పహాడీ రాగం అందాలు

శాస్త్రీయ సంగీతానికీ, ఈరోజుల్లో సంగీతం పేరుతో నిత్యమూ రొదలాగా వినబడే శబ్దాలకూ పూడ్చలేని ఎడం కనిపిస్తుంది. సామాన్యులకు ఇదేమీ ఇబ్బంది కలిగించదు గాని సంగీతం నేర్చుకోవడానికి ప్రయత్నించే చిన్నపిల్లలకు ఈ వైరుధ్యం మొదట్లో దిగ్భ్రమ కలిగించవచ్చు. ఎక్కువమంది సంగీతాన్ని భక్తి తోనూ, సంప్రదాయాల తోనూ ముడిపెట్టేసి సమాధానపడతారు. అయితే అటువంటి అవసరమేమీ లేదు. సమర్థుడైన శిక్షకుడు ఈ రెండిటికీ గల సంబంధాన్ని వివరించగలిగి ఉండాలి. సినిమా పాటలను ‘అంటరానివి’గా పరిగణించడం మాని, కనీసం కొన్ని పాత పాటలలో రాగాల అంశాలను ఎలా వాడుకున్నారో విద్యార్థులకు తెలియజెయ్యగలిగితే శాస్త్రీయ సంగీతంలో కూడా ‘వినదగిన’ అంశాలుంటాయని పిల్లలకు తెలిసే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను ఇటువంటి వ్యాసాల ద్వారా పాఠకుల సంగీతావగాహనను పెంచే ప్రయత్నం చేస్తున్నాను. ఈమాట వెబ్ పత్రిక కావడంతో నా ప్రయత్నానికి మంచి సదుపాయం లభిస్తోంది. ఇది మామూలు పత్రికలకు సాధ్యంకాని విషయం. ఎటొచ్చీ ‘నీ వ్యాసాలు చదివాక నాకు ఫలానా రాగం ఎలా గుర్తుపట్టాలో తెలిసింది’ అన్న వైఖరితో ఇంతవరకూ ఎవరూ స్పందన తెలియజెయ్యలేదు గాని కొందరైనా ఇటువంటి ప్రయోజనం పొందే ఉంటారనే నమ్మకంతో నేను నా రచన కొనసాగిస్తున్నాను.


శాస్త్రీయ సంగీత కచేరీలలో (ముఖ్యంగా హిందూస్తానీ శైలిలో) చివరికి ‘ఉపశాస్త్రీయ’ అంశాలు వినిపించే సంప్రదాయం ఉంటుంది. వీటిలో కొన్ని జానపద పద్ధతికి చెందినవిగా ఉంటాయి. నిజానికి పూర్తి జానపదశైలిలో ఉన్న పాటలను ‘శిష్టులైన’ శ్రోతలు ఎక్కువసేపు వినలేరు. ఎందుకంటే జానపద గీతాలు పల్లెప్రజల జీవితాలతో ముడిపడినవి. వీటిలో కొన్ని లయబద్ధంగా వారు చేసే శ్రమతో అన్వయం కలిగినవి. కొన్నిటిలోని సాహిత్యం వారి కష్టసుఖాలను ప్రతిబింబిస్తుంది. మొత్తం మీద అవేవీ పరిశుద్ధమైన రాగాలను అనుసరించి రంజింపజెయ్యడానికి రూపొందినవి కావు. ఆలిండియా రేడియో కోసమని వింజమూరి సీతగారు అలాంటి సంగీతాన్ని సేకరించారు. అవి వింటే నిజమైన జానపద సంగీతం ఎలా ఉంటుందో తెలుస్తుంది.

శాస్త్రీయ సంగీత కచేరీలన్నీ పాండిత్య ప్రదర్శనలే ప్రధానంగా సాగుతాయి కనక ముగించే ముందు కొంత లలితంగా అనిపించే అంశాలను వినిపించడం శ్రోతలకు ఆనందాన్నిస్తుంది. వీటిలోని జానపద గీతాలన్నీ ‘సంస్కృతీకరించ’బడినవే ననేది గమనించాలి. మన సినిమాల్లోనూ, టీవీ కార్యక్రమాల్లోనూ కనబడే పల్లెటూరి పాత్రధారులకు కూడా తెల్లని, అందమైన పలువరుస ఉన్నట్టుగానే శాస్త్రీయ సంగీతపు జానపద గీతాలు కూడా నాజూకుగానే ఉంటాయి.

