అలలు తలలూపుతున్నాయి
ఎలదోట వంపుల్ని వెలిగిస్తోంది వెన్నెల
నీటిగాలికి పులకించిపోతోంది నియమగిరి
రెప రెపల రేయింక అలసి నిల్చుంది.
పెరటి గుమ్మం దిగి రా రజియా
గులక రాళ్ళని తట్టి ఏనాటి ఊసులో తలబోసి
దిగులుపడి వెనుదిరిగిపోతోంది నది
దాని గుస గుసలు ఒదిగి వింటున్నాయి చేలు,
రాళ్ళు.
శాక్యముని ఏ వెయ్యేళ్ళనాడో
ఈ కాళింగ శిలలనే తలగొన్న
మనిషి కడగండ్ల మోఁత ఎద పెనగులాట
వెలవెల గొంతు ఎడ లేక
వినిపిస్తోంది చూడు
ఎండు సైకత సీమ గుండె తడి
మౌని చేవ్రాలు
మున్నీటి పాలు.
అడుగుకొక గుడి నిలబెట్టుకున్న ఈ పాషాణాలలో నేడు
నమ్మకాలేం లేవు
అమ్మకానికి కొన్ని స్మృతులు తప్పించి.
ఈ ముసలి ఏరెంత ఒంటరిది రజనీ, దీని వెత
నియమగిరి వేణువుల పగులు గుండెల కీచు
శ్రుతిలేని పాట,
మతిలేని మాట.
తీర్చిదిద్దిన రేఖల్లాంటి నీ పెదవుల తడిని
కాంతి మెరిసే చోటు ముద్దాడుకోనీ,
ఒద్దు
హాయిగొలిపే ఈ పాల వెన్నెల్లోన
నీటి వన్నెల్లోన గాలి సైగల్లోన
లేదు, ఏ అందమూ లేదు
ఈ తలపు చెఱశాల ఏ ప్రేమమూ లేదు
ఈ కాటి దిబ్బల వెనుక ఏ దీపమూ లేదు
సన్నని తీగెలా ఎగబాకి చుట్టుకొను నొప్పికి
ఇక్కడే సాయమూ లేదు పాపా
నీ బేల ఆశలకు ఎదుట
ఏ న్యాయమూ లేదు
ఈ కటిక బలి బయలు
మనుగడొక కలవరం రజితా ఇది
నిశిరాత్రి గతిమాలి
తోవ తప్పిన సైన్యాల వెఱ్ఱి వెంపర పోరు
వట్టి
నరఘోష.
(Inspiration: Matthew Arnold, Dover Beach)