పరిచయము
శార్దూల విక్రీడితము (శా.వి.) ప్రాచీనతమ వృత్తములలో ఒకటి. స్రగ్ధరతో ఈ వృత్తము కూడ సంస్కృతములో విరివిగా వాడబడిన నిడుద వృత్తములలో ఒకటి అని చెప్పవచ్చును. ఇది పింగళ ఛందస్సులో, భరతుని నాట్యశాస్త్రములో పేర్కొనబడినది. దీని నడక గంభీరముగా ఉంటుంది. స్రగ్ధరవలెనే ఇది కూడ గురువులతో ఆరంభమవుతుంది. ఈ వృత్తపు పింగళసూత్రము – శార్దూలవిక్రీడితం మూసౌ జూసౌ తౌ గాదిత్యఋషయః, అనగా శా.వి. కి గణములు మ/స/జ/స/త/త/గ, పాదములు పండ్రెండు (ఆదిత్య) అక్షరములు, ఏడు (ఋషి) అక్షరములుగా విఱుగును. ఈ వ్యాసము ద్వారా ఈ వృత్తమును గురించి వివరముగా చర్చిస్తున్నాను.
నిడుద వృత్తముల ఉత్పత్తి
వేద, పురాణేతిహాసములలోని పద్యముల (శ్లోకముల) ఛందస్సు అక్షర సంఖ్యపైన ఆధారపడినవి. ఎక్కువగా ఎనిమిది అక్షరముల అనుష్టుభ్, త్రిపద గాయత్రి, పదకొండు అక్షరాల త్రిష్టుభ్, పండ్రెండు అక్షరముల జగతి ఛందములను మనము ఋగ్వేదాది గ్రంథములలో చూడవచ్చును. జ్ఞాపకము పెట్టుకొనుటకు, ఉచ్చరించుటకు సులభముగా నుండుటకోసం చివరి అక్షరములను ప్రత్యేకమైన గురులఘువుల అమరికతో (ఉదా. IUIU) వ్రాసేవారు. ఒకే శ్లోకములోని పాదములలో అక్షర సంఖ్యలు, పాదముల అమరికలు కూడ భిన్నమై ఉండవచ్చును. క్రింద ఒక ఉదాహరణ –
న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా
అశ్వత్థమేనం సువిరూఢమూలం
ఆసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా – (భగవద్గీతా, 15.03)
(ఈ అశ్వత్థవృక్షపు రూపమును అవగాహన చేసికొనుటకు వీలుకాదు; దాని ఆద్యంతములు, మూలము ఎక్కడో తెలియదు. దృఢ చిత్తముతో, బంధమును త్యజించి…)
ఈ శ్లోకములో మొదటి పాదము పాదము 12 అక్షరములు గల జగతీఛందములోని వంశస్థ వృత్తము, రెండవ మూడవ పాదములు పాదమునకు 11 అక్షరములు గల త్రిష్టుభ్ ఛందములోని ఇంద్రవజ్ర వృత్తము, నాలుగవ పాదము అదే ఛందములోని ఉపేంద్రవజ్ర వృత్తము.
వైదిక ఛందస్సు
ఋగ్వేదములో వాడబడిన చందస్సును మొదటి చిత్రమునందు గల పట్టికలో గమనించవచ్చును. వేదములలోని త్రిపదలను నేను ఇదే పత్రికలో త్రిపదలపైన (ఉష్ణి, పరౌష్ణి, కకుభ్) వ్రాసిన వ్యాసములో ఉదహరించినాను. ఇందులోని సతోబృహతిని గుఱించిన ప్రస్తావన ఈ వ్యాసమునకు వర్తిస్తుంది. వేదములలో, రామాయణ భారతములలో అక్షర సంఖ్యపైన ఆధారపడిన అనుష్టుభ్, త్రిష్టుభ్ వంటి ఛందములతోబాటు ఇంద్రవజ్ర (UUI UU – IIUI UU), ఉపేంద్రవజ్ర (IUI UU – IIUI UU), ఈ రెంటితో ఉపజాతులు కూడ కనబడుతాయి. పాదమునకు 12, 13 అక్షరములపైన ఉండే ఛందస్సులను ప్రారంభ దశలో వాడలేదు.
