బెష్టు ఫ్రెండ్స్

పదిరోజులైంది స్కూలుకెల్లి. సాయంత్రమైతే చాలు జెరమొస్తంది బాగా, ఏం తిన్నా సయించదు. పగలంతా అమ్మా నాన్నా షాపుకెల్లిపోతారు గాబట్టి అమ్మ అన్నవొండి మందుబిళ్ళలిచ్చి, నన్ను పక్కింట్లో సుశీలమ్మమ్మ దగ్గర వదిలేసి యెల్తంది. కనీసం ఈరోజన్నా స్కూలుకెల్దావని ఎంత అనుకున్నానో! డిసెంబరు 31 కదా, అందరం గ్రీటింగ్ కార్డులిచ్చుకోవచ్చని. అమ్మతో జెరం తగ్గిపోయిందని కూడా చెప్పేశా. కానీ పొద్దున యూనిఫామేసుకునేటప్పుడు వాంతైపోయింది. ఇక యెల్లొద్దులే పొడుకో అనేసింది అమ్మ. ఇంట్లో ఉన్నాగానీ ఒకటే స్కూలు గుర్తొస్తా ఉంది. అందుకే మర్చిపోటాకి కొత్త సినిమా పాటల కాసెట్టు పెట్టుకుని యింటన్నా ఇప్పుడుదాకా.


కొద్ది కొద్దిగా చలేస్తంది, చెల్లి కూడా ఒచ్చేసింది ఇంటికి. “తింటాకి మళ్ళీ అర్టికాయలేనా, నాక్కోడా జెరవొస్తే బాగుండేది, బత్తాయి రసమిచ్చేవాళ్ళు నీకిచ్చినట్టే” అని ఏడ్చింది. ఇద్దరం వాకిట్లో నించోని షాపునుంచి అమ్మొస్తదని చూస్తా ఉన్నాం. రాగానే చెల్లి ఎక్కడ అమ్మతో గొడవేసుకుంటదో అని నాకు బయంగా ఉంది. అదింక ఆగలేక సందు చివరదాకా యెల్లి చూస్తా ఉంది. సడన్‌గా పరిగెత్తుకొచ్చి ఆయాసపడతా “అక్కాయ్, అమ్మతో పాటు… నీ… ఫ్రెండ్సు కూడా వస్తన్నారు” అన్చెప్పి లోపలికి పరిగెత్తింది. గబగబా వైరు కుర్చీ ఎక్కి అటక మీదనించి చాప తెచ్చి వసారాలో యేసింది. రెండు గ్లాసుల్లో మంచీళ్ళు ముంచుకొచ్చింది. నా ఫ్రెండ్సొస్తే బలే హుషారు దీనికి అనుకున్నా.

శివలక్ష్మి, రత్న వచ్చారు అమ్మతో బాటు. నాకు గ్రీటింగ్ కార్డులిద్దామని వచ్చారంట. సుందరకాండ సినిమాలో అపర్ణ ఫోటోలు ఉన్నయ్యే తెచ్చారు ఇద్దరూ. To: Jothi, Happy new year 1995 అని రాసిచ్చారు స్కెచ్ పెన్‌తో. నేను కళ్ళజోడు పెట్టుకుని అపర్ణలాగా, చిన్నపిల్లలాగా ఉంటానని అంటారు స్కూల్లో అంతా. ఈసారన్నా ఎవరన్నా మీనా ఫోటో ఉండే కార్డులిస్తే బాగుండనుకున్నా. వాళ్ళు నాకోసమని అమ్మతో కలిసి వస్తంటే మల్లేస్వరి ఎగతాళి చేసిందంట “ఏమ్మా, ఎప్పున్నించి మీరు ముగ్గురూ బెష్టు ఫ్రెండ్సయింది” అని, కుళ్లుబోతు మొహంది. నాకు బాగోలేదనన్నా అలగడం మానేసి నాతో మాట్టాడిద్దేవో అనుకున్నా, ఛీ…

“నేను మీకేం కార్డులు కొనలేదే” అన్నాను. “ఏం కాదులేవే తొందరగా స్కూలుకి రా చాలు” అన్నారు. “రేపు న్యూ యియర్ కదా ప్రసాదోళ్ళ స్టూడియోలో గరల్స్ గ్రూప్ ఫోటో దిగుతున్నాం వస్తావా?” అనడిగారు.

