ఛందస్సు కొక కొండ కొక్కొండ

వెండి
కవిమణినామ సత్కావ్యమ్మున్ గావించి
ఘటికాచల నృసింహ కరుణసిరులఁ గంటివిగా
అమర సింహాచలయాత్రను రచియించి
సూర్మికఁ గాళిదాసుఁ డన గణన జూపితిగా
అంతఁ గోర్కొండమహత్త్వంబునున్ జెప్పి
కుండలీంద్రుండుగన్ గొఱలితి దెలుఁగు సుకవిగా
శంకరవిజయధ్వజంబు నూరేగించి
కరభూషణుండవై కర మలరితి ఘనుఁడవుగా
తేటగీతి
మహితముగఁ బానక మొనర్చి మంగళగిరి
నృహరికృప రాజగౌరవ మెనసి తీవు
శ్రీమహామహోపాధ్యాయనామ బిరుద-
రత్న కొక్కొండ వేంకటరత్న శర్మ

– శ్రీదీక్షితచరిత్రము, అవతారిక 12.

భూనుత
ప్రాఁత పద్దెముల కూటువె పట్టి పెనమగన్
నూతనంబుగ దోఁచు మనోజ్ఞ సుపద్య
వ్రాత గీతములఁ గూర్చెదఁ బచ్చడి బద్దల్
ప్రీతిమైఁ బెరుగుఁ గూడునఁ బెట్టిన యట్లౌ

-బిల్వేశ్వరీయము 1.218

బిల్వేశ్వరీయము

వీరు వ్రాసిన పుస్తకాలలో బిల్వేశ్వరీయము[5] నిజముగా తలమానికమే. ఈ కావ్యములో ఆరు బింబములు లేక ఆశ్వాసములు ఉన్నాయి. ఇది ఒక నిర్వచన కావ్యము. ఇందులో సుమారు మూడువేలకు కొద్దిగా తక్కువగా పద్యాలు ఉన్నాయి. సుమారు 160 విధాలైన వృత్తములను, జాత్యుపజాతులను ఈ కావ్యములో నుపయోగించారు. ఇంత వృత్త వైవిధ్యము చూపిన మరొక కవి విశ్వనాథ సత్యనారాయణగారు మాత్రమే. సంస్కృతములో అప్పయ్య దీక్షితులు నయమంజరిలో సుమారు 180 పైగా వృత్తాలను, జాతులను వాడారు.


Bilvesvariyam

బిల్వేశ్వరీయము ఒక స్థలపురాణము. చెన్నై-బెంగళూరు రైలు మార్గములో షోలింగర్, కాట్పాడిల మధ్య తిరువలం అని ఒక ఊరు. అక్కడ బిల్వేశ్వరునికి గుడి ఉన్నది. ప్రసిద్ధ శైవక్షేత్రములలో యిది యొకటి. ఇక్కడే వినాయకుడు తన తలిదండ్రుల చుట్టు ప్రదక్షిణము చేసి శివునిచే ఫలమును పొందినాడట, అందుకే తిరువలం అనే పేరు యీ ఊరికి. దక్షయజ్ఞ ధ్వంసము కూడ యిక్కడే జరిగిందని ప్రతీతి. ఈ గుడిలో మరొక విశేషమేమంటే, యిక్కడి నంది బసవన్న శివ లింగాన్ని చూస్తు ఉండక, ఎదురుగా ఉండే కంజగిరి అనే కొండను చూస్తూ కూర్చున్నదట. ఆ కొండ కంజుడు అనే రాక్షసుడు, వానినుండి ఆ స్థలాన్ని కాపాడడానికి అలా కూర్చుని ఉందట. ఈ తిరువలం గుడి, బిల్వవృక్షము, నంది మున్నగు విశేషాలను ఈ చిత్రాలలో చూడ వీలగును. ఈ కావ్యాన్ని కవిగారు చోళింగపురము (షోలింగర్) ఘటికాచల యోగనరసింహస్వామికి అంకితము చేస్తూ వ్రాసిన ఒక షష్ఠ్యంతమును క్రింద చదువవచ్చును –

క. మత్స్యా ద్యవతార రచిత
      కుత్స్యాసుర హన్న కృత్య కుతుకయుత మహా
      వాత్స్యాయనాది మునిజన
      హృత్స్యందన భావభావితేష్టార్థునకున్

-బిల్వేశ్వరీయము 1.248


బిల్వేశ్వరీయము

నా ముఖ్యోద్దేశము ఈ కావ్యములోని ఛందస్సును గురించిన చర్చ మాత్రమే. ఈ కావ్యములో కవిరత్నము ఉపయోగించిన అన్ని రకములైన పద్యాలకు ఒక ఉదాహరణను అనుబంధము-1లో చదువగలరు. అవి అకారాదిగా అమర్చబడినవి. DLI నుండి దిగుమతి చేసికొనబడిన నా ప్రతి 19వ శతాబ్దపు నాటిది. నేటిలా కాక పదాలను విడదీసి వ్రాయలేదు అందులో. నేను నాకు తెలిసినంతవరకు వాటిని విడదీసి వ్రాసినాను. అక్కడ యిక్కడ తప్పులుంటే మన్నించ ప్రార్థన. ఆ పద్యాల తాత్పర్యాలు తెలియజేయడము ఈ వ్యాసపరిధికి చెందిన పని కాదు. కావున నే నా ప్రయత్నము చేయలేదు.

