పరిచయము
ఛందశ్శాస్త్రము ఒక మహాసాగరము వంటిది. అందువల్లనే కాబోలు కొందరు లాక్షణికులు తమ గ్రంథాలకు ఛందోంబుధి, వృత్తరత్నాకరము, కవితాసాగరము అనే పేరుల నుంచారు. నాలుగు పాదాలు ఒకే విధముగా నుండే ఒకటినుండి 26 అక్షరాలవరకు ఉండే సమవృత్తాలను 134,217,726 విధములుగా వ్రాయవచ్చును. ఇవి గాక అర్ధసమ వృత్తాలు, విషమవృత్తాలు, జాతులు, తెలుగులో ఉపజాతులు ఉన్నాయి. ఒక సీస పద్యపు పాదాన్ని186,624 విధములుగా వ్రాయవచ్చును. ఛందస్సులో ఇలా ఎన్నో గణితాంశాలు దాగి ఉన్నాయి. ఈ గణిత సౌందర్యాన్ని ఒకప్పుడు నేను వివరించి ఉన్నాను[1]. ఎన్నో రకాల వృత్తాలు, కందాది జాతులు, గీత్యాది ఉపజాతులు ఉన్నా కూడ, నన్నయనుండి నేటివరకు కవులు వీటిలో కొన్నిరకాల పద్యాలను మాత్రమే తమ కావ్యాలలో ఉపయోగించారు. అందులో ఖ్యాతవృత్తాలు నాలుగు – చంపకమాల, ఉత్పలమాల, మత్తేభవిక్రీడితము, శార్దూలవిక్రీడితము. కవులందరు ఎక్కువగా జాతి పద్యమైన కందమును వాడారు. తెలుగు భాషలో ఈ కందము సంస్కృతములోని అనుష్టుప్ శ్లోకపు స్థానాన్ని ఆక్రమించుకొన్నది. అందుకే తెలుగులో శ్లోకము అరుదు. ఉపజాతులలో ఆటవెలది, తేటగీతి, సీసము ఎక్కువగా వాడబడినవి. ఇవి కాక కొన్ని మత్తకోకిలలాటి విశేష వృత్తాలను, ఉత్సాహలాటి జాతులను కూడ సమయోచితముగా కవులు ఉపయోగించారు. నన్నయ, నన్నెచోడుడు వృత్తౌచిత్యములో అందెవేసిన కవులు. తిక్కన స్త్రీపర్వములో ఎన్నో అరుదైన వృత్తాలను వాడారు. విశ్వనాథ సత్యనారాయణ శ్రీరామాయణ కల్పవృక్షములో సుమారు 400లకు పైగా వృత్తాలను, జాత్యుపజాతులను ప్రయోగించారు. ఇటీవల వేము భీమశంకరం రసస్రువులో ఛందోవైవిధ్యాన్ని చూపారు. కాని ఒక విషయము, ఈ కవులందరు లక్షణ గ్రంథాలలో ఉండే వృత్తాలను మాత్రమే వాడారు. తాము స్వతంత్రముగా కొత్తగా కనిపెట్టిన వృత్తాలు చాల తక్కువే అని చెప్పవచ్చును.
పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో [2] ఎన్నో కొత్త వృత్తాలను ఉదహరించారు. తరువాత పందొమ్మిది, ఇరవై శతాబ్దాలలో జీవించిన కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు ఎన్నో వృత్తాలను, జాత్యుపజాతులను కనుగొనడము మాత్రమే కాక, వాటిని తన గ్రంథాలలో (ముఖ్యముగా బిల్వేశ్వరీయములో) ప్రయోగము చేసినారు. ధర్మవరం రామకృష్ణాచార్యులు, వేదం వేంకటరాయశాస్త్రి, రాయదుర్గము నరసింహశాస్త్రి మున్నగువారు కూడ నూతన వృత్తాలను, జాత్యుపజాతులను కనుగొని తమ రచనలలో వాడారు[3]. ఈ శతాబ్దములో తిరుమల కృష్ణదేశికాచార్యులు కొన్ని ప్రయోగాలను చేసిన విషయము గమనార్హము. వైయక్తికముగా న్యూజెర్సీ వాస్తవ్యులు సుప్రభగారు (పావులూరి ప్రభావతి) ఎన్నో కొత్త గణ వృత్తాలను, మాత్రా వృత్తాలను కనుగొని ఛందస్సు, రచ్చబండ గుంపులలో వాటికి ఉదాహరణలను పద్యరూపముగా నిచ్చారు. గడచిన పది సంవత్సరాలుగా నేను ఈ ఉద్యమములో నిరంతర కృషిని సలుపుచున్న విషయము అందరూ యెరిగినదే. ఉన్న వృత్తాలలోని విశేషాంశాలు, అందులో దాగియుండే అపురూపమైన నడకలు, ఎన్నో కొత్త వృత్తాలు, తాళబద్ధమైన మాత్రా వృత్తాలు, సంగీతానికి సాహిత్యానికి ఉండే పద్యరూపమైన అవినాభావ సంబంధాన్ని విశదీకరించే ఉదాహరణలను తెలుపుతున్నాను.
కొక్కొండ వేంకటరత్నము పంతులు
కొక్కొండ వేంకటరత్నము
(1842-1915)
ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు ఛందశ్శాస్త్రములో చేసిన గొప్ప కృషిని అందరికీ తెలుపడము మాత్రమే. కొక్కొండ వేంకటరత్నము పంతులు 1842-1915 మధ్యకాలములో జీవించారు. వీరి తండ్రి నరశింగశర్మ, తల్లి రమాంబ (రామమ్మ, రామాయమ్మ). మొదటి భార్య పేరు సుబ్బమ్మ, వేంకట లక్ష్మీనరసింహులని యిద్దరు కొడుకులు. పరవస్తు చిన్నయసూరి పిదప మదరాసు రాజధాని కళాశాలలో 1878-1899 కాలములో తెలుగు పండితుడుగా పని చేసారు. (వీరి తరువాత వీరేశలింగముగారు ఈ పదవిని అలంకరించారు.) తరువాత రాజమండ్రిలో కూడ పని చేసారట. అక్కడ వీరు రత్నకవి గ్రంథాలయము అని ఒక గ్రంథాలయమును కూడ స్థాపించారు. ఇది తరువాత గౌతమీ గ్రంథాలయములో ఒక భాగమైనది. వీరి తనయుడు కుమారనరసింహం తరువాత శాంతానందస్వాములని ప్రసిద్ధి పొందారు. వీరి రెండవ కుమార్తె బెహరా కమలమ్మ కమలాంబికగా బాలత్రిపురసుందరీపీఠాన్ని అధిరోహించారు.
పంతులుగారు సాంఖ్యయోగములో దిట్ట. వీరికి కవిబ్రహ్మ, కవిరత్న, మహామహోపాధ్యాయ అనే బిరుదులు ఉండేవి. వీరి రచనలు – పంచతంత్రము (విగ్రహము – వచన రచన), సింహాచలయాత్ర, బిల్వేశ్వర శతకము, బిల్వేశ్వరీయము, కోరుకొండ మాహాత్మ్యము, మంగళగిరి మాహాత్మ్యము, గోదావరీ వర్ణనము, గోవిందమంజరి (భజగోవిందము తెలుగు సేత), దీక్షితచరిత్రము, Prince of Walesను గురించి వ్రాసినది, సంస్కృత మహాశ్వేత తెలుగు అనువాదము, నరకాసురవిజయ వ్యాయోగము, ధనంజయవిజయ వ్యాయోగము అనే రెండు వ్యాయోగ నాటకాలు, ప్రసన్న రాఘవమునకు తెలుగు అనువాదము. ఇందులో వీరి మహాశ్వేతను కొందరు మొదటి తెలుగు నవలగా గుర్తిస్తారు. వీరి నరకాసురవిజయ వ్యాయోగము తెలుగులో మొట్ట మొదటి నాటకపు ప్రచురణ (కోరాడవారి మొట్టమొదటి నాటకము మంజరీ మధుకరీయము తరువాత ప్రచురించబడినది). ఇందులో బిల్వేశ్వరీయము, గోవిందమంజరి, దీక్షితచరిత్రము Digital Library of India (DLI)లో లభ్యము. బిల్వేశ్వరీయము కొన్ని నెలల ముందు రత్నకమలాంబికా సేవ ట్రస్ట్ ఆధ్వర్యాన పునర్ముద్రించబడినది.
ఆ సంధియుగములో తెలుగు సాహిత్యములో ముగ్గురు హేమహేమీలు ఉండేవారు, వారు – కొక్కొండ వేంకటరత్నము పంతులు, కందుకూరి వీరేశలింగం, వేదం వేంకటరాయశాస్త్రి. అందరూ చిన్నయ సూరి విధానమే అనుసరించారు. కాని వారి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువ. ముగ్గురికీ మూడు పత్రికలు ఉండేవి – కొక్కొండకు ఆంధ్రభాషాసంజీవని, వీరేశలింగమునకు వివేకవర్ధని, వేంకటరాయశాస్త్రికి వారి స్నేహితులైన పూండ్ల రామకృష్ణయ్య నడిపే అముద్రిత గ్రంథచింతామణి. వీటిలో ఎప్పుడు ఒకరిని మరొకరు దుయ్యబట్టేవారు. వ్యావహారిక భాషావాదులైన గిడుగు రామమూర్తిపంతులుకు వీరెవ్వరి ధోరణి నచ్చకపోయినా, మిగిలినవారు దురుసుగా, అమర్యాదగా, అనవసరముగా కొక్కొండను విమర్శించారని అభిప్రాయపడ్డారని గిడుగు సీతాపతి చెప్పారు[4]. పంతులుగారు శుద్ధ గ్రాంథికవాదులు అనడములో అతిశయోక్తి యేమాత్రము లేదు. వారు తన స్వగృహములో భార్యతో, బంధువులతో, బయట వర్తకులతో, పనిమనుషులతో గ్రాంథికములోనే మాటలాడేవారట. ఆశువుగా గ్రాంథికభాషలో ప్రాసానుప్రాసలతో చక్కగా కర్ణానందముగా ఉపన్యాసాలను యిచ్చేవారట.
వృత్తాలను ఎందుకు కనుక్కోవాలి?
