దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 1

కీతో – ఒతవాలో

ఆగస్టు – సెప్టెంబర్ (2022) నెలలలో నేను చేసిన మధ్య అమెరికా ప్రయాణాలు మనసులో తిరుగాడుతూనే ఉన్నాయి. స్థూలంగా పాన్-అమెరికన్ హైవే మీదుగా సాగిన ప్రయాణమది. ఉత్తరాన మెహికో దేశపు సరిహద్దుల్లో ఉన్న గ్వాతెమాలతో ఆరంభించి బెలీజ్, ఓందూరాస్, ఎల్ సల్బదోర్, నికరాగ్వా, కోస్త రీకల మీదుగా పనమా దేశపు కొలంబియా సరిహద్దుల దాకా పద్ధెనిమిది రోజులు చేసిన ప్రయాణమది.

ఉత్తర అమెరికా ఖండపు అలాస్కాలో మొదలయ్యే పాన్-అమెరికన్ హైవే దక్షిణ అమెరికా ఖండపు కొట్టకొనన ఉన్న ఉషుఆయ (Ushuaia) నగరం దాకా కొనసాగుతుంది. అప్పటిదాకా అఖండంగా సాగే ఈ రహదారికి పనమా దేశంలో 90 కిలోమీటర్ల గండి పడుతుంది. ఆ గండిని దరియేన్ గాప్ (Darién Gap) అంటారు. ఆ గండిని దాటాక ఆ మహా రహదారి కొలంబియా భూభాగంలో తన పరుగును తిరిగి అందిపుచ్చుకొని ఎక్వదోర్ (Ecuador), పెరు (Peru) దేశాల మీదుగా ఖండపు దక్షిణ కొస దాకా సాగుతుంది. మధ్య అమెరికాలో నేను చవిచూసిన అనాది సాంస్కృతిక వైభవం నన్ను ఎంతగానో ఆకట్టుకొంది. ఆ సంస్కృతిని మరింత ఆవాహన చేసుకోవాలన్న తపన కలిగించింది. అదే బాణీ సంస్కృతీ చరిత్రా కలిగి ఉన్న కొలంబియా, ఎక్వదోర్ దేశాలు నేను చూడాలనుకొంటోన్న దేశాల పట్టికలో అగ్రస్థానానికి ఎగబ్రాకాయి.

నాకు ముందునుంచీ ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలలో యూరోపియన్ల రాకకు పూర్వమే విలసిల్లిన మాయన్, ఇన్కా నాగరికతల విషయంలోను, అవి యావత్ ప్రపంచానికీ అందించిన సాంస్కృతిక వారసత్వం విషయంలోనూ ఆసక్తీ ఆరాధనా ఉన్నాయి. అక్కడి దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోన్న ఘనమైన దేశవాళీ సంస్కృతి పట్ల ఆకర్షణ ఉంది. మెహికో, గ్వాతెమాల, ఓందురాస్ లాంటి ఉత్తర అమెరికా ఖండపు దేశాలలో అప్పటి మాయన్ నాగరికతా రేఖలు ఇప్పటికీ స్పష్టంగా కనిపించినట్టే కొలంబియా, ఎక్వదోర్, పెరు, బొలీవియా లాంటి దక్షిణ అమెరికా ఖండంలోని దేశాలలో ఇన్కా నాగరికత ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయని తెలుసు. ఆ ఛాయల వెదుకులాటకోసం కొలంబియా, ఎక్వదోర్ దేశాలు వెళ్ళి తీరాలన్న తపన నన్ను వెంటాడింది.

ఈ తపనతోబాటు, చార్లెస్ డార్విన్ పరిశోధనలకు కేంద్రబిందువులయిన గలాపగోస్ (Galápagos) ద్వీపాలను చూడాలన్న ఓ తీవ్రమైన ఆకాంక్ష కూడా నాలో ఎప్పట్నించో గూడు కట్టుకొని ఉంది. ఆ ద్వీపాలు ఎక్వదోర్ దేశానికి చెందినవి. తన జీవపరిణామ సిద్ధాంతంతో జీవాల మూలాల విషయంలో విప్లవాత్మకమైన ప్రతిపాదనలు చేసి ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పిన డార్విన్ పరిశోధనలకు మూలకారకమైన గలాపగోస్ ద్వీపాలను సందర్శించడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదని తెలుసు. అంచేత కొలంబియా, ఎక్వదోర్ దేశాలకు వెళ్ళాలన్న నిర్ణయం తీసుకున్నాను. 2023 ఫిబ్రవరి నెలలో అందుకోసం పంతొమ్మిది రోజులు కేటాయించాను.


అబియాంకా (Avianca) అన్న కొలంబియా దేశపు ఎయిర్‌లైన్స్ సంస్థ లండన్ నుంచి ఆ దేశపు రాజధాని బొగొతాకి (Bogotá) డైరెక్ట్ సర్వీస్ నడుపుతోంది. ఈ బొగొతా నగరం ఆ సంస్థ ముఖ్యస్థావరం కూడానూ. ముందు బొగొతా నుంచే నా రెండు దేశాల యాత్ర ఆరంభిద్దామనుకొన్నాను గానీ మళ్ళా కాస్త వివరాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే బొగొతాలో ఆగకుండా తిన్నగా ఎక్వదోర్ చేరుకుందామని, ఆ దేశమంతా చూశాక కొలంబియా వెళదామనీ అనిపించింది. అలా అయితే గలాపగోస్ ద్వీపాలు చూడటం కూడా కాస్త సులభమవుతుంది. ఆ ద్వీపాలు ఎక్వదోర్ భూభాగానికి పశ్చిమాన వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

ఉత్తరాన కొలంబియా, తూర్పు దక్షిణ దిశలలో పెరు, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం – స్థూలంగా ఎక్వదోర్ భౌగోళిక స్వరూపం ఇది. తన పొరుగుదేశాలతో పోలిస్తే పరిమాణంలో చిన్నది అనిపించినా వాస్తవానికి అది ఎన్నో యూరోపియన్ దేశాలకన్నా పెద్దది. యూకే కన్నా పదహారు శాతం ఎక్కువ భూభాగం, మన ఆంధ్రప్రదేశ్-తమిళనాడుల ఉమ్మడి వైశాల్యంతో పోలిస్తే పన్నెండు శాతమే తక్కువ. అంచేత అందరూ అనుకొనేంత చిన్నదేంగాదు ఎక్వదోర్ దేశం. అధికారికంగా దాని పేరు రిపబ్లికా దెల్ ఎక్వదోర్ – అంటే ఈక్వేటర్ దగ్గరి రిపబ్లిక్ అని అర్థం. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే భూమధ్యరేఖ దగ్గర ఉన్న గణతంత్ర రాజ్యం అనవచ్చు. జనాభా ఒకటిమ్ముప్పావు కోట్లు.

వైశాల్యాలూ జనాభాలూ అటు ఉంచితే భౌగోళికంగానూ, జీవవైవిధ్యంలోనూ ఎన్నదగ్గ దేశం ఎక్వదోర్. ప్రపంచపు భూభాగంలో ఎక్వదోర్ వంతు 0.054 శాతమే అయినా ఆ దేశంలో ప్రపంచంలోని పదిశాతపు జంతుజాలం, ఎనిమిది శాతపు వృక్షజాలం ఉన్నాయి. వైశాల్యంలో తనకన్నా నలభై రెట్లు పెద్దదయిన యుఎస్‌ఎలో ఎంత జీవ వైవిధ్యముందో ఎక్వదోర్‌లో అంతకన్నా ఎక్కువ ఉంది. భౌగోళికంగా చూస్తే దేశంలో స్థూలంగా నాలుగు ప్రాంతాలున్నాయి: పసిఫిక్ సాగరతీరం, ఆండీస్ పర్వతశ్రేణి అంచుగాగల హైలాండ్స్ లోని అగ్నిపర్వత సీమ, అమెజాన్ వర్షారణ్యం, గలాపగోస్ ద్వీపాలు – ఇలా ఈ నాలుగు భౌగోళిక ప్రాంతాలూ దేశానికి విభిన్నరూపాలు ప్రసాదించాయి.


ఫిబ్రవరి 2, 2023న లండన్ నుంచి బొగొతా చేరుకున్నాను. అర్ధరాత్రి పదకొండు ముప్పావుకు విమానం. నా పక్కసీటు మనిషి నా దృష్టిని ఆకర్షించాడు. అతని రూపురేఖలు అచ్చమైన నేటివ్ అమెరికన్ బాణీవి. నిడుపాటి జుట్టు… మధ్య పాపిడి తీసి జడలు వేసిన జుట్టు… వయసు తెలియని శరీరరీతి… రాత్రి ప్రయాణం అవడంవల్ల ఇద్దరం హలో హలో అనుకున్నామేగానీ దానిని మించి మాటలు సాగలేదు.

