శరవణన్ అని నా స్నేహితుడు. ఆయన, నేనూ ఒక రోజు ఏవో బజారు లెక్కలు సరిచూసుకుంటున్నాము. ఆయన పొడుగ్గా రిబ్బన్‌లాగ ఉండే రశీదు కాయితాన్ని కిందికీ మీదికీ నాలుగు సార్లు చూసి, మనసులోనే ఏదో లెక్క గుళ్ళించుకుని, మొత్తం సొమ్ము ఎంతయ్యిందో చెప్పీసేడు. నాకు ఆశ్చర్యం. నేను బజారు ఖర్చు ఎలా లెక్క చూస్తానంటే ఒక్కో సరుకు ఎదురుగా ఒకొక్క వరసలోనూ ఉన్న ధరను జాగర్తగా గమనించి, దాన్ని కిందదాని ధరతో కూడవేసి, అలా వరస కలుపుకుంటూ మొత్తం లెక్క చూస్తాను. ఆయన అలా చెయ్యకుండా ఇలా ఇలా కిందికీ మీదికీ కళ్ళెత్తీ దింపీ చూస్తూ ఉజ్జాయింపుగా లెక్క సరిగ్గానే చెప్పేస్తున్నాడు. నేను ఆశ్చర్యపోతుంటే నవ్వి, “నన్నేం చూసేవు! మా నాన్న పచారీ కొట్టు షావుకారు. ఆయనైతే కొన్ని వందల సామాన్ల పద్దు లెక్కనంతా కేవలం ఒకటి రెండు సార్లు కిందికీ మీదికీ చూసి అణా పైసలతో సహా ఖచ్చితంగా అప్పచెప్తాడు.” అన్నాడు. షావుకారుగారు అసలు ఏ లెక్కా కట్టకుండానే కూడిక సరిగ్గా చెప్పేస్తున్నారని అనుక్కునే వీల్లేదు. అది తర్క సమ్మతం కాదు; కనికట్టూ, గారడీ అవుతుంది. ఆయన ఏం చేస్తుండి ఉంటారంటే, మామూలుగా కొన్ని నిమిషాలైనా పట్టవలసిన లెక్కలోని అంచెలన్నింట్నీ ఎలాగో, చిత్రమా అనిపించేలా ఆయన క్షణంలో పూర్తిచేస్తున్నారు. ఆయన చిన్నప్పుడు అందరిలాగే ఒక్కో సరుకు ధరనీ కూడవేస్తూ లెక్కించేవాడేనని, అనుభవం మీద క్రమంగా ఎలాగో లెక్కని ఒక యంత్రంలా (Automaton) త్వరితంగా పూర్తిచేసే ఒడుపును సాధించుకున్నాడనీ అనుకున్నాము.
స్థిరమైన అభిరుచిని నిర్మించుకోగలిగినవాళ్ళు, అంటే ‘ఇదీ నా తోవ!’ అని తమ ‘లక్షణ సిద్ధాంతా’న్ని స్పష్టంగా అవగాహన చేసుకుని, స్థిరంగా నిలబెట్టుకోగలిగినవాళ్ళు సృజనలను పడికట్టే పద్ధతి ఈ షావుకారుగారి లెక్కలాగ ఉంటుందని నాకు అనిపిస్తుంది. నామిని సుబ్రమణ్యం నాయుడుగారు ఎప్పుడైనా అరుదుగా సృజనను గురించి తన అభిప్రాయం చెప్పుకునే పద్ధతిని పరికించి చూస్తే ఆయన రచనలని ఈ షావుకారుగారి లాగే అప్రయత్నంగా, instinctiveగా – మనోవేగంతో అంటారు – అలాగ పరీక్ష చేసి ఒక నిర్ణయానికి వస్తున్నారని తోస్తుంది. ఇలా మచ్చు చూసి కవితని, కధని, వ్యాసాన్ని గురించి ఒక అభిప్రాయానికి రావటం అంత అరుదేం కాదు. నేను కూడా ఏదైనా ఒక రచన కళ్ళెదుటికి వస్తే అది నాకు చదవాలనిపిస్తోందా లేదా