నడిరాతిరి వేళ! కాలు మడుచుకుందామని పంౘలోకొచ్చింది వీరగణికమ్మ.
పున్నమివెలుగును ఎర్రగా మారుస్తూ పెళపెళమంటూ తగలడిపోతుంది పుంతరేవమ్మ గుడి.
“అపచారం! అపచారం! అమ్మ గుడి తగలడిపోతోoదొరేయ్!” గుండెలు బాదుకుంటా వీధిగుమ్మంలోనే సొమ్మసిల్లి పడిపోయింది గణికమ్మ. గణికమ్మ ఇంట్లో కరెంటుబల్బు ఠక్కున వెలిగింది. ఇంట్లో జనం వీధిలోకొచ్చేరు. అందరూ గుడివైపు చూసి గుండెలమీద చరుసుకుంటూ పెడబొబ్బలు పెట్టారు. ఆ అరుపులకు ఊరు ఊరంతా లేచింది. వీధిమొగలో వేణుగోపాలస్వామి గుడిని అనుకుని ఉన్న పుంతరేవమ్మ గుడి వైపు పరుగులు పెట్టారు ఊరిజనం.
పుంతరేవమ్మ గుడి అంటే శిల్పాలు చెక్కిన రాతి స్థంభాల కట్టడంపై నిలబెట్టిన గాలిగోపురపు దేవాలయం కాదు. నాలుగు కొబ్బరి గుంజల్ని నాలుగు పక్కలా పాతి, మధ్యలో నిలబెట్టిన తాటి దూలం మీదుగా వెదురు బొంగులతో కట్టిన పైకప్పు మీద తాటాకు, కొబ్బరి ఆకులతో నేసి, గుడిసె చుట్టూ వెదురుతడికలు దడి కట్టి నిలబెట్టిన పందిరిపాక. అందులో ఉన్నది ఏకశిలపై నగిషీలు చెక్కి, ప్రాణప్రతిష్ఠ చేసిన బొమ్మ కాదు. నిండు ప్రాణాల్ని నవనాడుల్లో నింపుకుని జనంతో పూజలందుకుంటూ ఒంటిగా కాలం వెళ్ళదీస్తున్న ఓ నాలుగుపదుల వయసున్న ‘అమ్మ’.
“అమ్మ లోపలే ఉంది. గొమ్మునెల్లి అట్టుకురండేహే!” గుంపులో నుండి అరిచారెవరో! నలుగురు కుర్రాళ్ళు తడి గోనెపట్టాల్ని ఒంటికి చుట్టుకుని మంటల్లోనుండి చాకచక్యంగా అమ్మని బయటికి తీసుకొచ్చేరు. అప్పటికే సగానికి కాలిపోయింది పుంతరేవమ్మ. ఊరు మొత్తం ఒక్కపెట్టున ఏడుపు లంకించుకుంది.
“మేం ఏం అపచారం చేసేం తల్లో! నీకు నీవే శిచ్చ ఏసుకున్నావు మా బంగారు తల్లో!” అంటా లెంపలేసుకుంటా పొట్టి కాంతమ్మ పుంతరేవమ్మ మీద పడబోయింది. విసురుగా పక్కకి లాగేశారు ఎవరో. బాధగా ముల్గుతా ఏదో చెప్పడానికన్నట్టు చేతులు గాల్లో ఆడిస్తా మాట రాక గమ్మునుండిపోయింది పుంతరేవమ్మ.
“అగో ఏదో సెప్తుంది మా రాజుతల్లి… ఆ వేణుగోపాలసాములోరి గుడి మాన్యాలు ఆక్రమించేసి ఆ పంచాయితీ ఆఫీసోల్లు రాళ్ళు పాతినందుకే అలిగినట్టు ఉంది మాయమ్మ తల్లీ. అందుకే ఆత్మబలిదానం చేసుకో…” వేణుగోపాలస్వామి ఆలయ ధర్మకర్త ఆంజనేయులుగారి మాటలింకా పూర్తికానేలేదు. ఏదో గొణుగుతా కెరటంలా పైకి లేచి చప్పున నేలకి అంటుకుపోయి సన్నగా మూల్గింది పుంతరేవమ్మ.
“ఒరేయ్! ఆరెంపీ సత్తిపండుకి ఫోన్ చేయాండ్రా. ఏం చెప్తాడో సూద్దాం. ఆడి వల్ల కాదంటే ఆయమ్మని ఆసుపత్రికి అట్టుకుపోదాం” వీరగణికమ్మ మొగుడు భీమరాజు కుర్రాళ్ళకేసి చూస్తా అరిచేడు.
