5.
Model, Agent, Rules, Assumption, Judgment, Association, Conditioning, Should – ఇలాంటి మాటలకి సరైన తెలుగు మాటల కోసం వెదుకుతున్నాను: Cognitive Science నుండి చెప్పవలసిందానికి అమిరేటట్లు వీటికి సరైన తెలుగు మాటలు కావాలని. Modelని నమూనా అనుకోవాలి. ఉదాహరణకు ఇంజనీర్లు పెద్ద భవన సముదాయాలు, వంతెనలు వంటి వాటికి ప్రతీకలుగా చిన్న నమూనాల్ని తయారుచేసి గాజుపెట్టెల్లో ఉంచి చూపిస్తారు. వైద్యులు అవయవాల బొమ్మ నమూనాల్ని ప్రదర్శిస్తుంటారు. Agentని ప్రతినిధి అనుకోవాలి. ఉదాహరణకు ‘సృజనశీలి’ అంటున్నది కవి, రచయిత, పాఠకుడు, సంపాదకుడు, విమర్శకుడు, పండితుడు – ఇలా సారస్వత సృజనతో సంబంధం, ఆసక్తి ఉన్న మనుషులందరికీ ప్రతినిధి. మనుషులందరికీ స్వాభావికమైన సృజన కవులు, పాఠకులు, సంపాదకులు, విమర్శకులు వంటి వాళ్ళలో చాల బలీయమైన స్వభావంగా ఉంటుంది. ఇలాంటివాళ్ళందర్నీ కలిపి ‘సృజనశీలి’ అని, ‘కవి’ అనీ విస్తృతార్ధంలో అంటున్నాను. సౌలభ్యం కోసం ఆడవాళ్ళనీ, మగాళ్ళని కూడా ‘డు’ అనే అంటున్నాను. మాటి మాటికీ ‘అతడూ లేదా ఆమె’ అనడం మర్యాదే, కాని గుద్దుకున్నట్టు ఇబ్బందిగా ఉంటుంది. నేను ప్రతిపాదించబోయే విషయాలు సృజన ప్రక్రియకు నమూనాగా ‘ప్రసారాలు’ (communications) అనేవాటినీ, సృజన ప్రసార యంత్రాంగానికి ప్రతినిధిగా ‘కవి’ని, సృజన ప్రసారానికి మాధ్యమంగా ‘భాష’ను వినియోగిస్తాయి. సృజనను గురించి పరిశోధించే వైజ్ఞానికులు కంప్యూటరు, వానరం, మనిషి – ఈ మూడింటినీ నమూనాలుగా స్వీకరించే సంప్రదాయం ఉంది. సృజనశీలి మనస్తత్వాన్ని అర్ధం చేసుకోటానికి ఈ మూడింటి అంతరంగాన్నీ, ప్రవర్తననూ పరిశీలిస్తే పనికొస్తుంది.
టెలిఫోన్లు, రేడియోలు, టీవీలు, కంప్యూటర్లు వంటి యంత్రాలు ఫోన్ కాల్స్, టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ , ఈ మెయిల్ వంటి ప్రసారాలని నిర్వహించే పద్ధతిని స్థూలంగా అర్ధం చేసుకుంటే, ఆ అవగాహన సృజనల ప్రసారాన్ని అర్ధం చేసుకోడానికి ఉపయోగపడుతుంది. ఒకదానితోనొకటి సంభాషించగలిగే ప్రసార యంత్రాలన్నీ ఎలాగయితే ఒకే తరగతికి చెందిన యంత్రాలో, ఒక సృజనను సృజించీ, చదివీ, విశ్లేషించే మనుషులందరూ అలాగే ఒకే తరగతికి చెందిన ‘కవులే’. పాఠకుడు, సంపాదకుడు, విమర్శకుడు – వీళ్ళందరూ కూడా కవి ఒకసారి సృష్టించిన ‘కావ్యా’న్ని (text) తమ మనోరంగం మీద ఇంకోసారి పున:సృష్టి చేస్తున్నారు. అంచేత, ఫోన్ కాల్ చేసే యంత్రం, వినే యంత్రం ఎలాగయితే రెండూ ఫోన్లే అయినట్టు, వీళ్ళందరూ కూడా కవులే. అయితే సృజనకారుడు ప్రదాత (transmitter), పాఠకుడు, విమర్శకుడు ఇలాంటి వాళ్ళందరూ గ్రహీతలు (receivers). సృజనశీలి ఎలా సృష్టిస్తున్నాడన్న