స్త్రీవాద కథల సంపుటి: విభజిత

సామాజిక కార్యకర్త, సాహిత్యకారిణి భండారు విజయ కలం నుండి జనవరి 2024లో వెలువడిన పదిహేడు కథల సమాహారం విభజిత. కేవలం ఆమె కథలను ప్రస్తావిస్తే, గణిక వంటి మంచి కథా సంపుటాన్ని 2020లో తీసుకొచ్చారు. దీనికి తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ కథా సంపుటి అవార్డును పొందారు. ఆమె సంపాదకురాలిగా నలభై మంది రచయిత్రుల కథలతో వచ్చిన స్వయంసిద్ధ (మే, 2023), యాభై మూడు మంది రచయిత్రుల కథలతో వచ్చిన యోధ (అక్టోబర్‌, 2024) సంకలనాలు అత్యంత అమూల్యమైనవి. మొదటిది ఒంటరి మహిళల జీవన గాథలు చిత్రించిన సంకలనం. రెండవది మాతృత్వం: భిన్న వ్యక్తీకరణలను వివరించిన సంకలనం.

విభజిత ఆమె రెండవ కథా సంపుటి. స్త్రీవాద కోణంలో రాసిన కథల సంపుటి. సామాజిక కార్యకర్తగా విజయ ఫీల్డ్‌వర్క్‌, మహిళలకు కౌన్సిలింగ్‌ ఇచ్చే పనులే కాకుండా, తన పరిధిలోకి వచ్చిన మహిళల జీవితాలను తెలుగు సాహిత్యంలోకి తీసుకురావాలన్న ఆశయంతో ఈ కథలు రాశారు. శిల్పం మీద ఎక్కువ దృష్టి పెట్టి, ప్రయోగాత్మకంగా, గొప్పగా ఉండటానికి ఆమె ఈ కథలు రాయలేదు. స్త్రీల జీవితాల్లోని భిన్న శకలాలను నిజాయితీగా చూపించడమే ప్రత్యేక ప్రయోజనంగా రాశారు. కరోనాకి సంబంధించిన మూడు కథలు, రెండు మైనారిటీల కథలు కూడా ఇందులో ఉన్నాయి. అన్నీ సామాజిక స్పృహతో, అవగాహనతో రాసినవి.

విజయ కథలను అర్థం చేసుకునే ప్రక్రియలో ఒక్కొక్క కథను వివరంగా చర్చించి, విశ్లేషించడం ఎంతో అవసరం. ముందుగా ఆమె రాసిన కరోనా కథలను పరిశీలిద్దాం. కరోనా దేశాన్ని తన కబంధ హస్తాలలో ఇరికించి అతలాకుతలం చేసిన వైనం అందరికీ తెల్సిందే. అప్పటి కష్టాల, సమస్యల, దుఃఖాల నేపథ్యంలో విజయ రాసిన కరోనా కథలు ఇవి.

‘ఆన్‌లైన్‌ క్లాసులు’ కథలో కరోనా వైపరీత్యం మూలంగా బడులు మూసివేయబడి, పిల్లలు ఎలా ఆన్‌లైన్‌ క్లాసులకు పరిమితం అయ్యారో చూపిస్తుంది. స్వచ్ఛమైన అమ్మ ఒడిలాంటి పాఠశాల వాతావరణంలో ఊగుతూ ఆడాల్సిన పిల్లల జీవితాలు కరోనా మాయమారి వలన పంజరంలో బంధించిన పక్షుల్లా మారాయని రచయిత్రి పేర్కొన్నారు. మానసికంగా ఎదగని తన పిల్లలపై వస్తున్న వత్తిడి గ్రహించి, ఇకనుంచి ఇంట్లో తనే పాఠాలు చెప్పాలన్న తల్లి పాత్ర నిర్ణయంతో కథ ముగించడం బాగుంది. కథలో అప్పుడప్పుడు తొంగి చూసిన హాస్యం కథను ఆసక్తిగా చదివించింది.

