[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]
4. డెత్ బై వాటర్
మూడవ కవితాభాగం అగ్ని (The Fire Sermon) తరువాత యీ నాలుగవది అప్పు. ‘అగ్నేరాపః’ (నిప్పునుండి నీరు) అని తైత్తిరీయోపనిషత్తు. ఎలియట్ అన్ని భూతాలలోనూ (elements) మృత్యువును దర్శిస్తాడు. ఒకదానిలో ఖననం (Burial of the Dead), మరొకదానిలో దహనం (burning). ఇక్కడ జలగండం (A current under sea/ Picked his bones). ఎలియట్ మృత్యువులో సత్యదర్శనం చేస్తాడు. (మృత్యువును మించి అమరణాన్ని బోధించగల గురువు ఎవరు? కఠోపనిషత్తులో మృత్యువే గురువు కదా?)
వేస్ట్ లాండ్‌లో అన్నిటికంటే పెద్ద అంకం ది ఫైర్ సెర్మన్. అన్నిటికంటె చిన్నది ఈ డెత్ బై వాటర్ (10 పాదాలు). చిన్నది కావడం వల్ల కావచ్చు, చెక్కిన పద్యంలా చిక్కగా కనిపిస్తుంది. ఇందులో స్వరం గంభీరంగా, బైబిల్ ప్రవచనంలా ఉంటుంది (O you who turn the wheel).
Phlebas the Phoenician, a fortnight dead,
Forgot the cry of gulls, and the deep sea swell
And the profit and loss.
A current under sea
Picked his bones in whispers. As he rose and fell
He passed the stages of his age and youth
Entering the whirlpool.
Gentile or Jew
O you who turn the wheel and look to windward,
Consider Phlebas, who was once handsome and tall as you.
వేస్ట్ లాండ్‌లో ప్రతి పదము మొత్తం కావ్యానికి కేంద్రబిందువే. సాలెపురుగు తన బొడ్డులో నుండి దారం లాగి గూడు కట్టినట్టే, ప్రతి పదము కావ్యాన్ని తన నడిబొడ్డుకు దారమేసి లాగి పట్టుకొంటుంది. అంటే యీ కావ్యంలో, కేంద్రస్థానమంటూ లేదు. కావ్యమంతటా కేంద్రం తిరుగుతుంటుంది. పదంలాగే యిందులోని పాత్రలు. ఒక్కొక్క పాత్ర నామరూపాలు మార్చుకొంటూ కావ్యంలో చివరి అంకం వరకు కనిపిస్తూనే ఉంటారు. ఇందులోని ఫీనీషియన్ ఫ్లీబస్, వెనుక మేడమ్ సొసోస్త్రిస్ చెప్పిన యిద్దరు పాత్రలు కలిసిన పాత్ర – ఫీనీషియన్ నావికుడు (the drowned Phoenician Sailor), ఒంటికంటి వ్యాపారి (the one-eyed merchant). ఇతడే ది ఫైర్ సెర్మన్‌లో యూజినీడిస్, ఎండుపండ్ల (currants) సముద్రవ్యాపారి. ఇతడే తరువాత నేపుల్స్ రాకుమారుడిగా కనిపిస్తాడు. (షేక్స్‌పియర్ నాటకం టెంపెస్ట్‌లో ఫెర్డినాండ్.) ఒకే నదీజలాలు ఒక్కొక ప్రాంతంలో యితరనదులను కలుపుకొని పేరుమార్చుకొని అలకనందగా మందాకినిగా, తుంగభద్రగా కృష్ణగా ప్రవహించినట్టు, వేస్ట్ లాండ్‌లో పాత్రలు సన్నివేశాలు పదాలు కూడా ఒకదానినొకటి కలుపుకొని సమష్టిగా సాగుతాయి.
