గణేశ్ బప్పా

ప్రతి బుధవారం సాయంత్రం ద్వారకా నగర్ లైబ్రరీలో సమావేశం అవడం మా సాహితీ సమితి సభ్యులకి అలవాటు. వచ్చిన వాళ్ళు పురాణశ్రవణానికి వచ్చినట్లు కాకుండా వాళ్ళు వ్రాసినదో, ఇతరులదో, కథో, కవితో, వ్యాసమో, సమీక్షో తెచ్చి, చదివి, అది ఎందుకు నచ్చిందో చెప్పడం నియమం.

ఆ రోజు శాస్త్రిగారు ముందుగా లేచి, తనకు నచ్చిన కథ అని చెప్పి, రోల్డ్ డాల్ వ్రాసిన లామ్ టు ది స్లాటర్ కథ చదివారు. ఎందుకు నచ్చిందో చెబుతూ, “జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు, ఊహించని పొరపాట్లూ జరుగుతాయి. వాటి పర్యవసానంగా, మనం ఎంతో విలువైన వస్తువుల్నీ ఆత్మీయమైన మనుషులనీ పోగొట్టుకుంటాం. మరింత బాధాకరమైన విషయం, ఈ కథలోని కథానాయిక మేరీ లాగా, ఆ పోగొట్టుకోడానికి కారణం మనమే అవడం. కానీ జీవితం అక్కడ ఆగిపోదు. ఆగిపోకూడదు కూడా. సగటు మనిషి ఆలోచించినట్టు ఆలోచించకుండా, జీవితం మన ముందు ఉంచిన సవాలును ఎదుర్కొని ముందుకు పోవడమే మన కర్తవ్యం. ఈ సత్యాన్ని ఈ కథ చక్కగా చెబుతుంది,” అని ముగించారు.

ఆమె ప్రవర్తన గురించి, చివర పోలీసులు తమలో మాటలాడుకుంటూ “మన కళ్ళకెదురుగానే” అన్న మాటలో చమత్కారం గురించీ, మంచి చర్చ నడిచింది. అనుకుంటాం గాని, ఒక రచనలో సన్నివేశాలు, సంభాషణలను తీర్చిదిద్దే రీతిలో రచయిత తాత్విక చింతన ఏ మేరకు తొంగి చూస్తుంటుందో, దానిని చదివేవారు, దాన్ని అర్థంచేసుకునే క్రమంలోనూ విమర్శించే తీరులోనూ, వారి వారి తాత్విక దృక్పథాలు తొంగి చూస్తుంటాయి.

సత్యవతిగారు జ్యోతిలో వచ్చిన ఆమె కవిత చదివారు. రావు తాను చేసిన ఇంగ్లీషు కథకి తెలుగు అనువాదాన్ని వినిపించాడు. బాలకృష్ణగారు మంచి గాయకుడు. ఒక రకంగా మా ఆస్థాన గాయకుడు. అప్పుడప్పుడు చిన్న చిన్న సరదా కవితలు వ్రాసి రాగయుక్తంగా పాడి వినిపిస్తుంటాడు. “మీకు మినపట్లూ, పెసరట్లూ, పుల్లట్లూ ఇష్టమైతే, నాకు చప్పట్లు చాలు,” అంటూ హాస్యానికి ఒక చిన్న కవిత పాడి వినిపించాడు. విజయలక్ష్మిగారు ఆవిడ వ్రాస్తున్న సీరియల్లో ఒక భాగాన్ని వినిపించారు. నేను చదవబోయే కవిత కూడా, శాస్త్రిగారు వినిపించిన కథలోని భావాన్నే సూచిస్తుంది అని చెప్పి రవికుమార్ ఎడ్నా విన్సెంట్ మిలే వ్రాసిన లామెంట్ అన్న కవిత చదివాడు.

నా వంతు వచ్చింది.

“ఒక్కోసారి ఇలా కుదురుతుంటుంది. ఇవాళ నేను చదవబోయే కథకి శాస్త్రిగారు, రవికుమార్‌గారూ జీవితం ఒక్క చోట ఆగిపోకూడదని, ముందుకే వెళ్ళాలని, దానికి తగిన సంసిద్ధత మనలో ఎప్పుడూ ఉండాలనీ చెప్పే కథని, కవితనీ చదివి మంచి నేపథ్యాన్ని సమకూర్చారు. ఆ విషాద క్షణం, దాని తాకిడి, మనని ఒక రకమైన విభ్రమకి లోను చేస్తుంది. మనం విపరీతమైన మానసిక సంఘర్షణకి లోనవుతాం. ఒక లౌకిక సత్యం మనలోకి ఇంకి మనం జీవితంలో అయిష్టంగా గ్రాడ్యుయేట్ అవుతాము.