కోట్ల కొలది వృత్తాలు ఉన్నా కూడ, వాటిలో పేరున్న వృత్తాలు సుమారు 1000-2000 మాత్రమే[5]. అందులో కూడ సంస్కృతాంధ్ర కవులు ఒక 50-100 వృతాలు మాత్రమే తమ కావ్యాలలో వాడినారు. తెలుగు కవులు చంపకోత్పలమాలలను, శార్దూలమత్తేభవిక్రీడితాలను మాత్రమే విరివిగా నుపయోగించారు. కవికి ముఖ్యమైన కర్తవ్యము తన కావ్యములో రక్తికరముగా, ఆసక్తికరముగా కథను నడిపించడము, వర్ణనలను చేయడము, యిత్యాదులు. దీనికి తాను ఎన్నుకొన్న యే వృత్తమయినా సరిపోతుంది. ప్రతియొక్క కవి కొన్ని పద్యాలను మలచడములో ప్రతిభావంతుడు, ఉదా. పోతన మత్తేభాలు, శ్రీనాథుని సీస పద్యాలు, సోమనాథుని ద్విపదలు మున్నగునవి. ఈ కొన్ని వృత్తాల ప్రయోగములో కవులు అసమాన చాతుర్యాన్ని ప్రదర్శించారు. కాని కొందరు కవులకు కొత్త కొత్త చట్రములో పద్యాలు యేలాగుంటాయో అనే కుతూహలము కలుగుతుంది. ఆ జిజ్ఞాసను పూర్తి చేసికోవడానికి విశేష వృత్తాలలో పద్యాలను వ్రాసినారు. చాల మంది కవులు ఆశ్వాసాంతములో యిలాటి వృత్తాలను ఉపయోగించారు. కొన్ని వృత్తాలు లయబద్ధముగా, తాళబద్ధముగా ఉంటాయి, ఉదా. లయగ్రాహివంటి ఉద్ధురమాలావృత్తాలు, రగడలు, దండకము మున్నగునవి. చక్కగా వ్రాయబడిన యిట్టి తాళవృత్తాలను పాడుకొని ఆనందించవచ్చును. యక్షగానాలలో ఇట్టివి పదేపదే గోచరిస్తాయి.
ఎవరెస్టు, కాంచనజంగ, కిలిమంజారో, పైక్స్ పీక్ మున్నగు పర్వతశిఖరాలను వ్యయప్రయాసల కోర్చి యెందుకెక్కాలయ్యా అంటే దానికి జవాబు అవి ఉన్నాయి కనుక, వాటిని యెక్కాలి. అదే విధముగా కొత్త కొత్త పద్యాలను ఎందుకు సృష్టించాలి అంటే అవి ఉన్నాయి, ఆ అమరికలో వ్రాయబడిన పద్యాలు ఎలా వినబడుతాయో అనే ఆదుర్దాను తీర్చుకోడానికి అన్నదే నా జవాబు. బహుశా ఈ కారణాలవల్లనే పంతులుగారు కూడ యెన్నో విశేష వృత్తాలలో వ్రాసినారు, మఱి కొన్ని వృత్తాలను, జాతి పద్యాలను సృష్టించి ఆ చట్రములో తన కవితను పదిల పరచినారు.
ఛందశ్శాస్త్రములో తన నూతన పంథాను గురించి , తాను వ్రాసిన కావ్యములను గురించి ఈ క్రింది పద్యాలలో చెప్పుకొన్నారు (ఆ పద్యముల ఛందస్సును తరువాత వివరిస్తాను).
బంగారము –
బిల్వేశ్వరీయమన్ విదిత ప్రబంధంబు
వివిధ సద్వృత్తాళి విస్తరించి పేర్మి మించి
వెండి బంగారముల్ వెలయించి యాంధ్రభా-
షాసీస దుస్థితి నోసరించి వాసిఁ గాంచి
యంతియే కాక రత్నావళుల్ గల్పించి
యాంధ్రు లెందఱనొ భూషాంచితులఁగ నాదరించి
గురుత విశ్వామిత్ర గోత్రగౌరవ మెచ్చఁ-
గన్ గవిబ్రహ్మ నా ఖ్యాతిఁ గాంచి కరము మించి
తేఁటి –
సముచితాక్షర సాంఖ్యశాస్త్రము నొనర్చి సరవిఁ బేర్చి
కనితి వర్ణసాంఖ్యాచార్యుఁ డనఁ బ్రసిద్ధి ఘన సుసిద్ధి
గన మహామహోపాధ్యాయ ఘన బిరుదము వినుతి యెందు
నిఖిల పండిత కవివంద్య నీకె తగును నీకె తగున్– శ్రీదీక్షితచరిత్రము, అవతారిక 11.
వెండి –
కవిమణినామ సత్కావ్యమ్మున్ గావించి
ఘటికాచల నృసింహ కరుణసిరులఁ గంటివిగా
అమర సింహాచలయాత్రను రచియించి
సూర్మికఁ గాళిదాసుఁ డన గణన జూపితిగా
అంతఁ గోర్కొండమహత్త్వంబునున్ జెప్పి
కుండలీంద్రుండుగన్ గొఱలితి దెలుఁగు సుకవిగా
శంకరవిజయధ్వజంబు నూరేగించి
కరభూషణుండవై కర మలరితి ఘనుఁడవుగా
తేటగీతి –
మహితముగఁ బానక మొనర్చి మంగళగిరి
నృహరికృప రాజగౌరవ మెనసి తీవు
శ్రీమహామహోపాధ్యాయనామ బిరుద-
రత్న కొక్కొండ వేంకటరత్న శర్మ– శ్రీదీక్షితచరిత్రము, అవతారిక 12.
భూనుత –
ప్రాఁత పద్దెముల కూటువె పట్టి పెనమగన్
నూతనంబుగ దోఁచు మనోజ్ఞ సుపద్య
వ్రాత గీతములఁ గూర్చెదఁ బచ్చడి బద్దల్
ప్రీతిమైఁ బెరుగుఁ గూడునఁ బెట్టిన యట్లౌ-బిల్వేశ్వరీయము 1.218
బిల్వేశ్వరీయము
వీరు వ్రాసిన పుస్తకాలలో బిల్వేశ్వరీయము[5] నిజముగా తలమానికమే. ఈ కావ్యములో ఆరు బింబములు లేక ఆశ్వాసములు ఉన్నాయి. ఇది ఒక నిర్వచన కావ్యము. ఇందులో సుమారు మూడువేలకు కొద్దిగా తక్కువగా పద్యాలు ఉన్నాయి. సుమారు 160 విధాలైన వృత్తములను, జాత్యుపజాతులను ఈ కావ్యములో నుపయోగించారు. ఇంత వృత్త వైవిధ్యము చూపిన మరొక కవి విశ్వనాథ సత్యనారాయణగారు మాత్రమే. సంస్కృతములో అప్పయ్య దీక్షితులు నయమంజరిలో సుమారు 180 పైగా వృత్తాలను, జాతులను వాడారు.
బిల్వేశ్వరీయము ఒక స్థలపురాణము. చెన్నై-బెంగళూరు రైలు మార్గములో షోలింగర్, కాట్పాడిల మధ్య తిరువలం అని ఒక ఊరు. అక్కడ బిల్వేశ్వరునికి గుడి ఉన్నది. ప్రసిద్ధ శైవక్షేత్రములలో యిది యొకటి. ఇక్కడే వినాయకుడు తన తలిదండ్రుల చుట్టు ప్రదక్షిణము చేసి శివునిచే ఫలమును పొందినాడట, అందుకే తిరువలం అనే పేరు యీ ఊరికి. దక్షయజ్ఞ ధ్వంసము కూడ యిక్కడే జరిగిందని ప్రతీతి. ఈ గుడిలో మరొక విశేషమేమంటే, యిక్కడి నంది బసవన్న శివ లింగాన్ని చూస్తు ఉండక, ఎదురుగా ఉండే కంజగిరి అనే కొండను చూస్తూ కూర్చున్నదట. ఆ కొండ కంజుడు అనే రాక్షసుడు, వానినుండి ఆ స్థలాన్ని కాపాడడానికి అలా కూర్చుని ఉందట. ఈ తిరువలం గుడి, బిల్వవృక్షము, నంది మున్నగు విశేషాలను ఈ చిత్రాలలో చూడ వీలగును. ఈ కావ్యాన్ని కవిగారు చోళింగపురము (షోలింగర్) ఘటికాచల యోగనరసింహస్వామికి అంకితము చేస్తూ వ్రాసిన ఒక షష్ఠ్యంతమును క్రింద చదువవచ్చును –
క. మత్స్యా ద్యవతార రచిత
కుత్స్యాసుర హన్న కృత్య కుతుకయుత మహా
వాత్స్యాయనాది మునిజన
హృత్స్యందన భావభావితేష్టార్థునకున్-బిల్వేశ్వరీయము 1.248
నా ముఖ్యోద్దేశము ఈ కావ్యములోని ఛందస్సును గురించిన చర్చ మాత్రమే. ఈ కావ్యములో కవిరత్నము ఉపయోగించిన అన్ని రకములైన పద్యాలకు ఒక ఉదాహరణను అనుబంధము-1లో చదువగలరు. అవి అకారాదిగా అమర్చబడినవి. DLI నుండి దిగుమతి చేసికొనబడిన నా ప్రతి 19వ శతాబ్దపు నాటిది. నేటిలా కాక పదాలను విడదీసి వ్రాయలేదు అందులో. నేను నాకు తెలిసినంతవరకు వాటిని విడదీసి వ్రాసినాను. అక్కడ యిక్కడ తప్పులుంటే మన్నించ ప్రార్థన. ఆ పద్యాల తాత్పర్యాలు తెలియజేయడము ఈ వ్యాసపరిధికి చెందిన పని కాదు. కావున నే నా ప్రయత్నము చేయలేదు.
వృత్తములు
నా ఎన్నికలో పంతులుగారు సుమారు 150 వృత్తాలను బిల్వేశ్వరీయములో పదిలపరచారు. ఆ వృత్తాలను పట్టిక-1లో చూడవచ్చును. ఈ పట్టిక అకారాదిగా అమర్చబడినది. దీని తయారీలో నేను కోవెల సంపత్కుమారాచార్యుల ఛందఃపదకోశమును[6], హరిదామోదర వేళంకర్‌గారి జయదామన్[7] వృత్త సంకలనాన్ని పరిశీలించాను. ఆయా వృత్తాలకు ఉండే నామాంతరాలను కూడ కుండలీకరణములలో తెలిపినాను. ఆ వృత్తాల గణస్వరూపాన్ని, వాటి గురు లఘువులను వివరించాను. ఈ పట్టిక ఛందశ్శాస్త్రములో ఆసక్తి ఉన్నవారికి ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నా ఉద్దేశములో అవి పంతులుగారి కొత్త వృత్తాలని తోచినప్పుడు వాటి పక్కన ఒక నక్షత్రపు గుర్తు నుంచాను. వారు ఉపయోగించిన వృత్తాలలో నా దృష్టిలో మాత్రాగణబద్ధమైన వృత్తాలను పట్టిక-2లో ఉదహరించాను. ఈ పట్టిక పూర్తిగా నా స్వంత అభిప్రాయము, కల్పన మాత్రమే. ఉదాహరణకు, ఇంద్రవజ్రను మాత్రాగణబద్ధ వృత్తముగా నెవ్వరు విశదీకరించలేదు, కాని అది మిశ్రమాత్రాగణ వృత్తమని నేను తెలిపాను. పంతులుగారు వీటిని కొన్ని చోటులలో పాటించారు, కొన్ని చోటులలో పాటించలేదు. పదాలు మాత్రాగణాలుగా విరిగినప్పుడు మాత్రమే ఇట్టి వృత్తాలు తాళ వృత్తాలవుతాయి. అంటే వీటిని సంగీతపరముగా వివిధ తాళముల నుంచుకొని పాడుకొనవచ్చును. ఉదాహరణకు, చంపకోత్పలమాలలను అట తాళ యుక్తముగా పాడుకొనవచ్చును, కాని తెలుగు కవులెవ్వరు అలా మాలావృత్తాలను రచించలేదు. అందుకే పద్యగానము తెలుగు నాటకాలలో, చలనచిత్రాలలో ఉన్నా కూడ, వాటికి సామాన్యముగా రాగము ఉంటుంది కాని తాళముండదు.
