మూడు లాంతర్లు – 7

ఒకే సృజనతో రకరకాల మనుషులు ఎలా సమాధానపడతారో అర్ధం చేసుకునే ప్రయత్నం ఈ చాటువులో కనిపిస్తుంది:

కవితా కన్యకు నలుగురు
కవి జనకుడు, భట్టు దాది గణుతింపంగా
నవరస రసికుడె పెనిమిటి
అవివేకియె తోడబుట్టువనవేమ నృపా!

ఇది చెప్పిన కవెవరో తెలియదట. అనవేమా రెడ్డి శ్రీనాధుని కాలం కంటె పాతకాలపు రాజు. సృజన ఒక కన్యక అని, స్వీకరించేది కృతిభర్త అనీ ఇది పాత కాలపు ఆలోచన; ఇప్పటి దృష్టికి ఎబ్బెట్టుగా తోస్తుంది. కాని ఈ చాటువులోని అంతరార్ధం ఇక్కడ ఉపయోగపడుతుంది. సృజనశీలి సృజనకు తండ్రి. ఇలా ఉండాలి అలా ఉండాలి అని ముందస్తు ప్రణాళికతో కాకుండా, అనివార్యంగా అసంకల్పితంగా సృజిస్తున్నాడు. సృజనకు అతని సంకల్పంతో, ఇష్టాఇష్టాలతో అవసరం, ఖాతరు లేవు. అతనికి సృజనతో ఉన్న అనుబంధం వాత్సల్యపూరితమైనది; మూల్యాంకనం, బేరీజు అతని స్వభావం కావు. ఒకసారి రాసినదాన్ని మళ్ళీ వివరించటం, చర్చించటం, దాని అందాల్నీ లోపాల్నీ లెక్కించటం వెగటు అనీ, అయిష్టం అనీ చెప్పిన రచయితలు చాలామందే ఉన్నారు. జాయిస్ (James Joyce) గురించి, హెమింగ్వే (Ernest Hemingway) గురించి చెప్పింది ఉంది. త్రిపుర ఇంతే. తను రాసినవాటిని గురించి అంతకు మించి వివరించబోనని బెకెట్ (Samuel Beckett) భీష్మించుకుని కూర్చున్నారు. They simply ‘mean what they say.’ అని. ఆన్ బీటి (Ann Beattie) అని రచయిత్రి. ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్నతను ‘మీ పాత కధలు, ఈ కధ గుర్తుందా, ఆ కధ ఎలా రాసేరు?’ అని పదే పదే అడుగుతుంటే ఆవిడ ‘నువ్వు చెప్తున్న కధలేవీ నాకు జ్ఞాపకం లేవయ్యా?’ అని ఇబ్బంది పడ్డారు. ఆవిడ అలా అనడం విని విని అతను “Have you ever read Ann Beattie’s work? It’s very good.” అని చలోక్తి విసిరేడు.

భట్టు అంటే సృజనను పెంచి పెద్దచేసేవాడు – సంపాదకుడు, ప్రచురణకర్త, ప్రచారకుని వంటి బాధ్యతల్ని తలకెత్తుకొని, సాంస్కృతిక నాయకత్వం వహించే స్వభావం ఉన్నవాడు. ఇతను సృజనకు దాది. ఆ సృజనంటే ఆసక్తి, స్వీకరించగలిగిన శక్తి ఉన్నవాడు సృజనకు పాఠకుడు. అలాంటి వివేకం లేనివాడు ఆ సృజనకు మాత్రం తోబుట్టువు. సృజనకు తగిన పాఠకుడు లభించటం అమ్మాయికి తగిన వరుడు దొరకటమంత అరుదని కవి చమత్కారం. సృజననుండి పాఠకుడు, సంపాదకుడు, ప్రచురణకర్త ఆశించేదీ, అందుకొనగలిగేదీ, వీటికి ఎడంగా రచయిత ఆశించేదీ, అనుభవించేదీ వీటి మధ్య ఎన్నో తేడాలుండే అవకాశం ఉంది. ఏమీ లోవెల్ (Amy Lowell) అని కవయిత్రి; చిత్రవాద కవిత్వంతో రక రకాల ప్రయోగాలు చేసింది. ఆవిడ వీలునామా అనుసారం అరవయ్యేళ్ళకు పైగా Amy Lowell Poetry Travelling Scholarship అని కవులకోసం ఒక స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. సృజన అనుభవంలోని అనివార్యమైన నొప్పిని, వేదనను గురించి ఆవిడ చెప్తున్నారు. Poetaster అంటే అకవి:

