తెరచాటు-వులు: 11. జాటర్ డమాల్! (అంటే అర్థం లేదు అని అర్థం)

దేశ కాలమాన పరిస్థితులు, సాంఘిక/రాజకీయ అనిశ్చితి, యుద్ధాలు, కుల/మత సమీకరణలు, వాతావరణం, పండగలు-పబ్బాలు, సహజాత సినిమాల ప్రభావం, నటీనటుల నోటి దూలలు, విడుదల వెతలు, వివాదాల వెల్లువలు, అతి సున్నిత మనస్క వర్గాల/తెగల అకారణ ప్రతీకార చర్యలు/దాడులు– ఇవన్నీ ఒక వైపు;

కథనం, హాస్యం, కితకితల మాటలు, గిలిగింతల గీతాలు, స్టెప్పులు, సంగీతం, హీరో ఇరగతీత, హీరోయిన్ ఆరబోత, కదిలించే– ఒళ్ళు, కాళ్ళు, కళ్ళు, మనసులు-దృశ్యాలు, ఇంతకు మునుపు తెర మీద కనని వింతలు-విశేషాలు, తారల అప్పటి తారాబలం, నిర్మాత తలరాత– ఇవన్నీ మరోవైపు.

ఒక సినిమా బతికి బట్టకట్టి, ప్రేక్షకులని చేరి, వారి దూషణ-భూషణలు, సత్కార-ఛీత్కారాలు, ఆదరణ-తిరస్కరణలు మున్నగు ద్వంద్వ సమాసాలకు గురికావడానికి పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క పనికిమాలిన, అసంబంధిత కారణమైనా చాలు. ఇదే సినీ వైకుంఠపాళి. విషయమేమిటంటే ఈ ఆటలో ఆ పై పట్టికలో ఏది నిచ్చెనగా మారి పైకి ఎగదోస్తుందో ఏది పాముగా మారి పడదోస్తుందో తెలియని విచిత్ర పరిస్థితి.

ఒక దేశంలో ఈ మధ్య వెల్లువెత్తుతున్న లైంగిక వేధింపుల ఆరోపణల కారణలతో, తత్సంబంధిత (తెర– ముందు, వెనక) కార్యవర్గీయుల సినిమాలు విడుదల కాకుండా నిలిపి వేయబడడమూ; మరో ప్రాంతంలో గవర్నమెంటు వారి పథకాలకు చురక వేసిన కారణాన మాములూగా పోవల్సిన సినిమా రాజకీయ వివాదం/ప్రచారం మూలంగా కళ్ళు బైర్లు కమ్మే వ్యాపారం చేయడమూ; అస్మదీయలు అధికారంలో ఉంటే భూతద్దంతో వెతికి కనిపించని కారణాలకి పన్ను రాయితీలు ప్రకటించి నిర్మాతలను ఒడ్డున పడవేయడమూ; ఇవన్నీ చూస్తుంటే ఒక సినిమా బతికి బట్టకట్టడానికి పెట్టిపుట్టడానికి (లేదా పురిటిలోనే పోవడానికి) సినిమాయేతర, అతీంద్రియ, రాజ్యాంగేతర ప్రభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది అసలు సమస్య. కనిపించని ఏ కిరాతుడి బారిన పడి ఎప్పుడు ఎందుకు ఎక్కడ విలవిలడుతుందో, తెలియని ఏ రాతో ఊతో గీతో ఎందుకో ఎగదోసి అనుకున్న అంచనాలను మించిపోయేట్టుగా చేస్తుందో ఎవ్వరూ చెప్పలేని అనిశ్చితి. దీనికి సినీ పండితులు పెట్టిన ముద్దు పేరే ‘పల్స్’! ప్రేక్షకుల నాడిని సరిగ్గా పట్టుకోగలిగితే వరమాల మెడలో పడటం తథ్యం అన్నది వారి ఊహ. సినిమాకి సంబంధించినంత వరకూ థియరీలు ఉండవు. అన్నీ సత్యాలే. ఈ సూత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నయో, అదే సూత్రం కారణంతో ఊష్ఠం కొట్టుకుని పోవడానికి అన్నే వెక్కిరింతలు నిలువుటద్దాలలా నిలుస్తాయి. సినిమాని సూత్రీకరించాలంటే అందుకు అన్వయించగలిగే సిద్ధాంతం ఒకటే, అదే అనిశ్చితి నియమం (Uncertainty Principle). చిత్రీకరించాలంటే పెదవి విరుపే తగిన రూపు. ఈనాడు ఆహో ఒహో అని శ్లాఘించబడి వేనోళ్ళ కీర్తించబడుతున్న శంకరాభరణం సినిమా విడుదల సందర్భంలో ఎన్ని బాలారిష్టాలు దాటుకుని బయటపడి గుక్కతిప్పుకుందో తెలిస్తే, అసలు ఎవరికి ఏమి కావాలన్న దాని మీద కించిత్తు కూడా అవగాహన ఉన్నట్టు తోచదు. ఈ సందర్భంలో ఏళ్ళ క్రితం VIP లోదుస్తులవారి వాణిజ్య ప్రకటన tag line గుర్తు చేసుకోవడం ఉచితం– What’s he got that I ain’t got? ఆడిన సినిమాలో ఉన్నది ఏమిటి, చతికిలపడిన దానిలో లేనిది ఏమిటి? ఏమిటి ఆ బ్రహ్మ పదార్థం?