“ఈ కథకి ఒక రకంగా ప్రేరణ నేను చిన్నప్పుడెప్పుడో పత్రికలోనో, ప్రభలోనో చదివిన కథ. కథ పేరు గాని, రచయిత పేరు గాని గుర్తు లేవు. కానీ కథ మాత్రం బాగా గుర్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, అందులో ఒక పసివాడి తల్లి చనిపోతుంది. వాడు బయట ఆడుకుంటూంటాడు. లోనికి వచ్చి, ఆమెను కుదిపి కుదిపి మాటాడటానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో ఎవరో వచ్చి వాడికి ఇష్టమైన కుక్కపిల్లతో ఆడుకోమని దూరంగా తీసుకుపోతారు. తర్వాత చూస్తే, వాడికి ఇంట్లో ఎప్పుడూ పడుక్కున్న మంచం మీద వాళ్ళ అమ్మ కనిపించదు. ఇల్లంతా వెతుకుతాడు. కనిపించదు. ఏమయింది అని అడిగితే దేముడు దగ్గరకు వెళ్ళిందని చెబుతారు. ఆమె ఏదో ఊరు వెళ్ళిందనుకున్నాడేమో, ఊరుకుని తన కుక్కపిల్లతో ఆడుకుంటుంటాడు.

“ఒకరోజు, ఆ పిల్లడు కుక్కపిల్లతో రోడ్డు మీద ఆడుకుంటుంటే దానిని జోరుగా వస్తున్న సైకిలో, మరేదో వాహనమో, గుద్దేస్తే అల్లంత దూరం పడి చచ్చిపోతుంది. ఎంత ప్రయత్నించినా అది లేవదు. దారిన పోతున్న దానయ్య ఎవరో చూచి, ‘బాబూ, అది చచ్చిపోయిందిరా. అది లేవదు,’ అంటాడు.

‘అంటే?’ అని అడుగుతాడు కుర్రాడు. ‘అంటే అది దేవుడి దగ్గరకు పోయింది. మరి లేవదు,” అని చెప్పి వెళ్ళిపోతాడు.

అప్పుడు వాడికి వాళ్ళమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందని ఇంట్లో చెప్పిన మాట గుర్తొస్తుంది. చావంటే ఆ పిల్లవాడికి మొదటిసారి అర్థం అయి ఒక్కసారి అమ్మా! అని బావురుమంటాడు.”

ఇంతలో అధ్యక్షులవారు అందుకుని, “ఇలాంటి కథే శ్రీపతిగారు ట్రావెలోగ్‌గా ఇండియా టుడే మాసపత్రికలో ఈ మధ్యనే వ్రాశారు. టూకీగా చెప్పాలంటే, కొడుకూ, కోడలూ పోయిన ఒక తాతగారు వారసుడిగా మిగిలిన మనవడిని పెంచుతూ ఉంటాడు. కాస్తంత జ్ఞానం వచ్చిన కుర్రాడు పదే పదే అమ్మ గురించి అడిగితే, అమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళిందని చెప్తాడు. తన మనసుకి ప్రశాంతత చిక్కడానికి కుర్రవాడిని తీసుకుని యాత్రలకు బయలుదేరుతాడు. కుర్రాడు ‘ఎక్కడికి పోతున్నాం మనం?’ అని అడిగితే, అలవాటుగా ‘దేవుడిని చూడ్డానికి’ అని చెప్తాడు. కుర్రాడు ఉత్సాహంతో బయలుదేరుతాడు. తాత, మనవడు శ్రీశైలం చేరుకుంటారు. ఆ రోజు ఏదో పండగ అవడం మూలాన ఆలయం జనాలతో కిటకిటలాడుతుంది. ‘నాకు దేవుడు కనిపించడం లేదు, తాతా!’ అని కుర్రాడు మారాం చేస్తాడు. పాపం తాత ఆ కుర్రాడిని భుజాల మీద ఎక్కించుకుని ఎదురుగా శివలింగాన్ని, పానవట్టాన్నీ చూడమంటాడు. ‘దేవుడు కనిపిస్తున్నాడు గానీ, తాతా, అక్కడ అమ్మ కనిపించటం లేదు’ అంటూ ఏడుపు లంకించుకుంటాడు ఆ కుర్రవాడు.

“పిల్లలకి చావు గురించి పరిచయం చెయ్యటం చాలా కష్టం. ఆ సత్యం పరిచయమైన క్షణం వాళ్ళని గొప్ప మానసిక సంఘర్షణకి లోను చేస్తుంది” అని ముగించారు.