ఉత్తరాది శాస్త్రీయ సంగీతం ద్వారా దేశమంతటా ప్రజాదరణ పొందిన జానపదశైలి రాగాల్లో పహాడీ ఒకటి. కశ్మీర్, పంజాబ్ కొండప్రాంతాల పల్లెపాటలను తలపించే ఈ రాగం ఆధారంగా దేశమంతటా ఎన్నో వేలకొద్దీ ఠుమ్రీ, గజల్, భక్తిసంగీతం, లలితగీతాలు, సినిమా పాటల స్వరరచన జరిగింది. వీటిని అన్ని దేశభాషలలోనూ వినవచ్చు. సంగీతం గురించి నేను రాసిన తక్కిన వ్యాసాల్లాగే దీన్నికూడా కేవలం చదవడమే కాక, ఆడియోలు కూడా వింటూ ఉంటే రాగస్వరూపం ఎటువంటిదో తెలుసుకోవచ్చు. ఇటువంటి వాటిలో ఒకే రాగంలోని పది పాటలను విని, పదకొండోదాన్ని తామే గుర్తించగలిగిన పాఠకులు ఎవరైనా ఉంటే నా శ్రమ ఫలించినట్టుగానే భావిస్తాను.

జానపదశైలి వైఖరి కాస్త వేరుగా ఉంటుంది. వాటిలో కీబోర్డ్‌ వంటి వాయిద్యాల్లో కనబడే 12 స్వరాలే (chromatic scale) ఉండాలనే పట్టింపు లేకపోవచ్చు. సినిమాల్లో ఎస్.డి.బర్మన్, శాస్త్రీయ విద్వాంసుల్లో జానపద గీతాలను అధ్యయనం చేసిన కుమార్ గంధర్వ తదితరులకు ఈ సంగతి బాగా తెలుసు.

పహాడీ హిందూస్తానీ రాగమే కాని, కర్నాటక విద్వాంసులు కూడా లలితగీతాల్లో ఈ పహాడీ రాగం వినిపిస్తూ ఉంటారు. బాలమురళి పాడిన అష్టపది రమతే యమునా, వోలేటి పాడిన గడచేనటే సఖీ వగైరాలు ఇందుకు ఉదాహరణలు.

//eemaata.com/Audio/nov2011/Tirchhi తోరీ తిర్ఛీ నజరియా – బడే గులాం అలీఖాన్

ప్రఖ్యాత విద్వాంసుడు బడే గులాం అలీఖాన్ పాడిన తోరీ తిర్‌ఛీ నజరియాకే బాన్ అనే పహాడీ ఠుమ్రీ 1940, 50లలోనే అందరినీ ఉర్రూతలూగించింది. ఇది అప్పట్లో ఎంత ప్రజాదరణ పొందిందంటే శంకర్ జైకిషన్ బర్సాత్ సినిమాలో లతా చేత ఇదే తరహా పాట పాడించి మెప్పు పొందారు.

పంజాబ్‌కు చెందిన నజాకత్ అలీ, సలామత్ అలీ ద్వయం, బడే గులాం కుమారుడైన మునవ్వర్ అలీ తదితరులు ఈ రాగంలో పాడిన ఠుమ్రీలు ఆకర్షణీయంగా ఉండడంలో ఆశ్చర్యంలేదు. వాద్య నిపుణుల్లో బిస్మిల్లా ఖాన్, రవి శంకర్ వాయించినవి చాలా బావుంటాయి. శివకుమార్ శర్మ (సంతూర్), హరిప్రసాద్ చౌరాసియా (వేణువు), బ్రిజ్‌భూషణ్ కాబ్రా (గిటార్) త్రయం వినిపించిన Call of the Valley కూడా పహాడీ రాగంమీద ఆధారపడినదే.

సంగీతశాస్త్రం లెక్కన పహాడీ ఆరోహణ స – రి2 – గ2 – ప – ధ2 – స, అవరోహణ స – ని2 – ధ2 – ప – గ2 – మ1 – గ2 – రి2 – స. దీన్ని తారస్థాయిలో ఎక్కువగా వినిపించరు కనక మధ్యమశ్రుతిలో పాడడం పరిపాటి. అందుకని చాలామంది పొరపాటున దీని ఆరోహణ స రి2 మ1 ప ధ2 అనుకుంటూ ఉంటారు. శాస్త్రం ఏం చెప్పినప్పటికీ ఇది ఠుమ్రీల రాగం కనక అన్యస్వరాలు తరుచుగా తగులుతూనే ఉంటాయి. ఉదాహరణకు గ2, గ1 లు వరసగా వినిపించడం, ని1 తగలడం వగైరాలు వినవచ్చు. 1980 ప్రాంతాల పాకిస్తాన్ విద్వాంసుడు సలామత్ అలీ బొంబాయిలో పాడిన ఒక కచేరీకి నేను వెళ్ళాను. అందులో అతను చివరికి పహాడీ పాడి అందులోని భారత, పాకిస్తాన్‌ల పోకడలూ, ఈజిప్ట్‌తో సహా రకరకాల పశ్చిమాసియా ధోరణులూ, చివరికి పాశ్చాత్యవైఖరీ కూడా పాడి వినిపించాడు. అంత స్పష్టం కానప్పటికీ ఈ అరుదైన రికార్డింగ్ నేను దాచుకున్నాను.

పహాడీ వందలకొద్దీ సినిమా పాటలకు ఆధారమయింది. హిందీలో ఖయ్యామ్, తొలి దశల్లో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయం ఈ రాగాన్ని తరుచుగా ఉపయోగించారు. ఖయ్యామ్ తలత్ మహ్మూద్‌ చేత పాడించిన షామే ఘమ్‌కీ కసమ్, పర్బతోంకే పేడోంపర్, కభీ కభీ మొదలైన గీతాలూ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సలామత్ రహో, చాహూంగ మైఁ తుఝే, జానేవాలో జరా, సావన్ కా మహీనా మొదలైనవన్నీ పహాడీయే.

నౌషాద్‌ కూడా పహాడీలో చాలా పాటలు స్వరపరిచాడు. అన్‌మోల్‌ఘడీ లోని జవాఁహై ముహబ్బత్, దులారీలో సుహానీ రాత్, దీవానా లోని తస్‌వీర్ బనాతా, కోహినూర్‌ లోని దో సితారోఁకా, కోయీ ప్యార్‌కీ దేఖే, సన్ ఆఫ్ ఇండియాలో దిల్ తోడ్‌నేవాలే వగైరాలన్నీ పహాడీ అందాలను ప్రదర్శించేవే.

నౌషాద్‌కి మార్గదర్శకుడైన ఖేమ్‌చంద్ ప్రకాశ్ మహల్ సినిమాకు స్వరపరిచిన ఆయేగా ఆయేగా కాకుండా లతా పాడిన మరొక పాట పహాడీయే. దాని ప్రేరణతోనే నౌషాద్ బైజూబావ్‌రా కోసమని బచ్‌పన్‌కీ ముహబ్బత్ అనే పాట చేసినట్టుగా అనిపిస్తుంది.

మరొక మేటి సంగీతదర్శకుడు రోషన్ పహాడీలో చేసిన జో వాదా కియా, రహేఁ న రహేఁ హమ్ రెండూ ఎంతో ప్రజాదరణ పొందాయి. అలాగే ఎస్.డి.బర్మన్ స్వయంగా పహాడీలో పాడిన వహాఁ కౌన్‌హై తేరా, కిశోర్‌ చేత పాడించిన ఫూలోంకే రంగ్‌ సే మొదలైనవి ఎంతో బావుంటాయి.

పహాడీ ఎంత బావుంటుందంటే రవి ఆ రాగంలో చేసిన చౌద్‌వీఁకా చాంద్, ఇన్ హవాఓఁమేఁ వగైరాలు కూడా ఎన్నో దశాబ్దాల బట్టీ వినబడుతున్నాయి. చిత్రగుప్త స్వరపరిచిన చల్ ఉడ్‌జారే పంఛీ అందరూ విన్న మంచిపాట. దీనిలాగే అతను చేసిన మరొక పహాడీ యుగళగీతానికి కూడా తెలుగులో నకలు తయారయింది.

