మూడు లాంతర్లు – 8

జీవ పరిణామ క్రమంలో మనిషి ఆధిపత్యాన్ని సాధించటానికి కారణం సంస్కృతి – అంటే భాషను, పనిముట్లను సృజించి, ఉపయోగించుకుని, పరిరక్షించుకోగలిగిన శక్తి. సృజనశీలతను జీవ పరిణామ పరంగా అర్ధం చేసుకునే ప్రయత్నాలు జంతుశాస్త్రంలో, మనస్తత్వం లోను కనిపిస్తాయి. స్థూలంగా వాళ్ళు చెప్పేదేమంటే మనుగడకి, వంశం నిలబడ్డానికీ అవసరమైన విషయాల్నే మనుషులు కోరుకుంటారు. ఆహారం, నిద్ర, మైధునం వంటి ఆనందం ఇచ్చే విషయాలన్నీ ఈ ప్రకృతి నియమానికి లోబడిన అనుభవాలే. అలాగే, మిగతా అన్ని జంతువులకంటే భిన్నంగా మనం భాషను, కళల్ని వినియోగించుకోవడం, చుట్టూ ఉండే ప్రకృతిని, ప్రవర్తనను జిజ్ఞాసతో పరిశోధించటం ఇవన్నీ కూడా మనుగడకు ఉపకరిస్తాయి కాబట్టే ఆనందాన్నిస్తాయి, ఆసక్తికరంగా ఉంటాయి.

సృజనానుభవం కూడా ఇంతేనని ఒక సిద్ధాంతం ఉంది. అంటే సృజనశీలతకు మూల కారణాలు జీవ పరిణామ ధర్మాలు, అంటే ఇవి మనిషి మనుగడకు అవసరమైనవని నిర్దేశించే ప్రవర్తనల్లో ఉన్నాయి. దీన్ని అంగీకరిస్తే మరి మనుషులందరూ సృజనశీలురే కావాలి కదా? ఇది నిజమే. మిగత జంతువులతో పోలిస్తే మనిషి మిక్కిలి సృజనశీలి; మనుషులందరం ఇంతే. అందుకే జంతువుల్లో సృజనశీలత కేవలం వైయక్తికం అయితే, మనుషుల సృజనకు చారిత్రకం, సాంస్కృతికమైన పరంపరగా ఒక తరం నుండి ఇంకొక తరానికి సంక్రమించి, ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి పరివ్యాప్తమయ్యే శక్తి ఉంది. జంతువుల్లో ఇలాగ Historic Creativity అనేది లేదు. అయితే సహజంగా సృజనశీలురైన అందరు మనుషుల్లోనూ కొందరికి మాత్రం సృజన తీవ్రము, బలీయమైన స్వభావంగా ఉంటుంది. వీళ్ళను సృజనశీలురని ఎడం చేసి, ఇలాంటి వాళ్ళ – అంటే కవులు, కళాకారులు, శాస్త్రజ్ఞులు మొదలైనవాళ్ళ – సృజనాత్మకతను కూడా జీవ పరిణామ ధర్మాల నేపధ్యంలో వివరించే ప్రయత్నాలున్నాయి. వీటిలో మచ్చుకి కొన్నింటిని పరామర్శిస్తే కవులు, కళాకారులు వంటివాళ్ళ ప్రవర్తనల్ని అర్ధం చేసుకోడానికి పనికి వస్తాయి. ఉదాహరణకు సృజనశీలుర మనస్తత్వం చిన్న పిల్లల్లాగని ఇది వరకు ప్రస్తావించినది. వీటన్నింటికీ సామాన్యమైన ప్రాతిపదికలు: ప్రేరణ (stimulus), స్పందన (response).

మిగతా అన్ని జంతువుల్లాగే మానవ జంతువు చుట్టూ ఉన్న విషయావరణం నుండి ప్రేరణలని గ్రహిస్తుంటుంది – చూపు, వాసన, వినికిడి, స్పర్శ, రుచి వంటి ఇంద్రియ జ్ఞానం ద్వారా. అన్వేషించే స్వభావం ఉన్న జంతువులు, మనుషులు చుట్టూ ఉన్న ప్రపంచం నుండి ఇలాంటి ప్రేరణను నిరంతరం, తగినంత మోతాదులో అందిపుచ్చుకోవాలని ఆశిస్తాయి. మనుషులకి ఇలా బాహ్య ప్రేరణల కోసం వేచి చూచి, స్పందిస్తుండటం తప్పనిసరి అయిన ప్రవృత్తి. రేడియోలో పాటల ధ్వనిలాగే ఈ ప్రేరణ మోతాదు ఎక్కువా కాకుండా, తక్కువా కాకుండా తగు మోతాదులోన ఉన్నపుడే జంతువుకు తృప్తి. ప్రేరణ తక్కువైతే మిగిలేది బోర్‌డమ్(Boredom), ఎక్కువైతే చికాకు, అయోమయం వలన అసంతృప్తి. ప్రేరణ కోసం నిరంతరాయమైన ఈ వెదుకులాటను Stimulus Struggle అన్నారు. ప్రేరణ కోసం వెదుక్కొనే జంతువుల్లో కూడా మళ్ళీ నిపుణులు, అవకాశవాదులు అని రెండు రకాలట. నిపుణులు – పాములు, గ్రద్దలు ఇలాంటివి, తమకు ఏ రకం తిండి కావాలో దాని మీద మాత్రమే ధ్యాస పెట్టుకుని బతుకుతాయి. అవకాశవాదులు, కుక్కలు, నక్కలు, పిల్లులు వంటివి, నిపుణుల్లాగ కాకుండా రక రకాల ఆహారాల కోసం, సౌకర్యాల కోసం నిరంతరం చుట్టూ వెతుక్కుంటూ, తవ్వుకుంటూ ఉంటాయట. ఇలా అన్వేషించే స్వభావం తీవ్రంగా ఉన్న జంతువుల్లో మొట్టమొదటిది మనిషి. అందుకే ఒకవైపు ప్రేరణ కోసం వెదుకులాటే అతనికి చాల పెద్ద సమస్య. ఇంకొకవైపు ఈ అన్వేషణ, చలనశీలతలే అతని సాంస్కృతిక విజయానికీ, సృజనశీలతకూ మూల కారణం.