‘అనుబంధం’ కథలో పెద్ద కొడుకు దగ్గర ఉన్న అత్తమామలు కరోనా సోకి ఆస్పత్రి పాలయినప్పుడు, చిన్న కొడుకు కుటుంబం కూడా అక్కడకు చేరుతుంది. అత్తమామలిద్దరూ మరణిస్తారు. ఇద్దరన్నదమ్ముల పిల్లలు అందరం ఒకే చోట ఉందామని చిన్న కోడలు స్నేహను ప్రాధేయపడ్తారు. కరోనాలాంటి విపరీత పరిస్థితులలో రెండు కుటుంబాలు తోడు నీడగా, ఒకరికొకరు సాయంగా ఉండటం, పిల్లల కోరికను ఆమోదించడం ఆమెకు కూడ సరైన నిర్ణయం అనిపిస్తుంది.

‘మలుపు’ కథలో సుందరి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ ఇంటికి పరిమితమవుతుంది. అదివరకు ఆఫీస్‌కు పోయే రోజుల్లో అత్తగారు, భర్త, పిల్లలు ఆమెకి సహాయపడుతుండేవారు. ఇప్పుడు ఆమె ఇంట్లోనే ఉంటుంది కదా అని భారమంతా ఆమె మీద వేస్తున్నారు. ఆఫీస్‌ రోజులే బాగున్నాయని అనిపించేలా చేస్తున్నారు. దానికి తోడు లాక్‌డౌన్‌ వలన పనిమనిషి రాకపోవడంతో ఆమె మీద మరింత ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితులకు విసిగిపోయి ఆమె ఒక రోజు ప్రొద్దున్నే ఎవరూ లేవకముందే స్నేహితురాలు రాగిణిని కలుసుకోవడానికి బయటికి వెళ్తుంది. లేచిన తర్వాత సుందరి కనపడక ఇంట్లోవాళ్ళు గాభరాపడతారు. తమ తమ పొరపాట్లు గ్రహించుకుని ఇంటి పనుల్లో జొరబడతారు. సుందరి ఇంటికి రాగానే ఆమె మీద ప్రేమాభిమానాలు వ్యక్తపరుస్తారు. మళ్ళీ ఆమెను బయటికి తీసుకెళ్ళడానికి రాగిణి కారులో రాగానే ఆప్యాయంగా వీడ్కోలిస్తారు. స్త్రీలకి కూడా విశ్రాంతి, స్వేచ్ఛ ఎంత అవసరమో ఈ కథ తెలుపుతుంది.

‘హిజాబ్‌’ ముస్లిం కుటుంబానికి సంబంధించిన కథ. తాగుబోతు భర్తతో బాధలు పడి, అతడి మరణం తర్వాత ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ వచ్చిన ముంతాజ్‌ తన కూతుళ్ళిద్దరిని, కొడుకుని ప్రయోజకులని చేస్తుంది. ఇస్లాం మతంలో కూడా పురుషాధిక్యత ఉందని, ముస్లిం మహిళలు వివక్షకు, అణచివేతకు గురవుతున్నారని ఈ కథ తెల్పుతుంది. కథ నేపథ్యంలో హిజాబ్‌ విషయంలో దేశంలో మతం పేరుతో మైనారిటీలపై హిందుత్వవాదులు చేస్తున్న అరాచకాలను చూపించారు. హిజాబ్‌ వేసుకోవాలా? వద్దా అనేది ముస్లింలకు సంబంధించిన వ్యక్తిగత విషయమని, దానిపై ఇతర మతస్తులు అభ్యంతరపెట్టడం మైనారిటీల హక్కులను తిరస్కరించడమే అవుతుందని కథలో పేర్కొన్నారు.

