గంజి బువ్వ

[[ఈ కథ 06 మార్చ్ 2011 సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది. మూడు లాంతర్లు వ్యాసం 3, 4 భాగాల్లో ఉటంకించిన కారణంగా, ఈమాట పాఠకుల సౌలభ్యం కోసం ఇక్కడ పొందు పరుస్తున్నాం – సం.]


శెంప మింద, శెవి మింద నీళ్ళ సుక్కలు తపక్ తపక్‌మని పడతాంటే, మాంచి నిద్దర్లో వున్నె నేను ఉలిక్కిపడి లేసి కూచ్చుంటి. కూచ్చుంటే ఇంగొక పక్క నుండి పడతాండయి. అట్టిట్ట మసలుతాంటే మా నాయన ఆడగూడా నీళ్ళు పడతాండయా నాయనా అన్నాడు. పడతాండయి అన్నాను. అయితే ఈ పక్కకురా అన్నాడు.

అప్పటికే మా నాయన మంచం మింద కాల్లకట్టకాడ ఒదుక్కోని కూకోనుండడు. లాంతరు ఒక్కరవ్వ పెంచినాడు. నేను పొయి మా నాయన కప్పుకున్నె దుప్పట్లోకి దూరి మా నాయన ఎదమింద ఒదుక్కుంటి. మా నాయన కాన్నిండి వచ్చే వాసన శానా బాగుంటది. ఎచ్చగా మా నాయన ఎదమింద ఒదుక్కోని దుప్పట్లోంచి తలకాయ బయట పెట్టి సూచ్చి. బయట జోరువాన మాంతంగా పడతాంది. అట్టాటి వాన అంతకు ముందెప్పుడు సూడలా. ఆ వానకు ఇల్లు కూలిపోతదేమో అన్నెంత బయమేసింది. వానమోత మోగుతాంది. ఇండ్లంతా కారతాంది, మా నాయన నేను కూకున్న సోటు తప్ప.

మిషన్ కాంపౌండులో మట్టితో గోడలు కట్టి బోద గప్పిన ఇండ్లది. శిన్న వానలకే గోడలు కూలిపోతాంటయి. సమత్సరానికి ఒకసారి వాటిని రిపేరు జేపిచ్చాంటరు. రిపేరు శేయడానికి కాంటాక్టు తీసుకునే మనిషి శానా పిసినారి మాదిరిగా కడ్తాడు. ఇంగ పైకప్పు ఇషయానికి వచ్చే ఒకింటికి ఎయ్యాల్సిన బోద రెండిండ్లకు ఏచ్చడు. ఎండాకాలం బాగానే ఉంటది. వానలకాలం నాటికి ఆ పతలాగా ఏసిన బోదను సగం శెదులు కొరుకుతది.

సగం కోతులు ఇండ్ల మింద తిరగడంతో వాటి దెబ్బకు బోద కిందికి దిగజార్తది. ఒక్కొక్కసారి ఎవురిండ్లు వాళ్ళే కప్పిచ్చుకోవాల. ఎన్నిసార్లు కప్పినా వానాకాలం ఈ అగసాట్లు తప్పవు. అయితే ఇంతకాలం మామూలు వానలు గాబట్టి యాన్నో ఒక సోట కారతాన్నెది. ఇప్పుడు కుండపోతగా కురుచ్చాన్నె వాన దెబ్బకు ఇండ్లంతా కారతాంది.

మాయమ్మ, మాయన్న మా అక్కోల్లు అందరూ కడపలో ముగ్గురాళ్ళ కంపెనీలో పనులు చేసుకోవడానికి పొయిరి. నేను సన్నబిల్లోన్ని. సదువుకుంటా వుంటి. మా నాయన టీచరు పనిజేసే దాన నేను మా నాయనే ఇంటికాడ వుంటిమి.

