ఒక (అ)నాగరిక ఆనందం

తనతో కలిసి
ఎగురుతున్న
ప్రతిసారీ,
విమానం నన్నొక
ఆదిమ మానవుడిని చేసేస్తుంది

రెప్ప తెరిచిన కిటికీ సాక్షిగా
నాగరికత బుగ్గ చుక్కలు పెట్టుకున్న
భూమి పెళ్ళికూతురిని
మురిపెంగా చూపించి ఊరిస్తుంది
బాల్యంలో నగ్నంగా ఆడేసుకున్న
నదీ స్నానాలని గుర్తుకు తెస్తుంది

ఎవ్వరి నీడా సోకని
అడవుల కొండల
నదీనదాల ప్రకృతి మీదికి
చూపుల దారాల గుండా
సున్నితంగా జారవిడుస్తుంది

ఎదురొచ్చే
గాలినీ, మబ్బులనూ
చీల్చుకుంటూ
తను ఎంత ఉక్కిరి బిక్కిరైపోతున్నా
నన్ను మాత్రం పొత్తిళ్ళలోని పసిపాపలా
సుతారంగా తీసుకు పోతుంది

దారిపొడవునా
చిల్లర మల్లర చిరు మేఘాలు కొన్ని
గుబురు గుబురు గూడుపుఠానీ మేఘాలు మరికొన్ని
తుళ్ళిపడుతూ అడ్డుపడుతూ
నానా హంగామా చేస్తుంటాయి
సాపేక్షతా పూర్వకంగా
గాలిలో విమానం,
విమానంలో నేనూ
కూరుకుపోలేదని
పదే పదే గుర్తు చేస్తుంటాయి

ఎండనూ నీడనూ సమానంగా కప్పుకున్న భూమి
అధునాతన విమానంలో ప్రయాణిస్తున్నా
నన్నొక ఆదిమ మానవుడిని చేసేస్తుంటుంది.


రచయిత గరిమెళ్ళ నారాయణ గురించి: డా. గరిమెళ్ళ నారాయణ ప్రస్తుతం హెర్న్‌డన్, వర్జీనియాలో ఉంటున్నారు. వృత్తి సైంటిస్ట్.  ...