మితిమీరిన భయం వల్ల అతడి నరాలు బిగుసుకుపోయాయి. చాలా సేపటినుండి కూర్చోనే ఉండడంవల్ల అతడి మోకాళ్ళు మూర్ఛ రాబోతున్నట్టు వణికాయి.
నగరంలో అల్లర్లు చెలరేగి నాలుగు రోజులయ్యింది. కర్ఫ్యూను ఉదయం కాసేపు, సాయంకాలం కాసేపు సడలిస్తున్నారు. కర్ఫ్యూ సడలించినప్పుడు కొందరు రోజూవారి జీవనానికి కావాల్సిన సరుకులు కొనుక్కోడానికి హైరానా పడుతుంటారు. మరికొందరు హడావిడిగా కత్తులు దూసో, నిప్పటించో మారణకాండ సృష్టించి, కొందరినైనా శవాలుగా మార్చి, తిరిగి కర్ఫ్యూ మొదలయ్యేలోపు ఇళ్ళకు చేరుకొని తలుపులేసుకుంటుంటారు. తాజా తాజా వార్తలూ, వేడి వేడి నెత్తురూ ఆగకుండా పారుతున్నాయి బొంబాయిలో. రేడియోల్లోనూ, టీవీల్లోనూ మాత్రం, నగరంలో పరిస్థితులు అదుపులో ఉన్నాయనీ, జనజీవనం ’నార్మల్’ అవుతుందనీ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు.
పరిస్థితులు మామూలుగానే ఉన్నాయని నిరూపించడానికి పొద్దుపోయేవరకూ లోకల్ ట్రైన్లను నడపడం మొదలెట్టారు. చాలా వరకూ కంపార్ట్‌మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. రైలు పట్టాలమీద పరిగెత్తుతున్న వెలుగులు కనిపించేసరికి, నాలుగురోజుల నుండి స్థిరపడిపోయిన చీకట్లలో కొంచెం కదలిక వచ్చినట్టనిపించింది. రైలు ప్రయాణిస్తుండగా వెలువడే దడదడధ్వనుల వల్ల రైల్వే ట్రాకులకు ఇరువైపులా ఉన్న బస్తీలలో కరుడు కట్టిన నిశ్శబ్దం బీటలువారి, బతుకుపై కొత్త ఆశ చిగురించింది.
యాసీన్ ఈ చప్పుళ్ళన్నీ వినేవాడు. రైళ్ళ రాకపోకలనీ గమనించేవాడు. అతడు ఇంటికి వెళ్ళక రేపటికి ఐదో రోజు. ఈపాటికి ఎదురుచూపులు కట్టిపెట్టి, అతడికోసం వెతకటం మొదలెట్టుంటారు. సాయంత్రానికి అతడి ఓపిక నశించింది. ఆ పూట కర్ఫ్యూను సడలించగానే అతడు ’అంధేరి’ స్టేషన్‍కు చేరుకున్నాడు. ప్లాట్‍ఫారం నిర్జనంగా ఉంది. కానీ ఇండికేటర్‌పై రైళ్ళ రాకపోకల సమయాలు తళుక్కుమంటున్నాయి.
రైలు స్టేషన్లోకి నిదానంగా ప్రవేశించింది. రోజూ వచ్చేట్టు స్టైలుగా కాకుండా, దీనంగా, భయంగా, తత్తరపాటుతో వచ్చింది. ట్రైన్లో ఇక్కడొకరూ, అక్కడొకరూ ఉన్నారు. ఏ పెట్టెలోకి ఎక్కాలో అతడు తేల్చుకోలేకపోయాడు. అధికసంఖ్యాకులు హిందువులే కదా! గుత్తులు కట్టి విసిరేసినట్టు ఒకరిద్దరు మనుషులు అక్కడక్కడా ఉన్నారు. అతడు ప్లాట్‍ఫారం పై వేచి చూస్తూ, రైలు బయలుదేరాక ఒక ఉదుటున పరిగెత్తి ఎక్కాడు. ఎవరూ లేని పెట్టెనే ఎంచుకున్నాడు. నాలుగువైపులా చూసాడు. ఎవరూ లేరు. తర్వాత, పెట్టెలోని చివరి బెంచ్ మీద చివరి సీటులో నక్కాడు. అక్కడి నుండైతే అతడు మొత్తం పెట్టెపై కన్నేసి ఉంచగలడు. ట్రైన్ వేగమందుకోగానే అతడు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.