మొదటి ప్రశ్నకు ప్రదానం, అంటే transmission ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. అలాగే పాఠకుడు సృజనను ఎలా స్వీకరిస్తున్నాడన్న మూడవ ప్రశ్నకు గ్రహణం (reception) నమూనాగా పనికొస్తుంది. స్థూలంగా ఇవి రెండూ ఒకటే మౌలికమైన ప్రక్రియను ఒకదానికొకటి వ్యతిరిక్తమైన దిశల్లో, అంటే reverse orderలో బింబ ప్రతిబింబాల్లాగా నిర్వర్తిస్తాయి. అంటే అంతశ్చేతనలో చెదురుమదురుగా, అనైక్యంగా ఉన్న అనేక స్పందనల్ని సృజనకారుడు బహిశ్చేతనలో అందిపుచ్చుకుని, ఐక్యతను కల్పించి ఒక పాఠంగా (text) వెలయించేది బింబమయితే, ఆ పాఠాన్ని చదువుకొని, ముందు తన బహిశ్చేతనలో మళ్ళీ నిర్మించుకొని, మననం చేసుకొని అంతిమంగా తన అంతశ్చేతనలోకి, వ్యక్తిత్వంలోకి జీర్ణం చేసుకొనే ప్రతిబింబక్రియ పాఠకుడు చేస్తున్న పని. ఇవి రెండూ కూడా పుర్తికావడానికి కొన్ని రోజులు, నెలలు, ఏళ్ళూ పట్టవచ్చు. బలమైనవిగా పాఠకుల మీద ముద్రవేసి వాళ్ళని కుదిపేసే సృజనలు జీర్ణమయ్యే ప్రక్రియ ఏళ్ళకొద్దీ జరుగుతుందనేది మనందరి అనుభవంలోని విషయమే.
టెలిఫోన్, కంప్యూటర్ వంటి యంత్రాల్లో ఈ ప్రక్రియలు చాల ఖచ్చితమైన ప్రసార అనుక్రమణికల్ని అనుసరించి జరుగుతాయి. ఉదాహరణకు కంప్యూటర్లో బొమ్మలు తెరమీద రూపించే క్రమం అంచెలంచెలుగా Graphics Pipeline అన్న ఖచ్చితమైన పద్ధతిని అనుసరించి జరుగుతుంది. అలాగే టెలిఫోన్లు మనం ఫోన్ నెంబరు నొక్కిన మొదలు అవతలి మనిషి మన మాటల్ని వినే వరకు ఆ అంచెలన్నీ Communications Event Flow అని ఒక ఖచ్చితమైన క్రమాన్ని అనుసరించి జరుగుతాయి. ఈ అంచెలు (steps) – 1. ఫోన్ నెంబరు నొక్కడం; 2. మాటలు సృష్టించిన శబ్దతరంగాలకు మైక్రోఫోన్ స్పందించడం; 3. ఈ స్పందనల్ని మైక్రోఫోన్ విద్యుత్ప్రకంపనలుగా, సంఖ్యలుగా మార్చడం; 4. సంఖ్యల సంకేతాలు టెలిఫోన్ తీగెల్లోంచి ఇంకెంతమందివో ఇతరుల ఫోన్ కాల్స్‌తో కలసి ప్రయాణం చేసి అవతలి మనిషి ఫోన్‌ని చేరుకోవడం; 5. గ్రహీత ఫోన్లో ఈ అంచెలన్నీ దీన్ని తిరగేసిన క్రమంలో (reverse order) మళ్ళీ జరిగి చివరికి అతను ఆ మాటల్ని వినడం – ఇలా వివరించి చెప్తారు. వీటిలో ఒక్కొక్క అంచెలోని సూక్ష్మాల్ని, అంటే inner mechanicsను విశ్లేషించడానికి వాటి event flowని మళ్ళీ అనేక అంచెలుగా విడదీసి పరిశీలిస్తారు. సృజనశీలి యంత్రం కాదు. కాని అతని అంతరంగంలో ఒక కంప్యూటరు వంటి మెదడు, ఆ పైన ఒక ఆదిమ వానరం అనదగిన జాంతవ ప్రకృతి, ఆ పైన నాగరికుడు, మర్యాదస్తుడు, సంస్కారి అనదగిన ఒక మనిషి – వీళ్ళు ముగ్గురూ ఉన్నారు. ఈ ముగ్గురి స్వభావాలు, అవసరాలు, ప్రవర్తన ఇవి సృజనల ప్రసారాల్ని అర్ధం చేసుకోడానికి పనికొస్తాయి.
