‘బాపుగారూ, ఒకటి అడిగితే ఏమనుకోరు కదా?’ అనడిగేవాణ్ణి. ‘మీరు అడగకపోతేనే ఏమైనా అనుకుంటానండి’ అనేవారు బాపుగారు.
ఒక్కసారా? పదిసార్లా? ఇలా వందసార్లు ఆయన్ని మరీ కావాలని, ఆయన నోట ఆ మాట వినాలని అలా అడిగేవాణ్ణి. నేను బాపుగారి వాడినని, బాపుగారు నావాడని పదే పదే ఒక ముద్రలా ఉండాలని భ్రమ. ఓసారి ఒక పుస్తకంపై నన్ను వ్రాసి సంతకం చేసి ఇమ్మన్నారు. నా వెర్రి నాకు మాత్రం తెలీదా ఈ మనిషి విశ్వమానవుడని, తెలుగువారి ఇంటింటి బొమ్మల కొలువని. కానీ తెలిసినా కావాలనే ఇలా వ్రాశా ‘నా బాపుకి ప్రేమతో – మీ అన్వర్.’ సరే మళ్ళీ ముందుకొద్దాం. నావాళ్ళని ఆ వాళ్ళని ఈ వాళ్ళని అనేక వాళ్ళ బొమ్మలన్నీ బాపుగారితో గీయించుకునేవాణ్ణి. అన్నీ అయిపోయాకా తమాషా కొద్ది ‘మీరు బొమ్మ గీసినందుకు మీకేం డబ్బు ఇవ్వలేనండీ’ అంటే ఆయన ‘తల్లితండ్రులే పిల్లలకు ఇవ్వాలండీ, వారి దగ్గర తీసుకోకూడదని’ ఇంకా ఇంకా నన్ను పాడుదగ్గర చేసేవారు.
పతంజలిగారు పోయాకా ఆయన బొమ్మ బాపుగారు వేస్తే ఇంట్లో పెట్టుకుందామని ఆయన్ని అడుగుతూ చెప్పా, నా హృదయానికి దగ్గరిగా ఉండే మనిషి ఈయన, మా నాయనతో సమానమని. అడిగిన కొద్ది రోజులకి ఒక బొమ్మ అందింది. రంగుల్లో రాజుగారు. గీసింది బాపుగారు. అది చూసి పతంజలిగారి అమ్మాయి కన్నీటితో ఉత్తరం వ్రాసింది. ‘ది గ్రేట్ బాపుగారు మా నాన్నగారి బొమ్మ వేశారంటే ఆయన ఎక్కడున్నా ఎంతో సంతోషపడుతుంటారు’ అని ఇంకా ఇంకా సంతోషపడింది. మా సంతోషం ములిగిపోక ముందే మళ్ళీ బాపుగారి కవర్ ఒకటి చేతికొచ్చింది. ఏమిటా! అని చూస్తే మరో పతంజలి. ‘ఇదేవిటీ బాపుగారు?’ అని ఫోన్ కలిపితే ‘మీ హృదయానికి దగ్గరి మనిషన్నారు కదా! అందుకని మిమ్మల్ని మరింత ఎక్కువ సంతోషపెడదామని మళ్ళీ ఇంకో బొమ్మ వేశా’ అన్నారు. ఇప్పుడు ఇలా తలుచుకుంటుంటే ఏరీ ఆ మనుష్యులు? ఏమైపోయారు? మేం పిల్లలం ఒంటరులమై పోతామని కొంచెం కూడా మతి లేకుండా అలా వదిలి వెళ్ళిపోవడమేనా ప్రేమలంటే? సంతోషపెట్టడమంటే?
ఆ రోజుల్లోనే ముళ్ళపూడిగారితో పతంజలిగారి ప్రస్తావన వచ్చింది. ఆయన పతంజలిగారి పేరు విన్నాడో లేదో గుర్తు లేదు కానీ ఆయన రచన ఒక్క కాగితం ముక్క కూడ చదవలేదన్నాడు. సరే ఎలాగోలా వెతికి ఆయనది ఒక్క చిన్న బుక్కు ఊరికే స్టైల్ తెలుసుకుంటాడని పోస్ట్‌లో పంపించా. చదివిన పిమ్మట ఫోన్ చేసి ‘మాంచి ఫైర్ ఉన్న వాక్యం అండీ మీ గురువుగారిది, కానీ మనిషికి కాస్త తిక్క ఉన్నట్టుంది’ అన్నారు. ‘ఆ తిక్క ఉంది కాబట్టే ఆయన పతంజలి అయ్యాడు సార్’ అని వివరణ ఇచ్చా.