‘పరదాల వెనుక’ కథ ‘హిజాబ్‌’ కథకు సీక్వెల్‌ అనిపిస్తుంది. ముస్లిం స్త్రీలు గంపెడు పిల్లలతో ఎలా జీవితాలు గడుపుతున్నారో, పిల్లల్ని ఎలా పైకి తెస్తున్నారో ఈ కథ చూపిస్తుంది. వారి పిల్లలు ఇప్పుడిప్పుడే పెద్ద చదువులు చదువుకుని, ఉద్యోగాలు సంపాదించుకుని పెళ్ళి, ప్రేమల విషయంలో తమ ఇష్టప్రకారం నడుచుకునే స్వతంత్రత ఉండాలనుకోవడం ఈ కథలో కన్పిస్తుంది. ముస్లిం కుటుంబాల్లోని సమస్యల్ని, బాధల్ని చూపించిన ఈ కథలు మతమేదైనా స్త్రీలు వివక్షకు, అసమానతలకు గురవుతున్నారని కూడా చెబుతాయి. కరోనా కథలైనా, మైనారిటీ కథలైనా ఇవన్నీ కూడా స్త్రీవాద కథలే!

ఇక మిగతా కథలను పరిశీలిద్దాం. ‘జుమ్రీ’ ఒక్కొక్కసారి స్వంత బంధువులే కుట్ర పన్ని మోసాలకు దిగుతారన్న నిజాన్ని చెప్పిన కథ. ఒక న్యాయవాదిగా విధిత దీనిని పరిష్కరించాలని గట్టి నిర్ణయం తీసుకోవడం మంచి ముగింపు. తెలంగాణా గ్రామాల్లో కొడుకు పుట్టేంత వరకు పిల్లల్ని కంటూ ఉండాలన్న ఆంక్షలకు మహిళలు గురవుతున్నారని, ఒకవేళ కొడుకు పుట్టకపోతే మగవాడికి మారుమనువు చేస్తారన్న సమాజపు నిర్బంధాలను, కట్టుబాట్లను తెలిపిన కథ.

‘చొరబాటుదారు’ కథలో కొందరు పురుషులు స్త్రీల అవసరాలను, చిన్న చిన్న విషయాల్లో ఇతరుల మీద ఆధారపడే బలహీనతను సాకుగా తీసుకుని వాళ్ళ జీవితాల్లో ఎలా చొరబడతారో చూపిస్తుంది. వంటరి మహిళల విషయంలో ఇది ముఖ్యంగా జరుగుతుందని, కొన్నిసార్లు స్త్రీలు తమకు తామే అమాయకంగా ఈ ఊబిలోకి దిగజారుతారని, పురుషులు చేసే సహాయాలకు కృతజ్ఞులై ఆ వలలో చిక్కుకుంటారని రచయిత్రి ఈ కథలో చక్కగా చూపించారు.

‘విభజిత’ కథ పేరునే రచయిత్రి తన కథా సంపుటి పేరుగా పెట్టుకున్నారు. ఈ కథలో జానకి జీవితం ఒకదానికొకటి సంబంధం లేని విధంగా విభజింపబడింది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుని, తండ్రి, సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక ఇల్లు వదిలి పారిపోతుంది. రైల్వే స్టేషన్‌లో కాలం గడుపుతూ ఒక దుర్మార్గుడి అత్యాచారానికి గురవబోతూ తప్పించుకుని పోలీసులకు చిక్కుతుంది. వాళ్ళు ఆమెను షెల్టర్‌ హోమ్‌లో చేరుస్తారు. అక్కడ చక్కగా చదువుకుని పదవ తరగతి పాసవుతుంది. మైనరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నియమం వలన హోమ్‌ను వదలాల్సి వస్తుంది. ఒక టీచరు సహాయంతో ప్రైవేటు హాస్టల్‌కి మారి ఇంటర్‌ ఫస్ట్‌ యియర్‌లో మంచి మార్కులతో పాసవుతుంది. తర్వాత అనంతు అనే డ్రైవర్‌ ప్రేమలో పడి, హైదరాబాద్‌ విడిచి దగ్గరలోనున్న పల్లెటూరుకి వెళ్ళి పెళ్ళి చేసుకుంటుంది. కొడుకు, కూతురు పుడతారు. అనంతు వేరే ఊరికి వాళ్ళను తీసుకెళ్ళి, ఒక రోజు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. చివరకు ఎటూ దారిలేక, పిల్లల కోసం ముళ్ళబాట నాశ్రయించి, తన శరీరాన్ని కొవ్వొత్తిలా కరిగించుకుంటుంది. పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులవుతారు. ఆమెను పట్నం తీసుకెళ్ళి, మంచి ఇల్లు కొని, ఆమెకు ఆసరాగా నిలుస్తారు. కథ సుఖాంతమవుతుంది. ఎన్నో కోణాలుగా విభజింపబడిన జానకి జీవితానుభవాల గుర్తుగానే రచయిత్రి ఈ కథకు ‘విభజిత’ అని పేరు పెట్టారు.