“I do not suppose that anyone not a poet can realize the agony of creating a poem. Every nerve, every muscle, seems strained to the breaking point. The poem will not be denied, to refuse to write it would be a greater torture. It tears its way out of the brain, splintering and breaking its passage, and leaves that organ in a state of jelly-fish when the task is done. And yet to have no poem to write is the worst state of all. Truly a poet’s life is not a happy one. Broken and shattered when creating, miserable and void when not creating, urged always to a strain which cannot heal except through immense pain, peaceful only in the occasional consciousness of a tolerable achievement – certainly the poor creature must be born to his calling, for no man would take on such an existence willingly. This is just the difference between the poet and the poetaster, I think. Does a man create with his blood and sinews, and suffers in doing so ? If he does not, give no heed to his works, they are still-born.”

స్వయంగా సృజనకారులు కాని వాళ్ళకు సృజన అనుభవంలోని వ్యధ అర్ధం కాదని ఆవిడ అంటున్నారు. రాయటం ఒక వేదన. అలా అని రాయకుండా వదిలేస్తే అది నిలువనివ్వదు కాబట్టి అంతకంటే ఎక్కువ దుఃఖం. సృజనశీలి బతుకు ఏమంత సుఖం కాదు. ఇలాంటి వేదనను ఏరి కోరి కావాలని ఎవరూ తలకెత్తుకోరు కాబట్టి, సృజన తనంత తానుగా, తనకు ఒప్పిన సమయంలో సందర్భంలోన పుట్టేదనీ, అది కవి ప్రయత్నపుర్వకంగా ప్రణాళికలు వేసుకొని సృజించేది కాదని. ఇలాంటి వేదనామయమైన అనుభవం వలన అనివార్యమై రాని రచనలు మృత శిశువుల్లాగ నిర్జీవంగా ఉంటాయని, అకవి రచనల్ని ఇలాగ పోల్చుకోవచ్చునని ఆవిడ మాట.

సృజన ఇంకా రూపు దిద్దుకొంటున్న సమయంలో సృజనకారుల అనుభవాన్ని గురించి ఇంకొందరి పరిశీలనలున్నాయి. వీటిలో ఎలియట్ (T. S. Eliot), యుంగ్ (Karl Jung) వంటివాళ్ళవి విస్తారంగా ఉంటాయి. ఇలాంటి సంగతులు కవులు, రచయితల్ని గురించే కాకుండా, చిత్రకారులు, శాస్త్రజ్ఞులు వంటివాళ్ళ స్వభావాల్ని గురించినవీ ఉన్నాయి. వీటిని పరామర్శించే ముందు కొన్ని జాగర్తల్లాగ చెప్పాలనుంది. ఒకటి – ఇలాంటి సంగతులు చెప్పేవాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా, పేరున్నవాళ్ళయినా సరే వాళ్ళు చెప్పేవి వెంటనే ఒప్పుకోకుండా, అలాగని తిరస్కరించకుండా ఆసక్తికరంగా ఉన్నాయని అనిపిస్తే వాటిని పరిశీలించటం, లేదంటే పక్కన పెట్టెయ్యటం మంచిదని తోస్తుంది. వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లు. చదవటం – అంటే Reading అనేదే చాల ఆసక్తికరమైన ప్రక్రియ. కేవలం శబ్ద తరంగాలైన మాటల్నే వినియోగించి ఒక మనిషి ప్రవర్తనను ఇంకొక మనిషి చేత్తో అంటీ ముట్టుకోకుండా నియంత్రించడానికి భాష ఒక ‘రిమోట్ కంట్రోల్’ లాగ పనిచేస్తున్నాది కదా. భాషకున్న ఈ శక్తే నాగరికతకు ప్రాతిపదిక అంటున్నారు. అంటే జంతువుల్నుండి మనని ఎడం చేసే సంస్కృతికి ప్రాతిపదిక భాష. చదవటం, రాయటం భాషకున్న అనేక రకాల ప్రయోజనాలకు ఒక పార్శ్వం. ఈ రెండింటిని గురించీ అవి cognitive processesగా కవుల్లో, పాఠకుల్లో ఎందుకు, ఎలా పని చేస్తాయో కొత్తగా చాలా ఆసక్తికరమైన చర్చ ఉంది. ఉదాహరణకు ఇలాంటివాళ్ళు కొందరికి కాయితాల పిచ్చి, పెన్నుల పిచ్చి, అందునా ఫౌంటెన్ పెన్నుల పిచ్చి ఇలాగ ఉంటాయట. దానికి కారణాలున్నాయి. Writing as Thinking అని నిశితమైన పరిశోధన ఉంది. రాయటం ఒక ప్రత్యేకమైన వివేచన; రచనలో వెలుపలికొచ్చిన విషయాన్ని కేవలం రాతపూర్వకంగా మాత్రమే స్ఫురణ, అనుభవం చేసుకోగలం. రాయకపోతే తెలీదు. నారాయణరావు గారు రాసేటప్పుడు నెమ్మదిగా కూడబలుక్కుని రాస్తానని అనేవారు.