మార్చ్ 29, 1952 పతంజలిగారి పుట్టినరోజు. మార్చి 11, 2009 పతంజలిగారు మరణించిన రోజు. తెలుగు సాహిత్యం రాసే వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ. పతంజలిగారు ఎంత బాగా రాస్తారో అంతకు కొన్ని వేలరెట్లు బాగా బాగా చదువుకున్న మనిషి. అదీ ఇదని మాత్రమే కాదు, చదవదగ్గది అనుకున్న ప్రతీదిని ఆయన ఎంత చదువుకున్నాడో లెక్కేయడానికి లెక్కేలేదు. ఆయన నడకలో, నడతలో, మాటలో, ఆయనదైన ప్రతీలోను ఆ చదువుకున్న తాలూకు చక్కని పదునైన జ్ఞానము కనబడుతూ వినబడుతూ ఉండేది. ఒకానొక కాలంలో మహానగర్ అనే పత్రిక ఉండేది. ఆ పత్రికకు పతంజలిగారు తాను చిన్నతనాన చదువుకున్న సాహిత్యాన్ని, కథ పేరు, రచయితల పేర్లు కూడా మరిచిపోయిన ఆ సాహిత్యాన్ని తనదైన శైలిలో అక్షరబద్ధం చేశారు వాటికి జ్ఞాపకథలు అని పేరు పెట్టారు.
ఒక మార్చి నెలలో ఆయన ఈ భూమి మీదకు వచ్చారు, ఒక మార్చి నెలలో ఆకాశం ఆయన్ను భూమి నుండి తీసుకెళ్ళిపోయింది. ఈ మార్చి నెల ఆయన ఒక జ్ఞాపకథ.
అన్వర్.
మంచి గెలిచేదాకా…
లంకంత కొంపలో ఆయన, ఆవిడే వుంటున్నారు. పిల్లా పిచ్చుకా లేరు. డబ్బుకి కొదవలేదు. ఆయనకు డబ్బు ముఖ్యమూ కాదు. ‘మానవత్వం ముఖ్యం. చివరికి, ఎప్పుడైనా, ఎక్కడైనా ఏ యుద్ధంలోనైనా మానవత్వమే గెలుస్తుంది’ అనేది ఆయన సిద్ధాంతం. పొద్దున లేవడం, ఫ్యాక్టరీకి పోవడం, వ్యాపారం విషయాలు చూసుకొని ఇంటికి రావడం. భార్యతో ఇంటి ముందున్న విశాలమైన అందమైన పూలతోటలో కూర్చుని కబుర్లు చెప్పటం, చదువుకోవడం.
ఆయన దగ్గిర చాలా మంచి, ఎంతో చక్కని పుస్తకాలు వేనకువేలు ఉన్నాయి. ప్రపంచంలోని ఉత్తమ రచయితల కథలు, నవలలు, కవితలు, నాటకాలూ అన్నీ ఆయన దగ్గిరున్నాయి. వాటిలో చాలా ఎక్కువ భాగం ఆయన చదివాడు కూడాను. ఇంట్లో పనివాడికి, అతడి భార్యకూ తన ఔట్‌హౌస్ ఇచ్చేడు. అందులో ఉండటం, ఆయన ఇంట్లో తినడం. ఆయన చదివిన మంచిమంచి పుస్తకాల్లోని సారాంశాన్ని వినడం అంతే పని. మ్యూనిక్ నగరంలో ఓ మూల ఉందాయన ఇల్లు. ఆయనతో పాటు సైన్యంలో పనిచేసి రిటైరైపోయినవాళ్ళలో కొంతమంది అప్పుడప్పుడూ ఆయనను చూడటానికి వచ్చేవారు.
హిట్లరు రాజ్యానికి వచ్చినప్పుడు ఆయన కొంచెం చీదరించుకున్నాడు. ‘వీడూ, వీడి యూదు ద్వేషమునూ… మూర్ఖుడయ్యా? ఇలాంటివాడు పదవిలో ఎంతకాలం ఉంటాడు? ఎలాగొచ్చేడో అలాగే పోతాడు’ అని ఆయన తన పనివాడితో అన్నాడు.