మనం ఒక సృజనను చదివి అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం దాని నమూనాను అంతరంగంలో నిర్మించుకుంటాము. కవి, పాఠకుడూ విడివిడిగా, వేరు వేరు కాలాల్లో ఈ పని చేస్తున్నారు. ఇంతేకాదు – మనం దైనందిన జీవితాన్ని నిర్వహించుకోవడం కోసం, గతాన్ని అంచనా వేసుకోవడం కోసం, భవిష్యత్తుకి ప్రణాళికలు వేసుకోవటం కోసం కూడా జీవితానికి, చుట్టూ ఉన్న ప్రపంచానికీ ప్రతీకలుగా ఇలాంటి మనోశిల్పాల్ని, అంటే నమూనాల్ని చెక్కుకుంటామట. తిండి సంపాదించుకు తిని, పిల్లల్ని కని, ఆరోగ్యంగా, భద్రంగా వీలైనంత ఎక్కువ కాలం బతికి చచ్చిపొమ్మని మన జాంతవ ప్రకృతి శాసిస్తుంది. సంస్కృతి ఏర్పరచిన నియమాలు (Rules) విభిన్న భాషలు, సంస్కృతుల్లోనా, దేశ కాలాదుల్ని అనుసరించి వేరు వేరుగా ఉంటాయి, కాని ప్రకృతి ఏర్పరచిన నియమాలు – ఆహారం, నిద్ర, భయం, మైధునం ఇలాంటివి – మనందరికీ దేశ కాలాదులతో నిమిత్తం లేకుండా ఒక్కలాగనే ఉంటాయి. మనం ప్రకృతి, సంస్కృతి ఏర్పరచిన నియమాల అనుసారం జీవితానికి నమూనాల్ని మన అంతరంగంలో నిర్మించుకొని, వాటిని అనుసరించి బతుకుతున్నాము. దీన్లో ప్రకృతి నియమాలకు తలొగ్గేదాన్ని జాంతవ జీవనమని, సంస్కృతి నియమాలకు తలొగ్గేదాన్ని నాగరిక జీవనమనీ అనుకుంటే, వీటిని అనుభవించేది మనలోని ఆదిమ మానవుడూ (మానవ జంతువు), నాగరికుడూను. వీళ్ళలో నాగరికునికే కాదు, మానవ జంతువుకు కూడా తమ జీవన వ్యాపారాలకు సృజన, ముఖ్యంగా కధ, ఒక అనివార్యమైన, తప్పనిసరి అవసరమట. సృజనకు మనిషికి ఉన్న అనుబంధం అంత మౌలికమైనది, పురాతనమైనది. అందుకే మనిషిని Story-telling Animal అని అన్నారు. కావ్యం మన మనుగడకు అంత తప్పనిసరి. తెల్లారి లేచి పుస్తకాలూ, కధలూ, సినిమాలూ వెదుక్కొనేది ఇందుకే. మనం కవులుగా, సృజనకారులుగా, పాఠకులుగా సృజనను ఎందుకు వెతుక్కుంటామన్న ప్రశ్నకు సమాధానాలు ఇక్కడ్నించి దొరుకుతాయి. ‘కవితా! ఓ కవితా!’ వంటి సృజనల్ని, సృజనకారుల జీవితాల్నీ పరిశీలిస్తే, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది పాఠకులు పుస్తకాల కోసం దినమూ వెదుక్కొనే వైఖరిని పరిశీలిస్తే ఈ అన్వేషణ ఎంత బలీయమైనదో బోధపడుతుంది. మనవైపు తెలీక, కొంత వెక్కిరింతగాను ‘వాడికి కవిత్వాల పిచ్చి!’ అని ‘దానికి పుస్తకాల పిచ్చి!’ అని అంటుంటారు. కధ కోసం ఈ ఆరాటమే మనల్ని సినిమాలకీ, టీవీకీ అతుక్కుపోయేలా శాసిస్తుంది. పోచికోలు కబుర్లు అనుకొనే gossipని కూడా మనం ఇతరుల జీవిత కధల్ని మన బతుకు కధ నమూనాతో పోల్చి చూసి, సమన్వయం చేసుకోడానికి అనాలోచితంగా వాడుకుంటున్నాము.