పంతులుగారు ఉపయోగించిన విశేష వృత్తాలలో కొన్ని అందరు కవులు అప్పుడప్పుడు ఉపయోగించినవే – ఉదా. కవిరాజవిరాజితము, క్రౌంచపదము, తరళ, తోటకము, దండకము, పంచచామరము, భుజంగప్రయాతము, మంగళమహాశ్రీ, మందాక్రాంత, మత్తకోకిల, మహాస్రగ్ధర, మానిని, మాలిని, వనమయూరము, వసంతతిలక, విద్యున్మాల, సుగంధి, స్రగ్ధర, స్రగ్విణి. కాని పట్టిక-1 లోని మిగిలిన వృత్తాలలో తెలుగు కవులు అరుదుగా పద్యాల నల్లినారు. ఈ వృత్తాల వాడుక వారికి ఛందశ్శాస్త్రములో నున్న గొప్ప కౌశల్యాన్ని, అభిరుచిని, విజ్ఞానాన్ని తెలుపుతుంది. అంతే కాదు, సమయోచితముగా, ఆ వృత్తాలలో ముద్రాలంకారాన్ని (పద్యములో దాని పేరు వచ్చుట) కూడ ఉపయోగించారు. పద్య సంఖ్యలు బిల్వేశ్వరీయకావ్యమునుండి గ్రహించబడినవి. మచ్చుకు ఒక రెండు ఉదాహరణలు:
ఉత్పలమాల 20 కృతి 355799 UIIUIUIII UIIUIIUIUIU భ-ర-న-భ-భ-ర-ల-గ 10
శంకరి నీ మొగంబు నెలజానుగఁ గొల్చిన డిందుఁగం దటన్
చంకిలి యేదివచ్చె శశి యాదరమొప్పఁగఁ జూడు వీని మీ-
నాంకుని మామ మామక శిఖాంచితుఁ బ్రాంచితు నుత్పలాప్తునిన్
బొంకమగున్ గదా వినతపోషణ ముత్పలమాలికేక్షణా – 2.32
కవిరాజవిరాజితము 23 వికృతి 3595120 – IIII UII UII UII UII UII UII U న-జ-జ-జ-జ-జ-జ-ల-గ 14
వెలయఁగ వేల్పులకున్ ద్రిదివం బిలవేల్పులకున్ భువి సోఁకులకున్
విలసిలఁగాను రసాతల మెంతయు బ్రీతి సునీతి జగత్త్రయమున్
జెలఁగెను వారలు గారవ మారఁగఁ జేకొని స్వేష్ట పదార్థము లిం-
పెలయఁగ నేలుము నేలుము రాజ్యమనన్ గొనియెన్ గవిరాజవిరాజితమున్
– 5 ఉత్తర భాగము, 393
జలద 13 అతిజగతి 3543 – UII UIU III UIIU – భ-ర-న-భ-గ 10 (ఉత్పలమాలలోని మొదటి 13 అక్షరాలు కలిగి ఉంటుంది యీ జలదవృత్తము).
వేసవి నెండ నుక్కఁ గడు వెక్కసమై
వేసరిజేసినన్ దపము విశ్వజనుల్
వాసిగ వారి నేల హరి వచ్చెనొ నా
భాసిలె నింగినిన్ జలదవార మహా
– 5 పూర్వ భాగము, 148
ఉన్న వృత్తాలను తగిన రీతిగా వాడడము మాత్రమే కాక పంతులుగారు ఎన్నో కొత్త వృత్తాలను కనుగొన్నారు. ఈ వృత్తాల సంఖ్య సుమారు 40, వాటిని పట్టిక-3లో చూడగలరు. అందులో కొన్ని నేను ఎన్నుకొన్న రెండు సంకలనములు కాక ఇతర లాక్షణిక గ్రంథములలో ఉండవచ్చును. ఏది ఏమైనా వీరు ఎన్నో నూతన వృత్తాలను కల్పించి అందులో పద్యాలను అల్లినారు అనడములో అతిశయోక్తి లేదు. అందులో మత్తకీరలాటివి ఉన్న వృత్తాలకు చిన్న మార్పులను చేయడమే. దీని లయకు మత్తకోకిల లయకు ఎట్టి భేదము లేదు.
మత్తకీర – 20 కృతి 372096 – III IIII UI UII UI UII UIU న-న-జ-భ-ర-స-ల-గ – యతి 13
అలరఁగను దన కెన్ని పెట్టిన నక్కఱం గడు మెక్కియున్
బలుకులను దన కొప్ప నేర్పగఁ బ్రౌఢిఁ గాంచియు నెంచకే
వెలలు నిలువదు పంజరంబున వేడ్కఁజెందువ నాప్తి రా-
మ లలన యొకను రామచిల్కను మత్తకీర సువృత్తమున్ – 2.15
వీరు ఎందరో దేవుళ్ళ పేరితో వృత్తాలను సృష్టించారు, అవి – శివ, నారాయణ, గణనాథ, తనుమధ్యమా , దేవ, పరమేశ, శంకర (రెండు విభిన్న వృత్తాలు), చంద్రశేఖర, వామదేవ, శ్రీమతి, వాణి, లక్ష్మీ, శోభనమహాశ్రీ. అందులో ఒకటి –
వాణి 19 అతిధృతి 106225 – UU UU IIII UII IIU UII UU మ-భ-స-న-య-స-గ యతి 13
వాణిన్ వీణా జపసర పుస్తక వరకీరాంచిత పాణిన్
వీణా హంసవ్రజ శుక సత్పరభృత వాణిన్ విధిరాణిన్
శ్రేణీభూత స్ఫురదళివేణిని భృతసుశ్రోణిని నా గీ-
ర్వాణిన్ గొల్తున్ మదిని సుభక్తిని వలదీక్షణరుచిరైణిన్ – 2.172
మంగళమహాశ్రీ వృత్తమునకు దీటుగా శోభనమహాశ్రీ అనే వృత్తాన్ని వీరు కల్పించారు. ఇది కూడ ఒక పంచమాత్రావృత్తమే. దానిని యిప్పుడు చదవండి –
శోభనమహాశ్రీ 25 అభికృతి 14498421 – UUI UIII UUI UIII UUI UIII UIIU త-భ-య-జ-స-ర-న-భ-గ యతి 8,15,22
చూడంగదే చంద్రు సోఁకెన్ కనుంబరిది సొక్కెన్ చెఁజెందొరలు శోభనమే
వాడేంగదే కల్పవల్లీమతల్లి యిది భాసిల్లె మంజరులు బాగనమే
వీడెంగదే రిక్క పిండొప్పె నర్ధముల బింబంబునం ?ఱులు వీలనమే
యాడంగ లేదేల యంచన్న శోభనమహాశ్రీ యిదౌ ననిరి యౌ ఘనమే
-5 ఉత్తర భాగము, 598
బిల్వేశ్వరకావ్యములో పార్వతి పేరు తనుమధ్య. ఆరు అక్షరాల తనుమధ్య (UUIIUU) అని ఒక వృత్తము గలదు. ఆ వృత్తములో వ్రాయడము మాత్రమే కాక తనుమధ్యమా అని ఒక వృత్తాన్ని కూడ సృష్టించారు పంతులుగారు. క్రింద తనుమధ్యమా వృత్తము –
తనుమధ్యమా 18 ధృతి 77378 – IUUU UUI UUI IIUI UUIU య-మ-య-న-ర-ర 8,15
మహాకాళి వీవౌదు మామానవతి యాదిమా తామసీ
మహాలక్ష్మి వీవౌదు మా బిందుమతి మాదిమా రాజసీ
మహావాణి వీవౌదు మా జ్ఞానదయ వాదిమా సాత్వికా
మహాశక్తి వీవౌదు మమ్మేలు తనుమధ్యమా (మాతృకా)
– – 6 తృతీయ భాగము, యాత్రాభిజ్ఞ పర్వము 28
వీరు తన ఆత్మానందానికో యేమో, తక్కువ అక్షరాల వృత్తాలను కూడ కొన్ని వ్రాసారు. ఉదా.
శ్రీ 1 శ్రీ 1 U గ
శ్రీ బి ల్వే శా – 6.2.2
క్షితి 1 శ్రీ 2 – I ల
శి వ య ను – 2.50
జన 2 అత్యుక్త 4 – II ల-ల
అను మను మును కొని – 2.104
కొన్ని వేళలలో వీరు మాత్రాగణాల స్వరూపములో పదములను వాడలేదు. అందువలన నడక అప్పుడప్పుడు కుంటువడినది. చతుర్పంచ మాత్రల వృత్తము ఫలసదన ఎలాగో నడచినది ఈ పద్యములో –
ఫలసదన 16 అష్టి 16384 – IIIII IIII IIIII UU న-న-న-న-స-గ 10
అలరుల నళులకును నవనిజము నీడన్
బొలయు మొగములకును బొనరెడును మేలై
ఫలముల నిగుళులను బతగముల కింపౌఁ
బలు బెఱఁగులను నిది ఫలసదన మయ్యెన్ – 2.22
మరి కొన్ని చోటులలో ఒకే గణముల అమరికను వేరు వేరు పేరులున్న వృత్తములుగా చెప్పారు, ఉదా. సుభగ (ప్రకృతి) 8 అనుష్టుప్ 52 – IIUU IIUU స-భ-గ-గ 5
అభినవతామరస (కమలవిలాసిని, తామరస, లలితపద, తోదక, తోవక, దోధక, కలరవ) 12 జగతి 4896 – IIII UII UII UU న-జ-జ-య 8.