8500 కిలోమీటర్ల దూరాన్ని పదకొండున్నర గంటల్లో దాటి వెళ్ళాక విమానం మర్నాటి తొలి సంజవేళలో బొగొతా విమానాశ్రయం చేరుకొంది. పశ్చిమదిక్కుకు ప్రయాణం కదా, మాకు సమయం కలిసి వచ్చింది. నా పక్క సీటు మనిషికి గబగబా గుడ్‌బై చెప్పేసి ఎక్వదోర్ దేశపు రాజధాని నగరం కీతో (Quito) వెళ్ళే విమానాన్ని అందుకోవడానికి అటువైపుకు సాగిపోయాను. ఆ విమానానికి ఇంకా రెండున్నర గంటలు వ్యవధి ఉంది. అంచేత అది వెళ్ళే గేటు దగ్గరే ఓ కుర్చీలో చేరగిలబడ్డాను. అంతలో అప్పటిదాకా ప్రయాణంలో నా పక్కన కూర్చుని ఉన్న వ్యక్తి కూడా అక్కడికి చేరాడు. ఈసారి మేమిద్దరం చిరపరిచితుల్లా పలకరించుకొన్నాం. అతని పేరు గుస్తావొ (Gustavo) అనీ, తనూ కీతో నగరానికే వెళుతున్నాడనీ తెలిసింది.

అమెజాన్ అటవీప్రాంతం లోని కురికింది కాసే సెంటర్ (Kurikindi Kawsay Centre) అన్నచోట గుస్తావొ కొన్ని వారాలు గడపబోతున్నాడట. కెచువా (Quichua) భాష మాట్లాడే తెగలకు చెందిన అమెజాన్ ప్రాంతపు కురికింది అన్న షామన్ (Shaman) పేరిట ఏర్పడిన ఆధ్యాత్మిక కేంద్రమది. ఉభయ అమెరికా ఖండాలలోని స్థానిక తెగలలో ఈ షామన్‌లు కీలక పాత్రధారులు. పూజారులుగాను, మతాధికారులుగాను, లౌకిక ప్రపంచానికీ అలౌకిక ప్రపంచానికీ నడుమ వారధిగా నిలబడి ప్రజల రుగ్మతలను పరిహరించే మాధ్యమాలుగానూ వారిది బహుముఖ పాత్ర. ఆ కురికింది అన్న షామన్ అమెజాన్ అడవులలో పెట్రోలియమ్ వెలికితీత ప్రయత్నాలవల్ల ధ్వంసమవుతోన్న పర్యావరణాన్ని కాపాడే దిశలో చురుగ్గా పనిచేశాడట. సహజంగానే అక్కడ అతని ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అంచేత తన నివాసాన్ని యూకేకు మార్చాడు. గుస్తావొ లాంటి అతని అనుచరులు మాత్రం అమెజాన్ అరణ్యాలలో పైన చెప్పిన ఆధ్యాత్మిక కేంద్రాన్ని నడుపుతున్నారు. షామనిజమ్‌కు చెందిన అధ్యయనాలకూ ఆలోచనాలకూ కేంద్ర బిందువు ఆ కురికింది కాసే సెంటర్.

పక్కనే ఉన్న ఓ కాఫీ షాపులోకి చేరి మేము మాటలు కొనసాగించాం. గుస్తావొ షామనిజాన్ని అనుసరించడమే కాదు – కురికింది సెంటర్లో బోధిస్తాడు కూడానట. లండన్-అమెజాన్ వర్షారణ్యాల మధ్య తన సమయాన్ని కేటాయించి తిరుగుతూ ఉంటాడు. తను చేస్తోన్న పని అంటే అతనికెంతో మక్కువ. లండన్‌లోనూ ఒక కురికింది సెంటర్ నడుపుతున్నాడట. అక్కడ నిర్వహించే షామనిజమ్ కోర్సుల గురించి నాకు వివరించాలని ఉత్సాహపడ్డాడు.

షామనిజమ్ కోర్సుల ద్వారా సాటి మనుషులతోను, జంతుజాలంతోను, ప్రకృతితోను, దైవశక్తులతోనూ ఎలా టెలిపాతిక్ సంపర్కం ఏర్పరచుకోవచ్చో గుస్తావో తన విద్యార్థులకు బోధిస్తాడట. ప్రేమ, క్షమ, కరుణ, అనుకంప, ఒప్పుదల – ఇవీ ఒక షామన్‌కు ఉండవలసిన, వారు అలవరచుకొనవలసిన ముఖ్యలక్షణాలు అని వివరించాడు.

అంతా విన్నాక అతని నేపథ్యం తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అది గమనించి అతనో చిరునవ్వు నవ్వి వివరించాడు: బయాలజీలో డిగ్రీ చేశాడు. పైలట్‌గానూ ఆయన తర్ఫీదు పొందాడు. చిన్నపాటి విమానాలనూ హెలికాప్టర్లనూ నడపగలడు. అమెజాన్ ప్రాంతపు సీతాకోకచిలుకల కేంద్రాలనుంచి యూరప్‌కు వాటిని ఎగుమతి చేసే చట్టబద్ధమైన వ్యాపారం చేశాడు. సీతాకోకచిలుకల్ని వాటి సహజ వాతావరణంలో పెంచాడు. తమ తమ నెలవుల్లో పుట్టి పెరిగినప్పుడే సీతాకోకచిలుకలు తమ వన్నెచిన్నెలను పరిపూర్ణంగా సంతరించుకొంటాయి అని వివరించాడాయన.

ఇవన్నీ చేసే ప్రక్రియలో అతనో పర్యావరణ ప్రేమిగా పరిణమించాడు. తన మూలాలతో సంబంధాలను ఏర్పరచుకొనే ప్రయత్నంలో షామన్‍గా రూపుదిద్దుకున్నాడు. తాను పుట్టి పెరిగిన అమెజాన్ అడవుల గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఆ అడవుల్లో జరుగుతున్న పెట్రోలియం వెలికితీతకు వ్యతిరేకంగా ఉద్యమించాడు కానీ అది విఫలప్రయత్నమే అయింది. చదువు, ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాలు అంటూ ఎరలు వేసి ఆయిల్ కంపెనీలు స్థానికుల స్థలాలను కొనివేయసాగాయి. ‘నిజమే. ఈ ఎరలకు లొంగి మా వాళ్ళు స్థలాలను వదులుకోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. వాళ్ళ ప్రాణాలకవి ఎంతో గొప్ప లాభాలు. కానీ క్రమక్రమంగా ఈ పరిణామాలు కలిగించే విధ్వంసం ఊహాతీతం’ అంటూ నిట్టూర్చాడు గుస్తావొ.

నన్ను గురించి తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు వేశాడతను. నాకు తన ఫోన్‌ నెంబరు ఇచ్చి లండన్‌లో తనను తప్పక కలుసుకోమని మరీ మరీ చెప్పాడు. పధ్నాలుగు గంటల క్రితం అతను నా పక్క సీట్లో చేరినప్పుడు ఎవరో మామూలు మనిషి అనిపించాడు. ఇపుడీ గంటసేపు మాట్లాడుకొన్న తర్వాత అతనో అసామాన్యుడు అన్నది స్పష్టమయింది. నిజమే, ప్రతి మనిషిలోనూ ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. తెలుసుకోదగ్గ అనుభవాలు ఉంటాయి. అవన్నీ వారివారి మనోవల్మీకాల్లో ఇమిడి ఉంటాయి. ఆసక్తీ చిత్తశుద్ధులతో ప్రయత్నించిన పక్షంలో వారినుండి ఆ అనుభవాలను వెలికితీయడం కష్టమేమీ కాదు.


వెలుగు రేకలు విచ్చుకునే సమయంలో మా విమానం కీతో వేపుగా తన ప్రయాణం ఆరంభించింది. నాది విండో సీటు… ఎన్నో చక్కని దృశ్యాలు… విమానం కీతో నగరపు పరిసరాలు చేరినపుడు మంచు నిండిన అగ్నిపర్వతశిఖరాలు, ఆకుపచ్చా నీలిరంగుల మేలికలయికతో ఉదయపుటెండలో మెరిసే సరోవరాలు, పగడాల రాసులలాంటి వృక్షసముదాయం – మనసును సంతోషంతో నింపాయి. కీతో నగరంలో దిగుతున్న సమయంలో ఆ ఊరు, చుట్టూ కొండలతో నిండిన విశాలమైన లోయలో ఉందని గమనించాను.

కీతో నగరపు ‘మరిస్కాల్ సుక్రే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’లో ఉదయం తొమ్మిదింటికి దిగాము. ఎయిర్‌పోర్ట్ నుంచి ఊరికి అరగంట దూరం. ఇమిగ్రేషన్ ప్రక్రియ ఎంతో సులభంగా ముగిసింది. ‘ఎన్ని రోజులు ఉంటారు, ఎక్కడ ఉంటారు’లాంటి సాధారణమైన వివరాలు అడిగి నిముషాల్లో వీసా-ఆన్-ఎరైవల్ ఇచ్చేశారు.

ఊళ్ళోకి వెళ్ళడానికి టాక్సీ చేసుకున్నాను. టాక్సీ పరుగందుకోగానే నేను ఆలోచనల్లో మునిగిపోయాను. ఎక్వదోర్ లాంటి మారుమూల దేశానికి వెళతానని నేను ఏనాడూ అనుకోలేదు. భౌగోళికంగానూ సాంస్కృతికంగానూ మాత్రమే కాకుండా భాషాపరంగానూ ఎక్వదోర్ లాంటి దేశాలు నాకు ఏమాత్రం ‘దగ్గరితనం’ లేని ప్రదేశాలు. దశాబ్దాలుగా యూకేలో నివసించడంలో ఒక ఇబ్బంది ఉంది: అక్కడి ఆంగ్లానురాగప్రపంచంలో మునిగితేలే వారికి ఫ్రెంచి ప్రపంచాలు, హిస్పానిక్ ప్రపంచాలు పట్టనే పట్టవు. ఆ పొరుగు ప్రపంచాల గురించి తెలియనే తెలియదు. ఆలోచిస్తే ఒక రకంగా అది సహజమే అనిపిస్తుంది. భాష ఒక బలమైన సాంస్కృతిక సేతువు. ఒకే భాష మాట్లాడే దేశాల మధ్య – అవి భౌగోళికంగా ఎంతెంత దూరాన ఉన్నా బలమైన బంధం ఏర్పడుతుంది. నేను పుట్టి పెరిగిన భారతదేశం ఆంగ్లభాషా ప్రపంచానికి చెందినది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలండ్, సౌత్ ఆఫ్రికా, ఒకప్పటి బ్రిటిష్ వలసదేశాలైన నైజీరియా, జింబాబ్వే – ఇలా ప్రాంతాలూ ఖండాలూ వేరైనా భాష ఒక్కటే అయినపుడు ఆయా భాషాకుటుంబదేశాల మధ్య స్నేహసౌహార్దాలు సహజంగా ఏర్పడతాయి.