“అపచారం! లోకాల్ని ఏలే ఆ తల్లికి ఆసుపత్రి వైద్యమా?! ఆ తల్లికంటే గొప్పోల్లా ఆ డాక్టర్లు! ఆ యమ్మకి ఆయమ్మే రక్ష. కాసిన్ని ఏపమండల్ని తీసుకురండి పాన్పువేసి పడుకోబెడదాం. ఓ వీరగణికమ్మో! ఎవరి ఇంట్లోనైనా పుట్టతేనే, వెన్నపూసా ఎంతుంటే అంత అట్టుకొచ్చి ఆయమ్మ ఒంటికి పూయండే. తెల్లారే సరికి ఆయమ్మ గజ్జెపూసలా లేచి చెంగుచెంగున తిరుగుద్ది.” ఆంజనేయులుగారు తనవంతు సలహా ఇచ్చేరు. ఊళ్ళో సగంమంది తందానా అన్నారు. ఆ మాటలు విన్న పుంతరేవమ్మ గొంతు కీచుమంది. అది ఆవేశంతో అరిచిన అరుపో… బాధతో చేసిన ఆర్తనాదమో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరిద్దరు ఆడోళ్ళు పాత చీరలతో పుంతరేవమ్మ చుట్టూ దడి కట్టేరు. గుడిముందున్న నూతిలోనుండి చల్లటి నీళ్ళబిందెల్ని తీసుకొచ్చి బిందెల్లో గుప్పిళ్ళతో అంత పసుపేసి నీళ్ళని అమ్మ మీద ధారగా గుమ్మరిస్తున్నారు. పుట్టతేనె, వెన్నపూస తీసుకురావడానికి ఇద్దరుముగ్గురు ఆడోళ్ళు ఇళ్ళవైపు కదిలేరు. పుంతరేవమ్మ మూల్గతానే ఉంది. పాన్పు వేయడానికి ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు పక్కనే ఉన్న వేపచెట్టెక్కేరు. వీరగణికమ్మ కొంచెం తేరుకుని పుంతరేవమ్మ దగ్గరకొచ్చి కూర్చుంది. గణికమ్మ కళ్ళనిండా నీళ్ళు.
ఆ రోజు ఇంకా కళ్ళముందే కదలాడుతుంది గణికమ్మకి. కోడి కూసి జామున్నర గడిచి కూడా చీకటి ఇంకా వీడిపోలేదు. మసక వెలుతురులో… చెంబట్టుకుని పుంతరేవుకి ఈవలి పక్క దిగువునున్న అడవితూటు డొంకల్లోకి దూరబోతున్న గణికమ్మ ఉన్నట్టుండి చేతిలో చెంబు వొదిలేసింది. పుంతరేవు నీళ్ళల్లోనుండి మెల్లగా పైకి లేస్తున్న ఆ ఆకారాన్ని చూడగానే ఆమెకి గుండాగిపోయింది. చెయ్యెత్తరిమనిషి! నీళ్ళల్లో తడిసి సగం గుండెలమీదకి ఇంకో సగం వీపు మీదకి జారిన బారెడు జుట్టు. ఒంటికి అంటుకుపోయి అడుగులు వేస్తున్నప్పుడు తపతపలాడుతున్న ఎర్రటి చీర. ఆ ఆకారం అలాగే రేవులోనుండి గట్టు మీదకొచ్చి ఊరివైపున్న సిమెంట్ రోడ్డు మలుపులోకి తిరుగుతుంటే గుండె అరచేతిలో పెట్టుకుని డొంకల్లోనే కూర్చుండిపోయింది గణికమ్మ. ‘పుంతలోముసలమ్మ తల్లి’ కాదుకదా అనుకుంది మనసులో. పొద్దుపొడుపు చుక్క పొడిచాక గ్రామదేవతలెవరూ ఊళ్ళల్లో తిరగాడరని సర్ది చెప్పుకుంది. ఆకారం డొంక దాటుతున్నప్పుడు ఆ మనిషెవరోనని కళ్ళు చిట్లించి తేరిపారా చూసింది. ఆ మసక వెల్తుర్లో అంతుచిక్కలేదు. ఆ మనిషి వెనకాలే అడుగులో అడుగేసుకుంటూ ఊళ్ళోకి వొచ్చిన గణికమ్మ వేణుగోపాలస్వామి గుడివైపు వెళ్తున్న ఆ మనిషిని ఆపే సాహసం చేయలేదు. గుడిప్రాంగణంలో అడుగుపెట్టిన ఆ ఆకారం గర్భగుడిలోని స్వామికి ఎదురుగా వొచ్చి అలాగే నిలబడిపోయి చేతులు జోడించింది. ఆనక గుడిమంటపంలో ఉన్న గిన్నెలోనుండి అంత పసుపు తీసుకుని ముఖమంతా పూసుకుందామె. మునివేళ్ళతో కుంకుమ తీసుకుని రూపాయి కాసంత బొట్టు నుదుటున దిద్దుకుంది. చుట్టూ తేరిపారా ఓ చూపు చూసి ఎడతెరిపి లేకుండా, పోటెత్తిన గోదారి వరదలా నవ్వుతా మండపం మధ్యలో తిష్టవేసుకు కూర్చుంది. నెమ్మదిగా కళ్ళు రెండూ మూసుకుని నోటికొచ్చిన మాటల్నో, మంత్రమో పఠిస్తూ కూర్చుంది ఆ చెయ్యెత్తరి మనిషి.