పెద్ద వృత్తముల నిర్మాణము
వైదిక ఛందస్సునుండి కావ్యములలో వాడబడిన లౌకిక ఛందస్సుకు వచ్చేసరికి పాదముల గురులఘువుల అమరిక పటిష్ఠమైనది. పెద్ద వృత్తముల నిర్మాణము ఎలా జరుగుతుంది? సులభమైన చిట్కా, రెండు చిన్న వృత్తములను చేరిస్తే ఒక పెద్ద వృత్తము వస్తుంది. రెండు కలా(ళా) వృత్తములను (IUIU, శ్లోకములయందలి సరి పాదములలోని చివరి అక్షరములు) చేరిస్తే ఒక ప్రమాణిక వృత్తము (IUIU IUIU) లభిస్తుంది. రెండు ప్రమాణికలను ప్రక్క ప్రక్కన ఉంచితే అది పంచచామర వృత్తము (IUIU IUIU – IUIU IUIU) అవుతుంది. ఇదే పంచచామరవృత్తములో మొదటి లఘువును తొలగించిన యెడల, మనకు ఉత్సాహజాతికి మూస అయిన సుగంధి (UI UI UI UI – UI UI UIU) లభిస్తుంది. రాజరాజి అనబడే వృత్తమునకు గణములు త/త/గ. ఇందులోని త-గణములకు బదులు ర-గణములను ఉంచినప్పుడు అది హంసమాల (ర/ర/గ) అవుతుంది. ఒక వృత్తమునుండి మఱొక వృత్తమునకు మనము కూడిక, తొలగింపు, ఒకదానికున్న గణములకు బదులు వేఱు గణముల నుంచుట ద్వారా సాధించ వీలగును. దీనినే నేను ఆంగ్లములో insertion, deletion, substitution లేక sub-in-del అంటాను. ఈ సిద్ధాంతముపైన ఆధారపడిన ఒక చిన్న ఆటను కూడ మఱొక చోట వివరించియున్నాను.
అక్షరసంఖ్యపైన ఆధారపడిన శ్లోకములు వేదములలో, పురాణేతిహాసములలో ఎక్కువైనను, కావ్యములలో క్రమబద్ధమైన పాదములతో నిర్దిష్టమైన గురు-లఘువులతో, ప్రతి ఛందస్సుకు ఒక ప్రత్యేకమైన పాదపు విఱుపులతో గల పద్యములను మనము చదువుతాము. ఈ మార్పు ఒకే రోజు వచ్చి ఉండదు. ఇలాటి మార్పు రావడానికి బహుశా ఒక రెండు శతాబ్దములై ఉండవచ్చును. సంస్కృత కావ్యములలో ఎక్కువగా చిన్న వృత్తములనే వాడారు. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, వంశస్థ, వసంతతిలక, మాలిని, మాత్రాబద్ధ ఛందస్సైన ఆర్య (గాథ) మున్నగునవి లౌకిక ఛందస్సులో వాడబడిన ప్రథమ ఛందోబంధములు. ఈ సమయములో బహుశా నిడుద వృత్తములను వాడవలయుననే ఆశ, అవసరము కవులకు కలిగినది కాబోలు. అప్పుడే శార్దూలవిక్రీడితము, స్రగ్ధరలు పుట్టి యుండవచ్చును.
శా.వి.కి గురులఘువులు – UUUIIUIUIIIU – UUIUUIU. ఇందులో 1-8 అక్షరములు శ్లోకములయందలి సరి పాదములకు సరిపోతాయి. ఎందుకనగా ప్రత్యేకముగా IUIU అమరిక శ్లోకపు సరి పాదములలో మనము చదువుతాము. (ఇదే విషయమును అమూల్యధన్ ముఖర్జీ కూడ ప్రస్తాపించినారు. కాని వారు శా.వి.కి గ్రీకు భాషలోని కొన్ని పద్యములకు గల పోలికను గమనించి వీటికి ఒక సమానమైన ఉత్పత్తి స్థానము ఉన్నదేమో అని ఊహించినారు.) అదే విధముగా చివరి మూడు అక్షరములు కూడ. మఱొక విషయము నా కళ్ళకు కనబడినది, 9-16 అక్షరములను పరిశీలించినయెడల 9-13 అక్షరముల గురులఘువులు 1-5 అక్షరముల గురులఘువులలో గురులఘువులను తారుమారు చేసినప్పుడు కలిగిన ఫలితము. అది క్రింద చూపిన అమరిక ద్వారా గ్రహించవచ్చును. 6-8, 14-16, 17-19 అక్షరముల అమరిక ఒక్కటే (ర-గణము). చివరి ర-గణము లయకై చేర్చబడినదేమో?
UUUIIUIU (1- 8)
IIIUUUIU (9-16) UIU (17-19)
వైదికఛందస్సులోని పట్టికలో (మొదటి చిత్రము) సతోబృహతి అని ఒక ఛందస్సు గలదు. అందులోని పాదములకు 12, 8, 12, 8 అక్షరములు. 12, 8 అక్షరములను ప్రక్క ప్రక్కన ఉంచి, ఒక అక్షరమును తగ్గించినప్పుడు మనకు 19 అక్షరముల పద్యము లభిస్తుంది. శా.వి. వంటి వృత్తములకు పునాది ఇట్టి ఛందస్సుగా కూడ ఉండవచ్చునను అభిప్రాయము ఉన్నది. సతోబృహతికి ఒక ఉదాహరణము –
ఇరజ్యన్ అగ్నే ప్రథయస్వ జంతుభిర్
అస్మే రాయో అమర్తియ
స దర్శతస్య వపుషో వి రాజసి
పృణక్షి సానసిం క్రతుం – (ఋగ్వేదము, 10.140.04)
(అగ్నీ, నీవు జీవంతమైన లోకమునకు పాలకునిగా వ్యాపించుము. అమర దైవమా, మాకు సర్వ సంపదలను ప్రసాదించుము. నీ సౌందర్యము ప్రకాశించుచున్నది. నీ ఆధ్వర్యములో మేము సశక్తులమై విజయమును పొందెదము.)
