అది ఓ శీతాకాలపు రాత్రి. కాన్సస్ రాష్ట్రంలోని ఒక చిన్న ఊర్లో రైల్వేస్టేషన్. ప్లాట్‌ఫారమ్ మీద ఆ ఊరివాళ్ళు కొందరు పడిగాపులు కాస్తున్నారు. తూర్పుప్రాంతం నుంచి రావాల్సిన రైలు అప్పటికే ఇరవై నిముషాలు ఆలస్యం అయింది. అంతటా దట్టంగా కురిసిన మంచు. ఊరికి దక్షిణాన, విశాలమైన పచ్చికబయళ్ళ గుట్టల మీదగా పరచుకుని, చుక్కల మసక వెలుతురులో, మెత్తగా వంకరలు తిరిగిన పొగలా కనిపిస్తోంది. ఆగ్నేయాన, ఏటిగట్టుతో పాటు మలుపులు తిరుగుతూ వస్తున్న రైలుపట్టాలు. స్టేషన్లో ఉన్న కొద్దిమంది జనం, నిలుచున్న చోటనే కాళ్ళు మార్చుకుంటూ, చలికి దగ్గరగా ముడుచుకుపోయి, జేబులు లోపలికంటూ చేతులు దూర్చి, చెవులదాకా కోటు కాలర్లు లాక్కుని, అప్పుడప్పుడూ ఆ రైలుపట్టాల దిశగా చూపు సారిస్తున్నారు. వాళ్ళలో వాళ్ళు నెమ్మదిగా మాటాడుకుంటూ, తామక్కడ ఎందుకున్నారో తెలియనట్టు అసహనంగా అటూ ఇటూ కదులుతున్నారు. ఒక లావుపాటతను మాత్రం అందరికన్నా భిన్నంగా ఉన్నాడు. అతని ఎదురుచూపులో ఏదో స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తోంది. మిగతావారిలా కాకుండా ప్లాట్‌ఫారమ్ ఆ చివరనుండి ఈ చివరివరకూ పచార్లు చేస్తున్నాడతను. పైకెత్తిపెట్టిన కోట్ కాలర్ అతని ముఖాన్ని కప్పేసింది. వెడల్పాటి భుజాలు కాస్త ముందుకి వంగి, ఏదో బరువును మోస్తున్నట్టు భారంగా పడుతున్నాయి అతని అడుగులు.
అంతలో, వెలిసిపోయిన ఆర్మీ బట్టల్లో, సన్నగా పొడుగ్గా తలనెరసిన ఒకతను, ఆ గుంపులోంచి తప్పించుకొని ఇతని దగ్గరికొచ్చి నిలుచుని, కొద్దిగా తటపటాయిస్తూ మాట కలిపాడు.
“ఈరోజు కూడా రైలు బాగా లేటుగా వస్తున్నట్టుంది. మంచు వల్లేనంటావా జిమ్?” అన్నాడు కీచుగొంతుతో, సగం తెరిచిన మడతకత్తిలా మెడ రిక్కించి.
“ఏమో! నాకు తెలీదు,” జవాబిచ్చాడు లావుపాటతను, కాస్త చిరాగ్గా. కాలర్ లోంచి బైటకు వచ్చిన అతని మొహమంతా దట్టమైన ఎర్రటి గడ్డం కప్పేసి ఉంది.
ఆ సన్నపాటి వ్యక్తి నములుతున్న టూత్‌పిక్‌ను నోట్లో ఒకవైపు నుండి రెండోవైపుకి మార్చుకుని, తనలో తను అనుకుంటున్నట్టుగా, “ఆ శవంతో పాటు తూర్పునుండి ఎవరూ వస్తారని అనుకోను,” అన్నాడు.
“నాకు తెలియదు.” లావుపాటతని జవాబు మునుపటికంటే మరింత కరకుగా ఉంది.
“మిలట్రీవాడైతే బావుండేది. లాంఛనాలతో నేనే ఊరేగించి పూడ్చిపెట్టించేవోణ్ణి. కాస్త పేరున్న పెద్దవారికి అలా చేయడం సముచితం,” సన్నపాటి వ్యక్తి తన కీచుగొంతుకలో ఎంతో కొంత సానుభూతి పలికించాలని ప్రయత్నించాడు, నోట్లోంచి పుల్ల తీసి జాగ్రత్తగా కోట్ జేబులో పెట్టుకుంటూ. ఆర్మీ జవాన్ల శవాలుగా ఊరికి తిరిగి వచ్చినప్పుడల్లా వారి అంత్యక్రియల్లో ఆ దళపు జెండా పట్టుకుని ఊరేగింపులో ముందు నడవడం అతని పని.
లావుపాటతను సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి మళ్ళీ ప్లాట్‌ఫారమ్ అంచుమీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇబ్బందిగా కదులుతున్న ఊరి జనం గుంపులో మళ్ళీ చేరిపోయాడు సన్నపాటి వ్యక్తి. “ప్చ్… ఎప్పటిలాగే జిమ్ చిరాగ్గా ఉన్నాడు,” అన్నాడు పెదవి విరుస్తూ.
సరిగ్గా అదే సమయంలో దూరంనుండి రైలుకూత వినిపించింది. జనాల్లో కాస్త అలికిడి వచ్చింది. హఠాత్తుగా వినిపించిన ఆ చప్పుడుకి బక్కచిక్కిన కుర్రాళ్ళు, చిన్నా పెద్దా చాలామంది–వెయిటింగ్ రూములో వెచ్చగా పడుకున్నవాళ్ళు కొందరు, ఆగి వున్న గూడ్సు బండిలో కునుకులు తీస్తున్నవాళ్ళు మరికొందరు–ఒక్కసారిగా కలుగుల్లోంచి బయటకి వచ్చిన ఎలకల్లా ప్లాట్ఫారం మీద చేరారు. ప్లాట్ఫారానికి అటుపక్కగా ఆపి వుంచిన హయ్ర్స్ -శవాన్ని తీసుకువెళ్ళే వాహనం- ముందు సీట్లల్లోంచి ఇద్దరు కిందకు దూకేరు. దూరం నుంచి వినిపించిన ఆ రైలు కూత శంఖనాదంలా వాళ్ళలో సందడి నింపింది. ఆ రోజు రైల్లో ఇంటికొస్తున్న ఆ వ్యక్తి చిన్నతనంలో, A రైలు కూత అలాగే సందడి నింపేది.
దూరంగా తూరుపునున్న చిత్తడినేలల మధ్యనుండి, నది వొంపులతోపాటు వొంపులు తిరుగుతూ, వొడ్డున ఇరువైపులా కావలి కాస్తున్న బూరుగచెట్లను వణికిస్తూ, వాటి మధ్యనుంచి ఎర్రని రాకెట్లా పొగలు కక్కుతూ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకు వచ్చింది. గుప్పున ఎగసే ఆ పొగలు మబ్బుల్లా కమ్ముకుని, ఆకాశంలో పాలపుంతను మసకబార్చాయి. రైలు ఎర్రని హెడ్‌లైట్స్ వెలుతురులో మంచులో తడిసిన పట్టాలు నల్లగా నిగనిగలాడాయి.
ప్లాట్‌ఫారమ్ చివరినుంచి తన చెదిరిపోయిన గడ్డాన్ని రుద్దుకుంటూ లావుపాటతను గబగబా రైలు వైపు నడిచాడు. మిగతా ఊరిజనం ఒకరిమొఖాలొకరు చూసుకుని, తటపటాయిస్తూ అతన్ని అనుసరించారు. ఆగిన రైలు తలుపులు తెరుచుకోవడం ఆలస్యం, ఒక కోచ్ లోంచి టిటియి దిగేడు. అతని వెనకే ఊలుటోపీ, పొడుగాటి ఓవర్కోటుతో ఒక యువకుడు కిందకు దిగేడు. ఆర్మీ బట్టల్లో ఉన్న సన్నపాటతను కోచ్‌లోకి కుతూహలంగా మెడ రిక్కించాడు.
“మిస్టర్ మెరిక్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడెవరైనా?” అడిగాడు యువకుడు.
ప్లాట్‌ఫారమ్ మీద ఉన్న గుంపు మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గుంపులోంచి ఒకతను హుందాగా ముందుకొచ్చాడు. “నా పేరు ఫిలిప్ ఫెల్ప్స్, ఇక్కడి బ్యాంకర్‌ను. మెరిక్ తండ్రి చాలా నీరసంగా కదలలేని స్థితిలో ఉన్నాడు. శవాన్ని తీసుకుపోడానికి మేం వచ్చాం,” అని చెప్పాడు.
“సరే. అతన్నిలా పంపించండి,” అన్నాడు టిటియి కసురుకుంటున్నట్టుగా. “ఇక్కడ కాస్త చేసాయం కావాలని ఆ గార్డ్‌కు చెప్పండి.”
రైలుపెట్టెలోంచి ప్లాట్‌ఫారమ్ మీదకి కాస్కెట్ -శవపేటికను- దింపారు. ఊరిజనం చుట్టూ గుమిగూడి, నల్లటి ఆ కాస్కెట్ మీదున్న ఆకుపచ్చ తాటాకు బొమ్మను చిత్రంగా చూడడం మొదలుపెట్టారు, ఉలుకూపలుకూ లేకుండా. డ్రైవరు పసుపుపచ్చని టార్చిలైటూ, పొడవాటి ఆయిలు కేన్‌తో ఇంజను నుంచి క్రిందకి దిగి, ఇరుసుల్లో కందెన వేశాడు. టిటీయి తన బాధ్యత తీరిపోయినట్టుగా కోచ్‌లోకి ఎక్కేశాడు. ఒక్కసారిగా ఇంజను పెద్దగా నిట్టూర్పు విడిచినట్టు చప్పుడు చేసింది. ఆవిరిపొగలు కక్కుతూ మెల్లిగా తన బరువును మోసుకుంటూ కదిలిపోయింది.
చనిపోయిన ఆ శిల్పి శవాన్ని తీసుకుని వచ్చిన యువకుడు బోస్టన్‌లో అతని శిష్యుడు. అతనికి అంతా కొత్తగా ఉంది. ఏం చేయాలో తెలియలేదు. నిస్సహాయంగా ఆ ఊరివారి వంక చూశాడు. ఉన్నవారందరిలో కాస్త నాగరికంగా కనపడుతున్న బ్యాంకర్ ఒక్కడే కొంచెం మాటాడడానికి యోగ్యుడుగా కనిపించాడు. అతనివైపు తిరిగి: “మెరిక్ అన్నదమ్ముల్లో ఒక్కరూ ఇక్కడలేరా?” అని సంశయిస్తూ అడిగేడు.
అప్పటిదాకా దూరంగా నిలబడున్న లావుపాటి ఎర్రగడ్డం వ్యక్తి గుంపు ముందుకి వచ్చి మొదటిసారి నోరు విప్పేడు. “లేదు, వాళ్ళెవరూ ఇంకా రాలేదు. అందరూ తలో దిక్కునా ఉన్నారు. మేమే ఈ శవాన్ని అతని ఇంటికి తిన్నగా తీసుకుపోతాం,” అని ఒంగి శవపేటిక చేతిపిడి ఒకవైపున అందుకున్నాడు. నలుగురూ కలిసి శవపేటికను శవవాహిక లోకి ఎక్కించారు.
“థామ్సన్! కొంచెం దూరంపడినా కొండరోడ్డు వెంబడే ఇంటికి పద. గుర్రాలకి సుళువుగా ఉంటుంది,” అన్నాడు ఒకాయన, హయ్ర్స్ డ్రైవర్ సీట్లోకి ఎక్కుతున్న కుర్రవాడితో.
లావుపాటి ఎర్రగడ్డపు లాయర్, జిమ్ లైర్డ్, బోస్టన్ యువకుడి వైపు తిరిగి, “శవంతో పాటు ఎవరు వస్తారో మాకు తెలీలేదు. చాలా దూర ప్రయాణం. కాబట్టి మీరు ఆ గుర్రం ఎక్కండి, హయ్ర్స్తో కూడా వెళ్ళచ్చు,” అంటూ చిక్కిపోయున్న ఒక బాడుగ గుర్రాన్ని చూపించాడు. ఆ యువకుడు వెంటనే, “లేదు లేదు. శవంతో నేనుంటాను. కాస్కెట్తోపాటే ప్రయాణం చేస్తాను,” అంటూ వ్యాగన్ నడిపే కుర్రాడి వైపు చూసి, “మీకు అభ్యంతరం లేకపొతే, నేను మీ పక్కన కూర్చుంటాను,” అంటూ వ్యాగన్ ఎక్కి అతని పక్క సీట్లో కూచున్నాడు.
అందరూ అక్కడున్న కాసిని బళ్ళల్లో సర్దుకొని చుక్కల వెలుగులో, తెల్లగా మెరుస్తున్న కొండదారి గుండా ఊరివైపుకు కదిలారు. ఆ మెరక పైనుంచి దూరంగా ఊరు కనిపిస్తోంది. మంచు బరువుకు కుంగిన చూరుల కింద ఇళ్ళల్లోని దీపాలు మిణుకు మిణుకుమంటూ కనిపిన్నాయి; ఊరు చుట్టూ ఎటు చూసినా పచ్చిక బయళ్ళు, మంచుతో నిండి, అనంతమైన ఆకాశంలా, తెల్లగా నిశ్శబ్దంగా శూన్యంలోకి పరుచుకునున్నాయి.
ఎండకి ఎండి వానకి తడిసి పాడుబడిన ఓ ఇంటి ముందు శవవాహనం ఆగింది. స్టేషన్‌కి వచ్చిన ఊరివాళ్ళ గుంపే ఇక్కడా చుట్టూ గుమిగూడింది. ఇంటి ముందు పెరడంతా మంచు, బురద కలిసి పేరుకుపోయి, దానిమీద నడవడం కోసం గేటు దగ్గర్నుంచి ఇంటిగుమ్మం దాకా వేసిన చెక్కపలకలు నానిపోయి వంకరతిరిగి కూలడానికి సిద్ధంగా ఉన్న వంతెనలా ఉన్నాయి. గొళ్ళెం తీసి గేటు పూర్తిగా తెరవడానికి గట్టిగా తొయ్యాల్సి వచ్చింది. శవంతోపాటే వచ్చిన యువకుడు హెన్రీ స్టీవెన్స్, ఆ గొళ్ళేనికి ఒక నల్లటి వస్తువేదో వేలాడుతుండడం గమనించాడు.
హయ్ర్స్ నుండి కాస్కెట్ దింపుతున్నప్పుడు అయిన చప్పుడుకు జవాబుగా ఆ ఇంట్లోంచి ఒక్కసారిగా ఏడుపులు వినిపించాయి; ముందరి తలుపు ధనామని తెరుచుకుంది. లావుగా, పొడవుగా, ఉబ్బిపోయినట్టున్న ఒకామె తల కూడా కప్పుకోకుండా మంచులో పరిగెత్తుకుంటూ వచ్చి శవం మీద పడి, “అయ్యో కొడుకా! ఇలా వచ్చావురా నా దగ్గరికి!” అంటూ పెద్దగా శోకండాలు పెట్టింది. ఎందుకో చెప్పలేని వెగటుతో స్టీవెన్స్ ముఖం పక్కకు తిప్పుకుని కళ్ళు మూసుకున్నాడు. నొక్కులజుత్తుతో, పొడవుగా, సన్నగా, ఎముకలబోనులా, నల్లనిబట్టల్లో ఉన్న ఒక యువతి బయటకి పరిగెత్తుకుంటూ వచ్చి, తల్లి భుజాలు పట్టుకుని, ఏడుస్తూనే, “అమ్మా! లోపలికి పద. నువ్విలా బయటకి రాకూడదు!” అన్నది. అంటూనే బ్యాంకరు వైపు తిరిగి, అంతే వేగంగా గొంతుమార్చి, అతివినయంగా, “ఫెల్ప్స్! ముందు గది సిద్ధంగా ఉంది!” అంది.
నలుగురూ కలిసి ఆ కాస్కెట్ను జాగ్రత్తగా ఆ చెక్కపలకల మీదనుంచి మోసుకొచ్చి చావడి పక్కగా ఉన్న గదిలోకి తెచ్చారు. గది మధ్యలో వేలాడుతున్న దీపం కింద చెక్క బల్లలు అమర్చి, వాటి మీద శవపేటికను ఉంచారు. వాడుకలో లేక చల్లగా, చెమ్మపట్టి ముక్కవాసన వాసన వేస్తూ ఉంది ఆ గది. స్టీవెన్స్ కాస్కెట్ పక్కనే నిలబడి చుట్టూ చూశాడు. పైన వేలాడుతున్న దీపం పాతకాలం నాటి గాజు స్ఫటికాల షాండిలియర్. ఒక గోడ మీద ఇంగ్లీష్ ఆక్రమణదారులైన జాన్ ఆల్డెన్, ప్రిసిల్లా దంపతుల పాత ఫోటోకు చెమ్కీదండ వేలాడుతోంది. ఆ ఫోటో చూడగానే స్టీవెన్స్ కడుపులో తిప్పినట్టయింది. ఏదో పెద్ద పొరపాటు చేసినట్టూ, రాకూడని చోటుకి వచ్చినట్టూ ముఖం పెట్టాడు. కిటికీలకూ గుమ్మాలకూ వేలాడుతున్న ఆకుపచ్చని బ్రసెల్ స్ప్రౌట్ దండలు, లావుగా మందంగా ఉన్న ముఖ్మల్ సోఫాలు, చెక్క బీరువాలలో నాసిరకం చైనా పింగాణీ కుండీలు- ఈ మోటుతనంలో, హార్వీ మెరిక్ది అని పోల్చుకునే వస్తువు కనీసం ఒక్కటైనా కనిపిస్తుందేమోనని వెతికాడు. ఒక మూల పాత పియానో మీద వేలాడుతున్న క్రేయాన్ పెయింటింగ్ ఒకటి కనిపించింది. అందులో ఉంగరాల జుత్తుతో ఉన్న ఒక పిల్లవాడి ముఖం చూసి, అది మెరిక్ బొమ్మ అని తేల్చుకున్నాక గాని, శవపేటికను ఎవరైనా తాకడానికి కూడా స్టీవెన్స్ ఇష్టపడలేదు.
“థామ్సన్! మూత తెరూ! నా బిడ్డ ముఖం చూడనీ,” అంది పెద్దామె శోకండాల మధ్యలో. ఈసారి భయపడుతూనే, ఒత్తుగా నల్లగా మెరుస్తున్న ఆమె తలకట్టు క్రింద ఎర్రగా ఉబ్బిపోయిన ఆమె ముఖంలోకి, సముదాయిస్తున్న ధోరణిలో చూశాడు స్టీవెన్స్. వెంటనే చూపు తిప్పుకుని, ఒక్కసారి మళ్ళీ ఆమె ముఖంలోకి చూశాడు, ఏదో నమ్మలేనిది చూసినట్టు. ఆ మొరటు ముఖంలో ఏదో చెప్పలేని శక్తి కనిపించింది… బలమైన నమ్మకాలు, ఆవేశకావేషాల క్రూరత్వం ఆ ముఖం ముడతల్లో నిండివుంది. బాధ, జాలి, సంతాపం వంటివి ఆమె దరికయినా రాగలవో లేదో అనిపించేలా ఉంది. పొడవాటి ముక్కు చివర ఉబ్బి, దానికి అటూ ఇటూ లోతుగా ఏర్పడ్డ చారలు; నుదుటికి అడ్డంగా, ఇంచుమించు కలిసిపోయినట్టున్న నల్లని దట్టమైన కనుబొమలు; దేన్నైనా చీల్చేసేలా ఎడయెడంగా ఉన్న పెద్ద పారపళ్ళు; గట్టిగా ఏడుస్తున్న ఆమె ఆ గదినంతా ఆక్రమించినట్టుగా ఉంది. ఆ శోకండాల ప్రవాహంలో ఆ గదిలో ఉన్న మగవాళ్ళు కూడా వరదలో కొట్టుకుపోతున్న కర్రాకంపల్లా మిగిలేరు. తనకు తెలియకుండానే ఆ సుడిలో చిక్కుపడిపోయానన్న అనుమానం స్టీవెన్స్‌కు వచ్చింది.
పొడుగ్గా ఎముకల బోనులా ఉన్న కూతురు, చేతుల్ని ఒళ్ళో ముడుచుకుని, కళ్ళూ ముఖమూ క్రిందకి వాల్చి, బిర్రబిగుసుకుని సోఫాలో కూర్చుని ఉంది. ఎప్పుడు శవపేటిక తెరుస్తారా అని ఎదురుచూస్తున్నట్టుంది. ఒక సంకరజాతి స్త్రీ, పనిమనిషి అయుండాలి, తలుపు ప్రక్కన భయంతో ఒదిగి నిలబడివుంది. వాడిపోయిన ఆమె ముఖంలో విషాదం, మృతుడిపట్ల అభిమానం కనిపిస్తున్నాయి. ఆమె తను కట్టుకున్న ఏప్రాన్తో కళ్ళు ఒత్తుకుంటూ, వెక్కిళ్ళను అతిప్రయత్నం మీద దిగమింగుకుంటూ మౌనంగా కుమిలిపోతూ ఏడుస్తోంది. స్టీవెన్స్ లేచి వెళ్ళి ఆమె ప్రక్కన నిలుచున్నాడు.
ఇంతలో మెట్లమీద సన్నని అడుగుల చప్పుడు వినిపించింది. పొడుగ్గా, బలహీనంగా ఉన్న ఒక వయసుడిగిన వ్యక్తి, పొగాకు కంపుకొడుతూ, మరకలు పడి మాసిన గడ్డంతో, చిందరవందర జుత్తుతో, అడుగులు తడబడుతూ గదిలోకి ప్రవేశించాడు. శవపేటిక దగ్గరకి నెమ్మదిగా నడిచి వెళ్ళి, తన చేతిలో రుమాలు నలుపుకుంటూ నిలుచున్నాడు. భార్య ఆర్భాటంగా పెడుతున్న శోకండాలకు బాధా, సిగ్గూ అతని మనసంతా కమ్ముకున్నట్టున్నాయి.
కంపిస్తున్న గొంతుతో, “ఆనీ! అదే వద్దంటున్నాను. కాస్త తెమ్మరిల్లు,” అన్నాడు, వణుకుతున్న చేతితో ఆమె భుజం మీద చిన్నగా తడుతూ. ఆమె మళ్ళీ ఏడుపులంకించుకుని ఒక్క ఉదుటున అతని భుజం మీదకి వాలడంతో తట్టుకోలేక పడిపోబోయాడు. కనీసం శవం వంక కన్నెత్తయినా చూడకుండా, యజమాని చేతిలో కర్రను చూస్తున్న కుక్కలాగా, ఆమె వంకే బెదురుతో, బ్రతిమాలుతూ చూడసాగేడు. అంతలో, ఆయనను వొదిలిపెట్టి ఆమె ఆ గదిలోంచి బైటకు నడిచింది. వెంటనే కూతురు కూడా ఆమె వెనుకే నడిచింది. పనిమనిషి ఒకసారి బెరుకుగా శవపేటికదాకా నడిచి, క్షణంసేపు వొంగి చూసి, వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ గదిలో స్టీవెన్స్, జిమ్ లైర్డ్, మెరిక్ తండ్రి, వాళ్ళ పాటికి వాళ్ళు మిగిలిపోయేరు.
ఆ ముసలాయన వణుకుతూ, చనిపోయిన కొడుకు ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు. శిల్పి అందమైన ముఖం, ఒక నిశ్చల శిల్పంలా, బతికున్నప్పటికన్నా హుందాగా అనిపించింది అతనికి. విశాలమైన ఆ నుదుటి మీద నల్లని ముంగురులు వాలి ఉన్నాయి. చిత్రంగా ఆ ముఖం కోలగా అనిపించింది. కానీ అందులో మృతుల ముఖాల్లో కనిపించే స్వచ్ఛమైన ప్రశాంతత పూర్తిగా లేదు. కనుబొమలు చిట్లింపువల్ల, కొటేరుముక్కు మీదగా యిటూ అటూ రెండు స్ఫుటమైన గీతలు ఏర్పడ్డాయి. దవడలు పట్టుదలతో బిగుసుకునట్టుగా ఉన్నాయి. అతని బతుకులోని చేదునూ బాధనూ, చివరికి చావు కూడా పూర్తిగా మరపించినట్టు లేదు. తను ఎంతో పవిత్రంగా, మనసులో ఎంతో భద్రంగా దాచుకున్న ఏ విలువైనదానినో, ఎవరూ పెకలించి తననుంచి తీసుకుపోకుండా కాపాడుకుంటున్న ఆదుర్దా ఉంది ఆ ముఖంలో.
మాసిన గడ్డం మాటున వణుకుతున్న పెదాలతో, లాయరువంక తిరిగి, “ఫెల్ప్సూ, తక్కిన వాళ్ళందరూ మళ్ళీ వస్తారు కదూ సర్వీస్‌కి?” అని భయంభయంగా అడిగేడు ముసలాయన. “నీ రుణం తీర్చుకోలేను జిమ్! ఇంత సహాయం నాకు ఎవరు చేస్తారు!” అన్నాడు. కొడుకు నుదిటిమీది ముంగురులు చేత్తో సవరించాడు. “నీకు తెలుసా జిమ్, వీడు చాలా మంచికుర్రాడు. పసిపిల్లాడిలాంటి మనస్తత్వం. కానీ మేమే వాడిని తెలుసుకోలేకపోయాం.” అతని కన్నీళ్ళు గడ్డంమీంచి జారి శిల్పి ఒంటిమీద పడ్డాయి.
“మార్టిన్! మార్టిన్! ఓ మార్టిన్, ఇలా రా!” అతని భార్య మెట్లమీంచే గట్టిగా అరిచింది. ఆ ముసలాయన వెంటనే భయంగా లేస్తూ, “హాఁ! ఆనీ! ఇదిగో వస్తున్నా!” అన్నాడు. గదిలోంచి వెళ్ళబోయి, కాసేపు తటపటాయించి, చివరకి వెనక్కి వచ్చి, మృతుడి జుత్తు సుతారంగా సవరించి, వెళ్ళిపోయాడు.
“పాపం, పెద్దాయన! ఈయన దగ్గర కన్నీళ్ళు ఇంకా మిగిలుంటాయని అనుకోనేలేదు. ఆ కళ్ళు ఎప్పుడో ఎండిపోయుండాలి. ఈ వయసులో ఇంతకంటే బాధించేది మరోటి ఉండదు,” అన్నాడు లాయరు.
అతనామాట అన్నతీరులో స్టీవెన్స్‌ని ఏదో చటుక్కున అతనివైపు చూసేలా చేసింది. మెరిక్ తల్లి ఆ గదిలో ఉన్నంతసేపూ ఆ యువకుడి దృష్టిలోకి ఇంకేదీ రాలేదు. కానీ ఇప్పుడు, కళ్ళలో నెత్తుటి జీరలతో ఎర్రగా కందిపోయిన జిమ్ ముఖం చూడగానే, అతను రైలు దిగిన దగ్గర్నుంచీ దేని గురించి వెతుకుతున్నాడో, ఇప్పటిదాకా ఇక్కడ ఎవరిలోనూ కనిపించక మథనపడుతున్నాడో, అది, ఆ బాధ, ఆ ముఖంలో కనిపించింది.
జిమ్ అతని గడ్దంలానే ఎర్రగా ఉన్నాడు. తాగుడువల్ల ముఖం ఉబ్బిపోయి కళ కోల్పోయినా, నీలపు కళ్ళలో చురుకైన చూపు ఇంకా అలాగే ఉంది. అతికష్టం మీద తనని తాను నిగ్రహించుకుంటున్న బాధ అతని ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది; అసహనంగా, తనమీద తనకే అసహ్యంతో తన గడ్డం వెంట్రుకల్ని పట్టి లాగుతూనే వున్నాడు. జిమ్ దీపం వత్తిని తగ్గించడం, దానికి వేలాడుతున్న గాజు స్ఫటికాలు చేస్తున్న గలగలలకి చిరాకుతో అటు తీక్షణంగా చూడడం, తర్వాత చేతులు వెనక్కి కట్టుకుని తన గురువు ముఖంలోకి తదేకంగా చూడడమూ – కిటికీ ప్రక్క కూచున్న స్టీవెన్స్ గమనించాడు. ఒక పాలరాతి బొమ్మకూ, ఒక బంకమన్ను ముద్దకూ ఎలాంటి సంబంధం ఉండివుంటుందా అని ఆలోచించసాగాడు.
ఇంతలో వంటింట్లోంచి కేకలు వినిపించాయి. వంటగది తలుపు తెరవగానే, ఆ గోల వెనక కారణం అవగతమయింది. అతిథులకోసం చేసిన సాలడ్ మీద డ్రసింగ్ సరిగ్గా చేయనందుకు మెరిక్ తల్లి ఆ పనిమనిషిమీద గొంతు చించుకుంటోంది. స్టీవెన్స్ తన జీవితంలో ఇలాంటివి ఎన్నడూ విని వుండలేదు. ఆ తిట్లు మానసికంగా హింసించడంతోబాటు, క్రౌర్యానికి పరాకాష్ఠగా ఉన్నాయి. కేవలం ఇరవై నిముషాల క్రితం ఆమె ప్రదర్శించిన ఆపుకోలేని దుఃఖానికి ఇది పూర్తిగా విరుద్ధంగా, అంతే ఆర్భాటంగా ఉంది. ఆ క్రూరత్వం చూసి ఒళ్ళు జలదరించి, వంటింట్లోకి తెరుచుకుంటున్న భోజనాలగది తలుపులు మూసేసేడు లాయరు.
వెనక్కి తిరిగి వచ్చి, “పాపం, రాక్సీ! బలయిపోతోంది,” అన్నాడు. “మెరిక్ కుటుంబం చాలా ఏళ్ళ క్రితం ఆమెను ఒక పేదయింటినుంచి తెచ్చుకున్నారు. వారిపట్ల ఆమెకున్న కృతజ్ఞతాభావం ఆమెను బయటకు చెప్పనివ్వదు గాని, చెబితే ఆ భయంకరమైన అనుభవాలు విని రక్తం గడ్డకట్టుకుపోతుంది. రాక్సీ అంటే, ఇంతకుముందు ఆ మూల నిలబడిన సంకరజాతి ఆమే! మెరిక్ తల్లి ఇప్పుడు విరుచుకుపడుతోంది ఆవిడ మీదే. పదిమందిలో జాలి ప్రదర్శిస్తూ, ఎవరూ లేనపుడు క్రూరత్వంలో కొత్తపోకడలు పోవడంలో ఆ మహాతల్లి తనకి తనే సాటి; హార్వీ ఇంట్లో ఉన్నంత కాలం అతని జీవితాన్ని నరకం చేసింది. ఆమె క్రూరత్వం ఏదో తన తప్పు అయినట్టుగా హార్వీ సిగ్గుపడేవాడు. ఇలాంటి ఇంట్లో ఉంటూ కూడా హార్వీ అంత మంచితనాన్ని ఎలా నిలుపుకున్నాడా అని ఆశ్చర్యం వేస్తుంది.”
“అవును! మెరిక్ చాలా మంచివాడు. గొప్ప వ్యక్తిత్వంగల మనిషి,” అన్నాడు స్టీవెన్స్ నెమ్మదిగా, “మంచివాడు అనుకున్నాను కాని, ఇప్పుడే తెలిసొచ్చింది అతను నిజంగా ఎంత గొప్పమనిషో.”
“అదే ఎవరికీ అర్థంకాని బ్రహ్మరహస్యం. అందులోనూ, ఇటువంటి పేడకుప్పలోంచి రావడమే అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం,” అన్నాడు లాయరు చేతులు నాలుగుపక్కలా తిప్పి ఇల్లంతటినీ చూపిస్తూ. ఆ మాటల వెనుక తాము నిలుచున్న నాలుగుగోడల మధ్యప్రదేశమని కాక వేరేదో ధ్వని ఉంది.
“మరీ ఊపిరాడకుండా ఉంది. కాస్త గాలి ఉంటే బాగుంటుంది,” అన్నాడు స్టీవెన్స్, ఒక చేత్తో కిటికీ తలుపు తియ్యడానికి నానా తంటాలు పడుతూ. కిటికీ చట్రం బిగుసుకుపోయి తలుపు తెరుచుకోలేదు. విసుగెత్తి తిరిగివచ్చి కూచుని గుండీ తీసి కాలర్ వదులు చేసుకున్నాడు. అది చూసి లాయరు వచ్చి కిటికీని బలంగా ఒక పిడిగుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి తలుపు రెండు అంగుళాలు పైకిలేచి తెరుచుకుంది. స్టీవెన్స్ లాయరుకు థాంక్స్ చెప్పాడు. అయినా, ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పటినుంచి కడుపులో పెరుగుతూ వస్తున్న వికారం, హార్వీ మెరిక్ గురించిన తన జ్ఞాపకాలు మలినం కాకముందే ఆ ఇంట్లోంచి దూరంగా పారిపోవాలన్న కోరికను లోలోపల రగిలిస్తూనే ఉంది. తన గురువు నవ్వులో ఎప్పుడూ ఎందుకు చిన్నపాటి విషాదం కనిపిస్తూ ఉండేదో అతనికి ఇప్పుడర్థమయింది.