ఇలా చెప్పుకుంటూ పోతే పహాడీలో ఎన్నెన్నో హిందీ సినిమాపాటలు గుర్తుకొస్తాయి. రొమాంటిక్‌గా, ఉత్సాహంగా సాగే ఈ రాగం పోకడలు అందరినీ ఆకట్టుకుంటాయి. తమిళులు చాలా ఇష్టపడే పి.బి.శ్రీనివాస్ పాట విశ్వనాథన్ రామమూర్తి స్వరపరిచిన కాలంగళిల్ అవళ్ వసంతం పహాడీ రాగమే. అలాగే టి.జి.లింగప్ప చేసి, సుశీల పాడిన మొదటి (?) తమిళ సినీగీతం అముదై పొళియుమ్‌నిలవే కూడా.

పహాడీలో స్వరపరచిన తెలుగు సినిమా పాటల సంఖ్య కూడా ఎక్కువే. పాత తరంలో సి.ఆర్.సుబ్బరామన్‌కి ఆ రాగమంటే ఇష్టమనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క దేవదాసులోనే పల్లెకు పోదాం, అందం చూడవయా, ఓ దేవదా, తానే మారెనా, చెలియ లేదు వంటి పాటలన్నీ పహాడీ రాగంతో చేసినవే. అలాగే చెలుని గని, దివ్యప్రేమకు అనే పాట కూడా. ఆయన పూర్తి చెయ్యకుండా వదిలేసిన ఓ తారకా (చండీరాణి) విశ్వనాథన్ రామమూర్తి ద్వయం రికార్డ్ చేశారు.

ఎస్.రాజేశ్వరరావు సంగీతంలోకూడా పహాడీ అందాలను సంతరించుకుంది. ఔనా నిజమేనా, ఈ నల్లని రాలలో, నీవులేక వీణా, నిన్నలేని అందమేదో, ఖుషీఖుషీగా నవ్వుతూ మొదలైనవన్నీ అటువంటివే.

ఈ నల్లని రాలలో ఏ కన్నులు – చిత్తరంజన్ చూచే కొలది సుందరము – కె.బి.కె మోహనరాజు

ఈ నల్లని రాలలో అనే పాట సినిమాలో రాక రెండేళ్ళ ముందే చిత్తరంజన్ ఆలిండియా రేడియోలో పాడాడు. ఆ తరవాతే ఆ పాటని అమరశిల్పి జక్కన్న సినిమాలో వాడుకున్నారు. అలాగే కె.బి.కె మోహనరాజు పాడిన చూచే కొలది సుందరము అనే లలిత గీతం (బోయి భీమన్న గీత రచయిత, చిత్తరంజన్ స్వరకర్త) కూడా పహాడీ రాగపు అందాలను ప్రదర్శిస్తుంది. ఈ రెండు పాటల ఆడియోలు పరుచూరి శ్రీనివాస్ అందించాడు.

పెండ్యాల నౌషాద్ పట్ల తన గౌరవాన్ని నిర్మొహమాటంగా ప్రదర్శిస్తూ ఆ తరహాలోనే పహాడీలో చేసిన అందచందాల సొగసరి అనే పాట ఘర్ ఆయా మెహమాన్ అనే గీతాన్ని స్ఫురింపజేస్తుంది. అయినదేమో అయినది, హాయిహాయిగా కూడా పహాడీయే.

ఘంటసాల సంగీతంలోని తీయని ఊహలు, నవ్వుల నదిలో వగైరాలు పహాడీ రాగమే. కె.వి. మహాదేవన్ దర్శకత్వంలో పాడుతా తీయగా, తేటతేట తెలుగులా మొదలైన పాటలన్నీ పహాడీలోనే రూపొందాయి.

పహాడీ రాగపు సినిమా రచనలన్నీ ఇక్కడ ఉదహరించ బూనడం అసాధ్యం. ఆ రాగాన్ని ఉపయోగించని సంగీతదర్శకులు ఉండరనడం అతిశయోక్తి కాదు. నాకు గుర్తున్న కొన్ని పాటలు మాత్రమే పేర్కొనగలిగాను. వీటి సహాయంతో మరెన్నిటినో పాఠకులు గుర్తించగలుగుతారు. సినిమా పాటలు రాగలక్షణాలను సమగ్రంగా వ్యక్తపరిచేందుకు ఉద్దేశించినవి కావు కనక సీరియస్‌గా అధ్యయనం చేసేవారు పెద్ద పెద్ద శాస్త్రీయ విద్వాంసుల రచనలను వినడం మంచి పద్ధతి.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...