సృజన అనుభవం మనుషులందరికీ సాధ్యమైనది, అవసరమైనది, అనివార్యమైనది. చెట్లని మట్టి, వేళ్ళు, కాండం, కొమ్మలు, ఆకులు ఇలా పొరలు పొరలుగా అర్ధం చేసుకున్నట్టు, భవంతుల్ని పునాదుల్నుండి పైకప్పు వరకూ అంచెలంచెలుగా అర్ధం చేసుకున్నట్టు, సృజనశీలి అంతరంగాన్ని, బహిరంగంగా అతను వెలువరించే సృజననూ పొరలు పొరలుగా, అంచెలంచెలుగా అర్ధం చేసుకోవచ్చు. లోతుల్లో యాంత్రికము, జాంతవము అయిన మన ప్రకృతి మీద సంస్కృతిని మనం పైదుస్తుల్లాగ తొడుక్కుంటున్నాము. భాష, వివేచన ఇవి సంస్కృతికి చెందినవి. స్ఫురణ, లయ, నర్తన, చలనం, ఇంద్రియ స్పర్శ వంటి ప్రాకృతికమైన స్ఫురితాంశలు – అంటే Cognitive Elements, దేశ కాలాదులు, భాషలు, కులాలు మతాలవంటి సంస్కృతి కల్పించిన కట్టుబాట్ల కంటె దూరంగా, లోతుగా మనందరికీ సహజంగా అబ్బిన శక్తులు. సృజన స్వభావం, అనుభవం మీద పరిశోధన చాలానే ఉంది; ఇదంతా వివరంగా వెతికి చెప్పుకోవాలని నాకున్నాది. దీనంతటికీ చాలా వ్యవధీ, జాగా కావాలి. ఇక్కడ రాసుకుంటున్నది వ్యాసం కాదు, ఇది ఒక పుస్తకం, పూర్తంటూ అయితే చాన్నాళ్ళే పడుతుంది. దీన్ని ఎందుకు రాస్తున్నావని ప్రశ్న వచ్చింది. దీనికి కారణాలు నాకు అర్ధమయినంత మటుక్కి ఏమంటే పశ్చాత్తాపం, కృతజ్ఞత, జిజ్ఞాస.