ఏది ఏమైనా శా.వి. క్రీస్తుశకారంభము నాటికే సంస్కృత కవులకు పరిచితమైన ఛందస్సు. మహాభారతములోని దక్షిణ భారత ప్రతిలోకర్ణ, అనుశాసనిక పర్వములలో శా.వి. ఛందములో నాలుగైదు పద్యములు ఉన్నవి. కాని ఇవి బహుశా ప్రక్షిప్తములని భావించవచ్చును. అశ్వఘోషుని సౌందరనంద కావ్యములో ప్రప్రథమముగా శా.వి. వృత్తమును మనము చదువవచ్చును. ఒక ఉదాహరణము –
భిక్షార్థం సమయే వివేశచ పురౌం – దృష్టౌర్జనస్యాక్షిపన్
లాభాలాభ సుఖాసుఖాదిషు సమః – స్వస్యేంద్రియో నిస్పృహః
నిర్మోక్షాయ చకార తవ చ కథాం – కాలే జనాయార్థినే
నైవోన్మార్గ గతాన్ జనాన్ పరిభవ – న్నాత్మాన ముక్తర్షయన్ – (అశ్వఘోషుని సౌందరనందము, 18.62)
(అతడు భిక్షార్థము నగరప్రవేశము చేసినప్పుడు, ప్రజలు అతడిని గమనించినారు. లాభనష్టములు, సుఖదుఃఖాదులను సమముగా నెంచు నతడు ఇంద్రియములకు అతీతుడు. అక్కడ ఆ క్షణము జనులకు తప్పు దారులను చూపక తన గుఱించి గొప్పలు చెప్పుకొనక ముక్తి మార్గమునుగుఱించి బోధించెను.)
సంస్కృతనాటకరచయితలలో పురాతనుడైన భాసమహాకవి వ్రాసిన ప్రతిమానాటకమునుండి ఒక శా.వి. వృత్తము –
ఆరంభే పటహే స్థితే గురుజనే – భద్రాసనే లంగితే
స్కంధోచ్చారణ నమ్యమాన వదన – ప్రద్యోతితోయే ఘటే
రాజ్ఞాహూయ విసర్జితే మయి జనో – ధైర్యేణ మే విస్మితః
స్వః పుత్రః కురుతే పితుర్యది వచః – కస్తత్ర భో విస్మయః – (భాసుని ప్రతిమానాటకము, 1.5)
(గురుజనుల సమక్షములో పటహ వాద్యములు మ్రోయుచుండగా, మంగళాసనముపైన నేను కూర్చుండగా, మంత్రజలములు పాత్రనుండి పోయబడు సమయములో చక్రవర్తి నన్ను చూడ రమ్మనెనను వార్త నా పేర వచ్చినది. జనులందఱు నా ధైర్యమునకు ఆశ్చర్యపోయారు. స్వపుత్రుడు తండ్రి మాటను పరిపాలించుటలో ఆశ్చర్య మెందుకో?)
శిలాశాసనములలో కూడ శా.వి. పద్యములను అల్లినారు. హరిసేనుడు సముద్రగుప్త చక్రవర్తిని గుఱించి వ్రాసిన ప్రయాగప్రశస్తిలోని క్రింది పద్యము దానికి ఒక ఉదాహరణము –
ఏహ్యోహీత్యుపగుహ్య భావపిశునై – రుత్కర్ణితే రోమభిః
సభ్యేషూచ్ఛ్వసితేషు తుల్యకులజ – మ్లానాననోద్వీక్షితః
స్నేహవ్యాలులితేన బాష్పగురుణా – తత్త్వేక్షిణా చక్షుషా
యః పిత్రాభిహితో నిరీక్ష్య నిఖిలాం – పాహిత్వముర్వీమతిః – (సముద్రగుప్తుని ప్రయాగప్రశస్తి, క్రీ.శ. 360)
(తాము తిరస్కరించబడిరనే మ్లాన వదనములతో సామంతరాజులు చూచుచుండగా, శ్రేయోభిలషులు సంతోషపడుచుండగా, రోమాంచితుడై తండ్రి అట్టి పుత్రుని (సముద్రగుప్తుని) కౌగిలించుకొని ఇతడు సమస్త లోకమును పరిపాలించు చక్రవర్తి అయ్యెనని ఆనందించెను.)