వ. అమృతాంశుని చల్లని వెన్నెల నొక రేయినిలఁ గమ్మిన వేళలో నేను
కం. ఇచ్చంబోవుచు దారిని
బిచ్చపు యువతి నొకదాని వీక్షించి మదిన్
కచ్చను దాపక కసరగ,
బొచ్చెను మడిచి తన యొడిని పొదవుకొను యెడన్,
వ. ఆమె యొడిలో..
ఉ. నేనట చిన్నిబిడ్డ నల నివ్వెరతం గని శోకమంది నా
దీనత హెచ్చ, బాలు మృగతృష్ణనుఁ బోలెడు శైశవంబు క
న్గాని గతిన్ వెతంబడి వగర్చియు వ్రాయగ పూనుకొంటి నీ
మానుష జన్మ దుర్గతిని మానసమందునఁ దిట్టుకొంచిటుల్.
సీ. అతని కన్నులు దివ్వెలంచుల వెలుగొందు
రింఖచ్ఛవులు, తన లేత నవ్వు
నీహారకణముల స్నేహార్ద్రసంస్పర్శ,
పైడి చెక్కిలి నుండి పాలు గారు,
శష్కులీద్వయము కిసలయమృదుతరము,
ముక్కేమొ సంపెంగ పువ్వు మొలక,
నుదురు బెత్తెడునుండు నునుపురాయి పలక,
కుంతలాలళిరాజి వింతదోచు.
ఆ. తనువు మూరెడైన తమ్మిపూగుత్తియ
చేతులెమొ చెన్ను చెంగలువలు
బుల్లి గడ్డమొక్క బెల్లపు తుండము
బీర పూవు పొల్కి బిరుసు మొగము
ఆ. తిరిపెమెత్తుకొనెడి దిక్కులేని యనాథ
తల్లి యొడిని జేరి యల్ల నిదుర
బోవు చిన్న వాఁడు ముద్దు మొగము వాఁడు
కల్ల కపట మెఱుగ నొల్లనోఁడు.
వ. ఇంకనూ వాఁడు
గీ. సుఖము జీవితంబైనట్టి సుప్తమూర్తి,
గూడు లేని యనాగతగుప్తకీర్తి,
మిన్నగా తల్లి మనసున మెఱయు స్ఫూర్తి
చందురుని నుండిల దిగిన చక్రవర్తి.
చం. ఒసగరు చిల్లిగవ్వ గొనుమొల్లమి, చూడరు కన్నులెత్తియున్
మసలు జనాళి యించుకయు మార్దవమెల్ల నశించెనేమొకో!
సిసువును హత్తి వెక్కసముఁ జేయు జనంబుల దిష్టి బాపుచున్
మసణపు పూవు జీవనపు మాన్యత దెల్పుచు నమ్మ సాగెడిన్.
శా. కర్మంబందురు తానుఁ గూరిచిన దుష్కార్యాల సారంబులే
ధర్మంబై కనిపించు కష్టములకాధారం బటంచున్ మహా
మర్మంబుల్ గని సూత్రముల్ నుడివి యామంత్రించి సూచింతురే
నైర్మల్యంబుల వాసి బాలుఁ గని యానందింపరీ మానవుల్.
వ. నేనంతట నాగి ఆ తల్లికి దానము చేయవలెనని రూపాయి బిళ్ళనొకదానిని చేతఁగొని సుంత చూచుచునుంటిని.
ఉ. పుట్టెడు చల్లగాలి, నెల పుష్యము, పున్నమి రాత్రివేళలో
గట్టిగ కప్ప చీర తునకైనను లేదొకొ, బొచ్చె యడ్డమై
కట్టనమాయె. అట్టి పెను కష్టమునన్ సుఖ నిద్రలో త్రుటిన్
బెట్టుగ నవ్వె చిట్టి శిశువెందుకొ, చక్కిలిగింత గొల్పుచున్.
కం. పులకలు మొలకలవ హృదిని
కలకలమను మధుర రవము కవనము పగిదిన్
జలకములడరగ మనసున
మలినము తొలగిన విధి శుచి మయిమరపు గొనెన్.
గీ. ఆ చిరునగవు సౌరభమంతకంత
నన్ను చుట్టుకొనంగ నా కన్ను లందుఁ
గమ్మె భాష్పచయము. బిచ్చగత్తె యంత
నొడలదొంతి తోడను నాదు కడకు వచ్చె.
ఆ. నాదు కరమునందు నలిగెడు రూపాయి
నన్ను జూచి యువ్వు నవ్వె నేమొ!
నల్ల రంగు పర్సు నలుపు హెచ్చినదేమొ!
మనసు చేష్టలుడిగి మసిని బారె.
కం. భాగ్యము గాదది నా దు
ర్భాగ్యము పసివాని నవ్వు క్రయమును గొలువన్
యోగ్యత లేదని నెఱిగియు
యోగ్యతఁ ధనమొసగిఁ జనితి నోకము కొఱకున్.