జంతు ప్రదర్శనశాలల వంటి ఆధునిక ఆవరణాల్లోని జంతువుల ప్రవర్తనల్ని పరిశీలించి చేసిన నిర్ధారణలు ఏమంటే చుట్టూ ఉన్న ఆవరణం నుండి ప్రేరణలు తక్కువగా ఉంటే అవకాశవాది జంతువు రక రకాలుగా ప్రయత్నించి ప్రేరణను తనే సృష్టించుకుంటుందట. ఇలాంటి ప్రవర్తనల్లో;

  • మొదటిది – అనవసరమైన, అక్కర్లేని సమస్యల్ని, ప్రహేళికల్నీ సృష్టించుకొని ఆ వెనుక వాటిని పరిష్కరించటంలో నిమగ్నం కావటం. ఉదాహరణకు పెంపుడు కుక్కలు బంతి విసరమని మారాం చేసి, దాన్ని వేటాడుతూ వెళ్ళి తెచ్చిచ్చి, మళ్ళీ బంతి విసరమని మారాం చేస్తాయి. వేటాడక్కర్లేకుండానే తిండి దొరుకుతున్న పెంపుడు జంతువు కనుక ఇంటి కుక్కకి ఈ బంతాట ఒక ఉట్టుట్టి, అంటే కేవలం నటనాత్మకం మాత్రమైన మృగయా వినోదం. అలాగే, పిల్లులు చచ్చిన ఎలుకనే మరింతగా వేటాడి, పరాక్రమంతో చీల్చి చెండాడుతాయి.
  • రెండవది – కొంచెమైన ప్రేరణకే ఎక్కువగా స్పందించడం. ఉదాహరణకు ఏ పనీ లేకుండా పడుకున్న కుక్క చిన్నపాటి సవ్వడికే ఓమని బిగ్గరగా మొరుగుతూ స్పందించడం పరిపాటి. కోతులు, పక్షుల వంటి అనేక రకాల జంతువులు ఇలాగే ప్రవర్తిస్తుంటాయట.
  • మూడవది: ప్రేరణలు తక్కువగా ఉంటే జంతువులు వినూత్నము, చిత్ర విచిత్రమైన రకరకాల ప్రేరణల్ని సృజించుకొని వాటికి స్పందించటంలో నిమగ్నమౌతాయట. ఈ మూడవ తరహా స్వభావమే సృజనకు కారణహేతువు. మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా సృజనాత్మకత చిత్ర విచిత్రమైన రూపాల్లో ఆవిష్కృతమౌతుంది. జూల్లో పెట్టిన జంతువులు బోరు కొట్టి తమవైపు వచ్చే సందర్శకులకు తమాషా విద్యల్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటాయి, ఆడతాయి, పాడతాయట!
  • నాలుగవది: ఉత్ప్రేరకాలు స్వల్పంగా ఉంటే ఆ ఉన్న కాసిన్ని ప్రేరణలకే కృత్రిమంగా, అంటే అసహజమైన రీతిలో స్పందించటం. దీన్ని super-normal stimuli అన్నారు. మనుషుల కళాత్మతకు, సౌందర్య దృష్టికి, అలంకరించుకొని ఆడి పాడాలన్న కోరికకూ ఇది ఒక కారణమట. ఉదాహరణకు నడవటం, తిండి తినటం, ఒళ్ళు కప్పుకోవటం, ఎండ వానలకు తలదాచుకోవటం ఇవి జంతుతతికి సాధారణమైన స్పందనలైతే పరుగుపందేలు, ఆటల పోటీలూ పెట్టుకోవటం, షడ్రుచులతో రక రకాలుగా వండుకు తిని వినోదించటం, రక రకాల దుస్తులు, నగలతో అలంకరించుకోవటం, అత్తర్లు పూసుకోటం, చిత్ర విచిత్రమైన భవనాల్లో ఉండటం ఇలాంటివి వాటికి సమమైన అసాధారణ స్పందనలు. ఇవి క్రమంగా సంస్కృతిలో భాగమై ఇప్పుడు సంప్రదాయం, సబబు అయ్యేయి.