మేముండే మిషన్ కాంపౌండ్ ఊరికి శివర్న సగిలేటి ఒడ్డున ఉంటది. కాంపౌండ్ మద్దెన పెద్ద బంగళా. దానికి నాలుగు పగ్గాల దూరంలో పెద్ద చర్చి. ఆ రెండింటికి మద్దెన కుడిపక్కన పెద్ద పెంకులతో కట్టిన హాలు, దాని పక్కన రెండు మూడిండ్లు. బంగళాకు ఉత్తరం దిక్కున చర్చి పాస్టర్ ఉండే మిద్దె. దాని ఎనకాల రెండంకనాల కొట్టం. ఆ కొట్టంలో ఒక పక్క మేము. ఇంగొక పక్క శిన్న అబ్రామయ్య సారు ఉంటడు. ఆయన గూడా మిషన్ స్కూల్లో టీచర్. మా నాయన పేరు ఆయన పేరు ఒకటే గాడంతో మా నాయన్ను పెద్దబ్రామయ్య అని ఆయన్ను శిన్నబ్రామయ్య అని పిలుచ్చరు.

మా పక్కనోళ్ళ ఇండ్లు గూడా కారతాన్నెట్టుంది. ఉరుములు ఉరుముతాండయి. వాన ఉగ్రరూపం దాల్చింది. పక్కింట్లోనుండి మా నాయన్ను పిల్సినాడు చిన్నబ్రామయ్య. మా నాయన పలికినాడు. ఆయన ‘ఎట్టెట్టుంది పరిస్థితి’ అన్నెడు. ‘ఏముంది సుక్క బయట పడ్డంలేదు’ అని మా నాయన శెతురు మాట ఇడ్సినాడు. ఆయన గట్టిగా నవ్వినాడు. ‘నీ పరిస్థితి ఎట్టుంది?’ అన్నాడు.

మా నాయన ‘ఏముంది నా పరిస్థితి బోల్‌నక్కో ఇంట్లో కారని సోటు లేదు. ఒక పక్కన ముడుక్కొని కూచ్చోనుండం’ అని శెప్పినాడు. ఇద్దరూ వాన గురించి శెతురు మాటలు మాట్లాడుకున్నారు. వాళ్ళట్ట మాట్టాడుకోడం మామూలే. మా నాయనలో ఉండేది అదే. పేదరికం వాన కొట్టినట్టు కొడతాన్నె కూడా బాదపడ్డం ఆయనకు తెల్దు. దాన్నిగూడా శెతురుగా మారుచ్చడు. వాన మింద శెతురు మాటలేచ్చడు.

వాన కురుచ్చాన్నె శబ్దం తగ్గలేదు. రెండు మూడు గంటలు ఇదలగొట్టి ఇడ్సింది. మా నాయన ఎదలమీదనే ఒక నిద్దర జేచ్చి. మా నాయన ఒక్కరవ్వ మసిలార్క నిద్దర లేచ్చి. మా పక్కింటి సారు మా నాయన ఇద్దరూ వాన ఒక్కరవ్వ తగ్గినాదని మాట్లాడుకుండిరి. వాన శబ్దం తగ్గింది. అయితే సగిలేరు మిడ్సరంగా రాడం తిరుక్కున్నెది. ఏట్లో నీళ్ళు పారే సప్పుడు ఎక్కువయింది. మేము ఉండే ఇండ్లు ఏటి పక్కనే ఉంటది గాబట్టి ఆ సప్పుడు బాగా ఇనపచ్చాంది. వాగు మాంతంగా వచ్చాందని మా పక్కకు ఉండే ఆయనకు శెప్పినాడు మా నాయన. వాన అంత పెద్దగ పడ్డం లేదు గాని తగ్గడమ యితే తగ్గలేదు. వాగు శబ్దం పెరిగింది. నీళ్ళు ఎగిరెగిరి పడతాన్నెట్టు ఇనిపిచ్చాంది.

ఒకూరి మిందికి మరొక ఊరోళ్ళు దాడి జెయ్యడానికి వీరోచితంగా పోతాంటే ఎట్టుంటదో ఈ వాగు పారకం గూడా అట్టనే అనిపిచ్చది. ఎప్పుడెప్పుడు తెల్లార్తదా పొయి చూసొజ్జామా అని ఉంది. ఎందుకంటే పెద్ద వాగు వచ్చే గినక శేలల్లో ఉండే శెరుకు, శెనక్కాయ, పసుపు పంటలు కొట్టుకోనచ్చయి. అంతేగాకుండా పెద్ద పెద్ద మొద్దులు వచ్చయి. వాటిని ఎల్లేసుకోవచ్చు. దాంతో పాటు వారలంబడి ఎత్తలి తీసకపోయి దేవుతాంటే సన్న శేపలే గాకుండా ఒక్కోసారి పెద్ద శాపలు గూడా పడ్తాంటయి. వాగొచ్చిందంటే బో ఉంటది.