సామాన్యముగా సంస్కృతము, తెలుగు కన్నడ భాషలలో వృత్త పాదాలు గుర్వంతములు. పేర్కొనబడిన లఘ్వంత వృత్తాలను వ్రేళ్ళపైన లెక్కపెట్టవచ్చును. కాని పంతులుగారు లఘ్వంత పాదములున్న వృత్తాలను కూడ బిల్వేశ్వరీయములో వాడారు, ఉదా. చంచల, జన, నారాయణ, బిల్వ, సలిల, సుభగ. యతుల విషయములో కూడ వీరు ఒకే విధముగా ప్రవర్తించలేదు. కవిరాజవిరాజితమునకు ఒక యతి, మానినికి ఒక చోట ఒక యతి, మరొక చోట మూడు యతులను ఉంచారు. విద్యున్మాల ఎనిమిది అక్షరాల వృత్తమైనా, తప్పని సరిగా ఐదో అక్షరముపైన యతి నుంచుట వాడుక, కాని వీరు యతిని పాటించలేదు. కాని పైన ఒకే గణములతో ఉండే ఎనిమిది అక్షరాల సుభగ, ప్రకృతి వృత్తాలకు ఐదవ అక్షరముపైన యతిని పెట్టారు. పృథ్వీవృత్తానికి ఒక పద్యములో తొమ్మిదవ అక్షరముపైన, మరో పద్యములో 12వ అక్షరముపైన యతి నుంచారు. క్రౌంచపదపు పూర్వార్ధములో ప్రాసయతికి బదులు అంత్యప్రాసను పాటించారు. అర్ధసమ వృత్తములో సరి పాదములు ఒక విధముగా, బేసి పాదములు ఒక విధముగా నుండుట సర్వసాధారణము. వీరు మొదటి రెండు పాదాలను ఒక విధముగా, చివరి రెండు పాదాలను మరొక విధముగా ఉపజాతిలా అమరించినారు.
అర్ధసమ వృత్తము
సరిగమపధని స్వరము లివేడున్
బరగఁగ దెలుపున్ బ్రణవముఁ గూడన్
హరియని హర యంచాదటఁ జూడన్
హరిహరుల యభే దాశయ మౌఁగా – 4.145
జాతి పద్యములు
తెలుగులో జాతుల ప్రత్యేకత ప్రాస. ఉపజాతులకు ప్రాస లేదు, జాతులకు ప్రాస ఉన్నది. కందము, రగడలవంటి జాతి పద్యాలు పూర్తిగా మాత్రాగణబద్ధమైనవి. ఉత్సాహ, అక్కఱ, ద్విపదాదులు ఉపగణాలతో (అంశగణాలతో) నిర్మింపబడినవి.
కందము – సంస్కృతములో తొమ్మిది విధాలైన ఆర్యాభేదాలు ఉన్నాయి. అందులో ఒకటైన ఆర్యాగీతియే కన్నడ తెలుగు భాషలలోని కందము. తెలుగులో అప్పకవి ఆరు విధములయిన కంద పద్యాలను వివరించారు. మనము దైనందినము చదివే కందపద్యాన్ని సహజ కందము అంటారు. ఈ సహజ కందము కాక యింకను ఐదు విధములయిన కంద పద్యములు ఉన్నాయి. అవి – పథ్యా, విపులా, చపలా, ముఖచపలా, జఘనచపలా.
పథ్యా కందము – పద్యములో 60 మాత్రలు (సహజకందమునకు 64 మాత్రలు) ఉంటాయి. మొదటి, మూడవ పాదాలు మామూలు కందపద్యము వలెనే ఉంటాయి. సరి పాదాలలో చివరి రెండు గణాలకు ఆరు మాత్రలు మాత్రమే. ఆరవగణము నలముగా నుండాలి, ఎనిమిదవ గణము గ-గ లేక స-గణమునకు బదులు ఒక గురువుగుగా నుంటుంది యిందులో. అన్ని చోటులలో వీరు ఈ లక్షణాలను సరిగా అనుసరించ లేదు.
సా పలుకుఁగాదె సాంబా
చూపున్ దాండవము నెమలి సుతి పొందన్
నీపేరొందెను గ్రీవన్
నీపదమున్ గనరె నతులు నిఖిలేశా – 4.139
విపులా కందము – దీనికి కూడ పథ్యాకందపు లక్షణాలే, పాదానికి 60 మాత్రలే. దీని ప్రత్యేక లక్షణము ఏమంటే మొదటి (మూడవ) పాదములోని చివరి పదము స్వతంత్రముగా నిలువకుండ రెండవ (నాలుగవ) పాదపు మొదటి అక్షరములతో చేరవలయును. ఈ పద్యాన్ని కూడ పంతులుగారు అన్ని చోటులలో సరిగా వాడలేదు.
యతమాన భక్తిరత్న సు-
హితకరుఁడ నియోగివిజయ మేలు భవా
క్షితిరథగతి నీవే కా-
కితరు లెట నియోగివిజయు నేళు శివా
– నియోగివిజయము, బిల్వేశపీఠిక
చపలాకందము – ఇందులో సరి పాదాలు జ-గణముతో ఆరంభమవుతుంది. చివరి పాదములో 15 మాత్రలు మాత్రమే, ఆఱవ గణము చతుర్మాత్ర కాదు, ఒక లఘువు మాత్రమే, పద్యానికి మొత్తము 57 మాత్రలు (12, 18, 12, 15) మాత్రమే. అప్పకవి ప్రకారము చపలాకందమునకు రెండవ పాదమునకు 18 మాత్రలు ఉంటాయి, నాలుగవ పాదమునకు మాత్రమే 15 మాత్రలు. కాని పంతులుగారు, రెండవ పాదానికి కూడ 15 మాత్రలను ఉంచారు.
సరిగాగాఁ బల్కుటకుఁ ద-
గరయ్యె దక్షుండు గననగుఁగా
సిరిఁ గనె నీదయచే నది
స్మరింపఁ ద్రిదివంబు సమకొనదే – 4.141
ముఖ చపలా కందము – రెండవ పాదము మాత్రము చపలాకందములా ఉంటుంది యిందులో, నాలుగవ పాదము పథ్యాకందములా ఉంటుంది ఇందులో.
తనుమధ్య మాప్తినీ ప్రియ
మునీడ్య తనుమధ్య పొరిఁ దనరెన్
గనుగొన మా మధ్యమ గద
వినరే మధ్యములు నరులు బిల్వేశా – 4.142
జఘనచపలా కందము – మొదటి అర్ధము పథ్యలా, రెండవ అర్ధము చపలలా ఉంటుంది యీ కందములో.
ఒనరిచి పర్ణాశనమున్
దన ద్విజతకుఁ దగఁ బిక మిది దా నేర్చన్
ఘన పంచమస్వరంబున్
గనుంగొనమి ద్విజత గలదె యిలన్ – 4.143
ఈ ఆరు రకములైన కంద పద్యములు మాత్రమే కాక, కొక్కొండవారు ఇంకొక మూడు విధములైన కంద పద్యములను కూడ కొత్తగా నిర్మించారు. అవి – మాకందము, రమాకందము, మహాకందము.
మాకందము – ఇందులో ఆరవ గణము జ-గణము, చివరి గణము చతుర్మాత్రకు బదులు ఒక గురువు. మాకందము అనే మరొక కంద పద్యాన్ని నారాయణారెడ్డిగారు సృష్టించారు. కాని సినారె మాకందము కొక్కొండవారి మాకందము వేరువేరు పద్యాలు. సినారె మాకందము సహజ కందపు పాదాలను తారుమారు చేసి వ్రాసిన ఒక భేదము. కొక్కొండవారి మాకందము 60 మాత్రలతోడి ఒక ఆర్యాభేదము. సినారె వ్రాసిన మాకందములాటి యితర కందపద్యాలను కూడ నేను ఒకప్పుడు విశదీకరించి యున్నాను. ఈ పద్యాన్ని కూడ పంతులుగారు అన్ని చోటులలో సరిగా వాడలేదు.
అనుచుపవాసవ్రతమునఁ
దనుఁ బూజించును బిల్వదళములచేన్
ఘనభక్తి శ్రీఫలములన్
దనకిడ నా రామ రామనామాప్తిన్ – 2.157
మరొక మాకందములో రెండవ పాదములో ఆరవ గణము న-లము, జ-గణము కాదు.
ఓంకృతి బిల్వవనేశా
యోకృతి బిల్వార్చిత నతు లొనరింతున్
ఓంకారాకారేశా
యోంకారార్థైకగమ్య యో శ్రీశా – 2.195
రమాకందము – ఇది చపలాకందమువంటిదే, కాని యిందులో సమ పాదములలో ముందుగా జ-గణము ఉండవలసిన నియమము లేదు.
మును గంగభంగి నేనున్
ఘనతన్ గనఁ గోరఁ గమ్మనవే
నను బిల్వముగను దన్మహి-
మ నిపుడు నేఁ గంటి బిల్వ మహిజమనై – 2.196
మహాకందము – ఇది సంస్కృతములోని ఆర్యవంటిది. పాదాలు దీర్ఘాలతోనైనా, హ్రస్వాలతోనైనా ఆరంభించవచ్చును, సామాన్యముగా కందములో పాదములోని మొదటి అక్షరాలు అన్నీ గురువుగానో లఘువుగానో ఉంటుంది.