రూపకాలంకారం కట్టటం – అంటే ఒక విషయంతో ఇంకొకదాన్ని రూపిస్తూ ఊహించటం (Metaphor), కవిత్వం, నర్తన, సంగీతం, కల్పన (Myth), కధలు అల్లటం (Narration), ఆభరణం ఇవి మనుషులకు అనాదిగా అలవడిన సృజన రూపాలట. రూపకాలంకారం (Metaphor) కాల్పనిక సృజన – అంటే కధ, కవితలకు వెన్నెముక వంటి ఉపకరణమనీ, మిగతా అన్ని అలంకారాలకూ తల్లివంటిదనీ Cognitive Scienceలోన విశేషమైన చర్చ ఉంది. ఇంతే కాకుండా రూపకం అనేది మనిషి స్ఫురణ (cognition), వివేచనలకే మూలస్థంభం వంటిదనీ ఒక సిద్ధాంతం. ఈ జాబితాలో విజ్ఞాన శాస్త్రాలు లేవు. కాని, విజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేకమైన గాధ, అంటే a special kind of narrative అని వాదన ఉంది. ఎందుకంటే కేవలం యదార్ధాలు (facts), ఋజువులతోనే సైన్స్ నిర్మించలేము; వాస్తవాలన్నింటినీ సమన్వయం చేస్తూ అల్లే కధలే ముందుగా వైజ్ఞానిక న్యాయాలు, సిద్ధాంతాలు, ఆ పైన శాస్త్రాలు. అందుకే కల్పనా శక్తి కళల్లో లాగే సైన్స్‌లోనూ పనికొస్తుంది. పాతకాలం నుండి ఇప్పటి కాలం వరకూ కాల్పనిక సారస్వతం లోన రూపకాలంకారపు విశ్వరూపాన్ని కొంచెం తరచి చూసినా గ్రహించుకోవచ్చును. ఉదాహరణకు నామిని సుబ్రమణ్యం నాయుడు గారి కధ, వచనమూ రూపకాలంకారం లేనిదే రెండు వాక్యాలైనా ముందుకి పోవు. ఈ రూపకం, దిగువన చెప్పిన బాలక్రీడ, నటన వంటి ఉపకరణాల్ని ఆయన అప్రయత్నంగా చాల సొగసుగా వాడుకుంటారు. అప్రయత్నం ఎందుకంటే అవి ఆయన ప్రపంచాన్ని దర్శించే పద్ధతికి, జీవితాన్ని అనుభవం – అంటే స్ఫురణ చేసుకొనే విధానికీ సహజము, అనివార్యమైనవి; అంటే ఆయన సృజన ఆవిష్కరణకు, తత్వానికీ పునాదులు. అవి ప్రయత్నపూర్వకమైన మాటలు, ఆలోచనలు అంటే conscious, logical thought కంటే లోతైన అనుభవం నుండి మొదలయ్యి, చిట్టచివరికి మాత్రం మాటల ద్వారా ప్రకటితమయ్యేవి. బలమైన కవి తన సృజన అనుభవపు మూలాల్నీ, తత్వాన్నీ తరచి చూసుకొని, అవగాహన చేసుకొని, స్థిరంగా నిలబెట్టుకోగలుగుతున్నాడు. అది చదివినవాళ్ళను అలరించటం అనేది కాకతాళీయకంగా జరిగేది కాదు. తర్కబద్ధంగానే జరిగేది. ఇదివరకు చెప్పుకున్న బింబ ప్రతిబింబ క్రియల్లోన కల్పన, పఠనంలో ప్రతి అంచెనూ సృజనానుభవం అంటున్నది ఎలా పని (operate) చేస్తుందో సహేతుకంగా విడమరచి చెప్పుకునే అవకాశం ఉంది. అలాంటి వివేచన వలన ఉపయోగం కూడా ఉంది.

సృజనలను విడమరచి చూపే వివేచన తప్పు అని, ‘రసపట్టులో తర్కం కూడదు!’ అన్నలాంటి ఆలోచన ఒకటుంది. అంటే సృజనను ఆస్వాదించాలి తప్ప తర్కించకూడదు అని. ఇది సరికాదు. అలాగే అందమైన, కళాత్మకమైన వస్తువుల్నీ, విషయాల్నీ ఆస్వాదించాలి తప్ప వాటిని గురించి వివేచన చెయ్యకూడదని ఒక ఊహ. ఇది కూడా సరికాదు. నిజానికి నిగూఢమైన, మార్మికమైన విషయాలను గురించి లోతుగా, విస్తారంగా తరచి తెలుసుకునే కొద్దీ అవి మరింత అవగతమై, అనుభవంలోకి వచ్చే వీలవుతుంది. ప్రకృతి కూడా ఈ ధర్మాన్ని పాటిస్తుంది. ఉదాహరణకు DNA అనేది చాల గజిబిజిగా, చిక్కుతాడులా కనిపించే బృహదణువు. కాని దాని చిక్కు ముళ్ళు విప్పి చూస్తే అది జీవధర్మపు గుప్త లిపి. దాన్ని గురించిన విశ్లేషణకు ప్రత్యేకమైన పనిముట్లు, తర్కం కావాలి. ఇలాగే కాల్పనిక సృజనకూ తనదైన తర్కం ఉంది. ఈ తర్కం లౌక్యులు, నాయకులు, మేధావులు, శాస్త్రజ్ఞుల తర్క పద్ధతుల కంటె భిన్నమైనది. రసపట్టులో లౌక్యుల తర్కం కూడదు కాని, సృజనశీలుర ‘తర్కం’ తప్పకుండా అక్కరకొస్తుంది. లౌకికమైన తర్కాన్ని కాకుండా వైజ్ఞానికమైన తర్కాన్ని ఉపయోగించి కెమిస్ట్రీ, లెక్కలు లాంటి శాస్త్రాల్ని ఎలా అర్ధం చేసుకుంటామో, సృజన తర్కాన్ని వినియోగించుకొని ఒక్కొక్క కవి కల్పననూ, తద్వారా వివిధము, బహుముఖమైన మొత్తం సృజన స్వరూపాన్నీ తప్పకుండా అవగతం చేసుకోవచ్చును. ఇలాంటి ఆసక్తి ఉన్నవాళ్ళు లాక్షణికులు. ఈ రోజుల్లో మనకు లాక్షణికులు లేరు. పాతకాలపు లక్షణ సిద్ధాంతాలు ఇప్పటి సృజనకు యధాతధంగా సరిపోవు. ఆ కాలం తరువాత అందివచ్చిన విస్తారమైన శాస్త్రవిజ్ఞానం నుండి అవసరం, లభ్యమయ్యే అన్ని అంశాల్నీ పురస్కరించుకొని వాటిని మారిన కాలానికి మళ్ళీ ఎత్తిరాసుకోవలసి ఉంటుంది. ఇదివరకే అనుకున్నట్టు రకరకాల సైన్స్ రంగాల్లోన ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త కాలపు లక్షణ సౌధానికి ఇవి ఇటికల్లాగ పనికొస్తాయి.