‘ఇడుపు కాయితాలు’ కథ బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న సుధకు, పెద్దగా చదువుకోక, ఒక ఆఫీసులో వంటమనిషిగా పని చేస్తున్న యశోదకు ఉన్న వ్యత్యాసాన్ని చూపుతుంది. డైవోర్స్‌ తీసుకునే విషయంలో యశోద తీసుకున్న దృఢ నిర్ణయం, తన పిల్లల్ని ఎలాగైనా పెంచి పెద్ద చెయ్యగలనన్న ధీమా ఆత్మవిశ్వాసం సుధలో లేకపోవడాన్ని, బాధలు పడుతున్నప్పటికీ డైవోర్స్‌ తీసుకోవడానికి ఎంత సంకోచించిందో చూపారు. చివరకు మిత్రులు మధ్యవర్తిత్వం వహించి మ్యూచ్యువల్‌ డైవోర్స్‌ ఇప్పించి సమస్యను పరిష్కరిస్తారు. స్త్రీకి ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ముఖ్యమని, అవి ఉంటే ఆమె తన సమస్యలని తనే ఎదురుకోగలదని తెలుపుతుందీ కథ.

‘మేడ్‌’ కథలో సువర్ణకు తన ఇంట్లో పనిచేసే శారద అప్పుడప్పుడు హఠాత్తుగా సెలవు తీసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. సెల్‌ఫోన్‌లో ఒక మీటింగ్‌లో శారద ఉండటం గమనిస్తుంది. మరునాడు శారదను అడిగితే శారద తప్పు ఒప్పుకుని రాజకీయ పార్టీలవాళ్ళు, కొన్ని సంఘాలవాళ్ళు, క్యాటరింగు చేసేవాళ్ళు పిలుస్తారని, వెళ్ళినందుకు బాగా పైసలిస్తారని, అందుకే పిల్లల్ని తీసుకుని వెళ్తానని చెబుతుంది. అమాయకంగా అందర్నీ నమ్మి, ఆడపిల్లల్ని తీసుకుని వెళ్ళొద్దని, ఏదైనా దుర్ఘటన జరిగితే ఎవరూ రక్షించడానికి రారని హెచ్చరిస్తుంది. శారద తన పొరపాటు గ్రహించి ఇక వెళ్ళనని చెబుతుంది. కథలోని విమల పాత్ర కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. బస్తీలల్లో తిరుగుతూ మహిళలకు రేషన్‌ కార్డులు ఇప్పిస్తూ, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాల గురించి వివరిస్తూ, వాటిని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి బోధించడం చేస్తుంది. అలా నిస్వార్థంగా, ఉదాత్తంగా సేవ చేసేవాళ్ళు సమాజంలో అరుదుగా ఉంటారు.