జర్మనీ అంతటా యూదులను వేధించడం, అవమానించడం, హింసించడం ఎక్కువైనపుడు… ‘ఆర్యులేమిటి? యూదులేమిటి వాడి పిచ్చి గాని, అందరూ మానవులే. మానవుడూ మంచితనమూ ముఖ్యం గానీ ఇలాంటి పిచ్చి సిద్ధాంతాలు ముఖ్యం కాదు. నేనూ యూదునే గదా? నువ్వేమో హిట్లరు చెప్పినట్టు ఆర్యుడివి. కానీ మనిద్దరి మధ్యా ఏవన్నా అరమరికలూ ద్వేషభావమూ వున్నాయా?’ అని ఆయన మళ్ళీ తన పనివాడితో అన్నాడు.
‘మీరు చెప్పింది నిజమే కానీ… ఈ మధ్యకాలంలో మీ స్నేహితులెవరూ మన ఇంటికి రావడం లేదు, మీరు గమనించారో లేదో? మీ చుట్టాలు మాత్రమే ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిది’ అని ఆ పనివాడు సలహా ఇచ్చాడు.
‘మన జోలికి ఎవరూ రారయ్యా. సగానికి సగం జర్మన్లు నా స్నేహితులే గదా? పైగా వాళ్ళలో చాలామంది మంచివాళ్ళు. హిట్లరుగాడి బ్రౌన్‍షర్టు వెధవలు రౌడీలు కానీ కడమా జర్మన్లు బంగారాలు గదా. నువు లేనిపోని భయాలు పెట్టుకోవద్దు’ అన్నాడాయన.
పనివాడు ఏమీ అనలేదు. కానీ వార్తాపత్రికలు చదువుతోంటే దేశంలో పరిస్థితి రానురాను ఘోరంగా తయారైనట్టు ఆయనకే అనిపించడం మొదలుపెట్టింది.
ఆయన ఫ్యాక్టరీ మీద ఒకరోజు గుర్తు తెలీని దుండగులెవరో దాడి చేశారు గానీ జరిగిన నష్టం పెద్దది కాదు. ఊర్లో ఉన్న బంధువులు ఒక్కొరొక్కరూ దేశంలో ఉండటం అంతక్షేమం కాదు. మేం వెళ్ళిపోతున్నాం. నీవు కూడా మాతో వచ్చేమంటే ఆయన ఒప్పుకోలేదు. ‘హిట్లరు చెడ్డవాడు కావచ్చు గానీ జర్మనీ పౌరులు చెడ్డవారు కాదు. ఇది మన జన్మభూమి. ఎవడో తలతిక్క వెధవ పరిపాలిస్తున్నాడని దేశాన్ని వదిలేసుకుంటామా? కొంచెం ఓపిక పట్టండి. మానవత్వమూ, మంచీ ఓడిపోయిన సందర్భాలు ప్రపంచం చరిత్రలోనే లేవు’ అన్నాడు పైగా.
ఒక రోజెవరో అతని ఇంటి మీదికి రాయి విసిరారు. దానితో ఆవిడ భయపడింది. ‘మనవాళ్ళంతా వెళ్ళిపోయారు. పేపర్లో చూస్తే యూదులను అన్యాయంగా తరిమి కొడుతున్నారని రాస్తున్నాయి. మన చుట్టూ ద్వేషపూరితమైన గాలి కమ్ముకుంటున్నది’ అన్నదావిడ.
అపుడాయన ఏమీ అనలేకపోయాడు. ‘భయం వేరు. జాగ్రత్తపడటం వేరు’ అని ఆవిడ మరో సందర్భం చూసుకుని అన్నది.
ఆకస్మికంగా అతనికి తన ఇంట్లోని నేలమాళిగ గుర్తుకొచ్చింది. నౌఖర్ని పిలిచి అందులోకి రెండు మంచాలు, నాలుగు కుర్చీలు, కొన్ని వేల పుస్తకాలూ తరలించాడు. బైటనుంచి చూసేవారికి నేల మాళిగ ద్వారం కనిపించకుండా తివాచీ పరిచి, దాని మీద సోఫా సెట్లు పెట్టించేశాడు. పగలు కాసేపు ఇంట్లో ఉండి, రేడియో విని, పేపర్లు చదివి, భోజనం చేసి రాత్రిపూట మాత్రం నేలమాళిగలోకి వెళ్ళి పడుకోవడం మొదలుపెట్టాడు. ఒక రోజు తెల్లవారి నౌఖరు నేలమాళిగలోకి వచ్చాడు.
