ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం

“సెమాంటిక్స్ అంటే కవిత్వం చేసే సవ్వడి.” – ఎడిత్ సిట్‌వెల్.

ఇది జాజుల జావళి. కాదు. అత్తరులు అద్దిన వెన్నెల ప్రవాహం. కోనేట్లో స్నానమాడి గుడిమెట్లు ఎక్కి వచ్చిన పిల్లగాలి అమృతస్పర్శ. ఏకాంతంలో మనతో మనం చేసుకునే రహస్య సంభాషణ. కాగితం వరకు రాకుండానే మనసులో ఇంకిపోయిన అనేకానేక అద్భుత భావసంచయం.

‘కవిత్వం ఒక ఆల్కెమీ’ అంటాడు తిలక్. ఆ రహస్యం నిషిగంధకు పట్టుబడింది.

అసలు మాటలలోకి కవిత్వం అలా ఒలుకుతుందో, లేదా కవి మనసులోని భావాలు కరిగించి పోతపోసినట్టు పదాల మూసల్లోకి ఒంపుతున్నప్పుడు వాటికి ఆ కవిత్వ వాసన ఎలా అబ్బుతుందో తెలుసుకోవడం కష్టం. నా మాటలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అన్నప్పుడు బహుశా తిలక్ మనసులోని సుకుమారమైన మాటలు వెన్నెలజల్లులలో తడిసి ఉండాలి.

కరుణశ్రీ పోతన గురించి వ్రాస్తూ, ‘ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో నద్దితివేమొ గంటము మహాకవిశేఖర!’ అంటాడు, అతని మాటలలోని తియ్యందనాన్ని ఉత్ప్రేక్షిస్తూ. నా భావన తప్పు. నేను ఉత్ప్రేక్షించడం అనడం కరుణశ్రీని అవమానించడమే. పరోక్షంగా ఆయన అనుభూతి సాంద్రత నాకు అందలేదన్నది స్పష్టం. అనుభూతిలోని సౌందర్యం లేదా సౌందర్యానుభూతి, కవిత్వంగా జాలువారే ముందటి స్థితిలో భావుకుడు లోనయే ఆవేశ తీవ్రతే రసం. అది అందరిలోనూ ఒక్కలా ఉంటుందని, కేవలం ఊహకోసం అనుకున్నా, అది కవిత్వంగా ఆవిష్కరించగల సమర్థత పదాలలోకి ఒలికించగల నేర్పులో ఉంటుందన్నది వాస్తవం. ఆ పదాలు కూడా కవి అనుభూతిని పలికించగలగడం ఒక్కటే కాదు, తిలక్ చెప్పినట్టు ఆ అనుభూతి సాంద్రత పాఠకుడికి చేరవెయ్యగలిగినవై ఉండాలి. ఆ నేర్పు నిషిగంధలో నాకు కనిపించింది.

నిషిగంధ ‘అనుకున్నదంతా చెప్పేలోపున అక్షరాలన్నీ అదృశ్యమైనా’, ‘కళ్ళకొలకుల జారుతున్న బిందువుల సాంద్రత’ కొలిచి పంపగల నేర్పున్న కవయిత్రి. ఆమె ‘మబ్బుతునకల ఆఖరి చారికను అదృశ్యం చేస్తూ’ చీకటిపడినప్పటికీ, ఆ సౌందర్యాన్ని క్లుప్తమైన మాటల కుంచెతో (అలాంటి పెన్నుని ఏమంటారో అన్వర్‌ని అడగాలి) మన మనోఫలకాలమీద పొల్లుపోకుండా చిత్రించగల చిత్రకారిణి.

అంతే కాదు, వీచే నింగి క్రింద గాలిని కోసే గడ్డిపూలనీ చూడగలదు; ‘పగలంతా ఒద్దికగా కూర్చున్న ముగ్గు, ఉండుండి వీచేగాలికి వళ్ళు విరుచుకున్నా మనో నేత్రంతో ఫోటో తియ్యగలదు. ‘అరచేతికి అంటిన ఆత్మీయపు స్పర్శల్నీ, ఇప్పుడే కొండెక్కిన దీపం వదిలిన వెచ్చదనాన్నీ, పట్టుకోగల అపురూపమైన శక్తి ఆమెకు ఉంది. ‘స్వప్నసంచారాల నిదురవేళల్లో కొబ్బరాకు చివుళ్ళపై పేరుకునే రేపటి కలల్ని దర్శించ’గలదీమె. ‘తెల్సిన అక్షరాలు గుప్పెడే’ అని ఆమె అన్నప్పటికీ, ‘మనసు పట్టక… దేహపు అంచుల్ని దాటేసి నింపాదిగా ప్రవహించే భావాలన్నిటితో’ పాటు, అనుభూతులన్నిటికీ అస్తిత్వాన్ని అద్దగలరు.

ఆమె దగ్గర అక్షరాలు అదృశ్యమైనా మిగిలే రహస్య భాష ఒకటి ఉంది. అందుకే, ‘నైరాశ్యపు క్షణాలు కొన్ని అస్సలిష్టం లేని అగరుబత్తి ధూపంలా చుట్టుముట్టినా’, ‘శీతాకాలపు సాయంకాలాలలో, నిశ్శబ్దపు వాగుమీద వంతెనొకటి పేర్చాలన్నా’, లోపలా… బయట… తుళ్ళిపడే ప్రేమావేశ జలపాతాన్ని దారి మళ్ళించాలన్నా…’ ఆమెకు సాధ్యపడుతుంది.