‘కూలిన గోడలు’ అనురాధ కథ. ఆమెను భర్త వదిలేసి మరొక ఆమెతో అమెరికా వెళ్ళిపోతాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కూతురు అపూర్వకు కిరణ్‌లాంటి మంచి భర్త లభించడం ఆమెకు సంతోషం కలిగిస్తుంది. కిరణ్‌ తండ్రి కిరణ్‌ తల్లిని ఆమె కాన్సర్‌తో మరణించే వరకు చాలా హింసించాడని తెలుసుకుంటుంది. చివరకు తన పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించినందుకు బాధపడ్తుంది. అపూర్వ డెలివరీకి సహాయంగా అమెరికా వెళ్తుంది. కిరణ్‌ ప్రవర్తన ఆమెకు నచ్చుతుంది. ఈ కాలం పిల్లలు స్త్రీల పట్ల సహానుభూతితో ఉన్నారని ఆనందిస్తుంది.

‘నిజం’ కథ మిగతా కథలకు భిన్నంగా ఉంటుంది. శరతు, రమణీ చిన్నప్పటి నుంచి కలసి చదువుకుని డాక్టర్లవుతారు. శరతు, భార్య శాంతి అమెరికా వెళ్ళిపోతారు. వారికి మొదట కొడుకు పుడతాడు. రెండవసారి డెలివరీ అప్పుడు పుట్టిన బిడ్డ చనిపోతుంది. శాంతి కోమాలోకి వెళ్ళిపోతుంది. శాంతిని ఇండియాలో రమణి హాస్పిటల్లో పెట్టి ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తాడు శరతు. అప్పుడప్పుడు ఆమెను చూడటానికి ఇండియా వస్తుంటాడు. శాంతికి ఫిట్స్‌ రావడంతో వేరే న్యూరో హాస్పిటల్లో చేర్పిస్తుంది రమణి. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుంది. ఈ మధ్యకాలంలో తీరిక లేక ఆ పనిని భర్త విరించికి అప్పగిస్తుంది. హఠాత్తుగా కోమాలో ఉన్న శాంతి పండంటి పాపకు జన్మనిచ్చిందని తెలుస్తుంది. సి.సి. కెమేరా ఫుటేజ్‌ వలన విరించి దీనికి బాధ్యుడని తెల్సుకుని, అతన్ని క్షమించలేకపోతుంది. శరతు అమెరికా నుండి వస్తాడు. మొదటి డెలివరీ అప్పుడు కోమాలోకి వెళ్ళిన శాంతి రెండో డెలివరీతో స్పృహలోకి రావడం, పాపాయిని చూసుకుని ఎంతో ఆనందపడటం చూసి అందరూ రాజీ పడతారు. కథ సుఖాంతం అవుతుంది.

‘హాఫ్‌ విడో’ భర్త నిరాదరణకు, చెడు అలవాట్లకు బలైన మీనాక్షి కథ. భర్త చెడు అలవాట్లతో అప్పులు చేయగా, అప్పులవాళ్ళు ఇంటికి వచ్చి వేధించేవారు. అతడు మీనాక్షి తల్లిదండ్రుల మరణానికి కూడా కారణమవుతాడు. అతన్ని భరించలేక, తన నగలన్నీ అతనికిచ్చి, ఇంటి నుంచి పంపేస్తుంది. ఈ విషయం ఆమె చనిపోయిన తర్వాత దొరికిన ఉత్తరం వలన తెలుస్తుంది. అంతకు ముందే తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి భర్తకు దక్కకుండా అన్నయ్య చిన్న కొడుకును దత్తత తీసుకుంటుంది. ఉత్తరంలో ఆస్తిని అన్నయ్య ముగ్గురు పిల్లలకు సమానంగా పంచమని రాస్తుంది. మీనాక్షి గాథ మనస్సులను విషాదభరితం చేస్తుంది. ఆమెలాగా కష్టాలపాలైన మహిళలు ఎందరున్నారో అని అనిపిస్తుంది.