సారస్వత సృజనను సాహితీ స్రవంతి అన్నారు. ఇది చక్కగా అమిరేది, ఎంతో హృద్యమైన, ఉపయోగకరమైన పోలిక! ఈ సృజనా స్రవంతి స్వరూపం ఏమిటో, స్వభావం ఏమిటో, దీన్ని మనలోని మర్యాదస్తుడు ఎన్నెన్ని రకాలుగా కలుషితం చేసుకుంటాడో ఇదంతా లోతుగా అర్ధం చేసుకోవాలని నాకుంటుంది. ఆరోపణ లాగ కాదు, అన్వేషణ లాగ. ఆరోపణ అంటూ ఉంటే అది వేరే ఎవరిమీదో కాదు, నామీద నాకే. మనమీద మనకే ఉండే ఆరోపణే పశ్చాత్తాపం అనుకుంటాను. పశ్చాత్తాపం ఎందుకంటే లోతుల్లోన నేనూ ఒక ‘బాల రామానుజన్’ని. ఉన్నతమైన సాహిత్యం పేరిట, ‘తెలుగు సాహిత్యం భవిష్యత్తు’ కోసం అని చెప్పీ, నేను దొంగేషకాలు చాలానే వేసేను. అవన్నీ ఇప్పుడు తవ్వి చెప్పుకుంటే చిన్నతనంగా ఉంటుంది. చేసిన పాపం చెపితే పోతుంది అంటారుగాని పోదు. మా అమ్మ చెప్పినట్టు – దెబ్బ మానిపోతుంది, మచ్చ మిగిలిపోతుంది. మనలో గడుసువాళ్ళం లౌక్యంగా మన ‘గొప్ప’ని ప్రదర్శించుకొని, ప్రచారంలోకి తెచ్చుకుని, లోపాల్ని మరుగ్గా ఉంచుకుంటాము. నిజమైన సృజన, అంటే కపటం లేని కాల్పనిక ధార అని నేననుకున్నది ఇలాంటి లౌక్యానికి, చిత్తవృత్తికి విరుగుడు. ఇలాగని వందలాదిమంది సృజనకారులు నొక్కిచెప్పేరు. “The purpose of art is washing the dust of daily life off our souls.” అని పికాసో అన్నారు. మంచి కధలు చదివితే బుర్రల్లో మంచి రసాయనాలు ఊరుతాయని నామిని అన్నారు. ఇప్పుడు నేను చెప్పుకొనేదేమంటే ఇక్కడ గాని, ఇంకెక్కడైనా నేను రాసేది ఏదీ ఎవరికైనా ఉపయోగిస్తుందనీ, వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుందనీ, లేదూ తెలుగు సాహిత్యానికి ఏదో మేలు చేస్తుందనీ ఇలా అనుకోటం లేదు. దీన్లో పాఠకులకి ఎలాంటి వాగ్దానమూ లేదు. ఇవన్నీ చదువుకుని, ఎత్తిరాసుకోవాలని నాకు పట్టలేనంత కుతూహలం. కడుపులో ఏముందో పైకి అంటేగాని తెలియదు. ఒకసారి వెలువరించిన సృజనల్ని స్నానం చేసి పారబోసిన నీళ్ళలాగ అనుకుంటాను. అవి ఊడ్చి అవతల పారేస్తాము, సీసాలకెత్తి దాచుకోము. అచ్చయినవాటి మీద అవి విలువైనవని, వాటిని చర్చించాలనీ, దాచాలనీ భ్రమల్లేవు, ఆసక్తి, గౌరవం లేవు. ప్రవాసం వెళ్ళిపోయిన వాళ్ళకి తెలుగులో మాట్లాడే అవకాశాలు తక్కువ. మా ఇంట్లోన, పనిలోనా ఇంగ్లీషే మాట్లాడుకుంటాము. ఇది తెలుగులో ఊహించడానికీ, రాయడానికి ఒక అవకాశం.