“రేప్పొద్దున చూసి పంపిస్తాలే” అంది అమ్మ.

చెల్లి ఇంకా ఐదో క్లాసేగా, దాని ఫ్రెండ్సుకి గ్రీటింగ్ కార్డులు కొంటాకి డబ్బులియ్యరు ఇంట్లో. అందుకే వాళ్ళంతా ఊరికే కాగితాల మీద హాపీ న్యూ యియర్ రాసి ఇచ్చుకున్నారు ఒకళ్ళకి ఒకళ్ళు. నా ఫ్రెండ్సు యెల్లిపోగానే “నీ కార్డులు నా బాగ్ లో పెట్టుకోనా?” అనడిగింది. ఎట్లాగూ నా పేరే రాసుందిగా అని సరే అన్నాను.


ప్రసాదోళ్ళ స్టూడియో దగ్గర నాన్న సైకిల్ మీద దింపాడు. పక్కనే మా బావోళ్ళ కిరాణా కొట్టుంటే వాళ్ళతో మాట్లాడతా ఉన్నాడు. అందరం పాండ్సు పౌడరు పూసుకున్నాం. రత్న ఎవరూ చూడకుండా స్నో క్రీం కూడా పూసుకుంది.

“రత్నా, ఒక్క పూటలో రంగొచ్చేద్దావనేనా?” అని ఎగతాళి చేశాడు ప్రసాదు. రత్న నాకూ శివలక్ష్మికి కూడా క్రీం పూసుకోమని ఇచ్చింది. “టాంక్సే” అన్నా. “నో మోషన్స్” అంది రత్న. అందరం నవ్వాం. రాదికా, సౌజన్యా వాళ్ళు తల్లో గులాప్పూలు పెట్టుకొచ్చారు. మిగతావాళ్ళకి ప్రసాదు ప్లాస్టిక్ పూలిచ్చాడు ఫోటోలో బాగా వస్తయ్యని.

లైట్లయ్యీ యేసాక కొంతమందిని కుర్చీల్లో కూర్చుని మిగతావాళ్ళని ఎనకమాల నుంచోమన్నాడు. నాకు నీరసమనిపిచ్చి కుర్చీలో కూచ్చున్నా బారతీ వాళ్ళతో పాటు. మల్లేస్వరికి కుర్చీ దొరక్క రోషవొచ్చింది.

“ఇన్నిరోజులు స్కూలెగ్గొట్టి ఇప్పుడొచ్చి కుర్చీలో కూచ్చుందండీ అమ్మగారు” అనేసింది. “దానికి బాలేదు కదే ఊరుకో” అన్నారు శివలక్షి వాళ్ళు. “ఈవె కూచ్చుంటే కుర్చీ ఇరిగిపోద్ది, ప్రసాదుకి లాసు” అని కోపంగా జడ ముందుకేసుకున్నాను, నా పూసల రబ్బర్ బాండ్ ఫోటోలో కనపడాలని. ఫోటో తియ్యటం అవ్వంగానే ఎవర్తో పలక్కుండా నాన్న సైకిలెక్కేసి ఇంటికెల్లిపొయ్యా.


