ఎగిరే కొబ్బరి చెట్టు

ప్రపంచాన్ని రెండుగా చీల్చుకుంటూ
పరుగులు పెట్టే రైలు
అకస్మాత్తుగా ఆగిపొయింది.
ఏ సిగ్నెలు కన్నెర్ర జేసిందో!

రైలు కిటికీలో నేను
వరిచేను గట్టుపై
ఒంటరి సైనికుడిలా
కొబ్బరి చెట్టు.

జోరుగా వీచే గాలికి
పది రెక్కలు విదిలించినా
ఎక్కడకీ ఎగరలేని
కొబ్బరి చెట్టు

తదేకంగా చూస్తున్న
నాలోకి మాత్రం
మెల్లగా నడుచుకునొచ్చి
లోతుగా పాతుకుపోయింది

ప్రపంచం, రైలు
మాయమైపోయాయి.

నా గుండెలోకి
ఎక్కణ్ణుంచో..
తియ్యటి నీరు!

ఇప్పుడు
ఎగిరే కొబ్బరి చెట్టుని చూడాలంటే
ఎక్కడిదాకో వెళ్ళక్కరలేదు మీరు!


రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. "ఏటి ఒడ్డున" కవితా సంపుటి (2006), "ఆత్మనొక దివ్వెగా" నవల (2019), "సెలయేటి సవ్వడి" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...