పూత బెట్ట మావి కూత బెట్ట పికము
వాలు జడల దోప మల్లె మొగ్గ
ఆమనేగు దెంచె ననిరి సనాతనుల్
వారికెల్ల వంద వందనాలు
మావి పూత గాదు మల్లె మొగ్గలు గాదు
పోతు కోయి లీల పోటు గాదు
ఊరు బాగుబడుట లూహించుట లుగాది
ఉర్వి జనుల శ్రేయ ముత్సవమ్ము
కాన క్రొత్త వత్సరాన కోరుకొనెద
సకలమాన వాళి శాంతి సుఖము
నలుగురు సుఖపడిన నాకది స్వర్గము
పలువురు సుఖపడిన పరమపదము
గాయబరచె నేమొ గాసియే బెట్టెనో
గతము దూర నేల కటువులాడి
పలుకు హితవుగాక భవిత హితవుగాదు
పరుషముల విడచుటె పౌరుషమ్ము
పర్వపర్వమునకు పద్యాలు పచరించి
పత్రికలకు పంపువాని విడచి
ఇరుగు పొరుగు జూచి చిరునవ్వు నవ్వెడి
వాని ఇంటికి జను వత్సరాది