ఎక్వదోర్ అనగానే నాకు వెంటనే గుర్తొచ్చేది ఈక్వేటర్ – భూమధ్యరేఖ. గుర్తొచ్చే రెండో విషయం – డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిధ్ధాంతానికి భూమిక అయిన గలాపగోస్ ద్వీపాలు. సమీపగతంలో వికీలీక్స్ ‘నిందితుడు’ జులియన్ అసాంజ్‌కి (Julian Assange) పౌరసత్వం ఇచ్చి తమ లండన్ ఎంబసీ భవనంలో శరణు ఇచ్చిన దేశంగానూ ఎక్వదోర్ నాకు గుర్తుంది. ఈ మూడు విషయాలే తప్ప ఎక్వదోర్ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. అయినా ముందు వివరించిన కారణాలవల్ల ఈ దేశం వెళ్ళాలన్న నిర్ణయం తీసుకున్నాను.

ఇలా ఆలోచనల్లో మునిగిపోయి, నేనేమీ ఎరుగని ఎక్వదోర్ లాంటి విభిన్న దేశంలోకి అడుగు పెడుతున్నానన్న చిరువింత భావంలోంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉండగానే కీతో నగరపు పాతపట్నం నడుమన ఉన్న హోటల్ శాన్ ఫ్రాన్సిస్కో చేరాను. ఒకనాటి వలసకాలపు స్పానిష్ బాణీ శ్వేతభవనమది. ఇపుడు హోటల్‌గా మారింది. అలంకరణతో నిండిన రాతి ముఖద్వారం, ప్రాంగణం నడుమన పచ్చదనం నిండిన తోట, ఆ తోట మధ్యలో రాతి ఫౌంటైను – చక్కని వసతి గృహమది.

రిసెప్షన్ లోని సారా అన్న యువతి సాదర స్వాగతం పాలికింది. ఆమె బాగా సాయపడే మనిషి అని చూడగానే తెలిసిపోయింది. ఆ హోటలు సొగసూ రమ్యతల గురించి ఆమెతో రెండు మంచి మాటలు చెప్పాను. సంతోషించింది. ఈ హోటలు ఆసామి ఎవరూ అని వాకబు చేశాను. వాళ్ళ నాన్నేనట. నా చెకిన్ ప్రక్రియను సాగిస్తూనే ఆమె ఆ హోటలు చరిత్ర చెప్పుకొచ్చింది: 1698లో కట్టారట. అప్పట్లో కీతోలో కట్టిన మొట్టమొదటి ఐదు భవనాలలో ఇది ఒకటిట. 1980లో సారా వాళ్ళ నాన్నగారు ఆ పురాతన భవనాన్ని కొన్నారట. కొని, ఐదేళ్ళు శ్రమించి పునరుద్ధరించారట. ఆ తర్వాత మరో ఐదేళ్ళు కష్టపడి భవనానికి ఇపుడు కనిపించే లలితలావణ్యాలు సమకూర్చారట.


సారా నన్ను తిన్నగా ఓ సొరంగం లాంటి గదిలోకి తీసుకు వెళ్ళి ‘ఇదిగో మీరు రేపు ఉదయం అల్పాహారం తీసుకునే ప్రదేశమిది’ అని పరిచయం చేసింది. అప్పట్లో ఆ గది గృహాంతర్గత కారాగారమట! జైలు ముచ్చట్లు ముగిశాక ఆమె నన్ను పై అంతస్తులో చక్కని అలంకరణతో నిండిన గదికి చేర్చింది. బడలిక తీరేలా వేన్నీళ్ళ స్నానం చేశాను. అప్పటికే మధ్యాహ్నమయింది. గబగబా గదిలోంచి బయటపడ్డాను. రాత్రి ప్రయాణం, ఇంగ్లండుకూ ఎక్వదోర్‌కూ మధ్యన ఉన్న కాలపు అంతరాలూ కలగలసి నేను పడక ముట్టుకుంటే చాలు గాఢనిద్రలోకి దారితీయిస్తాయని తెలుసు. అదే జరిగితే నిద్రా మెలకువల క్రమం గాడిలో పడే అవకాశమే ఉండదు. అంచేత ఆ మధ్యాహ్నంపూట చిన్నపాటి కునుకు తీద్దాం అన్న ప్రలోభాన్ని అరికట్టుకున్నాను. రాత్రి బాగా తొందరగా నిద్రకు ఉపక్రమిస్తే ఆ క్రమం గాడిలో పడుతుంది. అంచేత పడకను పట్టించుకోకుండా గది బయటకు దారితీశాను. హోటల్లోంచి బయట పడేముందు కీతోలోను, ఆ పరిసరాల్లోనూ వెళ్ళదగిన ప్రదేశాలు ఏమిటీ అన్న విషయం సారాతో మాట్లాడాను. మాటలు ముగిశాక ఆనాటి మధ్యాహ్నం అంతా ఆ దేశపు సుప్రసిద్ధ భౌగోళిక విశేషం – భూమధ్యరేఖ చూడటానికి కేటాయించాను. మర్నాడు అక్కడికి వంద కిలోమీటర్ల దూరాన ఉన్న ఒతవాలో (Otavalo) అన్న విపణి నగరానికి డే ట్రిప్ పెట్టుకున్నాను.

మితాద్ దెల్ మున్దో (Mitad del Mundo) అన్నది కీతో నగరానికి ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరాన ఉన్న భూమధ్యరేఖా స్మారక చిహ్నం. ప్రపంచమంతటిలోనూ భూమధ్యరేఖకు అతి దగ్గరగా ఉన్న రాజధాని నగరం కీతో. ఊళ్ళోని రవాణా సౌకర్యాల గురించి ఇంకా నాకు పట్టు చిక్కలేదు గాబట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆలోచన పక్కన పెట్టి తిన్నగా టాక్సీని ఆశ్రయించాను. నలభై నిముషాల్లో గమ్యం చేర్చింది. ఆ ప్రయాణం వల్ల అక్కడి టాక్సీలు బాగా చవక అని కూడా అర్థమయింది.

ఆ స్మారక చిహ్నానికి 8 డాలర్ల టికెట్టు ఉంది. అన్నట్టు ‘సియుదాద్ మితాద్ దెల్ మున్దో’ అంటే ప్రపంచపు నడిమధ్యన ఉన్న నగరం అని అర్థమట. నగరం అంటున్నారే కానీ అది ఒక పెద్ద గ్రామంలా మాత్రమే కనిపించింది. వృక్షాలూ పచ్చిక బయళ్ళూ నిండిన పెద్ద పార్కులో భవనాల సమూహం – అదీ ఆ ప్రాంతపు ఆకృతి. దానినొక వారసత్వ ఉద్యానవనంలా రూపకల్పన చేశారు. ఒక వారన ఆ ప్రాంతపు మూలవాసుల గుడిసెలూ నివాసాల నమూనాలు నిర్మించి ఉన్నాయి. పార్కుకు అటు చివర భూమధ్యరేఖను సూచించే బృహత్తరమైన కట్టడం – ముప్ఫై మీటర్ల ఘనాకారపు వేదిక మీద నిలబెట్టిన ఇత్తడి గ్లోబు – కనిపించింది. ఆ స్మారకచిహ్నానికి దారితీసే కాలిబాటకు అటూ ఇటూ భూగోళశాస్త్రానికి చెందిన వైతాళికులు, శాస్త్రవేత్తల విగ్రహాలు నిలిపి ఉన్నాయి.

ఆ స్మారక చిహ్నం నడుమగుండా సాగిపోయే స్ఫుటమైన తెల్లని గీత ద్వారా అక్కడ భూమధ్యరేఖ గుర్తించబడి ఉంది. అక్కడికి వచ్చే సందర్శకులందరూ ఆ గీతకు అటు ఒక కాలూ ఇటు ఒక కాలూ వేసి – ఒకేసారి పూర్వార్ధగోళంలోనూ ఉత్తరార్ధగోళంలోనూ నిలబడి ఫోటోలు తీయించుకోవడం ఆనవాయితీ. నేను కూడా ఆ లాంఛనాన్ని ముగించాను. వివరాల్లోకి వెళితే, ఆ చిహ్నం కట్టినపుడు అదే భూమధ్యరేఖాప్రాంతం అని నమ్మి కట్టినా తర్వాత అసలైన భూమధ్యరేఖ అక్కడికి 240 మీటర్ల దూరంలో ఉందని తెలిసిందట. అయినా వాస్తవాలు వాస్తవాలే, నమ్మకాలు నమ్మకాలే, లాంఛనాలు లాంఛనాలే!