‘వల’ భర్త వలన కష్టాల పాలైన పాతికేళ్ళు కూడా నిండని సంజన కథ. విక్రమ్‌ ఆమెను నమ్మించి మోసం చెయ్యాలని చూసిన కిరాతకుడు. పసిబిడ్డ తల్లి అని కూడా చూడకుండా వయసులో పెద్దవాడైన సుదర్శన్‌కు ఆమెను అప్పగించి డబ్బు సంపాదించాలనుకుంటాడు. సంజన ఈ విషయం తెల్సుకుని తెల్లవారు ఝామున విక్రమ్‌ తాగి పడుండగా, తన బిడ్డను తీసుకుని గమ్యం వెతుక్కుంటూ బయలు దేరుతుంది. ధైర్యంగా ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదని అనిపిస్తుంది.

‘సూసైడ్‌ నోట్‌’ కథలో తొమ్మిదవ క్లాసు టీచరు రూత్‌ మేడంకు తన స్టూడెంట్‌ చరిత్ర నోటు బుక్కులో సూసైడ్‌ నోట్‌ దొరుకుతుంది. ఈ మధ్య క్లాసులో చరిత్ర ఉత్సాహంగా లేకపోవడం, ఏదో పోగొట్టుకున్నట్లు ఉండటం కూడా గమనిస్తుంది. చరిత్రను బుజ్జగించి దూరపు చుట్టం, వరుసకు మామ అయిన సంపత్‌ ఆమెను లైంగిక హింసకు గురి చేస్తున్నాడని తెలుసుకుంటుంది. చరిత్ర ఈ విషయం తల్లికి చెప్పానని, ఆమె చిన్నతనంగా కొట్టిపారేసిందని చెబుతుంది. రూత్‌ చరిత్ర ఇంటికి వెళ్ళి చాకచక్యంగా వారికి ఈ విషయం తెలిపి, వాళ్ళు తమ తప్పు తెల్సుకునేలా చేస్తుంది. చరిత్రను విషమ పరిస్థితి నుంచి కాపాడుతుంది. లైంగిక హింసకు గురవుతున్న అమ్మాయిల సమస్యను తీసుకుని, మంచి అవగాహనతో ఈ కథ రాశారు. సమాజంలో రూత్‌ లాంటి ఆదర్శనీయులైన టీచర్ల ఆవశ్యకతను తెలుపుతుంది.

జయరాం, చంద్రం చిన్ననాటి స్నేహితులు. వారి భార్యలు మాధవి, వసంతలు కూడా మంచి స్నేహితులవుతారు. జయరాం కొడుకులు వారికి దూరంగా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వారిని పట్టించుకోరు. వసంత కాన్సర్‌తో బాధపడ్తున్నా కొడుకులు పట్టించుకోకపోవడం జయరాం, వసంతలను మరింత కృంగదీస్తుంది. మాధవి ఓదార్పు కూడా లాభం లేకపోతుంది. ఒకరోజు చంద్ర, మాధవిల ప్రోద్భలంతో వారు నలుగురు మూడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక నుంచి తమ గురించి తాము ఆలోచించుకోవాలన్నది మొదటి నిర్ణయం. పిల్లల్ని కన్నందుకు వాళ్ళని ప్రయోజకులను చెయ్యడం తమ బాధ్యత. కానీ ఆ పైన ఏమి ఆశించగూడదన్నది రెండవ నిర్ణయం. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకే వదిలేయాలన్నది మూడవ నిర్ణయం. ఈ నిర్ణయాల తర్వాత వారి మనస్సులు తేలికపడి సంతోషం వెల్లివిరుస్తుంది. పిల్లల ఆప్యాయతలకు దూరమై, ఓల్డేజ్‌ హోమ్‌లకు తరలిపోతున్న చాలామంది వృద్ధ తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే కథ. పిల్లల నుంచి ఏమి ఆశించని తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారనే మెసేజ్‌ ఇచ్చింది ‘మారిన దృక్పథాలు’ కథ.

