పాంథశాల

అలల తాకిడికి ఒకచోట చేరిన పుల్లలు
కాసేపు ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకొని
తమ దారిని తాము వెతుక్కుంటాయి
మనసు గోడ మీద మారిపోయే బొమ్మల్లా

అప్పుడప్పుడూ మాత్రమే పలకరించే మేఘం
బతుకు విత్తనాన్ని పచ్చని మొక్కగా ఎదగనివ్వదు
అల్లంత దూరం నుండి
చీకటిని చీల్చుకొని వెలిగే మెరుపు తీగ
వేదనల వణుకును పోగొట్టే నెగడుగా
ఎప్పటికీ మారదు

తళుక్కున మెరిసిన ఇంద్రధనుస్సు
తెల్లని నవ్వై తేలిపోతుంది
అసలు రంగేదో నువ్వు గుర్తించేలోగానే

ఆనందోత్సాహాల వెలుగులు
దుఃఖోద్వేగాల చీకట్ల మధ్య
చేసే చక్రభ్రమణంలో
అరుదుగా ఎదురయ్యే సంభ్రమం
కాసేపు ఇంధనమౌతుంది

మజిలీ ముగిసే నాటికి
నీ కోసం చెమర్చే కనుల కోసం
సాగించిన అన్వేషణ అంతా
వ్యర్థమేనని తెలుస్తుంది.