వృత్తములు

నా ఎన్నికలో పంతులుగారు సుమారు 150 వృత్తాలను బిల్వేశ్వరీయములో పదిలపరచారు. ఆ వృత్తాలను పట్టిక-1లో చూడవచ్చును. ఈ పట్టిక అకారాదిగా అమర్చబడినది. దీని తయారీలో నేను కోవెల సంపత్కుమారాచార్యుల ఛందఃపదకోశమును[6], హరిదామోదర వేళంకర్‌గారి జయదామన్[7] వృత్త సంకలనాన్ని పరిశీలించాను. ఆయా వృత్తాలకు ఉండే నామాంతరాలను కూడ కుండలీకరణములలో తెలిపినాను. ఆ వృత్తాల గణస్వరూపాన్ని, వాటి గురు లఘువులను వివరించాను. ఈ పట్టిక ఛందశ్శాస్త్రములో ఆసక్తి ఉన్నవారికి ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నా ఉద్దేశములో అవి పంతులుగారి కొత్త వృత్తాలని తోచినప్పుడు వాటి పక్కన ఒక నక్షత్రపు గుర్తు నుంచాను. వారు ఉపయోగించిన వృత్తాలలో నా దృష్టిలో మాత్రాగణబద్ధమైన వృత్తాలను పట్టిక-2లో ఉదహరించాను. ఈ పట్టిక పూర్తిగా నా స్వంత అభిప్రాయము, కల్పన మాత్రమే. ఉదాహరణకు, ఇంద్రవజ్రను మాత్రాగణబద్ధ వృత్తముగా నెవ్వరు విశదీకరించలేదు, కాని అది మిశ్రమాత్రాగణ వృత్తమని నేను తెలిపాను. పంతులుగారు వీటిని కొన్ని చోటులలో పాటించారు, కొన్ని చోటులలో పాటించలేదు. పదాలు మాత్రాగణాలుగా విరిగినప్పుడు మాత్రమే ఇట్టి వృత్తాలు తాళ వృత్తాలవుతాయి. అంటే వీటిని సంగీతపరముగా వివిధ తాళముల నుంచుకొని పాడుకొనవచ్చును. ఉదాహరణకు, చంపకోత్పలమాలలను అట తాళ యుక్తముగా పాడుకొనవచ్చును, కాని తెలుగు కవులెవ్వరు అలా మాలావృత్తాలను రచించలేదు. అందుకే పద్యగానము తెలుగు నాటకాలలో, చలనచిత్రాలలో ఉన్నా కూడ, వాటికి సామాన్యముగా రాగము ఉంటుంది కాని తాళముండదు.

పంతులుగారు ఉపయోగించిన విశేష వృత్తాలలో కొన్ని అందరు కవులు అప్పుడప్పుడు ఉపయోగించినవే – ఉదా. కవిరాజవిరాజితము, క్రౌంచపదము, తరళ, తోటకము, దండకము, పంచచామరము, భుజంగప్రయాతము, మంగళమహాశ్రీ, మందాక్రాంత, మత్తకోకిల, మహాస్రగ్ధర, మానిని, మాలిని, వనమయూరము, వసంతతిలక, విద్యున్మాల, సుగంధి, స్రగ్ధర, స్రగ్విణి. కాని పట్టిక-1 లోని మిగిలిన వృత్తాలలో తెలుగు కవులు అరుదుగా పద్యాల నల్లినారు. ఈ వృత్తాల వాడుక వారికి ఛందశ్శాస్త్రములో నున్న గొప్ప కౌశల్యాన్ని, అభిరుచిని, విజ్ఞానాన్ని తెలుపుతుంది. అంతే కాదు, సమయోచితముగా, ఆ వృత్తాలలో ముద్రాలంకారాన్ని (పద్యములో దాని పేరు వచ్చుట) కూడ ఉపయోగించారు. పద్య సంఖ్యలు బిల్వేశ్వరీయకావ్యమునుండి గ్రహించబడినవి. మచ్చుకు ఒక రెండు ఉదాహరణలు:

ఉత్పలమాల 20 కృతి 355799 UIIUIUIII UIIUIIUIUIU భ-ర-న-భ-భ-ర-ల-గ 10

శంకరి నీ మొగంబు నెలజానుగఁ గొల్చిన డిందుఁగం దటన్
చంకిలి యేదివచ్చె శశి యాదరమొప్పఁగఁ జూడు వీని మీ-
నాంకుని మామ మామక శిఖాంచితుఁ బ్రాంచితు నుత్పలాప్తునిన్
బొంకమగున్ గదా వినతపోషణ ముత్పలమాలికేక్షణా – 2.32

కవిరాజవిరాజితము 23 వికృతి 3595120 – IIII UII UII UII UII UII UII U న-జ-జ-జ-జ-జ-జ-ల-గ 14

వెలయఁగ వేల్పులకున్ ద్రిదివం బిలవేల్పులకున్ భువి సోఁకులకున్
విలసిలఁగాను రసాతల మెంతయు బ్రీతి సునీతి జగత్త్రయమున్
జెలఁగెను వారలు గారవ మారఁగఁ జేకొని స్వేష్ట పదార్థము లిం-
పెలయఁగ నేలుము నేలుము రాజ్యమనన్ గొనియెన్ గవిరాజవిరాజితమున్

– 5 ఉత్తర భాగము, 393