బంధుత్వమున్న స్నేహితురాండ్రు జానకి, చందన ‘జానకి నవ్వింది’ కథలో. చందన భర్త కరోనా వైరస్‌ వలన మరణించగా, చందనకు ఆసరాగా ఉంటుంది జానకి. జానకి భర్త రంగనాథ్‌, అతని కుటుంబ సభ్యుల ప్రవర్తన జానకిని కృంగదీస్తుంది. రంగనాథ్‌ తల్లిదండ్రుల, అక్కచెల్లెళ్ళ మాటలకు ఎక్కువ విలువనిస్తూ జానకిపట్ల దురుసుగా వ్యవహరించడం చందన గమనిస్తుంది. రంగనాథ్‌కు కాన్సర్‌ వ్యాధి సోకి, ట్రీట్‌మెంట్‌ జరిగినా చనిపోతాడు. చనిపోక ముందు కొన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టి, వాటిని పిల్లలకి ఇవ్వమని జానకికి ఇస్తాడు. జానకి ఇంటికి వచ్చి భర్త ఇచ్చిన పేపర్లు చూస్తుంది. మొత్తం ఆస్తులు కూతురుకి, కొడుకుకి రాసి, తన పేరు మీదున్న ఇంటిని తల్లి, చెల్లెలుకు రాసిన పేపర్లు అవి. తనని బానిసగా, దిక్కులేనిదానిగా చేసిన భర్త మీద జానకికి విపరీతమైన కోపం వస్తుంది. అతను సంతకం పెట్టిన ఖాళీ పేపరు జాగ్రత్తగా దాచి, తర్వాత ఆ కాగితంపై తన పేరు మీద ఆస్తులు, డబ్బులు భర్త సమ్మతంతో ఇస్తున్నట్లు రాసుకుని, కవరులో పెట్టి, కవరు పైన తన పేరు రాసుకుని, భర్త దిండు కింద పెడుతుంది. జానకి ఎంతో తెలివిగా చేసిన పని ఆమె భవిష్యత్తుని కాపాడుతుంది. చివరికి మంచే జరిగిందని స్నేహితురాండ్రు సంతోషపడ్తారు.

విజయ కథలన్నీ దాదాపు నగరాలకు సంబంధించిన మహిళల కథలు. అవి అన్ని తరగతులకు, వర్గాలకు చెందిన స్త్రీల జీవితాలకు ప్రతిబింబాలు. అనేక అసమానతలు, వివక్షలు, ఆంక్షలు, సమస్యల మధ్య సతమతమవుతున్న అతివల చిత్రాలు. పితృస్వామ్య ఆధిపత్యాలను మన కళ్ళ ముందుంచి, ప్రశ్నలు లేవనెత్తిన అభ్యుదయ రూపాలు.

స్త్రీవాద సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేసి, దాని ప్రాముఖ్యాన్ని వివరించే దిశగా ఈ కథలు సాగాయి. స్త్రీవాద అస్తిత్వ సాహిత్యం అరుదుగా వస్తున్న తరుణంలో, దానికి మద్దతుగా కథా సంపుటాలు రావడం ముదావహం. ఇందుకు మంచి ఉదాహరణలు కల్పనా రెంటాల అయిదో గోడ, విజయ భండారు విభజిత. తను స్వయంగా స్త్రీవాద కథలు రాస్తూ, ఇతర రచయిత్రులను రాయమని ప్రోత్సహిస్తూ, సంకలనాలు తీసుకురావడం విజయ ప్రత్యేకత. ఆ దిశగా ప్రయాణిస్తూ, స్త్రీవాద కథాసాహిత్య ప్రగతికి కొత్త మార్గాలు వేస్తూ ముందుకు సాగుతారని ఆశిద్దాం.


కథా సంపుటి: విభజిత
రచయిత: భండారు విజయ
ప్రచురణ: హస్మిత ప్రచురణలు, హైదరాబాద్.
వెల: 200 రూ. పే. 175.
ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు.