నయాగరా

కరిగి కన్నీరైన అనంత జలరాశి
పరవళ్ళు తొక్కుతున్న ప్రవాహం
ఆధారం కోల్పోయి అంతెంతునుండి జారిపడుతున్న జలపాతం
సూర్యకాంతిని హత్తుకుని రాళ్ళ మీద తల బాదుకుంటున్న ఇంద్రధనుస్సు
తనకు తానుగా తెలుసుకోలేని అందమైన అద్భుతం
ఒళ్ళు ఝళ్ళనిపించే ఆకాశ అవయవం

ఎంతయినా నీరు మరచిపోదేమో
విడిచిపోతున్న బాధలో
కన్నీటి తుంపర్లతో
తడిపి వీడ్కోలు చెబుతుంది

దారి చూపేవారు లేకపోయినా
జాడలైనా మిగల్చని రాకపోకలే –
తిరిగి రాలేని గమ్యం చేరేందుకు
అంత వేగమెందుకు నయాగరా!

నయాగరా!
చిత్రాల్లో బంధించి మేము దాచుకున్నట్టు
గడ్డ కట్టించి చూసుకుంటుందా నిన్ను ప్రకృతి
ఒక్కోమారు
నయాగరా!

నా మనస్సులో నువ్విపుడు
ఎన్నాళ్ళయినా
అలసిపోని అహ్లాద సరస్సువి
ఆగిపోని వేణునాదానివి
మరచిపోలేని జ్ఞాపకానివి
నయాగరా!

నీ ఒక్క బిందువు
నీడగా అయినా సరే
నా శరీరంలోనే
కలకాలం నిద్రించనీ.


వై. ముకుంద రామారావు

రచయిత వై. ముకుంద రామారావు గురించి:

9 స్వీయ కవిత్వ సంకలనాలు, 14 అనువాద గ్రంథాలు, ఆంగ్లం కన్నడంలో నా కవిత్వ అనువాద పుస్తకాలు, మరో 5 ఇతరాలు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం-సాహితీ పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం, అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం మొదలైన అవార్డులు వచ్చాయి. ఆంగ్లం, పోలిష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, సంతాలీ, మరాఠీల్లోకి ఎన్నో కవితల అనువాదాలు వచ్చాయి.

 ...