రాజు గారి కొత్త బట్టలు

సినిమా అంటేనే ఒక లాటరీ (తీసే వారి దృష్టి నించి) అన్న స్థితికి వచ్చిన పరిస్థితులు ఏమిటి? 1940లు తెలుగు సినిమా మొదటిసారి కేరుకేరుమన్న సమయం అనుకుంటే, 50వ దశకం కళ్ళు తెరుచుని కాళ్ళు చేతులు విరుచుకున్న కాలంగా పరిగణిస్తే, అక్కడి నించి కేవలం నాలుగు దశాబ్దాలలోనే (నిజం చెప్పాలంటే, రెండు దశాబ్దాలలోనే, అంటే 70లలోనే) ఆకాశంబుననుండి శంభుని శిరంబందుండి… పవనాంధోలోకము ఎలా పట్టిందో విశ్లేషించడానికి ధర్మ పన్నాలు ఏమీ తిరగేయనక్కర్లేదు. దానికి కారణాలు రెండే, ఒకటి ఎన్టీయార్, రెండు ఏయన్నార్.

యాభైలలో తెలుగు సినిమా స్వర్ణయుగం చూడడానికి, 70ల నించి పతనావస్థను చేరి ఇక అక్కడే మనుగడ సాగించడానికి మూల కారణాలు వాళ్ళిద్దరే. 50లలో నటులుగా ఉండి 70ల నుండి తారలుగా మారిన ఈ తెరవేల్పుల అభిరుచి, అనురక్తి, ఆసక్తులకనుగుణంగానే తెలుగు పరిశ్రమ వాటి పద్ధతులు మార్చుకుంది. పౌరాణికాలలో, సాంఘికాలలో, జానపదాలలో పోషించాల్సిన పాత్రలన్నీ పోషించిన తరువాత (అంతకంటే ముఖ్యంగా వయసు మీద పడిన తరువాత), హుందాగా వయసుకు తగ్గ/వానప్రస్థ వేషాలు పోషించాల్సింది పోయి, ఇంకా వాన పాటలలో, తమ కంటే సగం (లేక మూడోవంతో) వయసులో ఉన్న కుర్రకారుతో చేతులు కాళ్ళు (హాస్యాస్పదంగా) కదపడానికి సిద్ధమైన కారణాన, వారిద్దరి ఆ విపరీత చర్యలను సమర్ధించి ప్రోత్సహించిన నిర్మాత దర్శకుల అవకాశవాదాన, శరీరం సహకరించకపోయినా, ఆహార్యం ఎబ్బెట్టును దాచలేకపోయినా, కథ మాత్రము ఆ ఇద్దరు ఐదు పదులు దాటిన వారిని ఇంకా బాలాకుమారులుగా, నూనుగు మీసాల నూత్న యవ్వనులుగా ఊహించుకుని తయారుచేసిన ఆ గతి లేని రచయితల మూలాన… కర్ణుడు నీల్గెన్ అవ్వారి చేతన్.