అనుభవ మెఱుఁగమి నపుడీ
వనిన నుడినిఁ గొనక యుఱక యట్లైతిన్
కనుగొంటిఁ దత్ఫలము నీ
మానిని నను నింకనైన మైకొనవే – 2.197
రత్నావళి
కొక్కొండ వేంకటరత్నం పంతులుగారు సృష్టించిన జాతి పద్యాలలో రత్నావళి నిజముగా గొప్పదని చెప్పడములో సందేహము లేదు. రత్నావళి లక్షణాలను వారు క్రింది లక్షణ పద్యములో చెప్పారు. అది –
రత్నావళి –
విలసిలు రత్నావళి యను పద్యము విద్వద్వంద్యంబయి ప్రాసో-
జ్జ్వలమయి పాడఁగ నెల్లరు విన ముప్పది దినముల నెలవలె నెల నా-
ని లలి వర్ధిల నూతనముగఁ గవు లెక్కువ మక్కువఁ గనఁగొనఁగా
జెలువుగ ముప్పది మాత్రలఁ బాదము చెల్ల విరతి పదునేడింటన్
ప్రాసాదము సర్వాధారంబున్ బ్రాప్యము సర్వఫలప్రద మం-
చా సన్మంత్రస్రజమున కొలికిగనవుఁ దారకమం చది గాంచన్
వాసిగ బిల్వేశ్వరుఁ గొలువన్వలెఁ బ్రబ్బెడు జీవన్ముక్తియు నం-
చీ సముచిత రత్నేశ్వరకృతి వచియించున్ దత్త్వము శివమంచున్
– 6 ద్వితీయ భాగము, రత్నేశ సర్గము 13
ప్రతి పాదమునకు 30 మాత్రలు, పాదము 16, 14 మాత్రలుగా విరుగుతుంది, పదిహేడవమాత్రపైన యతి చెల్లుతుంది, జాతి పద్యము కనుక ప్రాస అవసరము. శార్దూల మత్తేభవిక్రీడితాలలో కూడ ప్రతి పాదానికి 30 మాత్రలు ఉన్నవి అన్న విషయము గమనార్హము. క్రింద రత్నావళిగా ఒక మత్తేభవిక్రీడితమును మీ గమనికకు తెస్తున్నాను –
భవ మందెప్పుడు నీవె యండ గద భావాతీత భవ్యప్రదా
నవమై జేయుమ నాదు జీవనము నానాచిత్రరూపమ్ములన్
శివమౌ సర్వము సంతసమ్ము లిడు శ్రీచిద్రూప శోభాస్పదా
రవముల్ మ్రోగు వసంతమౌ బ్రదుకు ప్రారంభించు సంతోషముల్
ప్రాసరహితముగా ఉండే రత్నావళిని ఏకావళి అనియు, ద్విపదగా ఉండే రత్నావళిని ద్వ్యావళి అనియు పంతులుగారు వాడినారు. ఈ రత్నావళికే కొన్ని మార్పులు చేసి గురురత్నావళిని, మహాగురురత్నావళిని సృష్టించారు. వాటి వివరాలు క్రింద చూడగలరు –
ఏకావళి – ప్రాసరహితముగఁ బరఁగిన రత్నావళి యేకావళియౌ నెటులేన్
ఇందులో ఏ పాదము ఆ పాదానికి స్వతంత్రముగా తరువాతి పాదముతో ప్రాస లేక ఉంటుంది. ఒక రెండు పంక్తులు
శ్రౌతస్మార్తా గమికములగు బహు సత్కృత్యములను దగఁ జలుపన్
శాస్త్రనిషిద్ధాచారంబులఁ గడుఁ జలుపుదు నేమనఁగల నింకన్
– 6 ద్వితీయ భాగము, రత్నదాస సర్గము 95
ద్వ్యావళి – రత్నావళి యర్ధము వేర్వేఱయి రంజిలఁగన్ ద్వ్యావళి యననౌ. ఇది రత్నావళి లక్షణములు కలిగిన ద్విపద.
అంతన్ గ్రమముగ సాంఖ్యజ్ఞానం బభివర్ధిల్లం దనుమధ్యా
కాంతుని బిల్వేశ్వరు నెల్లప్పుడు స్వాంతమునందు స్మరించుటచే
– 6 ద్వితీయభాగము, రత్నాయన సర్గము 69>
లఘురత్నావళి –
అల రత్నావళియే గురు వెడలుట నంతమునను లఘురత్నా-
వళి యని పలుకంబడుఁ బదునేడిట వళి యొప్పెడు నప్పగిదిన్
దొలుతను మాత్రలు పదునాఱగు మఱి దొడరెడు ద్వాదశమాత్రల్
గలయఁగ నిరువదియెనిమిది మాత్రలు గాదె హరిహర్యైక్యంబే
రత్నావళి పాదాంతములో రెండు మాత్రలను తొలగిస్తే మనకు లఘురత్నావళి లభిస్తుంది. యతి స్థానములో మార్పు లేదు. ఇదొక్కటే రత్నావళికి (30 మాత్రలు) లఘురత్నావళికి (28 మాత్రలు) భేదము.
తా సమకూడిన యక్షర సాంఖ్య సుధారసమున్ దా నొకఁడే
గ్రాసముగాఁ గొన కెల్లర కిడుట వరంబని సంస్కృత భాషన్
జేసెద తండల మార్గదాయినిని జెప్పెఁ దెనుంగున సారం
బా సువర్ణమణిమాలికఁ జెప్పెద నారయుఁ డీరు దగంగన్
– 6 ద్వితీయభాగము, రత్నాయన సర్గము 53
గురురత్నావళి – (అదనపు నాలుగు మాత్రలు వాలు అక్షరాలలో చూపబడినవి.)
తల్లఘురత్నావళి పదముపయిన్ దనరిన నాలుగు మాత్రల్ యతితోఁ దార్కొన్న ద్వాదశమాత్రల్
చెల్లెడు గురురత్నావళి పద్యము చెల్లెడు ద్వ్యేకావళులున్ వలసినఁ జేయఁగనౌ నెటులేనిన్
30 మాత్రల ప్రతి రత్నావళి పాదము పిదప యతి లేక నాలుగు మాత్రలు, యతితో 12 మాత్రలు ఉంటాయి ప్రతి గురురత్నావళి పాదానికి. ఈ గురురత్నావళి ఏకావళిలా కూడ ఉండవచ్చును.
రత్నమనంగ నరుం డొకరుం డిటు రత్నదాసుఁ డనఁ బరగెన్ బదపడి రత్నగుప్తుఁడనఁ దనరెన్
రత్నవర్మయననై యటుపిమ్మట రత్నశర్మయనఁగఁ దగెన్ సాంఖ్య ప్రజ్ఞానంబును గనుటన్
రత్న మనంగను బ్రాసాదము దారక మని యర్థ మెఱింగెన్ గని త ద్రత్నాయనములఁ జనియెన్
రత్నాయనుఁడని పేరందెన్ మఱి రత్నేశ్వరుఁడే యయ్యెన్ వింతయె రత్నము రత్నమె యయ్యెన్
– 6 ద్వితీయభాగము, రత్నేశ సర్గము 11
మహాగురు రత్నావళి – (అదనపు రెండు మాత్రలు వాలు అక్షరాలలో చూపబడినవి.)
రత్నావళి పాదముపై నిరు మాత్రలు యతిముఖముగ మనుమాత్రల్ దన రను గ్రమముగఁ జెప్పిన నొప్పున్
యత్నమున మహాగురురత్నావళి యను పద్యము ద్వ్యావళిగానే నే కావళిగానేణియుఁ దగెడున్
ఇందులో రత్నావళి పాదము పిదప యతి లేక రెండు మాత్రలు, యతితో 14 మాత్రలు ఉంటుంది. ఇది ఏకావళి లేక ద్విపదగానో ఉండవచ్చును.
రత్నేశుఁడు బిల్వేశుఁడె యౌటను రత్నములౌదురు తద్భక్తుల్ నర రత్నములౌదురు శ్రీయుక్తుల్
రత్నాయన కృత మగుటను సాంఖ్యము రత్నాయన మది గనుట నరుల్ నవ రత్నా యన నవరత్నేశుల్
రత్నము ప్రాసాదము దారక మా రత్నములన్ గని రంజిలుఁడీ నర రత్నములుగ మీరలు గండీ
రత్నమనన్ బ్రణవంబును బ్రహ్మము రత్నమనన్ నరుఁడౌటఁ గనన్ నర రత్నము బ్రహ్మం బౌనుగదా
– 6 ద్వితీయభాగము, రత్నేశ సర్గము 12
రత్నావళి కాక మఱి కొన్ని జాతి పద్యాలను కూడ పంతులుగారు ప్రవేశ పెట్టారు. అవి – జాగ్రజ్జాతి, పురుషజాతి, ప్రకృతిజాతి, మంగళమణిజాతి, మహామంగళమణిజాతి. వీరు మొట్టమొదట ఈ నామములతో ఒక వృత్తమును ఉదహరించి తరువాత వాటిని మాత్రాబద్ధమైన జాతులుగా ఉదాహరించారు. నేను కూడ యిక్కడ మొదట ఆ వృత్తాలను, తరువాత అందలి జాతి పద్యాలను మీకు తెలియజేస్తాను.
జాగ్రజ్జాతి – జాగ్రద్వృత్తము 17 అత్యష్టి 28540 – IIUII IIUII IIUII UU స-న-జ-న-భ-గ-గ 11. ఇందులో మూడు షణ్మాత్రలు, ఒక చతుర్మాత్ర ఉన్నాయి. చివరి చతుర్మాత్ర పాదాంతములో ఉన్నది కనుక పాడేటప్పుడు అది ఆరు మాత్రలకు సమానమే.
అరుణారుణ కరుణామయి హరిణాధిప మధ్యా
శరణాగత భరణాశశి శరణా తనుమధ్యా
శరణ మ్మని నెఱ నమ్మితిఁ జరణమ్మును నీదే
కరుణింపుము కరుణింపుము కరుణింపుము నన్నున్
– – 6 ప్రథమ భాగము, భీమోపాఖ్యానము 37
నాకేమో ఈ పద్యము లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతములోని క్రింది పద్యాన్ని జ్ఞాపకము తెస్తుంది. దీనికి లలితగతి లేక సురభి అని పేరు.
తరుణారుణ కరుణామయ విపులాయత నయనం
కమలాకుచ కలశీభర విపులీకృత పులకం
మురలీరవ తరలీకృత మునిమానస నలినం
మమ ఖేలతు మదచేతసి మధురాధరమమృతం
జాగ్రద్వృత్తమునే ఒక జాతి పద్యముగా కూడ వ్రాసినారు పంతులుగారు. దానికి ఉదాహరణ
జాగ్రజ్జాతి – ఆఱు, ఆఱు, ఆఱు, నాలుగు మాత్రలు, యతి మూడవ మాత్రాగణముపైన ఉంటుంది, ప్రాస నియతము.
పరఁగింప కుమాశంగ్రుధఁ బాశాంకుశపాణీ
వరమీయవె వెఱఁ బాపవె వరదాభయహస్తా
కరకమలాముక్తైక్షవ కార్ముకసుమబాణా
కరుణింపుము నిశ్చలమతి ఘనధృతిఁ దనుమధ్యా
– 6 ప్రథమ భాగము, భీమోపాఖ్యానము 38
పురుష జాతి – పురుష వృత్తము 9 బృహతి 31- UII IIU UU U భ-స-మ 7
ఆదిమ పురుషా యాత్మేశా
శ్రీద్రుమ మహితా శ్రీ??
ఆదుము తనుమధ్యాధీశా
వేదముఖనుతా బిల్వేశా
– 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 106
పురుషజాతి – చ-చ-చ-ద్వి (1.1, 3.1)
నారాయణుఁడే నల్వొందన్
శ్రీరాముఁడనన్ క్షితిపతియై
వీరత సీతన్ బెండ్లాడెన్
గౌరవ మెంతో కని మనియెన్
– 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 103
ప్రకృతి జాతి – ప్రకృతి వృత్తము 8 అనుష్టుప్ 52 – IIUU IIUU స-భ-గ-గ 5. ఇది రెండు ఆఱు మాత్రల వృత్తము.
