బాల్కనీ అతిథులు

ఉదయాన్నే
నలుపు రెక్కల గుంపొకటి
బాల్కనీలో కావుమంటుంది
అమ్మా ఆకలే అన్నట్టే
నా చెవికి వినిపిస్తుంది

పెరుగన్నం ముద్ద తిని
నింగిని పలకరించడానికి
వెళ్ళిన మరో గుంపు
మధ్యాహ్నాన్ని
భారంగా మోసుకొస్తుంది

ఎర్రని ఎండకు
ఎండిన దేహాలకు
కాసిని మెతుకులు
గుక్కెడు నీరు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి
నా నీడ ఆసరాగా
మరెన్నో రంగులదేహాలు
పళ్ళెం ముందు
అతిథులైపోతాయి
బాల్కనీ హోరెత్తి
కొత్తకోరస్ అందుకుంటుంది

వర్షపు దినాన
వాటి జాడకై
నాకు పక్షిభాషతో
పరిచయం అవసరం

పితృదేవతల గంధర్వుల
మారురూపం సంగతెందుకు
చిటికెడు పొట్ట నింపే
ఆనందం ఎదుట
పుణ్యమన్న మాట
సూక్ష్మరూపంతో ముడుచుకుపోదూ.