ఆ కట్టడం లోపల ఎక్వదోర్ సంస్కృతిని ప్రతిబింబించే మ్యూజియమ్ ఉంది. దేశపు భిన్న ప్రాంతాలలోని స్థానికుల జీవితం, సంస్కృతి, వేషధారణ కళ్ళకు కట్టినట్లు చూపించే నమూనాలు ఉన్నాయక్కడ. వాటితోపాటు గలాపగోస్ ద్వీపాల జీవరాసులూ భూమి స్వరూపమూ వివరించే ఎగ్జిబిట్లూ అక్కడ పొందుపరిచారు. నిజానికి ఆ ‘ప్రపంచపు నడి మధ్య నగరం’లోని ప్రదర్శనలోని వస్తువులూ వివరాలను ఆకళింపు చేసుకుంటూ ఒక పూటంతా అక్కడ గడిపేయవచ్చు.

సాయంత్రం నాలుగయింది. ఆ ఉదయం కీతో వచ్చిన విమానంలో అందించిన అల్పాహారం తప్ప ఆనాడు మరింకేమీ తినలేదని గుర్తొచ్చింది. ఆ గ్రహింపు ఆకలికి దారితీసింది. అక్కడ ఉన్న కఫేలో ఓ స్నాకూ కాఫీ అందిపుచ్చుకున్నాను. అవి తినే లోపలే ‘స్మారక చిహ్నం దగ్గరే ఉన్న ఇంతి-న్యాన్ సోలార్ మ్యూజియమ్ (Inti-ñan Solar Museum) తప్పకుండా చూసి రండి’ అన్న సారా సలహా గుర్తొచ్చింది. అది అయిదింటికే మూసేస్తారని చెప్పిన మాటా గుర్తొచ్చింది. గబగబా ఆ స్నాకును నోట్లో కుక్కుకొని కాఫీ ఒక్క గుక్కలో తాగేసి ఆ మ్యూజియమ్ దారి పట్టాను. అంత హడావుడిలోనూ దారిలో కనిపించిన ఓ పెద్ద భవనం నా దృష్టిని ఆకర్షించింది. ఆ భవనపు వాస్తురీతి రాబోయే కాలానికి చెందినట్లుగా అనిపించింది. యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్ (UNASUR) వారి ముఖ్య కార్యాలయమట – ఐరోపాలోని యూరోపియన్‌ యూనియన్‌కు (EU) ఇది దక్షిణ అమెరికా రూపాంతరమన్నమాట.

ఇంతి-న్యాన్ మ్యూజియమ్ ప్రాంగణం పచ్చదనంలో కళకళలాడుతూ కనిపించింది. చిక్కని పచ్చదనపు పార్కు, అందులో దట్టంగా స్థానిక వృక్షాలు, ప్రదర్శనకు ఉంచిన దేశవాళీ నివాసాలూ టోటెమ్ స్తంభాల ప్రతిరూపాలు… ఆకట్టుకొనే ప్రాంగణమది. దాన్ని నడుపుతోన్నది ప్రైవేటు వ్యక్తులట. దాని నిర్వహణలో పాలుపంచుకుంటున్న ఖాకీ యూనిఫామ్‌ధారులందరూ ఎంతో పిపాసతో తమ పనిచేస్తున్నట్టు తోచింది. ‘భూమధ్యరేఖ సాగిపోతున్నది మా ప్రాంగణంనుంచే’ అన్న విషయం వాళ్ళు నిస్సంకోచంగా నొక్కి వక్కాణించారు. ఆ రేఖాప్రాంతం సహజంగానే స్పష్టంగా గుర్తించబడి ఉంది. రెండు అర్ధగోళాల మీదా అటో కాలూ ఇటో కాలూ వేసి ఫోటోలు తీసుకోవడమన్న లాంఛనం ఉండనే ఉంది.

ఆ మ్యూజియమ్‌వారు ఏర్పాటు చేసే అరవై నిముషాల చిట్టచివరి గైడెడ్ టూర్‌ను సరిగ్గా సమయంలో అందుకోగలిగాను. ఆ టూర్‌లో ఎక్వదోర్ సంస్కృతిని వివరించడం ఒక భాగం అయితే భూమధ్యరేఖ దగ్గర భౌగోళిక శక్తులు ఎలా వ్యవహరిస్తాయో చూపించడం మరో భాగం. ఒక వాష్ బేసిన్ అడుగున బిరడా బిగించి నీటితో నింపి అందులో చిన్న చిన్న ఆకులు వేసి ఆ తర్వాత బిరడా తీసేశారు. నీరు సుడులు తిరుగుతూ బేసిన్ లోంచి కారిపోయింది. వాష్ బేసిన్ ఉత్తరార్ధ గోళంలో ఉండటం వల్ల ఆ సుడులు గడియారపు దిశలో గిరగిరా తిరిగాయి. అదే ప్రయోగం వాష్ బేసిన్‌ను పూర్వార్ధగోళంలో ఉంచి చేసినపుడు నీళ్ళు గడియారపు వ్యతిరేక దిశలో సుడులు తిరిగాయి. సరిగ్గా భూమధ్యరేఖ మీద ఉంచి చేసినపుడు ఏ సుడులూ తిరగకుండా జారిపోయాయి. సుడులు ఇలా భిన్నదిశల్లో తిరగడానికి తన అక్షం మీద భూమి నిరంతరం తిరగడం కారణమట. భూమధ్యరేఖను నిర్థారించడానికి, ఉత్తరార్ధ-పూర్వార్ధ గోళాలను గుర్తించడానికీ ఇది సామాన్యులు గానీ శాస్త్రవేత్తలు గానీ చేయగల ప్రాథమిక ప్రయోగమట. ఈ ప్రక్రియను ఒక ఫ్రెంచి సైంటిస్టు పేరిట కొరియోలిస్ ఎఫెక్ట్ (Coriolis Effect) అంటారట.

నిర్థారణలూ ప్రయోగాల సంగతి ఎలా ఉన్నా ఉష్ణమండలపు తుఫానులు చెలరేగినపుడు వాటి సుడుల తీరును పసిగట్టడం ఈ కొరియోలిస్ ఎఫెక్ట్ పరిజ్ఞానం వల్ల శాస్త్రవేత్తలకు అతి సులభమయింది. ఆ భూగోళిక ప్రక్రియను సూక్ష్మరూపంలో మా కళ్ళతో చూడగలగడం మాకు విస్మయానందాలు కలిగించింది. ఇలాంటి ప్రభావాలకు సంబంధించినవే మరో రెండు విశేషాలు మాకు అక్కడ ప్రదర్శించారు: కోడిగుడ్డును మేకు మొన మీద బాలెన్స్ చెయ్యడం భూమధ్యరేఖ దగ్గర సులభమవడం గమనించాం. ఖచ్చితంగా భూమధ్యరేఖ మీద నిలబడినపుడు మా శారీరక శక్తి స్వల్పంగా తగ్గడమూ గమనించాం.


ఇంతి-న్యాన్ మ్యూజియమ్ చూడటం ముగిసేసరికి సాయంత్రం అయిదున్నర అయింది; మ్యూజియమ్‌ను మూసేసే ప్రక్రియ మొదలైంది. నాతోపాటు మ్యూజియమ్ చూసినవాళ్ళంతా వాళ్ళ వాళ్ళ బస్సుల్లో వచ్చారు – అవి ఎక్కి వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా మిగిలాను. మామూలు బస్సేమన్నా దొరుకుతుందేమోనని మెయిన్ రోడ్డు వేపు నడిచాను. ఒక దయామయి బస్టాపుకు దారి చూపించింది. కాస్తంత కష్టమ్మీద బస్టాపును గుర్తించాను. బస్సు దొరికింది. నగర కేంద్రంలోని కరోలినా పార్క్ అన్న చోటికి చేరాలన్నది నా అభిమతం. స్థానిక ప్రజానీకాన్ని గమనిస్తూ ఓ సాయంత్రపు వేళ గడపడానికి అది సరైన ప్రదేశం అని విని ఉన్నాను.

నాణేలతో నిండిన చేతిని కండక్టరు ముందుకు చాపితే టికెట్టుకు సరిపడా డబ్బులు తీసుకుని టికెట్టిచ్చాడు. ‘కరోలినా పార్క్ వచ్చినపుడు చెప్పగలవా’ అని అతడిని అడిగాను. అడిగానే కానీ మా మధ్య మాటలు సాగడం కష్టమయింది. ఇది కాదు పని అనుకొని గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ఆశ్రయించాను. ‘సంభాషణ’ సులభమయింది. అతనికి నా అవసరం తెలిసింది. అరగంట ప్రయాణం తర్వాత ఒకచోట దించాడు. దిగానే గానీ అది నేను అనుకొన్న ప్రదేశం కాదని సులభంగానే బోధపడింది. ఆ తికమకల మధ్య ఓ మంచి మనిషి నా సమస్య అర్థం చేసుకొని మరో బస్సు ఎక్కించాడు. చివరికి సిటీ సెంటర్ చేరాను.

కరోలినా పార్కులో తిరుగాడుతూ కాసేపు గడిపాను. పార్క్ అంతా కుటుంబాలతో నిండిపోయి కళకళలాడుతోంది. చీకటి పడటం గమనించి పార్కు వదిలి మెయిన్ రోడ్డులోని పేవ్‌మెంటు పట్టుకొని చేరువలో కనిపిస్తోన్న ఆకాశహర్మ్యాల వైపుగా కాలు సాగించాను. ఆ భవనాలలో ఒకటి మన వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కట్టించిన ఆంటిలియా భవనంలా ఉంది. మరి ఆ రెండు భవనాల్లో ఏది ముందు వచ్చిందో ఏది దాని అనుకరణో తెలియదు. అక్కడి పేవ్‌మెంట్ల మీద ఎన్నో స్ట్రీట్ ఫుడ్ స్టాళ్ళు కనిపించాయి.