అతనికి బాగా గుర్తు. ఒకసారి మెరిక్, వాళ్ళ ఊరినుండి తిరిగి వచ్చినపుడు, తనతోపాటు చెక్క మీద తాపడం చేసిన ఒక బొమ్మ తెచ్చాడు. అందులో సన్నగా, పోలికలు పట్టడానికి వీలులేని ఒక వృద్ధురాలు కూచుని తన ముణుకుల మీద గుడ్డపెట్టుకుని ఏదో కుడుతున్నది. ఆమె పక్కనే ముద్దుగా బొద్దుగా తాళ్ళనిక్కరు తొడుక్కున్న కుర్రాడొకడు ఆమె గౌన్ పట్టుకుని లాగుతున్నాడు, తను అప్పుడే పట్టుకున్న సీతాకోకచిలుకను చూడు చూడమని. ఆ వృద్ధురాలి ముఖవైఖరిలో కనిపించిన కళ చూసి స్టీవెన్స్ ముగ్ధుడై ‘ఆమె మీ అమ్మగారా?’ అని మెరిక్ని అడగడం, అతని ముఖంలో ఒక్కసారి మెరిసి మాయమైన నిరుత్సాహం, గుర్తొచ్చాయి.
లాయరు, శవపేటిక ప్రక్కనున్న పడకకుర్చీలో తన శరీరాన్ని వెనక్కి వాల్చి, కళ్ళుమూసుకుని ఊగుతున్నాడు. స్టీవెన్స్ అతన్ని పరీక్షగా చూశాడు. తీరుగా ఉన్న చుబుకాన్ని చూసి, ఎందుకు దాన్ని అలా కప్పుతూ అందవికారంగా కనిపించే బవిరిగడ్డం పెంచాడో అర్థంకాక ఆశ్చర్యపోయాడు. ఆ యువశిల్పి చూపులు తనకి గుచ్చుకున్నాయేమో నన్నట్టు లాయరు కళ్ళు తెరిచాడు.
“వీడెప్పుడూ ఆల్చిప్పలా మూసుకుపోయే ఉండేవాడా?” అని అడిగేడు అకస్మాత్తుగా, “చిన్నప్పుడు వాడు చాలా సిగ్గరి.”
“అవును. మీరన్నట్టు అతను ఆల్చిప్పనే,” అని మాట కలిపాడు స్టీవెన్స్. “పదిమందితో కలవడం ఇష్టనే అయినా అతనెప్పుడూ నిర్లిప్తంగా కనిపించేవాడు. అతనికి అవేశాలు, ఆర్భాటాలు నచ్చేవి కావు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండేవాడు. తనకు తనపైనే నమ్మకం లేనట్టుండేవాడు. అయితే, తన పనిలో మాత్రం ఎలాంటి బెసుగుదనం ఎప్పుడూ లేదు. మనుషులని నమ్మేవాడు కాదు; ఆడవాళ్ళంటే మరీనూ. కానీ ఎవరి గురించీ చెడుగా ఎప్పుడూ అనుకోలేదు. సాటివారిలో ఎప్పుడూ గొప్పతనం, మంచితనం ఉందని నమ్మేవాడు కాని తన నమ్మకాన్ని ఎప్పుడూ పరీక్షకు పెట్టుకోవడానికి భయపడేవాడు.”
“ఒళ్ళుకాలిన కుక్క నిప్పంటే భయపడుతుంది,” అన్నాడు లాయరు కళ్ళుమూసుకుని విరక్తిగా.
ఆ శిల్పి బాల్యం అంతా స్టీవెన్స్ సన్నివేశాలుగా ఊహించుకోసాగాడు. మానవమాత్రుల ఊహకు కూడా అందని సుకుమారమైన భావనలు, సంస్కారవంతమైన ప్రవర్తన గలిగిన వ్యక్తి వెనుక, ఇంత ఆటవికమైన, బాధామయమైన బాల్యం ఉండడం భరించరాని చేదు నిజం. కళాతృష్ణలో, సృష్టిలో, అతను నిజంగా మాంత్రికుడే. చూసిన ప్రతీ వస్తువులోనూ అతనికి అందం కనిపించేది. అలా తన మది నిండా ఎన్నో అందమైన చిత్రాలు నింపుకున్నాడు. లేత ఎండ పడుతున్న గోడమీద కదలాడే రావి ఆకు నీడ కూడా ఒక గొప్ప కళాఖండమయేది అతని మనసులో. మెరిక్ దేనిమీద చెయ్యి వేస్తే, దాని నిగూఢరహస్యాలన్నీ బహిర్గతం చెయ్యగలిగేవాడు. అరేబియన్ కథలోని యువరాజు మంత్రగత్తె మాయలకు ప్రతిమాయ కల్పించి గెలిచినట్టు, గుప్తసౌందర్యపు బందిఖానానుండి తప్పించి, వాటికి తిరుగులేని సహజ సౌందర్యాన్ని పునరుద్ధరించేవాడు; అతనికి ఏ వస్తువుతో, వ్యక్తితో పరిచయమైనా వాటిలో అతనిదైన ఒక ప్రత్యేక అనుభూతిని మిగిల్చేవాడు. మాటలకు అందని ఒక ముద్రను, సువాసనని, మాటని, రంగుని విడిచిపెట్టేవాడు.
స్టీవెన్స్‌కి తన గురువు జీవితంలోని సిసలైన విషాదం అవగతమైంది. అందరూ అపోహపడుతున్నట్టు తాగుడూ, భగ్నప్రేమా అందుకు కారణం కావు. వాటికంటే లోతుగా చిన్నప్పుడు అతని మనసు మీద జీవితం చేసిన గాయమే కారణం. అందుకు కారణం తను కాకపోయినా, సిగ్గుపడవలసినపని లేకపోయినా, తన తప్పుగానే భావించి, సిగ్గుతో వాటి బరువు మోస్తూ, బాల్యం నుండీ గుండెలో దాచుకున్నాడు. కొత్త ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో ఉత్సాహంతో ఉరకలేస్తూ దగ్గరకు తీసుకోబోయిన ఒక కుర్రవాడిని, ఆ గాయం, తనని తాను రక్షించుకోలేని నిరాయుధుడిని చేసి, ఎన్నడూ కనీవినీ ఎరగని నికృష్టమైన సౌందర్యరహితమైన ఎడారిలో విడిచిపెట్టింది!
పదకొండుగంటలవుతూ ఉండగా, కూతురు ఆ గదిలోకి వచ్చి, ‘ఊరివాళ్ళందరూ పరామర్శకు వస్తున్నారు. మీరు కూడా డైనింగ్ హాల్లోకి రండ’ని పిలిచింది. స్టీవెన్స్ లేవడానికి ప్రయత్నిస్తుంటే, లాయరు నిర్వికారంగా, “మీరు వెళ్ళండి. వాళ్ళను కలవడం మీకు ఒక చక్కటి అనుభవం అవుతుంది. ఇరవై ఏళ్ళబట్టి భరించాను వాళ్ళని. ఈ రాత్రి మటుకు నేను తట్టుకోలేను.” అన్నాడు.
స్టీవెన్స్ ఒక్కడే బయటకు నడిచాడు. తలుపు మూస్తూ, సన్నని దీపం వెలుగులో, గడ్డంకింద చేతిని ఆన్చి, శవం ప్రక్కనే కూర్చున్న లాయరువంక ఒకసారి చూశాడు.
ఇంతకుముందు రైలుపెట్టె దగ్గర గుమిగూడిన మూకే మళ్ళీ ఇక్కడ చేరింది. కిరసనాయిలు బుడ్డిదీపం వెలుగులో వాళ్ళు ఇప్పుడు వేరువేరు వ్యక్తులుగా కనిపిస్తున్నారు. పిల్లిగడ్డం, పండిపోయిన జుత్తుతో పాలిపోయి నీరసంగా కనిపిస్తున్న చర్చ్ ఫాదర్, ప్రక్కనున్న మేజాబల్లపై బైబిల్ ఉంచి, దానికి ఆనుకుని కూర్చున్నాడు. ఆర్మీ బట్టల్లో ఉన్న సన్నపాటి వ్యక్తి, పొయ్యిగూడు మంటకు దగ్గరగా అనువుగా వుండేలా తన కుర్చీని జరుపుకుని, జేబులో దాచుకున్న టూత్‌పిక్ కోసం వెతుకుతూ కూర్చున్నాడు. బ్యాంకు ఉద్యోగులు ఫెల్ప్స్, ఎల్డర్, భోజనాలబల్ల వెనకనున్న ఒక మూల కూచుని వడ్డీలమీద ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం గురించీ, ఇంటి అప్పుల మీద దాని ప్రభావం గురించీ చర్చకు ఉపక్రమించేరు. రియలెస్టేట్ బ్రోకరు దొంగనవ్వులు నవ్వుతూ వారిపక్కనే చేరేడు. పొయ్యిగూడుకు అటుపక్క, దాని చట్రానికి దగ్గరగా తమకాళ్ళు జాపుకుని, కట్టెల అడితి ఓనరు, గొడ్ల వ్యాపారి కూచున్నారు. స్టీవెన్స్ తన జేబులోంచి ఒక పుస్తకం తీసి చదువుకోసాగేడు. ఇల్లంతా సద్దుమణుగుతోంది. నానా రకాల స్థానిక విషయాల గురించిన సంభాషణ అతని చుట్టూ పరుచుకుంది.