ఆఫియర్లీ పరిక్షలవుతున్నయ్యి. ఇవ్వాళ అసలే మేత్సు… నిన్న రాత్రి అల్జీబ్రా లెక్కలు కొన్ని రాలేదు. తొందరగా యెల్లి ఎవర్తోనన్నా చెప్పిచ్చుకుందావని నాన్న సైకిల్ తీసుకుని బయల్దేరా. నాన్న షాపుకెల్లేతప్పుడు చెల్లిని నడిపించుకుంటా తీసికెల్లి దింపుతానన్నాడు. “అమ్మాయ్, సైకిలు తొక్కుతావా, నీరసంగదా?” అన్నాడు నాన్న. “నాకు బానే ఉందిలే నానా” అని సైకిల్ కారేజ్ మీద పుస్తకాలు జారకుండా నొక్కిపెట్టి, ట్రయ్య్‌మని బెల్లు కొట్టి నవ్వుకుంటా పెడల్ తొక్కేశాను. కచేరీ సావిడి దెగ్గెర పేపర్లు చదివే జనాన్ని దాటేతప్పుడు అంజిగాడు చేరాడు వాడి సైకిల్ మీద.

“అమ్మాయ్ జోతీ, ఒకటడుగుతాను, నాకోసం కాదు. టెంత్ క్లాస్ రాజేషన్నయ్య కోసం” అన్నాడు.

“ఏంది మళ్ళీ, మా నానకి తెలవకుండా కొట్లోనుంచి రాజాఖైనీ పాకెట్ తెచ్చియ్యాలా? నీకని చెప్తే తేటల్లేదని టెంతన్నయ్య పేరు చెప్తన్నావా? రాజేషోళ్ళమ్మ మాకు చుట్టాలే తెలుసా, ఇట్లా అడిగాడని చెప్తే ఆయన్నయ్యకి, నీకు మొహం పగిలిపోద్ది తెలుసా?” అని గట్టిగా ఇచ్చుకున్నా. సైకిల్ స్లోగా తొక్కుతా గోడల మీద సినిమా పోస్టర్లు చూస్తన్నా.

అంజిగాడికి మండినట్టుంది. “ఏంటమ్మా, సినిమా పోస్టర్లా? ఆ తాట్టెంక మొహం ఫానా నువ్వు?” అనెక్కిరిచ్చి సీటు మీదనుంచి లేసి గాల్లో నుంచుని ఫాస్టుగా తొక్కుకుంటా యెల్లిపొయ్యాడు. “మీ హీరో గాడిక్కూడా సేం టూ యూ” అని గెట్టిగా అరిచాను.

మద్యానం లంచవర్లో అన్నం తినేసి పంపు దగ్గర బాక్సు కడుక్కుంటన్నా. పక్క పంపు దగ్గర మల్లేస్వరి ఎవర్తోనో డబ్బా కొట్టుకుంటంది ఎగ్జాం బాగా రాసినట్టు పెద్ద.

అంజిగాడొచ్చాడు “ఏందమ్మాయ్ జోతీ ఏడుస్తన్నావా? ఎవరం బాగా రాయలేదులే పేపరు, ఆ మల్లేస్వరి అంతే చెప్పుకుంటది. మీరిద్దరూ పలుక్కోటల్లేదంటగా, ఆ పిల్ల మంచిది కాదులే, బలే రుబాబు చేసిద్ది అబ్బాయిల మీద కూడా. నువ్వేడవమాక” అనేసి షర్టు జేబులోనించి ఒక కాఫీ బైట్ చాక్లెట్టు తీసిచ్చాడు.

“పొద్దున తిట్టినందుకు స్వారీ అబ్బాయ్” అన్నాను. “నేను కూడా సారీ, నీ పెళ్ళికి నా లారీ” అని నవ్వాడు. మళ్ళీ వాడే “పెద్దోళ్ళెవర్తో చెప్పమాక నేను ఖైనీ అడిగానని, ఒట్టెయ్యి” అని చెయ్యి చాపాడు. “ఏందమ్మో, పొట్టిపిల్ల ఒట్లేస్తంది” అనుకుంటా మల్లేస్వరి వాళ్ళు నాకు ఇనపడాలనే నవ్వుతన్నారు దూరంనించి.


