నిన్ను నాకు ఎలా వ్రాసుకున్నా సరే
నన్ను నీకు వ్రాసిచ్చి తిరిగి
అప్పచెప్పుకోవల్సిందేనని అర్థమైంది.
వ్రాసినది గుర్తించలేదనే బాధను
బాధ్యతగా భరించే ఓర్పుకు
నీ ఓదార్పుతో తృప్తి పడటం తప్పేది కాదేమో!
గుట్టుగా ఇష్టాల్ని ఖర్చు పెట్టే తీరులో
తీపి ఊపిరులే మనసు ముద్రలుగా
మౌనముద్రికలా ప్రేమకు సాక్ష్యంగా
ఎన్నో రాత్రుల సెగకు చిట్లిన నిద్ర పగుళ్ళలో
మొలిచిన లేఖలు రాత్రులల్లో తేలియాడి
ఉదయాన్నే హృదయానికి అంటుకుని
వేడి చినుకులుగా ఊహలు రాలుతూ
తేనె కెరటాల తీపి తేమకు
తడిసి ముద్దయిన నీపై ఇష్టం మాత్రం
ఆకాశమంతా రెక్కలు కళ్ళాపి చల్లి
ముద్దు కూతల ముగ్గులో
వాలిన ప్రతి చోట పండిన సంతోషాన్ని
పచ్చి నవ్వులని, పలుకు పూతలని
నోట కరుచుకుని నీ భుజాన వాలి
నీ కొంగుతో రోజూ కబుర్లే…
రాశులుగా పోసిన పాత రోజుల్లో
చేతికందిన పూటలో
చూపు కందిన దృశ్యాలను
తలగడ పక్కగా ఉంచుకుని
చెక్కిన నిద్రలో పెదవి అంచున
కల అంటుకు పిలకలేసిన పిచ్చి మాటలో
అరిగిపోయిన అర్థాలు మనసును ఊపుతుంటే
సమయం చల్లగా జరిగి జారి పోతుంటే
పట్టు దప్పి కాలం పగలా మారింది
గాయపడ్డ పగలు రాత్రిని పోలింది.
కోట్ల క్షణాల పెట్టుబడి
ఒక్క క్షణం లాభాన్ని ఆశిస్తూ
బతుకు గర్భం దాల్చిన రహస్యం చుట్టూ
కాపలా కాస్తూ
ఆనాటి పరిచయంలో రంగులని
ఈనాటి దగ్గరితనంలో కాంతులని
కలబోసిన ఆనందాన్ని అక్షరాలతో
అలంకరించి చదువుకున్నప్పుడు
ఎదన ఏదో అలికిడికి
కళ్ళలో నవ్వులు పూసి
వెలుగు వాటేసుకుని మాట్లాడినట్లు
చల్లని గాలి కట్లు విప్పిమని కసిరినట్లు
నా ముఖాన్ని నేను నమ్మనట్లుగా నిన్ను
తోడుగా లోపలంతా కలియతిరిగితే
అద్దం అవసరం లేని అండ
నీడతో పోటి పడి ఆసరా
నీలో దగ్గరిలో దగ్గరగా చూసి పొంగిన
అమాయకత్వానికి ఇప్పుడే తెలిసింది.
మనసు నమ్మకాన్ని పాటించే నిజాల్లో
మౌనం ఓ మూగ సంపదని
మనసు మనసును మోసే ప్రతి నిమిషంలో
ప్రేమది జీవం రహస్యమని
వయసు మనసును బంధించినా
మనసు వయసుని భరించినా
లోపలి నిజం బయట నటనగా జీవించినా
మనసు. నిజం. నమ్మకం. ప్రేమ.
నాలుగు స్తంభాలపై
కాలం ఎంత బరువును మోపినా
ఆ ఒక్క మనసే, ఆ ఒక్క బంధమే
నిజరూపంలో హద్దులన్నిటిని దాటి
ఊపిరి చివరి అడుగు దాకా తోడు వస్తూనే ఉంటుందని.