పైన చెప్పినవన్నీ ప్రేరణ తక్కువైతే వచ్చే సమస్యలు, స్పందనలు. మరి ప్రేరణలు ఎక్కువైపోతే అప్పుడు స్పందన సాధారణమైన స్థాయి కంటె తక్కువగా ఉంటుందట. అంటే పట్టించుకోకుండా ఊరుకోవడం. ఉదాహరణకు జంతువుల్ని తమ సహజావరణాల్నుండి బోనుల్లో జూల వంటి కొత్త చోట్లకి తీసుకొవచ్చినప్పుడు చప్పుళ్ళు, కదలికలు మరీ ఎక్కువగా ఉంటే అవి నిస్త్రాణగా కళ్ళు మూసుకొని పడుకుంటాయి. ఆధునిక మానవులకి చుట్టూ ఉన్న సంఘం నుండి, జీవితం నుండీ ప్రేరణలు, ఒత్తిడి ఎక్కువైపోతే నిస్త్రాణ, నిద్ర, అంతకు మించి తాగుడు, మాదక ద్రవ్యాల వంటివి అలవాటు కావటం ఉంది. సాధారణమైన నిద్ర, కలలు కూడా మితిమీరిన ప్రేరణల వలని ఒత్తిడిని ఒత్తిడిని తగ్గించడానికి ఉపకరిస్తాయి. టీవీ, స్పీకర్లు వంటివి బిగ్గరగా మోగుతున్నప్పుడు కళ్ళు, చెవులు మూసుకొని కూర్చోవటం ఒక పద్ధతి. అలాగే ధ్యానం, యోగాభ్యాసం వంటివి మితిమీరిన ప్రేరణలను వడపోసి, నియంత్రించి తగ్గించుకునే ప్రయత్నాలట.

ఆది మానవులకి ప్రేరణ కోసం వెదుక్కోవటం ఒక సమస్యే కాదు, ఎందుకంటే వాళ్ళ ధ్యాస, సమయం, శక్తి యుక్తులన్నీ ఆహారం కోసం వేట, భద్రత కోసం వెదుకులాట కోసమే వెచ్చించవలసి వచ్చేది. అంటే వాళ్ళకి పొద్దున్న లేస్తే ఆసక్తికరమైన ప్రేరణలకు, తీర్చుకోవలసిన సమస్యలకూ కొదవలేదు. ఆధునిక మానవులకు కూడా ఆహారం, నిద్ర, భయం, మైధునం, గుంపు మనస్తత్వం, సాంఘిక ప్రవృత్తి, యుద్ధ కాంక్ష ఇలాంటి అవసరాలున్నాయి. కాని సంస్కృతి ఏర్పరచిన సౌకర్యాల మూలంగా వీటిని తీర్చుకోడానికి మనం ఆట్టే సమయాన్నీ, శక్తిని, ధ్యాసనూ వెచ్చించవలసిన అగత్యం లేకుండా పోయింది. తీరుబాటు, అంటే leisure వచ్చిపడింది. కొత్త రాతియుగం, పారిశ్రామిక విప్లవం తరువాత సంక్రమించిన ఈ తీరిక సమయాన్ని ఏదో ఒకలాగ అర్ధవంతంగా వెచ్చించుకొని తీరవలసిన అగత్యం మనుషులకు వచ్చిపడింది. ఎందుకంటే చుట్టూ ఉన్న ఆవరణం నుండి ఆసక్తికరమైన ప్రేరణలకోసం వెదుక్కొని, స్పందించే స్వభావాన్నైతే మనిషితో సహా జంతువులేవీ పోగొట్టుకోలేదు. అంచేత ఆధునిక మానవ జంతువుకు తిండి, బట్ట, ఇల్లు వంటి అవసరాల కంటె కూడా అనుదినం తన చేతనకు అనివార్యమైన ప్రేరణ అనే అవసరాన్ని ఎలా తీర్చుకోవాలన్నది ఒక సమస్యగా పరిణమించింది. గత రెండు శతాబ్దాలలో శాస్త్ర సాంకేతికరంగాల్లో వచ్చిన సమాచార విప్లవం వంటి మార్పులూ, ఆదాయాల్లో, భద్రతలో వచ్చిన మార్పులూ, వలస పోవటం, కుటుంబాలు చిన్నవి కావటం వంటి మార్పులు ఇవన్నీ కలసి ఈ అవసరాన్ని కొత్తగా, రక రకాలుగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రవాసులకు, అధికాదాయ వర్గాల వారికి, ఉన్నత విద్యావంతులకూ ఈ సమస్య మిగిలిన జనసామాన్యం కంటె మరింత జటిలమైనది. ఈ అంశాల మీద విడిగా పరిశోధనలు ఉన్నాయి. స్థూలంగా, కేవలం జంతుశాస్త్రం పరిధిలోనుండే చూస్తే ఇప్పటికి బోర్‌డమ్ అనేది మనుషులకు పరిణామక్రంలో, సంస్కృతి వలన వచ్చిన మార్పుల వలన తటస్థించిన అవస్థ అని, సృజన దీని పరిష్కారం కోసం ఒక స్పందన అనీ గోచరిస్తుంది.