ఇంట్లోవాళ్ళందరూ నిద్రపోయారని రూఢి చేసుకున్న తర్వాత, సన్నపాటి వ్యక్తి, ఒళ్ళు విరుచుకుంటూ, కుర్చీమీద మడమలు ఆన్చి, కాళ్ళు రెండూ బారజాపుకున్నాడు.
“ఫెల్ప్స్, ఏదైనా వీలునామా ఉందా?” అన్నాడు సహజమైన కీచుగొంతుకతో.
బ్యాంకరు లేదన్నట్లు నవ్వుతూ, జోబులోంచి ముత్యాల పిడి ఉన్న పాకెట్ నైఫ్ ఒకటి తీసి గోళ్ళు కత్తిరించుకోసాగేడు. “ఏముందని వీలునామా?” అని, తనే మళ్ళీ, “ఉందా?” అని ఎదురుప్రశ్న వేసేడు.
ఆర్మీ వ్యక్తి తన కుర్చీలో అసౌకర్యంగా అటూ ఇటూ కదిలేడు. కాళ్ళను తన గడ్డానికి మరింత దగ్గరగా లాక్కుంటూ, “లేకపోడానికేం? హార్వీ ఈ మధ్య బాగానే సంపాదించాడని అన్నాడు కదా ఆ ముసలాయన మొన్నెప్పుడో?” అన్నాడు.
అప్పుడు రెండో బ్యాంకరు అందుకున్నాడు,”దానర్థం నా ఉద్దేశ్యంలో, హార్వీ మరే పొలాలూ తనఖా పెట్టమని అడగలేదనీ; అంటే, తన చదువు సంగతి తను చూసుకోగలుగుతున్నాడనీ.”
“నాకు తెలిసి హార్వీ చదువుకోకుండా ఎప్పుడున్నాడని!” అన్నాడు ఆర్మీ వ్యక్తి వెటకారంగా.
అందరూ కిసుక్కుమన్నారు. ఫాదరు జేబులోంచి రుమాలు తీసి దీర్ఘంగా ముక్కు చీదేడు. ఫెల్ప్స్ తన కత్తిని మడతపెట్టి జోబులో పెట్టుకుంటూ, “పాపం! ఆ ముసలాయనకి పిల్లలెవ్వరూ చేతికి అందిరాకపోవడం చాలా విచారకరం,” అన్నాడు సాధికారంగా. “వాళ్ళెప్పుడూ అందిరాలేదు. హార్వీ మీద మార్టిన్ ఒక డజను పశువుల కొట్టాలు నడపడానికి పనికొచ్చేంత డబ్బు తగలేశాడు. అదంతా శాండ్ క్రీక్ ఏట్లో పోసినట్టయింది. హార్వీ ఇంటిపట్టున ఉండి ఉన్నదేదో జాగ్రత్తపెట్టుకుని, పశువుల్నీ వ్యవసాయాన్నీ కౌలు లెక్కల్నీ చూసుకున్నా వాళ్ళ పని బాగుండేది. ముసలాయన పాపం అన్నిటికీ కౌలుకిచ్చిన రైతులనే నమ్ముకోవలసి రావడంతో, వాళ్ళు అతన్ని ఎడాపెడా మోసం చేసేరు.”
“కుర్రవనుకుని హార్వీ శాండర్స్ దగ్గర రెండు గిత్తలని కొన్నాడు గుర్తుందా? ఊళ్ళో అందరికీ తెలుసు, అప్పటికే అవి పదిహేడేళ్ళవని. శాండర్స్ మామగారు పెళ్ళప్పుడు తన కూతురికి కానుకగా ఇచ్చిన గిత్తలవి. వ్యాపారంలో చురుకుదనం ఉండాలి. హార్వీకి అది లేదు.” అన్నాడు గొడ్ల వ్యాపారి మాట అందుకుంటూ.
“ఆమాటకొస్తే హార్వీకి ఏది చాతనయింది కనక?” అన్నాడు అడితి ఓనరు. “హార్వీ క్రిందటిసారి ఇంటికి వచ్చినప్పటి సంగతి గుర్తుందా. తిరిగి వెళ్ళే రోజు, పాపం ముసలాయన హార్వీని స్టేషన్ తీసుకెళ్ళడానికి బండి కడుతున్నాడు. వీధి దడి కడుతున్న మూట్స్ దగ్గరికి వచ్చి, ‘మూట్స్! మూట్స్! నా పెట్టె తాడుతో కట్టవా?’ అని అడిగాడూ హార్వీ ఆడంగిలా. ఆమాత్రం పని కూడా చేసుకోలేడా!”
“హార్వీ సంగతే అంత!” తలతో ఊఁ కొట్టాడు ఆర్మీ వ్యక్తి. “కాస్త వయసొచ్చి పేంట్లు తొడుక్కుంటున్న రోజుల్లో కూడా, కొట్టాం నుంచి ఆవులు తప్పిపోయి పొలాల్లోకి పోతే పట్టించుకోనందుకు వాళ్ళమ్మ తోలుబెల్టుతో ఎన్నిసార్లు కొట్టిందో లెక్కే లేదు. ఓ సారి అలాగే నా ఆవునొకదాన్ని చంపేసేడు. జెర్సి ఆవు, తెగపాలిచ్చేది. పాపం ఆ నష్టం ముసలాయన భరించవలసి వచ్చింది. ఆవును పట్టించుకోలేదు ఎందుకురా అంటే, సాయంపొద్దును చూస్తూ ఒళ్ళు మర్చిపోయాడట. పైగా, ఆరోజు పొద్దు మిగతా పొద్దుల్లా లేదు లేదని వాదించాడు!”
“అసలా ముసలాయన హార్వీని చదువుకి తూర్పుప్రాంతానికి పంపించి పెద్ద తప్పుచేశాడు.” తీర్పునిచ్చేడు ఫెల్ప్స్, మేక గెడ్డంలాంటి తన గడ్డం సవరించుకుంటూ. “అక్కడే అతనికి పారిస్ పోవాలని, ఈ పనికిమాలినవన్నీ నేర్చుకోవాలని పుర్రెలో పుట్టింది. నిజానికి హార్వీ కాన్సస్‌లోనే ఏ బిజినెస్ కాలేజికో పోయివుండాల్సింది.”
స్టీవెన్స్‌కి చదువుతున్న పుస్తకంలో అక్షరాల బదులు వింటున్న మాటలు కళ్ళముందు కనపడుతున్నాయి. ఈ మనుషులకి శవపేటికమీద ఉంచిన తాటాకుకు అర్థమే తెలియదనుకోవాలా? అది వారికేమీ కాదని అనుకుంటున్నారా? చనిపోయిన వ్యక్తి తన ఊరికోసం తిరిగివచ్చాడని వీళ్ళకెవరికీ తెలియడం లేదా? హార్వీ మెరిక్ పేరుతో జతకలిసి ఉండకపోతే ఈ ఊరి పేరు ఎవరికి తెలిసేది? ఈ ఊరు శాశ్వతంగా ఏ పోస్టల్ గైడులోనో సమాధి అయిపోయి ఉండేది. రెండు ఊపిరితిత్తులలోనూ రక్తం పేరుకుని కోలుకోవడం అసాధ్యమని తెలిసిన తర్వాత, చనిపోయినరోజు తన శవాన్ని పుట్టిన ఊరు తీసుకుపొమ్మని చెబుతూ, మెరిక్ నిర్వికారంగా నవ్వుతూ అన్నమాటలు అతనికి గుర్తొచ్చేయి. “ప్రపంచమంతా కష్టపడి పనిచేసి పేరుప్రఖ్యాతులు సాధించేప్పుడు, ఆ ఊరిలో సమాధి కావడం అంత గొప్పవిషయం కాదు. కానీ, చివరికి మనమంతా వచ్చినచోటుకే పోవలసి వస్తుందేమో! ఊర్లో వాళ్ళందరూ నన్ను చూడడానికి వస్తారు; వాళ్ళందరూ నా గురించి చెప్పుకోవడం పూర్తయ్యాక ఆ భగవంతుడు ఇచ్చే తీర్పు ఏదైనా నన్ను భయపెట్టదు,” అంటూ, ఆర్ట్ స్టూడియో అంతా చెయ్యితిప్పి చూపిస్తూ, “ఈ గొప్పతనమేదీ నన్ను కాపాడదు అక్కడ,” అన్నాడు.