నేను అందుకుని, “కొన్ని సత్యాలు వాళ్ళ అవగాహన పరిధికి మించినవి కావటం వలన పిల్లలకి కొన్ని విషయాల గురించి అపోహలు ఉంటాయి. ఆ అజ్ఞానం, ఆ అమాయకత్వమే వాళ్ళ పసితనం ఆనందంగా గడిచిపోవడానికి తోడ్పడుతుంది. ఆ భ్రమలు తొలగడం వయసుతోపాటు అవగాహన పెరిగి తొలగితే ఫర్వాలేదు. కానీ, కొన్ని సత్యాలు వాళ్ళ పసితనం వీడక అకస్మాత్తుగా ముందే అవగాహన అవుతాయి. ఆ క్షణంలో వాళ్ళు పడే వేదన కూడా, అంత వయసులో ఉన్నప్పటికీ రోల్డ్ డాల్ కథలో మేరీ పడిన బాధకీ, ఎడ్నా కవితలో తల్లి పడిన వేదనకు ఏమాత్రం తీసిపోవు. చాల వరకు ఇది జరిగిన కథే. చిత్తగించండి” అంటూ కథ ప్రారంభించాను:


“మూర్తిగారూ! రాగిణి మేడమ్‌గారు మిమ్మల్ని సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు కలవమన్నారు,” అన్నాడు ఫోన్‌లో మేడమ్‌గారి సెక్రటరీ రవి.

“ఎక్కడ కలవాలి?”

“ఇంటికి రండి. ఆరు దాటేక అమ్మగారు తీరుబాటుగా ఉంటారు.”

“సరే” అని చెప్పి ఫోను పెట్టేశాను.


ఎందుకైనా మంచిదని ఒక పది నిముషాలు ముందే వెళ్ళాను. మేడమ్‌గారి సెక్రటరీ కూర్చోబెట్టి, కాఫీతో పాటు మర్యాదలన్నీ చేశాడు. తర్వాత రాగిణి మేడమ్ గదిలోకి వచ్చారు.

“మూర్తిగారూ! ఊరి నుండి ఎప్పుడు వచ్చారు?”

“వారం రోజులయిందమ్మా!”

“పిల్లలూ, మనుమలూ అందరూ బాగున్నారా?”

“మీ దయ వల్ల అంతా బాగున్నారండీ.”

“మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, ఈ మధ్య మా చిన్నవాడు ఆరిహంత్‌కి అల్లరి బాగా ఎక్కువైపోతోందండీ. దేని మీదా కుదురుగా దృష్టి ఉండదు. హోమ్‌వర్క్ చేయిద్దామంటే పట్టుమని పది నిముషాలు కూచోలేడు. భోజనం చేస్తూ చేస్తూ మరిచిపోయి టాబ్లెట్‌లో వీడియోలు చూస్తూ గడుపుతాడు. ఎంతసేపూ ఆట… ఆట… ఆట. పోనీ దాని మీదనైనా శ్రద్ధ ఉందా అంటే అదీ పది నిముషాలే. క్షణం కాలు నిలవదు. స్కూల్లో కూడా ఇదే తంతు.”

“పిల్లలు కదండీ! ఆ వయసులో అది సహజం. ఇవాళ రేపూ ఆఫీసులోనే ఎవరూ కుదురుగా కూచోరు. అరగంట కొక సారి వెళ్ళి కాఫీనో, టీనో తాగి రాకపోతే పని చెయ్యలేరు. అలాంటిది చిన్నపిల్లల దగ్గర నుండి ఆశించడం కష్టం.”

“లేదు. డాక్టర్ కృష్ణగారని మా ఫామిలీ డాక్టర్‌కి చూపించేను. మావాడు రెండు నెలలు ముందే పుట్టాడు. పుట్టినపుడు బరువు కూడా తక్కువ. అందుకని వాడికి ADHD ఉండే అవకాశం ఉందన్నారు. వాడిని ఆ టాబ్లెట్ చూడడం మానిపించి వాడికి ఇష్టమైనది చదవడమో, కథలు చెప్పడమో, సంగీతమో, ఏదో ఒకటి నేర్పించమన్నారు. మా బావగారి అబ్బాయికి మీరు కథలూ, పద్యాలూ చెప్పేవారు కదా. అందుకని వీడికి కూడా ఏదో ఒకటి చెబుతారని అడగడానికి పిలిపించాను. ఏమనుకోకపోతే, సాయంత్రం ఒక గంట సేపు చెప్పండి” అన్నారామె.