సంక్రాత్రి సెలవలయ్యాక మొట్టామొదటి రోజే మేత్స్ ఆయన పేపర్లు ఊపుకుంటా వచ్చాడు. “యేవే జోతీ, సిలిండరోడు పేపర్లు తెస్తన్నాడే, ఒక్కొక్కళ్ళకీ గాసు లీకయిద్ది జూడు” అని నవ్వుతంది శివలక్ష్మి. దానికి మార్కులు బాగానే వస్తయ్యి, వాళ్ళ అమ్మోళ్ళు కూడా ఏవన్రు. నాకు మాత్రం ఒణుకొచ్చేసింది. మోకాలు ఊగిపోతంది, ఇటేపునుంచి రత్న గట్టిగా కాలుపట్టుకుని ఆపేసింది. “ఒసెయ్ శివలక్ష్మీ, నీ జోకులాపవే, మాకిక్కడ డోకులొస్తన్నయ్” అంది రత్న.

సారు పేపర్లిచ్చుకుంటా అరవైకి తగ్గినోళ్ళందరినీ చెయ్యి యెనక్కి తిప్పమని బాదిపడేస్తన్నాడు. సుదాకరుకైతే చర్మం లేచొచ్చేసింది. నా పేర్రాగానే లేచెళ్ళా. కళ్ళు తిరిగిపోతన్నయ్, పేపరు చేతికిచ్చాడు… 59… కర్ర పైకి లేసింది. “అమ్మా!” అని కేక పెట్టేశాను పెద్దగా. సారు ఉలిక్కిపడి బెత్తం వదిలేశాడు. “అంత భయమేంటమ్మాయ్, ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు, పో” అనేసి ఒంగుని బెత్తం తీసుకున్నాడు.

తర్వాత మల్లేస్వరి పేరే వచ్చింది. ఆరోజు ఆపిల్ల తిన్న దెబ్బలకి నేనైతే జన్మలో స్కూలు మొహం చూసేదాన్ని కాదేవో. లంచి టైంలో దాన్ని చూస్తే నాకూ ఏడుపొచ్చింది, ఎంతైనా సెవెంతు క్లాసులో నా బెష్టు ఫ్రెండు కదా. ఈ ఏడు శివలక్ష్మివాళ్ళు నాకు క్లోజైపోయారని, నా సీటు దాని పక్కనించి మారిపోయిందని దానికి ఒళ్ళుమంట. అన్నం కలుపుకు తినబోతే చెయ్యి మంట పుడతన్నట్టుంది. పాపంలే అనిపిచ్చి పలకరిచ్చబోయా, ఈలోపుల బారతి స్పూన్ తెచ్చిచ్చి మల్లేస్వరి పక్కన కూచ్చుని “ఈసారి మీ నానని పిల్చుకురావే, మరీ అట్టా కొడతాడా ఆడపిల్లల్ని కూడా” అనేదో మాట్టాడిస్తా ఉంది. ఇక నాకెందుకులే అని క్లాసులోకి యెల్లిపోయా. వాళ్ళు గ్రౌండులో చెట్ల కింద చాలాసేపు మాట్టాడుకున్నారు.

సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు అంజి, నేనూ పక్కపక్కనే సైకిల్ తొక్కుతా యెల్తన్నాం. పెద్దొంతెన దాటేటప్పుడు ఒక చెయ్యి హాండిలొదిలేసి చొక్కాకేసి రుద్దుకుంటా ఉన్నాడు. “అబ్బాయ్, బాగా నొప్పుడ్తందా” అన్నాను. “ఈ కొత్త సారొచ్చాక అలవాటైపోయిందిలే. కాపోతే మల్లీస్పరికి దూల తీరింది చూడు, ఎగ్జాం రోజు ఎంత స్టైలు దొబ్బిందీ నీ దగ్గర” అని ఎగదోస్తన్నాడు. “అంజోడా, అది గానీ ఆళ్ళ నానని తీసుకొచ్చిందంటే ఉంటది చూడు సార్‌కి, ఏవనుకుంటన్నావో…”

“నేనొస్తాలే, నువ్వెళ్ళు జోతీ” అని వాడు మూలమీద బడ్డీకొట్టు దగ్గర ఆగిపొయ్యాడు.