గొడ్ల వ్యాపారి అందుకున్నాడు, “మెరిక్ వంశంలో ఎవరూ తొందరగా పోలేదు. నలభై ఏళ్ళకే మెరిక్ చనిపోయాడంటే ఆశ్చర్యమే. బహుశా తాగుడు ముందుకు నెట్టినట్టుంది.”
“వాళ్ళ అమ్మవైపు వాళ్ళు ఎక్కువకాలం బ్రతకలేదు. హార్వీ ఆరోగ్యంకూడా ఎప్పుడూ అంతంత మాత్రమే,” అన్నాడు ఫాదరు. అతనికి హార్వీ గురించి ఇంకా చెప్పాలని ఉంది. ఒకప్పుడు ఆ కుర్రాడికి ఆదివారాలు పాఠం చెప్పేవాడతను. హార్వీ అంటే చాలా ఇష్టం కూడా. కానీ ఇప్పుడు ఫాదరు ఇంకొకరికి పాఠాలు చెప్పగలిగే స్థితిలో లేడు. అతని కొడుకులిద్దరూ చెడుదారి పట్టినవారే. ఏదో కసీనోలో కాల్చి చంపబడిన ఒక కొడుకు శవపేటిక ఆ తూర్పుప్రాంతంనుంచి వచ్చే రైలులో ఈ ఊరికి చేరి ఇంకా ఏడాది దాటలేదు.
“తాగకుండా ఉండలేకపోయాడు పాపం. అది అతన్ని ఎంత వెధవను చేసినా, ఎర్రగా వైను కనిపిస్తే చాలు బలహీనపడిపోయేవాడు,” అంటూ నీతులు వల్లించేడు గొడ్ల వ్యాపారి.
సరిగ్గా అదే సమయంలో తలుపు గట్టిగా చప్పుడుచేస్తూ తెరుచుకునేసరికి అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. జిమ్ లైర్డ్ ఒక్కడే రావడంతో అందరికీ మనసు కుదుటపడింది. అసలే ఎర్రగా ఉన్న అతని ముఖం కోపంతో మరింత ఎర్రబడింది. అతని నీలికళ్ళలో ఎర్రటిచార చూడగానే ఆర్మీ వ్యక్తి తన తలను కాళ్ళమధ్య దాచుకున్నాడు. వాళ్ళందరికీ జిమ్ అంటే హడలు. అతను తాగుబోతే కాని, పడమటి కాన్సస్ ప్రాంతంలో ఏ లాయరుకీ చాతకానంతగా చట్టాన్ని తన కక్షిదారుకి అనుకూలంగా మార్చి వాదించగలడు; చాలామంది ప్రయత్నించేరు కూడా.
లాయరు తనవెనుకే తలుపు నెమ్మదిగా మూసి, దానికి వీపు చేరవేసి, చేతులు కట్టుకుని, ఒకప్రక్కకి తల వాల్చేడు. అదే కోర్టుగదిలో ఇలా చేసేడంటే, పదునైన వ్యంగ్యపు బాణాలు విసరబోతున్నాడనే అర్థం. కోర్టులో అందరూ చెవులు రిక్కించుకునేవారు.
జిమ్ గొంతు పెంచకుండా చిన్నగా మొదలుపెట్టాడు. “మీరంతా పెద్దమనుషులు కదూ! ఈ ఊర్లో పుట్టి పెరిగిన చాలామంది కుర్రాళ్ళ శవపేటికల దగ్గర మీరు కూర్చున్నప్పుడు మీ ప్రక్కన నేను కూడా ఉన్నాను. నాకు సరిగా గుర్తున్నంతవరకు, మీరెన్నడూ వాళ్ళ గురించి ఒక్క మంచిమాట మాటాడిన పాపాన పోలేదు. ఎందుకూ? పేరుకు తగ్గ ఊరు మన శాండ్ సిటీ. ఇసుకలో వజ్రాలు దొరకడం ఎంత అరుదో, మన ఊళ్ళో గౌరవంతో బతికే కుర్రాళ్ళు పెరగడం అంత అరుదు. కొత్తవాడికెవడికైనా దానికి కారణం ఈ ఊరి గొప్పతనంలోనే ఉందనిపిస్తుంది. గొప్ప తెలివైనవాడు, కుర్రలాయరు రూబెన్ సాయర్, యూనివర్శిటీ నుండి తిన్నగా ఈ ఊళ్ళో పడగానే తాగుడుకి బానిసై, చెక్కుమీద దొంగసంతకం చేసి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? బిల్ మెరిట్ కొడుకెందుకు ఒమాహాలో తాగి తాగి చనిపోయాడు? ఫాదర్ థామస్ కొడుకెందుకు కసీనోలో చంపబడ్డాడు? ఇన్సూరెన్సు కంపెనీలని మోసం చెయ్యడానికి ఏడమ్స్ కొడుకెందుకు మిల్లు తగలబెట్టి జైలుపాలయ్యేడు?”
లాయరు ఒక్కక్షణం ఆగి చేతులు వదులుచేసి, ఒక పిడికిలి బిగించి నెమ్మదిగా మేజాబల్లమీద ఆనిస్తూ కొనసాగించాడు.
“ఎందుకో నేను చెబుతాను వినండి. ఎందుకంటే, వాళ్ళకి చెడ్డీలు తొడుక్కోవడం వచ్చిన వయసునుండీ మీరు డబ్బు, వంచన, మోసం గురించి వాళ్ళ చెవులు హోరెత్తేలా నూరిపోసేరు. మన తాతలు జార్జ్ వాషింగ్టన్, జాన్ ఏడమ్స్లను ఎలా ఆదర్శంగా తీసుకుని మాటాడేవారో అలా మీరు ఫెల్ప్స్‌ని, ఎల్డర్ని వాళ్ళకి ఆదర్శపురుషులుగా చూపించి జోరీగల్లా సతాయించారు. పాపం కుర్రాళ్ళు! మరీ చిన్నవాళ్ళు! అదృష్టం కలిసిరాలేదు! అందరు దొంగలకూ అదృష్టం ఉండదు. మోసం చేయడంలో వీళ్ళిద్దరికీ ఉన్న నైపుణ్యం మరెవరికీ రాలేదు. అదే తేడా వీళ్ళకూ ఆ పిల్లలకూ. మీరు చూపిన దారిలో బతకలేకపోయారు. ఫెల్ప్స్, ఎల్డర్ లాంటి ఘనుల సంపాదనాకళ ముందు వాళ్ళెక్కడ నిలవగలరు! మీరు వాళ్ళని గజదొంగలుగా తయారు చెయ్యాలనుకున్నారు; వాళ్ళు కాలేకపోయారు. అంతే తేడా! సంస్కారానికీ, దుర్మార్గానికీ మధ్య పెరుగుతూ, వ్యసనాల బారిన పడకుండా ఉన్న కుర్రాడు ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నాడంటే అతను హార్వీ మెరిక్ ఒక్కడే. మీ దారి పట్టి బతకలేకపోయిన పిల్లలని మీరు ఎంత ద్వేషిస్తున్నారో, మీ దారి పట్టనందుకు మెరిక్నీ అంతకంటే ఎక్కువగా ద్వేషిస్తున్నారు. అయ్యో దేవుడా! ఎంత ఘోరంగా ద్వేషిస్తున్నారతన్ని!
ఫెల్ప్స్ ఎప్పుడూ ఏమంటుంటాడు? తలుచుకుంటే మనల్నందర్నీ ఇష్టానుసారం కొని, అమ్మగలనని కదూ! కానీ మెరిక్ అతని బ్యాంకన్నా, పశువుల కొట్టాలన్నా గుడ్డిగవ్వ విలువివ్వడని ఫెల్ప్స్కి తెలీదా! అందువల్ల అతనికి మెరిక్ అంటే ద్వేషం ఉండడం సహజం.
