వచన రచనలో పదస్వరూపాలు, సింటాక్స్

పరిపూర్ణమైన సింటాక్స్ (వాక్యనిర్మాణ నియమావళి) నిండైన భాషలోని భాగం. వచనంలో రాసేటప్పుడు పదస్వరూపాలను చెక్ చేసుకోవడం ద్వారా భాషాదోషాలను పరిహరించుకున్న తర్వాత, దృష్టి పెట్టాల్సింది సింటాక్స్ మీదనే. వాక్యం అన్ని విధాలుగా సవ్యంగా ఉండాలంటే ఈ రెండు అంశాలూ ముఖ్యమే. సరైన స్థానంలో సరైన పదం వేయటం వచన రచనలో చాలా అవసరం అని చెప్పేది సింటాక్స్.

కవిత్వంలో భావుకత, భావరమ్యత, అనుభూతి ప్రేరకత మొదలైనవి పాఠకుణ్ణి అలరిస్తాయి. అవి బలంగా ఉన్నప్పుడు భాషాపరమైన చిన్నచిన్న లోపాలు వాటి ఉద్ధృతిలో కొట్టుకుపోతాయి. వచనంలోని పరిస్థితి దీనికి భిన్నం. రసం, భావుకత లాంటివి సాధారణ వచనంలో ఉండవు కనుక పఠనీయత, సౌష్ఠవం (రీడబిలిటీ, సిమెట్రీ) వంటివి ప్రాధాన్యం వహిస్తాయి. వీటిని సాధించేందుకు ఉపయోగపడేవి సరళత, శబ్దరమ్యత, ఔచిత్యం, లయ మొదలైనవి. ఇవి వాక్యానికి ఆకర్షణను (appeal) కూడా చేకూర్చుతాయి.

వచనం రాసేటప్పుడు కొన్నిసార్లు పదాలు ముందుది వెనుక, వెనుకది ముందు రావచ్చు. ఊనిక కోసం, లయ కోసం, లేదా కవిత్వ ప్రభావాన్ని స్ఫురింపజేయడం కోసం ఈ పద్ధతిని అనుసరిస్తాము. దీన్నే ఇన్వర్షన్ (inversion) అంటారు. షేక్స్‌పియర్ వాక్యం, To be or not to be, that is the question – ఈ కోవకే చెందుతుంది. అదే విధంగా ఊనిక లేదా ఊతం కోసం వాక్యంలోని ఒక పదాన్ని ప్రారంభంలో పెట్టడం ఇంకో ధోరణి. ఎమిలీ డికిన్సన్ అనే ఆంగ్ల కవయిత్రి ఎమ్-డ్యాష్‍లను – ఎన్-డ్యాష్ అనే చిన్నరకంవి కూడా ఉంటాయి – ఎక్కువగా వాడి, ముక్కలు చేసిన వాక్యాలను చొప్పించి, ఒక ప్రత్యేకమైన శైలిని సాధించారు. చైతన్య స్రవంతి (stream of consciousness) శైలిలో వాక్యనిర్మాణం సంప్రదాయ పద్ధతికి భిన్నంగా (unconventional) ఉంటుంది. తెలుగులో కూడా సృజనాత్మకత ఎక్కువగా ఉన్న రచయితలు ఇటువంటి వ్యత్యాసాలను చేర్చుతారు, తమ వాక్యాలలో. దీన్నే ప్రయోగశీలత అనవచ్చు. శ్రీశ్రీ, బుచ్చిబాబు, మునిపల్లె రాజు మరికొందరు ఉదాహరణలు. ఈ తరానికి చెందినవారిలో బి. ఎస్. ఎమ్. కుమార్ అసంప్రదాయ, అసంబద్ధ భాషను వాడుతూ రచనలు చేస్తున్నారు.

