్తున్నప్పుడు వారి వైయక్తికజీవితాన్ని విమర్శకులు పట్టించుకోరు. తమ దృక్పథపు కళ్ళగంతలనుంచి మాత్రమే సాహిత్యాన్ని సమీపించే తెలుగుసాహిత్యసమాజానికి ఇది అర్థమూ కాదు, సాధ్యమూ కాదు. అందువల్ల విమర్శ ఎంత పేలవంగా మిగిలిపోతున్నదో, కవిరచయితల, వారి అనుయూయుల డాంబికపు సమర్థింపూ అంత బలంగా ఉంటున్నది. అందుకే, మనకి ఇప్పుడు విమర్శలో మనుషుల పేర్లు, వారిపట్ల విమర్శలు తప్ప, నిజమైన సాహిత్య చర్చ కనుమరుగు అవుతోంది. ఎప్పుడైతే చర్చ మనుషుల మీదకు మళ్ళుతుందో అప్పుడు సాహిత్యం తప్ప అన్నీ వివాదంలోకి నెట్టబడతాయి. ఒక సినీమా నచ్చనివారు అందులో లోపాలు ఏమిటో విశ్లేషించకుండా ఆ దర్శకుడినో, నటులనో దూషించడం వంటి అపరిపక్వ ప్రవర్తన ఇది. ఎంత బలమైన ప్రతికూలత మనలో కలిగించినా, భిన్న దృక్పథాలకు అంతే విలువ ఇస్తూ, కేవలం వస్తుచర్చ ద్వారా వాటిని ఖండించడం పరిణతి చెందిన ప్రజాస్వామ్యసమాజంలో కనిపించే/చవలసిన లక్షణం. జాతీయ నాయకులనుంచి, ప్రాంతీయ సేవకులదాకా ఇది ఏ రంగంలోనూ, ఎవరిలోనూ మనదేశంలో కనిపించదు. సాహిత్యసమాజంగా సభ్యత బైట ప్రపంచానికి నేర్పుదామా, వారినుంచి నేర్చుకుందామా అన్న ప్రశ్నకు సాహిత్యకారులు సమాధానం నిర్ణయించుకున్నట్టే ఉన్నారు. అందుకని, ఇక మాట్లాడుకోవలసింది ఇవి ప్రచురిస్తున్న వేదికలు, వాటి నిర్వాహకుల గురించి…