నేను నా సావాసగాడు సోమయ్య ఇద్దరం గల్సి ఏటి వాగంబడి తిరుగులాడ్తాంటాం. వాగంతా మాకు తెల్సు. యాడ ఎంత లోతుంటది. యాడ నీళ్ళు మిడ్సరంగా పారతాయి, యాడ సుడి తిరుగుతది ఇట్ట మాకు వాగంతా తెల్సు గాబట్టి దాని పకారం ఏటి వారంబడి తిరుగుతము. సోమయ్యగాడు నాకంటె ముందు ఏట్లేకి పోతాడేమో అనుకుంటా నిద్దరబోతి. తెల్లారాల్క వాన జడిపట్టింది.

ఇంట్లో పడతాన్నె వాన పొటుకు గూడా ఒక్కరవ్వ తగ్గింది. ఇంట్లో పన్నె నీల్లు ఆరిపొయినాయి. జడికి సూర్లోనుండి నీళ్ళు కారతానే ఉండాయి. ఇండ్లు కారడం తగ్గడంతో మా నాయనకు తెల్లార్జామున నిద్ర పట్టినట్టుంది. నిండా కప్పుకోని నిద్దర పోతాండడు. నేను మంచం దిగి ఒంటేలికి పోసుకుందామని శెత్తిరి తీసుకొని జాలాడిలోకి పోతి. మా జాలాడి గోడ వానకు నాని సొగం కూలింది. ఆ గోడ ఎక్కి వాగును సూజ్జామనుకుంటి. అదే కూలిపోయింది.

దొడ్లో కాలీ బాన బోర్లిచ్చి వుంటే దాన్నెక్కి వాగు తిట్టు జూచ్చి, వాగు బుసలు కొడ్తాంది. సముద్రమెట్టుంటదో అప్పుటికి సూల్లేదు. వాగు బో స్పీడుగా పారతాంది. ఆ స్పీడుకు వాగుకు ఆ పక్క ఈ పక్క ఉన్నె శెట్లన్నీ ఒంగిపొయినాయి. వాగు సూడాలంటే మామూలుగానయితే శెట్లన్నీ అడ్డమొచ్చాండయి. అయితే ఈ వాగు దెబ్బకు ఆ శెట్లన్నీ సలాం జేచ్చా పండుకున్నెయి.

శీకటి అప్పుటికింకా పూర్తిగా పోందాన నీళ్ళు మా చంద్రక్క తాగే టీ నీళ్ళ రంగులో అగపచ్చాండయి. బాన దిగి ఇంటెనకాల పక్కకు తొంగిజూచ్చి. మా యింటెనక ఉండే జాపరయ్య తోటనిండా నీళ్ళు పారతాండయి. ఎనక మా దొడ్డిగోడ కాడికి వచ్చినయి. ఒక్కోరవ్వ పెరుగుతాండయి. మెల్లగా మా జాలాడిలోకి రాడం తిరుక్కున్నెయి. ఉరుకుతా పోయి మా నాయన్ను లేపితి. ‘నీళ్ళొచ్చాండయి నాయనా’ అని జెప్తి.

మా నాయన ఆదలబాదలవచ్చి చూసినాడు. మా పక్కన ఉండే అబ్రామయ్య సారును గెట్టిగా పిల్సినాడు. ఆయన లేసి జూసి వాయమ్మ నీళ్ళు ఇంట్లోకి వచ్చయి అన్నాడు. గబా గబా గుడ్డు, గుడ్సు పెట్టలు, బోకులు బొచ్చెలు బంగాళాలోకి మార్సినాము.

ఇండ్లు నీళ్ళలో మునుగుతదేమోనని బయమేసింది. బంగళా పైకి ఎక్కిజూచ్చిమి. మా మిషను కాంపౌండుకు పై వల్ల రెండు వాగులు వచ్చి కలుచ్చయి. ఒకటేమో నల్లమల నుండి వచ్చది. ఇంగొకటి రాచ్చెరువు అలుకుకానిండి వచ్చది. దాని పేరు పులివాగు. ఈ రెండు వాగులు పారకం ఎక్కువై ఒక పక్క శేలల్లోకి నీళ్ళు తిరుక్కున్నెయి. మా కాంపౌండు సుట్టూరా నీళ్ళు పారడం తిరుక్కున్నెయి. అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు ఒకసారి ఇట్ట అయిందంట. మళ్ళా ఇప్పుడయిందని మా నాయన చెప్పినాడు.

