కొవ్వుపుంజి

కొన్ని రోజులుగా ఓడిపోయిన సైనికులు మందలు మందలుగా ఆ ఊరి గుండా ప్రయాణిస్తున్నారు. వాళ్ళిప్పుడు సుశిక్షితులైన సైనికులు కాదు, కేవలం చిన్న చిన్న రౌడీ మూకల్లాటి గుంపులు. మురికి బట్టలతో, బవిరి గడ్డాలతో, నాయకుడు లేక నిరాసక్తంగా సాగిపోతున్నారు. మానసికంగా, శారీరకంగా అలిసిపోయి, ఆశయం కొద్దీ కాకుండా, అలవాటు కొద్దీ అడుగులేస్తున్నారు. నడక కూడా అసాధ్యమనిపించినప్పుడు నిలబడ్డ చోటే చతికిలబడుతున్నారు. వాళ్ళల్లో కొంత మంది పాపం మామూలు పౌరులు! యుధ్ధాల గురించీ, మరణాల గురించీ, గాయాల గురించీ ఏమీ తెలియని శాంతి కాముకులు. ఆ రైఫిళ్ళ బరువు కింద ఒరిగిపోతున్నారు. మరి కొంత మంది యుధ్ధం అంటే ఏదో ఆట అనుకునే అమాయకులు. పోరాటానికీ, పారిపోవటానికీ సమానమైన ఉత్సాహం చూపే స్వచ్ఛంద సైనికులు! కొంత మంది మాత్రం నిజమైన సైనికులు. పాపం, ఓటమి భారంతో కృంగిపోతూనే కొంచెం వడి వడిగా అడుగులేస్తున్నారు. ఇంకొంతమంది ఫక్తు దోపిడీ దొంగల ముఠాలు!

విజేతలైన ప్రష్యనులు రూన్ నగరంలో కొచ్చేస్తున్నారన్న పుకారు బయల్దేరింది.

అంతే, అప్పటివరకూ చుట్టు పక్కల అడవుల్లో శత్రువుల కొరకు గాలిస్తూ, చీమ చిటుక్కుమంటే తుపాకీలు తీసే నేషనల్ గార్డు సభ్యులు, చడీ చప్పుడు లేకుండా తమ ఇళ్ళల్లోకి దూరిపోయారు. అందర్నీ హడలెత్తించిన వాళ్ళ యూనిఫారాలూ, ఆయుధాలు మంత్రించినట్టు మాయమై పోయాయి.

ఆఖరి ఫ్రెంచి సైనికులూ, వారి వెనకగా ఇద్దరు సైనికుల మధ్య తలవంచుకొని ఓటమితో కలిగిన దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేని దైన్యంతో నడుస్తున్న వాళ్ళ సేనాధిపతి, సీన్ నదిని దాటి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఆ ఊరు నిశ్శబ్దమైపోయింది. ఆ ఊరి ప్రజలు గుండెలు అర చేతిలో పట్టుకుని రాబోయే విజేతల కోసం ఎదురు చూస్తున్నారు. బ్రతుకంతా స్తంభించి పోయినట్టయింది. దుకాణాలు మూసివేసారు. వీధులన్నీ నిర్మానుష్యంగా వున్నాయి. నరాలు చిట్లిపోయే టెన్షన్‌తో రాబోయే విపత్తు ఊహిస్తూ గడపటం కంటే ఆ శత్రువు రాకే మంచిదేమో!

ఆ రోజు మధ్యాహ్నమే జర్మను సైన్యం ఊళ్ళోకి దిగింది. అర్ధం కాని భాషలో ఆజ్ఞలు ఇస్తూ అధికారులు, బెటాలియన్ల కొద్దీ సైన్యమూ ఆ ఊరిని హక్కు భుక్తంగా అనుభవించ టానికన్నట్టు దర్పంగా వచ్చాయి. నగర వాసులంతా గడ గడా వణికిపోతూ ఇళ్ళల్లో దూరి తలుపులేసుకున్నారు. ఏదో మానవశక్తి ఆపలేని భయంకర ఉపద్రవం ముంచుకు వస్తుందని తెలిసి, దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళలా వున్నారు వారంతా!

చిన్న చిన్న గుంపుల్లో జర్మను సైనికులు ఒక్కో ఇంటి తలుపూ తడుతున్నారు. తెరవగానే దూసుకు లోనికి ప్రవేశించి ఇంటిలోకి కనుమరుగౌతున్నారు. వాళ్ళతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు ఆ ఊరి పౌరులు. అవును మరి! విజేతలతో విభేదించటానికుంటుందా?

మెల్లిగా కొద్ది రోజులకి ప్రజలు భయాన్నించి తేరుకున్నారు. నిజానికి సంవత్సరం క్రితం అదే నగరంలో ఫ్రెంచి సైనికుల ప్రవర్తనా, అధికార దురహంకారమూ ఇప్పుడొచ్చిన జర్మను సైనికులకంటే తక్కువేమీ కాదు. వాళ్ళు ఆ మొరటు తనానికి అలవాటు పడిపోయారు.

అయితే గాలిలో ఏదో తేడా, ఏదో పరాయి భావన; ఇళ్ళల్లో జొరబడుతూ, తింటున్న తిండి రుచి కూడా మార్చివేసే దుర్భరమైన పరాయి వాతావరణం! విజేతలు పీడించి డబ్బు లాక్కున్నారు. పౌరులు మాట్లాడకుండా వాళ్ళడిగినంతా ఇచ్చుకున్నారు. నిజానికి వాళ్ళంతా ధనికులే. కానీ ధనికులైన నార్మన్ వర్తకులు ఎంత ఎక్కువ ధనం సంపాదిస్తే, ఆ డబ్బు అప్పనంగా వదులుకోవడానికి అంత ఎక్కువ బాధపడతారు. అది వారి నైజం!

అయినా అప్పుడప్పుడూ నదిలో తేలుతూ జర్మన్ సైనికుల శవాలు –- ఫ్రెంచి ప్రజలు సాధించిన పగకి ప్రతీకారంగా. అలాటి దేశ భక్తుల వీరోచిత గాధలను పౌరులు గుస గుసలుగా చెప్పుకుని, తమ మీద యుధ్ధంలో గెలిచిన జర్మన్ల మీద వాళ్ళ కసినంతా తీర్చుకునేవారు. ఇంకొన్ని రోజులకి అంతా సద్దు మణగటంతో వర్తకులకు మళ్ళీ తమ వ్యాపారాన్ని చేసుకోడానికి ధైర్యం వచ్చింది. అలాటి వాళ్ళల్లో కొందరు వ్యాపార రీత్యా హావ్రే నగరానికి వెళ్ళాలనుకున్నారు. రకరకాల జర్మను అధికారులను మచ్చిక చేసుకుని వాళ్ళు ఆ వూరు వదిలి వెళ్ళటానికి కావల్సిన అనుమతి పత్రాలు సంపాదించుకున్నారు.

ఒకనాటి మంగళవారం తెల్లవారు ఝామున గుర్రపు బగ్గీ పది మంది ప్రయాణీకులతో బయల్దేరింది. చలికి నేలంతా ముడుచుకుని పోయి ఉంది. అంతకు ముందు రోజు ఆగకుండా మంచు కురిసింది. తెల్లవారు ఝామున నాలుగు గంటలకి ప్రయాణీకులంతా బగ్గీలో సర్దుకుని కూర్చున్నారు. చలికి వారంతా గడ గడా వణుకుతూ వున్నారు. చిరు చీకట్లలో ఒకరి రూపం ఒకరికి అంత బాగా తెలియటం లేదు. ఇద్దరు మగవారు మాత్రం ఒకరినొకరు గుర్తు పట్టుకుని పలకరించుకున్నారు. ఇంకొక మూడో వ్యక్తి వాళ్ళతో వచ్చి కలిసాడు.

“నా భార్య నాతో ప్రయాణం చేస్తుంది,” ఒకతను అన్నాడు. “నా భార్య కూడా!”, “మా ఆవిడ కూడా!” మిగతా ఇద్దరూ అన్నారు.

మొదటి వ్యక్తి గుస గుసగా అన్నాడు, “మేం తిరిగి రూన్ రాదల్చుకోలేదు. హావ్రే నుంచి ఇంగ్లండు వెళ్ళే ప్రయత్నం చేస్తాము.” మాటల్లో ఆ ముగ్గురూ అదే ఉపాయంతో ఉన్నట్టు అర్ధమైంది. దట్టంగా మంచు కురవటం మొదలైంది. బగ్గీ నడిపేవాడు ఒక పెద్ద లాంతరుతో ముభావంగా వచ్చి గుర్రాన్ని బగ్గీకి కట్టాడు. అంతా సరిగ్గా వుందో లేదో చూసుకున్నాడు. ఇంకొక గుర్రాన్ని తీసుకు రావటానికి వెళ్తూ నిలబడ్డ మగవారిని చూసాడు.