“రాత్రి వాళ్ళొచ్చారు. కత్తులు పట్టుకొని వచ్చారు. ఇల్లంతా వెతికారు. ఊరొదిలి పారిపోయారని చెప్పాను. అప్పటిక్కానీ వాళ్ళు వెళ్ళలేదు. దేవుడి దయవల్ల నా మాట నమ్మారు… నా కంతే చాలు’ అన్నాడు.
ఆయన నౌఖరు వంక అభిమానంగా చూసి, ‘నీ మానవత్వం వల్ల నాకు ప్రమాదం తప్పిపోయింది… నీ మేలు మరిచిపోలేను’ అన్నాడు.
నౌఖరు సిగ్గుపడ్డాడు. వెంటనే మాట మార్చి ‘మీరిద్దరూ ఇక్కడే ఉండటం క్షేమం. నేను భోజనాలూ, పేపర్లూ మీకేమి కావాలిస్తే అవి ఇక్కడకే తెస్తాను. కొంచెం అల్లరి తగ్గేవరకూ అదే క్షేమం…’ అన్నాడు.
ఆయనా, ఆవిడా కూడా ఆ ఆలోచన బాగుందన్నారు. ఫ్యాక్టరీ కొన్నాళ్ళపాటు మూసేస్తే మంచిదని కూడా అనుకున్నారు. ఆ ఏర్పాట్లు చేయడానికి అవసరమైన అధికారాలు ఆ నౌఖరుకే లిఖితపూర్వకంగా ఇచ్చారు.
అంతా సవ్యంగా వుంది. కానీ దేశంలో ఏదీ సవ్యంగా లేదు. యుద్ధం మొదలైపోయింది. త్వరలోనే పోతాడనుకుంటున్న పీడముండాకొడుకు రోజురోజుకీ పెద్దవాడైపోతున్నాడు. జర్మనీలోని యూదుల యాతన వర్ణించనలవి కాకుండా ఉంది. ఐరోపా దేశాల్లో కూడా యూదుల్ని హింసిస్తున్నారు. ఒక్కటొక్కటిగా సరిహద్దు దేశాల్ని హిట్లర్ కబళిస్తున్నాడు.
వార్తాపత్రికల నిండా హింసే. రేడియో నిండా హింసే.
అంత హింస మధ్య మానవత్వాన్ని ప్రబోధించే చల్లని పుస్తకాలు, ‘నమ్మకస్తుడూ, మంచి గంధం లాంటి మనసున్నవాడు’ అయిన నౌఖరు మాత్రం వారికి తోడుగా దొరికాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత నౌఖరు వచ్చి ఆయన దగ్గిర కూర్చుంటాడు.
అన్నీ దుర్వార్తలే. జర్మనీలోనూ, ఆక్రమిత దేశాలలోనూ యూదుల ఊచకోత విన్నప్పుడు అతడికి గుండెనిబ్బరం సడలిపోతుంది. కానీ పుస్తకాలు అతనికి ధైర్యం చెబుతాయి. ఇది తాత్కాలికం. క్షణికమిది. ఇపుడు అధర్మమే, అన్యాయమే ఈ విధంగా గెలిచినట్టు కనిపించవచ్చును గానీ చివరికి ధర్మం గెలవక తప్పదు. అనంత మానవ హృదయ స్పందనమే చివరికి వినిపించే జయశబ్దం. అదే యుద్ధానంతరం వినిపించే విజయభేరి అని అవన్నీ కూడబలుక్కుని అతనికి చెప్పినట్టు భావిస్తుంటాడతను. అవే మాటలు అతను తన నౌఖరుకు చెబుతుంటాడు.
ఫ్రాన్స్ కూలిపోయింది. ఇంగ్లాండు జర్మనీ దెబ్బకు గజగజలాడిపోతోంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకటా? రెండా? పలు సంవత్సరాలా? ఎన్నో? లెక్క తప్పిపోతుంది. అధర్మానికి అపజయమే లేనట్టు కనిపిస్తోంది.
‘వద్దు నాకు వార్తాపత్రికలు తీసుకురావద్దు. ఈ రేడియో కూడా బైటకు తీసుకుపో. అధర్మం పెరిగిపోతున్న వార్తలు నేను విని భరించలేను.’ ఆయనొక రోజు నౌఖరుకు గట్టిగా చెప్పాడు. ఆ రోజునుంచీ వార్తాపత్రికలూ రేడియో అతని మనసుని కలచివేయడం మానివేశాయి. తక్కిన జీవితం మామూలుగానే ఉంది. విధేయుడైన నౌఖరు వారికి కావాల్సినవన్నీ టంఛనుగా సరఫరా చేస్తున్నాడు. ఏం తోచకుండా ఉంది. సూర్యుడ్నీ, చంద్రుడ్నీ, గరికపోచల్ని చూసి మాత్రం చాలా చాలా కాలం అయిపోయింది. అవన్నీ గత జన్మపు జ్ఞాపకాల్లాగా వున్నాయి.