మేడమ్ సొసోస్త్రిస్ జోస్యపు కార్డులలో ఒకటి ఫీనీషియన్ నావికుడు. అతడికి జలగండం ఉందని ఆమె జోస్యం చెప్పింది. (Here is your card, the drowned Phoenician Sailor). అతడే యిక్కడి ఫ్లీబస్ (Phlebas the Phoenician). అప్పుడు ఆమె జోస్యాన్ని తేలికగా కొట్టేశాం. ఆమె అంత తెలియనిదేమీ కాదు. ఆమె జోస్యం నిజమైంది కదా! ఇక్కడ ఫ్లీబస్, యూజినీడిస్‌గా మారిపోయాడు. ఇతడి వ్యాపారం ఎండబెట్టిన పండ్లు కొనడం అమ్మడం కావచ్చు. అతడు జేబులో ఎండబెట్టిన పండ్లు పోసుకుని తిరుగుతుంటాడు. ఫ్లీబస్ ఏం వ్యాపారం చేసేవాడో తెలియదు కాని, వ్యాపారమైతే చేసేవాడు (profit and loss). వ్యాపారసంబంధంగా సముద్రప్రయాణాలు చేస్తుంటాడు. ఒక నౌకాప్రమాదంలో సముద్రంలో మునిగి చనిపోయాడు (a fortnight dead). చనిపోయి పదిహేను రోజులు కావచ్చు, పదిహేను వందల సంవత్సరాలు కావచ్చు. అతడు ఫీనీషియన్ నావికుడు. ఈ కాలం వాడు కాదు. కాలాలను కలిపి కుట్టడం ఎలియట్ శిల్పంలో భాగమే. (Time present and time past/ Are both perhaps present in time future – Four Quartets.) ఫ్లీబస్ కూడా ఒకప్పుడు ‘నీలాగా అందగాడు ఆజానుబాహువు’ (who was once handsome and tall as you). ఇప్పుడు సముద్రగర్భంలో ప్రవాహాలు (deep sea swell) అతడి ఎముకలు ఏరి, చీకి శుభ్రం చేస్తున్నాయి. (యూజినీడిస్ currants జేబులో వేసుకొని తింటూ తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు ఫ్లీబస్‌ను currents తినేస్తున్నాయి. తింటున్న ఆ లోపలి అలల చప్పుడు (whispers) కూడా వివిపిస్తుంది మనకు. ఇప్పుడు ఫ్లీబస్‌కు తనను పీక్కుతినే సముద్రపక్షుల అరుపులు వినపడవు. లాభనష్టాల లెక్కల చింత లేదు. సముద్రంలోని అలలలో ఫ్లీబస్ శవం పడుతూ లేస్తూ ఉన్నది (fell and rose), బతికి ఉండగా అతని వ్యాపారంలో లాభనష్టాల లాగా, జీవితంలోని ఆటుపోటుల లాగా. బతికి ఉండగా యీ ఆటుపోటుల గురించి ఆలోచించరు మనుషులు, లాభనష్టాల ఆలోచనలే చేస్తారు.
అదే కాక – He passed the stages of his age and youth/Entering the whirlpool – అంటే, మృత్యువు ముఖాముఖి నిలబడిన క్షణంలో (Entering the whirlpool), గడిచిన జీవితమంతా, దాని ఒడిదుడుకులతో (the stages of his age and youth) ఒక్కసారి మెరుపులా స్మృతి గోచరం అవుతుంది.
Gentile or Jew
O you who turn the wheel and look to windward,
Consider Phlebas, who was once handsome and tall as you.
నీవు యూదు అయినా, జెంటైల్ అయినా (యూదుకాని వారందరూ జెంటైల్‌లు), ఏ జాతివాడివైనా, ఏ ధర్మమైనా, అందగాడివైనా ఆజానుబాహువైనా, ఎంత సమర్థుడవైనా, చక్రం తిప్పగలిగినవాడవైనా (who turn the wheel), మృత్యువు నిన్ను వదలదు. బతికినంతకాలం లాభనష్టాల చింత. ఈ చింత వదలడానికి ప్రాణం వదిలే వరకూ ఆగాలా? బతికి ఉండగా నిశ్చింతగా ఉండలేవా? నీదనుకున్నదేదీ నీ వెంట రాదన్న ఆలోచన ప్రాణం పోయిన తరువాత కాదు, బతికుండగా కదా రావలె? తరుముకొస్తున్న మృత్యువు అనే సుడిగుండంలో చిక్కుకొనే వరకు చింత.