“లోపలికెళ్ళి కూర్చొండి! బయట చలిగా వుంది!” ముగ్గురు మగవాళ్ళూ ఆ మాటతో బగ్గీ లోపలికెళ్ళి కూర్చున్నారు. వారి వారి భార్యలను భద్రంగా బగ్గీ చివర కూర్చొపెట్టారు. తరువాత మిగతా నలుగురూ మాట్లాడకుండా ఎక్కి మిగతా స్థలాల్లో సర్దుకుని కూర్చున్నారు. కిందంతా మెత్తటి గడ్డి పరచి వుంది. వెనక వున్న ఆడవారు వెచ్చటి చెప్పులేసుకున్నారు. ఆఖరికి బగ్గీకి ఆరు గుర్రాలు కట్టింతరువాత బయటినించి ఒక గొంతు “అందరూ ఉన్నట్టేనా?” అని అరిచింది. “ఉన్నాం లే, పద!” లోపలినించి జవాబొచ్చింది.

గుర్రపు బగ్గీ బయల్దేరింది. విపరీతంగా కురిసిన మంచు వల్ల ప్రయాణం నత్తనడక నడుస్తోంది. గుర్రాలు మధ్య మధ్యలో కాలు జారుతూ కూడా ఈడ్చుకుంటూ చెర్నకోల తగిలినప్పుడల్లా కొంత వేగం పెంచి నడుస్తున్నాయి. చీకటిని చిన్న చిన్న దీపాలు ఏమాత్రం తరమ లేక పోతున్నాయి. సమయం భారంగా సాగుతోంది.

ఇంతలో తెల్లవారింది. దూది పింజల్లా, చీకట్లో మెత్తని కాంతిని వెదజల్లే వెలుగు రవ్వల్లా అనిపించే సన్నని మంచు జల్లుల వాన ఆగిపోయింది. దట్టమైన నీలి మేఘాల మధ్య సందు చేసుకొని ప్రసరించే మసక వెలుతురు ఇంటి కప్పులపై రాజ్యమేలుతున్న మంచుకుప్పల తెల్లదనంతో పోటీపడుతున్నది.

తెల్లవారి వెలుతురులో బగ్గీ లోపల ప్రయాణీకులు ఒకరినొకరు కుతూహలంగా చూసుకున్నారు. చివర అన్నిటి కంటే మంచి సీట్లలో శ్రీమాన్, శ్రీమతి లూసో కూర్చున్నారు. లూసో పేరు పొందిన సారా వర్తకులు. ఆయన ఒకప్పుడు ఇంకొక సారా వ్యాపారి వద్ద గుమాస్తాగా పని చేసేవారు. క్రమేపీ యజమాని వ్యాపారాన్ని తనే కొనుక్కుని వృధ్ధిలోకి తెచ్చారు. ఆ క్రమంలో చెప్పలేనంత ధనాన్ని ఆర్జించారని వినికిడి. నిజానికి ఏ మాత్రమూ రుచి బాగుండని సారాయిని ఆయన చవకగా అమ్ముతారు. వ్యాపారంలో కుతంత్రాలకు ఆయన పెట్టింది పేరు. అన్నిటికంటే ఆయన హాస్య ప్రియత్వం విచిత్రమైనది! స్నేహితులమీదా, బంధువుల మీదా ఆయన చేసే వ్యాఖ్యలూ, వేసే జోకులూ అందరికీ బాగా తెలుసు. కొంచెం పొట్టిగా లావుగా నెరుస్తున్న జుట్టుతో వుంటారాయన. ఆయన భార్య పొడవుగా, గంభీరంగా, వాళ్ళ ఇంట్లో వుండే క్రమశిక్షణకి మారు పేరులా హుందాగా వుంది.

వాళ్ళ పక్కనే, అంతే హుందాగా వున్నారు, శ్రీమాన్ లామడోన్! ఆయన ఎంతో ప్రసిధ్ధి చెందిన నూలు వర్తకులు. ఎన్నెన్నో గౌరవ పురస్కారాలూ, సత్కారాలూ అందుకొన్నారు. రాజకీయాల్లో కూడా ఆయన చాలా ప్రసిధ్ధుడు. ఆయన శ్రీమతి, ఆయన కంటే ఎంతో చిన్నదిగా, అందంగా వుంది. సన్నగా, తీగలా చలికి ముడుచుకుని అందరి వైపూ చూస్తుందావిడ.

