మాట కాదు వినవేమే

మాట కాదు వినవేమే

రాగం: చక్రవాకం
తాళం: రూపక

స్వర రచన, గానం: పేరి పద్మావతి
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్

సాహిత్యం

పల్లవి:
మాట కాదు వినవేమే మానసా చటులాలసా
మాట కాదు వినవేమే మానసా చటులాలసా
మానలేని అలవా…టో… మదాలసా
మాట కాదు వినలే…వు…                  |మాట|
అనుపల్లవి:
మానలేని అలవాటో మానినీ కల్లోలినీ
కానలేవు లోఁకంట విలోలినీ
ఆనవాలు కనలేవు విలోలినీ
కానలేవు లోకన్ను…                         |మాట|
చరణం:
పాటుకాదు పొరపాటు పాటవిక చిద్బాహవీ
దారికాదు తీరనీ కారాటవీ
దారికాదు నేరవా కారాటవీ
ఆసపాటు విడలేవు…                          |మాట|
చరణం:
చిమ్మచీకటికి దాపుల నిర్మలా చిన్మంగళా
నమ్మలేవా నిను నీవు శంకాకులా?
బొమ్మ చెరిగితే నీవు శంకాకులా
నమ్మలేవా నిను నీవు…?                     |మాట|
చరణం:
బొమ్మ కాదు బోధ కాదు
అమ్మ కాదు అయ్య కాదు
నీవు కాదు నేను కాదు
వారు వీరు వేరు కాదు… విలోలినీ…                             |మాట|
చరణం:
ఊరు కాదు పేరు కాదు
చదువు కాదు పదము కాదు
తగువు కాదు బిగువు కాదు… చటు లాలసా…        |మాట|
చరణం:
పూజ కాదు ఓజ కాదు
జపము కాదు తపము కాదు
తప్పు కాదు ఒప్పు కాదు… కల్లోలినీ…                           |మాట|
చరణం:
దాపు కాదు దవ్వు కాదు
లోపు కాదు బయలు కాదు
మాట కాదు వినలేవూ… మదాలసా…                        |మాట|

(ఈ గీతానికి స్వర రచన కావలసినవారు ఈమాట సంపాదకుల ద్వారా మమ్మల్ని సంప్రదించమని మనవి.)


For Dr. Keinath