సామాన్లన్నీ బంగళాలో ఒక రూములో ఏసి బంగళా పైకి ఎక్కి ఏరును జూచ్చే శానా మాంతంగా పారతాంది. ఏటవతల కొంగల రామారంకు పొయ్యే దావలో ఉండే ఎనిమిది శింతశెట్లు అగపల్లా… నాతో పాటు బంగళా మీదికి ఎక్కినోళ్ళలో ఎవురో అన్నారు తెల్లారే తలికే ఆ శెట్లు అగపడ్డం లేదని. ఎనిమిది శింతమాన్లు కొట్టకపోయిన యంటే మామూలు మాటలు కాదు. ఇంగొక్క రవ్వ నీళ్ళు పెరిగితే బంగళా కూడా కొట్టకపోతదేమో అని ఒకరిద్దరు బయపడతాండరు. నాకు అట్టాటి బయం లేదు.

వారలంబడి ఏమైనా కొట్టకచ్చయేమో ఎల్లేసుకుందాం అనేది మాత్రమే మనసులో ఉంది. నీళ్ళు తగ్గకుండా బంగళా లోపలికి గూడా వచ్చే మేము బంగళా ఎక్కి కూకొని రక్షించండి రక్షించండి అని అరిచ్చే బాగుంటదని అనిపిచ్చాంది. నీళ్ళు గుడిసుట్టూ తిరుక్కున్నాయి. గుల్లోకి నీళ్ళొచ్చినయేమో అని అందరూ అంటాండరు గాని పోడానికి జంకుతాండరు. మా నాయన అడ్డపంచె ఎగజెక్కి నడ్సుకుంటా పొయి గుడి గేటు దీసి వరండాలోకి పొయి గుల్లేకి నీళ్ళు రాలేదని గమనించి తిరిగి వచ్చినాడు.

ఏట్లో నీళ్ళు మాత్రం అల్లకల్లోలంగా పారతాంటే ఈ పక్క శేలల్లో రెండు మాడి వనాల మద్దెన ప్రశాంతంగా పారతాంది. మా ఇంటి పక్కన ఉన్న శిన్నబ్రామయ్య డాయరు, బాడి మింద ఆ నీళ్ళలోకి దూకి అవతలకు పోడానికి సాహసం జేసినాడు. సొగం దూరం పొయ్యారక అల్త రాడమే గాకుండా నీళ్ళు బిస్సన పారతాంటే ఆ పోటుకు తట్టుకోలేక ఓ శెట్టు పట్టుకొని గస తీర్చుకోని ఎనిక్కి వచ్చినాడు.

ఊర్లోనుండి శానామంది జనమొచ్చి నిలబడినారు. వాళ్ళలో శానామంది మమ్మల్ని రక్షిజ్జామని వచ్చే, కొందరు ఈళ్ళు ఎట్ట కొట్టక పోతరో సూజ్జామని వచ్చినవాళ్ళు కూడా ఉండారు. కొందరు తాళ్ళు కట్టుకోని రావడానికి ప్రయత్నం జేచ్చాండరు. సోమయ్య వాళ్ళ ఇళ్ళు మిషన్ కాంపౌండ్‌కు దగ్గర్లో ఉండే దిన్నె మీద ఉంటది. వాళ్ళ నాయనా వాడు ఆ దిన్నె మింద ఉన్నెవాళ్ళు.

ఊర్లోవాళ్ళు మా తట్టు జూచ్చా శేతులు ఊపుతాండరు. నేను ఏటి తట్టు పోకుండా తూరుపు తిట్టు పొలాల మింద నుండి పారే నీళ్ళు తట్టు పోతి. ఏటి వారంబడి శేంతాడంత పాములు నీళ్ళలో నుండి బయటికి వచ్చి మళ్ళా నీళ్ళలోకి దిగి కొట్టుకొని పోతాండయి. జెర్రిపోతులు, నాగుబాములు, రక్తపింజర్లు, నీరు కట్టు పాములు యా పక్కకు పొయినా పాములు కనపడ్తాండయి.

