అప్‌డేట్ అవలేదు

బైకుల మీద
దూసుకుపోయే రోజొచ్చినా
తన ర్యాలీ సైకిలు మీద
కిలోమీటర్లను నింపాదిగా
కొలిచేవారు నాన్న

ఉదయాన్నే
నాలుగు మెతుకులను
నాలుకపై చల్లుకుని
వెళ్ళిన నాన్న
మిట్టమధ్యాహ్నం
మండే సూర్యుడిని
సైకిలుకు కట్టుకుని
రెండు కాఫీచుక్కల కోసం
రావడం చూశాకే
రేడియో పసిడిపంటలంటూ
గోల చేసేది

సాయంత్రం మళ్ళీ
పండో తాయిలమో తెచ్చి
చందమామల పెదవులపై
చిరునవ్వులు కురిపించే నాన్న
మహా మాటల పొదుపరి

చిన్నప్పుడే నాన్నను పోగొట్టుకున్న
నాన్న గుండెల్లో
పేలిన ఆకలి అగ్నిపర్వతాల జాడలను
వెతికే శక్తి ఎవరికుంది

తన ఆరో ప్రాణమైన సైకిలు
దొంగ చేతుల్లోకి జారాక
నాన్న దేహం
చిల్లు పడిన చక్రమై
ముందుకు కదలనంటూ
మూలన కూలబడింది

లాండ్ లైను దగ్గరే
తన జీవితాన్ని
ఆపేసుకున్న నాన్న
విరిగిన కాలును కూడగట్టుకుంటూ
ఉడిగిన వయసు ముడుతలను సరిజేసుకుంటూ
అమ్మ లేని ఒంటరితనంలోకి ముడుచుకున్నారు

ప్రపంచమంతా
పరుగెడుతోంది చూడు అంటే
నిదానమే ప్రధానమని
బోధించే నాన్న
ఇక అప్‌డేట్ అవలేనంటూ
చేతులేత్తేసి
మమ్మల్నిలా వదిలేసి
వెళ్ళిపోడానికి తొందరపడ్డారెందుకో
ఇప్పటికీ అర్ధం కాదు.