మన కాలం మహాకథకుడు పెద్దిభొట్ల

పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1938 డిసెంబర్ 15న జన్మించినారు. తన 80వ ఏట 18 మే 2018లో అస్తమించినారు. ఆయన 80 వరకూ కథలూ, 8 నవలలూ రచించినారు. ఆయన సాహిత్య వస్తువు దాదాపు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికే చెందినది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో వచ్చిన ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలను ఆయన కథలు చిత్రించినాయి. స్వాతంత్య్రం ప్రజలకు కల్పించిన భ్రమలు తొలగిపోవటానికి ఎక్కువ కాలం పట్టలేదు. ప్రజలకు పాలకవర్గాలు కల్పించిన ఆశలన్నీ అతి తక్కువ కాలంలోనే నీరుగారిపోయినాయి. అన్ని రంగాలలోనూ డబ్బున్న వాళ్ళ ఆధిపత్యమే క్రమంగా పెరుగుతూ వచ్చింది. మధ్యతరగతి ప్రజల జీవితంలో గొప్పగా కీర్తించదగ్గ మార్పులేవీ రాలేదు. పేదల సంగతి సరేసరి. వాళ్ళకు ఉపాధి లభించటమే కష్టమైపోయింది. నిత్యజీవితంలో పేదరికం పాత్ర ఎక్కువైపోయింది. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నవాళ్ళు కూడా బాగుపడింది ఏమీ లేదు. క్రమంగా సమాజం వ్యాపారమయం కాసాగింది. ఆర్తులూ, అన్నార్తులూ, నిరుద్యోగులూ, జీవన పోరాటంలో అలసిపోయేవాళ్ళూ, పెళ్ళికి నోచుకోని మధ్యతరగతి మహిళలూ, ఆధునిక సామాజిక అవసరాలు తీర్చలేని విద్యా, విద్యావంతులూ, క్రమంగా పెరుగుతున్న ఆర్థిక దోపిడీ, ఇవన్నీ సమాజాన్ని కలచి వేస్తున్న సందర్భంలో రచనలు ప్రారంభించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య, తన కళ్ళముందు కన్పిస్తున్న సమాజాన్నే తన రచనల్లో ప్రతిబింబింపజేశాడు. పాఠకుల్ని ఆలోచింపజేశాడు. ఏ భ్రమలకూ, కలలకూ ఆశలకూ ఊహలకూ తావివ్వకుండా, విమర్శనాత్మక వాస్తవికతతో కథల్ని రాసినాడు.

అందువల్లనే ఆయన రచనలన్నీ సామాజిక విషాదాన్నే పాఠకుల ముందు నిలిపినాయి. జీవన అభద్రత, పైకి ఎదగలేకపోవటం, ఉన్నచోటనే సమస్యల్ని స్మరించుకుంటూ వుండటం, పై తరగతితో పోల్చుకొని ఆత్మన్యూనతతో బాధపడటం, పోరాటంలో అలసిపోవటం, సంఘజీవితాన్ని కొంతైనా ప్రశ్నించటం, తమ అసమర్థతకు తమనే నిందించుకోవటం, ఇలాంటి వస్తువులతో ఆయన చాలా కథలు రాసినాడు. అందువల్లనే ఆయన కథల్లో కరుణ, జాలి, దయ, సానుభూతి నిండిన పాత్రలూ సన్నివేశాలూ పాఠకుడికి ఎదురుపడతాయి.

డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా, కనీసం గుమాస్తా ఉద్యోగం కూడా దొరక్క, నైరాశ్యంలో కూరుకుపోయి మబ్బు, ఇంటర్‌వ్యూ కథలలో కనిపిస్తారు. డబ్బుంటే తప్ప ఉద్యోగం దొరకని ఆర్థిక ప్రపంచం అలజడి కథలో కనిపిస్తుంది. అర్హతల వల్ల కాక ప్రాపకం వల్లే ఉద్యోగం లభించే పరిస్థితి పద్మవ్యూహం కథలో చూడగలుగుతాము.

