కాగితపు రెపరెపల మధ్య ఉన్నట్టుండి
ఒక వాక్యం కళ్ళబడుతుంది
ఎడతెరిపి లేని వాన తరువాత
ఒక ఉదయాన్నే సూర్యుడు
నవ్వుతూ పలకరించినట్టు
అద్భుతమేదో హఠాత్తుగా
ప్రత్యక్షమైనట్టు
కదలమంటూ
చూపులు మారాం చేస్తాయి.
నెమ్మదినెమ్మదిగా
మనసు వాక్యానికి
పాదాక్రాంతమవుతుంది
కొన్నాళ్ళో కొన్నేళ్ళో
అవే అక్షరాలను
భుజాన వేసుకుని
తిరుగుతుంది
ఒక మత్తిలిన నిదురరాత్రిలో
అదే వాక్యాన్నో
మరొక అనుభూతినో
ఏదో బ్రతుకు సందర్భాన్నో
ఆసరా చేసుకుని
కలలపల్లకిపై ఊరేగుతూ
మరొక మెరుపువాక్యం
రంగుల రేకులు విప్పుకుని
అందంగా పూస్తుంది
వేరొక గుండె దోసిలిపట్టి
అపురూపంగా కళ్ళకద్దుకుంటుంది