మల్లేస్వరి వరసగా నాల్రోజులు స్కూలుకి రాపొయ్యేసరికి సారు కొట్టిన దెబ్బలకే అనుకున్నారు అబ్బాయిలంతా. అమ్మాయిలం మాత్రం తలా రెండ్రూపాయిలు యేసుకుని ఒక చిన్న గిఫ్టు కొన్నాం. పదకొండోరోజు మద్యానం పర్మిషనడిగి లంచి టైమ్లో యెల్లి గిఫ్టిచ్చి ఫోటో కూడా దిగాం. మల్లేస్వరి చీర కట్టుకుని కుర్చీలో కూచుంటే మా చిన్నప్పుడూ వాళ్ళ అమ్మ ఉన్నట్టే కనపడింది. తలనిండా కనకాంబరం పూలు పెట్టారు. నన్ను చూసి నవ్వింది “జోతీ, తినకుండా యెల్లమాకండి ఎవరూ” అంది. వాళ్లన్నయ్య ఎప్పుళ్ళాగా ఫోజు దొబ్బకుండా మాతో మంచిగా మాట్టాడి బోజనాల దెగ్గెరకి తీసికెళ్ళాడు. శివలక్ష్మికైతే రెండోసారి కూడా జాంగ్రీ తెచ్చిపెట్టాడు.


శివరాత్రి పండగ కాణ్ణించీ అమ్మకి ఒంట్లో బాగోటల్లేదు. గొంతు దగ్గర కొద్దిగా వాసింది. మాటకూడా చిన్నగా వస్తంది. నాల్రోజుల్నించి షాపుక్కూడా యెల్లట్లేదు. నాన్నే బట్టలుతికి అంట్లు కూడా తోముతున్నాడు. నిన్నరాత్రి నాన్నకి షాపులో లేటైపోతే చెల్లి, నేను కలిసి అంట్లు తోమేశాం. అమ్మేవో సరిగ్గా ఎంగిలి పోలేదంది.

రేపు ఆదివారం బందరు పిక్నిక్కి తీసికెల్తాం అన్నారు స్కూల్లో. నేనొస్తానో రానో తెలియదని చెప్పాను. ఇవ్వాళ సాయంత్రం అమ్మకి చిన్న ఆపరేషన్ చెయ్యాలన్నారంట. తర్వాత నాలుగు రోజులు రెస్టు తీసుకోవాలంట. అమ్మా నాన్నా ఇద్దరూ దిగులుపడతా ఉన్నారు. హాస్పటల్లో డబ్బులు కట్టాలి, ఈమద్య అమ్మని చూసుకోటాకని నాన్న ఎక్కువసేపు షాపు మూసేసే ఉంచుతున్నాడు, బేరాలన్నీ పక్క షాపులకి పోతన్నయ్యి. పిక్నిక్ సంగతి చెప్పటాకి నాకు నోర్రాలేదు.


చీకటి పడిపొయ్యింది. చెల్లి, నేను వాకిట్లో కూచ్చుని చూస్తా ఉన్నాం. నేను అన్నం కూడా వండా, కాపోతే కొంచం అడుగంటింది. కూరేం లేదు కదా ఆమ్లెట్టేసుకుందామా అంది చెల్లి. ఇంట్లో ఒక్కటే గుడ్డు ఉంది. ఉల్లిపాయలు ఎక్కువ కోసిపెడతావా, అందరికి సరిపొయ్యేలాగా పెద్ద ఆమ్లెట్టేస్తాను అన్నాను. నాకు కత్తిపీటంటే బయం అంది. నాక్కోపవొచ్చింది, నా ఫ్రెండ్సిచ్చిన గ్రీటింగ్ కార్డుల్లో నా పేరు కొట్టేసి దాని పేరు రాసుకోడం చూశా పొద్దున. అమ్మకి బాగోనప్పుడు గొడవ చెయ్యటవెందుకులే అని ఊరుకున్నా.