తాగుడువల్ల మెరిక్ చనిపోయాడని నిమ్రాడ్ నిందిస్తున్నాడు; తాగుడు గురించి నిమ్రాడ్, నావంటి వాళ్ళు మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉంటుంది.
ముసలాయన పంపిన డబ్బులు మెరిక్ విచ్చలవిడిగా ఖర్చుపెట్టేడని మైడియర్ ఎల్డర్ అంటున్నాడు. కొడుకుగా తన బాధ్యతల నిర్వహణలో మెరిక్ కొంత విఫలమై ఉండొచ్చు. కానీ మనందరికీ తెలీదా, డియర్ ఎల్డర్ ఎలా వాళ్ళ నాన్నను ఒక అబద్ధాలకోరుగా కోర్టులో నిలబెట్టాడో; కలిసి పెట్టిన వ్యాపారం నుంచి ఉన్ని గొరిగిన గొర్రెలా, ఒంటిమీద చర్మంతో ఆ తండ్రిని ఎలా వెళ్ళగొట్టాడో! సరే, ఇక చెప్పదలచుకున్నదానికి వస్తాను.”
లాయరు ఒక క్షణం ఆగేడు. భుజాలను నిటారుచేసి మళ్ళీ మొదలుపెట్టేడు.
“హార్వీ మెరిక్ నేనూ ఇద్దరం ఒక బడిలో కలిసే చదువుకున్నాం. మేమిద్దరం గొప్పవాళ్ళం కావాలని, మమ్మల్ని చూసి మీరందరూ గర్వపడాలని కలలుగన్నాం. నేను కూడా కలగన్నాను, ఇది సరదాకి చెబుతున్నది కాదు, నిజంగా ఒక మంచి న్యాయవేత్త అవుదామనుకున్నాను. నేనిక్కడికి వచ్చి ప్రాక్టీసు ప్రారంభించేక తెలుసుకున్నది, మీకు న్యాయవేత్త అవసరంలేదు; ఇక్కడ మీకు మీ వ్యవహారాలని నడిపించగల లాయరు కావాలి. ఇక్కడో ముసలి సైనికునికి, అతనికున్న అజీర్తి రోగానికి, పెన్షను ఎక్కువయ్యేట్టు నేను చూడాలి; ఫెల్ప్స్కి, చచ్చిపోయిన విల్సన్ భార్యకి చెందిన భూమి ఎలాగైనా తన దక్షిణంవైపు కొలతలోకి వచ్చేట్టు కొత్త సర్వే చేయించాలి; నెలకి 5 శాతం వడ్డీకి అప్పు ఇచ్చి, ఎలాగైనా వడ్డీ రాబట్టుకోవడం కావాలి ఎల్డర్కి; ముసలాయన స్టార్క్‌కి, ఇక్కడున్న ఆడవాళ్ళను, ఏటా తమకు వచ్చే వడ్డీ డబ్బుల్ని, ప్రామిసరీనోటు కాగితం విలువకూడా చెయ్యని భూములమీద ఎలాగైనా మదుపు చేసేలా నమ్మించడం కావాలి. అందుకు మీకందరికీ నేను తప్పనిసరిగా కావలసి వచ్చింది, ఇక ముందు కూడా కావాలి. అందుకే నేను నిజం నిర్భయంగా చెప్పదలుచుకున్నాను.
ఏదయితేనేం, మీరనుకున్నట్లుగా నేను వెనక్కి వచ్చి, మీరు కోరుకున్నట్టుగా, దగాకోరు లాయరుగా మారిపోయేను. అందుకే మీరు నా మీద ఏదో గౌరవం ఉన్నట్టు నటిస్తారు. కానీ హార్వీ విషయానికి వచ్చేసరికి అందరూ కలిసికట్టుగా అతనిమీద బురదజల్లుతారు; ఎందుకంటే అతని చేతుల్ని కట్టిపడేసి వాటిని మీరు మురికి చెయ్యలేకపోయేరు గనుక. ఓ! చెప్పకేం, మీరందరూ వివేకవంతులైన క్రిస్టియన్స్! ఎప్పుడైనా తూర్పుప్రాంతాలనుండి వచ్చే పేపర్లలో మెరిక్ పేరు పెద్ద అక్షరాలతో కనిపిస్తే, కమ్చీ దెబ్బలు తిన్న కుక్కలా సిగ్గుతో కుంచించుకుపోయేవాడిని. ఈ దిక్కుమాలిన బురదప్రపంచంలో పొర్లాడకుండా, అతని ప్రపంచంలో అతను, తను పెట్టుకున్న ఉన్నతమైన ఆదర్శాన్ని చేరుకుంటున్నట్టు అప్పుడప్పుడు ఊహించుకునేవాడిని.
మరి మన సంగతి? పాడుపడిన ఈ చిన్ని ఊరులో, మనందరం అసూయతో కక్కుర్తితో చాతనైనంతవరకు పోట్లాడుకుని, అబద్ధాలడుకుని, కష్టపడి ఒకరిదొకరు దోచుకుందుకు ప్రయత్నించి, ఒకర్నొకరు ద్వేషించుకుని మనం సాధించిందేమిటి? మీకందరికీ తెలుసును–మనమందరం సమష్టిగా సాధించినదంతా ఇచ్చినా, ఒక సాయంసంధ్యని చూడడానికి యిచ్చినపాటి విలువకూడా మెరిక్ దానికి ఇవ్వడని.
ఇంత పగా ద్వేషంతో మండిపోయే ఊరునుండి, అంతటి గొప్ప వ్యక్తిత్వంగల ప్రతిభాశాలి ఎలా పుట్టేడని అడిగితే దానికి కారణం నేను చెప్పలేను. మనమెవ్వరం అర్థంచేసుకోలేని ఆ లీల భగవంతుడుకి మాత్రమే ఎరుక. కానీ బోస్టన్ నుండి వచ్చిన ఈ మంచిమనిషికి నేను విన్నవించేది ఒక్కటే. ఈ రాత్రి ఆయన విన్న సొల్లుకబుర్లే, దారితప్పి, చేవచచ్చిన, దరిద్రులచేత పోషించబడే ఈ శాండ్ సిటీ లాంటి దిక్కుమాలిన ఊరు, ఒక గొప్పవ్యక్తికి యివ్వగలిగే నివాళి. ఈ ఊరిని ఆ భగవంతుడు రక్షించు గాక!”
లాయర్ స్టీవెన్స్‌తో కరచాలనం చేసి, తన ఓవర్‌కోట్ అందుకొని చరచరా బైటకు నడిచాడు. ఆర్మీవ్యక్తి తల ఎత్తి మడతకత్తిలా మెడ రిక్కించి నాలుగుపక్కలా చూసి ఏమవుతోందో గ్రహించే లోపే, అతను ఇల్లు దాటిపోయాడు.
మరుసటిరోజు జిమ్ లైర్డ్ తాగిపడిపోయి అంత్యక్రియలకి హాజరు కాలేకపోయాడు. స్టీవెన్స్ అతని ఆఫీసుకి రెండుసార్లు కబురు పంపేడు కాని సమాధానం రాక, చివరికి అతనికి వీడ్కోలు చెప్పకుండానే తూర్పుప్రాంతం వెళ్ళే రైలు ఎక్కవలసి వచ్చింది. అతనికెందుకో మనసులో జిమ్ లైర్డ్ దగ్గరనుండి మళ్ళీ ఏదో కబురు వస్తుందని అనిపించి, తన చిరునామాను అతని టేబుల్ మీద వదలి వెళ్ళేడు. జిమ్ లైర్డ్ ఒకవేళ దాన్ని చూసి ఉంటే ఉండొచ్చునేమో గాని, సమాధానం ఇవ్వలేదు. హార్వీ ఏ గుణాన్నయితే జిమ్‌లో ప్రేమించాడో అది హార్వీ శవంతో పాటే సమాధి అయిపోయుండాలి. ఎందుకంటే, జిమ్ లైర్డ్ మళ్ళీ ఎన్నడూ హార్వీ మెరిక్ గురించి మాటాడలేదు. ఆ తర్వాత కొంతకాలానికే ఫెల్ప్స్ కొడుకుల్లో ఒకడు కొలరాడోలో గవర్నమెంట్ అడవిని ఆక్రమించుకుని కలప దొంగతనం చేస్తూ దొరికిపోయినప్పుడు, జిమ్ అతని తరఫున వాదించడానికి వెళుతూ న్యుమోనియా వచ్చి చచ్చిపోయాడు.
(మూలం: A sculptor’s funeral రచన: Will Cather.)