శ్రీ ఖరనామ సంవత్సర బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు గ్రహీతలు

పద్మలతకు ఇస్మాయిల్ అవార్డు

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు పద్మలత కవితా సంకలనం “మరో శాకుంతలం” ఎంపికైంది. గడుసైన ఎత్తుగడలు,క్లుప్తత, సకలోద్వేగాలను సమర్థంగా వెల్లడించగల నేర్పు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌,వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావులకు ఈ అవార్డ్ లభించింది.

ఈ మాట పాత సంచికల నుండి పద్మలత కవిత ఒకటి: అన్నీ చెప్పగల భాష.

కోరాడ మహాదేవ శాస్త్రి గారికి బ్రౌన్ పురస్కారం

భాషా శాస్త్రంలో ఏడు దశాబ్దాల అవిరళ కృషి పరిశోధనకు గాను శ్రీ ఖరనామ సంవత్సరం బ్రౌన్ పురస్కారానికి కోరాడ మహాదేవ శాస్త్రి గారిని ఎంపిక చేసాము. తెలుగు పరిశోధనా రంగంలో మహాదేవ శాస్త్రిగారు భీష్మపితామహులు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల తెలుగుకు శ్రేష్ఠభాషగా గుర్తింపు వచ్చింది. ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం ఒక పీఠాన్ని కూడా అనుగ్రహించింది. దీని వెనుక కోరాడ వంటి ఎందరో మహానుభావుల పట్టుదల ఉన్నది. మహాదేవ శాస్త్రిగారు పరిశోధక విద్యార్థిగా గావించిన కృషి తెలుగు చారిత్రక వ్యాకరణంగా రూపు దిద్దుకుంది. ఈ విశిష్ట గ్రంధాన్ని హరప్పా లిపిని అర్థవంతంగా చదివే ప్రయత్నాల్లో ఐరావతం మహదేవన్ వినియోగించుకున్నారు అంటే కోరాడ వారి గొప్పదనం విశదమవుతుంది. అక్కడితో ఆగిపోలేదు వీరి కృషి. దక్షిణాదిన, జర్మనీలో ఆచార్యత్వం వహించి ఎన్నో మేటి గ్రంధాలను రచించి బుధవరుల మన్నన పొందారు. ఐతే, వీరి పుస్తకాలకు పునర్ముద్రణలు రావలసి వుంది. నేటి తరం వీరి రచనలు చదివి స్ఫూర్తి పొందాలి. ఈ డిసెంబర్ 29కి తొమ్మిది పదుల నిండు వయసు లోకి అడుగు పెడతారు కోరాడ వారు. ప్రస్తుతం వారి నివాస స్థానం మద్రాసులో తలపెట్టిన వారి సన్మానానికి ఇదే మా ఆహ్వానం.

జీవిత విశేషాలు: బందరులో జననం (1921), చెన్నపట్టణం ప్రెసిడెన్సీ కాలేజీలో చరిత్ర, ఆర్ధిక శాస్త్రాల్లో ఉన్నత విద్య(1944), కొంతకాలం సంబంధిత రంగాల్లో పరిశోధన. తిరిగి కలకత్తా విశ్వవిద్యాలయం లో ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త సునీతి కుమార్ చటర్జీ మార్గదర్శకత్వం, ఉద్దండులైన సుకుమార్ సేన్, క్షితిజ్ చంద్ర చటర్జీల శిష్యరికం. అంతే గాక సర్వ ప్రథమునిగా ఉత్తీర్ణులై బంగారు పతకం, D.Litt పట్టా (1952) పొందారు. తదుపరి అక్కడ మానవ శాస్త్ర విభాగం క్షేత్ర పరిశోధనల్లో పాలుపంచుకొని ఉత్తర ప్రదేశ్‌లో యునెస్కో ప్రాజెక్టులో భాగంగా భోజ్‌పురీ మాండలికాన్ని అధ్యయనం చేశారు. పదేళ్ళకు పైబడి అన్నామలై, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో బోధన. జర్మనీలో మూడేళ్ళ పాటు ఆచార్యత్వం. International School of Dravidian Linguistics, Trivendrum కు గౌరవాధ్యక్షత వహించారు.

వీరు వెలయించిన ఉద్గ్రంధాలు, పరిశోధక వ్యాసాలు మచ్చుకు కొన్ని:

Historical Grammar of Telugu(1969) ,Descriptive Grammar of Telugu,(1985) Hand Book of Modern Telugu (1985), వ్యాకరణ దీపిక(1984), ఆంధ్ర వాజ్మయ పరిచయము, తెలుగు వ్యుత్పత్తి పద కోశము(2003). A Folktale in Western Bhojpuri (1954), Prakrit inscriptions in Buddhic Andhra, Dialectal differences in Eleventh Century Telugu, పాళీ భాషా వాఙ్మయములు, ప్రాఙ్నన్నయ శాసన భాషలో గ్రాంధిక వ్యావహారిక భేదములు.


పద్మలతతో మాటామంతి

“మరో శాకుంతలం ” కవితా సంకలనానికి ఇస్మాయిల్ అవార్డు (2011) లభించిన సందర్భంగా అభిరుచి గల కవయిత్రి పద్మలతతో తమ్మినేని యదుకుల భూషణ్ మాటా మంతి.

మీరు కవిత్వం రాయగలనని ఎప్పుడైనా అనుకున్నారా ?

నేను ఒకనాడు కవిత్వం రాయగలని ఎన్నడూ అనుకోలేదు. ఇంట్లో మంచి సాహిత్య వాతావరణం అయితే ఉండేది. అమ్మమ్మ సందర్భోచితంగా ఎన్నో పద్యాలూ చెబుతూ ఉంటే శ్రద్ధగా వినేదాన్ని. అలాగే నాన్నగారి ముఖతః ఎన్నో విన్నాను. నేను బాగా కబుర్లు చెప్పేదాన్ని. జరిగిన వాటిని రసవంతంగా చెప్పగల నేర్పు ఉండేది. చదువుకొనే రోజుల్లో ఉపన్యాసాలు , చర్చల్లో పాల్గొని మెప్పు పొందాను. కానీ కవిత్వాల వైపు మనసు పోలేదు.

మరి తొలి కవిత ఎప్పుడు రాశారు ??

నాన్న గారి మరణం నన్ను కదిలించింది. నాన్న నాలో మానవత్వాన్ని పాదుగొలిపిన వ్యక్తి. తాను ట్రేడ్ యూనియన్ లీడర్. అర్ధరాత్రి అపరాత్రి ఎవరైనా సరే, సాయం కోరి తలుపు కొడితే ఉన్న ఫళాన లేచి వెళ్ళేవారు. అటువంటి నాన్న లేని ఒక శూన్యం నుండి పుట్టుకొచ్చింది నా తొలి కవిత.

మీకు మీ మీద కవిగా నమ్మకం కలిగిన క్షణం?

‘ఒంటరిగా నేనున్నా
తుంటరిలా నన్ను వదలని
నీ జ్ఞాపకం’ – అని కవిత మొత్తం ఒక్క క్షణంలో ప్రత్యక్షమయింది. ఆ క్షణం నాకనిపించింది నేను కవిత్వం రాయగలనని.

మీరు విరివిగా కవిత్వం రాసిన కాలం?

2001 మొదలుకొని ఎన్నో కవితలు రాశాను. వాటికి తారీఖులు వేయడం, జాగ్రత్త చేయడం వంటి పనులు నాకు రావు. కాబట్టి సంకలనం తేవడానికి దాదాపు పదేళ్ళు పట్టింది.

మీ పుస్తకంలో ఏ కవితకీ పేరు లేదు? కారణం?

పుస్తకానికి పేరు పెట్టే సరికే తల ప్రాణం తోకకు వచ్చింది. ఇక ఇన్నేసి కవితలకు పేర్లు పెట్టడం నా వల్ల కాదనిపించి అలా వదిలేశాను. కవిత రాయడం, ఒకరిద్దరు రస హృదయులకు వినిపించడంతోనే నా ఉత్సాహం తీరిపోతుంది. అంతకు మించి కష్టపడలేను.

మీ కవితలకు ప్రథమ శ్రోత?

ఎంతో ఆదరంతో వెనుక మాట రాసి ఇచ్చిన వెల్చేరు గారు.

నేటి కాలపు కవుల మీదా కవిత్వాల మీద మీ అభిప్రాయం?

మారిన ఆర్ధిక పరిస్థితులవల్ల తీరిక లేని పాఠకుడిని ఒక పక్క టీవీలు, మరో పక్క పత్రికలూ- సినిమా రాజకీయ వార్తలతో , వారి వారి agendaలతో హోరెత్తిస్తూ ఉంటే, కవులు కూడా కలసి ఉండక పొతే, కొత్త, పాత కవిత్వాన్ని ప్రోత్సహించుకోకపోతే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కోల్పోతాం. ఈ విషయంలో కవులకు ఎక్కువ స్వార్ధం ఉండాలి అన్నది నా ఆలోచన. నావరకు, కవి ముందు మంచి మనిషి కావాలి, ఆ తర్వాత కవిత్వాలు అనిపిస్తుంది. ఇక కవిత్వాల విషయాని కేమో గాని కవిత్వగౌరవానికి వస్తే, తెలుగు దేశంలో కవిత్వ పుస్తకాలని కొని చదివే రోజు వస్తుందని ఆశిస్తున్నాను. అటువంటి ఆత్మస్థైర్యం విషయంలో కూడా తొలుత కవిదే ముందడుగు కావాలి.

కవిత్వ విమర్శ మీద మీ అభిప్రాయం?

సదభిప్రాయమే. నా కవిత్వాన్ని విమర్శకు గురి చేయమనే చెబుతాను.

మీ కవితలన్నీ మీరు అవలీలగా పుస్తకం చూడకుండానే చెబుతున్నారు?

నా కవితలే కాదు, నాకు నచ్చిన పద్యాలూ పాటలు అన్నీ నాకు కంఠతా వచ్చు.

మీకు ఇష్టమైన కవులు రచయితలు?

నేను అందరినీ ఇష్టంగా చదువుకున్నా. ఎందరో ప్రాచీన కవులు, తిలక్, శ్రీ శ్రీ, విశ్వనాథ, జాషువా చలం ఇలా.

మీ కవితలు క్లుప్తంగా , బలంగా ఉన్నా కొన్ని చోట్ల వాటిని మరింత బలంగా మార్చవచ్చు అనిపించింది.

అదెలా ??

మీ అనుభవాల గూర్చి మీరు చెప్పినప్పుడు అవి బలంగా వస్తాయి. అందులో ఆలోచనలు ప్రవేశించాయా ఆ మేరకు అవి బలహీన పడతాయి.

(సాలోచనగా) కొన్ని ఉదాహరణలు కావాలి!

‘నేనంటే ఇష్టం లేదని’ కవిత ప్రథమార్థంలో ఆలోచనలు తీసి వేస్తే సున్నితమైన అనుభవం మరింత వెలిగేదిఅన్నది నా అభిప్రాయం.సాధారణంగా చాలా మంది కవితా సంకలనాల్లో పది శాతం కూడా కవిత్వం కాదు. మీ కవితలెన్నో కవిత్వ పరీక్షలో నెగ్గడం నాకు ఆనందం కలిగించే విషయం.

మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీరు తప్ప, ఇంతవరకూ నా కవిత్వాన్ని అందరూ “అహో ఓహో’ అని పొగిడిన వారే.మీరు నిష్కర్షగా నా కవిత్వంలోని బలాన్ని, బలహీనతని విశదపరిచినందుకు ఆనందంగా ఉంది. నాకు అవార్డుకన్నా మిన్నగా ఇటువంటి పరిశీలన ఎంతో ఉపకరిస్తుంది.

సరే, మీకు గుర్తుండి పోయిన ఒక ప్రశంస ఏదైనా ఉందా?

ఎందుకు లేదూ? అది వేటూరి సుందర రామ్మూర్తి గారిది. ఆయన ఎంతో ఆదరంగా మాట్లాడి, “అమ్మాయి నీ పుస్తకం కావ్యమే, నాకు శిష్ట్లా ఉమా మహేశ్వరరావు గుర్తుకొస్తున్నాడు” అన్నారు.

వేటూరి శిష్ట్లా తో పోల్చారు అంటే మీ కవిత్వం అసలు సిసలైనది అని చెప్పక చెప్పారు. శిష్ట్లాలో originality ఎక్కువ. శ్రీ. శ్రీ కన్నా ముందు రాసిన వాడు. విశ్వనాథ ముందు మాట రాశారు వారి కవిత్వానికి. చాలా సంతోషం, మీ కవిత్వం దిన దినాభివృద్ధి చెంది ఆంధ్రావని మోదమందు గాక. స్వస్తి.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...