స్వామి సాక్షాత్కారం ప్రసన్నం చేసుకోవడం కంటే, విరోధం వల్లనే తొందరగా సిద్ధిస్తుందన్న ధోరణిలో వయసుకు తగ్గ పాత్రలకంటే, నేలను విడిచిన కథల ద్వారానే వారిద్దరి కటాక్షవీక్షణాలు తమ మీద ప్రసరింప చేసుకోవచ్చనుకునే రచయితలు తమ అభూత కల్పనలతో వారిని ఊరిస్తుంటే, ఔత్సాహికులైన నిర్మాతలు వచ్చి కిలోల లెక్కలో తెచ్చి టోకున డబ్బులు కుమ్మరిస్తుంటే, అవకాశం కోసం చకోర పక్షులల్లే వేచి ఉండే భావి దర్శకులు వాస్తవికత పరిధులను ఇట్టే గడప దాటించగలమని హామీలిస్తుంటే, ఈ కుప్పిగంతులన్నీ ప్రజలను ఒక మాయా ప్రపంచంలోకి నెట్టి వారిని రెండున్నర గంటల కాలం నిజజీవితాన్ని మరపించగలిగే ఉదాత్తమైన సాంఘిక ప్రయోజనం కోసమే అన్న ఆత్మ ద్రోహంలో వారిద్దరూ ఎంతకైన తెగిస్తే… కర్ణుడు నీల్గెన్ అవ్వారి చేతన్.

ఈ పాపం పాపం వారిదేనా, లేదా వారేం చేసినా చప్పట్లు కొట్టి, దండలు కట్టి, దండోరాలు కొట్టిన ప్రేక్షకులది కూడానా? వారేం కోరితే అదే ఇస్తున్నాం అన్న శిఖండి చాటు ఇక్కడ ఎంత మాత్రమూ చెల్లదు. ప్రపంచ పరిశ్రమ పోకళ్ళు కళాకారులుగా నిశితమైన దృష్టితో పరికించిన ఆ ఇద్దరు నటులు తమ దాకా వచ్చేసరికి తమ సామాజిక/కళాత్మక బాధ్యతను విస్మరించి (ఒకటి డబ్బు, రెండు స్థానం కోసం) తాము ఎంతో పాటుపడి నిర్మించిన ఉత్తమ కళాసౌధాన్ని తమ చేతులతోనే మొదళ్ళ నించి కూల్చేయడం చాలా బాధాకరమైన విషయం. ఆనాడు వారు తమ స్థానాలని పదిలపరుచుకోవడానికి పఠించిన ఆ పలాయనవాద మంత్రమే నేడు పరిశ్రమలో వేనవేల గొంతులతో ప్రతిధ్వనిస్తోంది.

మన బంగారం మంచిదైతే…

జనాభా లెక్కల ప్రకారం గడచిన ప్రతి దశకం కంటే ఆ తదుపరి దశకంలో అక్షరాస్యత దశాంశమ స్థాయిలోనైనా పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. బళ్ళు ఎక్కువయినాయి, ప్రమాణాలు హెచ్చినాయి, మేధోశక్తి కూడా ముందు తరం కంటే మెరుగు పడ్డట్టే అనిపిస్తోంది. మరైతే పాత తరంలో వచ్చిన సినిమా మాటల్లోని, పాటలలోని సాహిత్యపు ప్రమాణాల కంటే ఈ జనాభా లెక్కల కొలమానం ప్రకారం ప్రస్తుతం ఉన్న విలువలు ఎంతో హెచ్చుగా ఉండాలి. మంచి సందర్భానికి పాటలో గీత రచయిత ఒక బరువైన మాట వాడితే వాటి కింద విలవిలలాడి పోయి- దిగండి సార్, ఇంకా దిగండి, అని గీపెట్టే దర్శక నిర్మాతలు, వ్యాస భాగవతం కూడ వీధి భాగవతంలా చెబితే తప్ప వినే/కూర్చునే స్థాయిలో లేని ప్రేక్షకులు, అడుగడుగునా ప్రమాణాలు దించమనే ఒత్తిళ్ళు, అర్జీలు తప్పితే, ‘మీరు రాయండి పర్వాలేదు, అర్థం వారే చేసుకుంటారు’ అని భుజం తట్టి భరోసా ఇచ్చేవారు కరవైపోయిన పరిస్థితులు… వీటికీ ఆ అక్షరాస్యత లెక్కలకీ పొంతన ఎక్కడా ఉండటం లేదు. ‘చిలుక తత్తడి రౌత, ఎందుకీ హుంకరింత’ అన్న పదజాలం ప్రస్తుత కాలంలో ఏ యక్షగానాలకీ, పక్షిగానాలకీ ఊహించుకోలేము. ఈ మార్పు ఎక్కడ వచ్చింది? 50, 60ల దాక దిగ్దంతులైన కవులు సిన్మాల కోసం రాసిన ప్రబంధ సాహిత్యం సైతం పామర సమాజం ఆదరించి అక్కున చేర్చుకుని అందలం ఎక్కించింది. అటువంటిది, ఈ కాలంలో కౌముది అన్న పదమో, యామిని అన్న మాటో పడితే పాలల్లో ఏదో విషపు చుక్క పడినంత బెంబేలు పడిపోయే శోచనీయమైన స్థితి ఎలా పట్టింది?