ఒక చేతిలో కాఫీ కప్పు మరో చేతిలో బొగ్గుల మీద తాజాగా కాల్చిన మొక్కజొన్నపొత్తు పట్టుకుని, సాగిపోయే మనుషుల్ని చూస్తూ, ఆ వాతావరణాన్ని నాలోకి ఇంకించుకొంటూ కాసేపు అక్కడ తిరిగాను. నిలబడి ఉన్న డబుల్ డెక్కర్ బస్సొకటి నా దృష్టిని ఆకర్షించింది. వాకబు చేస్తే అది ఊరంతా తిప్పి చూపించే నైట్ టూర్ బస్సని తెలిసింది. అప్పటికే ఆ టూరు కోసం మనుషులు చేరడం ఆరంభమయింది. ఊరు చూడడానికి, నగరపు చరిత్ర కాస్తంత తెలుసుకోవడానికీ ఆ టూరు ఉత్తమ మార్గం అనిపించింది. వెంటనే టికెట్టు తీసుకున్నాను.

ఆ ప్రాంతాలను ఆక్రమించిన స్పానిష్ వాళ్ళు 1534లో ఇప్పటి రూపంలో ఉన్న కీతో నగరాన్ని నిర్మించారు. మొత్తం దక్షిణ అమెరికా అంతటికీ అతి పురాతన రాజధాని నగరం అన్న ఖ్యాతి కీతోకు ఉంది. చరిత్ర నిండిన ఆ నగరపు కేంద్రం దక్షిణ అమెరికాలోకెల్లా అతి పెద్ద ప్రాంగణమని, తన పురాతన సంస్కృతిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకొంటోన్న ప్రాంగణమనీ పేరు పొందింది. 1978లో యునెస్కో వాళ్ళు మొట్టమొదటిసారిగా ప్రపంచ వారసత్వ సంపద అంటూ ప్రదేశాలను గుర్తించడం ఆరంభించినపుడు అలా మొదటి విడతలో గుర్తించిన రెండు నగరాలలో కీతో ఒకటి; పోలెండ్‌ లోని క్రాకుఫ్ (Kraków) రెండవది. ఇరవై లక్షలమంది నివసించే కీతో నగరం ఎక్వదోర్ దేశంలో రెండవ పెద్ద నగరం. ముప్ఫై లక్షల జనాభాగల సముద్ర తీరపు గుయాకీల్‌ (Guayaquil) నగరానిది మొదటి స్థానం. ఈ గుయాకీల్‌ నగరం కొన్ని ప్రత్యేక సమయాల్లో దేశానికి రెండవ రాజధానిగా వ్యవహరిస్తుందట.

1820లో ఎక్వదోర్ స్పెయిన్ పాలననుంచి విముక్తి పొందింది. ఆంతోనియో హొసే సుక్రె (Antonio Jose Sucre) నాయకత్వంలో స్వాతంత్ర్యం సాధించింది. కీతో నగరంలోని మరిస్కాల్ సుక్రె అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరే పెట్టారు. స్పానిష్ సేనలను కీతో నగరంలో ఓడించిన సుక్రె ఆ తర్వాత సిమోన్ బొలీవార్‌తో (Simón Bolívar) కలిసి ఎన్నో దక్షిణ అమెరికా దేశాల స్వాతంత్ర్య సమరాలకు సారథ్యం వహించాడు. అప్పట్లో ఎక్వదోర్ దేశం పొరుగున ఉన్న కొలంబియా, వెనెసువేలా (Venezuela), (ఇప్పటి) పనమా (అది అప్పట్లో కొలంబియా దేశంలో అంతర్భాగం) దేశాలతో కలిసి గ్రాన్ కొలంబియా (Gran Colombia) సమాఖ్యగా ఏర్పడింది. ఈ సమాఖ్య ఆలోచన సిమోన్ బొలీవార్‌ది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బాణీలో దక్షిణ అమెరికా ప్రాంతమంతటినీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ అమెరికా అంటూ ఒకే తాటిన నిలబెట్టాలని బొలీవార్ కలలు కన్నాడు. కానీ ఆయన ఆశలు ఫలించలేదు. పదేళ్ళు గడిచేలోగా దేశాలన్నీ విడివడి తమ తమ మార్గాలలో ముందుకు సాగాయి.

మా టూర్ బస్సు నగరపు శివార్లలోని ఎన్నో ఆసక్తికరమైన ప్రదేశాల మధ్యనుంచి సాగింది. అక్కడి రేయి మెరుపుల జీవన సరళిని కాస్తంత చవి చూపించింది. అవన్నీ చూపించి చివరికి దీపాల వెలుగులలో ధగధగ మెరిసే తెల్లటి భవనాల సిటీ సెంటర్లో మమ్మల్ని దింపింది. మేము దిగిన ప్రదేశం పేరు ల రోందా (La Ronda). అక్కడి వీధులన్నీ పాదచారులకే అంకితమై కనిపించాయి. ఆకట్టుకొనే శ్వేతవర్ణపు వలసకాలపు భవనాలు, వాటి బాల్కనీలు, రంగురంగుల కిటికీలు, తలుపులు – అది విభిన్న ప్రపంచం. సందడి నిండిన ప్రాంగణం. లెక్కకు మించిన రెస్టరెంట్లు సరేసరి.

వాటిల్లో ఎల్ బుయెన్ కఫే దె హొయెల్ (El Buen Café De Joel) అన్న రెస్టరెంటు నన్ను ఆకర్షించింది. ఏమైనా తిని ఓ కాఫీ తాగుదామని అందులోకి ప్రవేశించాను. కనెలాసో (Canelazo) అన్న ఆ ప్రాంతపు డ్రింకు ఆర్డర్ చేశాను. ఆల్కహాల్‌తోపాటు తాజా పళ్ళూ సుగంధ ద్రవ్యాలతో కూడిన పానీయమది. దానితోపాటు తినడానికి చికెన్ ఎంపనాదలు (Empanadas) తెప్పించుకున్నాను. స్థూలంగా ఈ ఎంపనాదలన్నవి మన కజ్జికాయల వంటి వంటకాలు. గోధుమ లేక మొక్కజొన్న రొట్టెల మీద మనం కోరుకున్న చికెన్ లాంటి వాటి తునకలూ కాస్తంత పరిమళం నిండిన అన్నమూ వేసి, వాటిని కజ్జికాయ ఆకారంలోకి మలచి, కాల్చడమో వేయించడమో చేసి మనకు వడ్డిస్తారు. దక్షిణ అమెరికా దేశాల్లో ఇవి విరివిగా, రకరకాల కాంబినేషన్లలో దొరుకుతాయి.

ఆ చిన్నపాటి తిండి తినడం ముగించాక నా నడకను కొనసాగించాను. కాస్తంత దూరం వెళ్ళాక ఓ తల్లీ కూతుళ్ళు నడుపుతోన్న రెస్టరెంటు నన్ను ఆహ్వానించింది. ఎంపనాద మొరోచో (Morochos) అన్నది ఆ రెస్టరెంటులో దొరికే విశేష పదార్థం: స్థూలంగా అది మన దోశలాగా ఉంది. పులియబెట్టిన గోధుమపిండితో చేసిన అట్టు అది. దాన్ని చట్నీలాంటి అనుపానంతో కలిపి అందిస్తున్నారు. ఈ ఎంపనాద మొరోచోతోబాటు ఎంపనాద బియెంతో (Vientos) అన్న వంటకమూ రుచి చూశాను. ఛీజ్‌తో నింపిన వంటకమది. ప్రిస్తీనో (Pristinos) అన్నది నేనక్కడ రుచి చూసిన మరో వంటకం. వీటిల్ని మన జంతికలతో పోల్చవచ్చు – తేనెతోగానీ తియ్యని సిరప్‌తోగానీ అందిస్తారు వీటిని. తిన్నవన్నీ రుచికరంగా ఉన్నమాట నిజమే అయినా నాకు మన దేశాన్ని గుర్తుచేసే ఎంపనాద మొరోచోలు అన్నిటికన్నా బాగా నచ్చాయి.


ఒతవాలో అన్నది కీతోకు వంద కిలోమీటర్లు ఉత్తరాన ఉన్న పురాతన పట్టణం. రెండు గంటల ప్రయాణం. ఆ ఊళ్ళోని మార్కెట్టువల్ల ఒతవాలోకు గుర్తింపూ ఖ్యాతీ లభించాయనాలి. ప్రీ-కొలంబియన్ రోజులనాటి సంస్కృతీ అనుభూతీ సందర్శకులకు పుష్కలంగా లభిస్తుందక్కడ… మొత్తం దక్షిణ అమెరికాలోకెల్లా విలక్షణమైన దేశవాళీ వస్త్రాలు, హస్తకళారూపాలూ అక్కడ దొరుకుతాయి. మధ్య అమెరికాలోని గ్వాతెమాల దేశపు చిచికాస్తెనాంగోలో (Chichicastenango) ఉన్న ప్రముఖ విపణివీధితోపాటు ఈ ఒతవాలో మార్కెట్‌నూ ఘనంగా చెప్పుకుంటారు. ఆ పట్నపు పరిసరాల్లో ఎక్కువగా కెచువా (Quechua) భాష మాట్లాడే స్థానిక తెగలవారు కనిపిస్తారు. వాళ్ళంతా కెచువా భాష మాట్లాడతారు. వాళ్ళు జుట్టు కత్తిరించుకోరు. మగవాళ్ళు కూడా నిడుపాటి జడలు వేసుకుని కనిపిస్తారు.