“దానికేముందమ్మా, తప్పకుండా చెప్తాను. కానీ మీవాడికి ఏమిటేమిటి ఇష్టమో నాకు కాస్త చెప్పండి. వీడియోలో ఏమిటి చూస్తాడు. ఏమిటి ఇష్టపడి తింటాడు. ముఖ్యంగా చాక్లెట్‌లా, కుకీలా? ఏయే ఆటలు ఇంట్లో ఆడతాడు?” అని అడిగాను.

అలా ఒక పది నిముషాలు ఆరిహంత్ గురించి ఇష్టాయిష్టాలు తెలుసుకున్న తర్వాత సెలవు తీసుకున్నాను.


మూడో రోజు సాయంత్రం ఆరు గంటలకి అపాయింట్‌మెంట్ ఇచ్చిన వేళకి మేడమ్‌గారి ఇంటికి వెళ్ళాను.

“మాస్టారు చెప్పినట్లు బుద్ధిగా నేర్చుకో,” అని ఆరిహంత్‌కి చెప్పి, వాడిని నాకు విడిచి పెట్టి మేడమ్‌గారు లోనికి వెళ్ళారు.

“అయితే ఆరిహంత్! ఇవాళ వినాయక చవితి కదా! మమ్మీతో కలిసి పూజ చేశావా? అని అడిగాను.

“చేశాను.”

“దేవుణ్ణి ఏమని అడిగావు?”

“బోల్డు చదువు కావాలని అడగాలని మమ్మీ చెప్పింది. అడిగాను.”

“నిజంగా?”

“నిఝంగా!” రెప్పలు ఒక్కసారి గట్టిగా నొక్కి మరీ చెప్పాడు.

“అయితే గణేశ్ బప్పాని అడిగి తెలుసుకుంటానుండు,” అని సెల్‌ఫోను తీశాను.

“గణేశ్ బప్పా నెంబరు నీ దగ్గర ఉందా?”

“ఉంది. మే మిద్దరం రోజూ మాటాడుకుంటాం.”

“ఏదీ, తే! అయితే నేను కూడ మాటాడతా.”

“గణేశ్ బప్పా పెద్దవాడు కదా. అతను మాటాడేది నీకు అర్థం కాదు. నేనడిగి నీకు చెబుతాలే” అని చెప్పి ఏదో నంబరుకి డయల్ చేశాను.

“హలో గణేశ్ బప్పా! ఆరిహంత్ ఇవాళ నీకు పూజ చేశాడుట. బోల్డు చదువు కావాలని అడిగేడుట. నిజమేనా?”

“…”

“నిజమేనా! అయితే మరి ఎప్పుడిస్తావ్?”

“….”

“బుద్ధిగా శ్లోకాలు నేర్చుకుంటే ఇస్తావా?”

“…”

ఫోను కట్ చేసి, ఆరిహంత్‌తో “నువ్వు బుద్ధిగా శుక్లాంబరధరం నుండి శ్లోకాలు నే చెప్పినవి నేర్చుకుంటే బోల్డు చదువు ఇస్తాడుట.” అన్నాను.

“ఉత్తదే. అదంతా అబద్ధం.” అన్నాడు నమ్మాలో నమ్మకూడదో తేల్చుకోలేక.

“అలా అయితే చూడు. ఇప్పుడే బప్పాతో మాటాడి నువ్వు ఇవాళ బుద్ధిగా నేర్చుకుంటే నీకు కావలసింది ఇమ్మనమని చెప్తాను” అని, “నీకేమిటి కావాలో చెప్పు” అన్నాను.

కాసేపు ఆలోచించి నాకు కిట్‌కాట్ కావాలన్నాడు. మళ్ళీ వెంటనే, “ఒకటి కాదు, రెండు కావాలి” అన్నాడు.

నేను మళ్ళీ డయల్ చేసి, “గణేశ్ బప్పా! గణేశ్ బప్పా! ఆరిహంత్‌కి రెండు కిట్‌కాట్‌లు కావాలిట. ఇవాళ బుద్ధిగా నేర్చుకుంటానన్నాడు. నేను బుద్ధిగా నేర్చుకున్నాడో లేదో అరగంట పోయేక చెప్తాను. అప్పుడు పంపించు” అన్నాను.

“గణేశ్ బప్పా ఎలా పంపిస్తాడు?” అని అడిగాడు.

“ఇవాళ ఊరంతా పందిళ్ళే కదా. అన్నీ చూసుకుంటూ వస్తాడు. మన ఇంటి ముందు సెక్యూరిటీకి ఇస్తాడు. రవిని పంపించి తెప్పిద్దాం” అన్నాను.