వాక్యనిర్మాణంలో ప్రయోగాలు చేయగలిగేటంత భాషానైపుణ్యాన్ని సాధిస్తే, అద్భుత రచనలను సృష్టించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి పురస్కారాలను పొందవచ్చునని నిరూపించారు సల్మాన్ రుష్దీ (Midnight’s Children, 1981), అరుంధతి రాయ్ (The God of Small Things, 1997), గీతాంజలి శ్రీ (Reth Samadhi, 2022). వీరి నవలలను బుకర్ ప్రైజ్‍లు వరించాయి. నిజానికి, రేత్ సమాధికి కాకుండా దానికి ఆంగ్ల అనువాదానికి (Tomb of Sand) బుకర్ ప్రైజ్ వచ్చింది – అనువదించినవారు డైసీ రాక్‍వెల్ (Daisy Rockwell). ఐతే ఈ ముగ్గురికన్న ఎక్కువ విలక్షణమైన సింటాక్స్‌తో యులిసిస్ (1922) అనే నవలను రాసిన జేమ్స్ జాయ్‍స్‍కు నోబెల్ బహుమతి రాలేదు. బుకర్ ప్రైజ్ ఆ కాలంలో లేదు.

పదస్వరూపాలను పట్టించుకోకపోవటం కంటె, వాక్యనిర్మాణం మీద గరిష్ఠంగా ధ్యాస పెట్టకపోవటం తరచుగా జరిగే విషయం. కానీ, ఈ వాస్తవాన్ని అందరూ గుర్తించలేరు.

ఇక్కడ ఈ పదం కాకుండా ఫలానా పదం వచ్చి ఉంటే బాగుండేది అని కాని, ఈ మాట ఇక్కడ కాకుండా అక్కడ వచ్చి ఉండే బాగుండేది అని కానీ అనిపించని విధంగా రాసిందే సరైన సింటాక్స్ ఉన్న సక్రమమైన, ఉత్తమమైన వాక్యం. సింటాక్స్ సరిగ్గా ఉన్నప్పుడు వాక్యంలో కుదురు, సాఫీదనం, సమతూకం (బ్యాలెన్స్) నెలకొంటాయి. సింటాక్స్ లోపభూయిష్ఠంగా ఉంటే వాక్యాలు కొన్నిచోట్ల తడబడినట్టు, తట్టుకున్నట్టు, లేదా మడత పడ్డట్టు అభాసను కలిగించే ప్రమాదముంది. వాక్యంలోని మాటలన్నీ సరైన పదస్వరూపాలను కలిగినవే ఐనా చాలాసార్లు వాక్యం సంతృప్తికరంగా తయారుకాకపోవడాన్ని, నిశితమైన పాఠకులు తాము చదివే రచనలలో గుర్తుపడుతుంటారు. ఈ కింది నాలుగు వాక్యాలను పరిశీలించండి.

  1. రామారావుకు షష్టిపూర్తి వేడుక జరపాలని కుటుంబంలోని అందరు సమిష్టిగా నిర్ణయించారు.
  2. అందరు కుటుంబంలోని రామారావుకు సమష్టిగా షష్టిపూర్తి వేడుక జరపాలని నిర్ణయించారు.
  3. రామారావుకు షష్టిపూర్తి వేడుక జరపాలని కుటుంబంలోని అందరు సమష్టిగా నిర్ణయించారు.
  4. రామారావుకు షష్ఠిపూర్తి వేడుక జరపాలని కుటుంబంలోని అందరు సమష్టిగా నిర్ణయించారు.

మొదటి వాక్యంలోని సమిష్టి, నాలుగవ వాక్యంలోని షష్ఠిపూర్తి సరైన పదస్వరూపాలు కావు. మూడవ వాక్యంలో ఈ రెండు పదాలు కరెక్ట్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. రెండవ వాక్యంలో కూడా పదస్వరూపాలు అన్నీ సరిగ్గానే ఉన్నాయి. అంత మాత్రాన అది సవ్యమైన వాక్యం అయిపోదు. కారణం, సింటాక్స్ (వాక్య నిర్మాణం) సజావుగా లేకపోవడం. మరింత స్పష్టంగా చెప్పాలంటే, వాక్యంలోని పదాలు సరైన క్రమంలో లేవు. కాబట్టి, ఉన్న వాక్యాలలో ఉత్తమమైనది, సక్రమమైనది మూడవ వాక్యం. ఇటువంటి సూక్ష్మ భేదాలను (nuances) అందరూ వెంటనే గుర్తించలేకపోవచ్చు.

మరొక ఉదాహరణను పరిశీలిద్దాం.

  1. ప్రజల సంప్రదాయాలు ఉత్తర ధ్రువములో నివసించేవారిలో విచిత్రంగా ఉంటాయట.
  2. ఉత్తర ధృవంలో నివసించే ప్రజల సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయట.
  3. ఉత్తర ధ్రువంలో నివసించే ప్రజల సాంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయట.
  4. ఉత్తర ధ్రువంలో నివసించే ప్రజల సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయట.