ఒతవాలో మార్కెట్ వారం పొడవునా తెరచి ఉండే మాట నిజమేగానీ శనివారంనాడు అక్కడ పెద్ద మార్కెట్టు జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లోని స్థానిక తెగలవాళ్ళంతా తమ తమ వస్తువులు అమ్ముకోడానికి ఆనాడు అక్కడికి చేరతారు. నేనక్కడికి వెళ్ళినరోజు అనుకోకుండా శనివారం అయింది. కీతోలో నాలుగు రోజులు ఎలా గడపాలీ అన్న విషయం హోటలు రిసెప్షన్‌లోని సారాతో చర్చిస్తున్నప్పుడు ఆమె ‘రేపు తప్పక ఒతవాలోలో ఉండేలా చూసుకోండి’ అని గట్టిగా చెప్పింది. చెప్పడమే కాకుండా ఒతవాలోకూ దాని పరిసర ప్రాంతాలకూ డే-ట్రిప్‌లు నడిపే టూర్ ఆపరేటర్ల వివరాలూ ఇచ్చింది. ఆమె ఇచ్చిన నెంబర్లకు ఫోన్ చేశాను. ఎవరూ ఎత్తలేదు. పోనీ వాళ్ళను ఇంటర్నెట్‌లో పట్టుకుందామా అని ఆ పనిలో పడ్డాను. ఆ ప్రయత్నంలో ఉండగానే ‘గెట్ యువర్ గైడ్’ అన్న వెబ్ సైటు తటస్థపడింది. ఆ సైటులో వివరాలు చూడటం వగైరా ఎంతో సరళంగా తోచింది. దానికి తోడు వాళ్ళు బ్రిటిష్ పౌండ్లూ యూరోలూ స్వీకరిస్తున్నారు. ఇక వెదుకులాట కట్టిపెట్టి వాళ్ళ ద్వారానే ఒతవాలోకూ ఆ పక్కనే ఉన్న కొతకాచి (Cotacachi), కుయికోచ (Cuicocha) అన్న ప్రదేశాలకూ తీసుకువెళ్ళే టూర్ ఒకటి బుక్ చేసేసుకున్నాను.

అది నాకు ఎక్వదోర్ దేశంలో రెండవ రోజు. ఉదయం ఏడున్నరకల్లా ఎన్. ఎచ్. కలెక్షన్ అన్న హోటలు దగ్గర ఉండాలని నిర్దేశించారు మా టూర్ ఏజెన్సీ వాళ్ళు. పొద్దున్నే బాగా పెందరాళే లేచి గబగబా తయారయ్యాను. అంతే త్వరగా బ్రేక్‌ఫాస్ట్ ముగించాను. ముగించి ఊబర్ బుక్ చేశాను. ఒక పాయింట్ నుంచి మరో పాయింట్‌కు మాత్రమే వెళ్ళాల్సిన సమయాల్లో ఎలాంటి వాహనం బుక్ చేయాలి అన్న విషయంలో నాకు పెద్దగా పట్టింపులుండవు. ఏది చవకగా కనబడితే దాన్ని బుక్ చేస్తాను. ఆరోజూ అలా బుక్ చేశాక వెళ్ళి మా హోటలు ముందు నిలబడి ఊబర్ కోసం ఎదురు చూడసాగాను. మా ఊబర్ యాప్ ‘నీ వాహనం వచ్చేసింది’ అని పదేపదే చెపుతోంది. డ్రైవరు కూడా ‘వచ్చేశాను’ అని మెసేజ్ పంపాడు. రోడ్డు మీద కారు మాత్రం కనిపించదు! పార్సిళ్ళు తీసుకెళ్ళే బాక్స్ ఉన్న మోటర్ సైకిల్ ఒకటి మాత్రం కనిపిస్తోంది. ఏం చేయాలో పాలుపోలేదు. ఆ మోటారుసైకిలు మనిషికూడా నాలానే విస్తుపోయి దిక్కులు చూడటం గమనించాను. అతను నాకేసి రాసాగాడు. అతని బండి నెంబరేవిటా అని పరిశీలించాను. నా ఊబర్ యాప్ చెపుతోన్న నెంబరే అది. నా హడావుడిలోపడి, చూసుకోకుండా పార్సిల్ బైక్ బుక్ చేసానన్నమాట. అప్పటికే ఏడూ పది అయింది. ఇరవై నిమిషాలే మిగిలింది టూరు బస్సు అందుకోడానికి. బైక్ మనిషికి నా పరిస్థితి వివరించి ‘బాబ్బాబు కాస్త ఎక్కువ ముట్టజెపుతాను, నన్ను నా గమ్యం చేర్చు’ అని బతిమాలాను. ఒప్పుకున్నాడు. ఆ పార్సిల్ బాక్స్‌ను దాటి నా కాలు వేసి బండి ఎక్కడం ఓ చిరుసవాలుగా పరిణమించింది. నా ఇబ్బంది గమనించి, బండిని ఓ పక్కకు వీలుగా వంచి, నా బైకారోహణ సులభతరం చేశాడా బైకు మనిషి. మొత్తానికి ఎక్కేశాను. వాహనసందోహం లేని కీతో నగరపు రహదారుల మీద బైకారూఢుణ్ణయి వేగవేగంగా గమ్యంకేసి సాగాను. సెలవు రోజవడమూ బాగా ఉదయం అవడమూ వల్ల రోడ్ల మీద ట్రాఫిక్ అంతగా లేదు. ఏడూ ఇరవై అయిదుకల్లా గమ్యం చేరాను.

ఫ్రాన్సిస్కో అన్న మనిషి ఆనాటి మా గైడు. డ్రైవరు పేరు హొసే. నేను ఎక్కేసరికి వ్యానులో ఐదుగురున్నారు. మరో పికప్ పాయింట్ తర్వాత మా వ్యాను నిండింది. అంతా కలిసి పదిమందిమి. అందులో విస్కాన్సిన్ నుంచి వచ్చిన క్రిస్టియానా, మాన్‌ఫ్రెడ్ అన్న మధ్యవయస్కులున్నారు. జర్మనీనుంచి వచ్చిన ఇరవై ఏళ్ళ అనామిక అన్న యువతి, పెద్రో అన్న స్థానిక బ్రెజిల్ మనిషి, పనమానుంచి వచ్చిన ఐదుగురు పడుచువాళ్ళు – అంతా కలిసి పదిమందిమి. చిన్న బృందం. మా ఫ్రాన్సిస్కో బాగా కలుపుగోరు మనిషి. కాసేపటికల్లా మా పదిమందిమీ ఒకరికొకరం బాగా దగ్గరయిపోయాం.

ఫ్రాన్సిస్కో వెనెసువేలా దేశపు మనిషి – చక్కని ఇంగ్లీషు మాట్లాడాడు. ఎక్వదోర్‌లో ఐదేళ్ళుగా ఉంటున్నాడట. స్వదేశం వదిలి ఎందుకు వచ్చావూ అని ఎంతో మర్యాదగానే అడిగాను. ‘పేరుకు మా వెనెసువేలా బాగా డబ్బున్న దేశమే. చమురు నిల్వల దేశం మాది. కానీ అదంతా పై పై మెరుగు. అక్కడ బతకడం కష్టం’ అన్నాడు ఫ్రాన్సిస్కో. మొదట్లో మార్పుకోసం కొద్దిరోజులు ఉందామని వచ్చాడట. ఆ కొద్దిరోజులు కాస్తా ఐదేళ్ళయిపోయింది. ‘ఇక్కడ నాకు అంతా బావుంది. ఇప్పట్లో వదిలి వెళ్ళాలని లేదు’ అన్నాడతను!

ఎక్వదోర్ కొలంబియాల్లో పంతొమ్మిది రోజులు గడపడానికి వచ్చాను అని చెప్పినపుడు ‘మరి వెనెసువేలా ఎందుకు వెళ్ళడంలేదూ’ అని అడిగాడు ఫ్రాన్సిస్కో. ఈ ప్రాంతపు పరిస్థితులు కాస్తంత అధ్యయనం చేశాక భద్రతా కారణాల వల్ల వెనెసువేలాను నా ప్రణాళికలో చేర్చలేదు అని నేను అన్నపుడు ‘కొలంబియా కన్నా వెనెసువేలా భద్రమైన దేశం’ అని వ్యాఖ్యానించాడు.


కీతో నగరం పొలిమేరలు దాటి పాన్ అమెరికన్ హైవే పట్టుకుని ఉత్తరదిశగా సాగటానికి మాకు నలభై నిముషాలు పట్టింది. ఆర్నెల్ల క్రితం మధ్య అమెరికా దేశాల్లో తిరుగాడి వదిలిపెట్టిన ఆ రహదారిని మళ్ళీ ఇపుడు దక్షిణ అమెరికాలో పట్టుకొని సాగిపోవడం ఒక అవినాభావ సంబంధాన్ని కొనసాగించడమే అనిపించింది. సంతోషం కలిగించింది.