దానికి కారణం 80లలో ప్రబలిన ఆంగ్ల మాధ్యమ బోధనావిధానం. దీనితో జనజీవితాల్లో ప్రౌఢ తెలుగు (వాడుక తెలుగు కాదు) క్రమేపీ కనుమరుగైపోయి, దాని స్థానే ఆంగ్లం పెద్ద పీట వేసుకుని తిష్టేసుకుని కూర్చున్న ఫలితమే నేడీ తెలుగు సినిమాకు పట్టిన ఈ గతి. విచిత్రమేమిటంటే పొరుగింటి పుల్లకూరని ఆవురావురని గుటకలేసిన సంస్కృతి తెలుగు వారిదొక్కరిదే కావడం. తక్కిన దాక్షిణాత్యులు కాని, లేదా ఉత్తరాది వారు కాని, వారి అస్థిత్వాన్ని కాపాడుకుంటూనే కొత్తదనాన్ని ఆహ్వానించారు (…నిస్తున్నారు). దీనికి పుస్తక ఆదరణ మించిన ఉదాహరణ ఉండబోదు. సర్వేల ప్రకారం పుస్తకాలు పెరుగుతున్నాయి, చదివే వారి సంఖ్య పెరుగుతోంది, మిగతా అన్ని భాషలలోనూ (మన చుట్టూ ఉన్న తమిళ, కన్నడ, మళయాళ భాషలలో) ఇంకా కొత్త రచనలు వెలువడం, వాటిని తగిన రీతిలో ఆదరించడం జరుగుతోంది. మరి తెలుగు మాటో? ప్రమాణాలు పడిపోతున్నాయని యే ఎన్టీయార్‌నో, ఏయన్నార్‌నో ఆడిపోసుకోవటం కంటే అద్దంలో మన మొహం మనం చూసుకోవడం ఆవశ్యకం. తారలని వేరే రాష్ట్రాలని నించి దిగుమతి చేసుకుని వారి చేత 1 2 3లు చెప్పించి డబ్బింగులో సర్దుకుందాం అనుకునే దర్శకులు, భాష రాని వాళ్ళ చేత పాటలు పాడించి వాళ్ళు ఎంత భాషను ఖండఖండాలు చేస్తే అంత వెరయిటీ అనుకునే నిర్మాతలు/సంగీత దర్శకులు, భాష రాని తారలు, భాష పలకలేని నటులు, భాష తెలియని దర్శకులు, భాష అర్థం కాని సంగీతఙ్ఞులు, వీరందరి సమష్టి కృషితో తయారైన వినూత్న ప్రయోగాన్ని భాషతో పనిలేకుండా ఎంతో పెద్ద మనసు చేసుకుని చూసి ఆదరించే గతిలేని ప్రేక్షకులున్నంత కాలం, తీసేవారికి డబ్బాలు తిరిగొస్తాయో లేదో తెలియని మానసిక స్థితి, చూసేవారికి డబ్బులకు తగ్గ ఫలితం దక్కిందా చెప్పలేని గ్రహస్థితి. ఇది ప్రస్తుత తెలుగు సినిమా పరిస్థితి.

మూడు పదుల యేళ్ళ క్రితం ఉన్న మాతృభాషా వృక్షాన్ని కాండం వరకూ తెగనరికి ఆంగ్ల భాష విత్తుని అపురూపంగా వేసి పెంచుకున్న ఫలితం– పృష్ట తాడనాత్ దంత భంగః అన్న రీతిలో నేతి బీరకాయలో నెయ్యి లేని చందాన తెలుగు సినిమాలో తెలుగు మృగ్యం చేసే పరిస్థితులు కల్పించింది. ఉన్న సంస్కృతి నించి ఎప్పుడైతే దాని కళారూపాలు విడివడిపోతాయో వాటికున్న ఆదరణ కూడా అదే నిష్పత్తిలో సన్నగిల్లడం మొదలుపెడుతుంది. ఇది ప్రస్తుత తెలుగు సినిమాని పట్టి పీడించే అసలు అనిశ్చితి సూత్రం.

(చివరి భాగంలో: సివరాకరికి సెప్పొచ్చేదేమింటంటే…)