నా స్నేహితులు తిరిపేలు, కల్లూరి అంపయ్య ఏడవ తరగతి చదువుతున్నారు. అక్కడ వాళ్ళకు ఛందస్సు చెప్పుతారు. వీళ్ళు పరీక్షకు కావలసినంత చదువుకున్నారు. పద్యాలు వ్రాయడం అభ్యాసం చేయలేదు. సెలవులకు వచ్చినప్పుడు నా పద్యాలు విని మెచ్చుకునేవాళ్ళు.
నా కవితా వ్యాసంగం మా ఊళ్ళోవాళ్ళకు తెలిసింది. వాళ్ళు నేనేదో మహాకవినై పోయినట్లు గౌరవించేవాళ్ళు. దాంతో నాకు ప్రోత్సాహం కలిగింది. ప్రతిదినం ఏటి ఒడ్డుకు పోయి కూర్చుండి నీళ్ళకు వచ్చేవాళ్ళను, పశువులను కడిగేవాళ్ళను, పాత్రలు తోముకునేవాళ్ళను చూస్తూ రకరకాల పద్యాలు రాసేవాణ్ణి. శ్రీనాథుని చాటువులు నాకు చాలా వచ్చినాయి. ఆ విధంగా రాయడానికి ప్రయత్నించేవాణ్ణి. ఒకనాడు మా ఊరి ఆయుర్వేద వైద్యుడు తూము వీరాచారి ఇంటికి పోయినాము. ఆయనను మేము మామా అని ఆయన భార్య గోవిందమ్మను అత్తా అని పిలిచేవాళ్ళం. ఆయనకు సంతానం లేదు. మేము పోతే ప్రీతితో ఆ దంపతులు మాకు చిరుతిండ్లు పెట్టేవాళ్ళు. ఆయుర్వేదంలో ఆయన పండితుడు. స్వయంగా మందులు తయారుచేయడంలో ఘనుడు. ఒకనాడు నేను వెళ్ళిననాడు “వసంత కుసుమాకరం” అనే మందును తయారుచేసి సీసాలో వేస్తున్నాడు. ఇంట్లో కొందరు రైతులున్నారు.
ఆ దినం నేను పోగానే ఆయన సంతోషంతో ‘రా అల్లుడూ! రా! నీవు కవిత్వం చెప్పుతున్నావంట కదా. పరీక్ష చేయమంటావా’ అన్నాడు. ఇప్పుడు కవులను గౌరవించడానికి రాజులు లేరుకదా. మీ వంటి వాళ్ళే ముందుకు రావలె కదా అన్నాను. ‘ఉత్త పరీక్ష కాదోయ్, ఇదిగో చూచినావా, ఈ మందును వసంత కుసుమాకరం అంటారు. మంచి బలవర్ధకమైన ఔషధం. తులం ఇరవై రూపాయలు. ఇక్కడ ఈ తట్టలో ఆకులు, వక్కలు, సున్నం, పొగాకు ఉన్నాయి. కంద పద్యంలో వీటి పేర్లు వచ్చేటట్లు చెప్పు చూద్దాం. ఈ మందును పావలా ఎత్తు తూచి ఇస్తా’ అన్నాడు. నేను ఆశువుగా పద్యం చెప్పగా ఒక రైతు రాసినాడు.
“ఆకులు, పోకలు, సున్నము తోకూడిన పొడుము పత్రి దొరికిన జనముల్, నాకమునైనను కోరరు ఏకముగా వీనిరుచికి ఇమ్మహిలోనన్!”
చెప్పిన మాట ప్రకారం వీరాచారి మామ ఇంట్లోకి పోయి త్రాసు తెచ్చి తూచి పావలా ఎత్తు మందును పొట్లం కట్టి ఇస్తూ దినమూ రెండు పూటలా నెయ్యితో సేవిస్తే బాగా బలం వస్తుంది అన్నాడు. అక్కడున్న రైతు “సామీ నేనొక పరీక్ష చేదునా” అన్నాడు. కానీ అన్నాను. కంద పద్యంలోనే ఈ నాలుగు వస్తువులనూ, వాటి గుణాలతో చేర్చి చెప్పండి అన్నాడు. ‘దీనికేమి పందెం’ అన్నా. దీనికీ ఈ మందును పావలా ఎత్తు ఇస్తాం అన్నాడు. అయితే రాసుకోండి.
“ఆకులు సుఖదాయకములు. పోకలు రుచి కలుగజేయు, పొగపత్రములన్ చేకూర్చు దంత పటిమను ప్రాకటముగ సున్నమునకు వాతము పోవున్!”
మామ ఇంకో పావలా ఎత్తు తూచి మందు ఇచ్చినాడు. ‘నాయనోయ్ మీ పరీక్షలు చాలు. ఆయనకేం ఎన్ని పద్యాలైనా చెప్తాడు. నష్టపోయేది నేను. నాకు బిడ్డ ఉంటే కాళ్ళు కడిగి కన్యనిచ్చేవాణ్ణి’ అన్నాడు. అంతా నవ్వుకున్నాము. పల్లెటూళ్ళలో అప్పుడు కులమత భేదాలు లేకుండా అందరూ అన్న, మామ, బావ, చిన్నాయన అని వరుసలతో పిలుచుకుంటూ ఆత్మీయతా అనురాగాలతో ఉండేవారు. ఇప్పటి ‘అభివృద్ధి’ పుణ్యమా అని ఆ పల్లెలే కక్షలకూ, కార్పణ్యాలకూ నిలయమైనాయి. నా పద్య రచనాభ్యాసం నిరంతరంగా సాగిపోతున్నది. మా చిన్నాయన ఇట్లా విడివిడి పద్యాలురాయడం కంటే ఏదైనా కథ తీసుకొని కావ్యంగా రాస్తే బాగుంటుంది అని సూచించినారు. నాకూ అది నచ్చింది. ఆలోచించాను, నేను ఐదవ తరగతి చదివినప్పుడు మా వాచకంలోని చంద్రహాసుని కథ జ్ఞాపకం వచ్చింది. ఒక మంచి దినం చూచి కావ్యారంభం చేసినాను. చిన్నతనం నుంచి నాకు ఆంజనేయుని మీద భక్తి వుంది. ఆయనను స్తుతించి ఆయనకే కావ్యాన్ని అంకితమిస్తే బాగుంటుందనుకున్నాను. అప్పటికి నాకు 18 ఏండ్ల వయస్సు.
[సుప్రసిద్ధ శాసనపరిశోధకులు, పండితకవి గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ ‘శతపత్రము’ నుండి. మార్చి 6న రామకృష్ణశర్మగారి జన్మదిన సందర్భంగా ఈ చిన్న ముచ్చట. ఈ తీగను పట్టుకుని చదువరులు ఆయన ఆత్మకథలోని శతాపత్రాలను చదువాలనేది మా పెద్ద కోరిక – సం.]