ప్రణుతింతున్ బ్రకృతీ శ్రీ
తనుమధ్యా తలి నిన్నున్
జనయిత్రీ జగదంబా
కని కావంగదె నన్నున్
– 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 105
జాతి పద్యముగా – ష-ష (1.1, 2.1)
శ్రీమతియే సీతయనం-
గా మహిజా ఖ్యాతిఁ గనెన్
రామునికిని రాణియునై
శ్రీ మించెను శ్రీయె యనన్
– 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 102
మనోహర జాతి – మనోహర వృత్తము 13 అతిజగతి 2731 – UI UI UI UI UI UI U ర-జ-ర-జ-గ 9
దేవదేవ శర్వ సర్వ దేవసేవితా
సేవ సేయుచుందు నిందు శిష్టభావితా
కావవయ్య నన్ను ముందు కాలకంధరా
సేవకుల్ భజింతు రింత శ్రీద శంకరా
– 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 63
ఈ మనోహర వృత్తాన్నే మూడు మూడు మాత్రలుగా జాతిగా కూడ వ్రాసినారు. ఉత్సాహకు ఈ మనోహరజాతికి తేడా చివరి భాగములో ఒక త్రిమాత్ర ఇందులో తక్కువగా ఉండడము మాత్రమే.
మనోహర జాతి 3-3-3-3- 3-3-2, యతి 13వ మాత్రపైన.
సర్వమంగళాన్వితాంగ చంద్రశేఖరా
సర్వమంగళంబు లొసఁగు సదయ శంకరా
నేర్వఁ గొలువ నొరులఁ గోర నిన్నె గొల్తురా
శర్వ నన్నుఁ బ్రోవనీవ చాలి దీశ్వరా
– 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 63
మంగళమణి జాతి – మంగళమణి వృత్తము 16 అష్టి 31711 – UIIII UIIII UIIII U భ-స-న-జ-న-గ 11
భృంగకచకు బిల్వకును మహేశ్వరసతికిన్
భృంగసరుచికంఠుని కల బిల్వకపతికిన్
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమగు నెల్లరకును మాన్యతఁ గనరే
– 6 తృతీయ భాగము, కల్యాణరసజ్ఞ పర్వము 134
మంగళమణి జాతి – ఆఱు మాత్రలు మూడు, చివర ఒక గురువు, యతి 13వ మాత్రతో చెల్లుతుంది. దీనిని ఆఱు, ఆఱు, నాలుగు, నాలుగు మాత్రలుగా కూడ భావించవచ్చును. మహామంగళమణికి ఇంకొక రెండు మాత్రలు ఎక్కువ.
మంగళమణి జాతి యవును మాత్ర లిరువదే
నంగుగఁ బదుమూడవదే యతియవుఁ దుదగా
మంగళమణి వృత్తమవు సమగణముగ మహా
మంగళమణి రుద్రద్వయ మాత్రల నహహాశతరూపకు శతధృతికిని జత గుదిరెనుగా
స్తుతియించిన వినుతించిన శుభము లొనరుగా
కృతులార సుకృతులార సుకృతి సుకృతదమౌ
నతులంబిది మంగళకృతి యరయుఁడి శివమౌ
– 6 తృతీయ భాగము, శతరూపాశతానందుల కల్యాణము 27
మహామంగళమణి జాతి – మహామంగళమణి వృత్తము 15 అతిశక్వరి 14020 – IIUU UUII UIIU IIU స-మ-స-స-స 9
అవుఁ గల్యాణంబో మని యంత నమో యనఁగన్
శివమంత్రం బా పిమ్మటఁ జెల్లు శివాయ యనన్
జవిఁ గొల్పున్ భాగాస్తి రసజ్ఞత నట్లె కనన్
దవుఁ గల్యాణాభిఖ్య ముదంబిడు పర్వ మిదౌ
– 6 తృతీయ భాగము, కల్యాణరసజ్ఞ పర్వము 135
మహామంగళమణి జాతి ఆఱు, ఆఱు, ఆఱు, నాలుగు మాత్రలు, యతి మూడవ మాత్రాగణముతో చెల్లును
శ్రీమతి యన శ్రీమతి యవు శ్రీమతికినిఁ గంద-
ద్దామోదరుఁడవు దామోదరునకుఁ దత్పతికిన్
వేమఱనరె మంగళమని విశ్రుత గురుభక్తిన్
గామితములు సమకొనుఁ దత్కల్యాణము నెన్నన్
– 6 తృతీయ భాగము, శ్రీమతీదామోదరకల్యాణము 108
మంజరి
వీరు మంజరి అనే ఒక చతుర్మాత్రాబద్ధమైన చతుష్పాద జాతి పద్యమును కూడ ఉపయోగించారు. ఈ మంజరిని చతుష్పద లేక చౌపద లేక మహానవమి అని కూడ అంటారు[8]. ప్రాసలేని ద్విపదను మంజరీద్విపద అంటారు, ఈ పద్యము అలాటిది కాదు. మధురగతి రగడకు కూడ పాదానికి నాలుగు చతుర్మాత్రలే, కాని మధురగతి రగడ అంత్యప్రాసతో కూడిన ఒక ద్విపద. మంజరికి యతి మూడవ చతుర్మాత్రపైన, ప్రాస, అంత్యప్రాస, కొన్ని చోట్ల పక్కపక్కన ఉండే పాదాలకు, కొన్ని చోట్ల సరి పాదాలకు, బేసి పాదాలకు అంత్యప్రాస నుంచారు.
విడివిడి పాదాలకు అంత్యప్రాసతో మంజరీజాతి –
శివుఁ గొలువుండీ శివుఁ గొలువుండీ
శివుఁ గొలువుండీ శివరతులారా
శివుఁడవు బ్రహ్మము సిద్ధము సుండీ
శివమవు సర్వము క్షితి జనులారా
– 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 161
పక్కపక్కన ఉండే పాదాలకు అంత్యప్రాసతో మంజరీజాతి –
కాముని రూపును గాంచుటఁ గాల్చెన్
సా మేనను దన చానను దాల్చెన్
భూమిని దివినేన్ బోలు నెవండీ
స్వామిని శివు నీశ్వరుఁ గొలువుండీ
– 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 162
ఈ మంజరికి అన్ని పాదాలలో ఒకే అంత్యప్రాస ఉండిన యెడల దానిని మణిమంజరి అన్నారు.
మణిమంజరి – చ-చ-చ-చ, యతి (1.1,3.1) ప్రాస, అన్ని పాదములకు అంత్యప్రాస
అంగజవిజయుని కంజలి యిడరే
మంగళకృతి మణిమంజరిఁ గొనరే
అంగనలాఆరా హర్షద మనరే
పుంగవులారా పొలుపును గనరే
– 6 ద్వితీయ భాగము, రత్నగుప్త సర్గము 70
రగడ
వీరు వృషభగతి రగడలాటి ఒక పద్యమును రగడ పేరితో వ్రాసినారు. కాని పేరు తెలుపలేదు. అంత్యప్రాస ఆచరణను గమనిస్తే ఇది వృషభగతి రగడను బోలినది. కాని రగడలకు అక్షరసామ్య యతిని మాత్రమే వాడుతారు. కాని ఇందులో ప్రాసయతి ఉన్నది. కావున వీరి ఉద్దేశములో అక్షరసామ్య యతికన్నను ప్రాసయతి ఉత్తమ మేమో? ఆ రగడలో ఒక రెండు పాదాలు క్రింద ఇస్తున్నాను –
రగడ – త్రి-చ త్రి-చ త్రి-చ త్రి-చ ప్రాస, అంత్యప్రాస, ప్రాసయతి.
కంటివే యెలమావి గున్నను మంటవలె నిది యలరె సంజనఁ
గంటిఁ దుమ్మెద తుటుము పొగవలె మింట నంటెఁద మంబ నంజనఁ
గాంచితే యల గండుఁగోయిల పంచమస్వర మెందు నీవలెఁ
గాంచితిన్ రతి నిన్ను వేఁడెడు సంచు సూచించుటగఁ గావలె – 2.29
ఇవి గాక జాతులైన ఉత్సాహ, ద్విపద, తరువోజలు కూడ వారి గ్రంథములో నున్నవి. తరువోజ పూర్వార్ధమునకు, ఉత్తరార్ధమునకు ప్రాస కూడ ఉన్నది ఈ పద్యములో. అంటే రెండు ద్విపదలను చేర్చినట్లున్నది. ఉత్సాహజాతి అని ఒక చోట పేర్కొన్నారు కాని, దానికి ఉత్సాహకు తేడా లేదు. ద్విపదను వీరు ఒక అంత్యప్రాస నుంచి పాటగా మార్చిన తీరు నన్ను ఆకర్షించినది. కొన్ని చోటులలో అక్షరయతికి బదులు ప్రాసయతిని పెట్టారిందులో. పాటరూపములో వ్రాసినారు కనుక ఇది బహుశా అంగీకృతమే. ఆ పాటను క్రింద అందజేస్తున్నాను –
పాటగా ద్విపద
ద్విపద – (ఇం-ఇం) (ఇం-సూ)
అనువుగా గౌరికల్యాణ వైభవమె
యని పాడి రినుమాఱు లడరంగ ద్విపద
గౌరీ కల్యాణ వైభవమే – గౌరీ కల్యాణ వైభవమే – పల్లవి
హిమవంతు కూఁతురై యింపుసొంపొందె
హిమకరమౌళిని హితమొందఁ బొందె
వలఱేనిపగవాని వానికిఁ జెలిగ
నలరించెఁ బెండ్లియై యయ్యె నెచ్చెలిగ
కాళికాత్వము వీడఁగా గౌరి యయ్యె
మౌళిగా సిరిపల్కు మగువల కయ్యె
శ్రీరుచికుచ యౌట చేనన మించె
మారేడు మ్రానుగా మహి జన్మించె
తనక్రింద లింగమై తనరారు మగనిఁ
దన యాకు పూజలఁ దనియించె నొగిని
బిల్వదళాంబ నాఁ బేరొందెఁ దాను
బిల్వనాథునిఁ జేసె విభు బాగుగాను
తాను శ్రీతరువయి తనపతిన్ శ్రీశుఁ
గా నొనరించెను గడఁగి భూతేశు
మెఱపుఁదీఁగ యనంగ మెఱయుచు గౌరి
కఱకంఠు సాంధ్యేందుఁగన్ జేసె మూరి
తనుమధ్య యగుటను దనుమధ్య యనఁగ
వినుతయై ప్రోచును వినతుల మనగ
మ్రొక్కెద మందఱ మక్కఱ నిందు
జక్కఁగా శివులకు సత్ఫల మందు
ఈ గౌరికల్యాణ మీ పాట హెచ్చు
శ్రీగౌరియును వాణి శివుఁడును మెచ్చు
కవిరత్న కృత మిది గావున నెల్ల
కవులు గందురు పొందు కర ముల్లసిల్ల – 2.283
అమృతవాహిని – శ్లోకము
సంస్కృత కావ్యాలలో శ్లోకమును ఎక్కువగా వాడుతారు. ఎక్కడెక్కడ కథనము కొనసాగవలెనో అక్కడ మనము శ్లోకాన్ని చదువుతాము. ఈ శ్లోకపు స్థానాన్ని కన్నడ తెలుగు సాహిత్యాలలో కంద పద్యము ఆక్రమించింది. అందుకే మనకు తెలుగులో శ్లోకానికి ఏమాత్రము ప్రయోజనము లేకపోయింది. కాని బాగుగా ఉపయోగించితే శ్లోకము అందముగానే ఉంటుంది. కొన్ని వృత్తముల గతిని నేను శ్లోకరూపములో ప్రయత్నము చేసి కృతకృత్యుడుని అయ్యాను. ఈ శ్లోకానికి పంతులుగారు అమృతవాహిని అని పేరు పెట్టారు. శ్లోకములో ఐదవ అక్షరము ఎప్పుడు లఘువే, ఆరవ అక్షరము ఎప్పుడు గురువే. బేసి పాదాలలో ఏడవ అక్షరము గురువు, సరి పాదాలలో లఘువు. మిగిలిన అక్షరాలు ఏలాగైనా ఉండవచ్చును. చివరి అక్షరాలు సామాన్యముగా గురువే. సులభముగా జ్ఞాపకము ఉంచుకొనుటకై నేను ఒక కొత్త పద్ధతిని తెలియబరచాను. ఐదు, ఆరు, ఏడు అక్షరాలు బేసి పదాలలో య-గణము, సరి పాదాలలో జ-గణము. తెలుగులో దీనికి ప్రాస ఉంటుంది. పాదానికి ఎనిమిది అక్షరాలు, కాబట్టి యతి లేదు.