ఒక అరగంటసేపు బుద్ధిగా నేర్చుకున్నాడు.

“మన ఇల్లు ఎక్కడ ఉందో బప్పాకి ఎలా తెలుస్తుంది?” అన్నాడు.

“బప్పాకి తెలియంది లేదు. నీకు అనుమానం అయితే ఫోను చేసి చెబుతాను” అన్నాను.

“చెప్పు,” అన్నాడు.

వెంటనే ఫోను తీసి, “గణేశ్ బప్పా! నువ్వూ ఊరల్లా తిరుగుతూ అడ్రసు మరిచిపోతావేమో. ఆరిహంత్ అడ్రసు… ఇంటి ముందర సెక్యూరిటీ ఉంటుంది. ఎవర్నీ లోపలకి రానివ్వరు. అందుకని గేటు దగ్గరనే రెండు కిట్‌కాట్‌లు ఇచ్చేసి వెళ్ళిపో. ఇంకా చాలామందికి ఇయ్యాలి కదా” అన్నాను.

“చాలామందికి ఇస్తాడా?”

“మరి? నీలాగే ఇవాళ ఎంతమంది పిల్లలు అడిగారో కదా! వాళ్ళందరికీ ఇస్తాడు.”

మరో అయిదు నిముషాలు అవీ ఇవీ అడిగాడు. అన్నిటికీ సమాధానాలు చెప్పి, “ఇవాళ ఈ శ్లోకాలు పూర్తయ్యాయో లేదో బప్పా కనుక్కుంటాడు. అయ్యాయని చెప్పీదాకా మన వీధికి రాడు” అన్నాను.

మరో ఇరవై నిముషాలు నాతో పాటే శ్లోకాలు గబగబ వల్లె వేస్తూ, ఒక్కసారిగా ఆగి, “బప్పా ఎందాక వచ్చాడో కనుక్కో” అన్నాడు.

మళ్ళీ ఫోను చేసి, “బప్పా! ఎందాక వచ్చావ్?” అని అడిగాను.

“….”

“మొదటి క్రాస్ దాకా వచ్చేడుట. మనది అయిదవ క్రాస్. నాలుగే శ్లోకాలు ఉన్నాయి. అవి అయిపోతే ఇవాళ్టికి అయిపోయినట్టే.” తొందర పెట్టేను.

ఆ నాలుగు శ్లోకాలూ పూర్తయ్యాయి.

వెంటనే రవి తలుపు తెరిచి, “గణేశ్ బప్పా రెండు కిట్‌కాట్‌లు సెక్యూరిటీకి ఇచ్చి వెళ్ళిపోయాడుట,” అని చెప్పి నా చేతికి ఇచ్చాడు.

ఆనందంగా నా చేతి లోంచి లాక్కుంటూ ఇంట్లోకి తుర్రుమన్నాడు ఆరిహంత్.


ప్రతి రోజూ పాఠం చెప్పడం, మధ్య మధ్యలో గణేశ్ బప్పా ఎంతదూరం వచ్చాడని కనుక్కోడం, గణేశ్ బప్పా రెండేసి కిట్‌కాట్‌లు ఇవ్వడం. ఒక రోజు వాళ్ళ పిన్ని కొడుకు వచ్చాడని అడిగితే గణేశ్ బప్పా పాపం ఆ రోజు మరో రెండు కిట్‌కాట్‌లు అదనంగా ఇచ్చాడు కూడా.

ఈ నాటకం ఒక నెల్లాళ్ళు సజావుగా సాగింది.

ఇంతలో దసరా శెలవులు వచ్చి వాళ్ళ అన్న ఊరునుండి వచ్చాడు. వాడు ఆరిహంత్ కంటే నాలుగేళ్ళు పెద్ద. మర్నాడు ఆరిహంత్ అన్న కూడా పాఠానికి కూర్చున్నాడు. యథాప్రకారం పాఠం అయిపోయింది. గణేశ్ బప్పా రెండు కిట్‌కాట్‌లు ఇచ్చాడని వచ్చి రవి నా చేతికి ఇచ్చాడు.

“ఆరీ! నీకో రహస్యం చెబుతా, రా!” అని అన్న తమ్ముడి చెవిలో ఏదో చెప్పాడు.

ఆరిహంత్ వెంటనే నా వైపు తిరిగి, “అవునా?” అని ఆశ్చర్యమో, విచారమో తెలియరాని భావోద్వేగంతో చూశాడు.

ఆ చూపులో, ఆ కన్నీటి పొర వెనుక … కొండంత నిరుత్సాహం, విలువైనది ఏదో కోల్పోయిన బాధ తొంగి చూశాయి.