ఇప్పటికి ప్రస్తుతం ఏమిటంటే ఎవరైనా ప్రచురించే ఊహల్ని, అభిప్రాయాల్నీ స్వీకరించటంలో, తిరస్కరించటంలో జాగర్తని గురించి. చదవటంలో రెండు రకాలున్నాయట – విమర్శనాత్మక దృష్టితో చదివేది, సానుభూతితో చదివేదీ – అంటే Critical Reading, Sympathetic Reading అని. చెప్పే విషయం మీద, అది నిర్మిస్తున్న ఆవరణం – అంటే ఇదివరకు చెప్పుకున్న cognitive model మీద, ఇంకా ఆ చెప్తున్న వాళ్ళ మీద, లేదూ వీటన్నింటి మీదా ఇదివరకే సౌజన్యం, ఇష్టం లేకుంటే కనీసం పరిచయం ఉంటే అది Sympathetic Readingకి దోహదం చేస్తుంది. వీటికి ఎడంగా పాఠకునికి స్థిరమైన, బలమైన అభిరుచి అప్పటికే ఏర్పడి ఉంటే అది Critical Readingకు దోహదం చేస్తుంది – సానుభూతి, సౌజన్యం ఉన్నా లేకపొయినా. బలమైన కవులున్నట్టే, బలమైన పాఠకులుంటారు; పాఠకుడు, సంపాదకుడు – వీళ్ళందరూ ‘కవులే’ నని ఇదివరకు అనుకున్నది. బిపిన్‌ని, త్రిపురని చూడగా చూడగా అభిరుచిలో పరిణతి, స్థైర్యం ఉన్న పాఠకునికి ఒక సృజన యెడల విమర్శా దృష్టీ, సానుభూతీ ఏక కాలంలోనే అనుభవం కావచ్చునని అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏ పద్ధతిని ఎంచుకున్నా సరే, తొందర పడి ఒప్పుకోకుండా, తిరస్కరించకుండా సంశయంతో పరికించి చూడటం సహాయం అవుతుందని తోస్తుంది. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు సూచనగా చెప్పింది ఏమంటే ఏ రచననైనా చదవటానికి ఉపక్రమించే ముందు కొంత సానుకూల దృష్టితో మొదలుపెట్టాలి అని. అయితే, చేతికి అందివచ్చిన ప్రతి రచన పట్ల ఇలాంటి సానుకూల వైఖరి అనేది సాధ్యం కాదు. కొంతసేపు పరికించి చూసేక ఒక సృజనకు తను పాఠకుడు అవునో కాదో సుమారుగా అవగాహనకు వస్తుంది. అప్పుడు కూడా ఆసక్తిగా ఉన్నట్టయితే ఇంకా ముందుకు పోయి, లోతుగా చదవటానికి ఉపక్రమించవచ్చు. ఇది పేటర్ (Walter Pater) సూచించిన పద్ధతి.

ఆయన ఏమన్నారంటే ముందు కొంచెం మచ్చు చూస్తామని. “The first step towards seeing one’s object as it really is to know one’s own impression, to discriminate it, to realize it distinctly. What is this song or picture, this engaging personality in life or in a book, to me?” అంటే, పట్టి చూడగానే ఆ సృజనతో ‘నాకేంటి?’ అన్నది మొదటి ప్రశ్న. అప్పటికీ తన ధ్యాసను ఆ సృజన ఆకట్టుకోగలిగితేనే అంతకంటే ముందుకు పోయేది. “When we have formed our impressions we proceed to find ‘the power or forces’ which produced them, the work’s ‘virtue’.” ఈ చెప్పిన ప్రక్రియలోన అభిరుచి ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇలా చదివే ప్రక్రియతో నాకు వ్యక్తిగతంగా ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఎప్పుడో ఏ ఒక్కటో అరుదుగా తప్ప నా ఆసక్తిని, ధ్యాసను ఆకట్టుకోలేవు. దానికి కారణాలు ఏమిటనేది ముందుగా చాలా వెతుక్కొని ఆనక విడిగా, విస్తారంగా చెప్పవలసింది.