దాన్ని బాగా ఇసుక్కొని నేనే పని చేసుకున్నా. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు కూడా రేపు ఎట్టొకట్టా రావే అన్నారు ఫ్రెండ్సందరూ. అందరూ ఇళ్ళల్లో చెప్పి ఏదో ఒకటి ఒండిచ్చుకుని తీసుకొస్తామన్నారు, నేనేం తేలేను గదా, మా అమ్మకి బాగోలేదు అని నాకు బాదగా ఉంది. పక్కింటి సుశీలమ్మమ్మ పలకరిచ్చింది “అమ్మోళ్ళింకా రాలేదా” అని. “బయమేస్తంది మామ్మా” అంది చెల్లి. అమ్మమ్మొచ్చి మా పక్కన కూచ్చుంది. కొంచం సేపుట్లో అమ్మా నాన్నా వచ్చారు.

అమ్మకి గొంతు మీద ఏదో బాండేజీ లాగా ఉంది. మజ్జిగన్నం మెల్లిగా తింది. నాన్నా మేవూ అన్నాలు తింటన్నాం. సుశీలమ్మమ్మ మళ్ళా వచ్చి పెద్ద స్టీల్ కాన్‌లో పాలిచ్చి యెల్లింది. నాన్న ఆ పాలన్నీ పొయ్యిమీద పెట్టి కాస్తన్నాడు. “ఇప్పుడెందుకు నానా” అనడిగాను. తోడు పెడదావమ్మాయ్, రేప్పొద్దున పిక్నిక్‌లో అందరికీ పెరుగు తీసుకెల్దువు, అమ్మ పంపిచ్చమంది అన్నాడు. చెల్లి పరిగెత్తుకుంటా పక్కసందులో మా ఫ్రెండోళ్ళింటికి యెల్లింది, “మా అక్క పిక్నిక్కి వచ్చిద్ది రేప్పొద్దున” అని చెప్పటానికి. నాకైతే ఇంక నిద్ర పట్టలేదు, తెల్లారిపొయ్యిందేమో అని పద్దాకా కదుల్తానే ఉన్నా.


బస్‌లో అంత్యాక్షరి ఆడతన్నాం. మాత్స్ సార్ బాయ్స్‌తో పాటు సైన్సు మిస్ గరల్స్‌తో పాటు చేరారు. ఆళ్ళిద్దరూ పిల్లల్తో అంత సర్దాగా ఉంటారని మేవెప్పుడూ అనుకోలా. అమ్మాయిలవే గెలుస్తా ఉన్నాం. మాత్స్ సార్‌కి సినిమా పాటలు తెలవ్వనుకుంటా. నిర్మలా మిస్ మాత్రం పాతయ్యీ, కొత్తయ్యీ అన్నీ బలే అందిస్తా ఉంది మాకు. “వరాప్రదం… శ్రీ… వాతాపి…” అని వాళ్ళకిచ్చేసింది మిస్. ‘ప’తో పాటలన్నీ అయిపోయినయ్యి అప్పుడికే. అబ్బాయిలు బిక్క మొహాలేసుకు చూస్తన్నారు. ప్రకాషు కొంచం సిగ్గుపడతా అంజిగాడి చెవిలో ఏదో చెప్పాడు. ఇంక వాడు రెచ్చిపోయి “పాలకొల్లు పాపా నీ పైట జారు వేళా…” అని అందుకున్నాడు. అబ్బాయిలంతా గోలగోలగా అరిచారు. నిర్మలా మిస్సేమో “ఇక చాల్లే, ఆటాపేసి ఈనాడు పజిల్ చేసుకుందాం రండి” అంది అమ్మాయిల్ని.

