ఏయే దేశాల సరిహద్దుల్ని దాటుకుని వచ్చిందో?
ఎన్ని ఝంఝూనిలాల్ని తట్టుకుని ఎగిరిందో?
ఎన్ని మారణ హోమాలకు సాక్షిగా నిలిచిందో?
ఈ నైజీరియా శలభం!
ఆత్మాభిమానపు వర్ణపటలాన్ని
దాచాలని ఎంత ప్రయత్నిస్తున్నా…
ఎగరలేని దుర్బలత లోలోపలి దిగులును
అస్పష్టంగానయినా చాటుతోంది!
దారిలో…
ఉక్రెయిన్ శిథిలశకలాల్లో చిక్కుకుపోయో;
ఎడారి సరిహద్దుల ఉక్కపోతల్లో నలిగిపోయో;
కకావికలై దారితప్పిన మిత్రులనూ;
రెక్కలు తెగిన ఆప్తులనూ;
మళ్ళీ కలుస్తానో లేదోనన్న బెంగ
కంటి గోళాల్లో ప్రతిఫలిస్తోంటే…
నిన్నటినుంచీ ద్వారం మీద
నిశ్చలంగా వాలినది వాలినట్టే
స్థాణువయి నిలిచిపోయింది
ప్రాణభయంతో…
సేద తీరుతుందో
ఒంటరిగా కుములుతోందో,
మానవజాతి యుద్ధ పిపాసను
అతీత ధ్వనులతో శపిస్తోందో కాని…
ఉదయ కిరణస్పర్శ వెచ్చగా తగిలి
ప్రమాదం లేదన్న నమ్మకం కలిగాక…
అనుమానానికి తావివ్వకుండా
జాగ్రత్తగా… అప్పుడప్పుడు…
గుట్టుచప్పుడు కానీక
రెక్కలు కదిలించడం
మళ్ళీ…
అలవాటైన మౌన రోదనా ముద్రలోకి
జారుకోవడం…
నిన్నటించీ
ఇదీ వరస
ఈ నక్తంచర కీటకానిది…
ఉద్యానవనాల విశ్వవిద్యాలయాల్లో
హద్దుల్లేని లేని ఆనందాల చదువుల్ని ముగించి
బయటి ప్రపంచం మరింత అందంగా
ఉందని ఉంటుందనీ ఆశపడి
వలస వచ్చిన ఏ నిరుద్యోగినో…
కాదుకదా? ఈ క్షతగాత్ర శలభం!
ఆకుల సందుల్లోంచి జారే
చంద్రకిరణాలను తాగే ఏకాంతాలలో…
ఆకుల పాన్పుమీద
విడమరచి చెప్పలేని ఏవో
వింత స్వప్నాలను కనీ కనీ
సోయగాలు పోయి పోయి
విసుగుతో సతత హరిత రాజ్యాన్ని
సకల పరివార జనాన్ని
వదిలి వచ్చిన ఏ శాక్యరాకుమారో
అయివుండదు కదా? ఈ సొగసరి మిడుత!
సాహసయాత్రలో అనుయాయిలతో కలిసి
పచ్చిక బయళ్ళ తావులని వెదుకుతూ
గుంపుగా బయలుదేరి ఒంటరై మిగిలిన
యాత్రికురాలయి వుంటుందా? ఏమో!
కలగనినంత అందంగా అవతలి ప్రపంచం లేదని
అర్థం అయ్యేసరికే అంతా తలకిందులయ్యిందేమో!
తామసిక నాగరికతల్లో…
ఇమడలేమన్న జ్ఞానోదయం అయ్యేసరికే
గుంపుచెదిరి ఏకాకిగా మిగిలిపోయిందేమో!
చావు భయంతో దిక్కుతోచక
దారితప్పిన అతిథిని
బడలిక తీర్చుకొమ్మని;
బతుకు మీద ఆశ చిగురింప జేసుకొమ్మని;
నచ్చినన్నాళ్ళు నా తోటలో ఉండిపొమ్మనీ
ఒక ఆకు మీద చేర్చి;
నిన్నటి నుంచీ బతిమాలుతున్నా!
నాతో స్నేహం చేయవచ్చనీ
మరి కొన్నాళ్ళు నా కుటీరంలో…
నిశ్చింతగా బతికి, చేవ చేకూరిన పిమ్మట
నచ్చిన చోటికి తరలి పోవచ్చనీ
నమ్మబలుకుతున్నా!
నా విన్నపంలోని అంతర్ధ్వనిని
దాని అతీత ధ్వనులలోకి అనువదించుకుని
ఈ కీటకం మన్నిస్తుందనే అనుకుంటున్నా!