ఇది కాక, ఆధునికుల సాంకేతిక అభివృద్ధికి, ఆర్ధికాభివృద్ధికీ కూడా సృజన (Invention) ఆయువుపట్టు. అందుకే తీవ్రమైన చలనశీలత, అన్వేషణ వీటి పర్యవసానంగా జరిగే సృజన – వీటిని గౌరవించడం, వీటి కోసం అర్రులు చాచటం ఆధునిక సంస్కృతిలో ఒక భాగమైపోయేయి. అన్వేషణ, జిజ్ఞాస, వాటి ప్రోద్బలంతో జరిగే సృజన – వీటిమీద ఆసక్తి తీవ్రంగాను, తప్పనిసరిగాను ఉండేవాళ్ళు సృజనశీలురు. కవులు, కళాకారులు, శాస్త్రజ్ఞులు, కొత్త కొత్త విషయాల్నీ, వస్తువుల్నీ, సాంకేతిక జ్ఞానాన్నీ కనిపెట్టే పరిశోధకులు, ఇలాంటి మనుషులు. వీళ్ళు నిరంతరం అన్వేషిస్తూ, సృజిస్తూ ఉండే స్వభావం ఉన్నవాళ్ళు కాబట్టి stimulus struggle అని సూచించిన అవస్థతో సరిగ్గా, అంటే సమతూకంగా సమాధానపడలేకపోయిన మనుషులు. వీళ్ళ సృజనలు సమాజానికి పనికొస్తాయి గాని, వీళ్ళ మానసికస్థితి ఏమంత ఆరోగ్యకరమైనది (well-adjusted) అని చెప్పుకొనే వీల్లేదు. ఇలాంటి సృజనశీలురలో చాలామందికి ఇది వరకు చెప్పిన eccentricity అనేలాంటి తిక్క, కొస వెర్రి ఉంటాయట. ఇలాంటివాళ్ళ సృజనశీలతకు చిన్న పిల్లల ఆటకు చాల సామీప్యాలుంటాయి. చిన్న పిల్లల అవసరాలన్నీ వాళ్ళ ప్రమేయం లేకుండానే పెద్దవాళ్ళు తీరుస్తారు. పిల్లల ధ్యాసంతా ఎప్పుడూ ఆట మీదే ఉంటుంది. ఈ ఆటల్లో కూడా కొత్త కొత్త విషయాల్నీ, తోవల్నీ కనిపెట్టి ఆనందించటం చిన్న పిల్లలకు సహజం. వాళ్ళకి ప్రతీదీ కొత్తే, ప్రతీదీ వింతే. ఆ కొత్తల్నీ, వింతల్నీ వెదికి పట్టుకుని, అర్ధం – అంటే అనుభవం చేసుకోవడం వాళ్ళకు గొప్ప ఆనందం. ఇలాంటి సృజనాత్మకమైన అన్వేషణ ఫలితంగా నేర్చుకొనే పాఠాలు వాళ్ళ బతుక్కి ముందు ముందు చాల అవసరం కాబట్టి.

చిన్నతనంలో ఉండే ఈ జిజ్ఞాస, అన్నిటినీ అన్వేషించి చూడాలనీ, కొత్త కొత్తవన్నీ విప్పిచూడాలనీ ఉండే తృష్ణ, అన్నింటినీ లోతుగా ప్రశ్నించే స్వభావం ఇవి కొంతమందిలో పెద్దయినా మాసిపోకుండా అలాగే ఉండిపోతాయి. వీళ్ళను పిల్లల్లాంటి పెద్దవాళ్ళు (childlike adults) అన్నారు. సాధారణంగా పెద్దలకూ పిల్లలకూ తేడాలేమిటంటే పెద్దవాళ్ళు తమ చుట్టు ఉన్న ఆవరణాన్ని, పరిస్థితుల్నీ తమ జీవికకు, లౌకిక ప్రయోజనాలకూ అనుకూలంగా ఉండేలా నిర్వహించుకుంటారు. వాళ్ళ ధ్యాసంతా అప్పటికే పరిచితమైన తోవల్నీ, ఎరిగున్న జవాబుల్నీ, పద్ధతుల్నీ ఉపయోగించుకొని లౌకిక విజయాన్ని సాధించుకోవటం మీదే లగ్నమై ఉంటుంది. లౌకిక విజయం అంటే ఇదివరకు మాస్లో అవసరాల అనుక్రమంలో సృజన కంటే కిందివి, తిండి, ఇళ్ళు, భద్రత, సాంఘిక గౌరవం, ప్రతిష్ట ఇవి సంతృప్తిగా తీర్చుకోవటం. లౌకికుని స్వభావం అన్వేషణ కాదు, సృజన కాదు; మనుగడ, సాంఘిక ప్రతిష్ట, వాటికి అవసరమయ్యే కార్య నిర్వహణ. ఇందుకు భిన్నంగా పిల్లలు కొత్త ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, కొత్త తోవలు తొక్కుతూనే ఉంటారు. సృజనశీలి పిల్లల స్వభావం ఉన్న పెద్దవాడు. ఆతని మౌలికమైన, అనివార్యమైన స్వభావం బాలక్రీడ (pretend play). సృజనకూ బాలక్రీడకూ నడుమ ఉన్న సామ్యాలపైన విశేషమైన చర్చ ఉంది. సదా బాలకుడు ఇస్మాయిల్ అనీ, శ్రీశ్రీ గారిది చిన్న పిల్లడి మనస్తత్వమనీ ఇలా పరిచితమైనవి కొన్ని. పుట్టపర్తి నారాయణాచార్యులుగారు ఇంతేనట. త్రిపుర ఇంతే. రావిశాస్త్రిగారు ఇలాగే. ఎం. ఎఫ్. హుసేన్ ఇంతే. నాకు పరిచితులైన కొద్దిమంది సృజనకారుల్లో సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం అని తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ముమ్మాటికీ ఇంతే. ఇలా చూసి చూసి నేను ఛలోక్తిగా ఏమనుకుంటానంటే మనిషి నడక, మాట్లాడే వాటం చూసి అతను కళాకారుడో లౌక్యుడో ఇట్టే పోల్చుకోవచ్చునని. సృజనశీలుర చరిత్రలు తవ్వుతూ పోతే వివిధ సంస్కృతుల్లోనా ఇలాంటి ఉదాహరణలు లెక్కకు మిక్కిలి కనిపిస్తారు.