అమృతవాహిని – సంస్కృతములోని అనుష్టుప్పు శ్లోకము, సరి పాదాలలో 5,6,7 అక్షరాలు జ-గణముగా, బేసి పాదాలలో అవే అక్షరాలు య-గణముగా నుండాలి, తెలుగులో ప్రాస ఉండాలి.
నుతింతున్ తనుమధ్యాంబన్
నుతింతున్ బిల్వనాథునిన్
మతిన్ గౌరీపురీ చిత్ర
హిత చారిత్ర మెంచెదన్ – 2.318
ఉపజాతులు
కొక్కొండవారు బంగారము, వెండి, తేటి, తేటిబోటి, ఆటబోటి వంటి ఉపజాతుల సృష్టిని గురించి గర్వపడ్డారు. ఇవన్నీ సీస పద్యానికి, ఆటవెలది, తేటగీతులకు వారు చేసిన కొన్ని మార్పులు, చేర్పులు, కూర్పులు. వీటిని గురించి చర్చించడానికి ముందు మనము చంద్రగణాలను గురించి కొద్దిగా తెలిసికోవాలి. గణాలు మూడు విధాలు – అక్షర గణాలు, మాత్రా గణాలు, అంశ లేక ఉప గణాలు. అక్షర గణాలు త్రికములైన న, య, ర, త, మ, భ, జ, స గణాలు, రెండక్షరాలైన ల-గ, గ-ల, గ-గ, ల-ల, ఒక అక్షరమైన ల, గ ములు. మాత్రా గణాలు రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, మున్నగు సంఖ్యలకు అమరే అక్షర గణాలు. ఇక పోతే సూర్య, ఇంద్ర, చంద్ర గణాలు ఉప గణాల కోవకు చెందినవి. ఇవి ఒక గురువును, రెండు లఘువులను తీసికొని వాటికి పదేపదే గురు లఘువులను చేర్చగా వచ్చినవి. వీటిని కన్నడములో బ్రహ్మ, విష్ణు, రుద్ర గణాలు అంటారు. నాలుగు బ్రహ్మ గణాలు (III, UI, IIU, UU), ఎనిమిది విష్ణు గణాలు (IIII, UII, IIUI, UUI, IIIU, UIU, IIUU, UUU), 16 రుద్ర గణాలు (IIIII, UIII, IIUII, UUII, IIIUI, UIUI, IIUUI, UUUI, IIIIU, UIIU, IIUIU, UUIU, IIIUU, UIUU, IIUUU, UUUU) ఉన్నాయి. వీటిలో తెలుగు లాక్షణికులు కొన్నిటిని అంగీకరించరు. తెలుగు ఛందస్సులో వీటిని సూర్య (రెండు – III, UI), ఇంద్ర (ఆఱు – IIII, UII, IIUI, UUI, IIIU, UIU), చంద్ర గణాలు (14 – IIIII, UIII, IIUII, UUII, IIIUI, UIUI, IIUUI, UUUI, IIIIU, UIIU, IIUIU, UUIU, IIIUU, UIUU) అంటారు. తెలుగు ఛందస్సులో చంద్రగణాలు అక్కఱలలో మాత్రమే ఉన్నవి. కాని చంద్రగణము లేని మధ్యాక్కఱను మాత్రమే తెలుగు కవులు విరివిగా వాడినారు.
వేంకటరత్నము పంతులుగారు తేటగీతి పాదము చివర యతి లేక ప్రాసయతితో ఒక చంద్రగణమును ఉంచి దానిని తేఁటి అని పిలిచారు. అదే విధముగా ఆటవెలఁది పద్యపు పాదాలకు యతితోబాటు ఒక చంద్రగణాన్ని తగిలిస్తే మనకు ఆటబోటి లభిస్తుంది. ఆటవెలఁది బేసి పాదానికి (నిడుద పాదము) యతితో ఒక చంద్రగణాన్ని ఉంచి అలాగే నాలుగు పాదాలు వ్రాస్తే లభించిన పద్యానికి తేఁటిబోటి అని పేరు నుంచారు.
తేఁటి – తేఁటి లక్షణాలను పంతులుగారు ఇలా వివరించారు –
సూర్యుఁ డాదినె యుండెడు సురపతులనఁ జొప్పడఁగా
నిద్ద ఱటు పిమ్మట న్రవు లిద్దఱుందు రద్ది రయ్య
తేటగీతియె యబ్జాప్తిఁ దేఁటి యగును వాటముగాఁ
జేరి సీసముఁ జేయు బంగారముగను సారముగా
తేఁటి – సూ-ఇం-ఇం-సూ-సూ-చం, యతి లేక ప్రాసయతి (1.1, 4.1, 6.1)
కృష్ణవేణివి గావునఁ గృష్ణ వయితొ కృష్ణకృష్ణ
కృష్ణమృగనేత్ర వగుటచేఁ గృష్ణవైతొ కృష్ణకృష్ణ
కృష్ణసోదరి వీవౌటఁ గృష్ణవయితొ కృష్ణకృష్ణ
కృష్ణవై తేల కాళికతృష్ణ నొక్కొ కృష్ణకృష్ణ – 2.64
తేఁటిబోటి – తేఁటిబోటి లక్షణాలను పంతులుగారు ఇలా చెప్పారు
ఆటవెలఁది బేసి యడుగుల యట్లేని యైన నాల్గు
పాదములు మఱి సరి పాదము లట్లేని పై యతితో
నబ్జయుక్తి షడ్గణాంఘ్రి యగుటను షడంఘ్రి తాప్తిన్
దేఁటిబోటి నాఁగఁ దేజరిల్లెడు నిది తేఁటివలెన్
తేఁటిబోటి – సూ-సూ-సూ-ఇం-ఇం-చం యతి లేక ప్రాసయతి (1.1, 4.1, 6.1)
అత్తకంటెఁ గోడ లుత్తమురాలని యంద ఱెంచ
నయ్యరుంధతియొకొ యనసూయయో యని యన జను లా
రత్నదాసు జాయ రామ రామయొ యనఁ బ్రస్తుతయై
సుగుణఖని యనంగ సుమతి యనందగె సుముఖి పేర
– 6 ద్వితీయ భాగము, రత్నదాస సర్గము 85
పై పద్యములో మొదటి పాదములో యతి మిశ్రణము ఉన్నది (ప్రాస యతి మఱియు అక్షర యతి). సామాన్యముగా ఒకటి కంటె ఎక్కువ యతి ఉంటే అది పాదమంతా ఒకే విధముగా నుండవలయునన్న నియమము ఉన్నది.
ఆటబోటి – ఆటబోటి లక్షణాలను పంతులుగారు ఇలా వివరించారు
ఇనులు మువ్వు రిద్ద ఱింద్రు లుందు రటంచు నిందుఁడు నిం
దొనరు యతిముఖుఁడయి యొంట మూట నొందు సరిన్
హంసపంచకంబ యగుడు నాపయి నట్లె యౌట నిదే
యాటబోటి నాఁగ నాటవెలది పాటిలెడున్
ఆటబోటి – సూ-సూ-సూ-ఇం-ఇం-చం / సూ-సూ-సూ-సూ-సూ-చం. యతి లేక ప్రాసయతి (1.1, 4.1, 6.1)
లేమ గేలి కోలి నేమేమొ యంటిని రామరామ
నీ మది కది గినుకగా ముగిసెనె రామరామ
యేమి సేయువాఁడ నేమన్నఁ బడియెద రామరామ
సౌమనస్య మున్నఁ జామ యోము రామరామ – 2.82
బంగారము
పంతులుగారు బంగారము అనే ఉపజాతి పద్యాన్ని కల్పించారు. సీసపాదములో రెండవ అర్ధభాగములోని రెండు సూర్యగణాల పిదప ఒక చంద్రగణము ఉంటుంది ఇందులో. ఇలాటి నాలుగు పాదాల తఱువాత సీసపద్యానికి పిదప ఆటవెలదియో లేక తేటగీతియో ఉన్నట్లు తేఁటియో లేక తేఁటిబోటియో ఉండాలి దీనికి. బంగారము ఉన్నప్పుడు సీసమెందుకు అని ప్రశ్నించారు పంతులుగారు. కాని సీసము అనే పదము సీసపద్యానికి లోహార్థముగా రాలేదు. సీసము లేక సీసకము శీర్షకమునుండి జనించినది. బంగారమును గురించి వారే యిలా చెప్పారు –
ఇంద్రగణంబు లాఱినగణంబులు రెండు
నిందుగణం బొకండిందునుండు నీక్షింపుడీ
నాల్గు పాదము లిట్లు నల్వొందఁ దేఁటియొ
తేఁటిబోటియొ కూడ వాటముగను బాటిలెడున్
బంగార మనఁగను బద్యంబు హృద్యంబు
సీస మేల సువర్ణసిద్ధి గలుగ శ్రీ మించఁగాఁ
బ్రణవగణావళి పరఁగుటఁ బ్రతిపాద
మందిది ప్రణవవిఖ్యాతిఁ గాంచు నారయుఁడీషడ్గణాళి పాదసరణి నొప్పుటను బ్రాసాదామౌఁగా
సకల సౌమనస్య సారంబు గ్రహియింప జాలు లీలన్
గాంచఁ దేఁటిబోటిగా నయ్యె నిది వెలిగార మనన్
గదిసి చాలఁ గ్రాలఁగాఁ జేయు నౌర బంగారమున్ శ్రీ
బంగారమునకు ఉదాహరణను యింతకు ముందే తెలిపియున్నాను (బిల్వేశ్వరీయమన్ విదిత ప్రబంధంబు…).