అపుడపుడూ నౌఖరు చెబుతుంటాడు. ‘ఇంగ్లండు కూలిపోయింది… బ్రిటీష్ పార్లమెంట్ భవనం మీద స్వస్తిక్ పతాకం దుర్మార్గంగా ఎగురుతోంది.’
ఆయన గుడ్ల నీరు కుక్కుకుంటూ వింటాడు. ఆ సమయంలో ఆవిడ చనిపోయింది. ఆ నౌఖరే లేకపోతే ఆమెను ఖననం చేసే దిక్కూ వుండేది కాదు. రాత్రివేళ ఆ నౌఖరే ఆమె శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా బైటకు తీసుకువెళ్ళి ఇంటి ఆవరణలోనే ఖననం చేశాడు. ఆరోజు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ‘ఇలాంటి దుర్మార్గ ప్రపంచంలో కూడా మానవ హృదయ సౌందర్యాన్ని దర్శించుకునే భాగ్యం నాదయ్యా… నీలాంటి మనిషి నాకు తోడుగా దొరకడం నా నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నది’ అన్నాడు.
నౌఖరు వినయంగా నవ్వి ఊరుకున్నాడు. బాధతో ఆయన భోజనం చేయనంటే బలవంతంగా నాలుగు ముద్దలు తినిపించాడు.
ఒకరోజు ఉదయాన్నే ఆ నౌఖరు యజమానికి చెప్పేడు. ‘రష్యా కూలిపోయింది. స్టాలిన్ రాజ్యం భూపతనం అయిపోయింది. హిట్లర్ ప్రపంచ నేతగా ఈరోజు సాయంత్రం పదవీ స్వీకారం చేస్తున్నాడు.’
ఆయన కళ్ళు మూసుకున్నాడు. నెరిసిపోయిన కనురెప్పల నుంచి రెండు చుక్కలు కిందికి జారి బోసిపోయిన బుగ్గల మీద నుంచి కింద రాలిపోయాయి.
నౌఖరు అన్నాడు. ‘బాధపడకండి. అధర్మం అప్పుడపుడూ తాత్కాలిక విజయాలూ సాధించవచ్చు. కానీ అంతిమ విజయం మంచితనానిదే. చివరకు మంచితనమూ, మానవహృదయమూ అన్నింటినీ గెలుస్తాయి. ఇన్నాళ్ళ మన జీవితంలో మనం నమ్మినదీ, మనం చదువుకున్నదీ, మనకు అనుభవంలోకి వచ్చినదీ అదేగదా?’
ముసలాయన కన్నీళ్ళు తుడుచుకుంటూ ‘నా కళ్ళెదురుగా ఉన్న నువ్వే మన నమ్మకానికి సజీవ సాక్ష్యం. మనిషిని గదా కాసేపు కలవరపడ్డానంతే. నువు చెప్పినట్టు తుది సమరంలో మంచితనమే నెగ్గుతుంది’ అన్నాడు.
నౌఖరు వినయంగా నవ్వేడు.
ఆ తరువాత కొద్దికాలానికే ఆయన కాలం చేశాడు. అప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఆస్తిని అనుభవిస్తూ ఆయన ఫ్యాక్టరీని సొంతం చేసుకుని ఆ ప్రాంతంలో ఒక సంపన్నుడుగా చెలామణీ అవుతున్న అతని నౌఖరు అదే గౌరవంతో రహస్యంగా ఆ ముసలాయనను గొయ్యి తీసి పూడిచేశాడు.
‘ఇక్కడే ఉండు నువు. మంచితనం గెలిచేదాకా. నీకా ఓపికా నమ్మకమూ ఉన్నాయి’ అనుకున్నాడతను ముసలాయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ…
(మూలం: రచయిత పేరూ, కథ పేరూ గుర్తులేవు. ఎన్నడో ఇంగ్లీషులో చదివిన కథ సుమారుగా ఇలాగే ఉన్నట్లు గుర్తు. మహానగర్, సాయంకాల దినపత్రిక, 7.8. 1995)