తెల్లగా వెలుగురేఖలు విచ్చుకోకమునుపే గణికమ్మ ఊరిమొత్తాన్ని లేవదీసుకొచ్చి గుడిముందర నిలబెట్టేసింది. గుడి మంటపంలో కూర్చుని కళ్ళు మూసుకుని ఏదో గొణుక్కుంటున్న ఆ మనిషిని చూడగానే కొందరి చేతులు భక్తితో గాల్లోకి లేచాయి. ఇంకొందరి గుండెలు భక్తి పారవశ్యంతో ఉప్పొంగిపోయాయి.
“రాజకీయాల రొంపిలో దిగబడిపోతున్న ఊరిని కాపాడ్డానికే ఆ బెజవాడ దుర్గమ్మ సొయంగా ఈ తల్లిని అంపినట్టుంది. అదిగో ఆ మొఖం చూడండి… పసుపు పచ్చని ఛాయతో వెలిగిపోతూ మధురమీనాక్షమ్మకి మల్లే! ఆ కళ్ళు అచ్చు కంచి కామాక్షమ్మవే! ఏ కొండ మీదనుండి దిగివచ్చిందో మాయమ్మ తల్లీ!” ఆమె ముందు సాగిలపడిపోయాడు వేణుగోపాలస్వామి గుడి ధర్మకర్త ఆంజనేయులుగారు. ఇప్పుడు మరికొన్ని చేతులు భక్తితో పైకి లేచాయి.
ఎవరో పాలు పట్టుకొచ్చి ఆయమ్మ ముందు పెట్టారు. కళ్ళు సగం తెరిచి గ్లాసులో పాలు సగం తాగి మిగతా సగం అక్కడే పెట్టేసింది. ఆ ఎంగిలి పాలని తీసుకుని భక్తితో ఒక్కోచుక్కా అరచేతుల్లో పోసుకుని అమృతం తాగినట్టు తాగేశారు జనం. అందనివాళ్ళు తమవంతు కోసం ఎదురుచూస్తా కూర్చున్నారు. చుట్టూ చేరినవాళ్ళు ఏవేవో ప్రశ్నలడుగుతున్నారు. ఆమె కళ్ళుమూసుకునే ఉందిగానీ ఏం మాట్లాడటం లేదు. ఒక్కోసారి ఉన్నట్టుండి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పిడికిలి బిగిస్తోంది. చుట్టూ జనాల్ని ఒక చూపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. ‘మైల జనాలెవరైనా ఉంటే లేచెళ్లిపొండి. అమ్మకి ఆగ్రహం తెప్పించకండి’ గుడిపూజారి సోమయాజులు గట్టిగా అరిచి చెప్పాడు. ఒకరిద్దరు లేచెళ్ళిపోయారు. తెల్లగా తెల్లారేసరికి ఊరి పొలిమేర దాటేసింది ఆ వార్త. పక్క ఊళ్ళల్లోనుండి తండోపతండాలుగా పోటెత్తారు జనం. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొందరు కుర్రాళ్ళైతే, పంచాయితీ వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్న దేవుడి మాన్యాలని వాళ్ళకి చెందకుండా గుడి ధర్మకర్త ఆంజనేయులు ఆడించే కొత్తనాటకమని తేలిగ్గా కొట్టిపారేశారు. పెద్దోళ్ళు కుర్రోళ్ళ మాటల్ని గట్టిగా ఖండించారు. గుడి పూజారి సోమయాజులు పెద్దోళ్ళకే వంత పాడేడు. ఆమె రాకతో అదనంగా రాబోయే కొబ్బరి చెక్కల్ని, చిల్లరపైసల్ని మనసులోనే లెక్కగట్టుకున్నాడు.
“ఆ తల్లిని ఏమని పిలుద్దాం?!” భీమరాజు సందేహాన్ని వెళ్ళబుచ్చాడు. “ఇంకేం పేరు?! పుంతరేవులోనుండి నడిసొచ్చిన్న ఆ తల్లిని పుంతరేవమ్మని పిలుచుకుందాం” అంటూ వీరగణికమ్మ ముందుకొచ్చింది. “పుంతరేవమ్మకి జై! పుంతరేవమ్మకి జై!” భక్తి పారవశ్యంతో గట్టిగా అరుస్తో ఊగిపోయారు అక్కడ ఉన్న భక్తజనం.
ఆ రోజు మొదలు రోజూ ‘పుంతరేవమ్మ’ వేగుచుక్క పొడవక ముందే పుంతరేవులోకి పోయి తలారా స్నానం చేసొచ్చేది. ఆ తడిబట్టలతోనే గుడిచుట్టూరా ప్రదక్షిణలు చేసి పసుపు, కుంకుమ ముఖానికి పూసుకుని గుళ్ళోని క్రిష్ణదేవుడి ముందు ఏదో గొణుగుతా సాష్టాంగపడి ఆనక గుడిమంటపంలో తిష్ట వేసుకుని కూర్చునేది. అందరికంటే ముందు వీరగణికమ్మ ఆ తల్లి దర్శనం చేసుకునేది. తనతో తెచ్చిన పాలని నైవేద్యంగా పెట్టి మిగిలిన ఎంగిలి పాలని ఆనక వొచ్చే భక్తులకు ప్రసాదంలా పంచేది. గుడిపూజారి సోమయాజులు పొద్దుపొద్దున్నే నాలుగు పువ్వుల్ని తెచ్చి ఆమె ముందు పెట్టి సాయంత్రం అవగానే నాలుగు కొబ్బరిచిప్పలనో, నాలుగుపదుల రూపాయలనో పట్టుకుపోయేవాడు. చీకటి పడుతూనే కాసింత పెరుగన్నం తెచ్చి ఆమె ముందు పెట్టి తన గోడు అంతా వెళ్ళబుచ్చుకునేవాడు ఆంజనేయులుగారు.
తరతరాలుగా దేవుడిమాన్యాలు వాళ్ళ వంశం వాళ్లే సాగుచేస్తున్నారని, వచ్చిన ఆదాయం అంతా ఆ దేవదేవుడి కైంకర్యాలకే తప్ప నయాపైసా కూడా సొంతానికి వాడుకోవడం లేదని, ఇప్పుడు దానిమీద పంచాయితీ వాళ్ళ కన్నుపడిందని… కోర్టులో కేసు నడుస్తోందని, తన పట్ల కాస్త దయచూపమని సాష్టాంగ పడేవాడు. పుంతరేవమ్మ ఏం విననట్టే ఉండేది. నోరు తెరిచి ఒక్కముక్కా మాట్లాడకపోయేది. ఆ పెరుగన్నాన్ని అటూ ఇటూ కలతిప్పి రెండు ముద్దలు తిని గిన్నెని దూరంగా నెట్టేసేది. ఆ ఎంగిలికూడుని వంతులవారీగా ఎత్తుకెళ్ళి పిల్లలకి పెట్టేవాళ్ళు ఊరిజనం. ఆ తల్లి విడిచేసిన బట్టల్ని కట్టుకుని ఉపవాసాలు చేస్తే పిల్లలు పుడతారని నమ్మేవారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు మొక్కుబడిగా తెచ్చిన చీరల్ని ఆ యమ్మకి కట్టబెట్టేవారు. వీరగణికమ్మ తన కూతురు కాపురం నిలబెట్టమని మొక్కుకుంది. రెండు వారాలు తిరక్కముందే అల్లుడొచ్చి కూతుర్ని తీసుకుపోయాడు. వెండి కడియాలు చేయించి ఆయమ్మకి తొడిగింది. ఎంగిలి పాలు తాగాక పొట్టి కాంతమ్మకి ఎన్నో రోజులుగా ఉన్న వెన్నునొప్పి తగ్గుముఖం పట్టిందంది. పూజారి సోమయాజులకి బెజవాడ కనకదుర్గమ్మ కల్లోకొచ్చి పుంతరేవమ్మని కళ్ళల్లో పెట్టి చూసుకోమని చెప్పిందని ఊరంతా చాటింపేశాడు. ఒక్కొక్కటిగా ఆ తల్లి మహిమలు అన్నీ ఊరి పొలిమేర దాటేయి. నెలల గడవకముందే చుట్టుపక్కల ఊరూవాడల్లో పేరెళ్ళిపోయింది ఆ తల్లి. మాట వరసకైనా ఓ మాట కూడా మాట్లాడని ఆ తల్లి చూపు, సైగల్నే దీవెనలుగా, ఆజ్ఞలుగా ఎవరికి నచ్చినట్టూ వాళ్ళు అన్వయించుకుంటో రోజులు సాగిపోతుంటే… అప్పుడొచ్చారు స్వాములోరు! పక్కనున్న టౌనులో ఏదో మఠానికి అధిపతి అంట! ఆనోట ఈనోటా అమ్మ గురుంచి విని చూసిపోదామని వచ్చారంట. అమ్మలో లక్ష్మీకళ ఉట్టిపడుతుందన్నాడు. అయ్యవారు ఉండే చోట అమ్మని ఉంచడం సబబు కాదన్నాడు. పక్కనే ఉన్న దేవుడి మాన్యమైన ఐదెకరాల కొబ్బరితోటలో అమ్మకి ‘గద్దె’ వేసి ఆశ్రమం ఏర్పాటు చెయ్యమ్మన్నాడు. స్వామిలోరికి పదివేలు రూపాయలు విరాళం ఇచ్చి పంపించారు ఆంజనేయులుగారు. అదిగో అప్పుడు వెలిసిందే ఈ పుంతరేవమ్మ గుడి.
వీరగణికమ్మ జ్ఞాపకాల్లోనుండి బయటపడి కన్నీళ్ళని తుడుచుకుని పుంతరేవమ్మని చూస్తా భారంగా నిట్టూర్చి పైకి లేచింది.
రాత్రి మూడో ఝాము దాటింది. కాలిన గాయాల నొప్పి తట్టుకోలేక పుంతరేవమ్మ మూల్గతానే ఉంది. ఆ మూల్గుడులో మెల్లమెల్లగా సవ్వడి తగ్గుతావుంది. ఏపమండల్ని తెచ్చి పాన్పు వేశారు కుర్రాళ్ళు. ఆ పాన్పుపై అమ్మని పడుకోబెట్టి సాంబ్రాణి ధూపం వేశారు ఆడోళ్ళు. పుట్ట తేనె, వెన్నపూస ఆ యమ్మ ఒంటికి పట్టించాక ఆ తల్లి మహిమల్ని కథలుకథలుగా చెప్పుకోవడం మొదలెట్టారు ఆ ఊరిజనం.
“మా పెద్దపిల్లకి పెళ్ళై మూడేళ్ళు దాటినా నీళ్ళోసుకోలేదు. అత్తగారోళ్ళు అనరాని మాటలన్నీ అన్నారు. ఇగో ఈ తల్లి ఇడిసేసిన తడిబట్ట కట్టుకుని ఉపవాసం చేశాకే మా పెద్దబుజ్జిది మా పెద్దదాని కడుపులో పడ్డది” పుంతరేవమ్మ కేసి చూస్తా భక్తిగా చేతులు జోడించిందో పెద్దావిడ.
“సెబితే నమ్మవు గానీ వదినే… ఏడాది కిందట పుట్టిన మా సొట్టశంకరంగాడి కొడుక్కి పుట్టుకలోనే గుండెలో చిల్లుందని చెప్పారంట డాట్టర్లు. మందులేవో ఇచ్చారు గానీ ఆయాసం తగ్గేది కాదు. ఇగో ఈ తల్లి ఎంగిలికూడు తినిపించాకే ఆడి పేణం కుదురుపడ్డాది. మొన్న కేనింగు చేసి సూత్తే సిల్లుగిల్లు ఏం లేదని చెప్పారంట డాట్టర్లు. మరి నా నొడుం నొప్పో?! ఏదో మంత్రం ఏసినట్టు ఎగిరిపోలేదా! ఆ తల్లి చలవ కాకపోతే ఇంకేం అంటాం పార్వతక్కా!” అంటా సాగదీసింది పొట్టికాంతమ్మ. కథలు సెలయేరులా సాగుతూనే ఉన్నాయి. తూర్పున పొద్దుపొడుపు చుక్క పొడిచింది. పక్కూరోళ్ళకి సంగతి తెలిసి పరిగెత్తుకొచ్చారు. ఆయమ్మని చూసి కరిగిపోయారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు. గతకాలపు కథల్ని వాళ్ళు కూడా ఒక్కొక్కటిగా నోటికెత్తుకున్నారు. కళ్ళుమూసుకుని ఆ కథలన్నీ వింటుందేమో అన్నట్టుగా మెల్లగా మూలుగు ఆపేసింది పుంతరేవమ్మ.
ఒళ్ళు కాలిన చోట మంటలు రేగుతున్నాయి. ఊరివాళ్ళు పూసిన వెన్నపూస ఏ సహాయమూ చెయ్యటం లేదు. వస్తూ పోతూ ఉన్న స్పృహలో జ్ఞాపకాలు తెరలుతెరలుగా రాసాగాయి. ఎక్కడ మొదలైన జీవితం… ఇక్కడిదాకా ఎలా వచ్చిందో… ఇంకేం కాబోతోందో…
అభిరామిసుందరి ఊరు తమిళనాట కృష్ణగిరి. ఆ దేవదేవుడికి నృత్యసంగీతాలతో ‘రంగభోగం’ చేసుకుంటా తరతరాలుగా ఆయనే సర్వస్వంగా బ్రతుకుతూ ఎవరి చల్లని చూపుతోనో బ్రతుకీడ్చిన కళావంతుల వంశం. ఒకప్పుడు దర్జాగా బ్రతికిన ఆ వంశస్తులు రాజులూ రాజ్యాలూ పోయాక బ్రతుకు భారమై జానెడుపొట్ట కోసం చాలామంది ఆడవాళ్ళు పడుపువృత్తిలోనే చితికి ఛిద్రమైపోయారు. అభిరామి అమ్మమ్మ కాస్త సంగీతము, నాట్యమూ తెలిసి, ఆ కట్టులోనుండి బయటపడి పెళ్ళి చేసుకోవాలని ఉబలాటపడినా మెళ్ళో తాళి కట్టి అక్కున చేర్చుకునే మహానుభావుడెవరూ కనపడలేదు. ఓ ఏడాది క్రిష్ణగిరి గుడి ఉత్సవాల్లో వయసులో ఉన్నప్పుడు నాట్యప్రదర్శన చేస్తుంటే ఎవరో ఓ అయ్యర్‍గారు చూసి మనసు పారేసుకుని ఆమె గురించి తెలుసుకుని సరాసరి ఇంటికే వచ్చేశాడు. తన మాట వింటే మహారాణిలా చూసుకుంటానన్నాడు. అమ్మమ్మ కాదనలేకపోయింది. సుబ్బులక్ష్మిని కని తల్లైతే అయింది కానీ అతడికి ఇల్లాలు మాత్రం కాలేకపోయింది. వేణుగోపాలస్వామి గుడిని ఆనుకుని ఉండే ఎత్తరుగుల మండువా లోగిలి ఇల్లు మాత్రం ఆమెకు దక్కింది.
తనను పొరపాటున కూడా కూతురుగా చూడలేదు. ఒక ముద్దూముచ్చటా లేదు సరిగదా ‘నాన్నా’ అని కూడా పిలవనివ్వని ఆ అయ్యర్‍గారిపై సుబ్బులక్ష్మికి ఏహ్యత తప్ప ఇంకేమీ మిగలలేదు. తన పిల్లలకూ అటువంటి గతే పట్టకూడదనుకుంది. పోషకులు, విటులపై ఆధారపడి బతకకూడదనుకుంది. గట్టిగా ఒట్టు పెట్టుకుంది. మనసుకి నచ్చినవాణ్ణే పెళ్ళి చేసుకుంటానంది. అలాగే చేసుకుంది కూడా. జిల్లాకోర్టులో అడ్వకేటుగా పనిచేస్తూ వేణుగోపాలస్వామి గుళ్ళో జమాఖర్చుల లెక్కలు చూసే గోపాలకృష్ణన్‍ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అతనికది రెండో పెళ్ళి. సమాజానికి భయపడి రాత్రిళ్ళు మాత్రమే ఇంటికొచ్చేవాడు. కాని, అభిరామి పుట్టాక తనని ఎంతా ప్రేమగా చూసుకున్నాడు. ఎంతో గారాబం చేసేవాడు. కాని, రానురానూ ఊరంతా పుకారు లేచింది. గోపాలకృష్ణన్ రానురానూ రావడం తగ్గించేశాడు. ఆయన దగ్గర పనిచేసే మురళీధరన్ మాత్రం కావాల్సిన సరుకులు డబ్బులు ఇచ్చిపోయేవాడు. మెల్లగా ఆ ఇద్దరికీ అలా ఒక మొగదిక్కయ్యాడు. అభిరామికి యుక్తవయసొచ్చింది. ఒకరోజు మురళీధరన్ ఆయాసంతో రొప్పుతూ వొచ్చి, అభిరామి అమ్మ చేతిలో ఏవో కాగితాలు పెట్టి ఇంకేదో చెప్పి అంతే వేగంగా తిరిగెళ్ళిపోయాడు. సుబ్బులక్ష్మి ఏడుస్తూ కూలబడిపోయింది. అభిరామి అమ్మమ్మ ఆ పేపర్లు తెచ్చి తన చేతిలో పెట్టి ‘పదెకరాల మాగాణి మీనాన్న నీపేరు మీద రాసి ఆ దేవుడు దగ్గరికెళ్ళిపోయాడే!’ అంటూ ఓ రెండు కన్నీటి బొట్లు రాల్చింది.
తండ్రి పోయాక కూడా మురళీధరన్ అప్పుడప్పుడూ ఇంటికి ఒస్తూ పోతుండేవాడు. కష్టసుఖాల్లో తోడుంటూ ఇంట్లో మనిషిగా అయ్యాడు. ఇంచుమించుగా సుబ్బులక్ష్మి వయసే కానీ అతని ఆలోచనలు ఇంకోదారి పట్టాయి. అభిరామిమీద మనసు పడ్డాడు. పెళ్ళి చేసుకుంటానన్నాడు. సుబ్బులక్ష్మికి అది ఇష్టం లేకపోయింది. మగ దిక్కులేని సంసారానికి దిక్కై ఉంటాడని, పాతికేళ్ళు దాటేసిన పిల్లకి ఇప్పుడు కాక ఇంకెప్పుడు పెళ్ళి చేస్తావని నానాయాగీ చేసి అమ్మమ్మ ఎలాగోలా అమ్మని ఒప్పించింది. చివరాఖరుకి అమ్మ, అమ్మమ్మ మాట కాదనలేక అభిరామి తాళి కోసం అతడి ముందు తలొంచాల్చివొచ్చింది. వారసుడు కావాలని ఒకే తాపత్రయం ఉండేది. కాని, అది కుదరలేదు. పరీక్షలు చేసిన డాక్టర్లు మా ఇద్దరికి పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పేశారు. డాక్టర్లు లోపం ఎవరిదో చెప్పకపోయినా అతడు మాత్రం అభిరామిపైనే నింద వేసేశాడు. పిల్లలు పుట్టరని తెలిశాక ఉద్యోగం మానేశాడు. పీడించి గుంజుకున్న డబ్బులతో మందు తాగొచ్చి నానా హంగామా చేసేవాడు. కొట్టేవాడు. వ్యాపారాలు చేస్తాననేవాడు. పెట్టుబడికి కావాల్సిన డబ్బుకోసం ఆస్తి పేపర్లు తనఖా బెట్టమనేవాడు. అభిరామికి మెల్లిగా అర్ధమైంది. అతడు వారి పంచన చేరింది తన పేరుమీదున్న ఆస్తి కోసం తప్ప తనకోసం కాదని! అతడెంటో మెల్లగా తెలిసొచ్చింది. ఒకరోజు బాగా తాగొచ్చి తానింకో పెళ్ళి చేసుకోబోతున్నాని చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు.
ఏళ్ళకి ఏళ్ళు ఏరులై సాగిపోయాయి. కష్టసుఖాల్లో పట్టించుకునే మగదిక్కు లేకుండా పోయింది. కృష్ణగిరి గుడిలో పెద్ధింటి బ్రాహ్మణ పిల్లలకి నాట్యం నేర్పే పని అభిరామికి దొరికింది. కళ్ళు తెరిస్తే నాట్యం, కళ్ళు మూస్తే కృష్ణదేవుడు! జీవితం ఒక గాడిలో పడుతుందనుకుంటుండగా… అదిగో మళ్ళీ అప్పుడే ఊడిపడ్డాడు మురళీధరన్! కాస్తంత డబ్బుకావాలని కాళ్ళావేళ్ళా పడ్డాడు. అభిరామి ఒప్పుకోలేదు. ఊరి చివారుండే ఓ తాగుబోతుని ఒకరాత్రి ఇంటిసావిట్లోకి పంపించి అభిరామిని అందరిముందు దోషిగా నిలబెట్టాడు. నిజం ఎరుగని ఊరు వారిని ‘వెలి’వేసింది. ఆ అవమానం తట్టుకోలేక సుబ్బులక్ష్మి గుండె కొన్నాళ్ళకు కొట్టుకోనంది. అభిరామి ఒంటరిదయింది. మురళీధరన్ ఓరోజు రాత్రి పీకలదాకా తాగొచ్చి స్టాంపుపేపర్ల మీద సంతకం చేయమన్నాడు. అభిరామి చెయ్యనంది. చేతికర్ర పైకెత్తి పట్టుకున్నాడు. చంపినా పరవాలేదంది. చంపడానికే వొచ్చినట్టున్నాడు. ఎత్తిన కర్రని అలాగే నెత్తిన బాదాడు. కళ్ళు బైర్లు కమ్మి, నుదుటి మీదనుండి రక్తం ధారకట్టి కిందకి జారిపోతూ అభిరామి నేల కూలిపోయింది.
తెల్లవారేసరికి తలంతా పచ్చి పుండైపోయుంది. ఎవరో జాలిపడి పసరు కట్టేదో కట్టారు. చుట్టూ చేరిన జనం జాలిగా చూస్తున్నారు. ఆ జనం ఏంటో ఎవరో అర్థం కాక వెర్రి చూపులు చూస్తున్న అభిరామిని ఒకరిద్దరు వరసలు కలిపి పిలిచేరు. ఎవరు ఎవరో అభిరామికి తెలియలేదు. ఎదురుగా గోడమీద వేళ్ళాడుతున్న పటంలోని కృష్ణదేవుడి ముఖం తప్ప ఇంకెవరి ముఖాలు అంతకుమునుపు క్షణకాలం చూసిన్నట్టయినా అనిపించలేదు. ఆ పటాన్ని గుండెలకి హత్తుకుని జనాల్ని తప్పించుకుంటూ గుమ్మం దాటబోయింది. ఒకరిద్దరు అడ్డుపడబోయారు. ‘వదిలేయండి’ అని ఎవరో పెద్దాయన ఆజ్ఞ వేశాడు. జనాలు అడ్డుతొలిగారు. మతి భ్రమించినట్టు ఉన్నదన్నారు కొందరు!
‘ఎవరికి?మీకా? నాకా?’ అభిరామి నవ్వింది పెద్దగా. పోటెత్తిన ఆ నవ్వుకి ఆ జనాలు భయపడిపోయారు. అప్రయత్నంగానే కొంచెం దూరం జరిగారు. అభిరామి గుడివైపు నడిచింది. కొన్ని బలమైన చేతులు ఆపి గుడిలోకి రానీయకుండా ఎత్తి బయటికి నెట్టేశాయి. అభిరామి జీవితం ఒక ప్రయాణమయింది. ఎక్కడ ఎవరు ఏది పెడితే తిని కడుపునింపుకుంది. ఎక్కడ అలసిపోతే అక్కడే పడుకుని నిద్రపోయింది. చివరాఖరికి వేణుగోపాలస్వామి గుడిలోని స్వామి తనను తిరిగి అక్కున చేర్చుకున్నాడు.
ఆరోజు పుంతరేవులో తొట్టతొలిసారి అభిరామిని చూసింది వీరగణికమ్మే అయినా తన అవసరానికి అడ్డం పెట్టుకుంది మాత్రం ఆంజనేయులుగారే! ఊళ్ళోకి అభిరామి రాకతో ఆయనకో ఆసరా దొరికింది. ఊరందరికీ తనొక దైవం అయితే ఆయన చేతికి మాత్రం ఒక ఆయుధం అయింది. పంచాయితీ వాళ్ళ కబ్జా నుండి దేవుడి మాన్యాన్ని కాపాడ్డానికే తను ఒచ్చిందని ఆయనో కొత్త కథ అల్లేడు. తనలోకంలో తానుంటే తనని ఒక దైవాన్ని చేసేశారు ఊరిజనం. తన చూపు వాళ్ళకి ఆజ్ఞ అయ్యింది. తన సైగ వాళ్ళకి శాసనం అయ్యింది. తన మౌనం వాళ్ళకి ధ్యానం అయ్యింది. తన ప్రతి కదిలికని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అన్వయించుకున్నారు. చెదిరిన వాళ్ళ మనసులని కుదుటపరుచుకున్నారు. కలతనిద్రలో కలలో మురళీధరన్ తారాడినపుడు ఆవేశంతో కదిలిన తనను చూసి మైలగాలికి కలిగే ఆగ్రహమేమో అనుకున్నారు.
కానీ పంచాయితీ ప్రెసిడెంటు తన ధోరణి మార్చుకోలేదు. ఆంజనేయులుగారికి అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు. ఇక తప్పలేదు. ఆదమరిచి నిద్రపోతున్న అభిరామి ఏదో అలికిడికి కళ్ళు తెరిచింది. ఎదురుగ్గా ఆంజనేయులుగారున్నారు. పెరుగన్నం పెట్టిపోయిన ఆ మనిషి మళ్ళెందుకు వచ్చాడో అర్ధంకాక వెర్రిచూపులు చూస్తూ అభిరామి పైకి లేవబోయింది. ఆయన బలంగా వెనకకు నెట్టాడు. అభిరామి తల నేలకు కొట్టుకొని స్పృహ కోల్పోయింది. గుడిసె మంటలలో కాలిపోయింది.
అచేతనమైపోయిన పుంతరేవమ్మ చుట్టూ దడి కట్టేశారు ఆ జనం. పుంతరేవులో కూర్చుని గుడిపూజారితో ఏవో మంతనాలు జరుపుతున్న ఆంజనేయులుగారికి కబురెళ్ళింది. హడావిడిగా గుడి సెంటర్లోకి ఒచ్చేరు. అమ్మ ముక్కు దగ్గర చెయ్యి ఆనించి ‘అంతా అయిపొయింది! ఆ పంచాయితీ వోళ్ళు చేసిన పనికిమాలిన పనికి అమ్మ బలైపోయింది’ అంటా భోరుమన్నాడు. ఊరువాడా గొల్లుమంది. గుడిపూజారి గొంతు సరిచేసుకుని నెమ్మదిగా జనం మధ్యలోకి వొచ్చి నిలబడ్డాడు.
“అమ్మ లేదంటే మనందరం ఉండి కూడా లేనట్టే. అమ్మ ఎక్కడికి పోలేదు. ఇక్కడే ఉంది. మనందరి మధ్యలోనే ఉంది. ఆ అమ్మని మనందరి మధ్యలోనే ప్రతిష్టించుకుందాం. ఏ మట్టి కోసమైతే ఆత్మబలిదానం చేసుకుందో ఆ మట్టిలోనే అమ్మకి ప్రాణప్రతిష్ట చేద్దాం. ఈ ఐదెకరాల మాగాణిలో ఆ తల్లికి గుడి కడదాం…” పూజారి మాటలు పూర్తికానేలేదు. “అవునవును. ఇక్కడే కడదాం. ఇక్కడే కడదాం!’ ఆంజనేయులుగారితో పాటే అక్కడున్న భక్తజనం ఉప్పెనలా ఒక్కపెట్టున నినదించారు. అక్కడే ఉన్న పంచాయితీ ప్రెసిడెంటు మెల్లగా జారుకున్నాడు.
అప్పటికే మూగబోయున్న పుంతరేవమ్మ చుట్టూ ఈగల్లా మూగిపోయున్నారు జనం. ఆత్మని విడిచేసిన అభిరామి శవం జనాల జయజయధ్వానాల మధ్య కాలి బూడిదయిపోయింది.ఓ కబంధుడి హస్తాల్లో ఛిద్రమై, ఇంకో కబంధుడి హస్తాల్లో అంతమై చివరాఖరుకి పుంతరేవమ్మ తల్లిగా అక్కడే కొలువై గుడి మాన్యాలను కాపాడుతూ ఆంజనేయులుగారికి కాసులు కురిపించే కల్పవృక్షమై దేవతగా మిగిలిపోయింది.