పిల్లలందరిలో సామాన్యంగా ఉండే ఉత్సుకతను, సృజనశీలతను చాల వరకు అణచుకొని, పెద్దరికపు బాధ్యతలు, మర్యాదలతో సమాధానపడేలాగ చదువు, సంస్కృతి మనని నిర్దేశిస్తాయి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి పెద్దవాళ్ళ సమాజపు మర్యాదలకు, బాధ్యతలకు కట్టుబడే క్రమంలో జిజ్ఞాసను, సృజనాత్మకతను క్రమంగా కోల్పోతారు. సృజన తీవ్రమైన స్వభావంగా ఉన్నవాళ్ళు అన్వేషణ, నటన, కల్పన, బాలక్రీడ లక్షణాలుగా ఉండే బాల్య ప్రవృత్తిని, వీటిని అంటిపెట్టుకొని ఉండే భోళాతనాన్నీ కోల్పోలేకపోతారు. కళా సాంస్కృతిక వైజ్ఞానిక రంగాలనుండీ ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇటువంటి మనుషుల చరిత్రలను, వాళ్ళ సృజనను పరికించి చూస్తే సృజన ప్రపంచపు తర్కం, ప్రవృత్తీ లౌక్యులు, నాయకులు, శాస్త్రజ్ఞులు, సాంఘిక మేధావుల తర్కానికీ, ప్రవృత్తికీ భిన్నమైనదని స్పష్టమౌతుంది. ఏదో ఒక రకంగా తీవ్రము, అసాధారణమైన బాల్యాన్ని అనుభవించిన ప్రతిభావంతుల్లో పెద్దయ్యీ సృజనశీలత తీవ్రమైన స్వభావంగా ఉంటుందని ఒక ప్రతిపాదన. అసాధారణమైన బాల్యం అంటే అటు పిల్లల సృజనశీలతను, ప్రతిభను అటు తీవ్రమైన హేళణకు, అణచివేతకూ గురిచేసినా, లేకుంటే ఇటు అవధుల్లేని ప్రోత్సాహాన్నీ, పోషణను, గుర్తింపునూ ఇచ్చినా సరే.

ఇందుకు భిన్నంగా లౌక్యులైన సామాజికులు, వాళ్ళ వ్యవహారాలకు నాయకత్వం వహించే ఆసక్తి ఉన్న నాయకులూ ప్రేరణ కోసం వెదుకులాటతో సాధారణమైన తోవల్లో, సాధారణంగా అందుబాటులో ఉండే వినోదాలు, మరిపింతలు, కార్యక్రమాలతో సమాధానపడతారు. లేకుంటే సుమారు అలాంటివే కొత్త కొత్తవి కార్యక్రమాల్ని సృష్టించుకొని వినోదిస్తారు. మనస్తత్వం దృష్టిలో ఇది సహజము, ఆరోగ్యకరమైన ప్రవృత్తి. లోకంతో సబబుగా, సమంజసంగా సర్దుకున్న (well adjusted) స్వభావం. మౌలికంగా వీళ్ళ స్వభావం లౌకికమైన జీవితంలో విజయాన్నీ, సంతోషాన్నీ సాధించుకోవటం కాబట్టి సృజన వీళ్ళకు పరమ ప్రయోజనం కాదు. అది వీళ్ళకు తమ లౌకిక కార్యాచరణ కోసం ఒక సాధనం. ఈ విజయం కోసం, సౌఖ్యం కోసం సృజనశీలి పని ఫలితాలు – అంటే సృజన యొక్క రకరకాల ఫలాలు, సమాజానికి కావాలి. సృజనకూ, పిల్లల వంటి పెద్దవాళ్ళ చిత్తవృత్తికీ ఉన్న సంబంధాన్ని గురించి మరింత వివరించే ముందు ఒక జాగ్రత్త చెప్పుకోవాలి. లౌకికం, సామాజిక నిర్వహణలకు సృజనకూ నడుమ మౌలికంగా సంఘర్షణ, అంటే పేచీ ఉండవలసిన అవసరం లేదు. లౌక్యం – అంటే లోక వ్యవహారం చాల అవసరమైనది. దాన్ని సక్రమంగా నిర్వహించుకుని, నాయకత్వం వహించి, నెగ్గుకొని రావటం ఏమంత సుళువు కావు. అందుకే వేలాదిమందిలో కొద్దిమందే లౌక్యులుగా రాణించగలుగుతారు, వాళ్ళల్లో ఇంకా కొద్దిమందికే నాయకత్వం వహించగలిగే ఆసక్తి, శక్తియుక్తులూ ఉంటాయి. మానవాళికి సృజన కంటె ముందుగా అవసరమైనది మనుగడ. అందుకే లోకవ్యవహారంలో విజయాన్నీ, నాయకత్వాన్నీ విశేషంగా గౌరవిస్తాము. కవిత్వం ఏం, కడుపు నింపుతుందా? అని ప్రశ్నిస్తాము. చిన్నపాటి లౌకిక వ్యవహారాల్నైనా సరే సమర్ధవంతంగా నాయకత్వం వహించి, నిర్వహించి, ఒప్పించగలగడం చాల కష్టతరమైన పని. ఉదాహరణకు పదిమందిని పిలిచి టీ కాచి ఇచ్చి, ఆ పదిమందిలో ఏ ఒక్కరిచేతా విమర్శ – అంటే తిట్లు కాయకుండా బయటపడటం దాదాపు దుర్లభం.