అని ఒక క్షణం పాటు మాత్రం ‘చూసి’, సాంతం చదవకుండానే ఒక అభిప్రాయానికి వచ్చి, దాన్ని పక్కన పెట్టటమో, లేదంటే స్వీకరించి పట్టి పట్టి చదవడమో చేస్తున్నాను. సాంతం చదవకుండానే ఒక అభిప్రాయానికి రావడం మర్యాద కాదు. ఒక రకంగా దీన్ని గీర అని, పొగరుబోత్తనమనీ అనుకోవడమే రివాజు. ఇది ప్రజాస్వామ్య సంస్కృతికి కూడా విరుద్ధమైన స్వభావం; ఒకలాంటి నిరంకుశత్వం. ఇందుకు భిన్నంగా, ఎవరిది ఏ రచననైనా కాదనకుండా సుహృద్భావంతో ప్రతీ వాక్యం, పేరా చదివి, దాని సారాంశాన్ని వివరించి, దాని గుణదోషాలని తోచినవాటిని గురించి నాలుగు మంచి మాటలూ, రెండు బలహీనతలూ ఎత్తిచూపిస్తూ తెలుగు సాహిత్యంలో ఆ రచన స్థానం ఏమిటో ప్రకటిస్తూ ముక్తాయించటం లోక సబబు, ప్రజాస్వామికమైన మర్యాద. నాకు గీరని, పొగరనీ అనుక్కుందామంటే నాకే చిన్నతనం అనిపించి, నేను సయించవని పక్కన పెట్టీసిన రచనలను మళ్ళీ మళ్ళీ కనీసం చదివి చూద్దామని ఎంత అనుకున్నా – ‘మనసు మాట వినదు.’ మళ్ళీ అవి పక్కన పెట్టెయ్యటమే అవుతుంది. ఇలాంటివాటిలో గొప్పవి అని బాగా ప్రచారానికి ఎక్కినవి కూడా ఉంటాయి. ఈ నా మనస్తత్వాన్ని గురించి నాలో నేనే చాలా గుళ్ళించుకుంటాను.
రావి శాస్త్రిగార్ని ‘మీ ప్రశ్నకి నా జవాబు’ వంటి శీర్షికలోన ఎవరో “బాపు రమణల రచనల మీద మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగితే “స్కూల్ బాయిస్ మెంటాలిటీ!” అన్నారు. మెహెర్‌గారు చాసో కధల్ని గురించి ఆ కధలేవీ తనకు ఏ అనుభూతినీ కలిగించలేదని అంటున్నారు. వంశీగారి మా పసలపూడి కధల్ని గురించి నామిని “ఒకసారి చదివి చూస్తే నాకేమీ నచ్చలా…” అని చెప్పుకున్నారు. ఈ అభిప్రాయాలు మూడింటితోనూ నాకు ఏకీభావం ఉంది. ఈ మూడూ కేవలం ఉదాహరణలు. బాగా ప్రచారంలోకి వచ్చి, ఆవరకే నాణ్యమైనవి అని పేరుపడిన వ్యవస్థలే ఉంటాయి. ఉదాహరణకు ఆధునిక సాహితీకారులు అందరూ ‘గురజాడ మహాకవి అభ్యుదయ గురు పీఠం,’ ‘గురుదేవులు రవీంద్రులు విశ్వకవి,’ వంటి భాష్యాలను ఒకటో తరగతి పిల్లలనుండీ స్థిరంగా పదే పదే చదువుకుని, వీటిని కూడా ‘సూర్యుడు తూర్పున ఉదయించును’ అనే సత్యాల్లాగానే ఒప్పుకుని, ఆ పైన ఎల్లప్పుడూ వాటికి విధేయతనే ప్రకటించుకోవాలి. సాధారణంగా ఇలాంటి అభిప్రాయాలతో బేధం ఉన్నవాళ్ళు తమ విబేధాన్ని చాటుగా వ్యక్తం చేసుకుంటారు, కాని బహిరంగంగా ఏమీ అనలేరు.