ఆమె పక్కనే తమ శ్రీమతితో సహా కూర్చున్నవారు, కౌంట్ హ్యూబెర్ట్ బ్రెవీల్. నార్మండీకి చెందిన అతి పురాతన రాచవంశాలలో వారిదొకటి. కొంచెం వయసు పైబడ్డట్టున్నా, కౌంట్ సహజమైన రాచరికపు ఠీవీ, దర్పమూ తెలుస్తూనే వున్నాయి. జన్మ సంజాతమైన రూపు రేఖలకి ఆయన శ్రధ్ధగా మెరుగులు కూడా దిద్దుకున్నారు. ఆయనలో కొంచెం మహారాజు నాలుగో హెన్రీ పోలికలు కనబడతాయి. ఎందుకన్నది దేవ రహస్యం! కౌంట్ హ్యూబెర్ట్‌కీ, లామడోన్‌కీ రాజకీయ బంధుత్వం వుంది. ఆయనకి తగ్గదే ఆయన శ్రీమతి కౌంటెస్ హ్యూబెర్ట్. ఆమె కూడా తన అందచందాలకీ, తమ ఇంట్లో ఏర్పాటు చేసే విందు భోజనాలకీ, రాచరికపు కుటుంబాల్లో వాళ్ళకున్న పలుకుబడికీ పేరు పొందారు. రాచరికపు కుటుంబాలన్నీ ఆవిడ ఇచ్చే విందుల్లో పాల్గొనటానికీ, ఆహ్వానం సంపాదించటానికీ పోటీలు పడతారు. బ్రెవీల్ లో వాళ్ళ ఎస్టేటు విలువ దాదాపు అయిదు లక్షల ఫ్రాంకులుంటుందని అంచనా!

బగ్గీలో వెనక భాగంలో కూర్చున్న వీళ్ళారుగురూ ఫ్రాన్స్ లోని గొప్ప కుటుంబీకులు. డబ్బూ, అధికారమూ, పరపతీ అన్నీ వున్న అదృష్టవంతులు. బగ్గీలో వున్న ఆడవాళ్ళంతా ఒకే వైపు కూర్చున్నారు. కౌంటెస్ హ్యూబెర్ట్ పక్కన ఇద్దరు క్రైస్తవ మిషనరీకి చెందిన సిస్టర్లు కూర్చున్నారు. ఇద్దరూ చేతిలో రోజరీలను తిప్పుతూ భగవద్ధ్యానంలో వున్నారు. అందులో ఒక నన్ వృధ్ధురాలు. మొహం మీద స్ఫోటకం మచ్చలతో జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నదానిలా ఉన్నారామె. ఆమె పక్కనే కూర్చున్న ఇంకొక సిస్టరు కొంచెం వయసులో చిన్నదై కాస్త ఆకర్షణీయంగానే వున్నా, చాలా బలహీనంగా వుంది. ఆ సిస్టర్లిద్దరికీ ఎదురుగా ఒక స్త్రీ, ఒక పురుషుడూ కూర్చొని ఉన్నారు. అందరూ వాళ్ళిద్దరినీ పరిశీలనగా చూడసాగారు.

ఆ మగవాడు అందరికీ సుపరిచితుడే! కోర్నుడెట్! ప్రజాస్వామ్యవాది. మర్యాదస్థులందరూ అసహ్యించుకునే పోకిరీ! అడ్డమైన స్నేహితులందరితో కలిసి తండ్రి ఇచ్చిన సంపదనంతా తగలేసాడు. కొత్త ప్రభుత్వం వస్తే తన దరిద్రం తీరుతుందని ఎదురు చూస్తున్నాడు. యుధ్ధంలో పని చేద్దామని వెళితే వీలు పడలేదు. నిజానికి అంత దుర్మార్గుడేమీ కాదు! యుధ్ధంలో నగరాన్ని పటిష్ఠం చేయటానికి చాలా మందితో కలిసి వ్యూహాలు పన్నాడు! పనికూడా చేసాడు. ఇప్పుడు హావ్రే నగరానికెళ్ళటానికి బగ్గీలో కూర్చున్నాడు.

అతని పక్కన కూర్చుని ఉందొక స్త్రీ! ఆమెని గుర్తు పట్టగానే అక్కడున్న మిగతా స్త్రీలందరూ నిర్ఘాంత పోయారు. మెల్లిగా వారిలో వారు గుస గుసలు పెట్టుకున్నారు. “సిగ్గులేని మొహం”, “తగుదునమ్మా అంటూ వీధిలోకొచ్చింది”, పెద్దగానే మాటలు వినపడటంతో ఆమె తలెత్తి చూసింది. ఆ చూపులో కనిపించిన తిరస్కారానికీ, ఆత్మ విశ్వాసానికీ జడిసి అందరి నోళ్ళూ మూత పడ్డాయి. అందరూ తలలు తిప్పుకున్నా, ఒక్క లూసో మాత్రం ఆమె వంక కుతూహలంగా, నిశితంగా చూడసాగాడు.