1.
బొమ్మకంటి అంటే ఏం స్ఫురిస్తుంది మీకు? కన్నుపోయి అసలు కంటికి బదులు గాజుకన్ను పెట్టించుకున్న మనిషి గుర్తొస్తారా? కల్లు అంటే రాయి. ఎవరో బొమ్మలు చెక్కే రాయి గలవాళ్ళా? బొమ్మకల్లు అని ఒక ఊరుందా పాలకొల్లు లాగ? ఆ ఊరివాళ్ళా వీళ్ళు? లేదు ఏదో గొప్ప విగ్రహాన్ని కనుగొని వచ్చి ఆ ‘బొమ్మను కంటి’ అని చెప్పుకున్నారా ఎవరో? మనం అందరం బొమ్మకంటి వాళ్ళమేనట. ప్రపంచంతో మన తొలి స్పర్శ ఒక బొమ్మ గానే మొదలవుతుంది – కళ్ళంట చిత్రంగా, చెవుల్లో శబ్దమై, నాలిక మీద రుచి లాగనో, వాసన లానో, స్పర్శ లాగనో. మనం ప్రపంచాన్ని ఇంద్రియాలతో స్పృశించి, మన:ఫలకం మీద బొమ్మలుగా దర్శిస్తాం. బతుకంతా మనకి ఇలాగే అనుభవంలోకి వస్తుంది. ఒకసారి అనుభవించింది తిరిగి జ్ఞప్తికొచ్చేది కూడా బొమ్మల్లోనే. మనోచిత్రాల వినిర్మాణమే మన జీవితానుభవం – మెలకువలోను, చివరికి కలల్లో కూడాను.
మనోచిత్రాలు, ఆలోచనలూ ఒకటి కావు. ఎందుకంటే మనోచిత్రాలు ఏదో ఒక ఇంద్రియాన్నుండి పుడుతున్నాయి – చూపులు, చప్పుళ్ళు, రంగులు, తాకిళ్ళు, చలి, వేడి, రుచి, వాసన – వీటిలోంచి. ఆలోచనలకి బొమ్మలతో పనిలేదు. ‘ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు’ అని, ‘స్నేహం కోసం ప్రాణాలైనా ఇవ్వొచ్చు’ అనీ ఏ బొమ్మలూ కనకుండానే, ఏ విషయ స్పర్శా లేకుండానే అనుకోవచ్చు. కవులు చిన్న పిల్లల్లాగ, ఆది మానవుల్లాగ, కలల్లో మనందరం చూసేటట్లు, ప్రపంచాన్ని బొమ్మల్లో చూసి, అనుభవాన్ని బొమ్మల్లో వ్యక్తం చేస్తారు. మన మెదళ్ళో మూడొంతులు దృష్టిని, వాసనను, వినికిడిని గ్రహించడానికే వినియోగం అవుతాయి. మనకి బాగా నచ్చినవీ, మనం ఎంతగానో ఇష్టపడేవి, లేదా అసహ్యించుకొనేవీ ఇలాటివన్నీ అనివార్యంగా బొమ్మల్లోనే గోచరమౌతాయి. “I no sooner have an idea than it turns into an image” అని గర్ట (Johann Goethe) అన్నారు. మన ప్రపంచం ఇంత చిత్ర విచిత్రంగా ఉండడం వల్లనే దాన్ని మనకు చిత్రించి చూపే కవుల కళ్ళు బొమ్మ కళ్ళు. వాళ్ళ చూపు బొమ్మ చూపు. ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయనేది ఒక మర్మం; విజ్ఞానశాస్త్రానికి కూడా పూర్తిగా అర్ధం కాని విషయం. కన్ను కాంతి కిరణాలకు స్పందించే ప్రక్రియ అవగతమౌతుంది కాని, కంటి యంత్రాంగంలోన నాడీ స్పందనలు మనకి ఏవో గజిబిజి విద్యుత్ ప్రకంపనల్లా కాక ‘ఆకాశ నీలం’గా, ‘క్రీగంటి చూపు’గా, ‘విద్యుల్లత’గా ఎలా కనిపిస్తాయో శరీర విజ్ఞానం మనకి విప్పి చెప్పలేదు. కంటి చూపే కాదు, చేతి వేళ్ళూ, ముక్కుపుటాలూ, చవులూరే నాలుకా అన్నీ ఇలాగే బయటి విద్యుద్రసాయన చర్యలకు యాంత్రికంగా స్పందిస్తూ కూడా చిత్రంగా మనకి తీపిని, చేదుని, గుడ్డి వెలుతుర్ని, ఇంకొకరి చేతి వెచ్చదనాన్ని, అత్తరు వాసనల్నీ అనుభవానికి తెస్తున్నాయి. కవిత్వపు చిత్రాలు మన శరీరం, బుద్ధి, ఇంద్రియాలు స్ఫురణకు తెచ్చే అద్భుతమైన, మార్మికమైన వాస్తవాల మీదే ఆధారపడి ఉన్నాయి.