సుట్టూ తిరుగుతాంటే ఒక సోట ఏరుశెనక్కాయ శెట్లు కొట్టకవచ్చాంటే వాటిని ఒక కట్టెతో ఎల్లేచ్చి. పసుపు కొమ్మలు శెట్లతో సహా కొట్టుకోని వచ్చే వాటిని ఎల్లేచ్చి. అదయినంక కొన్ని దూలాలు ఎల్లేసిన. అయన్ని బంగళాలో ఉండే మా సామాన్లకాడ ఏచ్చి. మా నాయన వాగు కాడికి పోగాకు కొట్టకపోతవ్ అని జెప్పి కుసిని కాడికి బియ్యం డేచ్చా తీసుకొని రమ్మని జెప్పి బంగళాకు ఆనుకుని ఉన్నె బడి శేలేకి పొయినాడు. నేను బియ్యం కడిగి అత్తెసురు పెడ్తి. మా ఇండ్లకాడ కట్టెలు తడ్సినయి. దాంతో అందరూ వచ్చి ఆస్టల్ పిల్లోళ్ళ కుసిన్లో వండుకుండిరి.

మళ్ళా సన్నగా జడి తిరుక్కున్నెది. నేను పొయికాడ గూకోని పొయిలోకి కొరువులు ఎగదోచ్చా వుంటి. ఇంతలో మా నాయన వచ్చినాడు. పంచెలో ఏమో ఏసుకొని వచ్చినాడు. తెచ్చినయి పొయికాడ శాటలో పోసినాడు. బడి తోటలో బెండకాయలు, తమేటాలు, పచ్చి మిరప కాయలు కోసుకొచ్చినాడు. అయి నిగనిగలాడ్తాండయి. బెండకాయ మింద సన్నటి తెల్లనూగారు ఉంది. తమేట కాయలు దోరగా ఉండయి. పచ్చి మిరపకాయలైతే పచ్చగా మెరుచ్చాండయి. నన్ను కొరుకు నీయక్క నీ సంగతి జెప్త అన్నెట్టుండయి.

మా నాయన బెండకాయలు కోసి, తమేటాలు, బెండకాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు, ఉల్లిగడ్డలు ఓ కుండలో బేసి ఇన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టినాడు. ఇంతలోపల బియ్యం కుతకుతమని ఉడికి అన్నమయితాంది. గంటె తీసుకోని అన్నంలో పెట్టి కెర్లగిచ్చి. కొత్తబియ్యమయిందాన ఒక్కరవ్వ ఎసురు ఎక్కువయిందాన్నేమో అన్నం గంజి గంజి అయింది. మా నాయనకు జూపిచ్చే కాసేపుంటే ఇగురతదిలే అని పొయిమిందనించినాడు.

ఉడకబెట్టిన కుండలో నుండి పచ్చి మిరపకాయలు ముందు తీసి రోట్లో ఏసి ఇంత ఉప్పేసి దంచినాడు. అయి ఒక్కరవ్వ వక్కలొక్కలుగా మెదిగినంక, తమేటా కాయలు ఏసి నూరినాడు. అదయినంక బెండకాయలు, ఆకర్లో ఉల్లిగడ్డలు ఏసి బడ్తెతో రోలు లోపలపెట్టి గిరగిరా తిప్పి ఉప్పు జూసి ఒక్క రవ్వ తక్కువైంటే ఏసినాడు. రోట్లో శెయ్యి పెట్టి తోడ్తాంటే జోము కార్తాంది. అట్టనే కుండలోకి తోడినాడు.

అది బో కమ్మటి వాసన వచ్చాంది. నాకు నోట్లో నీళ్ళూరినాయి. మా నాయిన ఇట్టాటియి శానా బాగా జేచ్చడు. కూరగాయలతోనే గాదు, ఆక్కూరలు, పప్పు, శియ్యలు కూరాకు ఇయన్నీ బో జేచ్చడు. నెలకొకసారి నల్లేరు తీసుకోనొచ్చి కారెం నూర్తాన్నెడు. రోజుకొక రకం శేసుకోని తింటాంటిమి నేను మా నాయన.