తెలుగులో నిష్కల్మషమైన ఉపాధ్యాయులుగా తోచేవాళ్ళ చరిత్రలు కేవలం రేఖా మాత్రంగా దొరుకుతాయి, లేదా అదీ లేదు. నా అదృష్టం కొద్దీ Science లోన, Arts లోన వివేకవంతులైన ఉపాధ్యాయుల్ని దగ్గిరగా చూసేను. వాళ్ళు అభ్యాసబలంతో కాలుష్యాలు, రుగ్మతల్నుండి ముక్తులై సృజనను నిబ్బరంగా అనుభవిస్తున్నారు, ఆవిష్కరిస్తున్నారు. వాళ్ళ సమక్షంలోన చూసినవి, విన్నవి కృతజ్ఞతతో రికార్డ్ చెయ్యాలని నాకుంటుంది. ముఖ్యంగా త్రిపురని గురించి చెప్పుకోవాలని ఉంటుంది. ఆయనకి కిరీటం అని కాదు, నాకు ఊరట అని. త్రిపుర ఉపాధ్యాయులని, నాకు గురుతుల్యులని నేను ఇదివరకే చెప్పుకున్నాను. నేనే కాదు, నాలాంటివాళ్ళు ఎందర్నో ఆయన ఎంతో దయతలిచి, చప్పుడు కాకుండా చేరదీసేరు. ఉపాధ్యాయునిగా త్రిపుర మూర్తిమత్వాన్ని, ఆయన పాఠాన్ని విశదం చెయ్యడం అదొక పెద్ద పని. సృజనశీలుర పట్ల, సారస్వత విద్యార్ధుల పట్ల ఆయన చూపించే క్షమ, సానుభూతి, మాటలకు అతీతమైన స్వస్థతతో నిండిఉంటాయి. కొద్దిపాటి మాటలతో, చేష్టలతో ఆయన ప్రకటించే సారస్వత పాఠాలు తర్కసమ్మతమై ఉండి కూడా అంతకంటె లోతైన అనుభవానికి సంకేతప్రాయాలుగా మహావాక్యాల్లా అనిపిస్తాయి. మొదట్లో నేను ఆయన ‘దయ’ వలన అన్నిరకాల రచనల్నీ, పోకడల్నీ సహిస్తారని అనుకునేవాణ్ణి. కాని ఆయన క్షమకు ప్రాతిపదిక కరుణ, ప్రేమ, సామరస్యం, సౌభ్రాతృత్వం కావు. ప్రజాస్వామ్యవాదం, మానవత్వం ఇవేమీ కావు. లౌక్యునిగా త్రిపుర మార్క్సిజాన్ని నమ్మి, గౌరవించిన మనిషి. కాని సృజన పట్ల అవగాహనను, స్థైర్యాన్నీ ఆయన సారస్వతాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంలా వివేచన చేసి, సాధన చేసి, తనలో తానే తర్కించి, అనుభవించీ సాధించుకున్నారు. ఆయన్ని చూసి తెలుసుకున్నది క్లుప్తంగా, మాటల్లో చెప్పితీరాలంటే దాన్ని క్షమ అని, ఔదార్యమని అనుక్కోవచ్చు. ఆసక్తి ఉన్న మనుషులందరూ, అంటే సృజనశీలురందరూ సృజనను ఎలాంటి బెరుకు, సంకోచం లేకుండా నిరభ్యంతరంగా అభ్యాసం చేసి, అనుభవంలోకి తెచ్చుకోవచ్చునని, ప్రకటించుకోవచ్చుననీ, అలాగే చెయ్యాలనీ త్రిపుర సూచన. దీనికి ప్రతిభ, అవగాహన, చదువు, భాషా సంపత్తి, ఆలోచనా పటిమ, అంతస్థు, సౌశీల్యం, ‘జ్ఞానం’ ఇలాంటివేవీ అవసరం లేదు, ఇవి బలంగా లేకపోవడం అడ్డంకులూ కావు.
సాహితీ స్రవంతి సృజనశీలురందరికీ విలువైన వారసత్వ సంపదగా, ఉచితంగా లభించేది. సాహితీ స్రవంతి Kant చెప్పిన Ingeniumను తనంతట తానే రక రకాల చెలమలనుండి సేకరించుకొని, సృజనగా బహుముఖంగా, నిత్య నూతనంగా మనకు ఆవిష్కరిస్తోంది. జీవన స్రవంతి గొప్ప బలవంతులూ, కులీనులు, మేధావులకే కాకుండా సామాన్యులు, అవిటివాళ్ళు, దుర్బలులకు కూడా సమంగానే అందుబాటులో ఉంది. జీవితపు మౌలికమైన అనుభవం అందరికీ ఒక్కటిగానే ఉంది. ఇలాగే సృజన మౌలికమైన అనుభవం – అంటే fundamental cognitive