బొమ్మలంటే స్థూలమైన, మూర్తిమయమైన (concrete) చిత్రాలే, అమూర్తమైన (abstract) భావాలు, ఆలోచనలు కావు. ‘కొమ్మ, వెల్తురు, నులి వెచ్చన, పిడికిలి, గలాటా, ధ్యానముద్ర’ ఇలాటివి బొమ్మలు. ‘అద్భుతం, ధ్యానం, నిస్త్రాణ, విసుగు, ఏకమవటం, సాధారణీకరణ’ ఇలాటివి అమూర్తమైన భావనలు. ఆంగ్ల మహాకవి విలియం బ్లేక్ (William Blake) కవిత్వంలో అమూర్తమైన భావాల్ని నిరసిస్తూ తన ఆగ్రహాన్ని ఇలా పెద్దక్షరాల్లో మార్జిన్లో రాసుకున్నాడట: “To Generalize is to be an Idiot. To Particularize is the Alone Distinction of Merit …” అని. ఇంకా, “Singular & Particular detail (అంటే మనం చిత్రాలు అంటున్నది) is the Foundation of the Sublime.” అనీ. గార్సియా లోర్కా (Federico Garcia Lorca) అనే స్పానిష్ కవి “The poet is a professor of the five bodily senses” అన్నాడట. మన పాలపర్తి ఇంద్రాణి బొమ్మల రాణి. ఆవిడ కవితల్లోన కాగడాలు పెట్టి వెదికినా అమూర్తమైన భావనలు కనుక్కోడం కష్టం. సిడ్నీ స్మిత్ (Sydney Smith) అని 18వ శతాబ్దపు తాత్వికుడు ఎవర్నో చేసిన ఆక్షేపణ: “Not body enough to cover his mind decently with; his intellect is improperly exposed” అని లండన్ సెయింట్ పాల్స్ కెథడ్రల్లో భద్రపరిచేరట. మనని అలరించే కధలు కూడా కధకుడి ప్రపంచాన్ని బొమ్మలుగానే మన కళ్ళక్కడతాయి.