మా ప్రయాణం తుప్పలూ గుట్టలూ నిండిన బయలు ప్రదేశంగుండా సాగింది. అక్కడ కిత్తలి తుప్పలని సాగు చెయ్యడం గమనించాను. ఈ కిత్తలి మొక్కల ఆకులు బాగా దళసరిగా ఉంటాయి. మొగలి రేకుల్ని పోలి ఉంటాయి. రసంతో నిండి ఉంటాయి. పొడి నేలల్లోనూ బ్రతికేయగల తుప్పలవి. ఆ ఆకులనుంచి వచ్చే రసాన్ని పంచదారకు ప్రత్యామ్నాయంగా వాడతారు. ఆ రసాన్ని పులియబెట్టి తెకీలా (Tequila) అన్న సారాయి తయారు చేస్తారు. దారిలో కనిపించిన కఫె ఈక్వేటర్ అన్న చోట కాఫీ కోసం ఆగాం. పేరు సూచిస్తున్నట్టే అది భూమధ్యరేఖ మీద ఉందట. అప్పుడే ఓవెన్ లోంచి తీసిన బిస్కెట్లు, తాజాగా అక్కడే చేసిన చాకొలెట్లు – వాటికి తోడు రుచికరమైన హాట్ చాకొలెట్ డ్రింకు – ఉల్లాసం కలిగించే అల్పాహారం దొరికిందక్కడ.

మంచు కిరీటం పెట్టుకొన్న కయాంబె (Cayambe) అగ్నిపర్వతం మాకు ఎదురుగా నిలిచి కనబడింది. కనబడిందన్నమాటేగానీ ఆ పర్వతమంతా మబ్బులు నిండి ఉండటం వల్ల దృశ్యం స్పష్టాస్పష్టంగానే ఉంది. ఎక్వదోర్ దేశంలో మూడవ ఎత్తయిన శిఖరమది. 5790 మీటర్ల ఎత్తు.

‘భూమధ్యరేఖ దగ్గర ఉన్నది’ అని చెప్పబడే కఫేలో కూర్చుని ఉన్నాం కదా – అది ఖచ్చితంగా భూమధ్యరేఖా ప్రాంతమా కాదా అన్న బాల్యమీమాంస మాలో మళ్ళా నెలకొంది. పరిశీలించి చూస్తే కాదనే తేలింది. క్రిస్టినా, మాన్‌ఫ్రెడ్ ‘మన కఫేకు ఎదురుగా రోడ్డుకు అవతల ఈక్వేటర్ మాన్యుమెంట్ ఉంది చూడండి’ అని అందరికీ చూపించారు. చూడ్డానికి గంభీరంగా ఉంది కానీ ఆ స్మారకచిహ్నం కూడా మా మొబైల్ జిపిఎస్ లెక్కల ప్రకారం ఖచ్చితమైన స్థానంలో లేదు. మా మాయలేడి వేటలు చూస్తోన్న ఫ్రాన్సిస్కో నింపాదిగా మమ్మల్నందర్నీ వ్యాను ఎక్కించాడు. ‘మీ సమస్య నేను పరిష్కరిస్తాను చూడండి’ అని హామీ ఇచ్చాడు. ‘మీ జిపిఎస్‌లు తెరచి సిద్ధంగా ఉంచుకోండి’ అన్నాడు. మెల్లగా వ్యాను నడిపించాడు. క్రమక్రమంగా మేమంతా జీరో డిగ్రీ అక్షాంశానికి చేరువ కాసాగాము. మరికాస్త ముందుకు వెళ్ళి ఖచ్చితంగా జీరో డిగ్రీకి చేరాము. వ్యానంతా పదిమంది పిల్లల కేరింతలే కేరింతలు. క్షణాల్లో వ్యాను వేగమందుకొని ఉత్తరార్ధగోళంలోకి ప్రవేశించింది. గత రెండురోజుల్లో నేను భూమధ్యరేఖను రెండుసార్లు దాటానన్నమాట!

మేమంతా కయాంబె పట్టణాన్ని దాటుకొని ముందుకు సాగాం. దాటిన కొద్ది నిముషాల తర్వాత ఒక కఫే దగ్గర ఆగాం. అక్కడో చక్కని విస్టా పాయింట్ ఉంది. ఇంబబూరా (Imbabura) అన్న అగ్నిపర్వతం, దాని ముందు ఉన్న చెరువు ఎంతో విపులసుందరంగా కనిపించే ప్రదేశమది. ఆ కఫే ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించిన ఒక స్థానిక మహిళ తన పదేళ్ళ కొడుకుతోబాటు కనిపించింది. వారి దగ్గర ఒక అల్పాక (Alpaca) ఉంది. ఈ అల్పాక అన్నది దక్షిణ అమెరికా ఉన్నత పర్వత ప్రాంతాల్లో పెరిగే ఒక ముచ్చటైన జీవి. శరీరమంతటా మన బొచ్చు గొర్రెలను, మెడా మొహమూ మాత్రం ఒంటెలనూ పోలి ఉంటాయి. చిన్నపాటి శాంతజీవులవి. దాని బొచ్చుతో దుప్పట్లూ స్వెటర్లూ నేస్తారు. ఆ తల్లీ కొడుకులు తమతోనూ తమ అల్పాక‌తోనూ ఫోటోలు దిగమని అందర్నీ అడుగుతున్నారు – అందుకు రుసుము ఒక డాలరు.

ఒతవాలో పట్టణం చుట్టూ వృత్తాకారంలో నిలిచిన అగ్నిపర్వతాల మధ్యన ఉంది. ఇంబబూరా పర్వతం మిగిలిన అన్నీ పర్వతాలకన్నా ఊరికి దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రాంతపు దృశ్యమాలికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒతవాలో పట్టణంతో కూడిన పరిపాలనా విభాగానికి ఈ ఇంబబూరా పేరే పెట్టారు. 4609 మీటర్ల ఎత్తు ఉన్న ఈ పర్వతపు పరిసర ప్రాంతం సారవంతమైంది. రకరకాల పంటలు పండిస్తున్నారక్కడ.

మరికొద్ది నిముషాల్లో ఒతవాలో పట్టణం చేరుకున్నాం. మార్కెట్ దగ్గర ఆగాం. చూసీ చూడగానే ఆ ప్రాంతపు దేశవాళీతనం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ ఊరి ముఖ్యకూడలి – ప్లాసా దె పాంచోస్ – దగ్గర విస్తరించి ఉన్న మార్కెట్ అది. ఈ పాంచో అన్నది తల దూర్చేందుకు రంధ్రం మాత్రమే ఉండి శరీరమంతటినీ దుప్పటిలా కప్పే వస్త్రం. రంగురంగుల గుడారాల స్టాళ్ళు బారులు తీరి కనిపించాయక్కడ. అందమైన దుప్పట్లు, జంపర్లు, హస్తకళాకృతులు అమ్మకానికి కనిపించాయి. ఈ వస్తువులతోబాటు కూరగాయలు, పచారీ సామాన్లు, పళ్ళు, గృహపరికరాలు, తిండి పదార్ధాలు, నగలు – దొరకని వస్తువు లేదక్కడ. వీటన్నిటికీ తోడు వేణువూ ఇతర సంగీత వాద్యాలను వినిపించే కళాకారులూ విరివిగా కనిపించారు. ఆ ప్రాంతమో వర్ణలీల. ఆనందహేల.

అక్కడి మహిళల్లో చాలామంది – ముఖ్యంగా స్టాళ్ళలోని వాళ్ళు – సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. రంగురంగుల డిజైన్లు, పూల జాకెట్లు, నల్లని పొట్టి పావడాలు, పైన ఓ ఓవరాల్, నడుమున రంగురంగుల గుడ్డ బెల్టు, మెడలో పూసల హారాలు – వారి దుస్తులు చూడముచ్చటగా ఉన్నాయి. అప్పట్లో ఇన్కా తెగవారు ధరించే దుస్తుల బాణీకి ఇప్పటి ఈ వస్త్రాలు అతి దగ్గరగా ఉంటాయట. మగవాళ్ళు పాంటూ చొక్కాలలో ఉన్నారుగానీ వారి జుట్టు మాత్రం మధ్యపాపిడి తీసి జడ వేసి ఉంది.

జీవం ఉట్టిపడే విపణవీధులవి. ఆ ఉల్లాస వాతావరణంలో మునిగితేలడమన్నది అరుదైన అనుభవం. అసలిలాంటి ఏ మార్కెట్టన్నా నాకు మక్కువే – ఇహ అచ్చమైన దేశవాళీ మార్కెట్టంటే చెప్పేదేముందీ?! ఆ దుకాణాలను తనివిదీరా చూసుకుంటూ అక్కడ నింపాదిగా పచార్లు చేశాను. మా వ్యాను మిత్రులంతా మార్కెట్ స్టాళ్ళలో ఎవరివారు అటు అదృశ్యమయిపోయారు. మళ్ళా రెండుగంటల తర్వాత అందరం ముందే అనుకొన్న ప్రదేశం దగ్గర కలుసుకున్నాం. మేం కలుసుకున్నచోట వంటకాల పరిమళాలు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి… వాటి ప్రభావంలో పడి అటు అడుగువేసే లోపే మా వ్యాను వచ్చేసింది.

ఒతవాలో నుంచి కొతకాచి కయాపాస్ (Cotacachi Cayapas) నేషనల్ పార్కుకు వెళ్ళాం. ఒతవాలో దాటగానే సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఇద్దరు మహిళలు మా వాహనంలోకి ప్రవేశించి స్థానిక గీతాలు పాడారు. వారి స్వరాల్లో మాధుర్యముంది. నేనెప్పుడూ వినని భావతీవ్రత ఉంది. ఆ పాటలు నన్ను ఆకట్టుకున్నాయి. మా అందరి దగ్గరా కాసిన్ని నాణేలు సేకరించి వాళ్ళు పక్క ఊరి దగ్గర దిగిపోయారు.