చిన్నప్పుడు బహుశా, ‘వాకిలి పొడవునా రాలిన పారిజాతాలతో’ ఆమెకు అక్షరాభ్యాసం జరిగి ఉండాలి.

‘నిన్నటి స్వప్నం’ అన్న కవితని, “ఇంత సుగంధం నీకెలా అబ్బింది?” అంటూ ప్రారంభిస్తారు. నేను ఆమెని అదే ప్రశ్న వేస్తున్నా? మీరు అక్షరాల్ని ఎందులో ఊరబెడతారు? చిక్కని వెన్నెట్లోనా? మెత్తని చీకటిలోనా? ఆకాశమంత ఆనందంలోనా? సముద్రమంత విషాదంలోనా? పదాల్ని శృతిచేసి పాలచినుకుల్లోనా?

మాకు దొరకని, అందని, ‘కొమ్మ వంగి పువ్వుని పరిచయం చేసే లేతకాంతి సాయంత్రాలూ’; ‘కురిసెళ్ళిపోయిన వానని దాయలేక దక్షిణపు గాలితో దాగుడుమూతలాడే ఆకుల మెత్తని’ అలజడులూ; ‘మరుగుతున్న టీలోంచి సుడులు తిరుగుతూ టప్…టప్… చూరునీళ్ళని దాటుకొచ్చి మొదటిసారిగా పలకరించే’ పాటలూ; ‘ధూళిలా సనసన్నగా రాలిపడే జ్ఞాపకాలూ’; ‘గోపురం గూడులో తీసుకునే నింపాదిగా తీసుకునే శ్వాసలూ’; ‘విసిరేసే ముసురొచ్చినపుడు ఆసరా ఇచ్చిన గుబురుకొమ్మల చెట్టు, గూళ్ళు కట్టుకున్న జంటల గురించీ, వాటిని వదలివెళ్ళిన గువ్వల గురించీ చెప్పే చెమ్మగిలే కథలూ’; ‘విత్తనం చిట్లిన చప్పుళ్ళూ’; ‘ఇంటి చూరు పట్టుకుని వేళ్ళాడే మధ్యాహ్నపుటెండలా ఉత్తినే వేధించే అకారణపు దిగుళ్ళూ’; ‘ఎవరినీ చేరని కలలా చీకటి చివర్లలో ఊగుతూ ఒద్దికగా ఉండిపోవడాలూ’; ‘దిగులు గుబులు నీలి సాయంత్రాల్లో త్రోవ తెలియని నిశ్శబ్దాలూ;, ‘తడివెంట్రుకల్లో చిక్కుకుపోయిన గుసగుసలూ’ “మీ కెక్కడ దొరుకుతున్నాయి?” అని అడగాలని ఉంది.
మీ అనుభూతులని ఎక్కడ పదిలంగా దాస్తారు? ‘ఈ ఋతువుకి రాలాల్సిన ఆఖరి ఆకు ఏదో నేల తాకిన నిశ్శబ్ద శబ్దం’ మీకు ఎలా వినిపిస్తోంది? ‘తూరుపు జ్ఞాపకాలనన్నిటినీ కాగితప్పడవలోకి ఎక్కించి’ ‘నోవాస్ ఆర్క్’ లా మనో తీరాలకు తీసుకుపోతారేమో?

ఆమె కవిత్వం చదువుతున్నంతసేపూ, ‘కరుగుతున్న ఆఖరి మంచుజాడల తడిలా, అంతరాంతరాల్లో యుగాలుగా ఎక్కడో దాక్కున్న జ్ఞాపకాలు’ సైతం ఒక లిప్తపాటు తళుక్కున మెరిసి, మాయమయేలోగా మనల్ని చిటికెనవేలు పట్టుకు గతంలోకి లాక్కెళతాయి. ‘వాన సాయంకాలపు ఇంద్రధనుస్సులన్నీ ఎప్పుడో నింగిలోకి ఇంకిపోయినా’, ఆ రంగుల్ని ఆమె మాటలతో బంధించి మన చుట్టూ ఇప్పటికీ పరచగలిగిన నేర్పరి. మన ‘అనుభవాల అల్మరాలను తెరిచి, అందులో పదిలంగా దాచుకున్న స్పర్శల మొగిలి రేకుల్ని తిరిగి గుబాళింప జేయగల’ మంత్రదండం ఆమె దగ్గర ఉంది. ‘కాలం క్రమబద్ధంగా ఎండగట్టిన మన గుండె పగుళ్ళమీద ఉన్నట్టుండి ఒక ఆత్మీయపు వేసవి వాన కురిపించ గల’ ఆర్ద్ర రసజ్ఞ. ఆమె కవిత్వం ఎత్తుపల్లాల్లో నదిని వదలని తీరంలా మనల్ని పుస్తకం మూసినా వెంటాడుతూనే ఉంటుంది.


జాజుల జావళి – నిషిగంధ కవితలు. 2022
అనల్ప ప్రచురణ.
వెల: INR 150. USD 7. UKP 5.
లభ్యం: అనల్ప; అమెజాన్.ఇన్.