పై మూడూ కూడా అంగీకారంలో ఉన్న బహుళమైన అభిప్రాయాలతో విబేధించేవి. ఇవి చదివి ‘ఓహో! కనీసం ఇంకొక్క మనిషికి కూడా నేను అనుకున్నట్టే అనిపించిందా?!’ అని అనుకున్నాను. ఇలాంటి పాఠకులు సృజనలో ఏదో వెతుక్కుంటున్నారు. అదేమిటో అర్ధంచేసుకొనే ప్రయత్నమే లక్షణ సిద్ధాంతం అని అంటున్నది. ఇది ఒక్కొక్క పాఠకుడి అనుభవాన్నీ పరిశీలిస్తూ ప్రారంభించేది. కాని, ఇలాంటి నిర్ధారణలు ఎవరు చేస్తున్నా, ఏ రచనల్ని గురించి చేస్తున్నా అవి ప్రధమంగా కేవలం వాళ్ళ ఒక్కరి అభిప్రాయాలు. ఈ వ్యక్తిగతమైన అభిప్రాయాల్ని సార్వజనీనమనీ, అందరూ తాము అనుకున్నట్టే అనుకోవాలనీ ఆశించడం సబబేనా? సబబేనని కాంట్ (Immanuel Kant), కాదని మామ్ (Somerset Maugham) చేసిన వివేచన ముందుకి చూడవచ్చును. ఇప్పటికి ఒక జాగ్రత్త ఏమిటంటే ఒకరి అభిప్రాయం ముందుగానైతే ఆ ఒక్కరి అనుభవం మాత్రమే; అది ‘ఆటోమేటిగ్గా’ మిగిలినవాళ్ళందరికీ, లేదా ఏ కొందరికైనా కూడా వర్తిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి వివాదాస్పదమైన సంగతి. ఉదాహరణకు, చాసో కధలు, బాపు రమణ రచనలు తమకు ఎంతో నచ్చుతాయని చెప్తూ వస్తున్నవాళ్ళు వేలాదిగా ఉన్నారు; నచ్చవని చెప్పినవాళ్ళు ముగ్గురో, నలుగురో. ఇందుకు భిన్నమైనది ఇంకో ఉదాహరణ: త్రిపుర రచనలు తీసుకుంటే అవి తమకు అసలేం అర్ధం కాకుండా ఉన్నాయని చెప్పేవాళ్ళే అత్యధికంగా ఉంటారు.
ఒకరి అభిప్రాయం ముందుగానైతే ఆ ఒక్కరి అనుభవం మాత్రమే; దాన్నే ప్రాతిపదికగా చూపించి అందరి కోసం, లేదు ఇంకొక్కరి కోసం అయినా సరే ఎలాంటి నిర్ధారణా, సిఫారసూ చెయ్యలేము. ఈ విషయం ఒప్పుకోవడం, గుర్తుపెట్టుకోవడం చాల కష్టం. ఎందుకంటే ఇది మన ఉద్వేగాలతో, నమ్మకాలతో, సంకల్పాలతో, లక్ష్యాలతో చిక్కుగా ముడిపడి ఉన్నది, ఇదివరకు Cognitive Dissonance అని ప్రస్తావించిన దానికి సంబంధించిన అంశం. అందుకే, ఇది నచ్చినట్లు లేదు అనిపించిన రచనను, దాన్ని సమర్ధిస్తూ, మెచ్చుకుంటూ వచ్చిన సిఫారసులు ఎన్ని చదివినా, విన్నా ఆ అభిప్రాయం – అంటే first impression మార్చుకోవటం దుర్లభం. అది ఎప్పుడు సాధ్యమౌతుందంటే, ఏవో బలమైన కారణాల వలన ఆ పాఠకుడు ‘మారు మనసు’ పొందినప్పుడు – అంటే తన నమ్మకాలు, లక్ష్యాలు, సంకల్పాలు, తన ఔద్వేగిక వ్యవస్థల్లోన అనుకూలంగా మార్పు వచ్చినప్పుడు. దశాబ్దాల తరబడి డిటెక్టివ్ నవలల వంటివి రాసేవాళ్ళూ, చదివేవాళ్ళూ ఉన్నట్టుండి ‘ఆధ్యాత్మిక రచయితలు’గా, పాఠకులుగా మారు మనసు పొందటం చూస్తాము. ఇలాంటి మార్పుకు