హఠాత్తుగా పెట్టెలో ఇంకో మూలన ఒక ఆకారం కనిపించింది. యాసీన్ మతిపోయింది. మోకాళ్ళు మళ్ళీ మూర్చరాబోతున్నట్టు వణికాయి. ఒకవేళ ఆ మనిషి ఇటువైపు గానీ వస్తే బెంచ్ కింద దాక్కోడానికి వీలుగా, ఎదుర్కోవాల్సి వచ్చినా పొజిషన్ తీసుకోడానికి అనువుగా ఉంటుందని, సీటుపై చేరగిలబడుతూ కిందకంటా కూర్చున్నాడు
పెట్టె తలుపు దూరమేమీ కాదు. అయితే నడుస్తున్న బండిలోనుండి దూకేస్తే చావును మించిన ప్రమాదం ఇంకోటి లేదు. బండి నిదానించినా… ఆ మనిషి! ఉన్నట్టుండి ఆ మనిషి ఉన్న చోటునుండి లేచి నిలబడ్డాడు. నించునే నాలుగుపక్కలా చూసాడు. కానీ అతడి మొహంలో భయంగానీ, బెదురుగానీ ఏమీ కనిపించలేదు. అతడు కచ్చితంగా హిందువు – యాసీన్ మొదటి రియాక్షన్ ఇదే! తాపీగా అటూ, ఇటూ నడుస్తూ ఆ మనిషి అవతలి వైపు తలుపు దగ్గర నించున్నాడు. గాలికి అతడి మఫ్లర్ చిరిగిన జెండాలా రెపరెపలాడింది. కాసేపు బయటకు తొంగి చూస్తూ ఉన్నాడతడు. మరికాసేపటికి ఏదో వస్తువుతో కసరత్తులు చేస్తున్నట్టు అనిపించింది. యాసీన్ కూర్చున్న చోటు నుండి స్పష్టంగా తెలియలేదు. ఏదో వస్తువును లాగుతున్నట్టున్నాడు. ఒకసారి నొక్కుతాడు. ఒకసారి ఎత్తుతాడు. మరోసారి లాగుతాడు. యాసీన్‍కు ఏదో బద్దలుగొడుతున్నాడనిపించింది. అప్పుడే ఎకాయకిన తుప్పుపట్టిన తలుపు కీచుమంటూ, పెద్దగా చప్పుడు చేస్తూ ధడాలున మూసుకుపోయింది. నయం, దడుచుకొని యాసీన్ ఏ వెర్రికేకో వేయలేదు. అయితే ఆ మనిషే ఆ శబ్దాలకు ఉలిక్కిపడ్డాడు. నాలుగువైపులా చూసాడు. యాసీన్ ఉన్న మూలకు ఎక్కువ సేపు చూస్తూ ఉండిపోయాడు. యాసీన్‌కు అనుమానం కలిగింది, అతడు తనను చూసేయలేదు కదా? అలికిడిని పసిగట్టేసాడా?
ఆ మనిషి చూపించిన బలప్రదర్శనతో యాసీన్ గుండెల్లో విపరీతమైన భయం నాటుకుపోయింది. అతడుగానీ ఎదురుపడితే ఎదుర్కోగలడా? ఆ మనిషి తచ్చాడుతూ మరో తలుపు దగ్గర నుంచున్నాడు. బండి జోగేశ్వరి ప్రాంతంలోని నిర్జన స్టేషన్‌ను దాటుకొని దూసుకుపోతోంది. బండి ఆగుంటే అతడు దిగిపోయేవాడో, ఏంటో? కానీ ఇది కర్ఫ్యూ ఉన్న ప్రాంతం. అందుకని బండి ఆగలేదు. కర్ఫ్యూ ఉన్న ప్రాంతమే ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. కనీసం పోలీసులైనా ఉంటారు. ఇప్పుడైతే మిలిటరీని కూడా రప్పించారు నగరంలోకి. అల్లర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఖాకీ వాహనాలు నడుస్తూ కనిపిస్తున్నాయి. అదే రంగు దుస్తులు వేసుకున్న సిపాయిలు, తమ రైఫిళ్ళనూ, తుపాకీలను బయటకు చూపెడుతూ తిరుగుతున్నారు. పోలీసులు పనికిరాకుండా పోయారు. ఇప్పుడు వాళ్ళని చూసి ఎవరూ భయపడ్డం లేదు. రౌడీ మూకలు నిర్భయంగా వాళ్ళపై రాళ్ళూ, సోడా నీళ్ళ సీసాలు విసిరేవాళ్ళు. ఇప్పుడేమో, ఆసిడ్ నింపిన బల్బులు కూడా. పోలిసులు టియర్‌గాస్ ప్రయోగిస్తే, అల్లరిమూకలో కొందరు తడిసిన జేబురుమాళ్ళతో పోలీసులను తిరిగి కొడుతారు.
’సాకీనాకా’లో తను పనిచేసే బేకరిని తగలెట్టినప్పుడు పోలిసులేం చేశారని? దూరంగా నుంచుని చోద్యం చూస్తుంటే, వీళ్ళేమో ఇరుకు సందుల్లో నుండి ప్రాణాలను కాపాడుకుంటూ, విరిగి ముక్కలై, డొక్కుల్లా మిగిలిన పాడుబడ్డ కార్లున్న గారేజి వైపుకు పరిగెత్తారు. ప్రాణాలరచేత పట్టుకొని పరిగెత్తారు. వాళ్ళు ఎనిమిది పది దాకా ఉండి ఉంటారు. భాఁవూ కడుపు చల్లగా ఉండాలి. అతడే పరిగెత్తుతున్న తన చొక్కా పట్టుకొని టీకొట్టు పక్కన ఉన్న షెడ్డులోకి లాగేసాడు. తాను ముస్లిమని భాఁవూకి తెల్సు. కానీ భాఁవూ హిందువు. మరి అతనెందుకు పరిగెత్తాడు? భాఁవూ అన్నాడు – రక్తపిపాసులైన మూకలు పేర్లు కనుక్కోడానికి ఆగరని. వాళ్ళ దాహం రక్తంతోనో, నిప్పుతోనో తీరుతుంది. తగలబెట్టో. చంపో. నరికో. వాళ్ళ కోపం చల్లారేది ఎదురుగా ఇంకేం మిగలనప్పుడే.
రెండో తలుపు నుండి పెద్ద చప్పుడు వినిపించటంతో అతడు ఉలిక్కిపడ్డాడు. పెట్టెకు ఒకవైపు రెండు తలుపులనూ ఆ మనిషి మూసేసాడు. యాసీన్ దాక్కున్న మూలకే చాలా సేపటి నుండి చూస్తున్నాడు. మళ్ళీ అతడు భయం గుప్పిట్లో చిక్కుకుపోయాడు. ఆ మనిషి తలుపులన్నీ ఎందుకు మూసేస్తున్నాడు? తనని చంపేసి, నెత్తుటి మడుగులో తన శవాన్ని అక్కడే వదిలేసి వచ్చే స్టేషన్లో దిగిపోతాడా? రైలు ఇప్పుడు నిదానిస్తోంది. ఏదో స్టేషన్ వస్తోంది. ఆ మనిషి అడుగుల్లో ఇంతకు ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ నిబ్బరం కనిపిస్తోంది. మెల్లిమెల్లిగా నడుస్తూ తన వైపుకే వస్తున్నాడు. యాసీన్‌కు ఊపిరి తీసుకోవటం భారమయ్యింది. నుదురుపై పుట్టుకొస్తున్న చెమటచుక్కల చల్లని చెమ్మ అతడికి తెలిసింది. విపరీతంగా భయం వేసింది. ఊపిరాడలేదు. గుటక పడలేదు. సీటుకింద దాక్కున్న అతడికి ఎక్కిళ్ళు వస్తే? అతడు దగ్గితే?
బండి ఆగింది. ఏదో స్టేషన్ వచ్చింది. ఆ మనిషి తాపీగా ప్లాట్‍ఫారం వైపున్న తలుపు దగ్గర నుంచున్నాడు. అతడి చేయి ఒకటి అతడి జేబులో ఉంది. జేబులో ఏదో ఆయుధం ఉండే ఉంటుంది. తుపాకియో? కత్తో? పరిగెత్తుకొని వెళ్ళి అవతలి వైపునుండి దూకేద్దామా? అనుకున్నాడు యాసీన్. కానీ తాను నక్కిన మూలనుండి బయటపడేసరికే ఆ మనిషి తన పొట్టను చీల్చేస్తాడు. పొట్టనేం ఖర్మ! పీకే కోసేస్తాడు, అరిచే అవకాశమివ్వకుండా. దొంగచాటుగా తొంగి చూసాడు. ఆ మనిషి బయటకేసే చూస్తున్నాడు. ప్లాట్‍ఫారంపై ఎవరూ లేదు. అడుగుల అలికిడి కూడా లేదు. ఎవరైనా వస్తే బాగుణ్ణని యాసీన్ ఎంతగానో అనుకున్నాడు. కానీ ఎవరు వస్తారో ఎవరికి తెల్సు? హిందువో? ముస్లిమో? ఇంకో హిందువే అయినా పర్లేదు, భాఁవూలాంటి మంచివాడైతే. భాఁవూ తనకు జంధ్యం వేసి, టీకొట్టునుండి అతడుండే గదికు తీసుకెళ్ళాడు. నాలుగురోజులు ఆశ్రయమిచ్చాడు. అతడు అన్నాడు కదా –
“నేను మరాఠాను. కానీ రోజూ మాంసం తినను. నీకు కావాలంటే తీసుకువస్తాను. ఎలా దొరుకుతుందో నాకు తెలీదు. హలాల్, బలాల్ వంటివి తెలియవు. బయటున్న పరిస్థితుల్లోనేమో కూరగాయలు కుళ్ళిపోతున్నాయి. అమ్మేవాడు ఎవడూ లేడాయె! కొల్లగొట్టుకున్నవాడికి కొల్లగొట్టుకున్నంత!” రేడియోలో మాత్రం నగరంలో పరిస్థితులు నార్మల్ అవుతున్నాయని మళ్ళీ మళ్ళీ ప్రకటిస్తూనే ఉన్నారు. వాహనాలు నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సులను కూడా నడపడం మొదలెట్టారు. ఈ నాలుగు రోజుల్లో అతడికి ఇంట్లోవాళ్ళ మీద బెంగపట్టుకుంది. ఇంట్లోవాళ్ళూ తన గురించి ఆందోళన పడుతూ ఉండుంటారు. దానికితోడు కొత్త భయమొకటి మొదలయ్యింది. ఫాతిమా అతణ్ణి వెతుక్కుంటూ బేకరి అడ్రస్ తీసుకొని అక్కడికి పోతుందేమోనని. దాక్కున గదిలో నుండి రైలు పట్టాలు కనిపించేవి. రైళ్ళు కూడా కనిపించసాగాయి. కానీ భాఁవూ అతడిని వెళ్ళనివ్వలేదు.
