మూతబడ్డ పుస్తకం

మనుషులుండేది ఎంతసేపు!
క్షణంలో
కాలపునదిలో కరిగిపోతారు
ఉన్నట్టుండి
దట్టమైన పొగమంచులోకి
అదృశ్యమవుతారు.

ఒక చిన్న పలకరింపు కోసం
ఎదురుచూపులను తడితడిగా ఆరేసి
వసంతాన్ని పూయించే కలయిక కోసం
ఎడారుల వెంట నడకసాగిస్తూ
పాత కాలెండర్ మడతలలోకి
ముడుచుకుంటారు.

నిర్లక్ష్యంతోనో
అవసరం లేదనో
ఎడతెరిపి లేకుండా
పరుగులు తీస్తూ
చిటికెడు సమయాన్ని
వారి దోసిట్లో
ఆత్మీయంగా పోయలేని మనం
మూతబడిన పుస్తకంలోని
పేజీలనూ వాక్యాలనూ
దుఃఖంతో హత్తుకుంటాం
ఆటంతా ముగిశాక
పశ్చాత్తాపపు మంటలలో
దగ్ధమవుతూ ఉంటాం.