కారణాలను Cognitive Dissonance వివరిస్తుంది. వీటిలో ఒక మన:స్థితి ఇంకోదానికంటే మంచిది, గొప్పది అనే ఆలోచన, నిర్ణయం (value judgment) కళా దృష్టితో చూస్తే నిరాధారమైనవి. ఒక రచయితను గౌరవించటమంటే ఆయన రాసినవి మెచ్చుకోవడం ఒక్కటే కానక్కర్లేదు. కొత్తగా, నిశితంగా, విస్తారంగా పరీక్షించి చూస్తూ చేసిన విమర్శ ఎలాంటి పరిశీలన చేసినా అగౌరవం అయితే కాదు. కవి అయినా, పాఠకుడైనా ఎలా ఉన్న మానసిక స్థితినీ, ఔద్వేగిక స్థితినీ అలా ఉన్నది ఉన్నట్టుగా కనుక్కొని, అర్ధం చేసుకొని, నిర్మించుకొని, ప్రకటించుకోవటమే ‘సబబు’. ఇలా చెయ్యలేకపోవటం ‘జూటా’. ఇదివరకు నఓయా (Naoya Shiga) అని చెప్పిన జాపనీస్ రచయిత ఇలాంటి ‘నిజాయితీ’నే ఆశిస్తున్నారు. నామిని దీన్నే ఆశిస్తున్నారు. త్రిపురకి దొంగలు, కేటుగాళ్ళు, రగిడీసులు – ఇలాంటి మనుషులంటే ఒకరకమైన సానుభూతి, వాళ్ళు నటించకుండా తమ స్వభావానుసారం ప్రవర్తించేవాళ్ళని. పారిస్‌లో బెకెట్ ఇంటి దగ్గర్లోనే ఒక సెంట్రల్ జైల్ ఉండేదట. ఆయన దాన్లోని ఖైదీల్ని చూస్తూ గడిపేవాడట, వాళ్ళంటే తనకి ఏదో ప్రత్యేకమైన అభిమానం అని.
వేగంగా, కేవలం మచ్చు చూసినట్లు పరీక్ష చేసి వస్తువులు, ప్రవర్తనల్ని అంచనా వెయ్యటం అంత అసాధారణమైన విషయమేమీ కాదు. మన సంభాషణల్లోన సారమంతా నూటికి ఎనభయ్యైదు వంతులు మనిషి వాటం (Body Language) లోనే ఉంటుందని, వాచ్యంగా అంటున్న మాటల కంటె మనిషి హావ భావాల్ని బట్టే యదార్ధంగా అతని సంకల్పం ఏమిటో పోల్చుకోవాలనీ మనస్తత్వంలో చెప్తారు. గ్లాడ్‌వెల్(Malcolm Gladwell) అని, ఆయన ఇలా ఉజ్జాయింపుగా విషయాల అంతర్గత సారాన్ని అంచనా వెయ్యడాన్ని గురించి Blink: The Power of Thinking Without Thinking అని ఒక పుస్తకమే రాసేడు. మనుషుల సుప్త చేతనకు తక్కువ కాలంలో, కొద్దిపాటి సమాచారంతోనే చాలా త్వరితంగా విషయాన్ని అవగతం చేసుకొని, సరైన నిర్ణయాల్ని తీసుకొనే శక్తి ఉంటుందని ఆయన వాదించేడు. దీన్ని Thin slicing అని అంటారు. బ్లింక్ – అంటే ఒక రెప్పపాటులో అసలు విషయం ఏమిటో పోల్చుకుంటామనీ, చాలా సందర్భాల్లో ఎంతో తర్కించి చేసే నిర్ధారణల కంటే ఇలా అప్రయత్నంగా, అసంకల్పితంగా స్ఫురించే నిర్ణయాలే సరైనవిగా, సబబుగా ఉంటాయనీ ఆయన ప్రతిపాదన. స్నేహం, వ్యవహారం, బంధుత్వం వంటి సంబంధాల విషయంలో మనలో చాలా మందిమి ఇలాంటి పద్ధతుల్ని, అంటే ‘లక్షణ సిద్ధాంతాన్ని’ అసంకల్పితంగా వాడుకుంటాము. ఉదాహరణకు ఎవరైనా కలిసి, మాట్లాడి వెళ్ళిన తర్వాత, అక్కడ మిగిలి ఉన్నవాళ్ళు ఆ వెళ్ళిన వాళ్ళ వైఖరిని గురించి ‘అదేమో! ‘పైపైకి నవ్వుతున్నాది గాని ఎప్పటిలాగ సరిగ్గా మాట్లాడింది కాదు’ అనీ, ‘ఆయనేంటి అలా ఏదోలాగ చూస్తున్నాడు?’ అనీ ఇలా అంచనాకి రావటం సాధారణం. అనుభవజ్ఞులైన వ్యాపారస్తులు దుకాణంలోకి వచ్చిన మనిషి కొనే బేరమో కాదో తొలిచూపులోనే సరిగ్గానే నిర్ణయించుకుని, అందుకు తగినట్టుగా బేరం నిర్వహిస్తారు. ఇలాంటి నిర్ధారణలకు ప్రాతిపదికలు ఔద్వేగిక స్థితి, సంకల్పం. లోక వ్యవహారానికి దీన్ని అన్వయించడం లోని నిజానిజాల మాట ఎలా ఉన్నా, సృజనల పరిశీలనలో పాఠకులు ఇలా మచ్చు చూసి నాణ్యతను పోల్చుకుని, అభిప్రాయాన్ని స్థిరం చేసుకునే స్వభావం కొందరిలోనైనా చూస్తాము. నా స్వభావం ఇలాగుంది కాబట్టి దీన్ని అర్ధం చేసుకోవడం నాకు అవసరం. ఈ రోజుల్లోన ఉద్వేగం (Emotion) గురించీ, వివిధ కళారూపాల పైన ఉద్వేగపు ప్రభావాన్ని గురించీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న శాస్త్రీయ పరిశోధన సృజన అనుభవంలో ఔద్వేగిక ఆవరణకు, సంకల్పానికీ ఉన్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవడానికి ఉపయోగమౌతుంది.
కాని ఈ పద్ధతిలోన కొన్ని ఇబ్బందులున్నాయి. పాఠకుడి ఇష్టాయిష్టాలు, దురభిమానాలు (Prejudice) పైన Thin-slicing అన్న ఉపజ్ఞను నిర్హేతుకమైన వివక్షగా, ఉదాసీనతగా ఎలా పతనం చేస్తాయో గ్లాడ్‌వెల్ స్వయంగా వర్ణిస్తున్నాడు. అందుకోసం ఇదివరకు వ్యక్తిత్వం అని, self అన్నదాని స్వభావాన్ని గురించి ముందుకి వివరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇష్టానిష్టాలు, దురభిమానాల వంటివి వ్యక్తిత్వపు పరిమితులు. కులం, ప్రాంతం, స్నేహం, అంతస్థు వంటివి ప్రాతిపదికగా అభిమానాలు, అవజ్ఞ ముందుగానే ఏర్పడి ఉండటం, సాటివాళ్ళను గురించి ఈర్ష్యా – ఇలాంటివి సాధారణమైన అనుభవాలు. ఇవి ఉద్వేగాలతో, బాల్య స్మృతితో చిక్కుగా ముడిపడి ఉండేవి, ఆధునికులు ‘సహృదయత’తో నలుగురినుండీ మర్యాదగా దాచిపెట్టుకొనేవి. దురదృష్టవశాత్తు అభిరుచిలో, వ్యక్తిత్వంలో ఎంతో పరిణతిని, వివేకాన్నీ సాధించుకున్నవాళ్ళయితే తప్ప, తమ వ్యక్తిగతమైన అనుభవాన్ని, అభిరుచినే పదిమందికీ వర్తింపచెయ్యాలన్న సహజమైన ఉబలాటాన్ని నిగ్రహించుకోవటం కష్టం అవుతుంది. రచనలు, రచయితల మూల్యాంకనం – అంటే Relative Ranking మీదే ధ్యాసంతా నిలుపుకుంటే ఈ ఉబలాటం నా మేలైన ఉవాచను అందరూ ఒప్పుకోండన్న సిఫారసుగా, లేకుంటే మరీ కట్టుతెగి వెక్కిరింతగా, హేళనగా పతనమౌతుంది.