మృత్యువు దురతిక్రమము, నీ ఎత్తు నీ సొత్తు, ఏదీ నీ అక్కరకు రాదు, నిన్ను కాపాడలేదు, అన్న గొప్ప గుణపాఠం చెప్పదలచినట్టుంటుంది యీ పద్యం. మృత్యువుతో సర్వము ముగిసిపోతుంది. పునరుత్థానం క్రీస్తుకు. నీకూ నాకూ పునరుజ్జీవనం జీవించి ఉండగానే సాధ్యం, మృత్యువులో కాదు.
మృత్యుసాగరానికి సంతుష్టి లేదు. (షేక్‌స్పియర్ నాటకం ది టెంపెస్ట్‌లో ఏరియల్ అంటాడు: the never-surfeited sea.) వేల సంవత్సరాలనాటి ఫీనీషియన్, మధ్యయుగం నాటి నావికుడు, యీనాటి (fortnight dead) సముద్రవ్యాపారి, అందరినీ కబళిస్తూనే ఉంటుంది సముద్రం. ఒక్కొక శవము ఒక్కొక సంస్కృతికి, ఒక్కొక మహాసామ్రాజ్యానికి చిహ్నం. వేస్ట్ లాండ్‌లో చివరి అంకం వాట్ ది థండర్ సెడ్‌లో (What the Thunder Said) యీ కాలసముద్రంలో కలిసిపోయిన సంస్కృతులు, ఆ సంస్కృతుల మైలురాళ్ళుగా మిగిలిపోయిన నగరాలు కనిపిస్తాయి.
Jerusalem Athens Alexandria
Vienna London
Unreal
ఇవి టూరిస్ట్ గైడ్‌లో పేర్లు కావు, కాలసాగరంలో కలిసిపోయిన సంస్కృతులు. డెత్ బై వాటర్ ఒక వ్యక్తి జలగండం గురించి కాదు. నగరనామమాత్రంగా మిగిలిన సంస్కృతుల మైలురాళ్ళను చెబుతున్నది. అవును, లండన్ కూడా చరిత్రలో కలిసిపోయింది, Unreal. (I had not thought death had undone so many.)
ఇంత వరకు యీ వేస్ట్ లాండ్ వరుస వ్యాసాలలో, ఎజ్రా పౌండ్ దీనినుండి కత్తిరించిన భాగాలు చర్చకు రాలేదు. ఇక్కడ దాని చర్చ, యీ అంకం వరకు, కొంత సంగ్రహంగా చేద్దాం. ఆ చర్చకు ఒక ప్రయోజనం ఉంది.
ఎలియట్ తండ్రి, తన కుటుంబసభ్యులు సెలవులు గడపడానికి గ్లోస్టర్, మేసచూసెట్స్‌లో ఒక యిల్లు కొన్నాడు. ఎలియట్ బాల్యంలో వేసవి సెలవులు అక్కడ గడిపేవాడు. అది సముద్రతీరం. ఎలియట్ ఫోర్ క్వార్టెట్స్‌లో ‘ద డ్రై సాల్వేజెశ్ అనే సముద్రశిలలు యిక్కడివే. డెత్ బై వాటర్ మొదటి ప్రతి ఒక విషాదాంతసముద్రయానంతో మొదలవుతుంది. ఆ విషాదవృత్తాంతం ఏమిటి? ఆ ప్రారంభభాగాన్ని పౌండ్ కత్తిరించేశాడు. ఎలియట్ కాదనలేదు. పౌండ్ కత్తెరపై ఎలియట్‌కు అంత నమ్మకం. సాధారణంగా స్కూలుపిల్లాడు కూడా తన రాతలపై టీచరు కోతలు, ఎర్రసిరా గీతలు సహించడు. ఇది వేరే కథ.
ఎలియట్ తన మొదటి కవితా సంకలనాన్ని (Prufrock and other observations) మరణించిన తన ఆత్మీయమిత్రుడికి అంకితమిచ్చాడు. ఆ అంకితం వెనుక విషాదం తెలుసుకోడం వేస్ట్ లాండ్ అర్థం చేసుకోవడానికి అవసరం కాదు కాని, కావ్యతత్త్వాన్ని కవిత్వరచనను అర్థం చేసుకోడానికి ఉపకరిస్తుంది.