పెద్దిభొట్ల కథల్లో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలే ఎక్కువ కనిపిస్తాయి– పూర్ణాహుతి, దుర్దినం లాంటి కథానికలు బ్రాహ్మణ కుటుంబాలలో జరిగే ఘర్షణల్ని ప్రతిబింబించినాయి. బ్రాహ్మణులు వెనుకటి గౌరవాన్ని కోల్పోయి, పొట్టకూటి కోసం ఇల్లిల్లూ తిరిగి సంపన్నుల అవహేళనకు గురౌతూ, చాలీచాలని డబ్బులతో జీవితాలను గడిపే దుర్భర పరిస్థితిని శుక్రవారం కథలో మనం చూడగలుగుతాము. పౌరోహిత్యం అనేక మార్పులకు గురై, ఆర్థిక హింసకూ అవమానాలకూ గురి కావటాన్ని చాలా కథల్లో మనం చూస్తాము. చావు జరిగిన ఇళ్ళలో శ్రాద్ధం పెట్టే పురోహితుల మధ్య స్పర్ధ కూడా పెద్దిభొట్ల కథల్లో వస్తువు కావటం మరో విషాదం. దుర్దినం, పూర్ణాహుతి కథలు ప్రధానంగా వైదిక కర్మకాండలతో జీవించే బ్రాహ్మణ కుటుంబాలలోని అలజడిని, దైన్యాన్నీ పాఠకుల ముందు నిలుపుతాయి. ఈ కథలన్నీ కూడా కరుణ రసార్ద్రంగా నడుస్తాయి. పెద్దిభొట్ల పనిగట్టుకొని కరుణ రసాన్ని సృష్టించలేదు గాని అతని కళ్ళ ముందు కన్పించే పేద ప్రపంచమే, అతని కథల్ని కరుణరసభరితం చేసినాయి. ‘కరుణ లేని కవి వాక్కు సంకుచితం అవుతుంది’ అన్న తిలక్ కవితోక్తికి ఉదాహరణప్రాయంగా నిలుస్తాయి ఆయన కథలు.

పడుపువృత్తిలో బతికే వాళ్ళూ, శీలాన్ని పణంగా పెట్టి డబ్బును అవసరాల కోసం సంపాదించే ఆడవాళ్ళు కూడా పెద్దిభొట్ల కథల్లో మనకు తారసపడతారు. సినిమా రంగంలో పనిచేసే ఆడవాళ్ళు, ముఖ్యంగా ఎక్‌స్ట్రా వేషాలు వేసేవాళ్ళు అనుభవించే ఆర్థిక హైన్యాన్నికూడా పెద్దిభొట్ల కథలు పసిగట్టగలిగినాయి. పాతికేళ్ళ క్రితం తాను ప్రేమించిన అమ్మాయి ఒక వేశ్యాగృహంలో కనిపిస్తే ఆ ప్రేమికుడి అంతరంగం ఎలాంటి క్షోభను అనుభవిస్తుందో పొగమంచు కథలో చూపుతాడు పెద్దిభొట్ల.

తనకు తెలిసిన జీవితాన్నే, తనకు అనుభవంలోకి వచ్చిన సామాజికాంశాలనే తన కథల్లో ప్రదర్శించినాడు సుబ్బరామయ్య. ఆయన తన కథల్లో కల్పననూ, ఊహలనూ ఎప్పుడూ ఆశ్రయించలేదు. తాను జీవించిన విజయవాడ పట్టణమే ఆయన కథల్లో వేదికగా వుండటాన్ని కూడా మనం గుర్తుపట్టవచ్చు.

పెద్దిభొట్ల అనగానే మధ్యతరగతి అని గుర్తుండిపోయేలా చాలా కథలు రాసినాడు ఆయన. అందుకు బిన్నంగా కూడా ఆయన రాసిన అధోజగత్సహోదరుల కథలు ఆయనకు పేదలపట్ల గల అనుకంపనూ, కరుణనూ, దయనూ, జాలినీ వెల్లడి చేస్తాయి. విజయవాడ ప్లాట్‌ఫారంలోనూ, రైళ్ళ కంపార్టుమెంట్లలోనూ అయాచితంగా శుభ్రం చేస్తూ, ప్రయాణికుల ముందు చేతుల చాచి, వాళ్ళిచ్చే చిల్లరతో జీవించే వాళ్ళను మనం ఇప్పటికీ చూస్తూనే వున్నాము. వాళ్ళ గురించి పాతిక సంవత్సరాల క్రితమే దయనీయమైన కథలు రాసినాడు పెద్దిభొట్ల. ఆ కథల్లో చింపిరి కథ చాలా మందికి గుర్తుండిపోయే కథ. లేచిన వేళ, కోదండంగారి కల, అభాగ్యజీవుల ఆర్తనాదాలను బలంగా విన్పించే అధోజగత్సహోదరుల కథలు.

