ఒక కాల క్రౌర్యానికి తల వొగ్గి
వలువలిచ్చేసుకుంటూ, ద్రౌపదిలా
ఒక్కో పత్రాన్ని బొట్టు బొట్టు గా రాల్చుకుంటూ, కన్నీరులా
శోకతప్తమైంది వృక్షం.
మోడుబారింది శరీరం.
మౌనరోదనమైంది – హృదయం.
ఎట్నుంచి ఉరికొచ్చిందో మరో కాలం
బిడ్డ గుక్క విన్న తల్లిలా
పుడమి పుట్టువుని చుట్టుకుని,
వెన్ను తట్టి, ఊరడించింది చెట్టుని
నీడలా తనున్నానని!
కలల రెక్కల చివుళ్ళను పూయించి కన్ను కన్నునా
నును రెమ్మల్ను మొలకెత్తించి కొమ్మకొమ్మనా
జరీ రజముల అద్దకపు రవికలు తొడిగి
తరువు తరువుకీ పెళ్ళి చీర కట్టింది – ఆమని.
‘నిన్నటి తనేనా? తను! మురిసింది – పూలవని.
‘కాలం చేసే గారడిలో నువ్వు ఓడినా
ఆ వెనకొచ్చే మరో కాలం నిన్ను గెలిపిస్తుంది.
అదే – తీపీ, పులుపు.
ఇదే – ఉగాది పిలుపు!’
తన పేరు చెప్పి పోయింది గుండె గుండెన వసంతం!
దుఃఖితుల గాయాలకు చలించి
చెమర్చు చెమరింపులే చందన లేపనాలు
పురివిప్పిన నెమలి పింఛాల అందాలు
మానవతను పెంచే హృదయాలు!
ఇదొక మనసైన మల్లెపూల మధునది
కావాలి మనకది –
సహ జీవన నందన ఉగాది.