సత్యానికి దూరంగా

అసలు ఏ మెట్టు మీద ఉన్నామో
మనమెపుడూ చెప్పుకోం
లేని ఆడంబరాలు ప్రదర్శిస్తే
అసూయ కాల్చేస్తుంది
ఉన్న సంబారాలనే దాచేసుకుంటే
అపహాస్యం చీల్చేస్తుంది
అయినా సరే…
అచ్చంగా మన స్థాయిని మనమెపుడూ చెప్పుకోం

అసలు మనమేం సాధించగలమో
మనమేనాడూ ఒప్పుకోం
అధికంగా వూహించుకుంటే
అహంకారమన్న అపకీర్తి
అసలేమీ లేదనుకుంటే
అర్భకులమన్న చిరఖ్యాతి
అయినా సరే…
స్పష్టంగా మన శక్తిని మనమేనాడూ ఒప్పుకోం

అతనూ మనమూ ఒకటేనన్న సత్యాన్ని
మనమెన్నటికీ మప్పుకోం
అంతా అతనిదేననుకుంటే
అడిగి పుచ్చేసుకుందామన్న ఆరాటం
కాదిది మొత్తం మనదేననుకుంటే
మరింకెవరికీ దక్కరాదన్న పోరాటం
అయినా సరే…
నిక్కంగా మన స్థితిని మనమెన్నటికీ మప్పుకోం

టి. శ్రీవల్లీ రాధిక

రచయిత టి. శ్రీవల్లీ రాధిక గురించి: టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. \"రేవు చూడని నావ\" అనే కవితాసంపుటి, \"మహార్ణవం\", \"ఆలోచన అమృతం\" అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి \"mitva\" అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. \"నా స్నేహితుడు\" అనే కథకు 1994 లో \"కథ\" అవార్డు అందుకున్నారు ...