ఆయన చిత్రించిన కథల్లో ఎక్కువగా చావులు కన్పించడం చాలా అసాధారణంగా అనిపిస్తుంది. ఆయన ఒక ఇంటర్‌వ్యూలో ఇందుకు గల కారణం చెబుతూ ‘నేను చాలా చావులు, బంధువుల ఇళ్ళలో, తెలిసిన వాళ్ళ యిళ్ళలో చూడటం ఇందుకు కారణం’ అని వివరించాడు. ఆయన కళ్ళ యెదుట నడయాడిన విషాదమే అతని కథల్లోకి నడచుకుంటూ వచ్చింది.

ఆయన కథల్లో విచిత్రంగా ఎన్నో తమిళ పాత్రలు మనకు ఎదురౌతాయి. సేతురామన్, వేలాయుధం, కొళందవేలు, వేరమ్మ లాంటి తమిళపాత్రలు కొత్త జీవితాలను మనకు పరిచయం చేస్తాయి.

సాంఘిక సంక్షోభాలకు గురి అయ్యే పాత్రలే మనకు ఎక్కువగా ఆయన కథల్లో కనిపిస్తాయి. సామాజిక పరిస్థితులకు అనివార్యంగా బలి అయ్యే పాత్రలే ఎక్కువ. ఆయన తన పాత్రల్ని తానుగా ఆవిష్కరించడు. పాత్రలన్నీ తమకు తాముగా ఆవిష్కరించుకుంటాయి. ఏ పాత్ర కూడా రచయిత చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించదు. సుబ్బరామయ్య కథానికా నిర్మాణంలోని శిల్పజ్ఞత ఇది!

ఆయన కథల్లో చాలామందికి చిరకాలంగా గుర్తున్న కథలు నీళ్ళు, ఇంగువ. వీటిని చాలామంది రిఫర్ చేస్తూంటారు. నీళ్ళులేని ప్రాంతం నుండి, నీళ్ళు పుష్కలంగా లభించే విజయవాడ ప్రాంతానికి వచ్చిన ఒక కుర్రవాడి విచిత్రమైన ప్రవర్తన నీళ్ళు కథలో మనం చూస్తాము. మనిషి ప్రవర్తనను నీళ్ళు కూడా నియంత్రిస్తాయి అని పెద్దిభొట్ల చెప్పకనే చెబుతాడు ఆ కథలో. ఇంగువ అంటే ఏమిటి? అది ఎక్కడ కాస్తుంది? ఏ చెట్టునుండి పుడుతుంది? అనే చిన్న కారణాలను జీవితమంతా అన్వేషించి, తెలుసుకోకుండానే మరణించిన ఒక మధ్యతరగతి మనిషిని ఇంగువ కథలో చదివి విస్మయానికి గురి అవుతాము.

పెద్దిభొట్ల రాసినవన్నీ సమకాలీనమైన సామాజిక కథలే! సామాజిక జీవితాన్ని నడిపించే శక్తులను ఆయన కథలు ఆవిష్కరిస్తాయి. ఆయన తానుగా ఎక్కడా కథల్లో ప్రవేశించడు. ఆయన ఆధునిక భావజాలం గల కథకుడు. ఏ కథనూ ఆయన ఆదర్శీకరించడు. ఆయన కథల్లో ఆదర్శపాత్రలూ, ఆదర్శజీవితమూ వుండదు. పేదలూ, అసమానతలూ, దౌర్జన్యాలూ, అణచివేతలూ లేని సమాజాన్ని ఆయన కథలు కాంక్షిస్తాయి. ఆయన కథలు చదివిన పాఠకుడు నిరాశను జయించటం నేర్చుకుంటాడు. ‘జీవితం మనిషిలో పెంచే కాలుష్యాన్ని సాహిత్యం క్షాళనం చేస్తుంది’ అన్న కొడవటిగంటి మాటను నిరూపిస్తాయి పెద్దిభొట్ల కథలన్నీ కూడా!