ఇక్కడ రెండవ వాక్యంలోని ధృవం, మూడవ వాక్యంలోని సాంప్రదాయాలు సరైన పదస్వరూపాలు కావు. నాలుగవ వాక్యంలో అన్ని పదస్వరూపాలు నిర్దుష్టంగా ఉన్నాయి. ఐతే, మొదటి వాక్యంలో కూడా అన్ని పదాల స్వరూపాలు నిర్దుష్టంగా ఉన్నప్పటికీ, మాటలు సరైన క్రమంలో లేవు. ‘ఉత్తర ధ్రువంలో నివసించే…’ అని ప్రారంభిస్తేనే ఈ వాక్యానికి సౌష్ఠవం, సమతూకం సిద్ధిస్తాయి. సరైన స్థానంలో సరైన పదం అంటే ఇదే. దీన్నే ఆంగ్లంలో fronting అంటారు. మొదటి వాక్యంలో మరొక అపసవ్యత చోటు చేసుకుంది. ధ్రువము అనే పదం సాధారణంగా నిర్దుష్టమైనదే ఐనా, ఈ సందర్భంలో మాత్రం పూర్తిగా నిర్దుష్టమైనది కాదు. ధ్రువం దానికన్న ఎక్కువగా పొసగే మాట. ధ్రువము గ్రాంథిక వచనానికి మాత్రమే నప్పుతుంది. కానీ ఇక్కడి వాక్యాలన్నీ ఆధునిక వచనానికి చెందినవి. ప్రజల సంప్రదాయములు ఉత్తర ధ్రువములో నివసించువారిలో విచిత్రముగా ఉండునట అని రాస్తే, ధ్రువము అనే పదం పొసగుతుంది బహుశా. మొదటి ఉదాహరణలోని రెండవ వాక్యం ద్వారా, రెండవ ఉదాహరణలోని మొదటి వాక్యం ద్వారా భావం బాగానే బట్వాడా అయినా, కుంటి సింటాక్స్ కారణంగా అవి సౌష్ఠవం లోపించిన వాక్యాలు అయ్యాయి.

ఏ పదం ఏ స్థానంలో రావాలనేది సింటాక్స్ చెప్పే విషయాలలో ముఖ్యమైనది. ఈ కింది ఐదు ఉదాహరణలను పరిశీలిస్తే, వాటిలోని అపసవ్యత విశదమౌతుంది.

  1. కృత్రిమ మేధ సహాయంతో నేరాలు చేసేవాళ్ళను పోలీసులు పట్టుకున్నారు.
  2. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఈ వాక్యంలోని అపసవ్యతను వెంటనే గుర్తించలేం. కృత్రిమ మేధ సహాయాన్ని ఎవరు తీసుకున్నారు? నేరం చేసేవాళ్ళా లేక పోలీసులా? ఈ వాక్యాన్ని మూడు విధాలుగా సవరించవచ్చు. మొదటిది, ‘సహాయంతో’ తర్వాత కామా పెట్టడం. రెండవది, ‘నేరం చేసేవాళ్ళను’కు బదులు నేరస్థులను అని రాయడం. మూడవదీ అన్నిటికన్న ఉత్తమమైనది, నేరాలు చేసేవాళ్ళను పోలీసులు కృత్రిమ మేధ సహాయంతో పట్టుకున్నారు, అని రాయడం. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. నేరాలను చేసేందుకు నేరస్థులు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడి ఉద్దేశమైతే, ఈ వాక్యం సరిగ్గానే ఉంది. కాబట్టి, ఏ సవరణా అవసరం లేదు.

  3. నెల రోజుల్లో పెరిగిన నీ బద్ధకాన్ని పోగొట్టుకోకుంటే నీ ఉద్యోగం ఊడటం ఖాయం.
  4. ఇక్కడ నెల రోజుల్లో అన్నది దేనికి వర్తిస్తుంది? బద్ధకాన్ని పోగొట్టుకోవడానికా, లేక ఉద్యోగం ఊడటానికా? ఈ ఉదాహరణలో కూడా ‘నెల రోజుల్లో’ తర్వాత కామా పెడితే అనిశ్చితి తొలగిపోతుంది. కానీ అంతకన్న మంచి పద్ధతి, పెరిగిన నీ బద్ధకాన్ని పోగొట్టుకోకుంటే నెల రోజుల్లో నీ ఉద్యోగం ఊడటం ఖాయం, అని రాయడం.

