సి-రి-ని-వా-స వృత్తము
[ప్రతివాది భయంకర శ్రీనివాస్ గొప్ప గాయకులు మాత్రమే కాదు, గొప్ప కవి కూడ. వారు 26 అక్షరములకన్న ఎక్కువ అక్షరములు గల వృత్తములను, సార్థక నామ వృత్తములను సృష్టించియున్నారు. వారి స్మృతి చిహ్నముగా వారి పేరుతో పాదమునకు 34 అక్షరములు గల సి-రి-ని-వా-స వృత్తమును కల్పించి వారిపై ఒక పద్యమును వ్రాసినాను. ఇందులో గణములు స-స-స-ర-ర-ర-న-న-న-వ-వ-స, అనగా స-స-స-ర-ర-ర-న-న-న-జ-భ-గురు. ఈ వృత్తము 34వ ఛందములో 14426218588వ వృత్తము. సామాన్యముగా ఛందోగ్రంథములలో ఒకటినుండి 26 అక్షరముల వరకు గల ఛందములను మాత్రమే వివరిస్తారు. పొత్తపి వేంకటకవి తన లక్షణశిరోమణిలో పాదమునకు 27 నుండి 38 అక్షరములు వరకు గల ఛందస్సులను పేర్కొన్నాడు. దాని ప్రకారము పాదమునకు 34 అక్షరములు గల ఛందస్సును భూర్భువశ్చ్ఛందస్సు అంటారు. యత్యక్షరములు 1, 10, 19, 27; ప్రాస గలదు. నేను దీనిని మూడు చతుర్మాత్రలు, మూడు పంచ మాత్రలు, రెండు చతుర్మాత్రలు, ఒక పంచ మాత్ర, ఒక షణ్మాత్రగా విరుచుకొని వ్రాసినాను.]
సిరినివాస వృత్తము – స-స-స-ర-ర-ర-న-న-న-జ-భ-గురు, యతి (1, 10, 19, 27)
34 భూర్భువశ్ఛందస్సు 14426218588
ప్రతివాది భయంకర స-ద్వంశ సంజాతుఁడై యుక్తుఁడై –
వఱలుచు గళమున – స్వరరాగ మాలికలన్
గతితో మధు మాధురితో – గంగగాఁ బొంగజేసేవుగాఁ –
గడుకడు నిపుణతఁ – గమనీయ గీతికలన్
మితిలేనివి నీ గుణముల్ – మేలుగా నెన్నియో భాషలన్ –
మృదు పదకవితల – మెయిపొంగ వ్రాసితి వ-
ద్భుతమై స్థితమై స్తుతమై – ముగ్ధమై శ్రీనివాసా సుధీ –
ముదమున హృదయము – బులకించ భూమిపయిన్