నువ్వూ – కాలం

అరిటాకు మీద నుంచి
మంచుబొట్టు జారి
నేలని తాకుతుంది

మట్టి పిడతలో
సాంబ్రాణి ధూపం
ఆకాశాన్ని చేరుతుంది

ఏవి చేరాల్సిన చోటికి
వాటిని చేరుస్తూ కాలం
ఉదయమంతా తెల్లచీర
రాత్రయితే నల్లచీర కట్టుకుని
ఎగుడు దిగుళ్ళ రహదారి మీద
అలవోకగా పయనం సాగిస్తుంది

నువ్వే అర్దరాత్రో ఒంటరిగా
ప్లాట్‌ఫాం మీద కూచుని
మంచులో తడుస్తున్న పట్టాల మీద
దిగంతాల్లోకి ప్రయాణిస్తుంటావు

సముద్రపొడ్డున ఇసకరేణువులా
నిన్ను తడిపే అల కోసం
ఎదురుచూస్తూ పడుంటావు

ఆకులన్నీ రాల్చేసుకున్న చెట్టుకొమ్మలా
ఆకాశాన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటావు

లేదా
టార్చిలైటు వేసి
చీకటిని వెతుక్కుంటుంటావు

కాలం నవ్వే ముసిముసి నవ్వులు
నీకెప్పటికీ వినపడవు!


రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. "ఏటి ఒడ్డున" కవితా సంపుటి (2006), "ఆత్మనొక దివ్వెగా" నవల (2019), "సెలయేటి సవ్వడి" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...