అక్కడి పద్ధతి ప్రకారం స్థానిక తెగల నాయకుడు స్వయంగా తానే సందర్శకులందరినీ ఆ నేషనల్ పార్కులో తిప్పి చూపించి ఆ ప్రాంతపు జీవన విధానాన్ని వివరిస్తూ ఉంటాడట. కానీ ఆ రోజు స్థానిక సంస్థలకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో ఆయన ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నాడట. అన్నట్టు ఆ నాయకుడు ఆ ప్రాంతపు రాజకీయవేత్త కూడానూ… తన అశక్తతను మన్నించమని కోరుతూ ఫ్రాన్సిస్కో ద్వారా సందేశం పంపాడా మంచిమనిషి.

మూడువేల చదరపు కిలోమీటర్ల ప్రాంగణంలో ఉన్నదా కొతకాచి కయాపాస్ నేషనల్ పార్కు. ఇటు ఇంబబూరా అటు పక్కనే ఉన్న ఎస్మరాల్దెస్ పరిపాలనా విభాగాలలో ఆ ప్రకృతి ప్రాంగణం విస్తరించి ఉంది. 4944 మీటర్ల ఎత్తువున్న కొతకాచి జ్వాలాముఖి అక్కడి అత్యున్నత బిందువు.

లగూనా దె కుయికోచ (Laguna de Cuicocha) అన్నది ఆ ప్రాంతపు బిలముఖాలలో ఏర్పడిన సరోవరం. కూలిపోయిన జ్వాలాముఖులు వదిలిన లోతట్టు ప్రాంతమే ఈ సరోవరపు ఆయువుపట్టు. రెండువందల మీటర్ల లోతు, మూడు కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సరోవరం సముద్రతలానికి 3200 మీటర్ల ఎత్తున ఉంది. ఆ సరోవరం ఒడ్డునే గంటంబావుసేపు మేమంతా నడిచాం. ఆరోజు మహా వేడిగా ఉంది. భూమధ్యరేఖాప్రాంతంగదా, సూర్యుడి తాపం గుచ్చుకునేలా ఉంది. చర్మాన్ని కమిలిపోయేలా చేసే శక్తి ఆ ఎండకు ఉంటుంది. అంచేత దుస్తులకు బయట ఉండే శరీరభాగాలకు సన్‌స్క్రీన్ క్రీమ్ దిట్టంగా రాశాను. నా బ్యాక్‌ప్యాక్‌లో ఆ క్రీమ్ అన్ని వేళలా ఉంచుతాను.

పనమానుంచి వచ్చిన పడుచువాళ్ళు నాతో కలసిమెలసి మెలగడం మొదలెట్టారు; నడక పూర్తయేసరికి స్నేహితులైపోయారు. మేమంతా పనమా దేశంలో నేను ఆరునెలల క్రితం చేసిన పర్యటన గురించి మాట్లాడుకొన్నాం. వాళ్ళు అక్కడి యూనివర్శిటీ విద్యార్థులు; తిరగడానికి వచ్చారు. వాళ్ళను చూస్తే నాకు ముచ్చట వేసింది; జీవితంలోని అతి చక్కని దశలో ఉన్నారు – చీకూచింతా లేని కాలేజీ రోజులు… మరువలేని జ్ఞాపకాలు మిగిల్చే దినాలు… వాళ్ళంతా నా పర్యటనల మీద ఎంతో ఆసక్తి కనబరచారు. ‘మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి, అనేక దేశాలలో, ఏ అడ్డంకీ లేకుండా పర్యటించగలరు’ అన్నాడు వారిలోని ఒక యువకుడు. ‘మీ యవ్వనం చూస్తే నాకు అసూయగా ఉంది. నా యాత్రాసౌలభ్యాన్ని మీ యవ్వనంతో మార్పిడి చేసుకోడానికి నేను సిద్ధం సిద్ధం…’ అన్నాను. అంతా నవ్వేసుకున్నాం.

ఆ చెరువు మధ్యలో దట్టమైన చెట్లు నిండిన ద్వీపశిఖరాలు మూడు ఉన్నాయి. అవన్నీ చెరువు మధ్యలోంచి ఉబికివచ్చే లావా వల్ల ఏర్పడ్డ గుట్టలని వివరించాడు ఫ్రాన్సిస్కో. నీలాల జలాల మధ్య నిలచిన ఆ పగడాల శిఖరాలు చెరువుకు వింతశోభను సమకూర్చుతున్నాయి. ఆ సరోవరపు పేరు ఈ పగడాల శిఖరాల ఆకృతినుంచే వచ్చిందట – స్థానిక భాషలో ఆ పేరుకు అర్థం గినీ పిగ్స్ అని అట.

ఆ చెరువులోని నీళ్ళు మహా ఉప్పగా ఉంటాయట. జీవజాలం బ్రతకడానికి అనువుగానివట. ఆ జలాలలో బతికి బట్టగట్టే రకపు చేపలను అక్కడ వదిలి చెరువును సజీవం చేసే ప్రయత్నాలు జరిగాయట కానీ అవి ఫలించలేదు. అలా వదిలిన చేపలు చాలావరకూ చచ్చిపోయాయి. ఒకటీ అరా బతికినా వాటికి పునరుత్పత్తి సామర్థ్యం లేకుండా పోయిందట.

నడక ముగించుకొని వచ్చాక అందరం కాస్తంత దూరానే ఉన్న పట్నంకేసి సాగిపోయాం. అప్పటికే మధ్యాహ్నం మూడయింది. నేనయితే లంచికి ఆలస్యమయిపోయిందని కాస్తంత తొందరపడ్డాగానీ ఆ ప్రాంతాల్లో అదే లంచి సమయమట. అంతా భోజనం దిశగా నడక ఆరంభించాం. అర కిలోమీటరు నడిచాక మేము చేరవలసిన ల మర్కేస రెస్టరెంటు కనిపించింది. ఊళ్ళోకెల్లా పేరున్న రెస్టరెంటు ఇది అని చెప్పాడు ఫ్రాన్సిస్కో. అచ్చమైన కొతకాచి ప్రాంతపు భోజనం అక్కడ దొరుకుతుందనీ చెప్పాడు. ఫ్రాన్సిస్కోనూ మిగతావాళ్ళనూ గమనించి నేను కూడా కోర్న్ కొలొరాద అన్న వంటకం ఆర్డరు చేసాను. ఎండబెట్టి వేయించిన పందిమాసం, నానబెట్టిన మొక్కజొన్నలు, అవకాడో, రెండు మూడు వేయించిన అరటి ముక్కలు – వీటి సమ్మేళనం ఆ వంటకం. త్రాగడానికి గౌబాన (Gaubana) రసం అడిగాను. ఈ గౌబాన అన్నది స్థానికంగా దొరికే ఒక పండు పేరు.

సమమనస్కులతో లంచ్ టేబుల్ పంచుకోవడం అంటే యాత్రా విశ్వవిద్యాలయంలో చేరి యాత్రానుభవాల నిధిని పంచుకోవడం, అధ్యయనం చేయడమే! తమ తమ అనుభవసారాలను ఒకరికొకరు అందించుకునే విషయాల విద్యాప్రాంగణం… ఆరోజు మా అందరమూ ఆ పనిలోనే పడ్డాం. భోజనం చేసిన నలభై నిముషాల సమయంలో అంతా తలా కాస్త పరిజ్ఞానం, విజ్ఞత సాధించుకోగలిగాం. నా వరకూ నేను ఎక్వదోర్ కొలంబియా దేశాల్లో ఏం చూడాలి, ఏం చెయ్యాలి అన్న విషయంలో కాస్తంత స్పష్టత పొందాను.

మా టూరు ముగియడానికి మరో అరగంట వ్యవధి ఉంది. ఆ జర్మన్ యువతి అనామిక నాతోబాటు కలసి వచ్చింది. ఇద్దరం ఊరి మెయిన్ రోడ్డు మీద నడిచాం. మార్కెట్లో తోలు వస్తువుల దుకాణాలు ఎక్కువగా ఉండటం గమనించాను. వాకబు చేస్తే కొతకాచిని ఎక్వదోర్ దేశపు తోలు పరిశ్రమ రాజధాని అని అంటారని తెలిసింది. అనామిక తన యూనివర్శిటీ కోర్సు మధ్యలో ఒక సంవత్సరం ‘విరామం’ తీసుకుంది. ఆ సమయమంతా దక్షిణ అమెరికాలో తిరుగుతూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ గడుపుతోంది. కీతో నగరంలోని ఓ యూత్ హాస్టల్లో ఉంటోంది. ఆమె తలిదండ్రులుకూడా యాత్రాప్రేమికులట – అంచేత వారి మద్దతు, ప్రోత్సాహం ఆమెకు లభిస్తున్నాయి. నాతో గడిపిన సమయంలో ఆమె యాత్రలకు చెందిన కొన్ని వివరాలు అడిగి తెలుసుకొంది. నేను కూడా కీతో నగరం గురించి కొన్ని వివరాలు తెలుసుకోగలిగాను.

సాయంత్రం అయిదయింది. కీతోకు మా తిరుగు ప్రయాణం ఆరంభించాం.

(సశేషం)