ఎండగా ఉన్నా బీచ్‌లో బాగా ఆడుకున్నాం. బట్టల్నిండా ఇసక, ఉప్పునీళ్ళు. బస్ ఎనకమాల ఒకళ్ళకొకళ్ళం అడ్డం నించుని బట్టలు మార్చుకున్నాం. మల్లేస్వరి మారుజత తెచ్చుకోలేదు. పంజాబీ డ్రెస్ మీద చున్నీ తీసేసి తడి ఆరబెట్టుకుంటంది. అది మా అందరికంటే కొంచం లావుగా ఉంటది. అంజిగాడొచ్చి, “ఏంటమ్మాయ్, ఆ చమ్కీల డ్రెస్సులేసుకొని తిప్పుకుంటా తిరుగుతున్నావ్, శివరాత్రి ప్రభ బళ్ళ మీద డాన్సులేసే వోళ్లలాగా…” అనీ దూల మాటలు కూస్తన్నాడు. నాకు మండుకొచ్చింది. “అంజిగా, అదిగానీ గుద్దిందంటే గుద్దుకి చస్తావ్” అని దాన్నిటేపుకి లాక్కొచ్చాను.


బీచ్ దెగ్గెర్నించి బస్సెక్కి మళ్ళీ షాలోం చర్చితోటలో బోజనానికి దిగాం. అందరం తెచ్చుకున్నయ్యన్నీ అక్కడ పెట్టుకుని, మట్టినేల మీద చున్నీలు, దుప్పట్లు యేసుకుని కూచ్చున్నాం. పద్మ వాళ్లమ్మ బంగాళదుంప వేపుడు చేసి పంపిచ్చింది. రాజేషు పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో వడియాలు తెచ్చాడు. అమ్మకి నీరసం తగ్గిపొయ్యాక వడియాలేపమని అడగాలి. అమ్మ గుర్తొచ్చి దిగులేసింది. పొద్దున నేను బస్సేక్కేసరికి లేవలేదు. జడేసుకోటం చేతగాక పోనీ టెయిల్ కట్టుకున్నా. “క్లిప్పు బలే స్టయిల్గా ఉంది జ్యోతీ” అంది నిర్మలా మిస్. నేనేం వండిచ్చుకుని రాలేదే అని కొంచంసేపు సైలెంటయిపోయా. నన్ను చూసి మల్లేస్వరి, శివలక్ష్మీ వాళ్ళు దెగ్గెరికొచ్చి “నువ్వు తెచ్చిన పెరుగు బాగా మీగడ కట్టింది, సారు కూడా బాగుందన్నారు” అని చెప్పారు. మల్లేస్వరి చాలసేపు నా పక్కనే కూచ్చుని “ఆంటీకి తగ్గిపోయిద్దిలే, ఏవన్నా కావలంటే చెప్పు, నేను మీ ఇంటికొచ్చి హెల్ప్ చేస్తా” అంది. నాకు చాలా ఏడుపొచ్చింది. నా చెయ్యి పట్టుకుని మల్లేస్వరి కూడా ఏడ్చింది.


ఇంటికొచ్చేసరికి వాకిట్లో కళ్ళాపి జల్లి సందెకర్ర ముగ్గేసి ఉంది. చెల్లి నిద్రపోకుండా నాకోసం ఎదురు చూస్తా ఉంది. బీచ్‌లో ఏరుకొచ్చిన శంకం గవ్వలు దానికిచ్చాను. “అక్కాయ్, ఊర్నుంచి రాధ పిన్నొచ్చింది. అమ్మకి తగ్గేదాక ఉండిద్దంట, బంగాళాదుంప వేపుడు కూడా చేసింది” అని నవ్వుకుంటా చెప్పింది. “పిన్నీ” అని అరుస్తా లోపలికి పరిగెత్తాను.