చివరికి తాత్వికమని, ఆధ్యాత్మికమని అనేవి, అమూర్తమై కంటికీ మనసుకూ గోచరం కాని గాలి, మనసు వంటి వస్తువులు, ఆలోచనాత్మకమైనవీ, కేవలం భావమాత్రమైనవీ అయిన సంగతులు కూడా, అవెంత అమూర్తమైన అనుభవాలైనా మంచి కవిత్వంగా వ్యక్తమయ్యేటప్పుడు మాత్రం ప్రస్ఫుటమైన చిత్రమాలలే. దైవం కవి స్వానుభవంలో ‘నిర్గుణ పరబ్రహ్మం’ ఏమో గాని, అతని కవిత్వంలో మాత్రం అది ‘నిప్పై పాతక తూల శైలమడచే’ది. అది ‘పెంజీకటికవ్వల దవ్వులనుండే’ ఒక సజీవ మూర్తి! లేదా ఇంకా ప్రస్ఫుటంగా ‘నీల మేఘచ్చాయ బోలు దేహము వాడు’. మరో ప్రపంచం ఒక అమూర్తమైన భావన కాదు. అది కవిని, అతని పాఠకుల్నీ ‘పిలిచింది’. కణకణ మండే త్రేతాగ్నితోటి, హోరుపెట్టే జలపాతాలతోను, విరామమెరుగని కంచు నగారాను మ్రోగించుకుంటూ కేవలం అమూర్తము, కవి ఊహా జనితమైన ఆ మరో ప్రపంచం పరమ భౌతికంగా, మిక్కిలి మూర్తంగా పాఠకుని సర్వేంద్రియాలకూ కనిపిస్తూ, వినిపిస్తూ, స్పృశిస్తూ చివరికి ఈ ధరిత్రి నిండా నిండిపోయింది. అన్నమయ్య మనమున పొదుగుచు బొడమి, అదన నెక్కడికి యరుగునో తెలియక చకితం చేసే ఆసలు ఒదుగుచు జలముల నుండు మత్స్యములు. అవి పదపడి యేగతి బాసేనని ఎదటి మనిషిని అడిగినట్లే దైవాన్ని అడుగుతున్నాడు కవి. త్రిపుర పాఠకుడు నిశ్శబ్దపు పిలుపు వినగలగడు; నిశ్శబ్దపు ‘గర్జన’ను వినగలడు, ఈ ప్రపంచం కంటే లోతైన ప్రపంచాల్లోంచి! అతను ఒక్కొక్కప్పుడు సమస్తం తనని గాయపరుస్తున్న సమయంలో బ్రతుకుతూ ఉంటాడు. అప్పుడు లోకానికంతటికీ ‘కరుణతో క్రిస్మస్ పువ్వులాగ విడుతున్న’ ఉదయం తనొక్కడికి మాత్రం ‘చుట్టూ తెగమండి ధ్వంసమైన లేండ్ స్కేప్’ వలె వ్యాపిస్తుంది. కృష్ణశాస్త్రి గారి గాలి ‘దుడుకు రెక్కలజోడు తొడిగించుకొని, కడిమి పుప్పొడి జీను గదియించుకొనీ’ వస్తుంది, మాధవ స్వామి కోసం! కవి ప్రకృతినే కాదు, ప్రవర్తనని, అంతరంగాన్ని, సృష్టి సమస్తాన్నీ బొమ్మల్లో ‘చిత్రించే’ బొమ్మకంటి.
బొమ్మలు కట్టటం ఏదో కొందరి బులపాటం కాదు, అది మనసు పనిచేసే పద్ధతి – imagination. మనని గనక ఇంద్రియాలు పని చెయ్యలేకుండా చీకటిగా, నిశ్శబ్దంగా ఉండే గదుల్లో బంధించి ఉంచితే రక రకాల భ్రమలకు లోనవుతామట. వాటిని తట్టుకోడానికి మళ్ళీ అంతరంగంలో కల్పనా చిత్రాల్నే ఆశ్రయిస్తాము. ఆంగ్ల సాహిత్యంలో కవులకి, రచయితలకు చెప్పే మొదటి పాఠం ‘Show, don’t tell’ అని. Show అంటే ప్రదర్శన బొమ్మలతోనే సాధ్యం. Ezra Pound నొక్కి చెప్పిన మాట: “The artist seeks out the luminous detail and presents it. He does not comment.”
మనసు చూపును స్ఫురణ (cognition) అంటున్నాము. స్ఫురణను గురించిన విశేషాల్ని, భాష, తర్కం, ఉద్వేగాలు, ఆలోచన వంటివి స్ఫురణ ప్రక్రియలో పోషించే పాత్రల్ని తరచి చూసే శాస్త్రాన్ని Cognitive Science అంటున్నారు. మనస్తత్వం, భాషా శాస్త్రం, న్యూరాలజీ, సాంఘిక శాస్త్రం వంటి సమీపమైన శాస్త్రాల్లోంచి కావలసిన విషయాల్ని ఏరుకుని కంప్యూటర్‌కి, మనిషికీ నడుమ సామ్యాల్ని వెదికే Cognitive Science వలన Robotics వంటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకే కాకుండా ప్రవర్తన, భాష, మనస్తత్వం వంటి ప్రాచీన రంగాల్లో కూడా కొత్త అవగాహనకు ఆస్కారం కలుగుతున్నాది.