experience of art కూడా కళా స్రవంతిగా, సారస్వత స్రవంతిగా ఎవరో కొద్దిమంది ప్రతిభావంతులకే కాకుండా, మనందరికీ అనుభవంలోకి వస్తుంది. ఈ సృజన అనుభవానికి బలమైన అడ్డంకి ఏమిటంటే Assumption, Judgment, Should అనే మాటలు సూచించే అపోహ, ఎంపు, సొడ్డింపు, ఇతరుల సృజనానుభవం, ప్రకటన మన అవగాహనతోను, అనుభవం తోనూ ఒప్పుకొనే తీరాలన్న ఆకాంక్ష – అంటే expectation. బింబ ప్రతిబింబ క్రియలు రెండింట్లోనూ కవికీ, పాఠకునికీ కూడా ఇది ఆటంకమే. దీన్ని వదిలించుకోవటం ‘అహంకార త్యాగం’ అని, ఇది కవులకు, పాఠకులకు కూడా ప్రాధమికమైన అవసరమనీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు నొక్కిచెప్పేరు. “తెలిసినది తక్కువ. నాకేమో తెలియునన్న అహంకారమే ఎక్కువ.” అని విశ్వనాధ ఎత్తిచూపించేరు. ఈ అహంకారాన్ని ధార్మికులు, వేదాంతులు చెప్పే ‘అహం’ అని కాక, Cognitive Science చెప్పే పూర్వ జ్ఞానంగా (Conditioning) అర్ధం చేసుకుంటే ఇక్కడ ఉపయోగంగా ఉంటుంది. ఈ నిర్ధారణకు శాస్త్రీయమైన, సారస్వత సమ్మతమైన ప్రాతిపదికలు ఉన్నాయి, బిపిన్ నుండి, ఆయన అనుయాయుల నుండి, ఇతరుల్నుండీ. దీన్ని వివరించడం టూకీగా చెయ్యగలిగిన పని కాదు. విడిగా, వివరంగా చెప్పుకోవాలి.
సృజన మన జీవికకే అంత ముఖ్యమైతే దాన్ని మనం ఆరోగ్యం, తిండి, నీళ్ళు, గాలి వంటి మిగతా వస్తువుల్లాగే వివేకంతో నిర్వహించుకోవాలి కదా?! కాని మానవ సమాజాల్లో వీటిలో ఏ ఒక్కదాన్నీ మనం సరిగ్గా నిర్వహించుకోము; దుర్వినియోగమే చేస్తాము, వృధా చేస్తాము, కలుషితమే చేసుకుంటాము. ఉదాహరణకు తాగే నీళ్ళు మనకు జలస్రవంతిగా లభ్యమవుతాయి. ఇది నేలకింద నూతుల్లోను, భూమ్మీద చెరువులు, నదులు, సముద్రాలుగానూ విభిన్నమైన రూపాల్లో లభ్యమౌతుంది గాని ఉన్న నీరు ఒక్కటే. ఈ జలస్రవంతి మనందరికీ జీవితం లాగనే, సృజన లాగనే, ఉచితంగా, విస్తారంగా అందుబాటులోకి వస్తుంది. ప్రకృతి ఇచ్చిన జలాల్ని మన సంస్కృతి రక రకాలుగా కలుషితం చేస్తుంది. కాలుష్యాలు ‘చెడ్డ వస్తువులే’ కానక్కర్లేదు. వేరే ప్రయోజనాల కోసం చాలా విలువైన వస్తువులు కూడా స్థానభ్రంశం అయితే కాలుష్యాలుగా పరిణమిస్తాయి. ఉదాహరణకు తేనె, బలానికిచ్చే టానిక్, బంగారు ద్రావకం, పాలు, పెట్రోలు ఇవన్నీ వేటికవిగా చాల విలువైన పదార్ధాలు. వీటిలో ఏ ఒక్కదాన్ని తెచ్చి తాగే నీళ్ళల్లో కలిపినా అవి ఇటు నీళ్ళని కలుషితం చేస్తాయి, అటు తమ స్వాభావికమైన విలువనూ కోల్పోతాయి. ఆ తయారైన ద్రవం అటు మంచినీళ్ళూ కాక, ఇటు పాలూ, తేనే ఇలా ఏమీ కాలేకపోతాయి. ఈ పర్యావరణ కాలుష్యం ఎవరో దుర్మార్గులు కావాలని చేసింది కాదు. బుద్ధిమంతులు, మేధావులు, నాయకులు ఇలాంటి మనుషులే, గొప్ప ఉదాత్తమైన సంకల్పాలతోటే, పరిశ్రమలు స్థాపించీ, వాహనాల్ని తయారుచేసీ కాలుష్యాన్ని చివరికి అనివార్యం చేసేరు – గంగ కుళ్ళుకాలువలా అయిపోయేంతగా. మరి జీవితాన్ని జీవన స్రవంతి అనీ, చైతన్యాన్ని చైతన్య స్రవంతి అనీ మన పెద్దవాళ్ళు అన్నారు. ఇవి కూడా జలస్రవంతి లాగనే మనకు సహజంగా, ఉచితంగా లభ్యమయ్యేవే. వీటిని కూడా మనం ఇలాగే కలుషితం చేసుకుంటాము – విలువైనవి, వాంఛనీయమైన ‘విషయాల్ని’ ఒక్కొక్కటీ కలుపుకొని పోతూ. చైతన్య స్రవంతిలో, జీవన స్రవంతిలో జరిగే ఈ కాలుష్యాన్నే తాత్వికులు పాతవాళ్ళయితే ‘చిత్తవృత్తి’ అని, జిడ్డు కృష్ణమూర్తి గారి వంటి ఆధునికులయితే తెలివిడి (Conditioning) అనీ అన్నారు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఇది సృజన అనుభవానికి అడ్డంకి అని సూచిస్తున్నారు.
సృజన ప్రక్రియలో జరిగే కాలుష్యాన్ని, రాజీల్ని గురించి బిపిన్, ఇతరులు ప్రకటించిన పరిశోధనలున్నాయి. మచ్చుకి ఒకటి – ఆయన సహపాఠి హ్యారీ (Huge Harry) అన్నాయన ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఆర్ట్(IAAA – The Institute of Artificial Art, Amsterdam) నుండి అన్నది:
“It is practically impossible for human artists to create works of art that live up to the aesthetic ideals of philosophers like Immanuel Kant. Human artists always have rather selfish goals that usually involve money, fame and sex. Anyone who is aware of this will become much too embarrassed to be able to engage in a disinterested process of aesthetic reflection. Machines are in a much better position to create objects of serene beauty; and computers will finally be able to create endless amounts of such objects, in infinite variety.”
– Harry, 1997.
ఆయన ఏమంటున్నాడంటే ‘సృజనకారులు మానవ సహజమైన దౌర్బల్యాల వలన తమ సృజనల్ని, సృజనానుభవాన్ని కలుషితం చేసుకుంటారు. మేలైన సృజనలు మనుషుల్నుండి కాదు, కంప్యూటర్లనుండే వస్తాయి. ఇలాంటి చాపల్యాలకి దూరంగా నిత్య నూతనం, వివిధం, బహుముఖమైన సృజనల్ని ఆవిష్కరించడానికి మనుషులకంటే కంప్యూటర్లే తగినవీ అని.
6.
ఇది మొదలుపెట్టే సమయానికే ఒక అదృష్టం లాగ బత్తుల ప్రసాద్ గారి కధ – గంజిబువ్వ అని దొరికింది. ఇది చదివి నేను పొంగిపోయేను, కులికి సస్తున్నాను. కపటం లేని కాల్పనిక ధార అని నేననుకునేదానికి ఇది ఒక ఉదాహరణ. బలమైన సృజన కవి నుండి అతని పాఠకునికి ఎలా ప్రసారమౌతుందో ఈ కధను ఉదాహరణగా, ప్రాతిపదికగా వివరించి చెప్పవచ్చు. బత్తుల ప్రసాద్ కవి. చదివేవాడు పాఠకుడు. ఇల్లు వీళ్ళిద్దరికీ ముందు జాంతవమైన అవసరం, ఆ పైన మానసికమైన అవసరం, అంటే Home. తండ్రి పిల్లల్ని సాకే ప్రేమ వీళ్ళిద్దరికీ తొలుత పిల్లలుగా తరువాత తామే తండ్రులుగా ముందు జాంతవమైన అనుభవం, ఆ పైన సాంస్కృతికమైన అనుభవం.
(ఇంకా ఉంది)