ఆ బంగళాలో ఉన్నె నాలుగయిదు ఇండ్ల వాళ్ళం అందరూ బువ్వలు వండుకోని బంగళా వరండాలోకి జేర్తిమి. వర్సగ ఎవురి ఇంటోళ్ళు వాళ్ళకాడ కూకోని గిన్నెలు ముందేసుకున్నెరు. నేను మా నాయన ఒక సాట కూకుంటిమి. హస్తం గంటెతో ముందు నా గిన్నెలో అన్నం పెట్టినాడు మా నాయన. ముసురు పట్టిందాన అన్నం పొగలు గక్కుతా ఉంది. అన్నం గంజి గంజిగా తడిగానే ఉంది.

మామూలుగానయితే దినాం పగలు రాగి సంగటి తింటాంటిమి. రాగిపిండి ఇసురుకోడానికి ఇసుర్రాయి తడ్సింది. అందుకని ఎప్పుడన్నా పగులు పండగలకు మాత్రమే తింటాన్నె బియ్యం బువ్వ ఒక్క రవ్వ గంజి అయినా పెద్ద లెక్కగాదు గాబట్టి అన్నం గంజిపట్టిన యిషయాన్ని పట్టించుకోలేదు. మా నాయన ఇంత పెట్టుకున్నెడు. కుండలో శెయ్యి పెట్టి బెండకాయ బజ్జి ఇంత నాకు ఏసి మా నాయన ఇంత ఏసుకున్నెడు. ఉడుకుడుకు అన్నం జోము కారతాన్నె బెండ కాయ బజ్జి. ఆ రెండూ కలపడానికి ఒక్కరవ్వ తంటాలు పడ్తి.

అట్ట తిప్పి ఇట్ట తిప్పి మొత్తం మింద నోటికాడికి తెచ్చుకుండార్క జారతాంటే బో ఒడుపుగా దాన్ని నోట్లో ఎయ్యడం తిరుక్కుంటి. నోటికి కమ్మగా తగుల్తా గొంతులోకి జారతాంది బువ్వ. సన్నటి వాన, ఉడుకుడుకు అన్నం, కమ్మటి బెండకాయ బజ్జి. ఇద్దరం గలిసి కుండలు కాలిజేచ్చిమి. బువ్వంతా తిన్నెంక గిన్నెలో ఒక్కరవ్వ మిగిలిన జోము ఏళ్ళకు తగిలిచ్చుకోని నాక్కుంటా ఉంటే సొర్గం కనిపిచ్చింది.

బువ్వలు తిని బోకులు బొచ్చలు కడుక్కోని ఒక పక్క పెడ్తిమి. ఏరు ఏ మాత్రం తగ్గలేదు. ఇంగా పెరిగింది. ఇట్టనే ఓ రెండు మూడు గంటలు పెరిగితే బంగళాలోకి కూడా నీళ్ళు వచ్చయి. అందరం కొట్టుకోని పోడమే అని అందరూ బయపడ్తాన్నెరు. ఓ అరగంట కల్లా నీళ్ళు పీల్చినట్లు తగ్గడం తిరుక్కున్నెయి. ఊర్లో వాళ్ళు ఒకరిద్దరు తాడు కట్టుకోని నీళ్ళలో దిగి బంగళాకు వచ్చిరి. సగిలేటికి అడ్డంగా గిద్దలూరు దావంబడి కట్టిన కొత్త బిడ్జి తెగిపోయింది. ఆ దెబ్బకు నీళ్ళన్నీ పీల్చినట్టు పోయినాయి. ఆ బిడ్జికి పెద్ద పెద్ద శెట్లు అడ్డం పడ్డంతో నీళ్ళు ఎగదన్నినాయి అని జెప్పిరి. అందరూ ఊపిరి పీల్చుకుండిరి.

కాలం సైకిల్ గాను మాదిరిగా గిర్రున తిరిగిపోయింది. నేను ఇద్దరు పిల్లోల్లకు నాయన్నైన. మా నాయన మాదిరి నా పిల్లోల్లకు వండి పెడతా వుంటి. కాలానికి ఆకలెక్కువ. ఆ ఆకలికి మా నాయన కాలమయి పొయినాడు. అయినా ఇప్పుటికీ వాన కుర్సినా, బెండకాయ కనపడ్నా, ఆ దినాం మా నాయన నేను తిన్నె గంజిబువ్వ మతికొచ్చది. గంజిబువ్వలో కనిపిచ్చే తడి మాదిరి నా గుండెకాయ తడిబార్తది.