వెండి
వీరు జన్మనిచ్చిన మరొక ఉపజాతి వెండి. దీనిని రెండు విధాలుగా వ్రాయవచ్చును. (1) నాలుగు బంగారు పాదముల (చంద్రగణముతోడి సీసపాదముల) పిదప ఆటవెలది లేక తేటగీతి ఉండాలి. (2) సీస పద్యము తరువాత ఆటబోటి, తేఁటి లేక తేఁటిబోటి ఉండాలి. వెండికి లక్షణాలను వారే ఇలా వివరించారు –
వరుసఁ గూడ నాల్గు బంగారు పాదముల్ పై నెసంగ
నలరఁ దేటగీతి యాటవెలఁది యదగు వెండి
సీస పాదములును జెలఁగ నాల్గాపయిఁ జేరిన న-
య్యాటబోటి దేఁటి దేఁటిబోటి యగును వెండి
వెండి – బంగారము పిదప తేటగీతి –
నది ముత్తెఱంగుల నలరె నొగిని ఆదిశక్తి గాయత్రి యనఁగను గనుపట్టెఁ దొల్దొల్త సావిత్రియ ననంత సౌరు మీఱె సన్నుతాంగి మఱి సరస్వతి నాఁగ మహిత యయ్యెఁ దదాత్మ భవ యౌటఁ బుత్రి నాఁ బ్రథను గనియె వాణిగదా ఆ వేదమూర్తి యర్ధాంగ మౌట సువర్ణ రాశి గ్రైవేయక ప్రభను దనరె రత్నభూష అంతట హిరణ్యగర్భుఁ డక్కాంతఁ గాంచెఁ గామవికృతిఁ బ్రదక్షిణ క్రమమౌఁ జలుపు దాని నలుమొగములఁ జూచి తాను నల్వ యయ్యె నది మింటి కేగఁ బంచాస్యుఁ డయ్యె
– 6 తృతీయ భాగము, శతరూపాశతానందుల కల్యాణము 4
వెండి – సీసము పిదప తేఁటి
మద్యామిషార్థుల మచ్చిక దగ దెపుడును మ్రుచ్చుల నెలమిఁ జేర్చుకొనంగఁ జన దిచ్చకము లాడు జనులఁ గూడ రాదు గూర్చుకొనంగరాదు వంచకులఁ బం- చను నుంచుకొనరాదు జనుల నీచు- లను దురాచారుల నెనయంగఁ గూడదు కొండెగాండ్రను గూడి యుండరాదు నాగవాసము నాఁగను నాగవాసమౌఁ గానను భోగినులను భుజంగులఁ బొంద విసము పొసఁగున్ గద పారదారికవృత్తినో ప్రబ్బు మిత్తి పాతకమౌ దుష్టసాంగత్యమే యెల్ల దొసఁగుల నిడుఁ దొడర కయ్య
– 6 ద్వితీయ భాగము, రత్నవర్మ సర్గము 96
వారి కొత్త ఉపజాతులు (ఆటబోటి, తేఁటిబోటి, తేఁటి, బంగారము, వెండి) ఆటవెలది, తేటగీతి, సీస పద్యములకన్న మధురమా అనే విషయము ఒక చర్చనీయాంశమే. దొరసామి శర్మగారు వెండి బంగారు పద్యములకు ధారాశుద్ధి శూన్యమని అభిప్రాయ పడ్డారు. తెలుగు కవులకు చంద్రగణము రుచించదు. అందువల్ల వారు అక్కఱల జోలికి పోలేదు. ఈ చంద్ర గణాలను ఊతపదాలుగా (రామరామ, వైభోగమే, ఇత్యాదులు) ఉంచుకొని వ్రాస్తే పాడుకొనడానికి సులభముగా ఉంటుంది. కాని వాటిని సూర్యగణములతో చేర్చి వ్రాస్తే మధురత లోపిస్తుంది. ఆటవెలది తేటగీతులతో చేర్చినపుడు ప్రతి పాదాన్ని రెండుగా విభజిస్తే బాగుంటుందేమో? వీటినిగురించి కవులు ఇంకను పరిశీలనలు, పరిశోధనలు చేయాలని నా అభిప్రాయము.
చిత్రకవిత్వము
పంతులుగారు చిత్రకవిత్వములో కూడ కసరత్తు చేసినవారే. గర్భకవిత్వముగా వీరు వ్రాసినవి – మత్తేభవిక్రీడిత కందగర్భ సీసము, భుజంగప్రయాతవృత్తగర్భ స్రగ్విణి, కందపద్య తనుమధ్యావృత్త గర్భిత ప్రియకాంతావృత్తము, అనుష్టుబ్గర్భ పంచపాదిగీతాంచిత సీసము, శ్రీకరవృత్తగర్భ చంద్రశేఖరవృత్తము. ఇందులో మొదటి రెంటిని ఇతర కవులు (ఉదా. తిమ్మన, పాపరాజు) కూడ వ్రాసియున్నారు. ఇవి గాక రథబంధము, చతుర్దళ పద్మబంధము, అష్టదళపద్మబంధ స్రగ్ధరా వృత్తము, షోడశదళపద్మబంధ సీసము, చక్రబంధము, బిల్వబంధము, గోమూత్రికబంధము, స్రగ్ధరలో పుష్పమాలికాబంధాది బంధకవిత్వమును కూడ మలచినారు. దురదృష్టవశాత్తు, ఒక్క రథబంధానికి తప్ప మిగిలినవాటికి చిత్రాలు లేవు. నేను చక్రబంధము, గోమూత్రికాబంధము, పుష్పమాలికాబంధము, అష్టదళపద్మబంధములకు చిత్రాన్ని సృష్టించాను.
ఇందులో కేంద్రమునుండి మూడవ వలయములో (గులాబి రంగు) కవిరత్నకృతి అనియు, కేంద్రమునుండి ఆరవ వలయములో (కాషాయపు రంగు) బిల్వేశ్వరీయము అనే కావ్యనామమును గమనించవచ్చును. ఇవి గాక ఏకాక్షరి, ద్వ్యక్షరి, త్ర్యక్షరి, చతురక్షరులను కందపద్యములుగా వ్రాసినారు. ద్వి, చతుర్, పంచ ప్రాసాక్షరాల పద్యాలను రచించారు. ఓష్ఠ్య నిరోష్ఠ్య, సంకర కందములను, అచలజిహ్వ, అస్పర్శ కందములను కూడ వ్రాసినారు. 36 మారులు సహస్ర పదమును ఉపయోగించి శ్లోకములను, దేవ్యష్టోత్తరశతక్షేత్రసీసమాలికను, మహిషాసురమర్దినీ కంద నవరత్నహారమును, స్త్రీనీతికంద నవరత్నహారమును వ్రాసినారు. వీరి చిత్రకవిత్వములో కొన్నింటిని అనుబంధము-2లో చదువవచ్చును.
శివపార్వతుల పెళ్ళి సందర్భముగా ఆనందగీతము, కల్యాణగీతము, నలుగు పాట, పూలబంతులాట పాట, మంగళగీతము, లాలిపాట, శోభనగీతములను వ్రాసినారు. అందులో ద్విపదలో వ్రాసిన కల్యాణగీతమును ఈ వ్యాసములో చదువవచ్చును. ఇవి కాక నరసింహస్వామిపైన నవరత్నగీతమాలిక నొకటి సంస్కృతములో సృష్టించారు.
ముగింపు
ప్రాచీన కావ్యశైలి, కవితారీతికి సాయంసంధ్య పందొమ్మిదవ శతాబ్దము. ఆ సంధ్యాకాశములో నిజముగా శుక్రతార కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు. కవిత్వము, పాండిత్యము, సృజనాశక్తి, శాస్త్రజ్ఞానము, కౌతూహలము, నైర్మల్యత, ధర్మచింతన అనే సప్తస్వరాలతో సాహిత్యవిపంచిని మేళవించిన మహనీయు డితడు. వారి గ్రంథములను ఈ తరమువారు చదివి అవగాహన చేసికొనవలసిన అవసరము తప్పక ఉన్నది.
కొండయు నీవు పాండితిని గోవిదుఁడై యలరారినావు, కొ-
క్కొండయె నీవు ఛందమున కొల్లలుగా నవ వృత్తరీతులన్
నిండుగ వ్రాసినావు, కవినిష్ణుఁడ వేంకటరత్నశర్మ, మా
గుండెలలోన నుందువయ కోమల గ్రంథ సుగంధవీచితోన్
గ్రంథసూచి
- జెజ్జాల కృష్ణ మోహన రావు, తానా పలుకు, డెట్రాయిట్, 2005.
- పొత్తపి వేంకటరమణ కవి, సం. రావూరు దొరసామి శర్మ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, హైదరాబాదు, 1979.
- రావూరు దొరసామి శర్మ, తెలుగు భాషలో ఛందోరీతులు, వెల్డన్ ప్రెస్, మదరాసు, 1962.
- జీ. వి. సీతాపతి, History of Telugu Literature, సాహిత్య అకాడెమీ, కొత్త ఢిల్లీ, 1968.
- కొక్కొండ వేంకటరత్న శర్మ, బిల్వేశ్వరీయము, కలారత్నాకర ముద్రాక్షరశాల, చెన్నపురి, 1893.
- కోవెల సంపత్కుమారాచార్య, ఛందఃపదకోశము, తెలుగు అకాడెమీ, హైదరాబాదు, 1977.
- హరి దామోదర వేళంకర్, జయదామన్, హరితోష సమితి, బొంబాయి, 1949.
- సం. రాయవరపు రామస్వమి, పరిష్కర్త రావూరి దొరసామి శర్మ, కవితాసాగరము, శ్రీపతి ముద్రణాలయము, కాకినాడ, 1962.