బండి కుదుపు వల్ల యాసీన్ గదిలోనుండి పెట్టెలోకి వచ్చిపడ్డాడు. ఆ మనిషి ఎడంచేతితో రాడ్ పట్టుకొని, చాలా నిబ్బరంగా నించున్నాడు. కుడిచేయి ఇంకా జేబులోనే ఉంది. కొంతదూరం నుండి బండి నత్తనడక నడుస్తోంది. ఈ బండి ఎందుకు వేగమందుకోవటం లేదూ? సిగ్నల్ పడే అవకాశమూ లేదే?! పట్టాలపై ట్రాఫిక్ సమస్యే లేదు ఈవేళ. ఇప్పటివరకూ ఒక్క బండి కూడా ఎదురురాలేదు. అయినా బండి బొత్తిగా నత్తనడకే నడుస్తోంది! ఒక చోట ఆగింది. అది భాయందర్ అనే వంతెన. కింద సముద్రం వల్ల ఏర్పడిన అఖాతం ఉంది. ఇక్కడినుండే శవాలను వెలికితీసారంటూ వార్తాపత్రికల్లో కథనాలను అచ్చువేస్తూ ఉంటారు.
యాసీన్‌కు ఊపిరాడ్డం లేదు. ఈ భయంతో బతకటం దుర్భరమనిపించింది. పైగా ఆ మనిషి జేబులోంచి చేయి తీయడేం? అతడి వాలకం బట్టి అతడు దాడి చేస్తాడనే అనిపిస్తోంది. అతడు దాడికి దిగితే ఏమవుతుంది? బయటకు రమ్మని అడుగుతాడా? లేక జుట్టును చేతబట్టుకొని ఈడుస్తూ, పీకమీద కత్తి పెడతాడా? ఏం చేస్తాడతడు? అసలింతకీ, ఇంకా ఏం చెయ్యడేం?
అప్పుడే ఆ మనిషి జేబులోనుండి చేయి తీసాడు. మళ్ళీ బలప్రదర్శన చేయడం మొదలెట్టాడు. మూడో తలుపు కూడా మూసేస్తున్నాడు. ఇప్పుడిక తప్పించుకునేందుకు దారులన్నీ మూసుకు పోతున్నాయి. కిందేమో అఖాతం ఉంది. దూకేస్తే చావు తప్పదు. భయం హద్దులు మీరుతోంది. గుహ మూసుకుపోతోంది.
తటాలున దూకి, ముందుకొచ్చాడు. ఆశ్చర్యపడి చూసాడా మనిషి. అతడి చేయి జేబులోకి వెళ్ళింది. ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు కానీ, యాసీన్‌కు బోలెడు బలమొచ్చింది. “యా అలీ!” అంటూ ఆ మనిషిని కాళ్ళ సందులో నుండి ఎత్తి, బయటకు పారేసాడు. పడిపోతూ, పోతూ ఆ మనిషి పెట్టిన కేక – “అల్లాహ్!”
యాసీన్ చేష్టలుడిగి నిలబడి పోయాడు. బండి కదిలింది. యాసీన్ నివ్వెరపోయాడు. “అతడూ ముస్లిమా?” కానీ భయం గుప్పిట్లో నుండి బయటపడ్డం మృత్యుముఖం నుండి తప్పించుకొనొచ్చినట్లు అనిపించింది.
ఆ రాత్రి, అతడు ఫాతీమాతో అన్నాడు ,”ఒకవేళ అలా జరక్కపోయుంటే, నేనైనా ముస్లిమని ఏ రుజువు చూపించేవాణ్ణి అతడికి? గుడ్డలిప్పా?”