స్పష్టమైన తర్కం, పద్ధతీ ఏర్పడి ఉన్న లౌక్యపు వ్యవహారాలకు నాయకత్వం వహించటమే ఇంత కష్టమైతే, లక్షణ వ్యవస్థ సాంతం చితికి జీర్ణమైపోయి శిధిలావస్థలో ఉన్న కాల్పనిక సృజన ఆవిష్కరణను నిర్వహించటం, అంటే సాంస్కృతిక నాయకత్వం వహించటం ఇంకెంత కష్టతరమైన పని అయిఉంటుంది? అందుకే చరిత్రలో సాంఘిక నాయకులు, రాజనీతి, యుద్ధం, వాణిజ్యం, పరిశ్రమ వంటి వ్యాపారాలకు ఎందరో సమర్ధులైన నాయకులు కనిపిస్తారు కాని, సాంస్కృతిక నాయకులు చాల అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు సృజన తర్కాన్నీ, స్వరూపాన్నీ ఎంతో కొంత అర్ధం చేసుకోకుండా సృజనకు నాయకత్వం వహించలేరు. సృజన అలౌకికమైన అనుభవమేమీ కాదు, అది లోకంలో జరిగేదే కాని లౌక్యుల తర్కానికీ, మర్యాదకూ, పద్ధతులకూ ఎడంగా తనదైన, స్వానుభవపూర్వకమైన తర్కం ప్రాతిపదికగా నెరపవలసినది. ఈ రెండింటి లక్ష్యాల్నీ, స్వరూపాల్నీ, తర్కాన్నీ విడి విడిగా అర్ధం చేసుకుంటే ఒకదానితో ఇంకొకదాన్ని confuse అవకుండా దేనికది సమర్ధవంతంగా నిర్వహించుకొనే వెసులుబాటు ఉంది. ఇలాంటి అవగాహన ప్రాతిపదికగా సృజన చుట్టూ ఉండే రకరకాల సంఘర్షణలను, సంశయాల్నీ సమన్వయం చేసుకొని, పరిష్కరించుకొనే తోవలు కనీసం గోచరమయ్యే వీలవుతుంది. అందుబాటులో ఉన్న సాంస్కృతిక నాయకులు ఒకరిద్దరి చరిత్రలు ముందుకి పరామర్శించవచ్చును.

దర్శనంలో నవ్యత అనేది సృజనకు చాల దగ్గరి చుట్టం. ప్రకృతి, ప్రవర్తన, అంతరంగం ఈ మూడింటిలో తమకు ఆసక్తికరమైన వాటిని కొత్తగా చూడగలగటం సృజనకారుల మౌలికమైన స్వభావం. ఇలా ప్రపంచాన్ని కొత్తగా – అంటే లోక వ్యవహారంలో సాధారణమైన దృష్టుల కంటె భిన్నంగా చూసి, ఆవిష్కరించే శక్తి ఎంత బలంగా ఉంటే ఆ సృజన అంత విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆకట్టుకునే కల్పనల్లో నవ్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు నామిని కధలు మొదటి సారిగా అందుబాటులోనికి వచ్చినప్పుడు, ఇంద్రాణివి వానకు తడిసిన పువ్వొకటి వంటి కవితల్లోను, ఇదివరకు చెప్పిన గంజిబువ్వ అనే కధ వంటి కధలకూ ఈ నవ్యత ప్రాణప్రదంగా ఉంది. అది వస్తువునుంచి కాక, సృజనకారుల అంతరంగ ప్రపంచపు కెమెరాల్లోని అసాధారణము, ప్రత్యేకమైన దృక్కోణాలనుండి వచ్చింది.

రవిగాంచనిచో కవి గాంచునే అన్నదాన్లో రవి లౌక్యుడు; రోజూ ఎండ కాసే జాగాలను మాత్రం చూడగలిగినవాడు. కవి సృజనశీలి. అతను ప్రకృతిలో, ప్రవర్తనలో, అంతరంగంలోను కొత్తవి, అపరిచితమైన జాగాలను దర్శించి, ఆవిష్కరించగలుగుతున్నాడు. ఇలాంటి నవ్యమైన దృష్టి హేతువుగా ఉన్న సృజనను Stochastic Creativity అన్నారు. ఇటువంటి నవ్యతకు ఉండే లక్షణాలు ఏమంటే: ఒకటి పాతగానే చూసే చూపుకు బందీలై చిక్కి పడకుండా తప్పించుకోగలగడం; రెండవది పాతకు భిన్నమైన రక రకాల తోవల్లో ప్రపంచాన్ని చూస్తూ ఆ దృక్కోణాల్లో తన సృజనకు అవసరమైన కోణాన్ని ఎంపిక చేసుకొని, ఉపయోగించుకోవడం. పాత పద్ధతులు లౌక్యులకు అలవాటైన పద్ధతులు. ఎందుకంటే పాత దారులు క్షేమంగా ఉండేవి, లౌకిక విజయానికి సుగమమైన మార్గాలు. కొత్త తోవలు తొక్కడానికి సాహసం కావాలి, వాటి వెంబడి పోతే లోకవ్యవహారంలో పరాజయమే మిగలవచ్చు. అంచేత లౌక్యుడు పాత తోవల్ని, లేకుంటే సృజనశీలి ఇటీవల తొక్కి చదును చేసిన కొత్త తోవల్నీ స్వీకరించి తన కార్యం చక్కబెట్టుకుంటాడు. ఇలా అనుకరించే ధోరణులు కూడా సారస్వతంలో సాధారణంగా కనిపిస్తాయి.