  5. కనీసం బయటికి వెళ్ళడానికి రెండు మూడు జతల మంచి బట్టలైనా ఉండాలి.
  6. ఈ వాక్యంలో కనీసం అనే పదం సరైన స్థానంలో లేదు. ‘దాదాపు’ కూడా ఇదే విధంగా అపసవ్యంగా చోటు చేసుకుంటుంది – కొందరి వాక్యాల్లో. దాదాపు నేను ఆరు నెలలుగా వ్యాధితో బాధ పడుతున్నాను అని కాకుండా, నేను దాదాపు ఆరు నెలలుగా… అని రాస్తేనే అది సరైన వాక్యం ఔతుంది. అదే విధంగా ఈ మూడవ వాక్యాన్ని, బయటికి వెళ్ళడానికి కనీసం రెండు జతల బట్టలైనా ఉండాలి, అని మార్చితేనే వాక్యనిర్మాణంలో సవ్యత సిద్ధిస్తుంది. దాదాపు, కనీసం … ఇలాంటి పదాలు కచ్చితంగా ఏ పదానికి వర్తించాలని భావిస్తున్నామో ఆలోచించి, దానికి ఎడమపక్కన ఉన్న స్థానంలోనే (immediately before) పొందుపరచాలి.

  7. అ) పశువులూ కోటేశూ ఒక్కసారే వచ్చాయి. ఇ) పశువులూ కోటేశూ ఒక్కసారే వచ్చారు.
  8. ఈ రెండు వాక్యాలలో ఏది సరైనది? చెప్పడం కొంచెం కష్టమే. రావడం అనే క్రియను పశువులకు పర్తింపజేయడమే సమంజసం అనుకుంటే మొదటి వాక్యం, కోటేశుకు వర్తింపజేయటమే సబబు అని భావిస్తే రెండవ వాక్యం సరైనవి. క్రియకు దగ్గరగా ఉన్న నామవాచకానికే వర్తింపజేయాలని ఆంగ్లవ్యాకరణం చెబుతున్నది. తెలుగు భాషలో కూడా అదే విధానాన్ని పాటించాలని పండితులు సైతం అంగీకరిస్తారనుకుంటాను. అప్పుడు, కోటేశూ పశువులూ ఒక్కసారే వచ్చాయి అని గాని, పశువులూ కోటేశూ ఒక్కసారే వచ్చారు అని గానీ రాయాలి.

  9. ఇప్పుడు నాకు దేనిమీద ఆసక్తి లేదు.
  10. ప్రశ్నవాక్యాన్ని రాయబోయి చివరన ప్రశ్నార్థక చిహ్నాన్ని మరిచినట్టుగా లేదా ఈ వాక్యం? కాబట్టి, ఇప్పుడు నాకు దేనిమీదా ఆసక్తి లేదు అని రాసి అనిశ్చితిని తొలగించవచ్చు. పదం సరైన స్థానంలోనే ఉంది కానీ, అది సరైన రూపంలో లేదు. దేనిమీదా అంటే on anything; దేనిమీద అంటే on what/which thing.

ఇటువంటి బోలెడన్ని వాక్యాలను మనం రోజూ చదువుతూనే ఉంటాం. ఈ పరిశీలనలు వచన రచనలో పరిణతిని లేదా పరిపూర్ణతను సాధించేందుకు ఉపయోగపడే మౌలిక అంశాలు అని చెప్పవచ్చు.

ఏ ప్రక్రియలో ఐనా ప్రాథమిక అంశాలు కీలకమైనవి. శాస్త్రీయ సంగీతంలో ముందు సరళీస్వరాల మీద సంపూర్ణమైన పట్టును సంపాదించేందుకు చాలా కృషి చేయాలి. హిందుస్తానీ శైలిలో ఐతే కేవలం ‘ఆ’కార్ గాయనంలో నైపుణ్యం సంపాదించేందుకు సంవత్సరాల తరబడి సాధన చేస్తారు! సాహిత్యమూ అంతే. కవులు, రచయితలు కాదల్చుకున్నవారికి మొదట ప్రాథమిక అంశాలలో ప్రావీణ్యం ఉండటం అవసరం. ఎందుకంటే, అది బలమైన పునాదిని సమకూర్చుతుంది.