ఎలియట్ హార్వర్డ్ చదువు ముగిసిన తరువాత, సోర్బోన్‌లో చదవడానికి పారిస్ వెళ్ళాడు. అప్పుడు ఎలియట్‌కు యిరవై ఏళ్ళు. అక్కడ ఒక యువకుడు అతడికి మిత్రుడైనాడు. అతడు, జాఁ వెర్దనాల్ (Jean Verdenal), కవిత్వం కూడా రాసేవాడు. ఇద్దరూ ఒకే భోజనవసతిగృహంలో ఉండేవారు. స్నేహంలో చాలా దగ్గరైనారు. ప్రపంచయుద్ధ సమయంలో వెర్దనాల్ చనిపోయాడు (1915). ఆ మిత్రుని మరణం ఎలియట్‌ను చాలా తీవ్రంగా కలచివేసింది. ఆ దుఃఖం నుండి మనసు మళ్ళించడం కొరకు, వివియన్‌ను వివాహం చేసుకొన్నాడు. కాని ఆమెను గురించిన వదంతుల వలన ఎలియట్‌కు ఆ వివాహం పట్ల వైముఖ్యం కలిగింది. ఉత్సాహం లేని వివాహము, యిష్టం లేని ఉద్యోగము అతనిని మానసికంగా కుంగదీశాయి. పెళ్ళి అయిన ఆరునెలలకే, వివియన్‌ను బెర్ట్రండ్ రసెల్‌తో విహారయాత్రకు పంపించేశాడు. (వివాహవిషయాలలో రసెల్ విశేషజ్ఞుడు కదా!) బీచ్ విహారయాత్ర తరువాత వివియన్ మానసిక ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి ఆమె తిరిగి వచ్చింది. ఎలియట్ మానసికస్థితి కూడా వైద్యం అవసరమయేంతగా దెబ్బ తిన్నది. ఉద్యోగం చేయలేక వదిలేసి, వైద్యం కొరకు స్విజర్లండ్‌లో లాసోన్‌కు వెళ్ళాడు. ఆ స్థితిలో రాశాడు వేస్ట్ లాండ్.
ఇక్కడ గమనించవలసింది ఏమంటే, డెత్ బై వాటర్‌ను ఎలియట్ తన మిత్రుడి మరణంతో కలిగిన శోకంలో, తన వివాహవైఫల్యంలో మొదలుపెట్టాడు. ఆ ప్రారంభభాగాన్ని పౌండ్ కత్తిరించేశాడు. ఎలియట్ వద్దనలేదు. ఏమిటి దీని అర్థం పరమార్థం? కవి లేకుండా, కవి కష్టసుఖాలు, కవి జీవితంలో విషాదము, కవి అనుభూతి లేకుండా, కవిత్వం లేదు. కాని, కవి తనలోని బాధను అనుభూతిని లోకంలో చూడగలగాలి. చూచి, లోకంలో చూచినదానిని వ్యక్తం చేయవలె. దీనినే, ఎలియట్ objective correlative అన్నాడు. ఎలియట్ తన నిరీహ, నిస్పృహ, తన వైక్లబ్యము మానసికక్లైబ్యము, సమాజంలో చూచాడు. తనలోని మరుభూమిని బయట సమాజంలో చూచి, దానికి కావ్యరూపం యిచ్చాడు. కనుక, వేస్ట్ లాండ్‌లో సమాజం తన ముఖం చూచుకున్నది. తమ నిరాశ నిస్పృహ జడత్వం ఎలియట్ కావ్యంలో వ్యక్తం చేశాడు అనుకొన్నారు చదివినవారు. కావ్యంలో ఎలియట్ లేడు. అతని విషాదం లేదు. మరణించిన అతని ప్రియమిత్రుడు, మిత్రుడిగా లేడు. అతడు అనేక నామరూపాలలో, అత్యంత ప్రాచీన కాలాలనుండి అధునాతన సంస్కృతుల వరకు, గతించిన సంస్కృతుల గుర్తుగా మిగిలి అంతటా వ్యాపించి కనిపిస్తాడు. తన మిత్రుని అవశేషాలను అన్ని నదులలో సముద్రాలలో అన్ని అనాది సంస్కృతులలో ఆధునిక సామ్రాజ్యాలలో కలిపేశాడు. వ్యక్తిగా ఎలియట్ లేడు, తన మిత్రుడూ లేడు. తన కావ్యం నిలిచి ఉంది.
(సశేషం)