ఉదాహరణకు పచ్చనాకు సాక్షిగా కధల్లోని ఆత్మ చరిత్రాత్మకము, కన్‌ఫెషన్, బాలక్రీడ, ఎగతాళి, వేదన, పరాచికాలు, మాండలీకం ఇటువంటి రక రకాలుగా నవ్యమైన లక్షణాలను, పద్ధతుల్నే స్వీకరించి అటుపైన అనేకం రచనలు వచ్చేయి. వాటిలో ప్రళయ కావేరి కధలు నాకు ఎక్కువగా నచ్చుతాయి. ఎందుకంటే స. వెం. రమేష్ గారి సృజన తనదైన నవ్యతను కనుక్కొని, బలంగా ఆవిష్కరించగలుగుతుంది. తొలుత కొత్తదే అయిన తోవ, భాష, శైలీ, దృష్టీ మళ్ళీ తొక్కేసరికి మాసిపోతాయి. ఈ ఇబ్బంది ఇలా కొత్త తోవలు తొక్కిన వైతాళికులకే తెలిసిపోతుంది. అంటే వేరెవరో కానక్కర్లేదు, నామిని శైలిని, పద్ధతుల్ని నామినీ, ఇంద్రాణి పద్ధతుల్ని ఇంద్రాణీ, బత్తుల ప్రసాద్ పద్ధతుల్ని బత్తుల ప్రసాద్ ఇలా తమను తామే అనుకరిస్తూ పోతే అవికూడా మాసిపోయి, ఇబ్బంది పెడ్తాయి. తొలినాళ్ళలోని ప్రతిభ వలన మంచి రచయితలు, కవులు అని పేరుపడిపోయిన వాళ్ళు తరువాతి రోజుల్లో చేసిన రచనలు పేలవంగా, ఇబ్బందిగా ఉండటం, అయినప్పటికీ వాళ్ళు వాటినీ పాతవాటినీ కలిపి ప్రాచుర్యంలో తిప్పుకోవటం సృజనలోకంలో సర్వ సాధారణమైన సంగతి. ఇలా కాకుండా కళాకారులు తీసుకొనే జాగ్రత్త ఏమిటంటే పాత కెమెరాతోనే కొత్త కొత్త వస్తువుల్ని చూపించటం, లేకుంటే ఊరకే ఉండటం. అక్కడితో ఈ ఇబ్బంది దాదాపు నివారణ అవుతుంది గాని, సృజన రక్తి కట్టడానికి నవ్యత ఒక్కటే సరిపోదు. ఇప్పటికి ప్రస్తుతం ఏమంటే అందరికీ అందుబాటులో ఉన్న ప్రపంచాల్నే కొత్త కొత్తగా దర్శించటం, లేదు సామాన్యంగా అందుబాటులో లేని ఆవరణాల్ని దర్శించి చూపించటం ఈ రెండూ కొత్తతనానికి పనికొచ్చేవే.

బలమైన సృజనకారులు వస్తువులో కొత్తదనం మీద కంటె తమ దర్శనంలోని నవ్యత పైనే ఎక్కువగా ఆధారపడటం చూస్తాము. అంటే వీళ్ళ సృజనకు వస్తువు ఇదివరకు ఎవరూ ఆట్టే చూడని జాగాలు – కులు మనాలి, హిమాలయాలు, అమెరికా ఇలాంటివే కానక్కర్లేదు. రోజూ చూసేవీ, చాల ‘పరిచితం’ అయినవాటినే వీళ్ళు కొత్తగా, భిన్నంగా చూడగలుగుతారు. ఇలాంటి నవ్యము, సృజనాత్మకమైన దృష్టికి కొన్ని లక్షణాలు ఏమంటే అనూహ్యం, అపరిచితమైన తోవలు అనేకం పోల్చుకుని చూడగలిగే స్ఫురణ – Stochasticity అన్నది, Divergent Thinking అనేది ఒకటి. దీనికి దగ్గరగానే, పాత తోవల్ని తిరస్కరించటం, అంటే suppressing the obvious అనేది ఒకటి. ఉదాహరణకు పిల్లలు అరటిపండునో, కర్ర ముక్కనో తీసుకొని అది ఒక టెలిఫోన్లా చెవి దగ్గర పెట్టుకొని ‘హలో?! హలో!!’ అని మాట్లాడేటప్పుడు వాళ్ళు అరటిపండు తినడానికనీ, కర్ర ముక్క పొయ్యిలోకనీ పూర్వ జ్ఞానాన్ని విస్మరించి, ఆ వస్తువునే కొత్తగా చూడగలుగుతున్నారు. ఇలా కొత్త కొత్త ఉపయోగాల్నీ, సమాధానాల్నీ దర్శించే శక్తి జీవితంలో అన్ని వ్యవహారాలకీ ఎంతో ఉపకరించే సమయస్ఫూర్తికి చాల అవసరం. ధ్యాస నిడివి – అంటే Breadth of Attention అనేది విస్తారంగా ఉండటం ఇంకొకటి. ఉదాహరణకు ఇది అనేక అంశాల మీద, విషయాల మీద ఏక కాలంలోనే ఆసక్తి, ధ్యాస నిలిపే ప్రవృత్తిగా ఉండి, అవధానం వంటి కళలకు పనికొస్తుంది, ఇంకా ఒకే మనిషిని రక రకాల కళలు, విషయాల మీద ఆసక్తిగొనేలా చేస్తుంది. ఈ ప్రవృత్తే ADHD (Attention Deficit Hyperactivity Disorder) వంటి రుగ్మతల్లోనూ కనిపించేది. సృజనశీలురలో ఇది చాల ఎక్కువగా కనిపించే రుగ్మత. మూడవది బాలక్రీడ (Pretend Play) – అంటే దోబూచి, దొంగాట, నటన, అకారణంగా రక రకాల గొంతుల్నీ పాత్రల్నీ పోషించి వినోదించే మనస్తత్వం ఇలా పిల్లల్లో సర్వ సాధారణంగా కనిపించే బాల్య లక్షణాలు. ఈ బాలక్రీడ ద్వారా వేట, ఆత్మ రక్షణ, పెళ్ళి, వృత్తి వంటివి మనుగడకు, వంశానికీ అవసరమైన ఎన్నో కౌశల్యాల్ని రక రకాలుగా పిల్లలకు ప్రకృతి నేర్పిస్తుందట.

(ఇంకా ఉంది)

(ఉపయుక్త గ్రంధ సూచిక: Peter Carruthers ఆయన సహపాఠులవి The Origins of Creativity వంటివి, Desmond Morris రచనలు The Human Zoo, The Naked Ape వంటివి, Lionel Tiger and Robin Fox రచన The Imperial Animal వంటివి.)